Friday 21 October 2022

అపర ధన్వంతరి డాక్టర్ కె.జి.కె. శాస్త్రి

 నేనెరిగిన అపర ధన్వంతరి డాక్టర్ కె.జి.కె. శాస్త్రి (కురుగంటి గోపాలకృష్ణ శాస్త్రి )గారు 86 ఏళ్ల పండు వయసులో మొన్న సాయంత్రం పరమపదించారు. 



సాధారణంగా ఎవరికైనా ముందు చదువు తరవాత ఉద్యోగం ,ఆ మీదట ఉద్యోగ విరమణ , విశ్రాంత జీవనం. శాస్త్రి గారి ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ రామంతపూర్ లోని జయసూర్య ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాక గుల్బర్గా కాలేజిలో చేరి  ఎం.డి. చేశారు. చిన్న రూము లో అద్దెకుండి వంట వండుకుని రెండేళ్లు చాలా కష్టపడ్డారు. ప్రతి శుక్రవారం రాత్రి బయలుదేరి గతుకుల రోడ్డుపై  గుల్బర్గా నుంచి హైదరాబాద్ కు ఆర్.టి.సి. బస్సులో తెల్లవారేసరికి వచ్చేవాడు. 

ఎందుకు రెండు రోజులు ఇంటి పట్టున ఉండి రిలాక్స్ అవటానికా ? కాదు. నల్లకుంట శంకర మఠం కాంప్లెక్సు లోని  క్లినిక్ లో తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వందలాది పేషంట్లను చూడటానికి!  శని, ఆది వారాలలో భోజన విరామం మినహా నాన్ స్టాపుగా వైద్యం చేసి అటునుంచి అటే గుల్బర్గా బస్సు ఎక్కేవారు. అలా రెండేళ్ళు ఇష్టంగా కష్టపడి ఎం.డి. కోర్సు చేశారు. 

విశేషమేమిటంటే కె.జి.కె. శాస్త్రి గారు హోమియో వైద్యుడు. కాని అల్లోపతిలో హేమాహేమీలైన  సూపర్ స్పెషలిస్టు డాక్టర్లు ఎందరికో ఆయన ఫామిలీ డాక్టరు. స్పెషలిస్టుల తరం కాని మొండి రోగాల కేసులు ఆయనకు రిఫర్ చేయటం పరిపాటి. 

వ్యాధి నిర్ధారణ లో డాక్టర్ కె.జి.కె. గారికి తిరుగు లేదు. నా మిత్రుడు, పర్యావరణ ఉద్యమకారుడు బొలిసెట్టి సత్య గారికి ఒక మారు అమెరికాలో ఉండగా ప్రాణాపాయం వచ్చింది. US లో కొమ్ములు తిరిగిన డాక్టర్లు చాలా రోజులు గుంజాటన పడి , చాలా పరీక్షలు చేసి చేసి చివరికి అది Sarcoidosis వ్యాధి అని తేల్చారు. మూడు వారాలకు మించి బతకటం కష్టమని చెప్పారు. ఇండియా తిరిగివచ్చాక , ఆయన ఆప్త మిత్రుడు విశాఖపట్నం  కాన్సర్ స్పెషలిస్టు  డాక్టర్ రొక్కం గోపాలకృష్ణ గారు హైదరాబాద్ లో వైద్య నిపుణులను సంప్రదించి చేసిన ఆఖరు ప్రయత్నాలూ నిష్ప్రయోజనం అయ్యాక  ఒక సారి మా శాస్త్రి గారికి చూపిద్దాం అని నేనన్నాను. హోమియో వైద్యం  అంటే మహా చిన్న చూపు గల డాక్టర్ గోపాల కృష్ణ గారు నా బలవంతం మీద మహా చిరాకుగా మా వెంట వచ్చారు. హోమియో నాటు వైద్యుడికి అసలు రోగం పేరు చెప్పినా అదేమిటో  అర్థమవుతుందా అని ఆయనకు సందేహం.

 డాక్టర్ శాస్త్రిగారు స్కానింగ్ ఫిల్ము చూసీ చూడగానే "ఇది Sarcoidosis అన్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గారు షాక్ అయ్యారు. "ఔను. కాని నయమవుతుందా?" అని గౌరవంతో కూడిన గొంతుతో అడిగారు. "అవుతుంది. మందు ఇస్తాను" అన్నారు మా డాక్టర్ గారు.

మూడు వారాలలో పోతాడని 2001లో అమెరికా టాప్ డాక్టర్లు చెప్పిన బొలిశెట్టి సత్య నారాయణ గారు 21 ఏళ్ల తరవాత ఇప్పటికీ పర్యావరణ ఘాతకులను, జనసేన వైరి వర్గాలను టీవీ చానెళ్ళలో రోజూ దుంప తెంచుతూనే ఉన్నాడు. హోమియోపతిని క్వాకరీ అన్న డాక్టర్ రొక్కం గోపాలకృష్ణ గారు మా శాస్త్రి గారి చేత నేను రాయించిన "హోమియోవైద్యం" గ్రంథానికి ముందుమాట రాశారు.

కేర్ హాస్పిటల్ లో డాక్టర్ గారికి  బైపాస్ సర్జరీ తరవాత వయసు రీత్యా శరీరం సహకరించక సమస్యలు చుట్టుముట్టాయి. చాలారోజులు ఐసియు లో ఉండీ కోమాలోకి వెళ్లేంతవరకు తన మందులు తాను వేసుకుంటూనే ఉన్నారు. "ఫాస్ఫరస్" డ్రగ్ మంచిదని శిష్యులు సూచిస్తే 'కాదు. ఈ లక్షణాలకు "చైనా" పడతుందని చెప్పి తెప్పించి వేసుకున్నారు.

మా అమ్మకు "ఆస్టియో పొరోసిస్" వైద్యంకోసం ఎవరో రిఫర్ చేస్తే ఆయన దగ్గరికి మొదటి సారి వెళ్లాను. పేషంటు కదలటం కష్టం అంటే తానే మరునాడు కారు డ్రయివ్ చేసుకుంటూ ఈనాడు ఆఫీసుకు వచ్చి నన్ను తీసుకుని మా ఇంటికి వెళ్లారు. అది మొదలు 35 ఏళ్లుగా మా ఫామిలీ మొత్తానికీ ఆయనే వైద్యుడు.

కెజికె గారు  మాకు మెడికల్ కన్సల్టెంటు. నేను ఆయనకి జ్యోతిషం కన్సల్టెంటును. బైపాస్ "ఆపరేషన్ రోజు  ద్వాదశి  అయింది ఫరవాలేదా అని ఎం.వి.ఆర్. శాస్త్రి గారిని అడగాలి" అనుకున్నారట. అడగకుండానే వెళ్లిపోయారు. 36 ఏళ్ల ఆప్త బంధువు, మంచి మనిషి, స్నేహశీలి, అజాత శత్రువు అయిన డాక్టర్ కెజికె శాస్త్రి గారి కాలధర్మం వ్యక్తిగతంగా నాకు తీరని వెలితి. తన ప్రియమైన దత్త పుత్రిక డాక్టర్ అనన్య ఎం.బి.బి.ఎస్. చేత   ఎం.డి. చేయించాలని, తన ప్రాక్టీసును హోమియో డాక్టరు  అయిన నాగ‌హరిత కొనసాగించాలని ఆయన కోరిక. రెండూ తప్పక నెరవేరాలని ఆశిస్తున్నాను.