Wednesday 17 April 2024

చిన్న ఊరిలో గొప్ప గోపురం

 

గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామచంద్రుని విశిష్ట ఆలయం

దుర్గరాజు స్వాతి , జర్నలిస్టు

ఆంధ్రదేశంలో రామాలయం లేని ఊరు వుండదని నానుడి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న రామాలయం ఏదీ అంటే అందరూ  ఠక్కున చెప్పే పేరు భద్రాచలం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఆ ఆలయానికి అంతటి ప్రాశస్త్యం వుంది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రాలో పురాతనమైన ఒంటిమిట్ట రామాలయం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఆ రెండు ప్రధాన ఆలయాలలో లేని విశిష్ట శిల్ప సంపదతో అలరారుతున్న ఓ గొప్ప గోపురం వున్న రామాలయం ఒకటి ఓ చిన్న ఊరిలో ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. అది కూడా మన ఆంధ్రాలోనే ఉన్నదన్న విషయము మాకు కూడా ఈ మధ్యనే తెలిసి దానిని దర్శించుకుని వచ్చాము. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఆ విశేషాల్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 



    తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ అనే చిన్న ఊరిలో నెలకొన్న ఆ ఆలయం పేరు శ్రీ కోదండ రామచంద్ర మూర్తి దేవస్థానం.

   ఆలయ పరిధి దృష్ట్యా చూస్తే ఇది చిన్నదే అయినా దాని విశిష్టత అంతా అద్భుత శిల్ప సంపదతో అలరారుతున్న గొప్ప గోపురంలోనే ఇమిడి వుంది. 

       శ్రీరామచంద్రుని చుట్టూ అస్త్ర దేవతలు ప్రదక్షిణ చేయడం; దశరధుడు తన సతులు కౌసల్య,సుమిత్ర, కైకేయిలతో ఇరువైపులా నిలుచుని ఊయలలో నిదురిస్తున్న బాలరాముని ఆనందంగా తిలకించడం; విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా విల్లంబులు ఎక్కుపెట్టి రామలక్ష్మణులు మారీచ, సుబాహులతో యుద్ధం చేయడం; సీతారాముల కళ్యాణం;    అరణ్యవాసంలో రామాలక్షమణులు ఓ వృక్షం కింద సేదదీరడం; సీతాపహరణం, పక్కనే హనుమ ఆశీనుడై వుండగా వానరులంతా రామయ్యకు నమస్కరించడం; అశ్వాలు పూన్చిన రథాన్ని రామ లక్ష్మణులు ఎక్కబోవడం; వారధి నిర్మాణానికి వానర సైన్యం రామ శిలలను మోసుకు రావడం;  రావణ వధానంతరం సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవడం; సీతా సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు పయనమవడం ఇలా ఎన్నో రామాయణ ఘట్టాలను అద్భుత శిల్పాలుగా చెక్కి గొప్పగా గోపురాన్ని నిర్మించడం ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం రామాయణ ఘట్టాలే కాకుండా, నరసింహస్వామి హిరణ్యకశిపును వధించడం, సింహవాహిని కనకదుర్గమ్మ, సప్తాశ్వ రథమారూడుడయిన సూర్యభగవానుడు,   క్షీరసాగర మధనం, గీతోపదేశం వంటి ఇంకా అనేక ఘట్టాలను కూడా ఈ గోపురంపై చక్కగా చెక్కారు. 



కాల ప్రామాణికంగా చూసినా ఈ ఆలయానికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర వుంది. కీ.శే. శ్రీ ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే సోదరుల సంకల్పబలంతో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగింది. అదీ 1889లో రామ కోలల ప్రతిష్ఠాపనతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1934లో సీతారామ లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానంగా నామకరణం చేశారు. తదనంతరం 1948లో 160 అడుగుల ఎత్తులో తూర్పు గోపురం, 1956లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురం నిర్మించారు. మొత్తం పది అంతస్తులుగా నిర్మించిన ఈ గొప్ప గోపురంలో ప్రతి అంతస్తుకు చేరుకునేలా లోపలివైపు మెట్లను నిర్మించారు. ప్రతి అంతస్తులో ఓ గవాక్షం ఏర్పాటు చేయడంతో భక్తులు ఒక్కో అంతస్తు ఎక్కుతూ అక్కడ నుండి బాహ్య పరిసరాల్నింటినీ చూడవచ్చు. ఒక్కో అంతస్తూ ఎక్కుతున్నకొద్ది మనకు ఇంకా విశాలమయిన పరిధి కనబడుతూ ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. అంతేకాదు కొన్ని అంతస్తుల్లో మరికొన్ని విశేషాలు కూడా జోడించారు. అందులో  1975లో నిర్మించిన అద్దాల మందిరం ఒకటి వుంది. దీనిని ద్వారంపూడి వారసుడు రామచంద్రారెడ్డి గారు నెలకొల్పారు. అక్కడ నిలుచుని దేవతల విగ్రహాలను ప్రత్యేక భంగిమల్లో చూడడమే గాక మనం కూడా మన రూపాలను వివిధ ఆకృతుల్లో చూసుకుని వినోదించే ఏర్పాటు వుంది. అంటే అవి మ్యాజిక్ అద్దాలు కావడంతో అది మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. అలా ఒక్కో అంతస్తూ ఎక్కుతూ అక్కడ నుంచి కనబడే మేరకు శిల్ప సౌందర్యాలను ఆసక్తిగా తిలకించవచ్చు. 






ఈ ఆలయానికి కొద్దిపాటి భూములే వున్నా అక్కడ పనిచేసే అర్చకులకు ఇతర సిబ్బందికి ధర్మకర్తలే జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్నారు. అంతేకాదు ఇక్కడ నిత్యాన్నదానం కూడా నిర్వహించడం గమనార్హం. 

 ఇక ఆలయ సందర్శన వేళలు ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటలవరకు వుంటుంది. గోపురం అంతస్తులు ఎక్కి చూసే సమయం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే. 

ఈ ఆలయానికి సమీపంలోనే సూర్యభగవానుని ఆలయం కూడా వుండడం మరో విశేషం.

 ఇంత విశిష్టతలు వున్న ఆ ఊరిని దర్శించాలనే ఆకాంక్ష మీలో కూడా కలుగుతోంది కదూ. ఇక కదలండి మరి.


          

Thursday 15 February 2024

తెలుగువారి అదృష్టం....‌

  ఎం.వి.ఆర్.శాస్త్రి

   (2005 లో జి.వెంకట రామారావు గారురచించిన " ప్రధానిగా పి.వి." గ్రంథానికి నేను రాసిన ముందుమాట)



     పీవీ నరసింహారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం ; పీవీ దురదృష్టం.

     ఇటువంటి ప్రజా నాయకుడు ,ఇంతటి పండితుడు, మేధావి,  బహు భాషావేత్త, చెయితిరిగిన రచయిత, సంస్కరణశీలి ,దార్శనికుడు ,విశిష్ట పరిపాలకుడు వేరే రాష్ట్రంలోనో  ,వేరే దేశంలోనో  పుట్టి ఉంటే అక్కడి ప్రజలు నెత్తిన పెట్టుకుని పూజించేవారు .మరి మనమో..? ముఖ్యమంత్రి కావటానికి ముందూ తర్వాతా... ప్రధాని కావటానికి ముందూ తర్వాతా... జీవించి ఉండగా, మరణించిన తర్వాతా... మనమూ మనలను నడిపించే నేతలూ వారిని నడిపించే అధినేతలూ పీవీ పట్ల ఎంత గౌరవం ఎంత ఆదరణ ఎంత కృతజ్ఞత చూపింది మన అంతరాత్మలకు తెలుసు. విపులీకరించవలసిన పనిలేదు.

       ఒక సంవత్సరం కిందట ఇలాంటి పుస్తకాన్ని నేను చూసి ఉంటే -ఎందుకిది ?ఒక ప్రధానమంత్రి ఐదేళ్ల హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు నెంబర్ వేయటం దేనికి అనేవాణ్ణి. దీర్ఘకాలం దేశాన్ని, పార్టీని సేవించిన పీవీకి దివంగతుడైన తరువాత దేశ రాజధానిలో లభించిన ఘన నివాళిని , మరవలేని గౌరవ మర్యాదలను గమనించాక నా అభిప్రాయం మారింది. ఔరంగజేబు రోడ్లూ, తుగ్లక్ రోడ్లే తప్ప కృష్ణ దేవరాయల రోడ్డు, రుద్రమదేవి రోడ్డు లాంటివి రాజధాని నగరంలో కలికానికి కూడా కనిపించని దేశంలో...స్వాతంత్రం వచ్చి షష్టిపూర్తి కావస్తున్నా దాక్షిణాత్యుల పట్ల చిన్న చూపు ఉత్తరాది వారికి పోని బాధాకర పరిస్థితుల్లో ... కొద్ది బుద్ధి కలవారి కర్ర పెత్తనాలు ఇప్పటిలాగే సాగితే నెహ్రూ వంశానికి వెలుపలివాడైన నరసింహారావు అనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించిన సంగతి కూడా మరుగున పడిపోతుందేమో! ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా- పీవీ పరిపాలనలో దేశం ఎలా ఉండేదో ,అప్పటి దేశకాల పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఏమి సాధించిందో, ఏమి సాధించలేకపోయిందో ,ఎందువల్ల సాధించలేకపోయిందో, ఆ పరిపాలన ప్రత్యేకతలు ఏమిటో ఎప్పటికీ గుర్తు పెట్టుకో దగిన విశేషాలు ఏమిటో గ్రంథస్థం అయి తీరాలి. వివిధ నాయకులకు, ఆయా చారిత్రక ఘట్టాలకు సంబంధించి ఇటువంటి గ్రంథాలు ఇంగ్లీషులో బాగానే వచ్చినా, తెలుగులో ఈ మాదిరి రచనలు చాలా తక్కువ. అరుదైన, కష్టమైన ఇలాంటి కార్యానికి పూనుకుని ప్రతిభావంతంగా నిర్వర్తించినందుకు మిత్రులు వెంకట రామారావు గారిని అభినందిస్తున్నాను.

      ఈ సందర్భంలో స్వర్గీయ బుడి సత్యనారాయణ సిద్ధాంతి గారు నాకు గుర్తుకొస్తున్నారు. ప్రధానమంత్రి అయ్యాక నరసింహారావు గారి ఆధికారిక నివాసానికి కుటుంబ పురోహితుడుగా ఆయనే గృహప్రవేశం చేశారట. ఆ ఇంటికి ఏదైనా మార్పులు ,చేర్పులు సూచించబోతే "ఎందుకండీ పండిట్జీ ! ఈ సర్కారు ఎంతో కాలం ఉండదు కదా" అని అక్కడివారు పెదవి విరిచే వారట! నిజమే! రాజీవ్ మరణానంతరం వేరే దారి లేక నాయకుడిగా ఎన్నుకోబడ్డ పి.వి. గారు అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయినా, కనీస మెజారిటీకే గతి లేని ఆయన ఓటి ప్రభుత్వం రాజకీయ పెను తుఫాన్లను, సంక్లిష్ట సమస్యల సుడిగుండాలను తట్టుకొని ఆట్టేకాలం నిలబడుతుందన్న నమ్మకం అప్పట్లో ఎవరికీ లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా సామాన్లు సర్దుకుని హైదరాబాదుకు మకాం మార్చటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వృద్ధుడు... తనకంటూ వర్గ బలం, వీరాభిమానగణం ఏదీ లేని దుర్బలుడు రాజీవ్ అనంతరపు వెలితిని ఎంత మాత్రం పూరించలేక బొక్క బోర్ల పడతాడనే చాలామంది ఊహించారు. ఎవరికీ ఏ విధమైన ఆశ లేకపోవటమే పీవీకి వరమైంది. అద్భుతాలు సాధించగలడని తారాస్థాయిలో ఆశలు రేపిన రాజీవ్ గాంధీ ఎంత చేసినా తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు, ఆకాంక్షలకు సరితూగలేక చివరికి భంగపడ్డాడు. ఏమీ చేయ లేడని ముందే ముద్రపడిన పీవీ కొంచెమే చేసినా అదే చాలా ఎక్కువ అనుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నందున అధికార స్థానంలో కాలు నిలదొక్కుకోవటం తేలికైంది. బానిస మనస్తత్వానికి పేరు పడ్డ చాలామంది కాంగ్రెస్ నాయకుల్లా కాక స్వతంత్రంగా వ్యవహరించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ,తన సత్తా ఏమిటో చూపించిన తెలుగు బిడ్డ పీవీ! కరణీకపు ప్రజ్ఞతో మైనారిటీని మెజారిటీగా మార్చుకుని ఐదేళ్ల పూర్తికాలం అధికారం చలాయించిన అపర చాణక్యుడాయన. కొన్ని వ్యక్తిగత, రాజకీయ బలహీనతల వల్ల... కీలక విషయాల్లో అసమర్ధ నిర్వాహకాలవల్ల ...కాంగ్రెస్ పార్టీకి ,ప్రభుత్వానికి స్వతసిద్ధమైన అవలక్షణాల వల్ల ...ఇంకా అనేక అనేక కారణాలవల్ల మళ్లీ ఎన్నికల్లో ప్రజా విశ్వాసం పొందలేక ఆయన అధికార చ్యుతి నందటం వేరే సంగతి. అందుకు పూర్తిగా ఆయన్నే బాధ్యుడిని చేయటమూ సరికాదు. అధికారం కోల్పోయాక కూడా పార్లమెంటు లోపలా వెలుపలా ఆయన గౌరవం తగ్గకపోగా, కొన్ని సందర్భాల్లో ఇనుమడించిన సంగతీ మరచిపోరాదు.

       నరసింహారావు గారు ఇచ్చకాలు గిట్టని మనిషి.ముఖస్తుతులను, ప్రచార భజనలను ఇష్టపడని వ్యక్తి . లోతుగా ఆలోచించి ,సమయానికి ,సందర్భానికి తగ్గట్టు కౌటిల్య తంత్రం రచించుకుని గుంభనంగా తన పని తాను



చేసుకుపోవటమే తప్ప ఫలానా ఘనకార్యాలు, ఘన విజయాలు తపపల్లే సిద్ధించాయని డప్పు కొట్టించుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వైఫల్యాల మాట ఎలా ఉన్నా, ప్రధానమంత్రిగా పీవీ ఘనతలూ తక్కువేమీ కాదని స్పష్టం. బాంబుల పేలుళ్లు, కాల్పులు, ఊచ కోతలు నిత్య కృత్యంగా మారిన పంజాబులో విచ్ఛిన్నకర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి, మళ్లీ లేవకుండా మట్టు పెట్టగలగటం ఆషామాషీ విషయం కాదు. అలాగే కంఠశోషలిజాన్ని కట్టి పెట్టి ,ఉజ్జ్వల జాతీయ భవితకు ప్రోది చేసిన ఆర్థిక సంస్కరణలూ పీవీ హయాంలోనే దారిన పడ్డాయి. బాబరీ మసీదు కూల్చివేతను నిరోధించలేక పోవడాన్ని అందరూ మాయని మచ్చగా అభిప్రాయ పడుతున్నా... మనను కమ్మిన  మాయ పొరలు తొలగి, నిజమైన చారిత్రక దృష్టితో ,సిసలైన జాతీయ దృక్పథంతో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే పరిణతి కలిగాక పీవీ చేసినదానిని గురించి, చేయలేకపోయిన దానిని గురించి చరిత్ర ఇచ్చే తీర్పు ఏమిటో ఎవరి కెరుక?






Friday 5 January 2024

మనకు స్వతంత్రం రాలేదు

హిందూ నేషన్- 8



      నిజాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలే గాని  హిందూ జాతి దీనావస్థకు  మూల కారణం కనపడుతూనే ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే-

      నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సింగపూర్ కేంద్రంగా స్వతంత్ర భారత (ప్రవాస) ప్రభుత్వాన్ని 
స్థాపించి, ఆజాద్ హింద్ ఫౌజ్ను కూడగట్టి భారత సరిహద్దులో సాగించిన భీకర సాయుధ సంగ్రామపు 
ప్రకంపనాలకు తాళలేక  తెల్లదొరతనం బెంబేలెత్తి ఆదరాబాదరా సామాన్లు సర్దుకుని ఇండియా నుంచి దౌడు 
తీసింది. ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన అవిభక్త భారత దేశం లోని  ముస్లిములు  తమది ప్రత్యేకజాతిగా 
అంతర్జాతీయ గుర్తింపు, స్వతంత్ర రాజ్య ప్రతిపత్తి పొందగలిగారు. పాకిస్తాన్ అనే నేషనల్ హోమ్ లాండ్ లో 
ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి తమ మత సిద్ధాంతాలకూ , విశ్వాసాలకూ తగ్గట్టుగా రాజ్యాంగాన్ని తయారుచేసుకుని
 తమ మతాన్నీ ,తమ సంస్కృతినీ  తమకు కావలసినరీతిలో అభివృద్ధి చేసుకోగలిగారు.
      రెండు జాతుల సిద్ధాంతానికి  బ్రిటిష్ కలోనియల్ పాలకులూ , భారత నాయకులూ కూడా
 ఆమోదం తెలిపాక ...దేశాన్ని చీల్చి ముస్లిం రాజ్యాన్ని ముస్లిములకు పంచేశాక మిగిలేది హిందూ రాజ్యమే కదా? 
అక్కడ హిందూ మతానికి, దాని జీవనాడి అయిన సనాతన ధర్మానికీ , హిందువుల  జాతీయ సంస్కృతికీ , 
హిందువులకే కదా ప్రథమ ప్రాధాన్యం, ప్రాముఖ్యం , అత్యంత గౌరవ స్థానం దక్కవలసింది? 
      కాదు. అలా కుదరదు. హిందూ మెజారిటీ స్వతంత్ర దేశంలో హిందువులకు , వారి మత,
 సంస్కృతులకురాజపూజ్యత ,అన్నింటిలో పెద్దపీట ఉండాలనటం మహాపాపం; అనాగరిక, సంకుచిత, 
అప్రజాస్వామిక పాపిష్టి ఆలోచనావిధానం ! పక్కా మతతత్త్వం  ; నీచ ధూర్త మతోన్మాదం ! అలా అయితే
మైనారిటీలు నొచ్చుకుంటారు ;ఇబ్బంది పడతారు.కాబట్టి హిందూ దేశంలో హిందూ మతానికి గౌరవ స్థానం 
కుదరదు. అలాగని మైనారిటీలతో మీరూ సమానం కూడా కాదు. ఎప్పుడూ వారు అన్నివిధాల పైన ఉండ
వలసిందే . మీరు కింద పడిఉండవలసిందే. రాజ్యాంగ రక్షణలు,ప్రత్యేక హక్కులు, విద్యలో, ఉద్యోగాలలో 
ప్రోత్సాహకాలు, స్కాలర్ షిప్పులు ,పెన్షన్లు అన్నీ మత ప్రాతిపదికన మైనారిటీలకు మాత్రమే!  అవన్నీ
 మీకూ కావాలంటే హిందూ మతం వదిలేసి ఏదైనా మైనారిటీ మతంలోకిమారాల్సిందే అని చెప్పకనే
 చెప్పారు  కాంగ్రెసు మార్కు  “పెద్ద మనుషులు” . నెహ్రూ ప్రవక్త పూనికతో అందరూ కలిసి దానికి
 ఇండియన్ బ్రాండ్ “సెక్యులరిజం” అనే పవిత్ర నామం తగిలించారు. 
     అంటే- 1947 లో  అవిభక్త భారత దేశంలోని  ముస్లిం జాతికి స్వాతంత్ర్యం వచ్చింది. హిందూ
 జాతి ఇంకా స్వాతంత్ర్యం పొందలేదు. స్వరాజ్యాన్ని చవిచూడలేదు. 1947 లో ముస్లిముల విషయంలో
 జరిగినట్టు  హిందువులకు ఒక జాతిగా గుర్తింపు దక్కలేదు. సొంత హిందూ రాష్ట్రం అంటూ ఏర్పడలేదు. 
వారి నేషనల్హోమ్ లాండు మీద  వారికి , వారి ధర్మానికి కంట్రోలు ఏదీ చిక్కలేదు.
 ( పుట్టుక రీత్యా, పేరును బట్టి ,తల్లితండ్రులను బట్టి హిందువులైనప్పటికీ , ఆచరణలో హిందూ మత 
ప్రయోజనాలకు బద్ధ వ్యతిరేకంగా నాయకులు, పాలకులు  హిందువులకు పగవాళ్లే తప్ప తమవాళ్ళు కారు
. వారి సోకాల్డ్  సెక్యులర్ ఏలుబడి  హైందవ ధర్మబద్ధ పరిపాలన అనటానికి వీల్లేదు.  
      దారితప్పటం అలా మొదలైంది. కాంగ్రెసు మాయావుల సెక్యులర్ మాయలో పడి లక్ష్యానికి,
 గమ్యానికి చాలా దూరమయ్యాం.  ఆ వైనాలు ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం. 
      నెహ్రూ అండ్ కో తమ కళ్ళకు కట్టిన మాయ సెక్యులర్ పట్టీలు  తీసి పారేయనంతవరకూ సెక్యులర్ 
పద్మవ్యూహం నుంచిహిందూ జాతి బయటపడదు. హిందూ వ్యతిరేక రాజ్యాంగ వ్యవస్థను మార్చనంత 
వరకూ బ్రహ్మదేవుడు వచ్చి  ప్రధానమంత్రి కుర్చీలో కూచున్నాపరిస్థితి సమూలంగా మారదు. తామే 
దేశంలోకెల్లా పెద్ద వోటు బ్యాంకు అన్న తెలివిడి , సంఖ్యాబలంతో ఎవరినైనా శాసించి, ఆదేశించి, తమకు  
కావలసిన రీతిలో  రాజ్యవ్యవస్థను  తాము మలుచుకోగలమన్న విశ్వాసం మునుముందు  జాతీయ హిందూ 
సమాజానికి గట్టిపడాలి.  మనుషుల మీద భ్రమలను వదిలించుకుని, అనుభవాలనుంచి  గుణ పాఠం
 నేర్వాలి . మతానికి , ధర్మానికి, దేశానికి  చుట్టుముట్టిన ఆపదల తీవ్రతను గుర్తించి రెండో  
స్వాతంత్ర్య సంగ్రామానికి వ్యూహాత్మకంగా, సంఘటితంగా  ముందుకు సాగితే హిందూ జాతి వేల సంవత్సరాల 
పర్యంతం ,మత సహిష్ణుతతో , సకల జనశ్రేయోదాయకంగా వర్ధిల్లగలిగిన హైందవ రాజ్య వ్యవస్థను దేశంలో 
కాలానుగుణంగా మళ్ళీ ప్రతిష్ఠించగలదు.  నైతిక బలంతో మరోమారు   ప్రపంచాన్ని జయించగలదు. హిందూ
 నేషన్ కీర్తి, ప్రశస్తి ఇండియా దటీజ్ భారత్ కు గర్వకారణం కాగలదు. 
                   “తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః”