Wednesday 29 November 2023

గురువంటే ఇలా ఉండాలి

 ఎం.వి.ఆర్.శాస్త్రి

ముముక్షు జన మహాపీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ ముత్తీవి సీతారామ్ గురుదేవుల నిర్యాణం ధార్మికలోకానికి తీరని లోటు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం  పెదముత్తేవి లోని వారి సుప్రసిద్ధ శ్రీకృష్ణాశ్రమంలో నాలుగు రోజుల కింద ఇష్ట దైవాలకు నిత్య పూజ చేస్తూ తీవ్ర అస్వస్థతకు లోనైన గురువుగారు నిన్న ( నవంబర్28) రాత్రి 9-45 కు  శ్రీగురుపాదాలలో ఐక్యమయ్యారు. 



పరమపూజ్య శ్రీశ్రీశ్రీ సీతారామ యతీంద్రుల  ఆధ్యాత్మిక దివ్య వారసత్వం  పితృపాదులు  శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులు 1992 డిసెంబర్ లో ఐహిక  జీవనాన్ని చాలించిన తరువాత    సీతారామ్ గురుదేవులకు సంక్రమించింది.  ఆయన సంసారంలో ఉండీ సంసారం అంటని మానసిక‌ సన్యాసి . అసంఖ్యాక శిష్యుల యోగక్షేమాల కోసం‌ అహర్నిశలూ పరిశ్రమిస్తూ ప్రతి ఒక్కరికీ పరమాప్తుడిగా , కుటుంబపెద్దగా సహానుభూతి చెందుతూనే సర్వ సంగ పరిత్యాగి.  ఆధ్యాత్మికంగా ఉన్నతుడు. ఎవరి గురించీ పరుష పదం పలుకక , ఎవరి నిందనూ సహించక ,  అందరూ మహానుభావులేనని చాటిన సత్పురుషుడు. పలుకు ఎంత మృదువో ఆయనలో మండే  ధర్మాగ్రహం అంత‌ ప్రచండం. ఆయన ధర్మ‌ దీక్ష వజ్ర సదృశం. వారి ఆశ్రమం ఒక నంద గోకులం. కబేళాలకు తరలే అభాగ్య గోవులకు శ్రీకృష్ణాశ్రమమేఅదృష్టరేఖ.  గోశాలలో ఐదొందలకు పైగా గోవులున్నా పాలు, నెయ్యి మీద వ్యాపారదృష్టి వారికి ఉండదు.   

ఆధ్యాత్మికం కూడా లాభసాటి‌ వ్యాపారంగా అక్కడక్కడ రూపాంతరం చెందుతున్న ఈ రోజుల్లో సీతారామ్ గురుదేవుల వంటి భక్త శిఖామణి, ప్రేమమూర్తి, త్యాగి,విరాగి, ఆపద్బాంధవుడు, తపశ్శక్తిసంపన్నుడు కనపడటమే‌ అపురూపం. 

దైనందిన ఖర్చులకు ఎప్పుడూ తడుముకోవలసిన పరిస్థితుల్లోనే రోజూ వందల,వేలమందికి కులమతవర్గ వివక్ష లేకుండా ఆప్యాయంగా కడుపార భోజనం పెడుతూ ఆఖరు అతిథి చేయికడుక్కున్న తరువాత గానీ ఆహారం స్వికరించని నిస్వార్థ నిరతాన్నదాత సీతారామ్ గురుదేవులు. తమ‌ లక్ష్మీపతి దేవాలయంలో‌ దేవతా మూర్తుల చోరీ జరిగితే అవి తిరిగి లభించేంత వరకూ అన్నం ముట్టేందుకు ఆయన  ఇచ్చగించలేదు. 2004 లో జయేంద్ర సరస్వతి మహాస్వామిని దుర్మార్గంగా అరెస్టు చేసి‌ నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నంతకాలం ఆయన క్షేమం గురించి ఎంతో  తల్లడిల్లేవారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో  వైభవంగా జరిపించే‌ గోదా కల్యాణంలో వధువును కాపురానికి సాగనంపే ఘట్టంలో సొంత కుమార్తే  దూరంగా వెళ్లిపోతున్నట్టు భక్తి పారవశ్య భావోద్వేగంతో విలపించే పిచ్చితండ్రి సీతారామ్ గారు.‌



నా "కాశ్మీర్ కథ" పుస్తకం చదివి తెగ మెచ్ఛుకుని, నా సన్మిత్రుడు , తనకు సన్నిహితుడు అయిన సీనియర్ అడ్వొకేటు కె. వెంకట‌సుబ్బారావు గారి ద్వారా కబురుపెట్టి నన్ను‌ రెండు దశాబ్దాలకింద గురువుగారు తనదగ్గరికి పిలిపించుకున్నారు. అది మొదలు ఆయనకు మొదట నేను , తరవాత నా కుటుంబం మొత్తం అతుక్కుపోయాం. మా ముగ్గురమ్మాయిల పెళ్లిళ్ళు సహా‌ మా ఇంట్లో జరిగిన ప్రతి శుభకార్యానికీ ఆయన తప్పక వచ్చి ఆశీర్వదించేవారు. 2016లో నాకు ప్రాణాపాయం వచ్చినట్టు తెలిసిన తక్షణం బయలుదేరి హైదరాబాద్ కు వచ్చి  నిమ్స్ లోనూ ఆనక అపోలో హాస్పిటల్ లో ఆపరేషన్ సమయంలోనూ దగ్గరుండి ప్రేయర్ చేసి ఆయన చూపిన వాత్సల్యం మరపురానిది.    స్వయంగా తానే వేలాది శిష్యగణానికి గురుదేవులై నిత్య పూజలందుకునే మహిమాన్వితుడైనా సరే.. 2006 చివరిలో  మా పెద్దమ్మాయి పెళ్ళిలో మా గురువు సద్గురు శివానందమూర్తి గారికి మేము చేసిన పాదపూజ కార్యక్రమంలో అందరితో బాటు కూచుని పాల్గొన్న ఆయన వినమ్రతను ఎప్పటికీ మరవలేను. మళ్లీ అదే సద్గురు శివానందమూర్తి గారు తీవ్రంగా అస్వస్థులై తనకు తాను నయం చేసుకోవటానికి ఖండితఃగా నిరాకరించిన సమయాన నేనా విషయం చెప్పగానే సీతారామ్ గురుదేవులు ఉన్నపళాన రాత్రికిరాత్రి భీమునిపట్నం వెళ్లి చాలాసేపు ఉన్నారు. ఆ తరవాత మా గురువుగారికి‌ ఒకింత స్వస్థత చేకూరిందని విన్నాను. పాదపూజ చేసుకునేందుకు వీలుగా - మా ఇంటికి దయచేయదలిచినప్పుడు కాస్త ముందస్తు నోటీసు ఇవ్వమని ఎన్ని మార్లు చెప్పినా ఈ గురువుగారు వినరు. చెప్పా పెట్టకుండా  సపరివారంగా తలుపు తోసుకువచ్చి కాఫీ పెట్టమని అడగటమే ఆయనకు ఇష్టం. ఎన్ని సార్లు ఆశ్రమానికి వెళ్లినా మా ఇంటిల్లి పాదికీ బట్టలు పెట్టకుండా ఆయన, అన్నపూర్ణాదేవిని పోలిన కమల తల్లి ఏనాడూ పంపించలేదు. 

2021 మొదట్లో తిరుపతి దగ్గరలో తమిళనాడు సరిహద్ధు గ్రామం పోన్ పడిలో కంచి , హంపి , పుష్పగిరి వంటి ఎన్నో  ప్రాచీన  పీఠాల అధిపతులు కొలువుదీరిన ధార్మిక సదస్సులో సీతారామ్ గురుదేవులు ప్రగాఢ ధర్మాగ్రహంతో అధార్మిక , రాక్షస శక్తులపై  చేసిన సింహగర్జన ఇంకా నాచెవులలో మారుమోగుతూనే ఉంది. హైందవ జాగృతి, సంగఠన అత్యావశ్యకమైన నేటి కీలక తరుణంలో 66 ఏళ్ల వయసులోనే  ఈ సద్గురువు పరమపదించటం ధార్మిక లోకానికి, ఆయనను కుటుంబ పెద్దగా , రక్షకుడిగా  తలచి కొలిచే శిష్యకోటికి  తీరని వెలితి.