Tuesday 19 March 2019

తప్పులెన్ను రాహుల్ తమ తప్పులెరుగడు !

జి.ఎస్. కుమార్
.............

నూటపాతికేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పప్పూజీకి  కేవలం ఎదుటి పార్టీల తప్పులే కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు . కానీ, ఆయన వేటినైతే తప్పులని చెబుతున్నారో అవి తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తించడానికి ఎన్ని రోజులు పడుతుందో మరి! అదీగాక, ఎదుటి పార్టీల విషయంలో ఆయన తప్పుపడుతున్న అంశాల వెనుక తమ పార్టీ 'హస్తం' కూడా ఉందన్న సంగతి ఆయన గుర్తెరగడానికి ఈ జన్మ సరిపోతుందో లేదో...


ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు సభల్లో గొంతు చించుకుంటూ ఆయన చేసే ప్రసంగాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే తప్ప, తన ప్రసంగాల్లో లేవనెత్తే అంశాలపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని. తన ప్రసంగంలోని అంశాలను విపక్షాలు, మేధావులు, సాధారణ ప్రజలు సైతం విమర్శించి, పాయింట్లు దొరగ్గానే పట్టుకుంటారని ప్రధానమంత్రి పదవిని కోరుకుంటున్న రాహుల్ గ్రహించడం లేదు.

పుల్వామా దాడికి వ్యూహరచన చేసిన జైష్ ఏ మహ్మద్ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజార్‌ను 1999 నాటి కాందహార్ హైజాకింగ్ ఎపిసోడ్‌ సందర్భంగా నాటి బీజేపీ ప్రభుత్వమే విడిచిపెట్టిందని, అందువల్ల ప్రస్తుతం ఆ సంస్థ చేస్తున్న ఉగ్రవాదదాడులు, దాని తీవ్రవాద కార్యకలాపాలకు ఒక రకంగా బీజేపీయే కారణమని అంటారు రాహుల్. కానీ పుల్వామా దాడి కేవలం ప్రమాదమని ఆయన పార్టీలోని దిగ్విజయ్, కపిల్ సిబల్, సిద్దూ లాంటి సీనియర్, జూనియర్ నేతలు పేర్కొంటుంటే రాహుల్ మాత్రం జైష్ ఏ మహ్మద్‌ని, మసూద్ అజార్‌ని మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారో ఆయనకే తెలియాలి.

కాందహార్‌ విమాన హైజాక్‌లో బందీలైన 176 మంది ప్రయాణికులను కాపాడటం కోసం ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీయే సలహా ఇచ్చిందని కాంగ్రెస్ అధినేతకు బీజేపీ గుర్తు చేసింది. ఆ ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాజ్‌పేయి అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుటు అన్ని పార్టీల నేతలతో పాటు నాడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారని, ప్రయాణికులను కాపాడ్డానికి మసూద్‌ను విడిచిపెట్టాలని సూచించారని బీజేపీ చెప్పింది. మరి కాంగ్రెస్ యువరాజావారు దీనికేమంటారో...

ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదుల్ని అయాచితంగా విడిచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని విషయాన్ని ప్రధానస్రవంతిలోని మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా రాహుల్‌కి గుర్తు చేస్తోంది. కాస్త ఈ లింకు చూడండి...
https://www.ndtv.com/india-news/pak-terrorist-released-by-previous-government-struck-back-with-pathankot-1407168

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2010లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఎ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు షహీద్ లతీఫ్‌తో పాటు 20 మంది పాక్ ఉగ్రవాదుల్ని ఏ కారణమూ లేకుండానే విడిచిపెట్టేశారు. ఇంతమంది ఉగ్రవాదుల్ని ఎందుకు విడిచిపెట్టారో ఎవరికీ తెలియదు. 1999 నాటి హైజాకింగ్ ఘటనను తీసుకుంటే ఉగ్రవాదుల చేతిలో ఉన్న 176 మందిని కాపాడటానికి... సోనియా, మన్మోహన్ తదితర ప్రతిపక్షనేతల సలహాతోనే మసూద్ తదితర ముగ్గురు నలుగురు ఉగ్రవాదుల్ని అప్పటి బీజేపీ సర్కారు విడిచిపెట్టడం జరిగింది. మరి 2010లో అధికారంలో ఉన్న యుపిఎ సర్కారు 20 మంది ఉగ్రవాదుల్ని ఎందుకు వదిలేసిందో దేవుడికే ఎరుక. పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై జరిగిన దాడికి సూత్రధారి అయిన ఈ లతీఫ్ బృందమే 1999లో మసూద్‌ని విడుదల చేయించింది. ఇదంతా తెలిసి కూడా కాంగ్రెస్ 2010లో అతన్ని ఎందుకు వదిలేసింది? రాహుల్‌కి జవాబు తెలుసా?

Friday 15 March 2019

పాక్‌లో గెలవాలంటే భారత్‌ని తిట్టాలి! మరి భారత్‌లో గెలవాలంటే...?

జి.ఎస్.కుమార్
..........

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ గెలవాలంటే ఒకటే సూత్రం... అక్కడ ఏ పార్టీ అయినా సరే తమ ప్రత్యర్థి పార్టీపై దుమ్మత్తి పొయ్యడంతో పాటు మరోపని కూడా తప్పనిసరిగా చెయ్యాలి. అదేంటంటే... కశ్మీర్‌లో ఘోరాలు జరిగిపోతున్నాయని భారతదేశంపై నిందలు వేస్తూ... తాము అధికారంలోకి వస్తే భారత్ పని పడతామని ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పుకుని గగ్గోలు పెట్టాలి. కశ్మీర్‌పై తమకే చిత్తశుద్ధి ఉన్నట్టు నటించాలి. ఈ పని ఏ పార్టీ బాగా చేస్తే వారికే అధికారం దక్కేలా పాక్ సైన్యం కూడా శక్తివంచన లేకుండా సహకరిస్తుంది.

ఇక మన దేశంపైపు చూస్తే.. ఇన్నాళ్ళూ జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతోంది వేరు. మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. పూల్వామా ఉగ్రదాడి... దానికి దీటుగా భారత బలగాల స్పందన చూశాక ప్రతిపక్ష నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ పరిణామం ఎక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి లబ్ది చేకూర్చుతుందోనన్న ఆందోళనతో విపక్ష పార్టీలకు బీపీ పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకపార్టీని నిందించడంతో ఆగకుండా అనుక్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తున్న భారత సైన్యంపైనా నిందలు వేస్తూ ఎన్నడూ కనీవినీ ఎరుగనంత నైచ్యానికి ఒడిగడుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కే ప్రయోజనం చేకూర్చుతుందని, ఫలితంగా మన దేశానికే తలవంపులు తెస్తున్నామనే కనీస విజ్ఞత కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు.

ఇలా ప్రకటనలిస్తున్నవారిలో 125 ఏళ్ళ చరిత్ర కలిగిన చారిత్రక కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, సల్మాన్‌ ఖుర్షీద్‌, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రస్తుత, గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మమతా బెనర్జీ, మాయావతి, మెహబూబా ముఫ్తీ, కుమారస్వామి, సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేశ్... ఇలా మన దేశాన్ని, సైన్యాన్ని చులకన చేసి మాట్లాడేవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పుల్వామా ఉగ్రదాడి ప్రమాదమని... ఎన్నికలప్పుడే ఉగ్రవాద దాడి జరగడమేంటని... భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్రవాదుల్ని చంపిన సాక్ష్యాలు కావాలని... ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ళ కిందటే చెప్పారని.. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని...  ఇలా పేట్రేగిపోతూ మనదేశ ప్రతిపక్షనేతలు ప్రకటనలు చేస్తున్నారు. పొరుగుదేశంతో సమస్య వచ్చినప్పుడు మన సర్కారుకు, సైన్యానికి అండగా నిలబడకుండా అవమానిస్తున్న వీరందరి లక్ష్యమూ ఎన్నికల్లో తమ పార్టీల కోసం లబ్ది పొందడం కాక మరేమిటి?

పుల్వామా ఉగ్రవాద దాడికి ముందు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నోసార్లు మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నెన్నో ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాక్ తీరును మన ప్రభుత్వాలతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రశ్నించాయి.... అప్పుడు (ఇప్పుడు కూడా) పాక్ ఎలా స్పందించేదంటే... "మా మీద అన్యాయంగా నిందలేస్తున్నారు... మా (పాక్ ఉగ్రవాదులు) హస్తం ఉన్నట్టు ఆధారాలు చూపించండి..." అని. విచిత్రమేంటంటే, పుల్వామా దాడుల తర్వాత కూడా భారత సర్కారు పాక్ తీరును ప్రశ్నిస్తే... పాకిస్తాన్ స్పందన రావడానికి ముందే వారి తరఫున ముందుగా కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి సిద్ధుతో మొదలుపెట్టి.. "అయ్యో పాకిస్తాన్‌ని నిందిస్తారా?" అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ఈయన తర్వాత మనం పైన చెప్పుకున్న నేతాశ్రీలందరూ క్యూ కట్టి భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనుకుంటూ పాకిస్తాన్ తరఫున మన సైన్యాన్ని, సర్కారును నానా మాటలన్నారు. గతంలో ఇలాంటి సందర్భాలప్పుడు కేంద్ర సర్కారులకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్షపార్టీల వైఖరి ఈ సారి ఒక్కసారిగా ఎందుకు మారింది? ఎన్నికల్లో లబ్ధి కోసం కాదా?...

ఎప్పుడు పదవి పోతుందో అర్థంకాక రోజూ తలపట్టుకుని కూర్చునే కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా లైన్‌లోకి వచ్చేసి...  ఉగ్రవాదదాడులు ఇప్పుడే ఎందుకు జరగాలి? మా నాన్న (దేవెగౌడ) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరగలేదు కదా? అంటూ మమతా బెనర్జీ, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచాడు. ఇదంతా కాదు గానీ అసలు అభినందన్ మా హయాంలోనే పైలట్‌గా వైమానిక దళంలో చేరాడంటూ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్‌ నేత ఖుర్షీద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు.

పుల్వామా ఉగ్రవాదదాడి తమ పనేనని దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్, అతనితో ఆ పని చేయించిన జైష్ ఎ ఉగ్రవాదులు, జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ వీడియోలు విడుదల చేశారు. చివరికి పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కూడా రంగంలోకి దిగి తన హయాంలో కూడా జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌పై పలు మార్లు దాడులు జరిపిందని స్పష్టం చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న బాలాకోట్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన ప్రతిదాడుల్లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయని, పలువురు ఉగ్రవాదులు మరణించారని మన IAF ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలను అందజేసింది. అంతకు ముందే ఇటలీకి చెందిన ఒక మహళా పాత్రికేయురాలు ఈ విషయాన్ని ధృవీకరించింది.

మనల్నే కాపాడుతున్న మన సైనిక దళాలను అవమానపరచైనా మోదీ సర్కారును ఓడించాలని కంకణం కట్టుకున్న మన ప్రతిపక్ష నాయకులకు ఈ సాక్ష్యాలు, వీడియోలు కనిపిస్తాయనుకోవడం మన అత్యాశే... ఎందుకంటే తందానతాన అంటూ వాళ్ళకు వంతపాడే అనుకూల మీడియా సంస్థలు కూడా తోడున్నాయి మరి.

Wednesday 13 March 2019

కాంగ్రెస్ పేరెత్తితే వణుకుతున్న పాక్ ఉగ్రవాదులు

జి.ఎస్. కుమార్

...........

పాక్ ఉగ్రవాదులు మనదేశంలోని కాంగ్రెస్ నాయకుల పేరెత్తితే  వణికిపోతున్నారట!

పాకిస్తాన్‌లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ లాంటి పదవుల్లో ఉన్నవాళ్ళను సైతం పక్కనపెట్టి మరీ 'వీవీవీ...ఐపీ' ట్రీట్‌మెంట్ అందుకునేదెవరో తెలుసా? భారత్-పాక్ సరిహద్దుల దగ్గర కనీసం సీమటపాకాయనైనా తుస్సుమనిపించిన ట్రెయినీ ఉగ్రవాదితో మొదలుపెట్టి సీనియర్ మోస్ట్ ఉగ్రవాదుల వరకూ ఈ అరుదైన గౌరవాన్ని అక్కడ అందుకుంటుంటారు. ఇక అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ఐక్యరాజ్య సమితి రికార్డులకెక్కిన హఫీజ్ సయీద్, అదే బాటలో ఉన్న అజర్ మసూద్ లాంటి వారైతే దేశానికే అల్లుడి తరహాలో రాచమర్యాదలు అందుకుంటుంటారు. ఇలాంటి వారిని చైనా కూడా పాక్ పాలకులతో సమానంగా గౌరవిస్తుంటుంది.

అమెరికా చేతిలో అంతమైన అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్ పాక్ అండతోనే అబొట్టాబాద్‌లో అంతఃపురం లాంటి ఇంటిలో కొన్నేళ్ళపాటు సేదతీరిన సంగతి తెలిసిందే... ఉగ్రసంస్థ జైష్ ఎ మహ్మద్ అధినేత అజర్ మసూద్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో మర్యాదలు అందుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా పాకిస్తాన్‌లో గృహనిర్బంధం పేరిట పాక్ సైన్యం రక్షణలో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో ఉన్న మరో ఉగ్రవాది జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ అయితే రావల్పిండిలోని అడియాలా హైసెక్యూరిటీ జైల్లో ఉంటూనే జైలు అధికారుల అండదండలతో ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇదీ పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకున్న అత్యున్నతస్థానం. ఈ కింది లింకులు చూస్తే లఖ్వీకి దక్కిన రాచ మర్యాదల గురించి మరింత వివరంగా తెలుసుకోగలుగుతారు..

https://www.bbc.com/news/world-asia-31606798

https://zeenews.india.com/news/south-asia/26/11-accused-zaki-ur-rehman-lakhvi-fathered-a-child-while-in-jail_1517118.html

ఇలా ఉగ్రవాదులకు సమస్త సుఖభోగాలను అందిస్తూ వారికి భూతలస్వర్గంలా అలరారుతోంది పాకిస్తాన్. ఇప్పుడు అక్కడి ఉగ్రవాదులకు కొత్త కష్టం వచ్చింది. అందుకు కారణం భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులే కావడం విశేషం. అదెలాగంటే... 40 మంది భారత జవాన్లను బలిగొన్న పుల్వామా ఘటనను ఉగ్రవాదదాడిగా కాకుండా కేవలం 'ప్రమాదం' అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈయనతో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


వీళ్ళ వ్యాఖ్యలపై ఆగ్రహంతో చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు. పుల్వామా దాడులతో పాకిస్తాన్‌లో ఇమేజి పెంచుకుని మరిన్ని మర్యాదలు అందుకోవాలనుకుంటున్న ఉగ్రవాదులకు ఇప్పుడు భారత రాజకీయ నేతల వ్యాఖ్యలు భయంతో కూడిన కోపం తెప్పిస్తున్నాయట. పుల్వామా దాడులు తమ పనేనని నొక్కి చెప్పుకుంటూ కష్టపడి రెండు వీడియోలు కూడా విడుదల చేసి పాక్ సైన్యం మెప్పు పొందాలనుకుంటుంటే... అవి ఉగ్రవాద దాడులు కాదనీ, కేవలం ప్రమాదమని ఈ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని పాక్ సైన్యం నమ్మితే తమకు పాక్ సర్కారు కల్పిస్తున్న భద్రత, సుఖభోగాలకు కారణమైన 'ఉగ్రవాది' హోదా రద్దవుతుందేమోనని పాక్ ఉగ్రవాదులు భయపడుతూ దిగ్విజయ్ లాంటి కాంగ్రెస్ నేతల పేరెత్తితే చాలు గడగడ వణికిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న
హఫీజ్ సయీద్, జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో కంగారు పడుతున్నారట. ముంబై ఉగ్రదాడులతో పాటు భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడులన్నీ ప్రమాదమేనని రేపెప్పుడైనా కపిల్ సిబల్, నవజ్యోతి సింగ్ సిద్దు లాంటి కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితా నుంచి తమ పేర్లు కూడా తీసేస్తారేమో... అదే గనుక జరిగితే పాక్ సైన్యం తమను గాడిదల కంటే హీనంగా చూసి వదిలేస్తుందనీ... అప్పుడు కుక్కచావు తప్పదనీ భయపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారట.
 
మన రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ఎంత అభాసుపాలవుతున్నామన్నది ఇప్పటికైనా తెలుసుకుని మేలుకుంటే మంచిదని సూచిస్తున్నారు నెటిజన్లు.

Sunday 10 March 2019

పాక్ భక్త సిద్దు ... సిగ్గు సిగ్గు !


జి.ఎస్.కుమార్

.....
పుల్వామా దాడులు జరిగిన తర్వాత... సిక్సర్ల సిద్దూగా ఒకప్పుడు క్రికెట్‌లో పేరు తెచ్చుకున్న ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ముందే పాకిస్తాన్‌ని వెనకేసుకొచ్చాడు. నెటిజన్లు ఆయన్ని ఆ చెంపా ఈ చెంపా వాయించడంతో నాలుగు రోజులు నోరు మూసుకున్నట్టు నటించాడు. కానీ... "భారత వైమానిక దళాలు మా చెట్లను మాత్రమే కూల్చాయి... మాకేం నష్టం కలగలేదు" అని పాక్ సైనిక వర్గాలు ఒక కల్లబొల్లి ప్రకటన చెయ్యగానే ఈ సిద్దూ మళ్ళీ ఒళ్ళు విరుచుకున్నాడు. "పాకిస్తాన్‌లో మనవాళ్ళు 300 మంది ఉగ్రవాదుల్ని ఏరేశారా.. చెట్లు కూల్చారా?" అని ట్వీట్ చేశాడు. పలువురు కాంగ్రెస్ నేతలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా సిద్దు మార్గంలోనే నడిచారు. ఆ వెంటనే మన వైమానిక దళం అధికారులు రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బాలాకోట్‌లో తాము జరిపిన దాడులు, అక్కడ ఉగ్రవాద స్థావరాలకు కలిగిన నష్టాన్ని వివరించేలా 12 పేజీల ఉపగ్రహ చాయాచిత్రాలను విడుదల చేశారు.

భారత రాజ్యాంగ విధి విధానాల ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రమంత్రిగా చట్టబద్ధమైన పదవిలో ఉన్న సిద్దు పాక్ చూపించే సాక్ష్యాలకు మాత్రం విలువనిచ్చి, పాకిస్తాన్‌కి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ మన దేశాన్ని నిరంతరం రక్షిస్తున్న మన దళాలను దారుణంగా అవమానిస్తున్నాడు. ఈయనకు మన దళాలు చూపించే సాక్ష్యాలు అవసరం లేదు. పాకిస్తాన్ గత, వర్తమాన చరిత్రలను పరిశీలిస్తే... ప్రత్యేకించి కార్గిల్ యుద్ధమప్పుడు... భారత సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ సైనికుల మృతదేహాలను... "వాళ్ళెవరూ మావాళ్ళు కాదు" అంటూ తీసుకోవడానికి నిరాకరించింది. అప్పుడు మనదేశమే పాక్ సైనికులకు గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించింది. పాక్ సైనికుల క్రౌర్యానికి మరో ఉదాహరణ ఏమిటంటే, పలుమార్లు వాళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి మన జవాన్లను దారుణంగా చంపేశారు. మన జవాన్ల ప్రాణం తీసిన తర్వాత వదిలేయకుండా ఆ భౌతిక కాయాలపై రక్కిన గుర్తులు, ముఖాలు చెక్కేసిన ఆనవాళ్ళు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలు స్పష్టం చేశాయి. మానవత్వం అనే పదానికి చోటేలేని పాక్ సైన్యం ఇచ్చే సాక్ష్యాలకు రాష్ట్రమంత్రి హోదాలో ఉన్న సిద్దు ఇస్తున్న విలువ, ప్రకటనలు చూస్తే "కనకపు సింహాసనంబున..." అనే సుమతీ శతకకారుని పద్యం పదే పదే జ్ఞాపకం వస్తోంది.


ఒక పక్క పంజాబ్ రాష్ట్ర యువతరం మాదకద్రవ్యాల బారినపడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇదిగాక పలు సమస్యలున్నాయి. మంత్రి హోదాలో ఉన్న సిద్దు 24 గంటలూ పని చేసినా తరగనంత పని ఉంది. ఇవన్నీ పక్కనపడేసి "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షోకి యాంకర్‌గా పనిచేస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్న సిద్దు ఇలా టీవీ షోలు చెయ్యడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తే... దానికి తాను పారితోషికం తీసుకోవడం లేదని, అది లాభదాయక పదవి కాదని అడ్డగోలుగా వాదించి ఆ షో చేసుకుంటూ వచ్చాడు. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌పై జాలి చూపిస్తూ సిద్దు మొదట చేసిన ప్రకటనతో "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షో నుంచి అతన్ని తొలగించారు.

వింగ్ కమాండర్ అభినందన్‌ని పాక్ ప్రభుత్వం భారత్‌కు పంపినప్పుడు ఆయనకు స్వాగతం చెబుతానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా వాఘా వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. అయితే డిఫెన్స్ ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళలేదు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన అమరీందర్‌కు మన జవాన్ల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటే, ఆయన మంత్రివర్గంలో ఉన్న సిద్దు మాత్రం తన ప్రకటనలతో తన రాష్ట్రానికి, దేశానికి కళంకంగా మారాడు. మన దేశ సైన్యంలో విశేష సేవలందించిన పంజాబీ వీరులకు తలవంపులుగా మారాడు.

Sunday 3 March 2019

అభినందన్ మనకి... ఆనందం పాకిస్తాన్‌కి...

జి.ఎస్.కుమార్

............

తాజాగా కాంగ్రెస్ దిగ్గజనేత డిగ్గీరాజా అనబడే దిగ్విజయ్ సింగ్ అనే వృద్ధనేతకు గాభరా పుట్టింది. "పుల్వామా ఉగ్రదాడి, మన సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ గురించి అందరూ మాట్లాడేస్తున్నారు... నేను మాట్టాడకపోతే నా పని ఐపోయిందనుకుంటార"ని కంగారుపడి ఉన్నట్టుండి తెరపైకి వచ్చారు. అభినందన్‌ని వదిలిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని మెచ్చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా సీల్స్ మట్టుబెట్టినప్పుడు ఆధారాలు చూపించారని, అలాగే పాకిస్తాన్‌పై మన సైన్యం తాజాగా చేసిన దాడులలో చనిపోయినవారికి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ముందుగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. బిన్ లాడెన్‌‌ను అమెరికన్ సీల్స్ చంపిన ఆపరేషన్ వీడియో గానీ, అతని మృతదేహం ఫోటోలు గానీ అమెరికా బయటపెట్టలేదు. ఆ శవాన్ని ఎవరికీ చూపించలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జలసమాధి చెయ్యాలని నిర్ణయించుకుని లాదెన్‌ని చంపిన కొన్ని గంటల్లోనే ఆ పని కానిచ్చేశారు. ఇవేవీ అప్పటి పత్రికలు, టీవీ ఛానెళ్ళు సహా ప్రధాన మీడియాలో కనిపించలేదు. అమెరికన్ సీల్స్ ఎక్కుపెట్టిన తుపాకుల తూటాలతో కన్నాలు పడిపోయిన లాదెన్ ఫోటోలంటూ వెబ్ మీడియాలో కొన్ని ఫోటోలు వచ్చాయి గానీ అవి నిజమైనవి కావని ప్రధాన మీడియాకు చెందిన డిజిటల్ విభాగాలు స్పష్టం చేశాయి. కావాలంటే కింది లింకు చూసుకోవచ్చు....

https://www.theguardian.com/world/2011/may/02/osama-bin-laden-photo-fake

ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం చేసిన దాడుల్లో వారికి చెప్పుకోదగిన నష్టం జరిగి ఉండకపోతే, పాక్ వైమానిక దళాలు మన సైనిక స్థావరాలను ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. అలా వచ్చిన పాక్ వైమానిక దళాలను తరుముకుంటూ వెళ్ళినప్పుడే కదా మన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్ళడం, అతన్ని బంధించడం, భారత ప్రభుత్వ తీవ్ర హెచ్చరికల నడుమ 60 గంటల్లో అతను తిరిగిరావడం చకచకా జరిగిపోయాయి. మన సామర్థ్యానికి ఇవి సాక్ష్యాలని కాంగ్రెస్ వారికి ఎప్పటికీ అనిపించదు. బాలాకోట్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన జైషే మహమ్మద్ నేతలు మళ్ళా పుల్వామా తరహా దాడులు చేస్తామని వీడియోలు విడుదల చేశారు. జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ మార్చి 2న ఆడియో టేపు ద్వారా స్పందించాడు. కాశ్మీరులో జిహాద్ కోసం శిక్షణ పొందుతున్న తమ రిక్రూటర్ల శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసిందని స్పష్టంగా చెప్పాడు. మన సైన్యం చేతలకు ఇది సాక్ష్యం కాదా?...


బాలాకోట్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలిందని ఇటలీకి చెందిన ఒక మహిళా జర్నలిస్టు క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఇచ్చిన కథనం ఒకపక్కన కదలాడుతున్నా కొన్ని మీడియా సంస్థలకు అవేవీ పట్టవు. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌కు గానీ, ఉగ్రవాదులకు గానీ నష్టమేదీ జరగలేదని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంటున్నాయంటూ వాటికెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇదే నిజమైతే భారత సైనిక స్థావరాలపైకి అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 విమానాలతో పాక్ దళాలు ఎందుకు వచ్చాయి? అసలు ఉగ్రవాదుల వేటకు మాత్రమే వాడాల్సిన ఈ విమానాలను భారత్ పై దాడికి ఎందుకు వాడారని పాక్ సర్కారును అమెరికా నిలదీసి వివరణ అడిగింది. ఇవేవీ మన ప్రతిపక్షాలకు, మీడియా సంస్థలకు అవసరం లేదు.

అభినందన్ పాక్ అదుపులో ఉన్నప్పుడు అతని నుంచి భారత సైనిక రహస్యాలు సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ రాబట్టేందుకు పాక్ సైనికాధికారులు ప్రయత్నించారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కానీ ఈ విషయంలో మన మీడియా ప్రవర్తించిన తీరు మరీ ఘోరం. ఒకవైపు అభినందన్ దేశరహస్యాలు కాపాడే ప్రయత్నంలో ఉంటే, పాకిస్తాన్ శ్రమపడకుండానే అతని కుటుంబం గురించిన వివరాలన్నీ మన మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మన టీవీ చానెల్ ఒకటి గతంలో అభినందన్ బృందంతో చేసిన ఇంటర్వ్యూల ఫీడ్ కూడా పాక్‌కు చేరింది. చివరికి లోక్‌సభ ఎన్నికల ముందు యుద్ధం జరుగుతుందని బీజేపీ నేతలు తనతో రెండేళ్ళ కిందటే అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారంటూ పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ పత్రిక డాన్‌తో పాటు అక్కడి పలు మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. దీనిపై పవన్ మార్చి 2న స్పందిస్తూ ప్రముఖ వార్తా ఛానెళ్ళు, రాజకీయ విశ్లేషకులే వ్యాఖ్యలకు ఆధారమన్నాడు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్న పవన్ మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఈ లింకులు చూడండి...
https://epaper.andhrajyothy.com/c/37257305

https://www.dawn.com/news/1466936



ఎన్నికల సమయంలో ఉగ్రవాద దాడులు జరగడమేంటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు... వీటిపై చర్చలు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిస్పందన.. పాకిస్తాన్‌పై నిందలేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్, పంజాబ్ మంత్రి సిద్ధూల కన్నీరు... పాక్ కంట పన్నీరు... ఇదీ స్వతంత్ర భారతావనిలో నాయకత్వం తీరు.

అసలు ఒక దేశంపై పొరుగు దేశం నుంచి దాడి జరిగి విలువైన ప్రాణాలు పోతే... బాధిత దేశంలోని ప్రతిపక్షపార్టీలు లేదా మీడియా ఆ పొరుగు దేశం మీద జాలి చూపించడం మీరెక్కడైనా చూశారా? ఇప్పటివరకూ చూడకపోతే ఇప్పుడు చూడండి... భారతదేశంలో జరుగుతోంది అదే. పుల్వామా వద్ద 40 మంది భారత జవాన్లను పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదదాడులు బలిగొన్న తర్వాత, మన మీడియా, ప్రతిపక్ష నేతల, ప్రకటనలను గమనించండి. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి మన ధనమానప్రాణాలను కాపాడుతున్న సైనికులను లక్ష్యం చేసుకుని వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అన్నం పెట్టే చేతిని నరికే నీచనికృష్టుల్లాగా... సైనికులపై నిందలు వేస్తూ పరమ కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరు పాకిస్తాన్‌కి ఉపశమనం కలిగించేలా ఉంది తప్ప... తాము కూర్చున్న కొమ్మను తామే నరుకుతున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం లేదు. మన దేశంలో ఇలాంటి వాళ్ళుంటే పాకిస్తాన్‌కు అంతకంటే ఇంకేం కావాలి? ఐక్యరాజ్యసమితి మద్దతు కూడా అవసరం లేదు. మన మీడియా కంటే సోషల్ మీడియాలోని నెటిజన్లు పరిపక్వత ప్రదర్శిస్తున్నారు, ఈ నేతలకంటే సాధారణ పౌరులు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు.