Saturday 28 July 2018

పరతంత్రం నుంచి పరతంత్రంలోకి

పెక్యులరిజం - 6

ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.............
స్వాతంత్య్రోద్యమానికి తండ్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తాత మహాత్మాగాంధీ ఝాన్సీరాణీ, సావర్కర్‌, అరవిందఘోష్‌, సుభాస్‌ చంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌, భగత్‌సింగ్‌, అల్లూరి, శ్రద్ధానంద లాంటి వాళ్లు పెద్దగా పట్టించుకోనవసరం లేని చిల్లర శాల్తీలు .... అన్నట్టు- నెహ్రూ హయాంలో దేశ చరిత్రకు 'సెక్యులర్‌ వెల్ల'ను కమ్యూనిస్టు రాతగాళ్ల చేత ఎంతదట్టంగా వేయించినా ....

     
      నిజానికి మన ప్రాచీన పుణ్యభూమికి, దానిలో శతాబ్దాల పర్యంతం సాగిన భీకర, అద్భుత జాతీయోద్యమానికి సనాతన ధర్మమే ఊపిరి.

      ఏడు శతాబ్దాలకు పైగా సాగిన ఇస్లామిక్ దండయాత్రలను, దురాక్రమణలను వీరోచితంగా ప్రతిఘటించి, చివరికి విదేశీయ దుష్టశక్తులను జయించింది సనాతన ధర్మం; దాని నుంచి స్ఫూర్తి పొందిన హిందూ పరాక్రమం.

      నయవంచనలు, కుట్రలు, నమ్మకద్రోహాలతో దేశాన్ని దుర్మార్గంగా ఆక్రమించిన తెల్లరాకాసుల మీద జాతీయ స్థాయిలో మొట్టమొదటి గట్టి ప్రతిఘటన అయిన 1857 పోరాటాన్ని నడిపించింది ప్రధానంగా హిందూ వీరులు. ముఖ్య నాయకులందరిలోనూ సమానంగా ఉన్నది సనాతన ధర్మం పట్ల ప్రగాఢ నిబద్ధత. ఆ ప్రథమ స్వాతంత్య్ర పరాక్రమానికి ప్రజలను పురికొల్పినవి క్రైస్తవ మిషనరీల దౌర్జనపు మతమార్పిళ్లు; ఆవుకొవ్వు, పందికొవ్వు పూసిన తూటాలను భారత సైనికులు నోట పెట్టుకునేట్లు చేయటం లాంటి తెల్లవాళ్ల ఆగడాలు.

       1857 తర్వాత మళ్లీ జాతీయ స్థాయిలో దానికంటే సుదీర్ఘంగా, విస్తృతంగా నడచిన ప్రజా ఉద్యమం స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన గో-రక్షణ ఉద్యమం. 1880 నుంచి 1894 వరకు పధ్నాలుగేళ్ల పాటు గొప్పగా సాగి, బ్రిటిషు పాలకులకు చెమటలు పట్టించిన ఆ చారిత్రాత్మక పోరాటానికి ప్రేరణ సనాతన వైదికధర్మం. పోరాడిన వారు ఆ ధర్మానికి అంకితమైన హిందువులు.

       మిషనరీ స్కూళ్లు, కాలేజీలు తెరిపించి, ఇంగ్లీషు చదువులతో భారతీయ చరిత్రను, సంస్కృతిని, హిందూ మతాన్ని, నీచంగా చిత్రించి; ఇంగ్లీషు విద్యావంతుల బుర్రలను ఎంత చెడగొట్టినా, విశాల ప్రజాబహుళ్యంలో హిందూ మతం మీద భక్తి, ధర్మం మీద విశ్వాసం ఎంతమాత్రం సడలలేదు. సామాన్య జనంలో తెల్లదయ్యాల మీద నానాటికీ పెరుగుతున్న ఆగ్రహాన్ని తట్టుకుని, ప్రజలకు భ్రమలు కల్పించేందుకు బ్రిటిషు పాలకులు పనిగట్టుకొని తమ తైనాతీల చేత 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెసును పెట్టించారు. ఇంగ్లీషువారి బ్రెయిన్‌ వాషింగ్‌తో కొంతమంది మేధావులు 'తెల్ల'బుట్టలో పడ్డా, భారత ప్రజలు ముఖ్యంగా హిందువులు బ్రిటిషు దుష్టపాలన మీద కుతకుతలాడుతూనే ఉన్నారు. వారిలో చిరకాలంగా రగులుతున్న ధర్మాగ్రహం ఒక్క పెట్టున భళ్లుమన్నది 1905లో. గవర్నర్‌ జనరల్‌ కర్జన్‌ అడ్డగోలుగా చేసిన బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా.

        అమెరికా విశ్వవేదికపై నిలిచి హిందూ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన వివేకానందుడి అద్భుత ప్రేరణతో, సావర్కర్‌, అరవిందుల విప్లవ పోరాటాలతో బంకించంద్రుడి 'వందేమాతర' ప్రణవనాదంతో, రవీంద్రుడి జాతీయ గాన స్రవంతితో ఉత్తేజితులై - 

       
        బ్రిటిషు సామ్రాజ్య బంధనాల నుంచి భారతమాతను విముక్తి చేసేందుకు ఉరకలేస్తున్న హైందవ జాతీయ శక్తులను నిలువరించేందుకు తెల్లవాళ్లు వేసిన పాపిష్టి ఎత్తు బెంగాల్‌ విభజన. హిందూ జాతీయ చైతన్యానికి ప్రధాన కేంద్రమైన బెంగాల్‌ను అడ్డగోలుగా చీల్చి, ముస్లింలకు మెజారిటీ ఉండేలా కొన్ని ప్రాంతాలను కృత్రిమంగా వేరు చేసేందుకు బ్రిటిషు సామ్రాజ్యవాదులు, ఇస్లామిక్ సామ్రాజ్యవాద అవశేష శక్తులు కుమ్మక్కయి పన్నిన కుటిల వ్యూహాన్ని హిందూ జాతీయ వాదులు జయప్రదంగా వమ్ము చేశారు. వంగ దేశాన్ని దుర్మార్గంగా చెడగొట్టిన వారు తోక ముడిచి దానిని తిరిగి ఏకం చేయక తప్పని పరిస్థితిని దేశభక్తులు తెచ్చిపెట్టారు.

        1905లో బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా మొదలైన పోరు క్రమేణా స్వదేశీ ఉద్యమంగా ఊపు అందుకుని దేశమంతటికీ పాకింది. మహారాష్ట్ర, పంజాబ్‌ల నుంచి, ఆంధ్ర, కళింగ తీరాల వరకూ 'వందేమాతర' మంత్రం; 'స్వదేశీ', 'స్వరాజ్య' నాదం పోలీసుల లాఠీల దెబ్బలు తింటున్న ప్రతి భారతీయుడి పెదవుల మీద దిక్కులదిరేలా నినదించాయి. ముస్లిం సోదరులూ 'వందేమాతరం' అంటూ హిందువులతో గొంతు కలిపిన అపురూప ఘట్టమది.

       బెంగాల్‌ విభజన విఫల ప్రయోగంతో తెల్లవాళ్లు హైందవ జాతీయ విజృంభణకు ఎదురు నిలవటం తమ వల్ల కాదని గ్రహించారు. హిందూ-ముస్లిం సఖ్యతను చెడగొట్టి, జాతీయోద్యమాన్ని నీరుకార్చేందుకు 'విభజించి పాలించే' వక్ర నీతికి సానపెట్టారు. హైందవ పరాక్రమాన్ని నిర్వీర్యం చేసి హిందువుల చేతులు కట్టేసి, మహమ్మదీయులను వారిపైకి ఉసికొలిపి, బ్రిటిషు సామ్రాజ్యానికి ఎదురులేకుండా చేసుకోవటానికి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అణచివేత వల్ల కాని పనిని నయవంచనతో ఎలా సాధించాలా అని తెల్లవాళ్లు పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేకపోయింది. కాగల కార్యాలు సాధించి పెట్టటానికి సరైన మనిషి వారికి సులభంగానే దొరికాడు.

       ఇంగ్లీషువాళ్ల ఉచ్చులో దూరి, తెలిసో తెలియకో, అసంకల్పితంగానో, బుద్ధి పూర్వకంగానో బ్రిటిషు పాలకుల మాయాజూదంలో వాటమైన పాచికగా జీవితాంతం ఉపయోగపడ్డవాడు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి!

        
       మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దక్షిణాఫ్రికా నుంచి రాచమర్యాదలతో బొంబాయి రేవులో అడుగుపెట్టింది మొదలుకొని, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతమాతకు రంపపుకోత వరకూ గాంధీ మహత్ముడు చేసిన వరస తప్పుల వల్ల జాతీయోద్యమం చిందరవందర అయింది. గాంధీగారు తాగించిన మేకపాలతో హిందువుల క్షాత్రం సన్నగిల్లింది. ఆయన ఇచ్చిన వత్తాసుతో, కురిపించిన ధృతరాష్ట్ర ప్రేమతో ముస్లిం మతోన్మాదం పెట్రేగింది. మహాత్ముడు లొంగేకొద్దీ, బుజ్జగించే కొద్దీ, హిందువుల మెడలు బలవంతంగా వంచే కొద్దీ మహమ్మదీయుల పంతం నానాటికీ పెరిగి చివరికి దేశాన్ని ముక్కలు చేసింది.

        ఐదు శతాబ్దాలకు పైగా ఇస్లామిక్ దండయాత్రలూ, దురాక్రమణలతోనూ; బ్రిటిషు పాలనలో తరాల తరబడి ముస్లిం మతోన్మాదంతోను పోరాడి ఎన్నో బాధలు పడి, భయానక కష్టనష్టాలకు లోనై, రక్తపుటేరుల నడుమ ఎట్టకేలకు స్వాతంత్య్రమనబడేది సాధించాక మనం ఏమి చేసి ఉండవలసింది? అన్ని శతాబ్దాల పర్యంతం అధికార మదంతో, దౌర్జన్యంతో విరగపడి హిందూదేశంలో హిందూమతాన్ని రూపుమాపేందుకు శాయశక్తులా ప్రయత్నించిన ఇస్లామిక్ మత ప్రకోపానికీ; తెల్లదొరల వత్తాసులో దేశాన్ని క్రైస్తవీకరించడానికి విశ్వ ప్రయత్నం చేసిన క్రైస్తవ మతశక్తులకూ ముకుతాడు వేసి; వెనుకటి ఆగడాలు, దురాగతాలు మళ్లీ జరక్కుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవద్దా?

        హిందువులు, ముస్లింలు ఎంతమాత్రం కలిసి ఉండలేని విరోధి జాతులు అన్న తప్పుడు సిద్ధాంతానికి విధిలేక తలవంచి; ముస్లిం మెజారిటీ ప్రాంతాలను ముస్లింలకు పంచి ఇచ్చి వేరుపడిన తరువాత, మిగిలింది హిందువులు మెజారిటీ అయిన హిందూ దేశమే కదా? హిందువులకు మిగిలిన ఆ ఖండిత భారతదేశంలోనైనా హిందువులు తలఎత్తుకొని తిరగవద్దా? శతాబ్దాలుగా తురుష్క, మ్లేచ్ఛ దురాక్రమణలతో నానా అగచాట్లు అవమానాలు పడి, ఎట్టకేలకు విముక్తి పొందిన తరవాతైనా విదేశీయ ఇస్లామిక, క్రైస్తవ మతాల పెత్తనాలు, తలపోట్లు లేకుండా తమ దేశంలో తమ మతానికి, తమ ధర్మానికి సముచిత గౌరవ స్థానం కల్పించి, నిర్నిబంధంగా, సగర్వంగా బతికే అవకాశం హిందువులకు ఉండవద్దా? నూటికి 80 మంది హిందువులైన దేశంలో రాజ్యం, రాజ్యాంగం హిందువుల ఆచారాలు, విశ్వాసాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? తరతరాలు పోరాడి, అష్టకష్టాలు పడి సంపాదించిన స్వాతంత్య్రం సార్థకం ఎలా అవుతుంది?

        మెడమీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రశ్నలకు 'ఔను' అనే జవాబు చెబతాడు. కాని మనవాళ్ళు అనుకున్న పగవాళ్లు వేరే రకంగా వక్రపు ఆలోచనలు చేశారు.

        దేశాన్ని కోసి, ముస్లింల రాజ్యం ముస్లింలకు పంచి ఇచ్చిన తరువాత కూడా మిగిలేది హిందూ రాజ్యం కాదట! హిందూ మెజారిటీ దేశంలో కూడా ముస్లింలను, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకునే తిరగాలట! ఆ మైనారిటీలకు ఎక్కడా మనస్తాపం లేక అభద్రతా భావం కలగకుండా హిందువులు కళ్లలో వొత్తులు వేసుకుని కడు జాగ్రత్తగా మెలగాలట. మైనారిటీలను పువ్వుల్లో పెట్టి పూజించాలట. ప్రత్యేక హక్కులు, రాయితీలు మైనారిటీలకు సమకూర్చి, తాము చేతులు కట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని, అణగిమణిగి ఉండటమే మెజారిటీ ప్రజల ప్రారబ్ధమట!. 

        ప్రపంచంలో ఎక్కడా ఎన్నడూ లేని, బుద్ధి ఉన్నవాడెవడూ కలనైనా తలపోయని ఈ వెర్రిమొర్రి సిద్ధాంతాన్ని స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ పండితుడు జంకు లేకుండా ప్రవచించాడు. హిందువులు తమకు ఎంతటి అన్యాయం జరుగుతున్నదో విదేశీ పరతంత్రం నుంచి బయటపడిన వెంటనే మళ్ళీ స్వదేశీ పరతంత్రంలో ఎలా చిక్కుకుంటున్నామో, దాని పర్యవసానమేమిటో గ్రహించే అవకాశం లేకుండా మాయమాటలు చెప్పి, దుర్మార్గపు ఉద్దేశాలకు డాబుసరి పలుకుల మేలి ముసుగువేసి, నడమంత్రపు విధానాలను దేశం మీద రుద్దాడు.

        ఆ మేలి ముసుగు పేరు 'సెక్యులరిజం'.

       చక్కగా నడుస్తున్న జాతీయోద్యమాన్ని గాంధీగారు జయప్రదంగా హైజాక్‌ చేశాక.. బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి స్వతంత్రం సాధించటం కంటే కూడా హిందూ-ముస్లిం ఐక్యత అతి ముఖ్యమన్న సిద్ధాంతాన్ని ఆయన లేవదీసి, ముస్లింల చేతికి వీటో హక్కు ఇచ్చాక ముస్లిం మతశక్తులది ఆడింది ఆట అయింది. మహమ్మదీయుల మెహర్బానీ ఎలాగైనా పొందడం జాతీయవాదుల శీలానికి గీటురాయి అయి కూర్చుంది. ఎవరు జాతీయవాదులు, ఎవరు మతోన్మాదులు అన్నది ముస్లిం మతవాదులు నిర్ణయించసాగారు. వారి డిమాండ్లకు తల ఒగ్గి, వారు కోరే హిరణ్యాక్ష వరాలను సమర్థించే వారు నేషనలిస్టులుగా, సమర్థించలేని వారేమో హిందూ కమ్యూనలిస్టులుగా వింగడించబడ్డారు.

        ఇక స్వతంత్రం వచ్చాక ఎవరు సెక్యులరిస్టులో, ఎవరు కాదో నిర్ణయించేది మళ్లీ మైనారిటీలే. మైనారిటీల మత ఛాందసత్వాన్ని కిమ్మన మన్నించి, హిందువుల సమంజసమైన కోర్కెలను కూడా మతఛాందసత్వంగా తిట్టిపోసేవారికి 'సెక్యులరిస్టులు' అన్న భుజకీర్తులను మైనారిటీలు ప్రసాదించసాగారు. మెజారిటీ మత విశ్వాసాలు, సెంటిమెంట్ల పట్ల జరుగుతున్న దారుణ వివక్షను ప్రశ్నించే వారేమో 'హిందూ కమ్యూనలిస్టులు' అన్న చెడ్డపేరు పడ్డారు.

         ముస్లిం మెజారిటీ ప్రాంతాలు వేరుపడి పోయాక, భారతదేశంలో మిగిలిపోయిన తమను హిందూ మెజారిటీ అణగదొక్కి, వేటాడే ప్రమాదం ఎంతైనా ఉన్నదని మైనారిటీల పెద్దలు గగ్గోలు పెట్టారు. హిందూ మతోన్మాదం తమను మింగివేయకుండా తమకు ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక హక్కులు కల్పించాలని వారు పట్టుబట్టారు.

        'ఔనౌను. మీరన్నది నిజమే! హిందువుల బారినుంచి మిమ్మల్ని తప్పక కాపాడాల్సిందే. దానికి రాజ్యాంగంలోనే గట్టి బందోస్తులు చేయాల్సిందే' అన్నాడు దయగల నెహ్రూ పండితుడు.

        అంతపనీ చేయించాడు కూడా!

Friday 27 July 2018

అయ్యప్ప నిష్ఠ చెడగొట్టే తీరాలా ?

ఉన్నమాట

...... ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.......
[ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వివాదంమీద పన్నెండేళ్ళ కింద(20-8-2006 న) ఆంధ్రభూమి దినపత్రిక మొదటి పేజిలో రాసిన వ్యాసం యథాతథంగా ]
మసీదులలో మగవారితోబాటు ప్రార్థనలకు మహిళలను అనుమతించరు. ఈ సంగతి దేశంలోని ఏ హేతువాదికైనా చెప్పండి. 'ఔనా?' అని అదిరిపడడు. మహిళలు రాజ్యాలేలుతూ రాకెట్లు తోలుతున్న ఈ 21వ శతాబ్దంలో కూడా మహిళలపట్ల ఇంత దారుణమైన దుర్విచక్షణా అని మామూలు బాణిలో బోలెడు షాకైపోడు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వానికి, సమాన హక్కులకు, మత స్వేచ్ఛకు కొంపలంటుకున్నాయని గుండెలు బాదుకుంటూ ఏ రోడ్డుముందూ యాగీ చేయడు. పైగా- ఆ సంగతి చెప్పిన మిమ్మల్నే వింతజంతువును చూసినట్టు ఎగాదిగా చూస్తాడు. ''ఔను, ఐతే ఏమిటట? అది ఎప్పణ్ణించో వస్తున్న వారి మతాచారం. మసీదుకు వెళ్లగోరే స్త్రీలకు విడిగా వేరే ఏర్పాటు ఉంటుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా, ఆఖరికి స్వేచ్ఛ, సమానత్వం ఎక్కువై బాధపడుతున్న అమెరికాలో కూడా మసీదుల్లో మగవారి సరసన ప్రార్థనలు చేసుకోవడానికి మహిళలను అనుమతించరు. ఆడా, మగా భుజాలు రాచుకుంటూ మోకరిల్లితే ప్రార్థనాస్థలంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుందని ఆ కట్టడిచేసి ఉండొచ్చు. అయినా దాని జోలి నీకేల? మహమ్మదీయులకు, ముస్లిం మహిళలకు లేని అభ్యంతరం నీకెందుకు?'' అంటూ క్లాసు తీసుకుంటాడు. శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించడం లేదు అని అదే హేతువాదికి చెప్పండి. 'చాలా దుర్మార్గం' అంటాడు. ఈ లైంగిక వివక్ష స్త్రీజాతికి అవమానం; రాజ్యాంగానికి అపచారం అని ఎగిరెగిరిపడతాడు. ఎప్పణ్ణించో వస్తున్న ఆచారం అయినా సరే ఈ భ్రష్టాచారాన్ని ఇంకేమాత్రమూ కొనసాగనివ్వటానికి వీల్లేదంటూ మీడియా నిండా రాద్ధాంతం చేస్తాడు. దుష్టాచారాన్ని తక్షణం ఆపించి మహిళా సమానత్వానికి, మహిళల ప్రాథమిక హక్కులకు అర్జంటు న్యాయం చేయాల్సిదంటూ కోర్టుకెక్కి పిల్లు (ప్రజాహిత వ్యాజ్యం) మీద పిల్లు వేస్తాడు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని ఏ హిందూ దేవాలయంలోనైనా ఆడా, మగా కలిసే గుడికి వెళతారు. కలిసే పూజలు చేస్తారు. మిగతా సంగతులు ఎలా ఉన్నా ఆలయాల విషయంలో హిందూమతం మహిళలను పెద్దచూపే తప్ప చిన్నచూపు చూడదు. గర్భగుడి మూలవిరాట్టులో మగాయన పక్కనే ఆడామె ఉంటుంది. అమ్మవారి గుళ్లలోనేకాక మగదేవుడి గుడిలోకీ మగవారితో సమానంగా మహిళలకు ప్రవేశం ఉంటుంది. ఒకే ఒక్క గుడిలో తప్ప!
      
      శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలోకి ఆడవారిని రానివ్వనిదీ స్త్రీలంటే ద్వేషంతో కాదు. అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి. దేవుడికే కాదు.. అక్కడికి వెళ్ళే భక్తులకూ బ్రహ్మచర్యం తప్పనిసరి. 41 రోజుల అయ్యప్ప దీక్షకు మాలవేసుకున్న తరవాత కుబేరుడైనా, చక్రవర్తి అయినా కటిక నేలమీద ఆడ వాసన తగలకుండా ఒంటరిగా పడుకోవలసిందే. కఠోర బ్రహ్మచర్య దీక్షకు ముక్తాయింపుగా వేలూ లక్షల భక్తులు కిక్కిరిసి దర్శనం చేసుకునే ఇరుకైన దివ్య సన్నిధిలోకి వయస్సులోని స్త్రీలను అనుమతిస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. అవాంఛనీయ ధోరణులు ప్రకోపించవచ్చు. మామూలు మనుషులకు దేవుడినుంచి ధ్యాసమళ్లి, భక్తిపోయి రక్తి కలిగి, మగరాయుళ్లకు గుబులు పుట్టవచ్చు. అది ఆయా మహిళల క్షేమానికి మంచిది కాదు. 

       పైగా పరువంలోని స్త్రీలను చూడనని వ్రతంపట్టిన స్వామి గర్భగుడిలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లను అతిక్రమిస్తే స్వామికి ఆగ్రహం వస్తుంది. క్షేత్రం పవిత్రత చెడుతుంది. స్థల మహత్మ్యం సన్నగిల్లుతుంది. దివ్యశక్తిని కోల్పోయాక ఆ క్షేత్రానికి వెళ్ళే ప్రయోజనం ఉండదు. నాస్తికుల, హేతువాదుల సరదా షికారుకు విహార కేంద్రంగా మాత్రమే అది పనికొస్తుంది. భక్తిగల పురుషులూ, స్త్రీలూ ఇక అక్కడికి పొమ్మన్నా పోరు.

       ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే శబరిమల దేవస్థానం దైవసన్నిధిలో మహిళల ప్రవేశాన్ని మొదటినుంచీ నిషేధించింది. ఈ నిషేధం కూడా బహిష్టు ప్రాయమైన 10 నుంచి 50 ఏళ్ళలోపు స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. 10 లోపు, 50 పైన వయస్సుగల స్త్రీలను రానివ్వటానికి అభ్యంతరం లేదు. కనుక అయ్యప్ప స్వామిని పక్కా స్త్రీ ద్వేషి అనడానికి వీల్లేదు. ఈ ఆంకక్షూడా ఆ ఒక్క గుడిలోనే. దేశమంతటా, ఊరూరా ఉన్న ఏ అయ్యప్ప గుడిలోకైనా 10-50 వయోవర్గం సహా అన్ని వయస్సుల మహిళలూ నిక్షేపంలా వెళ్లవచ్చు. ఎక్కడాలేని ఆంక్ష ఒక్కచోటే పెట్టారంటే అది ఎందుకు పెట్టారో, తరతరాలుగా వస్తున్న కట్టడిని ఉల్లంఘిస్తే దేవుడికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో, ఏ అనర్థం వాటిల్లుతుందోనని బాధ్యతగల వారు ఆలోచించడం తప్పా? దేశమంతటా లక్షోపలక్షల దేవాలయాల్లో అన్నిటా స్త్రీ పురుషులకు సమాన ప్రవేశం ఉన్నా సరే... ఒక్కచోటే వేరే ట్టుబాటు ఉన్నది కనుక మహిళా హక్కులు మంట కలిశాయంటూ గగ్గోలు పెట్టాలా? ఆ ఒక్కచోట కట్టుబాటును పనిగట్టుకుని చట్టుబండలు చేస్తే తప్ప హేతువాదులు, హక్కులమ్మల కళ్ళు చల్లబడవా?

       అసలు దేవుడు అన్నదే ఒక భావన. ఒక నమ్మకం. దేవసంబంధమైన ప్రతిదీ విశ్వాసానికి సంబంధించిన విషయం. శాస్త్రీయత, అశాస్త్రీయతల చర్చకు, హక్కుల పేచీలకు, సమానత్వపు కబుర్ల రొడ్డకొట్టుడుకు దైవసన్నిధి వేదిక కాదు; సందర్భమూ కాదు. దేవాలయాల వ్యవహారాల్లో ఆచారానికి మాత్రమే ప్రాధాన్యం. ఏది ఆచారం, ఏది నియమం అన్నది సంబంధిత దేవస్థాన యాజమాన్యామే తేల్చాల్సిన విషయం. నచ్చినా, నచ్చకున్నా, వ్యక్తిగత విశ్వాసాలకు, ప్రకటిత విధానాలకు నప్పినా, నప్పకపోయినా అదే అందరికీ శిరోధార్యం.

       అదిగో - ఆ ఉద్దేశంతోటే కేరళ హైకోర్టు శబరిమల క్షేత్రంలో 10-50 మధ్య వయస్సుగల స్త్రీల ప్రవేశాన్ని నిషేధించటం సబబేనని 15 ఏళ్ల కిందటే తేల్చి చెప్పింది. శబరిమల క్షేత్రంలో యాత్రికుల సౌకర్యాల ఏర్పాట్లను సమన్వయం చేయవచ్చుగానీ గర్భాలయంలో అడుగుపెట్టరాదని కె.బి.వలసకుమారి అనే జిల్లా కలెక్టర్‌ను గతంలో న్యాయస్థానం ఆదేశించింది. కేరళలో కమ్యూనిస్టు, కాంగ్రెసు అన్న తేడాలేకుండా ఏ పార్టీ రాజ్యమేలినా అనుస్యూతపు సంప్రదాయాన్ని ఆ విజ్ఞతతోటే రాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తూవచ్చింది. మతాచారాల్లో, మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదన్న వివేకంతోటే ఇప్పుడున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఆలయ సంప్రదాయం విషయాన్ని దేవస్థానం బోర్డు నిర్ణయానికి వదిలేసింది. 10 -50 వయస్సు స్త్రీల ప్రవేశంపై శతాబ్దాలుగా అనుసరిస్తున్న నిషేధం కొనసాగుతుందని స్పష్టీకరించింది.

        ఇందులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. ఇది తప్పు అని అయ్యప్పను ఆరాధించే ఏ భక్తురాలూ అనలేదు. హిందూ స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే ఏ మహిళా సంఘం నోరెత్తలేదు. ఫలానా మతాచారంవల్ల తమ హక్కుకు భంగం కలిగిందా లేదా అన్నది ఆ మతానికి చెందిన ఆ వర్గం వారే కదా చెప్పవలసింది? కందకు లేని దురద కత్తిపీటకెందున్న సామెతలాగా సంప్రదాయిక హిందూ మహిళలకు లేని అభ్యంతరం పనిలేని కొందరు ప్లీడరమ్మలకు పొడుచుకొచ్చింది. వారిలో ఎంతమందికి దైవభక్తి ఉందో తెలియదు. ఆంక్ష ఎత్తేస్తే వారిలో ఎంతమంది శబరిమలను దర్శిస్తారో అంతకంటే తెలియదు. తీరికూర్చుని, అర్థంలేని రాద్ధాంతంచేసి, కేసు పెట్టగానే సర్వోన్నత న్యాయస్థానమే హుటాహుటిన కదిలింది. బకాయిపడి కొండలా పేరుకున్న కేసుల విషయంలో చూపని వేగాన్ని, శ్రద్ధను ఈ సంచలనాత్మక వ్యాజ్యంపై కనపరచింది. నిషేధం గురించి ఏమి చెబుతారని సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చేసరికి స్త్రీలు సైతం ఆలయ ప్రవేశం చేయవచ్చునని సహజంగానే కేరళ ప్రభుత్వం బదులిచ్చింది. సున్నితమైన ఆచార వ్యవహారంలో బాధ్యత గుర్తెరిగి ప్రభుత్వం చూపిన సంయమాన్ని అర్థం చేసుకోకుండా 'గుళ్లోకి ఆడవాళ్లను రానివ్వరా' అని అడిగితే 'రానివ్వము' అని ఏ ప్రభుత్వం మాత్రం ఎలా చెప్పగలదు? 

       లైంగిక వివక్షలా బయటి వారికి కనపడే కట్టుబాట్లు వేరే మతాల్లో లేవా? ఏ దేశంలోనైనా మొనాస్టరీలలోకి మహిళలను రానిస్తారా? క్రైస్తవ సన్యాసినులుండే నన్నరీలలోకి మగవారిని అనుమతిస్తారా? జెస్యూట్లు, బెనెడిక్ట్‌ ఆర్డర్లలో స్త్రీలకు ప్రవేశం ఉంటుందా? లోరెలా ఆర్డరులోకి క్రైస్తవ పురుషులను పోనిస్తారా? క్రైస్తవమతంలో ఒక మహిళ పోప్‌ కాగలదా? కనీసం బిషప్‌ అవుతుందా? హిందువో, ముస్లిమో ఎవరూ చెప్పలేని షిర్డీ సాయిబాబాగారి చావడి గదిలోకి తమను పోనివ్వక పోవటం తమ సమానత్వానికి, రాజ్యాంగ హక్కులకు, విఘాతక మని ఏ స్త్రీలైనా అనుకుంటున్నారా? 

         ఎప్పుడూ ఎక్కడాలేని గొడవ శబరిమలలో ఎందుకు మొలైంది? పత్రికలు, టీవీలు, చానెళ్ల చచ్చుచర్చల్లో పాల్గొనే తెలియని పెద్దనోటిరాయుళ్లు ఊదరపెడుతున్నట్టు ఇదంతా నిజంగా స్త్రీల హక్కులమీద మక్కువతోనేనా? రాద్ధాంతం వెనుక వేరే మతలబు ఉందా?

        దేవుడి పేరు చెప్పి మనుషులు చేసే పనులకు దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకునేందుకు శబరిమలలో అప్పుడప్పుడూ 'దేవప్రశ్నం' నిర్వహిస్తారు. జ్యోతిష సంబంధమైన లెక్కలువేసి, శకునాలను, నిమిత్తాలను గమనించి, ఇతర విధాల దేవుడి మౌనభాషను యథాశక్తిగా అర్ధం చేసుకుని ఆస్థాన దైవజ్ఞులు భక్తులకు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం మొన్నీమధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నిక ష్ణ పణిక్కర్‌ అనే దైవజ్ఞుడు ఆలయ వ్యవహారాలు నడుస్తున్న తీరుపట్ల స్వామి చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కనుక్కొన్నాడు. నీళ్ళు నమలకుండా, మొహమాటం లేకుండా తనకు స్ఫురించింది నిష్కర్షగా చెప్పాడు. ఆ సందర్భంలో బయటపడ్డ అనేక విషయాల్లో నిషిద్ధ స్త్రీల ఆలయ ప్రవేశం ఒకటి. శబరిమలలో అనాచారాలు, పాపాలు పెరిగిపోయాయి. మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారులు, లైంగిక విశ ంఖలత్వాలు పెట్రేగుతున్నాయి. దేవస్థానం అధికారులు, వ్యాపారాలు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడుతున్నారు.  స్వార్ధ ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నారు. సంప్రదాయాలు కట్టుతప్పాయి. నియమానికి విరుద్ధంగా ఒక మహిళ శ్రీకోవిల్‌లో అడుగుపెట్టి స్వామిని తాకింది... అంటూ దైవజ్ఞుడు వరసగా ఏకరవు పెడుతూంటే భక్తులు నివ్వెరపోయారు. 

        అతడు చెప్పేది నిజమనడానికి శకునాలు కూడా కనిపించాయట. ఒక మహిళ గర్భాలయంలోకి ప్రవేశించిందని అంటూండగా దేవప్రశ్నం నడుస్తున్న హాలులోకి ఒక మహిళ అడుగుపెట్టిందట. డబ్బులకోసం పిల్లుల్లా కొట్లాడుకుంటున్నారు అంటుండగా మూడు పిల్లులు అక్కడికి వచ్చి కలబడసాగాయట. దాంతో దేవుడికే ఆగ్రహంవస్తే దేవస్థానం ఏమవుతుంది. ఇక తమగతి ఏమిటి అన్న భయం భక్త జనానికి పట్టుకుంది. దేవప్రశ్నం విశేషాలు బయటికి వచ్చాక దైవాగ్రహానికి ఎక్కడ గురి అవుతానోనన్న హడలుతో జయమాల అనే కన్నడ నటి తాను పందొమ్మిదేళ్లకింద 27 సంవత్సరాల వయస్సులో గర్భగుడిలో ప్రవేశించి స్వామిని తాకినట్టు ఒప్పుకుంటూ దేవస్థానానికి రాసింది. చేసింది తప్పని లెంపలేసుకుందే తప్ప మూలవిరాట్టును తాకటం తన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని ఆమె కూడా అనలేదు. ఆలయ నిబంధనను, హైకోర్టు తీర్పును ఉల్లంఘించి ఆలయంలో ప్రవేశించిన నేరానికి న్యాయంగా అయితే ఆమెను ప్రాసిక్యూట్‌ చేయాలి. తప్పు ఒప్పుకున్నది లెమ్మని దయతలిస్తే, అటువంటి అపరాధం ఇంకెవరూ చేయకుండా గట్టి కట్టుదిట్టాలుచేసి ఊరుకోవాలి. అదీ ఇదీ కాకుండా తప్పుచేసిన మనిషిని నారీ హక్కుల ప్రతినిధిగా, మతఛాందసపు బాధితురాలిగా చూపించి నాలుక భుజాన వేసుకుని లొల్లి చేయటం మన కూహనా లౌకిక మేధావులకే చెల్లింది.

        ఎప్పుడో పందొమ్మిదేళ్లకింద జరిగి, సందర్భవశాత్తూ ఇప్పుడు బయటపడ్డ ఆచారభంగం ఉదంతానికి మితిమించిన ప్రాముఖ్యత ఇవ్వటం దండుగ. దానికంటే తీవ్రమైన విషయాలెన్నో దేవప్రశ్నంలో ప్రస్తావనకు వచ్చాయి. లైంగిక భ్రష్టత్వాల గురించి అందులో చెప్పినట్టే ఆలయం ప్రధాన 'తంత్రి'గారి వ్యభిచారపు విక తలీలలు రచ్చకెక్కాయి. ఇలాంటి భ్రష్టుల పెత్తనాలు, బాధ్యతా యుతస్థానాల్లోని వారి ఆవినీతి, అక్రమాలు, కంట్రాక్టర్లతో లాలూచీలు దేవుడికే ఆగ్రహం తెప్పించాయని తెలిశాక ఆందరూ ద ష్టి కేంద్రీకరించవలసింది- అలాంటి నీచ, నిక ష్ట భ్రష్టాచారాలమీద! వాటి సంగతి వదిలేసి ఇరవైఏళ్ల కిందటి ఘటనకు తగని ప్రాధాన్యమిచ్చి, ఆలయ వ్యవహారాల ప్రక్షాళన తక్షణావసరాన్ని కాస్తా మహిళా హక్కుల రాద్ధాంతంగా మార్చి తిమ్మినిబమ్మి చేయటం ఏ స్వార్ధశక్తుల కొమ్ముగాసేందుకు?

        ఇంకో సంగతి. 'దేవప్రశ్నం'లో దేవుడుకోరినట్టుగా వెల్లడైన ముఖ్య విషయమేమిటంటే భక్తులిచ్చే కానుకల దుర్వినియోగాలను ఆపాలని! వసతులులేక అవస్థపడుతున్న యాత్రికుల అగచాట్లను పట్టించుకోవలసిందని వారికోసం ఆలయ నిధులతో నిత్యాన్నదానానికి ఏర్పాటు చేయాలని! ఆ పని కనుకచేస్తే శబరిమలలోనూ, ఎరుమేలీ, కరిమల, రణ్నీ మార్గాల వెంబడి ఉన్న చాలా హోటళ్లకు వ్యాపారం దెబ్బతింటుంది. ఆ హోటళ్లు నడిపేవారిలో క్రైస్తవులు, ముస్లింలు చాలామంది ఉన్నారు. అలాగే ఆయ్యప్పకు సన్నిహితుడైన వావర్‌ మసీదును శబరిమల దేవస్థానం స్వాధీన పరచుకుని, అక్కడ సాగుతున్న అక్రమాలను అరికట్టాలని 'దేవప్రశ్నం'లో చెప్పింది. ఆది అమలుచేస్తే ఆ మసీదు పెత్తనంవల్ల అనుచిత లబ్ధిపొందుతున్న మోతుబరులకు నష్టం వస్తుంది. తమ ఇష్టారాజ్యానికి ఇబ్బంది లేకుండా చూడటానికే స్వార్ధశక్తులు ఏకమై, సమస్యను పక్కదారి పట్టించి మతాచారానికి మహిళా హక్కులకు నడుమ సంఘర్షణగా పనిగట్టుకుని చిత్రిస్తున్నారా? దుష్టశక్తులు దుర్బుద్ధితో పన్నిన ఉచ్చులో హక్కుల వాచాలురు తమకు తెలియకుండా తలదూర్చారా? కులమతాలకు అతీతంగా కఠోరదీక్షతో అయ్యప్పను సేవించే కోట్లాది భక్తుల సెంటిమెంట్లకు కోర్టులు, ప్రభుత్వాలు కనీసపాటి విలువ ఇవ్వవద్దా? హిందువులంటే అంత చులకనా?


Friday 20 July 2018

ప్రవక్త గారి పంచాక్షరి!

పెక్యులరిజం - 5

........

ఎం.వి.ఆర్‌.శాస్త్రి ......... సెక్యులరిజం పుట్టుక, దాని పూర్వరంగం కథ అంతా చెప్పి ఓ ఐదో క్లాసు విద్యార్థిని 'దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది?' అని అడగండి.

     'మతం చేసే పాపిష్టి పనులను రాజు సమర్థించకూడదు. రాజు చేసే పాపాలను మతం సహించకూడదు. తమ మతం మాత్రమే గొప్పదనీ, దానిని అంగీకరించనివాళ్లను బతికుండగానే తగలబెడతామనీ, తమ మతంలోకి మారకపోతే చంపేస్తామనీ చెప్పే తప్పుడు మతాలను రాజ్యంలో ఉండనివ్వకూడదు. జన జీవితం మీద వాటి నీడకూడా పడనివ్వకూడదు' అని తనకు నచ్చిన భాషలో చెబుతాడు.

     పెంపకం, శిక్షణ సరిగా ఉన్న చిన్న పిల్లలకు కూడా ఇట్టే స్ఫురించే ఈ కామన్‌సెన్సు పాయింటు స్వతంత్రం అనబడేది వచ్చాక మన కర్మ కొద్దీ దాపురించిన రాజకీయ మహనేతల బుర్రకెక్కలేదు. వారి వంకర బుద్ధికి తగ్గట్టే వారి ఆలోచనలూ, వారు వేసిన అడుగులూ వంకరటింకరగా సాగాయి.

     ఇక్కడో సంగతి గుర్తుంచుకోవాలి. మోసాలు, కుట్రలు చేసి హిందూ దేశాన్ని ఇంగ్లీషువాళ్లు దుర్మార్గంగా ఆక్రమించాక ఇంగ్లీషు విద్యావిధానం క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లు, కాలేజీల ద్వారా దేశవ్యాప్తమైంది. దానివల్ల ఒక మేలు ఏమిటంటే పాశ్చాత్య విజ్ఞానం, ఆధునిక పాశ్చాత్య దృక్పథం మన విద్యావంతులకు అబ్బి, వారి ఆలోచనాధోరణిని బాగా ప్రభావితం చేశాయి. పాశ్చాత్య నాగరికత నుంచి ఎన్నో భావనలను అలవరచుకున్న భారత విద్యాధిక వర్గాలను 'సెక్యులరిజం' ఆకట్టుకోలేకపోయింది. విదేశీ పాలన నుంచి విముక్తమయ్యాక స్వరాజ్యం రూపురేఖలు ఎలా ఉండాలన్న దానిపై ఆ కాలపు బుద్ధిజీవుల్లో సాగిన ఖండన మండనల్లోనూ సెక్యులరిజం ఊసు, ఊపు ఎక్కడా కానరావు.

      దానికి కారణమేమిటంటే.. పరమత సహనమనేది అనాదిగా భారతీయుల రక్తంలో రక్తం. ప్రాణంలో ప్రాణం. ఒక మతాన్ని అందలమెక్కించి పూజించి వేరొక మతాన్ని వేధించి వేటాడటమనేది మనకు తెలియవచ్చిన పదివేల సంవత్సరాల హిందూదేశ చరిత్రలో ఎన్నడూ లేదు. రాజులు ఏ మతానికి చెందినవారైనా, మధ్యలో ఇష్టపడి ఏ మతానికి మారినా, తమకు విరుద్ధమైన ఇతర మతాలను ఎన్నడూ నిరాదరించలేదు. బలవంతపు మతమార్పిడులను ఈ దేశంలో ఏ ప్రభువూ ఏ కాలంలోనూ ప్రోత్సహించలేదు. అనుమతించలేదు.

     రాజు శైవుడైనా, వైష్ణవుడైనా, శాక్తేయుడైనా, బౌద్ధుడైనా, జైనుడైనా రాజ్యంలో పరిపాలన, న్యాయ విధానం అన్ని మతాలకూ శిరోధార్యమైన ధర్మశాస్త్రాల ప్రకారం, సంప్రదాయబద్ధంగా నడిచేవి. రాజు వ్యక్తిగతంగా ఏ మతాన్ని అనుసరించినా, రాజ్యానికి అది అధికారిక మతం కాదు. రాజ్యానికి సంబంధించినంతవరకూ దాని ఎక్కువా లేదు. అన్యమతాలకు తక్కువా లేదు. వేల సంవత్సరాల కిందటే అశోకుడు, హర్షుడు వంటి చక్రవర్తులు వెలువరించిన శాసనాలు ఇదే విషయం స్పష్టం చేస్తాయి. క్రీ.శ.6-10 శతాబ్దాల నాటి ఎల్లోరా గుహల అద్భుత శిల్ప సంపదనే చూడండి. 17 హైందవ గుహలు, 12 బౌద్ధ గుహలు, 5 జైన గుహలు చరణాద్రి కొండలలో అపురూప శిల్పాలతో పక్కపక్కనే ఉండి భారతదేశానికి ఆదినుంచి గర్వకారణమైన మత సామరస్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి.

మతాన్ని వ్యాప్తి చేయటానికి రాజ్యాధికారాన్ని (స్టేట్‌ పవర్‌ని) విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం, గిట్టని మతాన్ని అనుసరించే వారిని సామూహికంగా చంపెయ్యటం, బతికుండగానే తగులబెట్టటం, వారి జనావాసాలను నాశనం చెయ్యటం లాంటి దారుణాలు భారతదేశంలో ఇస్లామిక్‌ దండయాత్రలకు పూర్వం ఏనాడూ లేవు. మతాన్ని, రాజ్య పాలనను వేరు వేరుగా చూడటమే మన జాతి లక్షణం. మధ్యయుగాల్లో క్రైస్తవమూ రాజరికమూ కుమ్మక్కయి ఐరోపా దేశాల్లో సాగించిన దురాగతాల వంటివి భారతదేశ మౌలిక తత్వానికి విరుద్ధమైనవి. కాబట్టి మతాన్ని, రాజ్యవ్యవస్థను వేరువేరుగా చూడాలన్న పాఠాన్ని పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవలసిన ఖర్మ భారతీయులకు పట్టలేదు. దాదాపు ఏడు శతాబ్దాల పాటు ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని భారతదేశం భయానకంగా అనుభవించింది. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్‌ మొదలుకొని 18వ శతాబ్దంలో నాదిర్షా, అబ్దాలీల వరకూ ఇస్లామిక్‌ వరుస దండయాత్రల్లో వేలాది ప్రాచీన హిందూ దేవాలయాలు నేలమట్టమయ్యాయి. లక్షలమంది హిందువుల ప్రాణాలు, మానాలు, సంపదలు నాశనమయ్యాయి. 12వ శతాబ్దంలో మహ్మద్‌ ఘోరీ మొదలుకొని 17వ శతాబ్దంలో ఔరంగజేబు దాకా దేశాన్ని చెరపట్టిన ప్రతి మహమ్మదీయ రాజు ఒక మహా హంతకుడే. రాజ్యాధికార మంతటినీ ఇస్లాంలోకి మతాంతరీకరణలకు, హిందువుల మెడమీద కత్తిపెట్టి బలవంతపు మతమార్పిడులకు అడ్డుగోలుగా దుర్వినియోగం చేసినవాడే. మతం మారని హిందువులపట్ల దారుణ దుర్వివక్ష చూపి, దుర్మార్గపు ఆంక్షలతో అవమానించి, నానావిధాల కాల్చుకుతిన్నవాడే. క్రైస్తవం చేతిలో ఐరోపా దేశాలు పడిన బాధల కంటే, అనుభవించిన రాజ్య బీభత్సం కంటే వెయ్యిరెట్లు ఎక్కువే ఇస్లామిక్‌ దురాక్రమణదారుల మూలంగా భారతదేశం అనుభవించింది. ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదుల వరస దాడుల నుంచి ఎట్టకేలకు కాస్త తెప్పరిల్లామో లేదో ఇంకో విదేశీ మతమైన క్రైస్తవం దాడులు మొదలయ్యాయి. 16వ శతాబ్దంలో గోవాలో, ఇతర ప్రాంతాల్లో అధికారం చేజిక్కించుకున్న క్రైస్తవులు తమ మతాన్ని వ్యాపింపజేయటానికి, దానిలో చేరేందుకు నిరాకరించిన హిందువులను చిత్రహింసలు పెట్టి చిత్రవధ చేసేందుకు ఎన్నెన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారన్నది రక్తసిక్త ఘోర చరిత్ర. కాలం అనుకూలించి ఉంటే అవే ఘాతుకాలను పోనుపోను దేశమంతటా ఒడిగట్టి మత బీభత్సంలో తమ యూరప్‌ రికార్డులను బహుశా ఇండియాలో జయప్రదంగా బద్దలు కొట్టగలిగేవారే. వారి ఖర్మ కొద్దీ, మన అదృష్టం కొద్దీ అదే సమయాన ఐరోపాలో సంస్కరణ వాదం ప్రబలి, క్రైస్తవ మతోన్మాదం మీద, రాజకీయ వ్యవస్థను అది భ్రష్టుపట్టించిన దుర్విధానం మీద ప్రజలు ఆగ్రహించి, మత రాజకీయాలను అంతమొందించారు.

       క్రైస్తవ మతం ఉక్కు కౌగిలినుంచి రాజకీయ వ్యవస్థ బయటపడటంతో ఇండియాను ఆక్రమించిన ఆంగ్లేయులు రాజకీయ వ్యవహారాల్లో ఆ మతానికి కాస్త దూరం జరిగారు. భారతదేశ మూలాలను వేటు వేసే పాపిష్టి వ్యూహంలో భాగంగా మిషనరీ స్కూళ్లను, కాలేజీలను ప్రోత్సహించి, మతాంతరీకరణలకు యథాశక్తి ఊతం ఇచ్చినా పరిపాలనలో క్రైస్తవానికి పొలిటికల్‌ ఏజంట్లుగా కాక స్వతంత్రంగా వ్యవహరించారు. కాబట్టి ఘోరీలు, ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొగలాయిల హయంలో ఇస్లామిక్‌ టెర్రర్‌ వలె బ్రిటిష్‌ హయాంలో క్రిస్టియన్‌ టెర్రర్‌ భారతదేశాన్ని బాధించలేదు. అయితేనేమి? మిషనరీ స్కూళ్లు, మిషనరీ హాస్పిటళ్ల ద్వారా హిందువులను లోబరచుకొని, రకరకాలుగా ప్రలోభ పెట్టి, విద్యావంతుల మెదళ్లలోకి పథకం ప్రకారం హిందూమతం, హిందూ సంస్కృతి, ప్రాచీన ఉజ్జ్వల చరిత్రల మీద ద్వేషాన్ని ఎక్కించి; క్రైస్తవ మూఢత్వాన్ని చొప్పించారు. క్రైస్తవ మతవర్గాలు ఇంగ్లీషు వాళ్ల ఏలుబడిలో దేశానికి చేసిన హాని సామాన్యమైనది కాదు.

       యూరప్‌లో క్రైస్తవం లాగా ఇండియాలో రాజ్యాధికారాన్ని తన ఆధిపత్య కాలంలో దుర్వినియోగపరచిందీ, మహా బీభత్సాలను సృష్టించి చివరికి దేశాన్ని ముక్కలు చేసింది ఇస్లాం! అన్ని విషానుభవాల తరువాతైనా మనం గుణపాఠం నేర్వాలి కదా? మళ్లీ అటువంటి ఘోర దురాగతాలకు ఆస్కారం లేకుండా గట్టి కట్టడి చేయవద్దా? భారతదేశం మొత్తాన్ని ఇస్లామీకరించి దారుల్‌ ఇస్లాంగా మార్చడం ధ్యేయమైన ఇస్లాంనూ, ఇండియాను క్రైస్తవీకరించాలని కంకణం కట్టుకున్న క్రైస్తవాన్ని కాస్త కంట్రోలు చేయవద్డా?  భారతదేశం భారతదేశంగా మిగిలేందుకూ, దానికి ప్రాణమైన సనాతన ధర్మం, ఆ ధర్మానికి ప్రతిరూపమైన హిందూమతం బంధనాలు తెంచుకొని స్వరాజ్యంలో వర్ధిల్లేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవద్దా? 

        
        వాస్తవంగా జరిగిందేమిటి?

        స్వాతంత్య్ర పోరాటకాలంలో తన రాతల్లోగాని, ఉపన్యాసాల్లోగాని 'సెక్యులరిజం' ఊసే ఎత్తని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వతంత్రం వచ్చాక సెక్యులరిజం మతానికి మహా ప్రవక్తగా మారాడు. పాశ్చాత్య రాజకీయ పరిభాష నుంచి తనకు ఫాషనబుల్‌గా కనిపించిన సెక్యులరిజం పదాన్నయితే కొట్టేశాడు. పాశ్చాత్య దేశాల్లో ఆ పదాన్ని ఏ ఉద్దేశంతో వాడారో దానికి మాత్రం జెల్లకొట్టాడు. అర్థం మొత్తం మార్చేశాడు. సంకుచితం, మహామూర్ఖం అయిన (Closed creed) క్రైస్తవం మీద హేతువాదుల, మానవతావాదుల తిరుగుబాటుకు ప్రతీక, బహుళత్వానికి సంకేతం అయిన పాశ్చాత్య సెక్యులరిజాన్ని అతి తెలివిగా, భ్రష్టు పట్టించాడు. ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం లాంటి Closed creed పిడివాదాలకు దాన్ని రక్షా కవచాన్ని చేసి, బహుళత్వానికి పెట్టింది పేరయిన ఉదార హిందూ మతాన్ని కుళ్లు కొద్దీ కుళ్లబొడిచాడు. మోసపూరిత వాగాడంబరంతో 'సెక్యులరిజం' పదాన్ని దేశీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని, జాతి ఉజ్జ్వల వారసత్వాన్ని ద్వేషించే ప్రతి పగవాడికీ వాటమైన, లాభసాటి అయిన రాజకీయ పంచాక్షరిగా మార్చివేశాడు. విఖ్యాత గ్రంథకర్త సీతారామ్‌ గోయల్‌ చెప్పినట్టు-

     The first Prime Minister of independent India became the leader of a Muslim-Christian-Communist Combine. Now everything which Hindus held sacred could be questioned, ridiculed, despised and insulted. At the same time the darkest dogmas of Islam and Christianity were not only placed beyond the pale of discussion but also invested with divinity any one who asked any inconvenient questions about them invited the attention of laws which were made more and more punitive.
[Pseudo-Secularism, Sitaram Goel, P.7]

     (స్వతంత్ర భారత తొలి ప్రధాని ముస్లిం-క్రిస్టియన్‌-కమ్యూనిస్టు కూటమికి నాయకుడయ్యాడు. హిందువులు పవిత్రంగా తలిచే దేన్నయినా ఇప్పుడు ప్రశ్నించవచ్చు; గేలిచేయవచ్చు; ఏవగించుకోవచ్చు; అవమానించవచ్చు! అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవాలకు సంబంధించిన మహామూఢ సిద్ధాంతాలను చర్చకు అతీతమైనట్టు చూపెట్టటమే కాదు. వాటికి దివ్యత్వాన్ని ఆపాదించారు. వాటి గురించి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసేవారి మీద చట్టాలు దృష్టి పెడతాయి. ఆ చట్టాల్లో శిక్షలను పోనుపోను తీవ్రం చేశారు.)

Sunday 15 July 2018

తిరుమలలో ఏమవుతున్నది ?

      తిరుమల గుళ్ళో ఏమవుతున్నది ? పుట్టా వారు పగ్గాలు చేపట్టాక ఆగమ శాస్త్రాలు , వాటి నియమాలు హఠాత్తుగా మారిపోయాయా ? మహాసంప్రోక్షణ , కుంభాభిషేకాలు 12 ఏళ్ల కొకసారి రివాజుగా జరిగేవే కదా? వాటికంటూ అనాదిగా పాటిస్తున్న  విధివిధానాలు అంటూ కొన్ని ఉన్నాయి కదా ? 1994 లో ,2006 లో ఇలాగే వారం పాటు గుడి మూసేశారా? విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అప్పుడు ఆపేశారా?

      ఏ గ్రహణాల రోజునో కొన్ని గంటలు తప్ప ఏకంగా ఆరు రోజులు పైగా భక్తులకు దర్శనం నిరాకరించడం ఈ శతాబ్దకాలంలో ఎన్నడైనా జరిగిందా? అటువంటి తీవ్ర నిర్ణయం ఎవరి నడిగి , ఏ పెద్దలను సంప్రదించి చేశారు?    రాజకీయ పలుకుబడి తో పదవులు తెచ్చుకున్న శాల్తీలకు పూజలు , క్రతువులకు సంబంధించి తలచిందే తడవుగా ఆగమపరమైన కీలక.నిర్ణయాలు ఏకపక్షంగా చేసే అధికారం ఉందా? వారు గుప్పెట్లో పెట్టుకున్న అర్చకుల చేత తల ఊపిస్తే సరిపోతుందా?

      ఆగస్టు 11 న అంకురార్పణ అయితే 9 నుంచే క్యూ గేట్లు ఎందుకు మూస్తున్నారు? దర్శనానికి 48 గంటలు పట్టేంత క్యూ 9 న  ఉంటుందని నడమంత్రపు పెత్తందారులకు ముందే తెలుసా? క్యూలో మిగిలిన భక్తులకు అంకురార్పణ తరవాత గతంలో వలె  దర్శనం చేయించకూడదా?  మునుపటి కంటే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందన్న సాకుతో మొత్తం దర్శనాలను టోకున ఎందుకు ఎత్తేశారు? పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులు గాని , విఐపీ బ్రేక్ ల వాళ్ళు గానీ చూడకూడనంతటి రహస్య కార్యకలాపాలు ఆ రోజులలో ఏమి జరపబోతున్నారు?

        అన్నట్టు ఆ ఆరు  రోజులు సి.సి. కెమెరాలను కూడా కట్టేస్తారంటున్నారు - నిజమేనా? సి.సి. కెమేరాల కళ్లు కూడా మంచివి కావని పుట్టాగారి ఆగమ శాస్త్రం చెప్పిందా? లేక .. కెమెరాలకు చిక్కితే ప్రమాదం అయిన సాహస కార్యాలేవైనా కొత్త శ్రీవార్లు  కూడబలుక్కుని చేయబోతున్నారా?

         జగమొండి సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టులో దుంప తెంచే పిల్ వేయబోతున్నట్టు ప్రకటించిన వెను వెంటనే గుడి ని వారం పాటు మూసి , ఇంకేవో "పనులు " రహస్యంగా చేసుకోవాలని వివాదాస్పద మైన కొత్త బోర్డు హుటాహుటిన నిర్ణయించడం కాకతాళీయమనే అనుకోవాలా?

 
           చేతిలో అధికారం ఉన్నది .కాబట్టి...   మాకు వేరే జరూరు పనులు ఉన్నందున ఫలానా తేదీలలో దర్శనాలన్నీ బంద్ - అని జస్ట్ మూడు వారాల ముందు ఆర్డర్ వేశారు. చాలా బాగుంది! కానీ ఆ తేదీలలో తిరుమల వెళ్లాలని చాలా నెలల కింద ప్లాన్ చేసుకుని , ఆన్ లైన్ లో దర్శనం, సేవల టిక్కెట్లు  కొనుక్కుని, ప్రయాణానికి, బసకూ అన్ని ఏర్పాట్లు చేసుకున్న భక్తుల కుటుంబాలు ఈ ఆకస్మిక నిరంకుశ నిర్ణయం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతారు? ఆ కష్టనష్టాలకు పరిహారం ఎవరు చెల్లిస్తారు?

            ఇంతకీ మన పేరు గొప్ప పీఠాధిపతులు, ధర్మాచార్యులు  ఏమంటారు? టి. టి .డి . తో మొగమాటాలను వదిలి పెట్టి , వారు ఇలాంటి అనాచారాలను , అపచారాలను, అవకతవకలను ఎప్పటికయినా పట్టించుకోగలరా?

               సెక్యులర్ బి.జె.పి.కి హిందువుల సమస్యలు ఎలాగూ పట్టవనుకోండి! నిస్తేజమైన హిందూ మత సంస్థలలోనైనా ఇప్పట్లో  చలనం వచ్చేనా?

Saturday 14 July 2018

మన రూటే వేరు !

పెక్యులరిజం - 4

.........

ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.........
సెక్యులర్‌ వ్యవస్థలో అన్ని మతాలనూ సమానంగా చూసే తీరాలా? ఒక మతానికి ప్రత్యేక గౌరవస్థానం ఇచ్చి మిగతా మతాలను కొంచెం తక్కువగా చూస్తే తప్పా? తప్పేమీ లేదు. సెక్యులర్‌ రాజ్యం ఇలాగే ఉండాలి, అందులో మతాల ప్రమేయం లేక ప్రాముఖ్యం ఈ రకంగానే ఉండి తీరాలన్న నిబంధన ఎక్కడా లేదు. సెక్యులర్‌ దేశాల్లో మతాల హెచ్చుతగ్గులు ఉన్న దృష్టాంతాలు కావలసినన్ని. 'ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌' ఇంగ్లాండులో ఆధికార మతం. దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయించబడ్డాయి. Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యు.కె.) లో ఇంగ్లాండుతో బాటు ఉత్తర ఐర్లండ్‌, వేల్స్‌, స్కాట్లండ్‌లు కూడా చేరి ఉన్నాయి. అక్కడ వేరే చర్చిలది ప్రాబల్యం. అయినా సరే - 'ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌'కు చెందిన ఈ 26 మంది Lords Spiritual లు మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి సంబంధించిన తీర్మానాల మీద ఓటు చేయగలరు. సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు.(కింది బొమ్మ చూడండి )


    బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్‌మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు. దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రాటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ, దాని సిద్ధాంతాన్నీ, పూజా విధానాన్నీ, క్రమశిక్షణను, చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు.

    అర్జంటీనా సెక్యులర్‌ దేశమే. అక్కడ అధికారిక మతమంటూ ఏదీ లేదు. కాని ఆ దేశ రాజ్యాంగం సెక్షన్‌ 2 ప్రకారం 'ఫెడరల్‌ గవర్నమెంటు రోమన్‌ కాథలిక్‌ అపోస్తలిక్‌ మతాన్ని సపోర్టు చేస్తుంది'.

    'మలేసియా అధికారిక మతం ఇస్లాం. కాని ఇతర మతాలను కూడా పౌరులు అనుసరించవచ్చు' అంటుంది మలేసియా రాజ్యాంగం.

The Republic of Srilanka shall give to Buddhism the foremost place, and accordingly it shall be the duty of the State to Protect and foster the "Buddha Shasana" (శ్రీలంక రిపబ్లిక్‌ బౌద్ధ మతానికి ప్రప్రథమస్థానం ఇస్తుంది. 'బుద్ధ శాసనా'న్ని రక్షించటం, పోషించటం రాజ్య బాధ్యత) అని చాటుతుంది శ్రీలంక రాజ్యాంగం.

     అలాగే 'థాయ్‌ ప్రజల్లో అత్యధికులు అనుసరించే బౌద్ధ మతాన్ని సంరక్షించి, ప్రోత్సహించటం ప్రభుత్వ కర్తవ్యం' అని థాయ్‌లాండ్‌ రాజ్యాంగం స్పష్టం చేస్తుంది.

     రుమేనియాలో మత స్వాతంత్య్రం ఉంది. కాని 'ఆర్థోడాక్స్‌ చర్చి'కి ప్రభుత్వ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు. జార్జియా రాజ్యాంగం మత స్వాతంత్య్రానికి గ్యారంటీ ఇస్తుంది. కాని 'జార్జియన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి'కి ప్రత్యేక ప్రతిపత్తినిస్తుంది.

     ఫిన్లాండ్‌ తాను సెక్యులర్‌ అంటుంది. కాని అక్కడి ఎవాంజలికల్‌ లూథరన్‌ చర్చ్‌, ఫిన్నిష్‌ అర్థోడాక్స్‌ చర్చిలకు చర్చ్‌ టాక్స్‌ను రాబట్టే అధికారం ఉంది. ఆ దేశంలో వ్యాపార సంస్థలు కూడా చర్చ్‌కి పన్ను చెల్లిస్తాయి. ఆయా చర్చ్‌లలో సభ్యులైన పౌరులనుంచి వ్యక్తిగతంగా వసూలు చేసే పన్నుగాక, ప్రైవేటు కంపెనీల నుంచి రాబట్టే సొమ్మును ప్రభుత్వం రెండు ఆధికారిక చర్చ్‌లకూ పంచుతుంది.

      అదేవిధంగా ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, ఐస్‌లాండ్‌, ఇటలీ, స్వీడన్‌, స్విట్జర్లండ్‌ వంటి దేశాల్లోనూ చర్చ్‌టాక్స్‌ వసూలు చేస్తున్నారు.

     ఈ ఉదాహరణలను బట్టి అర్థమయ్యేదేమిటంటే - అఫీషియల్‌ మతం అంటూ దేన్నీ పేర్కొనకపోయినా, కొన్ని మతాలకు ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక హక్కులు ఇచ్చి పెద్దపీట వేయటం ప్రపంచంలో చాలా దేశాల్లో రివాజు.

     మరి వాటికీ, మన సంకర సెక్యులరిజానికీ తేడా ఎక్కడ?

     ఇంగ్లాండ్‌లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అయినా, అర్జంటీనాలో రోమన్‌ కాథలిక్‌ అయినా, రుమేనియా జార్జియాల్లో ఆర్థోడాక్స్‌ చర్చ్‌ అయినా, డెన్మార్క్‌, జర్మనీ, ఇటలీ, స్వీడన్‌, తదితర ఐరోపా దేశాల్లో వేరువేరు చర్చిలు అయినా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లో బౌద్ధం అయినా ఆయా దేశాల్లో మెజారిటీ ప్రజలకు విశ్వాసం ఉన్న మతాలు! దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే మతాలకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ప్రాధాన్యం ఇవ్వటం సమంజసమే, ప్రజాస్వామ్యబద్ధమే.

     ఆచరణలో లోకమంతటా అనుసరిస్తున్న ఈ సాధారణ సూత్రాన్ని ఇండియాలోనూ మన్నించదలిస్తే ఈ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ మతానికి గౌరవస్థానం ఇవ్వాలి. దాని ప్రయోజనాల రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మనం చేసిందేమిటి?

     'ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి' అన్నట్టు ప్రపంచంలో మన రూటే వేరు. 20 శాతానికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలను నెత్తిన పెట్టుకుంటాం. ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు ఉదారంగా సమకూరుస్తాం! ప్రజల్లో నూటికి 80 మందికి విశ్వాసం ఉన్న అతిప్రధాన, అతి పెద్ద మతాన్ని మాత్రం కాళ్లకింద తొక్కేస్తాం. మిగతా ప్రపంచ దేశాలు ప్రధాన మతానికి ప్రత్యేక గౌరవం ఇస్తూ అనుకూల వివక్ష చూపుతూంటే మనం మాత్రం ప్రధాన మతాన్ని ప్రత్యేక అగౌరవం చేస్తూ, శాయశక్తులా సతాయిస్తూ ప్రతికూల వివక్షను కనపరుస్తున్నాం.

      ఈ విచిత్ర మనస్తత్వం మనకు ఎవరి నుంచి సంక్రమించింది? ఈ వికృత వంకర అవ్యవస్థ ఎలా వచ్చి పడింది? పైకి సెక్యులరిజం కొంగజపం చేస్తూనే కరకు మతతత్వాన్ని పెంచిపోషించి, జాతి మూలాలను వేటువేసే నికృష్ఠ రాజకీయ సంస్కృతి ప్రాచీన భరత భూమికి ఎలా దాపురించింది?

      దీన్ని అర్థం చేసుకోవాలంటే మొదట సెక్యులరిజం అనేది ఏ పరిస్థితుల్లో ఎలా పుట్టిందన్నది గమనించాలి. అసలు భావన ఏమిటో తెలిస్తేగానీ దానిని మన మహానుభావులు ఎలా భ్రష్ఠు పట్టించారన్నది తేటపడదు.

     క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ ఐరోపా దేశాలలో క్రిస్టియన్‌ చర్చికీ, రాజ్య వ్యవస్థకూ నడుమ గట్టి బంధం ఉండేది. ప్రతి దేశంలోనూ క్రైస్తవానికి శాఖ అయిన ఏదో ఒక చర్చితో అక్కడి ప్రభుత్వానికి లంకె ఉండేది. ప్రభుత్వం అనేది చర్చి యొక్క సెక్యులర్‌ అంగంగా వర్ణించబడేది. పవిత్ర రోమన్‌ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది మొదలుకొని చర్చి ఆధిపత్యం కొత్తకొత్త రాజ్యాలకు విస్తరించడానికి ప్రభుత్వాలు తోడ్పడేవి. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రభువులు చేసే దుర్మార్గపు దండయాత్రలకూ, జయించిన కొత్త ప్రాంతాల్లో విచ్చలవిడి దోపిడీలకూ, రాక్షస కృత్యాలకూ చర్చి వత్తాసునిచ్చేది. దానికి ప్రతిఫలంగా సమాజంలో చర్చిని ధిక్కరించే పౌరులను పరమకిరాతంగా పీడించి, చిత్రవధ చేసే పుణ్యకార్యాన్ని ప్రభుత్వాలు చేసిపెట్టేవి. వందేళ్ల యుద్ధాలు, రెండొందలు ఏళ్ల యుద్ధాలు అంటూ 'ఏకైక సత్యమతాన్ని' వ్యాప్తి చేసే నెపంతో మతం, రాజ్యం కుమ్మక్కయి యూరప్‌లో ఎన్ని ఘాతుకాలు చేశాయో, సామూహిక జన సంహారాలకు ఎలా పాల్పడ్డాయో, అవిశ్వాసులు, మంత్రగత్తెలు విగ్రహారాధకులు, అన్న అభియోగాలతో ఎన్ని లక్షలమందిని సజీవంగా తగలబెట్టి, దారుణంగా పొట్టన పెట్టుకున్నాయో నెత్తురు ఏరులుగా పారిన ఐరోపా అంధయుగ అంధకార చరిత్ర చెబుతుంది.

     పౌరుల ప్రాపంచిక జీవితాన్ని పర్యవేక్షించి, కంట్రోలు చేయడం మాత్రమే కాదు! పైలోకంలో వారికి ముక్తిని కలిగించటమూ ప్రభుత్వ బాధ్యతేనట! ఆ ముక్తికి కీలకమేమో చర్చి చేతుల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు చర్చి ప్రకటించే ప్రవర్తన నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా, ఎదురు తిరిగినా వారిని వెలివేసి, స్వర్గలోకపు గేట్లను వారికి చర్చ్‌ మూసేస్తుంది. ఆ తరువాత వారిని సజీవదహనం చెయ్యటమా, చిత్రహింసలు పెట్టి ఖైదు చేయటమా, చిత్రవధ చేయటమూ అనేది రాజ్యవ్యవస్థ బాధ్యత. అదేవిధంగా క్రీస్తును చంపిన పాపాత్ములు అని చర్చి ముద్రపడిన యూదులను, చర్చి జులుంను అంగీకరించని ఇతర వర్గాలను వేటాడటం, భయానక అఘాయిత్యాలకు గురిచేయటం ఏలినవారి డ్యూటీ. ఆ ప్రకారం చర్చి సేవ చేసి, అన్యమతాలను నిర్మూలించడంలో సహాయపడినంత వరకూ రాజులు ఎన్ని మహాపాపాలకు ఒడిగట్టినా చర్చి సమర్థించేది.

     క్రైస్తవంలోకి బలవంతంగా మార్చబడని ప్రాంతాలు, సమూహాలు ఐరోపాలో మిగిలినంతవరకూ చర్చికీ, రాజ్యానికీ మధ్య అపవిత్ర బంధం ఉభయ తారకంగా కొనసాగింది. క్రైస్తవేతరులను ఊచకోత కోయడానికి, దారుణంగా హింసించి బలవంతంగా క్రైస్తవంలోకి మార్పించడానికి రాజులు కత్తులు దూశారు. నరకలోకపు అగ్నికుండాల నుంచి 'పాగన్ల'ను రక్షించడానికీ, వారి ఆత్మలను ఉద్ధరించడానికే అదంతా చేస్తున్నట్టు వారు బుకాయించేవారు. 'గొప్ప పని చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు' అని క్రైస్తవ మత గురువులు శ్లాఘించేవారు. ఇలా రాజరికమూ, క్రైస్తవమూ చేతులు కలిపి తమ ప్రాబల్యాన్ని, సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయే క్రమంలో ఘర్షణలు తలెత్తేవి. విరోధం కన్నా సహకారం శ్రేయస్కరం. కాబట్టి తాత్కాలిక సంక్షోభాలను ఏదో ఒకటి చేసి గట్టెక్కేవారు.

     15వ శతాబ్దం చివరికల్లా మొత్తం ఐరోపా క్రైస్తవమయం అయిపోయింది. తమ అధికారాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చర్చితో అవసరం రాజులకు తీరింది. చర్చి కబంధ హస్తాల నుంచి బయటపడాలన్న ఆరాటం రాజ్యానికి మొదలైంది. 16వ శతాబ్దంలో చర్చిపై తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. క్రిస్టియానిటీ అనేక తెగలు (ూవష్‌ర) గా చీలిపోయింది. సంస్కరణ పేర చీలిపోయిన తెగలు మరీ దుర్మార్గంగా చెలరేగాయి. ఒకదేశంలో ప్రభుత్వం ఒక క్రైస్తవ తెగ కొమ్ముగాసి వేరొక తెగను క్రూరంగా అణచివేస్తే.. ఆ వేరొక తెగను ఇంకో రాజ్యం ఆదరించి, దానికి గిట్టని తెగను వేటాడేది. దాంతో యూరోప్‌ ఖండం అంతటా మతం పేరిట భయానక రక్తపాతం జరిగింది. దేశాల నడుమ మత యుద్ధాలు ముమ్మరమయ్యాయి.

     అదృష్టవశాత్తూ ఆ కాలపు యూరోపియన్‌ మేధావులకు, తత్వవేత్తలకు గ్రీస్‌, ఇండియా, చైనా దేశాల ప్రాచీన సంస్కృతులతో పరిచయం కలిగింది. ఆ విశిష్ట నాగరికతలలోని మానవతావాదం, హేతువాదం, విశ్వజనీన దృక్పథం వారిని గాఢంగా ప్రభావితం చేశాయి. క్రిస్టియానిటీలో జడలు కట్టిన మూఢత్వం మీద, దాని అభివృద్ధి నిరోధక, అశాస్త్రీయ, అనాగరిక పోకడల మీద బుద్ధిజీవులు తిరగబడ్డారు. తర్క పరీక్షకు నిలబడే దమ్ములేక, మూఢత్వపు చీకట్లను చీల్చిన జ్ఞాన, విజ్ఞాన వెలుగు పుంజాలకు తాళలేక మహామూర్ఖ, మహాక్రూర క్రైస్తవం కుప్పకూలింది. 18 వ శతాబ్దం ఆఖరులో ఫ్రెంచి విప్లవంతో క్రైస్తవ మతాధిపత్య పతనం వేగం పుంజుకుంది.

     ఇదీ యూరప్‌ ఖండంలో సెక్యులరిజం ఆవిర్భావానికి నేపథ్యం. 19వ శతాబ్దంలో ఐరోపాలోని ప్రతిదేశం చర్చి భల్లూకపు పట్టునుంచి బయటపడింది. పరలోకంలో పౌరుల ఆత్మలకు ముక్తికోసం ప్రభుత్వం పాటుపడాల్సిన పనిలేదు. ఎవరి ముక్తి సంగతి వారు ఆలోచించుకోగలరు. ప్రాపంచిక వ్యవహారాలు సజావుగా నడిచేటట్టు, సమాజపు కట్టుబాట్లు సరిగా ఉండేటట్టు, ప్రజల అవసరాలు తీరేటట్టు, శాంతిని, భద్రతను రాజ్యం కాపాడితే చాలు. రాజ్యవ్యవస్థ మీద మత జోక్యానికి వీలులేదు. ఈ నూతన ఆలోచనాధార ఆసరాతో చర్చి బంధనాలను తెంచుకొని కొత్తరూపు, కొత్త చూపు సంతరించుకున్న రాజ్యవ్యవస్థకు 'సెక్యులర్‌ స్టేట్‌' అని పేరు. మతం, రాజ్యం వేరువేరు; దేని దారి దానిది, దేని కార్యక్షేత్రం దానిది అన్న నవీన పాశ్చాత్య చింతనకు 'సెక్యులరిజం' అని వాడుక.

Friday 6 July 2018

మతాన్ని బట్టి చట్టం !

పెక్యులరిజం - 3

 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...........................

     ఎప్పుడైతేనేమి, ఎలాగైతేనేమి - ఎమర్జన్సీ చిమ్మచీకటిలో 'సెక్యులర్‌' పదం భారత రాజ్యాంగ పీఠికలోకైతే ఎక్కింది కదా ! కాబట్టి రాజ్యాంగరీత్యా మనది సెక్యులర్‌ రాజ్యం కాదా?

      కాదు. ఇంటి ముందు 'బృందావనం' అనో 'శాంతి నికేతన్‌' అనో ఫలకం వేసినంత మాత్రాన ఆ ఇల్లు బృందావనం కాదు. అచ్చమైన శాంతినికేతనమూ అయిపోదు. రాజ్యాంగ పీఠికలో 'సెక్యులర్‌' పదం చేరినంత మాత్రాన మనది సెక్యులర్‌ రాజ్యాంగమూ ఆటోమేటిగ్గా అయిపోదు.

     ఎందుకంటే సెక్యులర్‌ రాజ్యానికీ, రాజ్యాంగానికీ కొన్ని లక్షణాలు కంపల్సరీగా ఉండాలి. రాజ్యానికీ, మతానికీ మధ్య, కచ్చితమైన విభజన రేఖ ఉండాలి. రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం, లేక మత ప్రభావం ఉండకూడదు. ఎవరి మతం ఏమైనా చట్టాలు మాత్రం పౌరులందరికి సమానంగా వర్తించాలి. శాసనాలకు సంబంధించినంతవరకూ రాజకీయ అధికారం మతాలకు కాక రాజ్యానికే ఉండాలి. ఇతర విధాల తేడాపాడాలు ఎన్ని ఉన్నా ప్రపంచంలో సిసలైన సెక్యులర్‌ దేశాలు అనుకొనబడేవి అనుసరిస్తున్న పంథా ఇది.

      మరి మనదేశంలోనో ? కొన్ని పాశ్చాత్య దేశాలలో లాగా రాజ్యవ్యవహారాల నుంచి మనం మతాన్ని పూర్తిగా వేరు చేయం; అన్ని మతాలను సమానంగా చూస్తాం; మతాల విషయంలో తటస్థంగా ఉండటమే మన విధానం అని మహానేతలు చెబుతారు. చట్టం ముందు అందరూ సమానులు అనీ; చట్టాలు, రాజ్యాంగ సూత్రాలు పౌరులందరికీ సమానంగా వర్తించాలనీ మన రాజ్యాంగం ఘోషిస్తుంది. మంచిదే. కాని ఆచరణలోనో ?

      అందరూ సమానులే అయినప్పుడు కోడ్‌ ఆఫ్‌ లా అనేది పౌరులందరికీ కలిసి ఒకటే ఉండాలి కదా? మన దేశంలో మాత్రం అలా ఉండదు. దాని దగ్గరికి వచ్చేసరికి మతాల ప్రసక్తి వస్తుంది. మతాల తారతమ్యం కనిపిస్తుంది. పెళ్లి, విడాకులు, వారసత్వ హక్కులు, మనోవర్తి వగైరాల విషయంలో 'పర్సనల్‌ లా' లు ఆయా వ్యక్తుల మతాన్ని బట్టి మారతాయి. మహమ్మదీయ పౌరులకు షరియా ఆధారమైన ముస్లిం పర్సనల్‌లా వర్తిస్తుంది. ముస్లిం పర్సనల్‌లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్‌ అనే 1937 నాటి బ్రిటిషు కాలపు చట్టమూ, 1939లో తెల్లవాడు పెట్టిన 'డిజల్యూషన్‌ ఆఫ్‌ ముస్లిం మారేజస్‌ యాక్ట్‌' స్వతంత్ర భారతానికి సొంత రాజ్యాంగం అమరిన ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా మహమ్మదీయుల విషయంలో ఇంకా చెల్లుబాటు అవుతున్నాయి. ఎప్పుడో 1950ల్లోనే పార్లమెంటు పౌరులందరికి కలిపి రూపొందించిన సివిల్‌ కోడ్ హిందువులకు, క్రైస్తవులకు, ఇంకా ఇతర మతాలకే తప్ప ముస్లింలకు మాత్రం వర్తించడం లేదు. వారి దగ్గరికి వచ్చేసరికి పార్లమెంటు చేసిన చట్టం బలాదూరు. మతం నిర్దేశించే న్యాయానికి మాత్రమే చెల్లుబాటు.

     బాల్య వివాహం, బహుభార్యాత్వం, ఏకపక్షంగా విడాకులు వంటివి ఒక మతం వారు పాల్పడితే న్యాయబద్ధం. అదే పని వేరే మతాలవారు చేస్తే శిక్షార్హమైన నేరం. మహమ్మదీయుడు ఎన్నిపెళ్ళిళ్లయినా చేసుకోవచ్చు. హిందువులకేమో భార్య ఉండగా మారుమనువు చట్టరీత్యా నిషిద్ధం. మతాన్ని బట్టి న్యాయం మారేటప్పుడు చట్టం ముందు పౌరులందరూ సమానమన్న సెక్యులర్‌ సూత్రం ఏమైనట్టు?

      చట్టం ముందు అందరూ సమానులేకాని మహమ్మదీయులు మాత్రం ఎక్కువ సమానులా? వారు మాత్రం రాజ్యశాసనాలను పక్కకు బెట్టి తమ మతాచారం ప్రకారం నడచుకోవచ్చా? ఇది ముస్లింల పట్ల పక్షపాతం, ఇతర మతాల పట్ల అనుచిత వివక్ష కాదా? మతాచారాలు ముస్లింలకు మాత్రమే ఉన్నాయా? ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మ సూత్రాలు హిందూ మతానికి లేవా? హిందువుల్లో మాత్రం బహు భార్యాత్వం ఎప్పటి నుంచో లేదా?

       హిందువులు పూజించే దేవుళ్లకే పలువురు భార్యలు ఉన్నారు. ఇద్దరేసి, ముగ్గురేసి భార్యలు ఉండటం హైందవ గృహస్థులకు వేల సంవత్సరాలుగా పరిపాటే. బహుభార్యాత్వాన్ని హిందూ ధర్మశాస్త్రాలూ సమ్మతించాయి. ఇదిగో - ఇలాంటి సబబులు చూపించి తమకు బాహుభార్యాత్వం వెసులుబాటు కావాలని ఎవరైనా హిందువులు అడిగితే సభ్య సమాజం అంగీకరిస్తుందా?

      మతాచారాలు, సంప్రదాయాలు, నాగరిక నడవడికి విరుద్ధంగా ఉన్నట్టయితే వాటిని తప్పనిసరిగా మానేసి, ఆధునిక సమాజానికి అనుగుణ్యమైన శాసనాలకు లోబడి తీరాలని హిందువుల విషయంలో కట్టడి చేశారు. బాగానే ఉంది. మరి అదేవిధమైన కట్టుబాటు మహమ్మదీయులకు మాత్రం వద్దా? మన కపట రాజకీయుల దృష్టిలో ముస్లింలు ప్రత్యేక తరగతి పౌరులా? వారు చట్టానికి అతీతులా?

     నేరాలకు సంబంధించిన క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ దేశమంతటికీ కలిపి ఒకటే ఉన్నప్పుడు పెళ్లీ పెటాకులూ, ఆస్తి హక్కులు, వారసత్వాల్లాంటి సివిల్‌ వ్యవహారాలకూ సివిల్‌ కోడ్‌ ఒకటే ఉండాలి. భారత రాజ్యాంగానికి డెబ్భై వసంతాలు నిండవస్తున్నా కామన్‌ సివిల్‌ కోడ్‌ అనేది ఆకాశ కుసుమంగానే మిగిలింది. బుల్లి రాష్ట్రమైన ఒక్క గోవాలోనే సివిల్‌ కోడ్‌ మత ప్రసక్తి లేకుండా పౌరులందరికీ సమానం. అక్కడ ఎప్పటినుంచో ఎంచక్కా అమలు అవుతున్న కామన్‌కోడ్‌ను విశాల దేశంలో మాత్రం ఎందుకు అమలు పరచలేము? దానికి రాజకీయ దృఢ సంకల్పం, రాజకీయ పార్టీలకు కాస్తంత వివేకం, ప్రభుత్వాలకు కొంచెం చేవ, చొరవ కావాలి. ఎటొచ్చీ అవే మనకు కరవు.

      ఒక జాతికి చెందిన ప్రజలు ఒకేరకమైన శాసనాల కింద జీవించనవసరం లేదంటే.. వివిధ వ్యక్తులకు సంబంధించి చట్టాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు ఏ మతానికి చెందినవారన్న దానిని బట్టి ఉంటే అది సెక్యులర్‌ వ్యవస్థ అనిపించుకోజాలదు. అలాగే నిజమైన సెక్యులర్‌ వ్యవస్థలో రాజకీయాలపైన, ప్రభుత్వంపైన, పబ్లిక్‌ పాలసీ పైన, సాంఘిక వ్యవస్థల మీద, విద్యావిధానం మీద, ఉపాధి కల్పన మీద మతాల నీడ పడనేకూడదు. కాని మనదేశంలో మతం పేరుతో పార్టీలుంటాయి. పేరులోనే 'ముస్లిం', 'క్రిస్టియన్‌' లాంటి పదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. చట్ట సభలకూ ఎన్నికవుతుంటాయి. (ఇప్పుడు ఉనికి లేదుగాని, ఒకప్పుడు హిందూ మహాసభ అని హిందువుల పార్టీ ఉండేది.)

      మత పార్టీలను అనుమతించినప్పుడు మత రాజకీయాలూ, మత దుష్ప్రభావాలూ వాటి వెనువెంటే ఉంటాయి. బిజెపిని హిందూ పార్టీగా ముద్రవేసి, అంటరానిదిగా చూసే సెక్యులర్‌ నిష్ఠాపరులు కల్తీలేని కమ్యూనల్‌ అయిన ముస్లింలీగు లాంటి పార్టీలతో కొంగుముడి వేసుకోవటానికి ఎప్పుడూ వెనుకాడరు. సంకీర్ణ ప్రభుత్వాలకు ఆ పార్టీల మద్దతుకు ప్రతిఫలంగా జిల్లాలను చిందర వందర చేసి ముస్లిం మెజారిటీ గల మలప్పురం లాంటి జిల్లాలను ఏర్పరచి మతతత్వానికి దాసోహమనడానికీ మన రాజకీయ నేతాశ్రీలు ఎంతమాత్రం జంకరు. అదేవిధంగా జాతిభవితకు ప్రాణప్రదమైన విద్యావ్యవస్థలోనూ దిక్కుమాలిన ఓట్ల లబ్దికోసం మతాల చిచ్చుపెట్టటంలో మన రాజకీయ జీవులవి అందె వేసిన చేతులు.

       దేశంలో నూటికి 80% మంది హిందువులని అధికారిక గణాంకాలు చెబుతాయి. ఆ హిందువులు మతం లేనివారా? వారిది అనాగరిక, ఆదిమ జాతి మతమా? కాదు. హైందవం ప్రపంచంలోకెల్లా గొప్పమతం, ప్రపంచంలో కెల్లా గొప్పధర్మం, ప్రపంచంలోకెల్లా గొప్ప జీవన విధానం అని, ప్రపంచంలోని దేశదేశాల మహాజ్ఞానులు, మహామేధావులు ఎన్నో శతాబ్దాలుగా కొనియాడుతున్నారు. వేద విజ్ఞానం, భారతీయ శాస్త్రం, హైందవ తత్వం, సారస్వతం, సాంస్కృతిక వైభవాల లోయలను, ఎత్తులను లీలగానైనా పోల్చుకోవటానికి పాశ్చాత్య దేశాల్లో విస్తృత పరిశోధనలు, సమగ్ర అధ్యయనాలు తరతరాలుగా సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు లాంటి ఎన్నో దేశాలు యూనివర్సిటీల్లో హిందూమతాన్ని ఎప్పటినుంచో బోధిస్తున్నారు. దాని తాత్త్విక, వైజ్ఞానిక, శాస్త్ర పౌరస్వతాల మీద క్షుణ్ణంగా రిసెర్చిలు చేయిస్తున్నారు.

      మరి - నిఖిల జగతికి వెలుగుదారులు చూపిన హైందవానికి దాని సొంతగడ్డ మీద ఉన్న విలువ ఎలాంటిది? స్వదేశంలో దాని అధ్యయనానికి ఇస్తున్న ప్రాముఖ్యం ఏపాటిది? జాతికి సిగ్గుచేటు ఏమిటంటే హిందూ దేశంలో హిందూ మతానికి, హిందూ తత్వానికి పూచికపుల్లపాటి విలువ లేదు. సెక్యులర్‌ గంతలు తగిలించుకున్న మన ప్రభుత్వాల, పాలక వర్గాల దృష్టిలో హిందూ మతం గడ్డిపోచతో సమానం. తెల్లవాళ్లు ఏలిన కాలంలో కనీసం పాఠశాలల్లో హైందవ ధర్మానికి, హైందవ వీరులకు హిందూ ఇతిహాస పురాణాలకు సంబంధించిన పాఠాలను అనుమతించారు. హిందూ కాలేజీలను, హిందూ యూనివర్సిటీలను ప్రోత్సహించారు. తెల్లవాళ్లు పోయి దేశీయ ప్రభువులు వచ్చాక పరిస్థితి నానాటికీ దిగజారింది. స్వతంత్రం తరువాత తొలి దశాబ్దాల్లో 'రామాయణ, భారత, భాగవతాల పాఠాలను, హిందూ దేశ పవిత్రతను కొంతలో కొంతైనా పిల్లలకు బోధించనిచ్చేవారు. 1976లో ఇందిరమ్మ 'చేతబడి'తో దిక్కుమాలిన సెక్యులరిజం వచ్చిపడ్డాక ఆ పాఠాలు అటకెక్కాయి.
 హిందూ మతం, హిందూ చరిత్ర, విద్యార్థులకు ఎంతమాత్రమూ నేర్పుకూడని నిషిద్ధ పదార్థాలు అయ్యాయి. దేశంలో వందల సంఖ్యలో ఉన్న యూనివర్సిటీల్లో ఏ ఒక్కదానిలోనూ హిందూ మత అధ్యయనానికి ప్రత్యేక విభాగమంటూ లేదు.

       మన సెక్యులర్‌ ప్రభువుల దృష్టిలో మతం అశాస్త్రీయం కాబట్టి విద్యాసంస్థల్లో మత అధ్యయనాన్ని నిషేధించారేమో అనుకుందామా? చచ్చుదో పుచ్చుదో ఒక విధానమంటూ పెట్టుకొన్నప్పుడు అన్ని మతాల పట్ల ఒకే వైఖరి చూపాలి కదా? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?

       హిందూ మత పాఠశాలలను ఎంతమాత్రమూ దగ్గరికి రానివ్వని సెక్యులర్‌ సర్కార్ల వారు ఇస్లామిక్‌ మత పాఠశాలలను మాత్రం అక్కున చేర్చుకుంటున్నారు. హిందూ పాఠశాలలకు పైసా విదల్చని పాలకులు ముస్లిం మదరసాలకు మాత్రం ఉదారంగా డబ్బులిస్తున్నారు. మహమ్మదీయ మతబోధలను పిల్లలకి యధేచ్చగా బోధించటానికి, ముస్లిం ఫండమెంటలిజాన్ని నూరిపోయటానికి గవర్నమెంటు వారు సర్వవిధాల సహాయపడుతున్నారు. మతసంస్థలను, విద్యను రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో చేర్చినందువల్ల హైందవేతర మతాలకు, వాటి విద్యా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి వరాలు ఇస్తున్నాయి. మదరసాలలో, ఉన్నత విద్యాసంస్థలలో ఇస్లామిక్‌ స్టడీస్‌ పేరుతో ఎంత అభ్యంతకరమైన, జాతి సమైక్యతకు, సమగ్రతకు మహాప్రమాదకరమైన విషయాలను బోధిస్తున్నా, జిహాదీల ఉత్పత్తి కేంద్రాలుగా అవి ఎన్ని వెర్రితలలు వేస్తున్నా ప్రభుత్వాలకు పట్టవు.

       ఎలాంటి పర్మిషన్లూ లేకుండా, అధికారుల ఆదేశాలను, హైకోర్టు తీర్పును కూడా లక్ష్యపెట్టకుండా అనుమానాస్పదమైన చరిత్రగల ఒక మహిళ తిరుపతిలో ఆరు అంతస్థుల ఇస్లామిక్‌ యూనివర్సిటీని చట్ట విరుద్ధంగా నెలకొల్పి, అడ్డగోలుగా నడుపుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికీ చలనం లేదు. కేంద్ర పోషణలో, దేశ ప్రజల సొమ్ముతో నడిచే అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ పేరుకు సెంట్రల్‌ యూనివర్సిటీ అయినా పక్కా మైనారిటీ సంస్థగా నడుస్తోంది. జాతి శత్రువైన జిన్నాను అక్కడ పటం కట్టి పూజిస్తారు. రంజాన్‌ మాసంలో మహమ్మదీయేతరులకు కూడా పగటిపూట తిండి పెట్టకుండా బలవంతపు ఉపవాసం చేయిస్తారు. మిగతా సెంట్రల్‌ యూనిర్సిటీల్లో వలె ఎస్‌.సి., ఎస్‌.టి.లకు అడ్మిషన్లు, రిక్రూట్‌మెంట్‌లలో రిజర్వేషన్లు అక్కడ అమలు కావు. అయినా అడిగే దిక్కు లేదు.

        మతాల, మతసంస్థల విషయంలో, మైనారిటీ విద్యాసంస్థలకు సంబంధించి మన వింత సెక్యులర్‌ విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి ఊసులు మరోసారి.


Wednesday 4 July 2018

ఎందుకు అరెస్టులు చెయ్యరు ?

      ఇంతకీ మనం ఉన్నది పాకిస్తాన్ లోనా ? వాటికన్ లోనా ? దేశం లో నూటికి 80 మంది ప్రజలకు ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడు అయిన శ్రీరామ చంద్ర మూర్తి మీద ఒక హేతువు ఎరుగని హేతువాది శుంఠ , పెంటలో పొర్లే ఒక ఏబ్రాసి వెధవ  దుర్భాషలు ఆడి కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిస్తే బాధ్యత గల ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు ? మత విశ్వాసాలు , సెంటిమెంట్లు హిందువులకు ఉండవా ? అన్యమతస్తులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చలించి చర్య తీసుకోవాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా  ? మత సామరస్యానికి, మత విశ్వాసాలకు భంగం కలిగించే వారిని శిక్షించేందుకు ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న సెక్షన్లను హిందువుల విషయం లో మాత్రం పాటించ నక్కర లేదని తెలంగాణా లో నిజాము వారసులు కొత్త నిబంధనను  ప్రవేశ పెట్టారా ? అన్య మతస్తులెవరైనా నొసలు ముడుస్తే చాలు Iగజగజ వణికి మెరుపు వేగం కదిలే పోలీసులు , వారి రాజకీయ బాసులు ఈ విషయంలో మాత్రం కనీసం అరెస్టు అయినా చేయకుండా  ఎందుకు చోద్యం చూస్తున్నారు ? దిక్కుమాలిన డిబేట్లతో వెధవలందరిని ఉసికొలిపి , అడ్డగోలుగా వాగించి హిందూ మతం మీద అశుద్ధపు ముద్దలు వేస్తున్న వెధవ చానెళ్ల మీద  చట్టరీత్యా ఎందుకు చర్య తీసుకోరు ?

      హిందువులంటే లెక్కలేని పార్టీలు, ప్రభుత్వాలు , పోలీసులు హిందువులకు కలిగిన తీవ్ర మనస్తాపాన్ని పట్టించుకోకపోవటాన్ని ఆమోదించక పోయినా కనీసం అర్థం చేసుకోవచ్చు .కానీ హిందువులంటే లెక్క ఉందనుకునే బి.జె.పి. వారికి ఏమయింది ? ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు ? హిందువుల గురించి మాట్లాడితే తాము  వెంపర్లాడే సెక్యులర్ గురింపు కు ఎక్కడ  మోసం వస్తుందోనని వారి భయమా ? మీడియా ప్రకటనలే తప్ప క్షేత్ర స్థాయిలో హిందూ ప్రజల పక్షాన బాహాటంగా పోరాడే ధైర్యం బి.జె.పి.కి పోయిందా ?