Wednesday 4 August 2021

మరవలేని మిత్రుడు

 ఎం.వి.ఆర్. శాస్త్రి 

...........................

ఈ ఆదివారం ( 2021 ఆగస్టు 1 న ) కన్నుమూసిన ప్రముఖ కార్మిక నాయకుడు  వి,వి.రామారావు నాకున్న కొద్దిమంది ఆప్తమిత్రుల్లో  ఒకడు. నా ఆలోచనా విధానాన్ని మార్చి , నా మీద ప్రగాఢ ప్రభావం చూపిన ముగ్గురు వ్యక్తుల్లో కాలక్రమాన్ని బట్టి మొదట పేర్కొనవలసినవాడతడు .

1967 లో నా 15 వ ఏట ( రికార్డుల్లో ఒక సంవత్సరం ఎక్కువగా చూపించి) కృష్ణాజిల్లా జగ్గయ్యపేట హైస్కూల్ లో హయ్యర్ సెకండరీ ( 12th class ) పరీక్ష పాసయ్యాక బి.ఎ. నుంచి బి.ఇ. దాకా అగ్రికల్చర్ B.Sc. సహా అన్ని రకాల కోర్సులకు  అప్లై చేస్తే చివరికి నంద్యాల పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగు డిప్లమా ( L.E.E. ) కోర్సు సీటు వచ్చింది.  పల్లెటూరినుంచి పట్నానికి భయంభయంగా వెళ్లాక కాలేజీలో నాకు మొదటిరోజే పరిచయమైన వాడు రామారావు. అతడు సివిల్ ఇంజనీరింగులో ఫైనల్ ఇయర్ స్టూడెంటు. మాదీ కృష్ణా జిల్లానే  అన్నాడు. చూడగానే నచ్చాడు. మంచి మాటకారి. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు తానేనట. ఆ సంవత్సరం కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాడట. నా వోటు అతడికేనని  తను అడగకుండానే డిసైడ్ అయ్యాను.

అప్పట్లోముఖ్యంగా ఇంజనీరింగు, మెడికల్  కాలేజీలలో కొత్తగా చేరినవారికి సీనియర్ల రాగింగు బాధ మహా తీవ్రంగా ఉండేది. నన్నూ ఎంత ఏడిపిస్తారోనని  భయపడ్డాను. ఇక్కడ అలాంటివేమీ ఉండవు . నేను జరగనివ్వను అన్నాడు  రామారావు. దాంతో ఇంకా నచ్చేశాడు.  అతడు అప్పటికే వీర కమ్యూనిస్టు. స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) నాయకుడు. . విద్యార్థి సమస్యలమీద ప్రిన్సిపాల్ తో తెగ కొట్లాడేవాడు. అయినా ప్రిన్సిపాల్ కు అతడంటే మహా ఇష్టం. ఏ కారణం చేతో ఆ ప్రిన్సిపాల్  ను ట్రాన్స్ఫర్ చేస్తే రామారావు  మా చేత సమ్మె చేయించి , హైదరాబాద్ దాకా వెళ్లి  బదిలీని రద్దు చేయించాడు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో మమ్మల్ని పోలీసులు పట్టుకుపోతే రామారావు  వాళ్ళతో గొడవపడి  , ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకొచ్చి అందరినీ విడిపించాడు. (తరవాత కాలంలో  విశాఖ స్టీల్ ప్లాంటు యూనియన్ కి తను  గౌరవాధ్యక్షుడు అయ్యాడు.)

రామారావులో కళలు చాలా ఉన్నాయి. బాగా పాడేవాడు. మంచి నటుడు. కాలేజి యనివర్సరీల్లో నాటకాలు వేసి ప్రైజులు కొట్టేసేవాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం గడగడ అప్పజేప్పేవాడు. మాటలతో అందరినీ కట్టిపడేసేవాడు. నిప్పులాంటి మనిషి .ఎక్కడా నీతి గీత దాటడు.  ఎవరినీ లెక్కచేయడు. పచ్చిబూతులు తప్ప మాట్లాడడు .అది కూడా బహుసొగసుగా! వినటానికి ఇంపుగా! 

వారిది కలిగిన కుటుంబమే. కాని ఏదో మాట పట్టింపు వచ్చి , ఇంటినుంచి వచ్చేశాడు. తండ్రి అంటే  ఇష్టం. అయినా మాటల్లేవు. ఫైనల్ ఇయర్ పాసయ్యాక కూడా నంద్యాలలో  కాలేజీ దగ్గరలో మేమున్న టెక్కె ఏరియాలో మాలాగే అద్దెగదిలో  ఉండేవాడు. డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాడు. అయినా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. విప్లవం గురించే మాట్లాడుతూండే వాడు. కాలేజి చదువు అయ్యాక  కమ్యూనిస్టు పార్టీలో హోల్ టైమరుగా పనిచేశాడు. పార్టీవారు అప్పుడప్పడూ చేతిలో పెట్టే కాస్త డబ్బుతోనే కాలం గడిపేవాడు. రాంభట్ల కృష్ణమూర్తి , గజ్జెల మల్లారెడ్డి  లాంటి ఉద్దండులను పట్టుకొచ్చి మాకు పొలిటికల్ క్లాసులు పెట్టించేవాడు. కర్నూల్ జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం కూడా ఒక్కోసారి అతడి రూములోనే జరిగేది.

అదిగో ఆ రోజుల్లోనే రామారావు నాకు నెమ్మదిగా మార్క్సిజం ఎక్కించాడు. నా చేత మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు తెగ  చదివించే వాడు. అతడితో పాటు నన్నూ ఆదర్శ లోకాల్లో విహరింప జేసేవాడు. అతడి సావాసం వల్ల నేను కాలేజి ఎగ్గొట్టి కమ్యూనిస్టు కార్యకలాపాల్లో పడటంతో  ప్రిన్సిపాల్ మా ఇంటికి  ఆ శుభ వర్తమానం తెలియపరిచాడు. మా నాన్నకు  తిక్క రేగి ‘ఇకపై నీకు రూపాయి పంపను’ అని ఉత్తరం రాశాడు. ఏమి చెయ్యాలని రామారావును సలహా అడిగాను . ‘ఇది సామాజిక సమస్య కామ్రేడ్. ఎలాగూ రెండేళ్లలో సోషలిష్టు విప్లవం వచ్చి తీరుతుంది . దాంతో ఆందరి సమస్యలూ తీరుతాయి. అప్పటిదాకా నాలాగే ఎలాగోలా అవస్థలు పడు.’ అని అతడు నమ్మకంగా చెప్పాడు. నేనూ అంతే సీరియస్ గా అతడి మాట నమ్మాను. ఆ రోజుల్లో పీడిత తాడిత ప్రజానీకం, గతితార్కిక భౌతిక వాదం, సామ్యవాదం, సమసమాజం తప్ప వేరే ఆలోచన వచ్చేది కాదు. కులమన్నా, మతమన్నా, దేవుడన్నా, ఆచారాలన్నా , ఆరెస్సెస్ అన్నా కంపరం పుట్టేది. ఆరెస్సెస్ లో కలిసిన  నా చిన్ననాటి స్నేహితులతో వాళ్ల సంస్థనూ, హిందూత్వ భావజాలాన్నీ చీల్చి చెండాడుతూ పేజీలకొద్దీ ఉత్తరాలు రాస్తూండేవాడిని , విద్యార్థి దశలో నన్ను అంతలా ప్రభావితం చేసిన రోల్ మోడల్ వేమూరి వెంకట రామారావు.

చదువు అయిపోయాక రామారావుతో కొన్నేళ్ళు సంబంధాలు తెగిపోయాయి. నేను నిరుద్యోగపర్వంలో ఉన్నప్పుడు – మా నాన్న తరఫున ఆంధ్రపత్రిక ఏజెన్సీ చూసుకుంటూ ఉండేవాడిని .  ఒకరోజు  పేపర్ పార్సిల్  రిసీవ్ చేసుకోవటం కోసం బస్ స్టాండులో ఉంటే బెజవాడ నుంచి వచ్చిన బస్సులో  రామారావు కనిపించాడు. బస్సు బయలుదేరేలోపు ఉన్న కాసేపట్లో చాలా కబుర్లు చెప్పాడు. కర్నూలు పార్టీ నాయకులతో సరిపడక వచ్చేశాడట.   పోర్ట్ కార్మిక నాయకుడు భద్రం గారు పిలిస్తే విశాఖపట్నం వెళ్లి అక్కడ యూనియన్ , పార్టీ వ్యవహారాలు  చూస్తున్నాడట. యూనియన్ పనిమీదే ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నానని చెప్పాడు. మళ్ళీ కొన్నేళ్ళకు అనుకోకుండా విజయవాడలో ప్రజానాట్యమండలి నాటకాలపోటీ సందర్భంగా  కలిశాడు. వైజాగ్ నుంచి తన బృందంతో  నాటకం వేయటానికి వచ్చాడట. అందులో ముఖ్య పాత్ర తనదేనట.

మళ్ళీ నాలుగైదేళ్ళకు 1982లో సితార అవార్డుల ఫంక్షన్ కవర్ చేయటానికి  మొదటిసారి నేను వైజాగ్ వెళ్లాను. రామారావు గుర్తొచ్చి నేనున్న డాల్ఫిన్ హోటల్ నుంచి కాంటాక్ట్ చేశాను. పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేశాడు. ఏదో  ఆందోళనలో అరెస్టు అయ్యాడట. తరవాత హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాడు. సోమాజీగూడలో ఈనాడు ఆఫీసు పక్కనే పోర్ట్  గెస్ట్ హౌస్ లో దిగేవాడు. కాలేజీ రోజుల్లో కమ్యూనిస్టు పాఠాలు చెప్పినట్టే  అప్పుడు బతుకు పాఠాలు చాలా బాగా చెప్పేవాడు. అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అప్పటినుంచీ  మరణించేవరకూ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉండేవాడు. మరణానికి పక్షం రోజుల ముందు  మాట్లాడలేని  స్థితిలో కూడా ఫోన్ చేయించి నా గొంతు విన్నాడు.  

రామారావు మొదట్లో రాజ్ దూత్ మోటర్ సైకిల్ మీద తిరిగేవాడు. కొంతకాలానికి యూనియన్ తనకు కారు కొనిచ్చిందని చెప్పాడు. తరవాత ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. పోర్ట్ వర్కర్స్ యూనియన్ల సమాఖ్యకు కాబోలు  జాతీయ నాయకుడయ్యాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు. జనం మధ్య బతికాడు. లేనివాడి బాగోగులు పట్టించుకున్నాడు. గుప్తదానాలు ఎన్నో చేశాడు. ఎందరినో ఎన్నోవిదాల ఆదుకున్నాడు. పదవులను సొంతలాభానికి వాడుకునే లోకరీతికి భిన్నంగా తన పలుకుబడితో  నిధులు సమీకరించి విశాఖపట్నంలో పార్టీకి పెద్ద భవనం కట్టించాడు. తొలిరోజుల్లో తనను పైకి తెచ్చిన నీలం రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుని ఆ భవనానికి ఆయన పేరు పెట్టాడు. కాలేజి రోజుల్లో సమస్యలపై కొట్లాడికూడా ప్రిన్సిపాల్ కు ఇష్టుడైనట్టే , కార్మికులతరఫున ఎంత గొడవపడ్డా పోర్ట్ చైర్మన్లకు గౌరవపాత్రుడయ్యాడు. ముఖ్యంగా పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు రామారావు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెగ మెచ్చుకునే వాడు.

ఒకసారి నేను మా గురువు సద్గురు శివానందమూర్తిగారిని కలవటానికి భీమిలి  వెళ్ళబోతున్నాను.  వెళుతూ వస్తూ మనం మాట్లాడుకోవచ్చు ;నేనూ వస్తానని రామారావు అన్నాడు. ‘ఈ గురువులు నా ఒంటికి పడరు; నేను లోపలికి రాను ; కారులో వెయిట్ చేస్తాను’ అన్నవాడుకాస్తా తీరా వెళ్ళాక తానూ నా వెంట వచ్చాడు. లోపల గురువుగారు కొంతమందికి ఏదో  చెబుతున్నారు. రామారావెవరో ఆయనకు  తెలియదు. నేనూ వివరాలు చెప్పలేదు. కాని మనవాడిని  చూడగానే ఆయన నడుస్తున్న సంభాషణలో మార్క్స్ ‘కేపిటల్’ ప్రస్తావన తెచ్చారు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాన్నీ , భారతీయ తత్త్వాన్నీ చక్కగా సమన్వయం చేశారు. రామారావుకు అది నచ్చింది.బయటికి వచ్చాక ‘ ఆయన చెప్పినదానితో నాకు పేచీ లేదు. అంతా ఒప్పుకుంటాను. కానీ-'  అన్నాడు.

 ఆ ‘కానీ’  దగ్గరే అతడికీ నాకూ తగవు. జీవితకాలమంతా వాదులాడినా అది తెగలేదు. తెగేదీ కాదు. భావజాల పరంగా మేము ఉత్తరదక్షిణ ధృవాలం. అ తేడా మా స్నేహానికి అడ్డురాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నా కుశలం , నా కుటుంబ  క్షేమం ఆప్యాయంగా అడిగేవాడు. సొంత అన్నదమ్ములకంటే ఎక్కువగా ఆపేక్ష పడేవాడు.  తన స్నేహితులలో ఎవరికి ఏ మంచి  జరిగినా ఎంతో సంతోష పడేవాడు.  తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో ,  తన కార్మిక సోదరులనూ అంతే ప్రేమించాడు. ఒకరు వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోకుండా ఆదర్శవంతంగా బతికాడు. ఆచరణ, సమకాలిక పోకడల విషయంలో విభేదించినా నమ్మిన సిద్దాంతానికి కడదాకా కట్టుబడ్డాడు. నలుగురిలో  మంచి పేరు తెచ్చుకుని  మహారాజులా వెళ్ళిపోయాడు.

( ఇక్కడ  కనిపించేది 20 ఏళ్ల కిందట మా ఉభయమిత్రుడు బొలిసెట్టి సత్యనారాయణ గారు, చందు సుబ్బారావుగారు చొరవ తీసుకుని విశాఖపట్నంలో నిర్వహించిన నా ‘కాశ్మీర్ కథ’ గ్రంథావిష్కరణ సభలో నేను,రామారావు ఉన్న  ఫోటో )



                                    --------------------------------------------