Thursday 30 August 2018

నటరాజస్వామి చూపిన దారి

పెక్యులరిజం-11
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.....................


ఉండుండి ఎక్కడో దేవుడు వెలుస్తాడు. లేక వెలవాలనుకుంటాడు. ఒక పుణ్యాత్ముడికి బుద్ధి పుడుతుంది. ఇంకొందరు ధర్మాత్ములు సాయం పడతారు. గుడి ఏర్పడుతుంది. భక్తులూ, దాతల సౌజన్యంతో అభివృద్ధి చెందుతుంది. కాస్త పేరు, ప్రఖ్యాతి రాగానే సర్కారు వారి వంకరచూపు పడుతుంది. గుడిని ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ లాగేసుకుంటుంది.

ముందు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు వస్తాడు. వచ్చీ రాగానే హుండీ పెడతాడు. ప్రతి పూజకు, ప్రతి సేవకు, ఆఖరికి దైవ దర్శనానికి కూడా టిక్కెట్లు పెడతాడు. వాటి లెక్కలు చూడటానికి, పూజారులు కానుకల్ని కాజెయ్యకుండా కనిపెట్టటానికి మందీ మార్బలం! వాటి అజమాయిషీకి ఆఫీసులు, వాహనాలు, ఇంకా ఇంకా ! భక్తుల నుంచి వచ్చే రాబడిలో సింహభాగం అధికార యంత్రాంగాన్ని మేపడానికి చెల్లు! అసలు అవినీతి, అక్రమాలు అప్పుడే మొదలు! పార్టీ రాజకీయాలు, హైలెవల్‌ దందాలు మొదలయ్యాక ఘరానా దొంగల భుక్తికే తప్ప భక్తికి చోటుండదు.

రాజ్యాంగం ప్రభుత్వాలకు సందు ఇచ్చింది మత సంస్థల్లో, వాటి ఆస్తుల అజమాయిషీలో ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దేందుకు శాసనపరంగా తగుమాత్రం చర్యలను తీసుకోవటానికి! కాని ఇప్పుడు ఏ తప్పు జరగకముందే ప్రభుత్వాలు గుళ్లమీద పడుతున్నాయి. అవసరం ఉందా లేదా అన్నది కానకుండా కంటికి నదరుగా కనిపించే అన్ని గుళ్లలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లను నియమించి, శాశ్వత ప్రాతిపదికన కర్ర పెత్తనం చేస్తున్నాయి.

ఇది తప్పు; రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు నాలుగేళ్ల కింద చిదంబరం నటరాజాలయానికి సంబంధించిన కేసులో మొగం వాచేట్టు చివాట్లు పెట్టింది- ఇదిగో ఇలా :

“Even if the management of a temple is taken over to remedy the evil, the management must be handed over to the person concerned immediately after the evil stands remedied. Continuation thereafter would tantamount to usurpation of their property rights or violation of the fundamental rights guaranteed by the constitution in favour of the persons deprived. Therefore, taking over the management in such circumstances must be for a limited period”.

(ఒక చెడుగును సరిచేయటం కోసం ఒక దేవాలయ యాజమాన్యాన్ని (ప్రభుత్వం) టేకోవర్‌ చేసినప్పటికీ - ఆ చెడుగును పరిహరించే పని కాగానే యాజమాన్యాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పగించాలి. ఆ తరువాత కూడా ప్రభుత్వ యాజమాన్యాన్ని కొనసాగించడమంటే పదవి నుంచి తొలగించబడిన వారికి రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను భంగపరచి, వారి ఆస్తి హక్కులను హరించడమే అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం యాజమాన్యాన్ని చేపట్టటమనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి.)

ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు తమకు హిందూ దేవాలయాలు హక్కుభుక్తం అనుకుంటున్నాయి. తమ ఇలాకాలోని దేవస్థానాలన్నిటినీ సొంత ఆస్తులుగా పరిగణించి ఇష్టానుసారం పాలించడానికి రాజ్యాంగం తమకు గుండుగుత్త అధికారమేదో ఇచ్చినట్టు తెగ ఫీలైపోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని తీరవలసిన అవసరం ఉన్నదా లేదా అన్న విచక్షణ లేకుండా.. చక్కగా నడుస్తున్న గుళ్లతో సహా తగు మాత్రం ఆదాయం వచ్చే అన్ని దేవాలయాలనూ ఒకే ఒక చట్టంతో టోకున టేకోవర్‌ చేసి, ప్రతి గుడికీ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును నియమించి, గవర్నమెంటు  శాశ్వతంగా పెత్తనం చలాయిస్తున్నది.

అరవై డెబ్భై ఏళ్లుగా సాగుతున్న ఈ సర్కారీ జులుం అక్రమం, దుర్మార్గం అని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయింది. తీవ్రమైన తప్పిదం ఏదో జరిగిన సందర్భంలో ఒక ఆలయాన్ని ప్రభుత్వం టేకోవర్‌ చేసినా, ఆ తప్పును సరిదిద్దే పని పూర్తి కాగానే ఆలయాన్ని దాని హక్కుదారులకు తిరిగి ఒప్పగించాలి; ప్రభుత్వ కంట్రోలు అనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది! అంటే- సరిదిద్దాల్సిన తప్పు ఏదీ లేని, సవ్యంగా నడుస్తున్న దేవాలయాలను స్వాధీన పరచుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పినట్టే కదా? ప్రభుత్వ పెత్తనం అనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి; ఎల్లకాలం దాన్ని కొనసాగించడమంటే ఆలయ హక్కు దారులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును భంగపరచడమే అని సర్వోన్నత న్యాయస్థానం కరాఖండిగా ప్రకటించింది. దీన్ని బట్టి - ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో దేవాలయాలపై నిరవధికంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనం రాజ్యాంగ విరుద్ధం; ప్రాథమిక హక్కులకు విఘాతం - అని తేలిపోలేదా ?

చిదంబరంలోని దీక్షితార్ల దీక్ష, దక్షత చూసి మొత్తం హిందూ సమాజం గర్వపడాలి. సుప్రసిద్ధ నటరాజాలయాన్ని సర్కారీ గద్దల బారి నుంచి రక్షించటానికి వారు బ్రిటిషు పాలన కాలం నుంచే అలుపు లేకుండా పోరాడుతున్నారు. 1951లో మద్రాసు హిందూ రిలిజియస్‌ & చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ చట్టం తెచ్చిన వెంటనే చిదంబరం ఆలయానికీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును వేశారు. దీక్షితార్లు మద్రాసు హైకోర్టుకు వెళ్లి ఆ ఆర్డరు రద్దు చేయించారు. చారిత్రాత్మకమైన శిరూర్‌ మఠం కేసులో సుప్రీంకోర్టు ముక్కచివాట్లు పెట్టాక ఉన్న చట్టాన్ని ఎత్తివేసి ప్రభుత్వం 1959లో కొత్త ఎండోమెంట్స్‌ చట్టాన్ని తెచ్చింది. దానికింద 1987లో మళ్లీ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును నియమించారు.

దీక్షితార్లు మళ్లీ కోర్టుకెక్కారు. హైకోర్టు స్టే అయితే ఇచ్చింది. కానీ పదేళ్ల తరువాత కేసు కొట్టేసింది. చెప్పాల్సింది ప్రభుత్వానికి చెప్పుకుని అక్కడ న్యాయం జరగకపోతే మా దగ్గరికి రావాలని తుది తీర్పులో చెప్పింది. దీక్షితార్లు ఆ ప్రకారమే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. న్యాయం జరగలేదు. దీక్షితార్లు ఇంకోసారి హైకోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టు సింగిల్‌ జడ్జి వారి రిట్‌ను కొట్టేశారు.

2009 ఫిబ్రవరి 2న హైకోర్టు తీర్పు వెలువడింది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అధికార గణానికి ముందే ఉప్పందింది. మధ్యాహ్నానికల్లా అధికారులు గుడి దగ్గర కాచుకుని ఉన్నారు. తీర్పు ప్రకటించిన వెంటనే లోపలికి చొరబడ్డారు. ముందు హుండీలు పెట్టారు. ఆ వెనుక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు ప్రవేశించాడు. గుడి ప్రాంగణం లోపల, బయట మారేజీ హాళ్లు, వాణిజ్య కేంద్రాలు నెలకొల్పి సర్కారు వారు షరామామూలుగా పక్కా వ్యాపారం మొదలెట్టారు. ఆలయాన్ని టూరిస్టు కేంద్రంగా ఆకర్షణీయం చేయడానికి ప్లాన్లు వేశారు. మతం, ఆచారం, భక్తి అడుగున పడ్డాయి.

ఆ స్థితిలో దిక్కుతోచని దీక్షితార్లకు అదృష్టవశాత్తు ధర్మవీరుడు సుబ్రహ్మణ్య స్వామి తోడు దొరికింది. ఆయన వారితో కలిసి హైకోర్టుకు అపీలు చేశాడు. కేసు పోయింది. పట్టువదలని స్వామి సుప్రీంకోర్టు గడప తొక్కాడు. అదిగో ఆ అపీలు మీదే 2014 జనవరి 6న జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేలతో కూడిన డివిజన్‌ బెంచి పైన ఉటంకించిన చరిత్రాత్మక తీర్పును ప్రకటించింది.

ప్రత్యేక మతశాఖ (రిలిజియస్‌ డినామినేషను)కు చెందిన తాము 1500 సంవత్సరాలకు పైగా ఏ వంక లేకుండా నడుపుకుంటున్న నటరాజాలయాన్ని ఇష్టానుసారం హస్తగతం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు అన్న స్మార్త బ్రాహ్మణ దీక్షితార్ల వాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. దీనివల్ల ఒక్క చిదంబరం గుడికే కాక మొత్తం హిందూ ఆలయ వ్యవస్థకు గొప్ప మేలు జరిగింది. వ్యాజ్యం ఒక రిలిజియస్‌ డినామినేషన్‌కు సంబంధించినది అయినా దేవాలయాలను స్వాధీన పరచుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న హద్దులు, జోక్యం చేసుకోవలసిన సందర్భాలు, ఆ జోక్యానికి కాలపరిమితుల గురించి సర్వోన్నత న్యాయస్థానం చేసిన న్యాయ నిర్ణయం ప్రభుత్వ గ్రహణం పట్టిన అన్ని దేవాలయాలకు సరిపోతుంది.

“Power under the Act for appointment of an Executive officer could not have been exercised in the absence of any prescription of circumstances/conditions in which such an appointment maybe made. Even otherwise, the order in which no period of its operation is prescribed, is not substainable being ex facie arbitrary, illegal and unjust”.

(''ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును ఏ పరిస్థితుల్లో నియమించవలసిన వచ్చిందన్నది నిర్దేశించకుండా ఇ.ఒ. నియామకం చేయడానికి చట్టప్రకారం వీలులేదు. అదీగాక నియామకం ఎంతవరకు అన్న కాలపరిమితి నిర్దేశించబడని ఉత్తర్వు నిరంకుశం, చట్టవిరుద్ధం , అన్యాయం''.)

- అని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు చేసిన ధర్మ నిర్ణయం మిగతా రాష్ట్రాల్లోని దేవాలయాలకూ సహజంగా అన్వయిస్తుంది. హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ (హెచ్‌.ఆర్‌. & .సి.ఇ.) చట్టం ఒకటి చేసి, దాని ద్వారా ఏ గుడిని పడితే ఆ గుడిని తలచిందే తడవుగా గవర్నమెంటు పులుసులో కలిపేయటం, మామూలు గవర్నమెంటు డిపార్టుమెంట్లలో చేసినట్టు ఆలయాలకు కూడా ఇ.ఒ.లను రొటీన్‌గా అపాయింటు చేయటం నిరంకుశం, చట్టవిరుద్ధం అని ఇప్పుడు విస్పష్టంగా తేలిపోయింది. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో వేలాది దేవాలయాల్లో ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్న ఇ.ఒ.ల నియామకం చట్టరీత్యా చెల్లదని సాధికారికంగా ధ్రువపడింది. బలమైన కారణం ఉంటేనే, అదీ కేవలం కొద్ది కాలానికి మాత్రమే కార్యనిర్వహణ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు విడమర్చి చెప్పాక మొత్తంగా ఆలయ వ్యవస్థ మీద ప్రభుత్వ నడమంత్రపు పెత్తనానికి అడుగు ఊడిపోయింది.గుళ్లమీద అయినదానికీ కానిదానికీ ఎండోమెంట్స్‌ డిపార్టుమెంటు అత్తరికానికి ఆస్కారం పోయింది. ఆయా గుడుల అసలు హక్కుదారులను పక్కకు నెట్టి రాజకీయ జీవులు, అయోగ్యులు, అప్రాచ్యులు ధర్మకర్తల బోర్డులలో చేరి చేస్తున్న ఆగడాలకు ఇది ఆటకట్టు.



ఏ రకంగా చూసినా ఇది హిందూ సమాజానికి దిగ్విజయం. కాని ఒక కల కనగానే తెల్లవారిపోదు. చిదంబరం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గొప్ప తీర్పుతోటే హైందవ దేవాలయాలకు రాజకీయ తిప్పలు తీరవు. కారణం చూపకుండా, కాలపరిమితి చెప్పకుండా ప్రభుత్వం ఆలయాలను స్వాధీనం చేసుకోవటం తప్పు అని సుప్రీంకోర్టు అనగానే రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని అక్రమ కబ్జాలు మానుతాయన్న ఆశలేదు. సుప్రీంకోర్టు ప్రకటించిన న్యాయసూత్రం ఆటోమేటిగ్గా అన్ని దేవాలయాల్లో వెంటనే అమల్లోకి రాదు. ఆ పని జరగాలంటే మళ్లీ సుప్రీంకోర్టునే ఆశ్రయించాలి. చిదంబరం కేసులో తమరు చేసిన న్యాయనిర్ణయం అన్ని రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో అన్ని రకాల ప్రభుత్వ జోక్యాలకూ వర్తించేవిధంగా ఉత్తర్వు చేయమంటూ ఇంకో వ్యాజ్యం వేయాలి.

ఆ పని ఇప్పటికే మొదలైంది. పూజ్య దయానంద సరస్వతి స్వామి పూనికతో, సుబ్రహ్మణ్యస్వామి చొరవతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల ఎండోమెంట్స్‌ చట్టాలను సవాలు చేస్తూ గట్టికేసు సుప్రీంకోర్టులో చాలా కాలం కిందటే పడింది.కాని అది ఎప్పటికి తెములుతుందో ఎవరికీ తెలియదు. పూజ్య దయానంద సరస్వతి స్వామి ఈవరకే స్వర్గస్థులయ్యారు. 2016లోనే తుది తీర్పు వెలువడుతుందనుకున్నారు. వేగంలో నత్తకు మేనత్త అయిన మన న్యాయవ్యవస్థలో ఏ కేసుకు ఎప్పుడు మోక్షం వస్తుందో దేవుడికెరుక.

నిజానికి అసలు లోపం న్యాయ విధానంలో కాదు - మన ఆలోచనా విధానంలోనే ఉంది. ఎంతసేపటికీ ఏ సుబ్రహ్మణ్యస్వామో కాళ్లరిగేట్టు కోర్టుల చుట్టూ తిరిగి కార్యం సాధించాలనే మనం అనుకుంటాం. అంతేగాని ఇందులో మనం చేయవలసింది, చేయగలిగింది ఏముంది అని ఆలోచించం. ఎనభయ్యేళ్లు దాటినా పాపం సుబ్రహ్మణ్య స్వామి రేయింబవళ్లు ఎన్నో ప్రజా సమస్యలపై కొట్లాడుతూనే ఉన్నాడు. కాని మన వరకు మనం ఏమి చేస్తున్నాం? తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో దేవాలయాలపై సర్కారీ దాదాగిరీ రాజ్యాంగ విరుద్ధమని స్వయానా సుప్రీంకోర్టే ధ్రువీకరించాకయినా ఆ దాదాగిరీని అంతమొందించి తీరాలని హిందూ సమాజం కదిలిందా? చిదంబరం తీర్పు వచ్చి నాలుగున్నరేళ్లు దాటినా అక్రమ పెత్తనాన్ని కిమ్మనక భరిస్తున్నామే తప్ప.. ప్రభుత్వం మీద, దాన్ని నడిపే పార్టీల మీద గట్టి ఒత్తిడి తెచ్చి, గుళ్లకు రాజకీయ గ్రహణం తప్పించేందుకు కనీసం ఒక గట్టి ప్రయత్నం జరిగిందా?

మరికొన్ని నెలల్లో దేశమంతటా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అధికారం అపేక్షించే ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను ప్రసన్నం చేసుకుని, ఓట్ల అక్కర తీర్చుకోవడానికి ఆపసోపాలు పడుతుంటుంది. అడిగిన వారికి లేదనకుండా ఆపద మొక్కులు మొక్కుతుంటుంది. ఓటర్లలో ముప్పాతిక భాగానికి పైగా హిందువులు. ఆ హిందువులందరూ తమ గుళ్లపై గవర్నమెంటు జులుం పోవాలనుకుంటున్నారు అని అర్థమైతే ఏ పార్టీ అయినా దారికొచ్చి 'సరే' అనదా? ఓటు వంటి వజ్రాయుధం చేతిలో ఉండికూడా వాడుకోవటం చేతగానివాళ్లను ఏ పార్టీ లెక్క చేస్తుంది? ఏ కోర్టు ఆదుకుంటుంది?

Friday 24 August 2018

గుడుల గోడు

పెక్యులరిజం - 10
ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.................

గుళ్లమీద గవర్నమెంటు కంట్రోలుకు చచ్చుదో చెడ్డదో ఒక చట్టమైతే ఉన్నది కదా? ఆ చట్ట ప్రకారం ప్రభుత్వం దేవాలయాల మీద పెత్తనం చేస్తే అది నేరం ఎలా అవుతుంది? మనకు ఇష్టం లేకపోవచ్చు. మనకు కష్టం కలగవచ్చు. అంతమాత్రాన చట్టబద్ధంగా ప్రభుత్వం చేసే అజమాయిషీని బందిపోటుతనం అని ఎలా అనగలం ?

ఉన్న అధికారాన్ని సరిగా ఉపయోగిస్తే అది అజమాయిషీ అవుతుంది. లేని అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగపరిస్తే అది దోపిడీ అనిపించుకుంటుంది. దేశంలో మనతో సహా అనేక రాష్ట్రాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నది ఇందులో రెండోరకం.

ఏ దేవాలయాన్నయినా పోషించేది భక్తులు. ప్రభుత్వం తన జేబులోంచి ఖర్చు పెట్టేది దమ్మిడీ ఉండదు. ఎండోమెంట్సు చట్టం బారిన పడ్డ ఏ రాష్ట్రంలోనైనా వేళ్లమీద లెక్కించగలిగిన కొన్ని గుళ్లు భారీ ఆదాయంతో, సిరి సంపదల రాశులతో వెలిగిపోతుంటాయి. వందలకొద్దీ మధ్యతరగతి ఆలయాలు బొటాబొటి రాబడితో, పెద్ద ఖర్చేదైనా వస్తే డబ్బుకోసం తడుముకోవలసిన స్థితిలో కాలం వెళ్లదీస్తుంటాయి. వేలకు వేల బడుగు గుడులు నిత్యదీప, నైవేద్యాలకే ఇబ్బంది పడుతుంటాయి.

అంటే - సమాజంలోలాగే ఆలయ వ్యవస్థలోనూ ధనిక, మధ్య తరగతి, నిరుపేద అంతరాలు ఉన్నాయి. దేవుళ్లు మనుషుల్లాగా పిసినిగొట్లు కారు. డబ్బులేని గుడికి సహాయపడటానికి డబ్బున్న గుడి దేవుడికి అభ్యంతరం ఉండదు. అలాగే భక్తులు కూడా. తిరుమల వెంకన్నకో, భద్రాద్రి రాముడికో తాము సమర్పించుకునే కానుకలు ఊళ్లలో దీనావస్థలోని వెంకటేశ్వరాలయాలకో, రామాలయాలకో ఉపయోగపడతాయంటే సంతోషిస్తారే తప్ప ఏ భక్తుడూ తగవులాడడు.

సర్కారీ కర్రపెత్తనంలో ఇప్పుడు ఏమి జరుగుతున్నది ?

బాగా డబ్బున్న ఆలయాల సొమ్మునేమో అడ్డమైన రాజకీయ మెహర్బానీలకు యధేచ్ఛగా వాడేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను గుళ్ల నెత్తిన రుద్దుతూ రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, పెద్ద ఆస్పత్రులు, మురుగు నీటి పారుదల సౌకర్యాల వంటి వాటి మీద దేవస్థానాల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నారు.

దేవాలయం అనేది ప్రధానంగా మత సంస్థ. దేవస్థానంలోని మిగులు నిధులను హిందూ ధర్మ ప్రచారానికి, మత గ్రంథాల ముద్రణకు, పంపిణీకి, యాత్రికుల సౌకర్యాలకు, జీర్ణ దేవాలయ ఉద్ధరణకు వెచ్చించాలని ఎండోమెంట్ల చట్టాలైతే చెబుతాయి. హిందూ దేవాలయానికి హిందువుల వల్ల సమకూడిన నిధిని హిందూ మత ప్రయోజనాలకు వెచ్చించటానికైతే సర్కారీ పెత్తందార్లకు చేతులు రావు. హిందూ గుళ్ల సొమ్మును చర్చిలు, మసీదులు కట్టుకోవటానికి, క్రైస్తవ, ఇస్లామిక్‌ మత ప్రచార కార్యకలాపాలకు దొడ్డిదారిన తేరగా విరజిమ్మటంలో మాత్రం మన గుడిదొరలు కడు ఉదారులు!

పార్టీ ప్రయోజనాలకు, ఓట్ల అవసరాలకు, పాలకవర్గ సొంతలాభాలకు దేవుడి సొమ్మును అడ్డగోలుగా వాడేసుకునే పాలకులు దీనావస్థలోని దేవాలయాలను వాటి కర్మానికి వదిలేస్తున్నారు. ఇల్లుగడవక చిన్న గుళ్ల పుజారులు నానా బాధలు పడుతుంటే, పట్టించుకునే దిక్కు లేదు. దీపం పెట్టే దిక్కులేక ఊళ్లలో కొన్నివేల పాతగుళ్లు పాడుబడుతూంటే ఆలయ వ్యవస్థను చెరబట్టిన రాజకీయ, అధికార గణాలకు చీమకుట్టిన పాటి చలనం లేదు.

హిందూ దేవాలయాల నుంచి గుంజుకోవటమే తప్ప ఆలయాలకు ప్రభుత్వాలు ఇచ్చింది గుండుసున్న. కొన్ని శతాబ్దాలకింద, ఎన్నో తరాల వెనుక మహారాజులు, జమీందార్లు, సంపన్న దాతలు చేసిన దానాలు, ఇచ్చిన మాన్యాలే ఆలయాలకు ఉన్న ప్రధాన ఆస్తులు. సెక్యులర్‌ సర్కార్లు ఎలాగూ పైసా విదిల్చవు. కనీసం పాతకాలంలో దాతలు ఆయా ఆలయాలకు దఖలు పరచిన మడి మాన్యాలనైనా మన ప్రభువులు సక్రమంగా కాపాడుతున్నారా? వాటిని ఎవరూ ఆక్రమించకుండా, ఇవ్వవలసిన కౌలును, అద్దెలను ఎగ్గొట్టకుండా అడ్డుపడుతున్నారా?

అడ్డుకునే మాట దేవుడెరుగు. గవర్నమెంట్లు నడిపే వారే బరితెగించి గుడి ఆస్తులు కాజేస్తున్నారు. సర్కారీ పెత్తనం రావటానికి పూర్వం దేవస్థానాలలో ఉండిన వెలలేని రత్నాభరణాలకు లెక్కాపత్రం లేదు. జనాలు నాణేలు విసిరితే వజ్రం విరిగిపోయిందని చెప్పినా నమ్మాల్సిందే. దైవమాన్యాలను కాపాడవలసిన వారే తమ మనుషుల చేత ఆ మాన్యాలను కబ్జా చేయిస్తున్నారు. వేల ఎకరాల దేవుడి భూములను ఎవరికి పడితే వారికి రాజకీయ లబ్దికోసం తేరగా పంచి పెడుతున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా, కబ్జా భూమిని దేవస్థానం స్వాధీనం చేసుకోనివ్వకుండా రాజ్యమేలే నేతలు, వారి తైనాతీలైన అధికారులు రాజకీయ చక్రం అడ్డువేస్తున్నారు. కాగితాలమీద వేల ఎకరాల మాన్యాలూ, కోట్ల విలువైన ఆస్తులు ఉండికూడా నిత్యనైవేద్యాలకు, అర్చకుల జీతాలకు కటకటలాడుతున్న ఆలయాలు వేలకు వేలు. ఈదుస్థితికి పవిత్ర ఆలయ వ్యవస్థను దిగజార్చిన వారిని చట్టబద్ధ పరిపాలకులు అనాలా? పట్టపగటి బందిపోట్లు అనాలా?

ఆలయానికి కీలకమైన పూజారి ఇవాళ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు తక్కుంగల అధికారుల చేత దొంగలా చూడబడుతూ అటెండరుకంటే తక్కువ గౌరవం పొందే అభాగ్యుడు. గుడి బాధ్యతలకు వినియోగింపబడే ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వంటివారు హిందూ మతాన్ని విశ్వసించేవారు అయి ఉండాలన్న చట్ట నిబంధన కాగితాలమీదే కొడిగట్టింది. దేవస్థానం వాహనంలో చర్చికి వేళ్లేవాళ్లు, బైబిల్‌ పట్టుకుని తిరిగేవాళ్లు, స్వామికి దండం పెట్టని వాళ్లు, ప్రసాదం ముట్టనివాళ్లు పుజారుల మీద, పూజా విధానాలు, కైంకర్యాల మీద పెత్తనం చలాయిస్తున్నారు.

ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఆలయాలలో అంతులేని అవినీతి, అక్రమాల, అపచారాల, దురాగతాల వైనాలు ఎంత చెప్పినా తరగవు. రక్షకులే భక్షకులైన ఈ దారుణ దురవస్థ మొత్తానికీ మూలం ఆలయాల మీద సర్కారీ జబర్దస్తీ!

జబర్దస్తీ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలు చేస్తున్న స్వారీకి చట్టబద్ధత ఎంత మాత్రమూ లేదు కనుక! గుళ్లమీద కంట్రోలుకు తమకు ఉన్నదని ప్రభుత్వాలు చెప్పుకునే అధికారం వాస్తవానికి వాటికి లేనేలేదు కాబట్టి!!

గుళ్లమీద పెత్తనం చేసే అధికారం మీకు ఎక్కడిదని అడిగితే ఏ ప్రభుత్వమైనా చూపించేది ఒకే ఒక రాజ్యాంగ అధికరణం : 25(2)(a). హిందూ దేవాలయాలన్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా భావించి, వాటి నెత్తినెక్కి పెత్తనం చేయవచ్చునని అందులో ఎక్కడా లేదు. అక్కడ ప్రభుత్వానికి ఇచ్చిందల్లా 'మత ఆచరణతో సంబంధం ఉన్న ఏ ఆర్థిక, ద్రవ్యపరమైన, రాజకీయ లేక సెక్యులర్‌ యాక్టివిటీని క్రమబద్ధం లేక పరిమితం చేసేందుకు శాసనాలు చేసే'' అధికారాన్ని మాత్రమే! అంటే దేవాలయాలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సెక్యులర్‌ కార్యకలాపాల విషయంలో ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు భావిస్తే వాటిని ప్రభుత్వం క్రమబద్ధం (రెగ్యులేట్‌) చేయవచ్చు. రిస్ట్రిక్ట్‌ చేయవచ్చు. దానికి అవసరమైన శాసనాలు చేయవచ్చు. ప్రభుత్వం తన హద్దులో తానుండి, లోటుపాట్లను సరిదిద్ది కార్యకలాపాలను రెగ్యులేట్‌ చేసేందుకు కావాలనుకుంటే శాసనాలు చేయవచ్చు. అంతేగాని ఏకంగా దేవాలయాలను తన స్వాధీనం చేసుకుని, వాటి దైనందిన నిర్వహణ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని, గుళ్లమీద స్వారీ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు.

తప్పులు జరగకుండా రెగ్యులేట్‌ చేసేందుకే దేవాలయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నామని సమర్థించేందుకూ రాజ్యాంగరీత్యా ఆస్కారం లేదు. మత వ్యవహారాలను సొంతంగా మేనేజ్‌ చేసుకోవటానికి, స్థిరచరాస్థులను సంపాదించి వాటిని అజమాయిషీ చేసుకోవటానికి అన్ని మతాలకు చెందిన అన్ని మత శాఖలకు, వాటికి చెందిన అన్ని విభాగాలకూ పూర్తి హక్కులను రాజ్యాంగం 26వ అధికరణం విస్పష్టంగా దఖలు పరచింది. కాబట్టి మత వ్యవహారాల మేనేజ్‌మెంటు, ఆస్తుల అజమాయిషీ ఆయా మతాల వారి హక్కు. అందులో ప్రభుత్వం చొరబడతామంటే కుదరదు.

ఈ విషయం సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికి 64 ఏళ్లకిందటే నిష్కర్షగా తేల్చి చెప్పింది. ఉడిపి కేంద్రంగా శ్రీమత్‌ మధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాల్లో ఒకటైన శిరూర్‌ మఠానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1954లో ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు [1954 AIR 282] లో ఏమన్నదో గమనించండి.

Under article 26(d) it is the fundamental right of a religious denomination or its representative to administer its properties in accordance with law; and the law, therefore, must leave the right of administration to the religious denomination itself subject to such restrictions and regulations as it might choose to impose. A law which takes away the right of administration from the hands of a religious denomination altogether and vests it in any other authority would amount to a violation of the right guaranteed under clause (d) of article 26.
(చట్టప్రకారం తన ఆస్తులను అజమాయిషీ (administer) చేసుకోవడం ప్రతి మత శాఖకూ, దాని ప్రతినిధులకూ 26(డి) రాజ్యాంగ అధికరణం కింద ప్రాథమిక హక్కు. కాబట్టి అజమాయిషీ హక్కును సంబంధిత మతశాఖకే చట్టం వదిలిపెట్టాలి. అందుకుగాను విధించబడే పరిమితులకు, రెగ్యులేషన్లకు లోబడి ఆ అజమాయిషీ జరగాలి. పరిపాలన హక్కును మతశాఖ చేతుల నుంచి మొత్తంగా లాగివేసి వేరొక అధారిటీకి అప్పగిస్తే అది 26(డి) అధికరణం కింద గ్యారంటీ అయిన హక్కును భంగపరచడమే అవుతుంది.)

సుప్రీంకోర్టు ప్రకటించిన ఈ ధర్మ నిర్ణయంలో సందిగ్ధత గాని, అస్పష్టత గాని ఉన్నాయా?

26వ అధికరణంలో దేవాలయాలు, మఠాలు, ఇతర సంస్థలు అంటూ విడివిడిగా పేర్కొనలేదు. అన్నీ ఆయా మతశాఖలు (డినామినేషన్లు) నిర్వహించే సంస్థల కిందికే వస్తాయి. వాటికి సంబంధించిన ఆస్తుల అజమాయిషీ, పరిపాలన వగైరాలన్నీ ఆయా మతశాఖల హక్కుగానే రాజ్యాంగం ప్రకటించింది. ప్రభుత్వం కావాలనుకుంటే బయటి నుంచి శాసనపరంగా రెగ్యులేట్‌ చేయవచ్చే తప్ప లోపలికి చొరబడి మత సంస్థపై నేరుగా పెత్తనం చలాయించేందుకు వీలేలేదు.

ఈ మాటను రతీలాల్‌ పానాచంద్‌ గాంధికి బొంబాయి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1954లోనే ఇలా నొక్కి చెప్పింది.

It should be remembered that under article 26(d), it is the religious denomination itself which has been given the right to administer its property in accordance with any law which the state may validly impose. A law which takes away the right of administration altogether from the religious denomination itself and vests it in any other or secular authority; would amount to violation of the right which is guaranteed by article 26(d).
[1954 AIR 388]
26(డి) అధికరణం కింద ప్రభుత్వ శాసనాలకు లోబడి తన ఆస్తులను పాలించుకునే హక్కు సంబంధిత మత శాఖకే ఇవ్వబడిందని గుర్తుంచుకోవాలి. పరిపాలన హక్కును మతశాఖ నుంచి మొత్తంగా లాగివేసి, వేరేదైనా సెక్యులర్‌ అథారిటీకి ఏ శాసనమైనా అప్పగిస్తే అది 26(డి) అధికరణం ఇచ్చిన హక్కును అతిక్రమించటమే అవుతుంది.

తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన (Pannalal Bansilal Pitti Vs. State of Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు 1996 జనవరిలో చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని కూడా ఇదే సందర్భాన చిత్తగించండి :

The right to establish a religious and charitable institution is a part of religious belief or faith and... the right to administer and maintain such institution can not altogether be taken away and vested in... the officers of a secular Government.
[1996 AIR 1023]
(మత, ధార్మిక సంస్థను నెలకొల్పే హక్కు మత విశ్వాసంలో భాగం.. అలాంటి సంస్థను నడిపే హక్కును మొత్తంగా లాగేసి సెక్యులర్‌ ప్రభుత్వ అధికారులకు అప్పగించడం కుదరదు.)

మరి ఇప్పుడు స్మార్త, వైష్ణవ, మాధ్వ, వీరశైవ తదితర మతశాఖల హక్కులను లాగేసుకొని వాటికి చెందిన దేవాలయాలను నడుపుతున్నది సెక్యులర్‌ ప్రభువులే కదా? రాజ్యాంగరీత్యా అది అక్రమమే కదా?!

Thursday 16 August 2018

గవర్నమెంటే బందిపోటు

పెక్యులరిజం- 9
ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...........

ప్రభుత్వాలు ఉన్నది బందిపోట్లను అణచడానికి.

కాని మన దేశంలో ప్రభుత్వాలే బందిపోట్లు!

ఒక గుళ్లో దోపిడీ జరిగితే పోలీసులు కేసు పెడతారు. దొంగలను పట్టుకుంటారు. కోర్టులు వారిని శిక్షిస్తాయి.

అన్ని గుళ్లనూ గవర్నమెంటే తెగబడి నిలువుదోపిడీ చేస్తూంటే ఏ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాలి? ఆ దొంగలను ఎవరు పట్టుకోవాలి? ఏ కోర్టులు వారిని శిక్షించగలవు?

మామూలు దొంగలు ఎవరూ లేని సమయం చూసి సాధారణంగా రాత్రివేళ కన్నం వేస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. గవర్నమెంటు గజ దొంగలు పట్టపగలే అందరి కళ్లముందే పబ్లిగ్గా దేవుళ్ల సొమ్మును, ఆస్తులను దోచుకుంటారు.

గుడి దోపిడి ఒక ఊరు, ఒకరోజు, ఒకచోటు అని లేకుండా అన్ని ఊళ్లలో, అన్ని రోజులూ, అన్ని గుళ్లలో నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ఇంత భారీ చోరీని ఎక్కడా తేడా రాకుండా క్రమపద్ధతి ప్రకారం నిరంతరం నిర్వహించడానికి గవర్నమెంటు ఏకంగా ఒక డిపార్టుమెంటునే పెట్టింది.

దాని పేరు ఎండోమెంట్సు డిపార్టుమెంటు. మనలాంటి పామరులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది సర్కారీ గజదొంగల ముఠా!

గుడిదోపిడి చట్టబద్ధంగా, కోర్టులు కూడా అడ్డం రాలేనట్టు పకడ్బందీగా జరిగేట్టు చూడటానికి ఒక గట్టి చట్టం ఉంది. దాని పేరు హిందూ దేవదాయ, ధర్మదాయ చట్టం. దేవాలయాల, ధార్మిక సంస్థల ఆదాయాన్ని అడ్డంగా గుంజేస్తారు కాబట్టి జనం దానిని దేవాదాయ, ధర్మాదాయ చట్టం అని దీర్ఘాలు పెట్టి పిలుస్తారు.

దేవాలయాలు, ధార్మిక సంస్థలు ముస్లిం, క్రిస్టియన్‌ వగైరా మతాల్లోనూ ఉన్నాయి కదా? మరి చట్టం పేరులో 'హిందూ' అని ఉన్నదేమిటి? మనది సెక్యులర్‌ దేశం కదా? విషయం తెలియని వాళ్లకు ఈ అనుమానం రావచ్చు.

మీ ఇంటికి దొంగలొస్తే మీరు ఊరుకోరు. ఇంటిని దోచుకుంటామంటే ఎవరూ ఊరుకోరు. ఇంటివాళ్లు ఎలర్టుగా ఉంటే దొంగలు ఆ ఇంటి జోలికి వెళ్లరు. ఇళ్లలాగే గుళ్లు కూడా! చర్చిల జోలికి వెళితే క్రిస్టియన్లు చుక్కలు చూపిస్తారు. మసీదుల మీద పడితే మహమ్మదీయులు బొక్కలు విరగగొడతారు. కాబట్టి గవర్నమెంట్లు సహజంగానే వాటి తెరువు పోయేందుకు సాహసించవు.

అదే - హిందూ దేవాలయాల జోలికి వెళితే హిందువులు ఏమీ అనరు. ఎదురు తిరగరు. వారు గొప్ప వేదాంతులు. వాటమైన కర్మ సన్యాసులు. అన్నీ దేవుడే చూసుకుంటాడనీ, ఎవరి పాపాన వారే పోతారనీ, తాము కట్టుకున్న గుళ్లలో తాము పూజించే దేవుళ్ల పట్ల తమకు బాధ్యత ఎంతమాత్రమూ లేదనీ సగటు హిందువు నమ్మిక. ఈ చేతకానితనాన్ని, పలాయన మనస్తత్వాన్ని, బాధ్యతారాహిత్యాన్ని హిందువులు మంచితనం, హుందాతనం, పరిణత దృక్పథం అని భ్రమపడుతుంటారు. కాబట్టి హిందువులంటే గవర్నమెంట్లకు అలుసు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు ప్రభుత్వ దృష్టిలో వంటింటి కుందేళ్లు.

ప్రభుత్వపరంగా హిందూ దేవాలయాల దోపిడిని మొదలు పెట్టింది ఇంగ్లిషువాళ్లు. తిరుమల లాంటి పెద్ద గుళ్ల సంపద ఏ మేరకు ఎలా కాజెయ్యగలమా అని ఈస్టిండియా కంపెనీ దొరలే పథకాలు వేశారు. హైందవ ఆలయాలపై ప్రభుత్వ కంట్రోలును చట్టబద్ధం చేస్తూ బ్రిటిషు హయాంలో 1925లోనే 'మద్రాస్‌ హిందూ రిలిజియస్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌' వచ్చింది.

దేశాన్ని దుర్మార్గంగా దోచుకున్న తెల్లవాళ్లని తన్ని గెంటేశాక, స్వతంత్ర మనబడేది తెచ్చుకున్నాక దోపిడి వ్యవస్థకు స్వస్తి పలికి మిగతాదేశం లాగే దేవాలయాలకు కూడా స్వాతంత్య్రం ఇచ్చి ఉండాల్సింది. కాని తెల్లవాళ్లు పోయి మనవాళ్లు మన నెత్తినెక్కాక మన దేవాలయాల పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడ్డట్టయింది.

వెనుక జరిగిన తప్పులకు, దుర్మార్గాలకు ఇకపై ఆస్కారం లేకుండా చేయాలంటే కొత్తగా రాసుకునే రాజ్యాంగంలో దానికి తగ్గట్టు గట్టి కట్టుదిట్టాలు చేయాలి. ప్రజాస్వామ్య శాస్త్రప్రకారం భారత రాజ్యాంగంలో - దేశంలో ప్రతిఒక్కరికీ సంపూర్ణ మత స్వాతంత్య్రం ఉంటుందని హామీ దిట్టంగానే ఇచ్చారు. ఏ మతసంస్థలను ఆయా మతస్థులు స్వేచ్ఛగా, నిరాఘాటంగా నడుపుకోవచ్చని గొప్ప వరమైతే ఇచ్చారు 26వ అధికరణంలో ఇదిగో ఇలా :

26 Freedom to manage religious affairs.
Subject to Public order, morality and health, every religious denomination or any section thereof shall have the right.
a) to establish and maintain institutions for religious and charitable purposes.
b) to manage its own affairs in matters of religion.
c) to own and acquire movable and immovable property; and
d) to administer such property in accordance with law.

(26 మత వ్యవహారాలను మేనేజ్‌ చేసుకొనే స్వేచ్ఛ.

ప్రజా భద్రత, నైతికత, ప్రజారోగ్యాలకు లోబడి -

అన్ని మతాలకు చెందిన మత శాఖలకు లేక వాటిలోని విభాగాలకు -

అ) మత, ధార్మిక ఆశయాల కొరకు సంస్థలను నెలకొల్పి , నిర్వహించుకొనడానికి -

ఆ) మత విషయాల్లో వాటి వ్యవహారాలను అవి సొంతంగా మేనేజ్‌ చేసుకొనడానికి -

ఇ) స్థిరాస్తిని, చరాస్తిని కలిగి ఉండటానికి, కొత్తవి సంపాదించడానికి -

ఉ) అట్టి ఆస్తిని చట్ట ప్రకారం అజమాయిషీ చేయటానికి హక్కు ఉండును.)

హిందూమతంలో శైవం, వైష్ణవం, వగైరా అనేక శాఖలున్నాయి. మళ్లీ వాటిలో వీరశైవం, అద్వైతం, విశిష్టాద్వైతం వంటి ఉపశాఖలు, ఒక ఉపశాఖలో వేర్వేరు విభాగాలు ఉన్నాయి. మత శాఖలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఆగమాలు వేరువేరు అయిన దేవాలయాలు, ధార్మిక సంస్థలు లెక్కలేనన్ని. ఇలాంటి అన్ని శాఖలకూ, వాటిలో అన్ని విభాగాలకూ తమతమ మత వ్యవహారాలను తామే మేనేజ్‌ చేసుకోవటానికి, దేవాలయాల వంటి మత, ధార్మిక సంస్థలను స్వతంత్రంగా నడుపుకోవటానికి, ఆస్తిపాస్తులను సొంతంగా అజమాయిషీ చేసుకోవటానికి రాజ్యాంగం ఈ అధికరణంలో సర్వహక్కులు ఇచ్చింది.

ఇంతకుమించి కోరవలసింది ఏదీలేదు. అన్ని మతాలకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ  వరం ఇతర మతాల లాగే హిందూమతానికి, దానికి సంబంధించిన ఆలయాలు, ధర్మసంస్థలు అన్నిటికీ సమానంగా వర్తించే పక్షంలో ఆక్షేపించవలసింది ఎంతమాత్రమూ లేదు.

మరి - ఎవరి మత సంస్థలను వారు, ఎవరి మత వ్యవహారాలను వారు సొంతంగా నిభాయించుకోవడానికి రాజ్యాంగం ఇంత స్పష్టంగా హక్కు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఈ హక్కును ఎలా తుంగలో తొక్కగలిగాయి? హిందూ మత కమతంలోకి గవర్నమెంటు అచ్చోసిన ఆంబోతులా చొరబడి నానా ఆగం ఎలా చేయగలిగింది? హిందూ మత సంస్థల్లో సర్కారు వేలు పెట్టటానికి ఈ అధికరణంలో వీలు ఎక్కడుంది?

మత వ్యవహారాల స్వతంత్ర అజమాయిషీకి ఉద్దేశించిన 26వ రాజ్యాంగ అధికరణంలో అలాంటి వీలు లేనిమాట నిజమే. కాని దానికి ముందు ఉన్న 25వ అధికరణం ప్రభుత్వ జోక్యానికి తలుపు కాస్త ఓరగా తీసిపెట్టింది!

ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్య విషయాలకు లోబడి - మత స్వాతంత్య్రమూ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకూ సమానంగా ఉండును - అని మాత్రం చెప్పి 25(1) అధికరణం ఊరుకోలేదు. దానికింద ఇంకో క్లాజు ఉంది. ఆ క్లాజులో రెండు సబ్‌ క్లాజులు ఉన్నాయి. అసలు చిక్కంతా మొదటి సబ్‌ క్లాజులో ఉంది.

25(2) Nothing in this article shall affect the operation of any existing law or prevent the state from making any law.
a) regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice;
b) Providing for social welfare and reform... ... ... ...

25 (2) ఈ అధికరణంలో పేర్కొన్నది ఏదిన్నీ -\
ఇప్పుడున్నట్టి ఏ శాసనమైనా అమలు కాకుండా గాని,ప్రభుత్వం ఏ శాసనమైనా చేయకుండా నిరోధించడంగా గాని - ప్రభావం చూపజాలదు. ఆ శాసనాలు ఎటువంటివనగా

అ) మత ఆచరణతో సంబంధం ఉన్న ఏ ఆర్థిక, ద్రవ్యపరమైన, రాజకీయ, లేక సెక్యులర్‌ యాక్టివిటీని నియంత్రించేవి, లేక పరిమితం చేసేవి.
ఆ) సాంఘిక సంక్షేమం, సంస్కరణలకు ప్రోదిచేసేవి...

ఈ రాజ్యాంగ నిర్దేశాన్ని దానివరకు చూస్తే సమంజసంగానే కనిపిస్తుంది.

అందరు వ్యక్తులకు మత స్వాతంత్య్రం, మతాన్ని ఆచరించే, ప్రకటించే, ప్రచారం చేసే స్వేచ్ఛ సమానంగా ఉండును - అని 25వ అధికరణంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది దేశంలోని అన్ని మతాలకు చెందిన వారికి సమానంగా వర్తిస్తుందన్నది నిస్సందేహం.

మతానికి సంబంధించి అనేక వ్యవహారాలు ఉంటాయి. రకరకాల కార్యకలాపాలు ఉంటాయి. అవి రకరకాల వ్యక్తుల చేతుల మీదుగా నడుస్తుంటాయి. వారిలో మంచివాళ్లు ఉంటారు. చెడ్డవాళ్లు ఉంటారు. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, నిర్ణయాలు వాళ్లు ఎన్నో చేస్తుంటారు. ఒక్కోసారి ఆయా మత సంస్థలు, ధర్మ నిధులు ఏ ఉద్దేశాలతో, ఏ ఆశయాల కోసం నెలకొల్పబడ్డాయో వాటికి పూర్తి విరుద్ధంగా నిధులను ఖర్చు పెట్టటం జరగవొచ్చు. ఆస్తులు దుర్వినియోగం కావచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోబడనూవచ్చు. అటువంటి తప్పిదాలు, లోటుపాట్లు ఏ మతానికి సంబంధించి ఏ సంస్థలో జరిగినా వాటిని అరికట్టి, యాజమాన్య నిర్వహణ సవ్యంగా జరిగేట్టు చూసేందుకు ప్రభుత్వం చేతిలో అధికారం ఉండటం తప్పుకాదు. అవకతవకలు జరిగిన సందర్భాల్లో అన్ని మతాల వలెనే హిందూ మతానికి చెందిన మత సంస్థల మీద, ధర్మ సంస్థల మీద ప్రభుత్వం చట్ట ప్రకారం చర్య తీసుకున్నా, దానికోసం ప్రత్యేకంగా శాసనాలను చేసినా ఎవరూ దానిని ప్రశ్నించజాలరు.


 రాజ్యాంగం 25(2)(a) అధికరణం మత స్వాతంత్య్ర దుర్వినియోగాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వానికి ఇచ్చిన ఈ వెసులుబాటును మన సెక్యులర్‌ (అనగా హిందూ వ్యతిరేక) ప్రభుత్వాలు కేవలం హిందూ మతం మీదే విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాయి. హిందూ దేవాలయాలను, ధర్మ సంస్థలను పూర్తిగా తమ కబ్జాలోకి తెచ్చుకొని, నిరంకుశంగా పెత్తనం చేయసాగాయి. దేవుళ్లకు భక్తులు సమర్పించే కానుకలను, దేవాలయాలకు పూర్వం దాతలు ఇచ్చిన ఆస్తులను, సొంత అవసరాలకు, రాజకీయ స్వార్థాలకు అడ్డగోలుగా వాడేసుకోసాగాయి.

అవిభక్త మద్రాసు ప్రభుత్వం 1951లో తెచ్చిన దుర్మార్గపు చట్టం నమూనాగా దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ రిలిజియస్ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ చట్టాలను తెచ్చి హిందూ దేవాలయాలలో, ధర్మ సంస్థలలో మేరలేని అవినీతికి, అక్రమాలకు, అధికార దుర్వినియోగాలకు, పగటి దోపిడీలకు పట్టపగ్గాలు లేకుండా బరితెగించాయి.

ఆ విధంగా పవిత్ర దేవాలయ వ్యవస్థకు దుష్ట రాజకీయ గ్రహణం పట్టింది. అరవై ఏళ్ల తర్వాత కూడా విడవకుండా అది హిందూ మతాన్ని పీడిస్తూనే ఉంది.

Friday 10 August 2018

రాజ్యాంగ రక్షణ హిందువులకెందుకు?

పెక్యులరిజం - 8
 ఎం.వి.ఆర్‌. శాస్త్రి

..........


నిజం చూడకు.

నీ యధార్థ స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చెయ్యకు.

బుర్రకు పని పెట్టకు.

హాయిగా భ్రమల్లో బతికెయ్‌.

ఇదీ ఈ కాలంలో సగటు హిందువు మనఃస్థితి.

రాజ్య వ్యవహారాలూ, రాజ్యాంగ విషయాలూ మామూలు జనాలకు ఎలాగూ బుర్రకెక్కవు. మేధావులమని, తమకు తెలియంది లేదని అనుకునే వింత శాల్తీలకైనా తాము ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నారో అర్థమైందా?

మాట వరసకు మత స్వాతంత్య్రం సంగతే తీసుకోండి.

హిందూ సమాజంలో ప్రతి అమాంబాపతు మేధావీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలికే చిలక పలుకులేమిటి?

పరమ పవిత్ర భారత రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రసాదించింది. 25 నుంచి 30 నెంబరు వరకూ ఏకంగా ఆరు అధికరణాలను మత స్వాతంత్య్రాన్ని గట్టి చేస్తూ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల పరిచ్చేదంలో చేర్చారు. అవి భారత పౌరులందరితో సమానంగా హిందువులకూ వర్తిస్తాయి. కాకపోతే రాజ్యాంగం దేవుడు వరమిచ్చినా గవర్నమెంట్లు అనబడే పూజారులు వరమివ్వకుండా హిందువులమీద తగని వివక్ష చూపిస్తున్నాయి. లోపం రాజ్యాంగానిది కాదు. ప్రభుత్వాలు నడిపే రాజకీయ నాయకులది. రాజ్యాంగం ఇచ్చిన మతహక్కులను నిలబెట్టుకునేందుకు హిందువులు ఏకం కావాలి.

ఇదే కదా? మన పెద్ద తలకాయలు మనకు విసుగులేకుండా చెప్పేది? ఇది కరక్టేనా?

రాజ్యాంగంలో పొందుపరచిన మత స్వాతంత్య్రం ప్రధానంగా ఎవరిని ఉద్దేశించినట్టిది? 25 నుంచి 30 దాకా ఆరు అధికరణాలను రాజ్యాంగంలోకి ఎక్కించింది ముఖ్యంగా ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి? ఎవరి మత క్షేమం కాంక్షించి? అసలు మత స్వాతంత్య్రం విషయంలో రాజ్యాంగం రాసినవారి ఆలోచన ఏమిటి?

ఈ ప్రశ్నలకు తిరుగులేని సమాధానం చెప్పగలిగిందెవరు? రాజ్యాంగానికి సంబంధించినంతవరకు సాధికారికంగా వివరించగలిగింది ఉన్నత న్యాయ వ్యవస్థే కదా? అందులోనూ రాజ్యాంగ ధర్మ సూక్ష్మాలపై పరమ ప్రామాణికం సుప్రీంకోర్టు అభిప్రాయమే కదా? దేశంలో ఎంతటివారైనా దాన్ని శిరసావహించవలసిందే కదా?

మరి - అంతటి సర్వోన్నత న్యాయపీఠం రాజ్యాంగంలో మత స్వాతంత్య్రానికి సంబంధించిన అధికరణాల వెనుక ఉద్దేశం, వాటి పరమార్థం గురించి ఏమి చెప్పింది?

The object of articles 25 to 30 was to preserve the rights of religious and linguistic minorities, to place them on a secure pedestal... These provisions enshrined a befitting pledge to the minorities in the Constitution of the country... It is only  the minorities who need protection.

(25 నుంచి 30 వరకు గల రాజ్యాంగం అధికరణాల ఉద్దేశం మతపరమైన, భాషా పరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించి, వారిని పదిలమైన పీఠం మీద ఉంచడమే... దేశ రాజ్యాంగం మైనారిటీలకు చేసిన సముచితమైన బాసను ఈ అధికరణాలు తాపడం చేశాయి... రక్షణ అవసరమైంది మైనారిటీలకు మాత్రమే.)

ఇవి నేటికి 44 ఏళ్లకింద గుజరాత్‌ ప్రభుత్వానికీ, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజికి నడుమ వ్యాజ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎన్‌.రే నేతృత్వంలో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని కొన్ని వాక్యాలు. (1974 AIR 1389)

సుప్రీంకోర్టు చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో ఇంకా సందేహం ఉంటే పైన పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ కేరళ హైకోర్టు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఇచ్చిన ఈ కింది వివరణను చిత్తగించండి.

In this context it is relevant to bear in mind the historical background which led to the inclusion of Articles 25 to 30 in the chapter on fundamental rights in the Constitution... The real purpose and intendment of Articles 25 and 26 is to guarantee especially to the religious minorities in this country the freedom to profess, practise and propagate their religion, to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion.

No doubt, the freedom guaranteed by these two articles applies not merely to religious minorities but to all persons (Articles 25) and all religious denominations or sections thereof (Article 26). But in interpreting the scope and content of the guarantee contained in the two Articles, the court will always have to keep in mind the real purpose underlying the incorporation of these provisions in the fundamental rights chapter.

(రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 25 నుంచి 30 అధికరణాలను చేర్చడానికి దారితీసిన చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. 25, 26 అధికరణాల వెనక అసలు ఉద్దేశం, ఆంతర్యం ముఖ్యంగా దేశంలోని మతపరమైన మైనారిటీలకు కొన్ని గ్యారంటీలు ఇవ్వటమే. వారి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించటానికి, వ్యాప్తి చేయటానికి మతపరమైన, ధార్మికమైన సంస్థలను స్థాపించి, నడుపుకునేందుకు... మతపరంగా వారి వ్యవహారాలను వారే నిర్వహించుకోవటానికి స్వేచ్ఛనిచ్చే గ్యారంటీలవి.

ఈ రెండు అధికరణాలలో గ్యారంటీ ఇవ్వబడిన స్వాతంత్య్రం మతమైనారిటీలకే గాక అందరు వ్యక్తులకు (25వ అధికరణం), అన్ని మత శాఖలకు లేక వాటియొక్క విభాగాలకు (26వ అధికరణం) కూడా వర్తిస్తాయనడంలో సందేహం లేదు. కాని ఈ రెండు అధికరణాలలో పొందుపరిచిన గ్యారంటీల పరిధిని, విషయాన్ని వ్యాఖ్యానించేటప్పుడు  ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో ఈ అధికరణాలను చేర్చడంలోని అసలు ఉద్దేశాన్ని న్యాయస్థానం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.)

గురువాయూర్‌ దేవస్థానం మేనేజిమెంటుకూ టి.కృష్ణన్‌కూ నడుమ దావాలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కేరళ హైకోర్టు ధర్మాసనం 1978లో ఇచ్చిన తీర్పు (AIR 1978 Ker 68) లో చెప్పిందిది.

రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు రాజ్యాంగం నుంచే సర్వాధికారం పొందిన ఉన్నత న్యాయవ్యవస్థ రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వాతంత్య్రం ప్రధానంగా ఎవరి రక్షణ కోసం? ఎవరి ప్రయోజనాలను ఉద్దేశించి? అన్న విషయాన్ని ఇదిగో ఇంత వివరంగా చెప్పింది. అయినా రాజ్యాంగం తమకేవో గొప్ప వరాలు ఇచ్చిందన్న భ్రమలను హిందూ సమాజం వదలకపోతే దానిని బ్రహ్మదేవుడు కూడా బాగుచేయలేడు.

ఇక్కడ ఓ సందేహం రావచ్చు. దేశ జనాభాలో నూటికి 80 శాతం ఉన్న హిందువులను వదిలేసి 20 శాతం ఉన్న మైనారిటీలకు మాత్రమే రాజ్యాంగం అన్ని రక్షణలు ఎందుకు కల్పించింది? హిందువులకు మత స్వాతంత్య్రం అక్కర్లేదా? రాజ్యాంగ కర్తల దృష్టిలో మైనారిటీలవి మాత్రమే మతాలా? రాజ్యాంగం రాసినవాళ్లకు దేశంలోని అతిప్రధాన మతం మీద కక్ష ఏమైనా ఉందా? వారి దృష్టిలో హిందువులు ఏ రక్షణకూ యోగ్యత లేని రెండో తరగతి పౌరులా?

కాదు. తొందరపడి అలా నిందించటం తప్పు. రాజ్యాంగం రాసిన, ఆమోదించిన అంబేద్కర్ వంటి పెద్దలకు అలాంటి దురుద్దేశం లేదు. హిందువుల మీద, వారి మతం మీద రాజ్యాంగ కర్తలకు ప్రత్యేక ద్వేషం ఏమీ లేదు. అసలు విషయం వడ్లగింజలో బియ్యపు గింజ.

జనాభాలో కేవలం 20 శాతంలోపు ఉన్న మైనారిటీల మత స్వేచ్ఛకు మాత్రమే రాజ్యాంగంలో రక్షణ ఎందుకు కల్పించారంటే - వారు 20 శాతం కంటే తక్కువ ఉన్నారు కాబట్టి. 80 శాతం పైగా ఉన్న హిందువుల మత స్వేచ్ఛకు అలాంటి రక్షణ ఎందుకు ఇవ్వలేదంటే - వారు 80 శాతం పైగా ఉన్నారు కనుక! వారికి ప్రత్యేక రక్షణలేవీ అవసరం లేదు కనుక!

అది న్యాయమే కదా? దేశంలో ఉన్నదంతా హిందూ మతమే. దేశం నిండా ఉన్నది హిందువులే అయినప్పుడు వారి మతానికి వేరొకరి అనుమతి కావాలా? రాజ్యాంగంలో ప్రత్యేకంగా వరం ఇస్తేగానీ వారి మతాన్ని వారు ఆచరించుకోలేరా? వేల ఏళ్లుగా హిందూ ధర్మంలో ఉండి, హిందూ మతంలో పుట్టి, హిందూ మతంలో బతికి, హిందూ మతంలో చస్తున్న హిందువులకున్న మత హక్కులకు ఏ శక్తి అడ్డం రాగలదు? ఒకవేళ సమస్య ఏదైనా వస్తే వారు కాస్త చికాకు చూపిస్తే చాలు పరిపాలకులు పరిగెత్తుకొచ్చి ఆ సమస్యను తేల్చరా? మనం ఎంచుకున్నది ప్రజాస్వామ్యం. అందులో ఎవరు తమను పాలించదగ్గ వారో నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజల్లో 80 శాతం మందికి పైగా హిందూ మతస్థులు. అలాంటప్పుడు హిందూ మతం పట్ల భయభక్తులతో మెలిగి ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే మళ్లీ ఎన్నికల్లో ప్రజలు తమని తన్ని తగలేస్తారన్న భయం ప్రభుత్వాలు నడిపేవారికి ఉంటుంది. ఏదైనా కావలసివస్తే ప్రభుత్వాల గొంతు మీద కూచుని హిందువులు చేయించుకోగలరు. కాబట్టి మళ్లీ వారికి ప్రత్యేకంగా రాజ్యాంగ రక్షణల రక్షరేకు అక్కర్లేదు. వారి వలె ప్రభుత్వాలను ఒత్తిడి చేసి కార్యం సాధించగలిగిన ఓట్ల సంఖ్యాబలం అల్పసంఖ్యాకులైన మైనారిటీ మతాలకు ఉండదు. అవికూడా బతకాలి కదా? కాబట్టి వాటికి ఊతంగా చట్టరక్షణ అవసరం.

ఇదీ రాజ్యాంగ కర్తల ఆలోచనా ధోరణి. ఇది కేవలం మన ఊహ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే ధ్రువీకరించిన యదార్థం. పైన ఉటంకించిన 1974 AIR 1389 తీర్పులో సుప్రీంకోర్టు ఇంకా ఏమందో చూడండి.

The majority in a system of adult franchise hardly needs any protection. It can look after itself and protect its interests. Any measure wanted by the majority can without much difficulty be brought on the statute book because the majority can get that done by giving such a mandate to the elected representatives. It is only  the minorities who need protection.

(వయోజనులందరూ కలిసి చట్ట సభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో మెజారిటీ వర్గానికి వేరే రక్షణ అవసరమే ఉండదు. అది తన సంగతి తాను చూసుకోగలదు. తన ప్రయోజనాలను తాను కాపాడుకొనగలదు. మాకు ఇది కావాలి, మీరు ఇది చేయండి అని తాము ఎన్నుకొనే ప్రతినిధులకు చెప్పి, అలా చేయడానికి వారికి తమ తరఫున అధికారం ఇవ్వగలరు. మెజారిటీ ఏ విధానాన్ని కోరుకుంటే అది పెద్ద కష్టం లేకుండా చట్ట ప్రతిపత్తిని పొందగలదు. రక్షణ కావలసింది మైనారిటీలకి మాత్రమే.)

ప్రభుత్వాన్ని మెడలు వంచి తమకు కావలసిన చట్టాన్ని చేయించుకోగలిగిన ఓట్ల మహాబలం ఉన్నప్పుడు మళ్లీ హిందువులకు చట్టపరంగా ముందస్తు రక్షణ ఎందుకు? ఆ బలం లేనివారికి కదా అలాంటి రక్షణ ఊతం కావలసింది?

కరెక్ట్‌. అలాంటి మహాబలం తమ చేతిలో ఉన్నదన్న స్పృహ హిందువులకు ఉంటే ఏ సమస్యా లేదు. రాదు. కాని విచిత్ర విషాదం ఏమిటంటే - తమ ఉనికి చేతనే రాజ్యమేలే వారికి వినమ్రత కలిగించి, తమ కనుసైగతోనే పాలకులను శాసించి, రాజాధిరాజుల్లా బతకవలసిన హిందువులకు అనేక రకాల సంకర సెక్యులర్‌ వైరస్‌లు పట్టి మెదడు మొద్దుబారింది. తమ పెద్దలు, గురువులు, మేధావులు అని హిందువులు భావించేవారే గందరగోళంలో పడి తమ అయోమయాన్ని హిందూ సమాజానికి ప్రసాదంలా పంచిపెడుతున్నారు.

దాంతో - హిందువులు వారి దేశంలోనే వారు దిక్కులేనివాళ్లమని ఫీలైపోతున్నారు. ఏదో రాజ్యాంగం అండ ఉన్నది కాబట్టే ఈమాత్రం బతక గలుతున్నామని వారు తృప్తి పడుతున్నారు. మిగతా మతాలతో బాటు, వాటితో సమానంగా తమకూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా సరిగా అనుభవించలేని ఖర్మ పట్టిందని చాలా ఇదైపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా తమకు దక్కనీయకుండా ప్రభుత్వాలు దుర్మార్గాలకు దిగాయని నిస్సహాయంగా నెత్తి బాదుకుంటున్నారు. తమ నౌకర్లయిన పాలకులు తమకు చేస్తున్న అన్యాయాలను సరిదిద్ది, తమను ఆదుకోమంటూ పిటీషన్లు పట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

రాజకీయ నక్కలకూ, గద్దెలెక్కిన తోడేళ్లకూ అంతకంటే చాన్సు ఏమి కావాలి?


Friday 3 August 2018

మనుధర్మం

" మనుధర్మం " పుస్తకానికి మనవాళ్ళ స్పందన బాగా ఉంది. మొదట వేసిన వెయ్యి పుస్తకాలు. మూడు వారాల్లో అయిపోయాయి. అక్షరదోషాలను సవరించి రెండో ముద్రణ అచ్చవుతున్నది.
అమెజాన్ లో బట్వాడా చార్జీలు ఎక్కువగా ఉన్నాయని కొందరు మిత్రులు అన్నారు. అవి తగ్గాలంటే దుర్గా పబ్లికేషన్స్ నుంచి నేరుగా ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేసే కాపీలను బట్టి డిస్కౌంట్ వస్తుంది.
వివరాలకు 9441257961 , 62 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా durgapublicatiions@gmail.com కు మెయిల్ చేయవచ్చు.

మతమార్పిళ్లకు లైసెన్సు

పెక్యులరిజం - 7 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

..................

The Indian Church has reason to be glad that the Constitution of the country guarantees her an atmosphere of freedom and equality with other much stronger religious communities. Under this protection of this guarantee she is able, ever since independence, not only to carry on but to increase and develop her activity as never before without serious hindrance or anxiety.

[The Catholic church in India; Yesterday and Today, Felix Alfred Plattner, P.6 ] "ఇండియాలో చర్చ్‌ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే దానికంటే ఎంతో బలమైన మత సముదాయాలతో సమానతనూ, స్వేచ్ఛాయుత వాతావరణాన్నీ భారత రాజ్యాంగం దానికి గ్యారంటీ చేసింది. ఈ రాజ్యాంగ రక్షణ మూలంగా.. స్వాతంత్య్రం తరువాత తన కార్యకలాపాలను పెంచుకుంటూ.. గట్టి ఆటంకం గానీ, ఆందోళన గానీ లేకుండా.. గతంలో ఎన్నడూ లేనంత చక్కగా.. చర్చ్‌ అభివృద్ధి చెందగలుగుతున్నది". 'ఇండియాలో కాథలిక్‌ చర్చ్‌ : నిన్న, నేడు' అనే గ్రంథం 6వ పేజీలో స్వయానా క్రైస్తవ మిషనరీ అయిన ఫెలిక్స్‌ ఆల్‌ఫ్రెడ్‌ ప్లాట్‌నర్‌ 1964లో వెలిబుచ్చిన పరమానందమిది! ఇది వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 1947లో స్వాతంత్య్రం అనబడేది వచ్చేంతవరకూ దేశాన్ని ఏలింది తెల్లవాళ్లు. వారు స్వతహాగా క్రైస్తవులు. క్రైస్తవ మత ప్రచారానికి వీలైన మేరకు తోడ్పడ్డ క్రైస్తవ పక్షపాతులు. ఇండియాలో చర్చ్‌కి స్వర్ణయుగం అనేది ఏదైనా ఉంటే అది బ్రిటిష్‌ పరిపాలన నిరాఘాటంగా సాగిన సుమారు రెండు శతాబ్దాల కాలమే అని సాధారణంగా మనం అనుకుంటాం కదా? మరి ఈ జెస్యూట్‌ మిషనరీ ఇలా అంటున్నాడేమిటి? వెనకటికంటే - అనగా తెల్లవాళ్లు ఏలిన సుదీర్ఘకాలంలో కంటే - స్వాతంత్య్రం వచ్చిన తరవాతే అడ్డూ, బెంగా లేకుండా చర్చ్‌ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని తెగ సంతోషపడుతున్నాడేమిటి? మునుపెన్నడూ లేనంతటి వల్లమాలిన స్వేచ్ఛకు భారత రాజ్యాంగం తమకు గ్యారంటీ ఇచ్చిందన్న అమందానందం అతడికి కలగజేసిన రాజ్యాంగ రక్షణ ఇంతకూ ఏమిటి? విదేశీ మతాలకు అపరిమిత స్వేచ్ఛను, అపూర్వ అవకాశాలను భారత రాజ్యాంగంలో ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరు అధికరణాలు ప్రసాదించాయి. రాజ్యాంగం 3వ విభాగంలో ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 25వ అధికరణం నుంచి 30వ అధికరణం వరకూ మత స్వాతంత్య్రానికీ, మైనారిటీల హక్కులకూ సంబంధించినవి. రాజ్యం దృష్టిలో పౌరులందరూ సమానమని, చట్టాల రక్షణ అందరికీ సమానంగా వర్తిస్తుందనీ 14వ రాజ్యాంగ అధికరణం ఇచ్చిన వరం మతాల విషయంలో మసకబారింది. మనలను ఏలేవారి దృష్టిలో మతాలన్నీ సమానమే కాని విదేశీయ మైనారిటీ మతాలు ఎక్కువ సమానులు! అది కేవలం వారి దృష్టి దోషమే కాదు. మెజారిటీ (హిందూ) మతస్థులను రెండో తరగతి వారిలా, మైనారిటీలనేమో ప్రత్యేక హక్కులు గల ప్రత్యేక తరగతి వారిలా తగని వివక్ష చూపేందుకు భారత రాజ్యాంగమే కావలసినంత వెసులుబాటు కల్పించింది. ఈ సంగతి తేటపడాలంటే మతస్వేచ్ఛ గురించిన రాజ్యాంగ అధికరణాలను ఒకటి తరువాత ఒకటి కాస్త నిశితంగా చూడాలి. మొట్టమొదటిది 25వ అధికరణం.

"Subject to public order, morality and health and to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practise and propagate religion".

(ప్రజా భద్రత, నైతికత ఆరోగ్య విషయాలకు లోబడి - మత స్వాతంత్య్రమూ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకూ సమానంగా ఉండును) అని 25వ అధికరణంలో మొదటి క్లాజు పేర్కొంటుంది. ఈ సందర్భంలో ఒక చారిత్రక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగాన్ని తమ కోసం రాసుకుంటున్నది భారత ప్రజలు. వారిలో నూటికి 80 మందికి పైగా హిందువులు. వారు మతాన్ని ఆచరిస్తారు. ప్రకటిస్తారు. కాని ప్రచారం చేయరు. గట్టిగా మత ప్రచారం చేయాలన్న ధ్యాసగాని, ఇతరులను తమ మతంలోకి చేర్పించాలన్న ఆలోచన గాని హిందూ సమాజానికి ఎన్నడూ లేదు. విదేశీ పీడపోయి, స్వాతంత్య్రం వచ్చాక, కొత్తగా రాసుకుంటున్న రాజ్యాంగంలో మత ప్రచార హక్కును పొందుపరచాలన్న ఊహే ఏ హిందువుకూ - అంటే జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలకు లేదు. ఆ కోరికైతే లేదు గాని అన్యమత ప్రచారాల భయం మాత్రం వారికి జాస్తి. ఎందుకంటే ఐదు శతాబ్దాలకు పైగా సాగిన ముస్లిం పాలనలో ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిళ్ల బెడద వల్ల.. దాదాపు రెండు శతాబ్దాలుగా బ్రిటిష్‌ హయాంలో క్రైస్తవ మిషనరీల ముమ్మర మతాంతరీకరణల వల్ల వారు నానా అగచాట్లు పడ్టారు. భయానక చిత్తక్షోభను అనుభవించారు. కనీసం స్వరాజ్యం వచ్చాకైనా విచ్చలవిడి మతాంతరీకరణల పీడ లేకుండా, తమ మానాన తాము నిశ్చింతగా బతికి, తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే సావకాశం ఉంటే చాలు, అదే పదివేలు అన్న భావనతో 80 శాతానికి పైగా ప్రజలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టమే శిరోధార్యం. నూటికి 80 శాతంకి పైగా ప్రజలు మత ప్రచారం హక్కును కోరనప్పుడు ప్రత్యేకంగా ఏరికోరి దాన్ని దేశ రాజ్యాంగంలో పొందుపరచవలసిన అవసరం లేదు. అన్ని మతాలనూ ఆదరిస్తూ, ఎవరు ఏ మతాన్ని వ్యాప్తిచేసినా, ఎవరు ఏ మతంలోకి ఇష్టపడి చేరినా ఏనాడూ అభ్యంతరం తెలపని హిందూదేశంలో తమ మతం మనుగడ గురించి ఏ మతానికి చెందిన వారికీ అనుమానం గాని, భయం గాని ఉండటానికి ఆస్కారమే లేదు. మైనారిటీ మతాల వారికి పనిగట్టుకుని హామీలు, గ్యారంటీలు రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. అందుకే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన డ్రాఫ్టింగ్‌ కమిటీ రూపొందించిన రాజ్యాంగం తొలి ముసాయిదాలో మత ప్రచారం హక్కు ఊసే లేదు. "All citizens are equally entitled to freedom of conscience and to the right freely to profess and practise religion.." (మత స్వాతంత్రానికీ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి, ఆచరించడానికీ పౌరులందరికీ సమాన హక్కు ఉండును...) అదే తొలి ముసాయిదాలో ఉన్నది. Propagate religion (మతాన్ని వ్యాప్తి చేసుకొనే హక్కు) ఆ అధికరణంలో తరవాత వచ్చి చేరింది. All citizens (పౌరులందరికీ) అని ముసాయిదాలో ఉన్న మాట కాస్త తుది ప్రతిలో All persons (అందరు వ్యక్తులకూ) గా మారిపోయింది. దీనికి కారణమేమిటి?
భారత రాజ్యాంగంలో విస్తృత అధ్యయనం చేసిన విఖ్యాత అమెరికన్‌ మేధావి Donald E.Smith తన India as a Secular State గ్రంథంలో చెప్పిందేమిటంటే-
“The insistence from the Christian minority seemed to have largely contributed to the specific inclusion of this right. The Joint Committee of the Catholic Union of India and the All India Council of Indian Christians passed a resolution in October 1945 which (demanded) practice and propagation of religion should be guaranteed, and the change of religion should not involve civil or political disability”.
[Quoted in http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/77961/9/09_chapter%2004.pdf]
       (ఈ హక్కును ప్రత్యేకంగా చేర్చడానికి క్రిష్టియన్‌ మైనారిటీ పట్టుదల విశేష ప్రభావం చూపింది. కాథలిక్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రిస్టియన్స్‌ సంస్థల జాయింట్‌ కమిటీ 1945లో చేసిన తీర్మానం  మత ప్రచార హక్కుకు గ్యారంటీ ఉండాలని, మతమార్పిడి మూలంగా సివిల్‌ లేక రాజకీయ పరమైన అనర్హత కలగరాదని డిమాండు చేసింది.)

       మత ప్రచారాన్ని హక్కుగా ఆమోదిస్తే అది పెద్ద ఎత్తున మతమార్పిళ్లకు దారి తీయవచ్చని రాజ్యాంగ సభలో కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. మోసం చేసో, బలవంతానో, ఒత్తిడి పెట్టో ఎవరిని మతం మార్పించినా, అది చట్టరీత్యా చెల్లకూడదంటూ కె.ఎం.మున్షీ ఒక సవరణ ప్రతిపాదించారు. క్రైస్తవ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్‌ కూడా ప్రతిఘటించడంతో మున్షీ సవరణ వీగిపోయింది.

       భారతదేశం మొదటి నుంచీ బహుళత్వానికి వేదిక. ఒక మతం మాత్రమే గొప్పది; మిగిలినవన్ని చెడ్డవి అన్న సంకుచితత్వం భారతీయులకు ఏనాడూ లేదు. తమ మతంలోని మంచి అంశాలను, దాని ప్రత్యేకతలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. వాటికి ఆకర్షితులై ఎవరైనా వారి మతంలోకి ఐచ్ఛికంగా చేరితే అభ్యంతరం అక్కర్లేదు. ఇతర మతాల ప్రభావం గాని, ప్రచారం గాని ఏ మాత్రం సోకుండా హిందూ సమాజం చుట్టూ దడి కట్టాలని ఎవరూ కోరరు. అదే సమయంలో డబ్బో, మరొకటో ఎరవేసి, తగని ఒత్తిడి తెచ్చి, బలవంత పెట్టి అమాయకులను మతం మార్పించటం దుర్మార్గం. మిషనరీ స్కూళ్లు, కాలేజీలలో విద్యాబోధన నెపంతో.. మిషనరీ ఆస్పత్రులలో ఉచిత వైద్యం ఎరతో క్రైస్తవంలోకి మతమార్పిళ్లు చేయటం లాంటి ఆగడాలు ఈస్టిండియా కంపెనీ కాలం నుంచీ, అసంఖ్యాకంగా జరిగాయి. అన్నన్ని చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టే మత ప్రచారాన్ని హక్కుగా స్థిరపరిస్తే అది విశృంఖల మతాంతరీకరణలకు ఎక్కడ దారితీస్తుందోనని హిందువులు భయపడ్డారు.

       
       మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కల్పించినంత మాత్రాన విశృంఖల మతాంతరీకరణలకు లైసెన్సు ఇచ్చినట్టు కాదు. రాజ్యాంగం రాసిన వారికి, దానిని ఆమోదించిన వారికి ఆ విషయంలో స్పష్టత ఉంది. న్యాయ స్థానాలకూ స్పష్టత ఉంది.

       What article 25(1) grants is not the right to convert another person to one's own religion, but to transmit or spread one's religion by an exposition of its tenets.. What is freedom for one is freedom for the other, in equal measure, and there can be no such thing as a fundamental right to convert any person to one's own religion.
       (25 (1) అధికరణం ప్రసాదించింది తన మత సూత్రాలను వివరించి, తన మతాన్ని వ్యాప్తి చేసుకొనే హక్కును మాత్రమే. వేరొక వ్యక్తిని తన మతంలోకి మార్పించే హక్కును కాదు... ఒకరికి ఉన్న స్వేచ్ఛ వేరొకరికి కూడా సమానంగా ఉంటుంది. ఏ వ్యక్తినీ తన మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు అంటూ ఏదీ లేదు.)

-అని Rev.Stainslaus Vs. State of Madhya Pradesh కేసులో సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. చిత్రమేమిటంటే, ఈ చిన్న కామన్‌సెన్స్‌ పాయింటే 'పెక్యులరిజం' ప్రవక్త జవహర్లాల్‌ నెహ్రూగారి పెద్ద బుర్రకు ఎక్కలేదు.

        We permit, by our constitution, not only freedom of conscience but also proselytism" (కేవలం మత స్వాతంత్య్రాన్నే కాదు; మత మార్పిడిని కూడా మనం మన రాజ్యాంగం ద్వారా అనుమతిస్తాం) అని 1952 అక్టోబరు 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ రాసిన గొప్ప లేఖలో తొలి భారత ప్రధాని నెహ్రూగారు పచ్చి అబద్ధమాడారు.

       విదేశీ మిషనరీలు, స్వదేశీ మిషనరీలు యథేచ్ఛగా క్రైస్తవమతం వ్యాప్తి చేస్తూ, క్రైస్తవంలోకి మత మార్పిళ్లు చేసుకుపోవడానికి అన్ని విధాల సహకరించమంటూ అందులో ముఖ్యమంత్రులను ఆదేశించారు.

       బ్రిటిషు పరిపాలన సాగినంత కాలమూ క్రైస్తవ మత వ్యాప్తి మీద, మిషనరీల మత మార్పిడి కార్యకలాపాల మీద తగు మాత్రం ఆంక్షలు ఉండేవి. విదేశాల నుంచి మిషనరీలు వచ్చిపడి, విదేశీ నిధులు ధారాళంగా విరజిమ్మి, జనాలను టోకున క్రైస్తవంలోకి అడ్డగోలుగా మార్పించడానికి బ్రిటిష్‌ ఇండియాలో అంతగా వీలు ఉండేది కాదు. తెల్లవాళ్లు పోయి, స్వదేశీ మారాజులు వచ్చి కూచున్నాక ఆపాటి అదుపూ మృగ్యమైంది. మత స్వాతంత్య్రం ''పౌరులకు'' మాత్రమే కాక దేశంలోని 'అందరు వ్యక్తులకూ' ఉంటుందని రాజ్యాంగం 25(1) అధికరణం చేత చెప్పించడంతో దేశంలోకి వచ్చిపడ్డ విదేశీ మిషనరీలకు ఆడింది ఆట అయింది. మత మార్పిడి రాజ్యాంగ హక్కు అని ఏకంగా దేశ ప్రధానమంత్రే డబాయించి, ఫారిన్‌ మిషనరీల కొమ్ము కాయడం కంటే క్రైస్తవ పెద్దలకు జాక్‌పాట్‌ ఏమి కావాలి? రాజ్యాంగ రక్షణ పుణ్యమా అని మన పంట భలే పండింది అని మిషనరీలు మురిసిపోయారంటే ఆశ్చర్యం ఏముంది?