Friday 15 March 2019

పాక్‌లో గెలవాలంటే భారత్‌ని తిట్టాలి! మరి భారత్‌లో గెలవాలంటే...?

జి.ఎస్.కుమార్
..........

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ గెలవాలంటే ఒకటే సూత్రం... అక్కడ ఏ పార్టీ అయినా సరే తమ ప్రత్యర్థి పార్టీపై దుమ్మత్తి పొయ్యడంతో పాటు మరోపని కూడా తప్పనిసరిగా చెయ్యాలి. అదేంటంటే... కశ్మీర్‌లో ఘోరాలు జరిగిపోతున్నాయని భారతదేశంపై నిందలు వేస్తూ... తాము అధికారంలోకి వస్తే భారత్ పని పడతామని ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పుకుని గగ్గోలు పెట్టాలి. కశ్మీర్‌పై తమకే చిత్తశుద్ధి ఉన్నట్టు నటించాలి. ఈ పని ఏ పార్టీ బాగా చేస్తే వారికే అధికారం దక్కేలా పాక్ సైన్యం కూడా శక్తివంచన లేకుండా సహకరిస్తుంది.

ఇక మన దేశంపైపు చూస్తే.. ఇన్నాళ్ళూ జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతోంది వేరు. మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. పూల్వామా ఉగ్రదాడి... దానికి దీటుగా భారత బలగాల స్పందన చూశాక ప్రతిపక్ష నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ పరిణామం ఎక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి లబ్ది చేకూర్చుతుందోనన్న ఆందోళనతో విపక్ష పార్టీలకు బీపీ పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకపార్టీని నిందించడంతో ఆగకుండా అనుక్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తున్న భారత సైన్యంపైనా నిందలు వేస్తూ ఎన్నడూ కనీవినీ ఎరుగనంత నైచ్యానికి ఒడిగడుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కే ప్రయోజనం చేకూర్చుతుందని, ఫలితంగా మన దేశానికే తలవంపులు తెస్తున్నామనే కనీస విజ్ఞత కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు.

ఇలా ప్రకటనలిస్తున్నవారిలో 125 ఏళ్ళ చరిత్ర కలిగిన చారిత్రక కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, సల్మాన్‌ ఖుర్షీద్‌, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రస్తుత, గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మమతా బెనర్జీ, మాయావతి, మెహబూబా ముఫ్తీ, కుమారస్వామి, సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేశ్... ఇలా మన దేశాన్ని, సైన్యాన్ని చులకన చేసి మాట్లాడేవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పుల్వామా ఉగ్రదాడి ప్రమాదమని... ఎన్నికలప్పుడే ఉగ్రవాద దాడి జరగడమేంటని... భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్రవాదుల్ని చంపిన సాక్ష్యాలు కావాలని... ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ళ కిందటే చెప్పారని.. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని...  ఇలా పేట్రేగిపోతూ మనదేశ ప్రతిపక్షనేతలు ప్రకటనలు చేస్తున్నారు. పొరుగుదేశంతో సమస్య వచ్చినప్పుడు మన సర్కారుకు, సైన్యానికి అండగా నిలబడకుండా అవమానిస్తున్న వీరందరి లక్ష్యమూ ఎన్నికల్లో తమ పార్టీల కోసం లబ్ది పొందడం కాక మరేమిటి?

పుల్వామా ఉగ్రవాద దాడికి ముందు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నోసార్లు మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నెన్నో ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాక్ తీరును మన ప్రభుత్వాలతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రశ్నించాయి.... అప్పుడు (ఇప్పుడు కూడా) పాక్ ఎలా స్పందించేదంటే... "మా మీద అన్యాయంగా నిందలేస్తున్నారు... మా (పాక్ ఉగ్రవాదులు) హస్తం ఉన్నట్టు ఆధారాలు చూపించండి..." అని. విచిత్రమేంటంటే, పుల్వామా దాడుల తర్వాత కూడా భారత సర్కారు పాక్ తీరును ప్రశ్నిస్తే... పాకిస్తాన్ స్పందన రావడానికి ముందే వారి తరఫున ముందుగా కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి సిద్ధుతో మొదలుపెట్టి.. "అయ్యో పాకిస్తాన్‌ని నిందిస్తారా?" అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ఈయన తర్వాత మనం పైన చెప్పుకున్న నేతాశ్రీలందరూ క్యూ కట్టి భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనుకుంటూ పాకిస్తాన్ తరఫున మన సైన్యాన్ని, సర్కారును నానా మాటలన్నారు. గతంలో ఇలాంటి సందర్భాలప్పుడు కేంద్ర సర్కారులకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్షపార్టీల వైఖరి ఈ సారి ఒక్కసారిగా ఎందుకు మారింది? ఎన్నికల్లో లబ్ధి కోసం కాదా?...

ఎప్పుడు పదవి పోతుందో అర్థంకాక రోజూ తలపట్టుకుని కూర్చునే కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా లైన్‌లోకి వచ్చేసి...  ఉగ్రవాదదాడులు ఇప్పుడే ఎందుకు జరగాలి? మా నాన్న (దేవెగౌడ) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరగలేదు కదా? అంటూ మమతా బెనర్జీ, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచాడు. ఇదంతా కాదు గానీ అసలు అభినందన్ మా హయాంలోనే పైలట్‌గా వైమానిక దళంలో చేరాడంటూ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్‌ నేత ఖుర్షీద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు.

పుల్వామా ఉగ్రవాదదాడి తమ పనేనని దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్, అతనితో ఆ పని చేయించిన జైష్ ఎ ఉగ్రవాదులు, జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ వీడియోలు విడుదల చేశారు. చివరికి పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కూడా రంగంలోకి దిగి తన హయాంలో కూడా జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌పై పలు మార్లు దాడులు జరిపిందని స్పష్టం చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న బాలాకోట్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన ప్రతిదాడుల్లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయని, పలువురు ఉగ్రవాదులు మరణించారని మన IAF ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలను అందజేసింది. అంతకు ముందే ఇటలీకి చెందిన ఒక మహళా పాత్రికేయురాలు ఈ విషయాన్ని ధృవీకరించింది.

మనల్నే కాపాడుతున్న మన సైనిక దళాలను అవమానపరచైనా మోదీ సర్కారును ఓడించాలని కంకణం కట్టుకున్న మన ప్రతిపక్ష నాయకులకు ఈ సాక్ష్యాలు, వీడియోలు కనిపిస్తాయనుకోవడం మన అత్యాశే... ఎందుకంటే తందానతాన అంటూ వాళ్ళకు వంతపాడే అనుకూల మీడియా సంస్థలు కూడా తోడున్నాయి మరి.

No comments:

Post a Comment