Thursday 8 March 2018

నేను చేసిన 'దేశ'సేవ

పాత ముచ్చట్లు -4


ఎం.వి.ఆర్.శాస్త్రి
.........

   1982 సంవత్సరం . మే నెల అనుకుంటా.

   ఎన్.టి.రామారావు ఆ రోజు సాయంత్రం న్యూ ఎం.ఎల్.ఏ. క్వార్టర్స్ లో తాను పెట్టబోయే కొత్త పార్టీకి  "తెలుగుదేశం "  పేరు ప్రకటిస్తారనగా ... ఉదయం నేను , ఎస్.ఆర్. రామానుజన్ ఆయనని ఇంటర్వ్యూ చేశాము . అప్పుడు రామానుజన్ న్యూస్ టుడే డైరెక్టర్. నేను ఈనాడు డెస్క్ ఇంచార్జ్ ని.

   ముషీరాబాద్ లోని రామకృష్ణ స్టూడియో మేము వెళ్ళేసరికే జిల్లాలనుంచి వచ్చిన ఎన్టీఆర్ వీరాభిమానులతో మహా కోలాహలం గా ఉంది. ఎక్కడ చూసినా జనమే.  మేము వచ్చామని కబురు పంపగానే లోపలికి రమ్మన్నారు.  ప్రధాన ద్వారం బయటే చెప్పులు వదిలి వెళ్ళమన్నారు. అది మాకు కొత్త అనుభవం.

   ఆఫీస్ రూమ్ నిండా అభిమాన సంఘాల పెద్దలు ఉన్నారు. అక్కడ మాట్లాడటం కష్టం అనిపించి రామారావు గారు మమ్మల్ని లోపల ఒక హాల్ లోకి తీసుకు వెళ్లి మాట్లాడారు. ఆయన శ్రీమతి బసవతారకం గారు కూడా అక్కడ ఉన్నారు.

  " మనవాళ్ళు వస్తున్నారని చెప్పారు బ్రదర్ ! " అని ఇంటర్వ్యూ మొదలెట్టే ముందే అన్నారు ఎన్టీఆర్. మాకు అర్థం కాలేదు. మా అంతటా మేము అప్పటికప్పుడు ప్రయత్నించి ఇంటర్వ్యూ సంపాదించాము కదా ! ఈయనేమో మేము రాబోతున్నట్టు తనకు  ముందే తెలుసు  అంటున్నాడేమిటి?

   ఎలా తెలిసిందో , ఎవరు చెప్పారో తిరిగి వెళ్ళిన తరవాత కాని మా మట్టిబుర్రలకు బోధ పడలేదు. 

  రామారావుగారు అనర్గళంగా , మహా ఆవేశం గా మాట్లాడసాగారు. కానీ మేము అడిగేది ఒకటి . ఆయన చెప్పేది వేరొకటి. అందులో మళ్ళీ కావలసినంత గందరగోళం. పైగా భలే చిత్రమైన సమాధానాలు.

  " మీరు పెట్టబోయే పార్టీ రైట్ ఆఫ్ సెంటరా  ? లెఫ్ట్ ఆఫ్ సెంటరా ? "
    " మాది ప్రాంతీయ పార్టీ .సెంటర్ తో మాకు పని లేదు "
    " కొత్తగా పార్టీ పెట్టినప్పుడు రకరకాల మనుషులు చేరుతుంటారు  కదా ? అవాంఛనీయ శక్తులు చొరబడకుండా  మీరు ఎలా ఫిల్టర్ చేస్తారు ? "
   " మా పార్టీ లో అన్నీ స్వయం గా మేమే చూసుకుంటాం. మేమే దగ్గరుండి  infiltrate చేయిస్తాం "

   రెట్టించి అడిగినా అదే మాట అన్నాడు. ఇలా సాగింది ఇంటర్వ్యూ. మొత్తానికి ఆయనకి  రాజకీయ పరిజ్ఞానం సున్నా అని అర్థమైపోయింది. మాకైతే అద్భుతమైన " కాపీ " దొరికింది. ఈనాడు స్టైల్ లో మసాలా దట్టిస్తే రేపు స్టొరీ బ్రహ్మాండం గా పేలుతుంది అని సంబరపడుతూ సోమాజిగూడ లోని ఆఫీసుకు వెళ్ళాం. వెంటనే చైర్మన్ రామోజీ రావు గారిని కలిసి , ఇంటర్వ్యూ వింతలను ఆనందంగా వివరించాం. " ఇంకేం ? వాయించండి " అని బాస్ అంటారనుకున్నాం. బోల్తా పడ్డాం.

  " కొత్తగా వచ్చాడు. మంచివాడు.  ఏదో చేయాలనుకుంటున్నాడు. తెలియకపోతే నేర్చుకుంటాడు. కాస్త జాగ్రత్తగా రాయండి  " అన్నారు రామోజీరావు గారు.

     మేమేమి చేయాలో అర్థమయింది.  జవాబులు రామారావు చెప్పింది చెప్పినట్టుగా  కాక ఎలా చెప్పి  ఉండాల్సిందో అలా ..  ప్రశ్నలు కూడా మేము ఎలా అడిగి ఉండాల్సిందో అలా జాగ్రత్తగా సవరించాము.

    మర్నాడు ఇంటర్వ్యూ  బ్రహ్మాండంగా పేలింది . ఆయన మీద జనానికి నమ్మకం పెరిగింది.

    అది నేను చేసిన మొదటి 'దేశ'సేవ. అలాంటివి ఇంకా చాలా చేశాను. వాటిగురించి ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో చెప్పాను.

https://youtu.be/bTooF5RzQEM

    1982 మే 28 న అనుకుంటా .. రామారావుగారు తిరుపతిలో పెద్ద సభ పెట్టారు.దాన్ని రెండో మహానాడు అన్నారు. మొత్తం రాయలసీమ ను కదిలించాలని పెట్టిన కార్యక్రమం అది. దానికి తగ్గట్టే మేమూ మా వంతు తోడ్పాటు అందించాం. రామోజీరావు గారు పెద్ద ఎక్సర్ సైజ్ చేయించి ఆ సభ లో ఏ ఏ అంశాల మీద మాట్లాడాలి, వాటిమీద కొత్తపార్టీ విధానాలు ఎలా ఉంటే బాగుంటుంది అన్నవి ఖరారు చేసారు. వాటి మీద ఎలా మాట్లాడితే బాగుంటుందో , ఏది మాట్లాడకూడదో  కూడా మేమే అలోచించి అధినాయకుడి ఉపన్యాసం ముసాయిదా ను రసవత్తరంగా వండి  విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ముందే పంపించాం. ఆయన కూడా ఆనందించి అలాగే కానిద్దాం అన్నారట.

   ఆ సమయాన నేను  కొత్తగా రాబోతున్న ఈనాడు  తిరుపతి ఎడిషన్ ను పట్టాలెక్కించే డ్యూటీ  మీద కొంత కాలంగా తిరుపతిలోనే ఉన్నాను. నేను, కె.ఎన్.వై. పతంజలి డెస్క్ ఇంచార్జి లము. కొమ్మినేని శ్రీనివాసరావు ( ఇప్పుడు పేరుపడ్డ టీవీ యాంకర్ ) మా  మొఫసిల్ ఇంచార్జ్ . ఇంపార్టెంట్ మీటింగ్ కదా నువ్వే కవర్ చేయి అన్నారు రామోజీరావుగారు నాతో. ( అప్పుడు తిరుపతిలో ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ వల్లీశ్వర్ గారు.  ప్రస్తుతం భారత్ టుడే చానల్ డైరెక్టర్.  ఆయన అప్పుడు అందుబాటులో లేనట్టు గుర్తు. )

   సరే. నేను, శ్రీనివాసరావు గారు కలిసి వెళ్ళాం. మేము వెళ్ళే సరికే సభా స్థలం పరిసరాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడా కాలు పెట్టటానికి సందు లేదు. వేదిక వైపు పోయే వీలే లేదు. ఎవరూ ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేరు. మేము ఫలానా అని చెప్పుకుందామంటే మా దగ్గర ఏ ID కార్డూ లేదు. కనీసం విజిటింగ్ కార్డు కూడా లేదు. మరి లోనికి వెళ్ళటం ఎలా ?

    అప్పుడు సత్తా చూపించాడు కొమ్మినేని. నా చేతిలో  ఈనాడు పేరు రాసి ఉన్న ఫైల్ మాత్రం ఉంది. " ఇటు ఇవ్వండి చెబుతా " అని దాన్ని తీసుకుని పైకి ఎత్తి పట్టుకుని " ఈనాడు.. ఈనాడు " అని అరుస్తూ , అడ్డు వచ్చిన వాళ్ళని నెట్టేస్తూ నా చెయ్యి పట్టుకుని ఎలాగో వేదిక మీదికి చేర్చాడు. అప్పటికే నాదెండ్ల భాస్కర రావు గారు , ఇంకా చాలా మంది వేదిక మీద సందు లేకుండా కూచుని ఉన్నారు. నాదెండ్ల గారు అతి కష్టం మీద ఓ మూలన కాస్త జాగా చూపించారు. నినాదాలు దిక్కులదర గొడుతున్నాయి. ఊపిరి ఆడటం కష్టం గా ఉంది. ఇంకాసేపట్లో అందరూ ఎదురు చూస్తున్న మహా నాయకుడు వేదిక మీదికి వచ్చాడు. అభిమానులు వెర్రెత్తిపోయారు. పూనకం వచ్చినట్టు ఈలలు, కేకలు వేస్తున్నారు. చెవులు పగిలే రణగొణ ధ్వని. ఆ గోలలోనే రామారావు తన దైన రాజసం తో ,  ఆవేశంగా మాట్లాడటం మొదలెట్టారు.



   మహానటుడి  నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకీ జనం ఈలలు.చప్పట్లు. మాటిమాటికీ జిందాబాద్ నినాదాలు.  నేను రామారావు కి చాల దగ్గరగా ఉన్నాను.( ఫోటోలో కుడివైపు చివర గళ్ళ చొక్కాలో ). కానీ ఆ  గోలలో ఒక్క ముక్కా సరిగా వినపడలేదు.ఒకటి మాత్రం అర్థమయింది. ఆయన ఏదోదో మాట్లాడుతున్నాడు. జనం మైమరచి వెర్రెత్తి పోతున్నారు. మేము రాసి పంపిన  స్పీచ్ లో ఒక్క ముక్కా ఆయన మాట్లాడటం లేదు. అద్భుత హావభావాలతో  నాటకీయంగా మాట్లాడేస్తున్న దానిలో అసలు పాయింటు ఏమిటో అంతుబట్టలేదు.

  మరి ఏమి రిపోర్ట్ చేయాలి ? ఆ మాట ఆఫీసుకి వెళ్ళాక రామోజీరావు గారినే అడిగాను. సమస్యను ఆయన చిటికలో తేల్చేశాడు.

 ఎన్టీఆర్ మాట్లాడింది ఎవరికీ సరిగా అర్థం కాలేదు కదా ? మీ దగ్గర ఉన్న ప్రసంగం కాపీనే వాడేయండి - అన్నారు  బాస్.

  మర్నాడు ఈనాడు పేపర్లో -  రాయలసీమను పట్టిపీడిస్తున్న చిరకాల సమస్యలగురించి  ... కృష్ణా జలాల మళ్లింపు నుంచి  అనంతపురం ఎడారి బెడద దాకా ఎన్నో అంశాల గురించి ...  వాటిపై తన విలక్షణ ఆలోచనల గురించి - రామారావు తిరుపతి సభలో చేసిన అద్భుత ప్రసంగాన్ని ఆసక్తితో చదివి , ఆ మహానటుడికి ప్రజాసమస్యల మీద ఉన్న పట్టు కీ, దార్శనిక దృష్టికీ అశేషాంధ్ర ప్రజలు ఆశ్చర్యపోయారు.

  ఆ తర్వాత ఎన్టీఆర్ చైతన్య రథమెక్కి లెక్కలేనన్ని సభల్లో ఆంధ్రదేశమంతటా సుడిగాలిలా తిరిగాడు. మొత్తం దేశాన్ని ఉర్రూతలూగించాడు. తిరుపతి సమస్య మళ్ళీ ఎక్కడా ఎదురవలేదు. ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి.

   చైతన్య రథం ఒక పెద్ద సెంటర్ కి చేరబోయే ముందే , దాని వెనుక ఫాలో అవుతున్న ఈనాడు రిపోర్టర్ ఎన్టీఆర్ దగ్గరికి  టాకింగ్ పాయింట్లు రాసిఉన్న కాగితంతో  వెళ్ళేవాడు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా దాని కోసం ఏర్పాటైన సెల్ లో ఏ వూరికి సరిపడేలా ఆ వూరికి పాయింట్లు తయారు చేసి దగ్గరలోని ఈనాడు  ఎడిషన్ కార్యాలయానికి  టెలిప్రింటర్ మీద పంపేవారు. అక్కడ ఏ మోటూరి వెంకటేశ్వర రావు గారో, వాసిరెడ్డి సత్యనారాయణ గారో దానిని రోమన్ స్క్రిప్టు నుంచి తెలుగు లిపి లోకి రాయించి  ఒక మనిషిని కారులో  పంపి ,  చైతన్యరథాన్ని ఫాలో అవుతున్న మా వాళ్లకు అర్జెంటుగా చేరేట్టు చూసేవాళ్ళు . మా వాడు వెళ్ళగానే ఎన్టీ ఆర్ కళ్ళు మూసుకుని " చెప్పండి బ్రదర్ " అనేవాడు.

  రామారావుగారు  ఏకసంతగ్రాహి. ఒక్కసారి వింటే ఎన్ని పేజీల మాటర్ నైనా అక్షరం పొల్లు పోకుండా ఒప్పగించగలిగేవాడు. ఆ నేర్పు ఎన్నికల జైత్ర యాత్ర మొదట్లో  ఆయనకి బాగా  పనికొచ్చింది.

   పోనుపోను ప్రాంప్టింగు అవసరమే లేకపోయింది . ఎన్టీఆర్ రాటు  తేలి , జనం ముందు ఎలా మాట్లాడాలి , ఏమి చెప్పాలి అన్నది మాకే నేర్పగల స్థాయికి చేరాడు. తరవాతి చరిత్ర అందరికీ తెలుసు.









No comments:

Post a Comment