Thursday 10 September 2020

ఆటకెక్కిన ఆందోళన

 ఎం.వి.ఆర్.శాస్త్రి

....................................

    మన వాళ్లకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ .

    అంతర్వేది రథాన్ని తగలబెట్టిన కేసును సి.బి.ఐ. కి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయించారన్న వార్త చూసీ చూడగానే హిందూ ప్రముఖులు కొంతమంది ఆనందబాష్పాలు జలజల రాల్చారు. సాక్షాత్తూ అంతర్వేది శ్రీనరసింహస్వామే భక్తులను అనుగ్రహించి , సిబిఐ దర్యాప్తు వేయించినట్టు మరికొంతమంది ఓవరైపోయారు. కొద్దిరోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న హైందవ ప్రతిఘటన ఉద్యమానికి ఇది అద్భుత విజయమైనట్టు ఇంకొందరు సంబరపడ్డారు. మొత్తానికి – జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందువుల ధర్మాగ్రహానికి తలవంచి తోకముడిచిందని అందరూ తేల్చారు. ఇక ఆందోళనతో పనిలేదని తలచి, ఉద్యమాన్ని జమ్మి చెట్టు ఎక్కించి మళ్ళీ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు పడుతున్నారు.

    సర్కారు వారికి కావలసింది కూడా సరిగ్గా ఇదే. అర్జెంటుగా సిబిఐ పాత్రని రంగంలోకి దించింది హిందూ సమాజపు రౌద్రాన్ని శాంతింపచేసి గండంనుంచి బయటపడెందుకే ! సిబిఐ వచ్చి ఊడబొడిచేది ఏమీ లేదు ; తమకు ఇబ్బంది ఏమీ ఉండదు -అని ఏలిన వారికి తెలుసు. ఎటొచ్చీ మన జనాలకే ఆ సంగతి తెలియదు.

    ఉన్నత న్యాయ స్థానాలు  పట్టుబట్టి వెంటపడిన బహుకొద్ది సందర్భాల్లో తప్ప , ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకు పెట్టగల కేసులో సిబిఐ స్వతంత్రంగా కదలి , సమర్థంగా పనిచేసిన దృష్టాంతం దాని చరిత్రలో ఒక్కటీ లేదు. ఆ పేరు గొప్ప కేంద్ర దర్యాప్తు సంస్థకు అధిపతిగా పనిచేసిన అధికారే అనంతరకాలంలో ఒప్పుకున్నట్టు సిబిఐ అనేది పంజరంలో చిలుక ! కేంద్ర ప్రభువులు కరవమన్న వారిని కరవటం , వదలమన్నవారిని వదలటం , అరవమన్న వారిమీద అరవటం దాని నైజం. ఇది అనేక సందర్భాల్లో ఉన్నత , సర్వోన్నత న్యాయస్థానాలే చివాట్లు పెట్టి మరీ చెప్పిన నిజం.

    అప్పట్లో సెంటర్లో రాజ్యమేలిన ఇటాలియన్ మాత ఉసికొలిపినప్పుడు ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో సిబిఐ వెంటాడి వేటాడి దుంప తెంచింది . తరవాత సెంటర్ బాసులు దూకుడు తగ్గించమన్నప్పుడు తగ్గించింది.  ఇప్పుడు అంతర్వేది రథం కేసులో కూడా కేంద్రప్రభువులు పిసరంత సంకేతం అందిస్తే చాలు సిబిఐ చెలరేగి సూపర్ స్పీడుతో తడాఖా చూపించగలదు. కానీ ఆంధ్ర రాజకీయాల్లో కొన్నాళ్ళుగా సాగుతున్న చాటుమాటు  సరాగాలను,  బిజెపి ప్రముఖులనబడే కొందరి విచిత్ర విన్యాసాలను, వింత వైఖరులను గమనిస్తే ఈ విషయంలో ఆశ కంటే అనుమానానికే ఆస్కారం ఎక్కువ. రాష్ట్ర రాజధానిని ఎప్పుడైనా ఎన్ని చోట్లకైనా టూరింగు టాకీసులా తరలించ వచ్చునన్న జగన్ సర్కారు వాదనకు తాజాగా సుప్రీం కోర్టులో భారత ప్రభుత్వం వారు పలికిన వత్తాసును గమనించాక కూడా భ్రమలు వదలనివారి కళ్ళను భగవంతుడు కూడా తెరిపించలేడు.



    హిందూ మతం మీద , మతవిశ్వాసాలమీద , సెంటిమెంట్ల మీద , హిందూ దేవాలయ వ్యవస్థ మీద వరసగా ఎన్ని దాడులు జరుగుతున్నా, అంతర్వేది రథ దారుణ దహనానికి  మొత్తం హిందూ సమాజం మండిపడి, సామాన్య భక్తులు, మహిళలు సైతం అసాధారణ రీతిలో ధర్మాగ్రహం వెలిగక్కుతుంటే ఉలకని  పలకని  ముద్దులస్వామి సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని అందరికంటే ముందు ఎగబడి స్వాగతించటాన్ని బట్టే అర్థం కాలేదా – ఆ నిర్ణయం వెనుక మతలబు ఏమిటో !?

   


Tuesday 8 September 2020

పిచ్చివాళ్ళ స్వర్గం !

ఎం.వి.ఆర్.శాస్త్రి

......................................

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిచ్చోళ్ళ బారిన పడ్డట్టు కనిపిస్తున్నది. ఇంతకుముందు కడప జిల్లా రాజంపేటలో,  నెల్లూరు జిల్లా బిట్రగుంటలో దేవుడిరథాలను పిచ్చివాళ్ళు తగల పెట్టినట్టు పోలీసులు కనిపెట్టారు. తరవాత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో దేవతా విగ్రహాలనూ పిచ్చివాళ్ళే ధ్వంసం చేశారనీ సర్కారువారు దివ్యదృష్టితో కనుక్కున్నారు. ఇప్పుడు కొత్తగా అంతర్వేది దేవస్థానంలో పవిత్ర రథాన్నీ గుర్తు తెలియని పిచ్చివాళ్ళే పని గట్టుకుని దగ్ధం చేశారనీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ, పోలీసు , మరియు పార్టీ పెద్దలు రెడీమేడ్ నిర్ణయాన్ని జనం మీద రుద్దుతున్నారు. 

అంతర్వేదిలో అర్ధరాత్రి హిందూ వ్యతిరేక పిచ్చి ప్రకోపించ బోతున్నదని ముందేతెలిసి, ఆ ఘోరాన్ని చూడలేక సి. సి. కెమేరాలు చాలా కాలం ముందే కళ్ళు పొడుచుకున్నాయట!! 50 అడుగులపైగా ఎత్తు ఉండే రథశాల  పైన ఎక్కడో ఎవరికీ కనపడని చోట నిద్రపోతున్న తేనెటీగలకు కూడా సరిగ్గా అదే అర్ధరాత్రి పిచ్చి లేచిందట! ఎవరో ప్రభుదాసులను పిలుచుకొచ్చి ఓపొట్టి గడతో తమ పట్టును తగలబెట్టించుకుని ఆ తేనెటీగలు ఆనందంగా ఆత్మాహుతి చేసుకుంటూ తమతో పాటు తాటిచెట్టంత రథాన్ని కూడా కాకతాళీయంగా మంటలలో  మసి చేశాయట! ఈ దేవ రహస్యాన్ని అంజనం వేయకుండానే కనుగొన్న బాధ్యత గల పెద్దలను ఏ పిచ్చాసుపత్రిలో చేర్చాలో వెంటనే తేల్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  మునుముందు చాలా ప్రమాదం!ఈ రకమైన పిచ్చి వాగుళ్ళను సహించి ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పిచ్చివాళ్ళ స్వర్గం గా మారిపోవచ్చు. హిందూ మతం మీద,హిందూ దేవస్థానాల మీద , ఎవరి జోలికీ వెళ్ళని హిందువుల విశ్వాసాల మీద,  సెంటిమెంట్లమీద, మనో భావాలమీద పగబట్టి , వరసగా నీచ , నికృష్ట   దాడులకు తెగబడుతున్న వారి ఆగడాలను వెంటనే అణచి వేయకపోతే రాష్ట్రంలో శాంతికి,  ప్రజా భద్రతకు, మత సామరస్యానికీ పెను ముప్పు తప్పదు.  


ఉగ్రనారసింహుడు ఊరుకోడు! 


మహావిష్ణువు అవతారాలన్నిటిలోకీ మహోగ్రమైనది నారసింహావతారం. కోట్లాది హిందువులకు పరమపవిత్ర దివ్యక్షేత్రమైన అంతర్వేదిలో  నరసింహస్వామి దివ్యరథాన్ని దగ్ధం చేసిన వారు, చేయించిన వారు , వారిని ప్రేరేపించినవారు , కాపాడుతున్నవారు , దైవద్రోహంలో పాలు పంచుకునేవారు ఎవరైనా, ఎంతటివారైనా నామరూపాలులేకుండా మాడి మసికావటం తథ్యం.  ఉగ్రనారసింహుడు ఇప్పటికే హిందూ భక్తకోటిని పూనాడు. స్వతహాగాఎవరి జోలికీ వెళ్ళక , అవమానాలను,అపచారాలను మౌనంగా భరించే హిందువులకు ఓరిమి నశించింది. హిందూ సమాజం భగభగమండుతున్నది. ప్రకంపన మొదలైంది. అది మెల్లిగా పెను భూకంపంగా మారుతుంది. సింహం నిద్ర లేచేంతవరకే నక్కల , పిచ్చికుక్కల ఆట !   


శభాష్  పవన్ కల్యాణ్ !! 


ఈ సందర్భంలో ఇంకో ముఖ్య విశేషమేమిటంటే హిందూసమాజం వాణిని , మనోగతాన్ని బలంగా స్ఫుటంగా వినిపించేందుకు తెలుగునాట ఒక గట్టి నాయకుడు  కనపడ్డాడు. అంతర్వేది దురాగతంపై జనసేనాధిపతి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెలువరించిన ఈ వీడియో రెండు నాల్కల కుహనా లౌకికవాద రాజకీయ గోమాయువులకు దిమ్మతిరిగే చెంపపెట్టు. 


https://youtu.be/SymgUiyTCz8

ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలలో పునరుక్తి లాంటి దోషాలు ఉండవచ్చు. వీటిని ఇంతకంటే బాగా  , ఇంకా దృఢంగా , రసవత్తరంగా ఎందరో పెద్దలు చెప్పి ఉండవచ్చు. కాని సంఘ్ పరివార్ కు , దాని అనుబంధ , సోదర సంస్థలకు వెలుపల ఒక మెయిన్ స్ట్రీమ్ సెక్యులర్ రాజకీయ పార్టీ అధి నాయకుడు ఈ దేశ  రాజకీయాలను పిశాచంలా పట్టిన బూటకపు లౌకికవాదపు బండారాన్ని ఈ స్థాయిలో  బట్టబయలు చేయటం నాకు తెలిసినంతలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఇటీవలి దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇదే మొదలు.  ఇతరమతాలవారికి కించిత్తు అసౌకర్యం కలిగినా గుండెలు బాదుకుని లబలబలాడే రాజకియపార్టీలవారు మెజారిటీ ప్రజల మతవిశ్వాసాలకు , సెంటిమెంట్లకు ఎంతటి అపచారం , విఘాతం జరిగినా ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్న మతి తిన్నగా ఉన్నవారందరూ ఎప్పుడూ అడిగేదే . కాని అదే సవాలు  ఒక సెక్యులర్ పార్టీ అధినేత నుంచి వెలువడటం ఇక్కడ విశేషం. దేవీదేవతలకు జరిగే అపచారాలను సహించి ఊరుకొనరాదనీ , ఆ దేవతామూర్తులను ఆరాధించే కోట్లాది హిందువులు , ముఖ్యంగా హైందవ మహిళలు దైవద్రోహుల భరతం పట్టేందుకు వీథుల్లోకి రావాలని హిందూ సంస్థల పరివారానికి చెందని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పిలుపునివ్వటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం.   లక్షల సంఖ్యలో వీరాభిమానులుండి , ఇంకా అనేక లక్షలమందిని కదిలించగలిగిన   పవర్ స్టార్ ఇంత స్ఫుటంగా, దృఢంగా గళమెత్తటం హిందువుల చిరకాల, నిరంతర  ధర్మ పోరాటానికి  కొత్త దన్ను.