Friday 30 March 2018

మేలు చేసే జ్యోతిషం

జ్యోతిషం మీద నిన్న నా పోస్టుపై మన మిత్రుల మధ్య నడిచిన చర్చను చూశాక ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది .

జ్యోతిషాన్నీ, జోస్యాలనూ నేనూ చాలా ఏళ్ళు ఎకసెక్కాలాడిన వాడినే. ఆ మాటకొస్తే ఇప్పుడు టీవీ చానెళ్ళ పనికిమాలిన చర్చల్లో పనికిమాలిన వాళ్ళు చేసే అరిగిపోయిన వాదాలకంటే పదునుగా ; అవతలివాళ్ళు మారు మాట్లాడలేనంత  పవర్ ఫుల్ గా !

కాలేజీ చదువు అయి ఇంటికి వచ్చాక మా నాన్న బలవంతం మీద నేను జ్యోతిషం కొంతవరకు నేర్చుకున్నాను . ఆయన చాలా ఏళ్ళు పంచాంగాలు రాసేవాడు. జ్యోతిషం పుస్తకాలు కొనుక్కుని ఎంత చదివినా ఎన్నేళ్ళకూ అంతుబట్టని కిటుకులను అనుభవజ్ఞుడైన గురువు నేర్పగలడు. అలాంటివి కొన్ని మా నాన్న నాకు నేర్పాడు. దాంతో జాతకం ఎలా చూడాలి, లెక్కలు ఎలా వెయ్యాలి, ఫలితాలు ఎలా చెప్పాలి అన్నవి థియరీ వరకూ  ఒక మోస్తరుగా అర్థమయ్యాయి. అయినా అప్పట్లో నన్ను నిలువెల్లా ఆవహించిన మార్క్సిజం , భౌతిక వాదం , నాస్తికత్వం నేను నేర్చిన విద్యనూ నన్నే నమ్మనివ్వకుండా చేశాయి. అది ఎంత దాకా అంటే - పెళ్ళికి ముందు మా ఆవిడ జాతకం కూడా నేను అడగలేదు. కనీసం పుట్టిన తేదీ , సమయం తెలుసుకోవాలనీ అనిపించలేదు. నా పెళ్ళికి ముహూర్తం మాత్రం నేనే పెట్టాను !

తరవాత తరవాత నా ఆలోచన మౌలికంగా మారింది. మన పేరుమోసిన హేతువాదులకంటే ఎక్కువ హేతుబద్ధంగా ఆలోచిస్తూ, ప్రతిదాన్నీ  అనుమానిస్తూ , లాజికల్ గా తరచి చూస్తూ పోగా పోగా  నేను పూర్తి నాస్తికత్వం నుంచి పూర్తి ఆస్తికత్వం వైపు మళ్ళాను.  జ్యోతిషం మీద నా అభిప్రాయాలూ మారాయి. ప్రస్తుతం నేను అనుకుంటున్నదేమిటంటే -

1. అడుగు తీసి అడుగు వేయాలంటే తిథి, వారం, వర్జ్యం చూడాలనుకోవటం మూర్ఖత్వం.ప్రతి నిర్ణయమూ జాతకాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టే చేయలనుకోవటమూ అవివేకమే.  కానీ జీవితంలో, కుటుంబంలో అతి ముఖ్యమైన నిర్ణయం చేసే ముందు జ్యోతిష సలహా కూడా తీసుకోవటం చాల మంచిది.

2. ప్రతిదీ గ్రహాల మీదే ఆధారపడదు. మనిషి చేయగలిగింది చాలాఉంది. గ్రహాల ప్రభావాల నుంచి బయటపడగల శక్తి కూడా మనిషి చేతుల్లో ఉంది. కానీ ఆ ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకుని , దానిని దృష్టిలో పెట్టుకుని తదుపరి కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటే వాలుగాలిలో ప్రయాణం లా సుఖంగా ఉంటుంది. అవసరమైతే ఏటికి ఎదురీదవచ్చు .జ్యోతిషాన్ని పక్కన పెట్టి , అన్ని  పర్యవసానాలకు సిద్ధపడి ముందుకు సాగవచ్చు. అది అవసరమా అన్నది తేల్చుకోవటానికి కూడా జ్యోతిష సలహా ఉపయోగపడుతుంది.

3.అనుభవజ్ఞుడైన జ్యోతిషుడు ఒకరి జాతకం చూడగానే ఆయుర్దాయం, శరీర తత్త్వం, ఏ సమయంలో ఏ రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారముంది, ఏ పీరియడ్ లో ఎలాంటి జబ్బులు రావచ్చు, ఎలాంటి ఆపరేషన్లు జరగవచ్చు అన్నవి చెప్పగలడు . వాటిపై ముందస్తు హెచ్చరిక ఉంటే , వైద్యపరంగా సకాలంలో సరైన చికిత్స పొందటానికి వీలు ఉంటుంది. కాంప్లెక్సు కేసుల్లో సరైన డయాగ్నసిస్ చేసేందుకు వైద్యులకు కూడా జ్యోతిష పరిజ్ఞానం పనికొస్తుంది. అందుకే ఈ కాలంలో కొంతమంది   డాక్టర్లు రోగి తత్వాన్ని , వల్నరబిలిటీ నీ మదింపు చేయటానికి ఆస్ట్రాలజీనీ ఒక ఇన్ పుట్ గా పరిగణిస్తున్నారు.మెడికల్ ఆస్ట్రాలజీ ఇవాళ పెద్ద గిరాకీ ఉన్న సబ్జెక్టు.

4. పిల్లలను ఏ కోర్సులో చేర్పించాలో నిర్ణయించే ముందు వారి జాతకానికి ఎలాంటి విద్యలూ వృత్తులూ రాణిస్తాయన్నది కూడా తెలుసుకుంటే .. తలితండ్రుల  కలలకు పసివాళ్ళను బలిచేసే దుర్మార్గం కాస్త తగ్గవచ్చు.

5. వ్యక్తిగత జీవితంలో పెద్ద రిస్కులు తీసుకుని ,  ఖరీదైన ప్రయోగాలు చేయబోయేముందు జ్యోతిష్కుడి ఒపీనియన్ కూడా తీసుకుంటే ఆనక చేతులు కాల్చుకుని జీవితాంతం బాధపడే అవస్థ కొంతలో కొంత తప్పవచ్చు.

6. బిడ్డల పెళ్ళిళ్ళలో జ్యోతిషం చేయగల ఉపకారం ఎంతో ఉంది. జాతకాలు చూసుకోవటం అంటే పంచాంగాల గుణ మేళన చక్రాల్లో వధూవరుల నక్షత్రాలను బట్టి పట్టికలో మార్కులు చేసి 18 దాటితే పాస్ , దానికి ఒకటి తగ్గినా ఫెయిల్ అని కొట్టిపారేయటం కాదు. ఆశ్లేష అత్తకు గండం, మూలా నక్షత్రం మామకు గండం అని మూర్ఖంగా నమ్మటం కాదు. సబ్జెక్టు తెలిసిన, వాక్శుద్ధి గల, డబ్బు ఆశ మరీ ఎక్కువ లేని జ్యోతిషుడు వధూవరుల పొంతనలను చూసి, వైవాహిక జీవితం లో compatability ని మదింపు చేయటంలో మంచి సలహా ఇవ్వగలడు. పెళ్ళిళ్ళు చేయించే ప్రతి పురోహితుడూ జ్యోతిష పండితుడు కాడు. పెద్ద ఎత్తున మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రతి గాడిదా జ్యోతిష్క చక్రవర్తి కాడు .

7. ప్రజలలో నూటికి 95 మంది జ్యోతిషాన్ని నమ్మేవారు. ప్రతివారూ మంచి జ్యోతిష్కుడిని సంప్రదించాలనే కోరుకుంటారు. కానీ ఇవాళ డిమాండుకు తగ్గట్టు సప్లయి లేదు. నిజమయిన జోస్యులకంటే మోసగాళ్ళే , ఏమీ తెలియని ఏబ్రాసులే ఎక్కువ . ఈ దురదృష్టకర స్థితి  మారాలంటే ఒక క్రమపద్ధతిన జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించే వారి సంఖ్య పెరగాలి. సమర్థులైన జ్యోతిషులను తయారు చేసేందుకు సీనియర్లు, వృత్తిపరమైన సంస్థలు, విద్యాసంస్థలు ఇంకా ముందుకు రావాలి.

8. చెపుతూ పొతే ఇలా చాలా ఉన్నాయి. జ్యోతిషం మీద బహిరంగంగా రాళ్లు వేస్తూ , తమ వరకూ వచ్చేసరికి అడ్డమైన జ్యోతిష్కుల చుట్టూ చాటున తిరగటం కాదు చేయవలసింది. సాంప్రదాయిక విద్య అయిన జ్యోతిషాన్ని సమాజంలో ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మేలు చేసేలా ఎలా అభివృద్ధి చేయగలమన్నదే ఇప్పుడు ఆలోచించవలసింది.


ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ

పాత ముచ్చట్లు - 10

ఎం.వి.ఆర్.శాస్త్రి
.......

     అది 1993 డిసెంబర్ 23.  ఉదయం పదిన్నర కావస్తోంది. .  నల్లకుంట లోని మా ఇంట్లో అసెంబ్లీకి వెళ్లటానికి తయారవుతున్నాను. ప్రతిపక్ష నాయకుడు ఎన్.టి.రామారావు గారిని మా ఆంధ్రప్రభ కోసం  ఇంటర్వ్యూ  చెయ్యాలి.

     తొందరలేదు. మా రిపోర్టర్ పొలిశెట్టి అంజయ్య ( ఇప్పుడు 'మన తెలంగాణ ' దినపత్రిక ఎడిటర్ ) తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ( టి.డి.ఎల్.పి. ) ఆఫీసు లో కాచుకుని ఉన్నాడు.  "11-15 కు ఇంటర్వ్యూ అన్నారు సార్! ఆ లోపు మీరు వస్తే సరిపోతుంది " అని పదినిమిషాల కిందటే ఫోన్ చేశాడు.  మా ఇంటి నుంచి అసెంబ్లీ కి  వెళ్లటానికి  ఇరవై నిమిషాలు  చాలు. ఇంకా బోలెడు టైం ఉంది కదా అని తాపీగా ఉన్నాను.

     అంతలో మళ్ళీ ఫోను . అంజయ్య నుంచే . " టైము కి వచ్చేస్తా బ్రదర్ ! ఇంకో పావుగంటలో బయలుదేరతా " అన్నా రిసీవర్ ఎత్తగానే. మా వాడు కాస్త  కంగారుగా ఉన్నాడు. " వెంటనే బయలుదేరండి సార్ ! రామారావుగారు మీ కోసం వెయిట్ చేస్తున్నారు. " అన్నాడు.

 " అదేమిటయ్యా ? 11-15 కి అన్నావుకదా ?"

 " మీరు వచ్చాక చెబుతాను సార్. మీరైతే అర్జెంటుగా వచ్చేయండి "

   హడావిడిగా తయారై   కారెక్కి అదృష్టవశాత్తూ  యాక్సిడెంటు కాకుండా ఆగమేఘాల మీద  అసెంబ్లీ కాంప్లెక్సు చేరేసరికి 11 కావస్తోంది. అంజయ్య గేటు బయటే వెయిట్ చేస్తున్నాడు.

   టి.డి.ఎల్.పి. ఆఫీసు వాళ్ళు మేము వస్తున్నట్టు రామారావుగారికి ముందే చెప్పారట. ఇంటర్వ్యూ 11- 15 కు  ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారట . కానీ పెద్దాయన 10-30 కే బెల్లు కొట్టి " వారిని రమ్మనండి " అన్నారట. అవతలి వారు రావటానికి ఇంకా టైం పడుతుంది అని పెద్దాయనకు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదట. ఇప్పటికే సారు రెండు సార్లు బెల్లు కొట్టి " ఏరీ వారు ? " అన్నారట కోపంగా . దాంతో అంతా మహా టెన్షన్ గా ఉన్నారట. లోపలికి వెళ్ళాలంటే ప్రతివాడూ భయపడుతున్నాడట.

   నేను కనపడగానే ఎన్.టి.ఆర్. గారి పర్సనల్ సిబ్బంది తినేసేలా చూసారు. " సార్  మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారండి ." అన్నాడు సెక్రటరీ నిష్టూరంగా  .

   చెప్పొద్దూ . కాస్తంత భయం వేసింది . అసలే ఎన్.టి.రామారావు. ఆ పైన కోపంగా ఉన్నాడు. పోగానే ఏమంటాడో!  అసలు ఇంటర్వ్యూనే ఇవ్వను పొమ్మంటాడేమో !



   సరే తెగించి , సింహం గుహలోకి అడుగు పెట్టినట్టు లోపలికి వెళ్లాం. ముందు ఫోటోగ్రాఫరు. వెనక అంజయ్య , తరవాత నేను. ఫోటోగ్రాఫరు వెళ్ళీ వెళ్ళగానే కెమెరా క్లిక్ మనిపిస్తూ పనిలో పడ్డాడు. ఎంతయినా షోమాన్ కదా ? కెమెరాను చూడగానే కుదురుగా , ముచ్చటగా పోజు ఇవ్వసాగారు ఎన్టీఆర్ ! బయటవాళ్ళు భయపెట్టినంత భయంకరంగా ఏమీ లేదాయన 'మూడు '.

   పరిచయాలు కాగానే ఆలస్యం చెయ్యకుండా మొదటి  ప్రశ్న వేశాను   :

  " ఏమిటి రామారావుగారూ ! కొత్తగా పెళ్ళయ్యాక మీ గ్లామర్ రోజురోజుకీ తెగ పెరిగిపోతున్నది ! మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా జనం విరగబడి మిమ్మల్ని  నెత్తిన పెట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడే మీకు ప్రజాభిమానం  మరీ ఎక్కువైంది.  ఇంత బ్రహ్మాండమైన ప్రజాదరణను మీరెలా సాధించారండి ? "

  ఎన్టీఆర్ మొగంలో అప్పటిదాకా ఉన్న చిరు చిరాకు కూడా మాయమయింది. ఆయన చాలా ప్రసన్నంగా ఉన్నాడు. కొత్తపెళ్లికొడుకు కొంచెం ముసిముసిగా నవ్వాడు కూడా.
ప్రశాంతంగా సావకాశంగా మాతో సంభాషణ సాగించాడు.

     అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి. ప్రతిపక్షనాయకుడు ఎన్.టి.రామారావు. అసెంబ్లీలో ఏదో గొడవ జరిగి అప్పటికి చాలారోజుల కింద రామారావు, చంద్రబాబులతో సహా మొత్తం తెలుగు దేశం ఎం.ఎల్.ఏ . లందరినీ స్పీకర్ బయటికి పంపారు. దాన్ని అవమానం గా భావించి రామారావు మళ్ళీ అసెంబ్లీ లో అడుగు పెట్టనని శపథం చేశారు.  మిగతా ఎం ఎల్ ఏ లు కొద్దిరోజులతరవాత సభకు వెళ్ళసాగారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షనాయక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామారావుగారు రోజూ ఉదయం వేల తప్పకుండా అసెంబ్లీ కి వెళుతున్నారు. పార్టీ వారితో మాట్లాడతారు. సభలో ఏమి జరుగుతున్నదీ కనిపెట్టి ఎప్పటికప్పుడు తమ లెజిస్లేటర్లకు సూచనలిస్తారు. కానీ సభలోపల కాలు పెట్టరు .

   " ప్రతిపక్షనాయకుడు అలకపాన్పు ఎక్కాడు. సంతకం పెడతాడు కాని సభలోకి రాడు. సభానాయకుడైన ముఖ్యమంత్రికి సభలోకి వచ్చి కూర్చునే తీరిక ఎప్పుడో తప్ప దొరకదు. అగ్రసనాధిపతి స్పీకరు. ఇంగ్లీషులో ఆ మాటకు అర్థం " మాట్లాడేవాడు " అని . అందుకేనేమో మన స్పీకరు (శ్రీపాదరావు ) అందరికంటే ఎక్కువ తానే మాట్లాడుతారు " అని ఆంధ్రప్రభ  ఆదివారం అనుబంధంలో 1994 ఏప్రిల్ 10 న నా "ఉన్నమాట " కాలమ్ లో రాశాను.

  "మీరు సభలోకి ఎందుకు పోరు ? " అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇంటర్వ్యూలో నేను అడిగాను .

 " రమ్మని నన్ను ఎవరు పిలిచారు " అని రామారావు గారి జవాబు.




  మునుపటిమీద ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది. లోగడ పత్రికల వారితో మాట్లాడేటప్పుడు తనకు తోచింది తన ధోరణిలో అనర్గళంగా ఉపన్యసించటమే తప్ప ఎదుటివారు చెప్పేది సాధారణంగా వినేవారుకాదు. మధ్యమధ్య పృచ్చకులు అంతరాయం కలిగించ బోయినా పట్టించుకోకుండా వాక్ప్రవాహాన్ని కొనసాగించే వారు. అలాంటిది ఆయన ఇప్పుడు ఎదుటివారు అనేది వింటున్నారు .ప్రశ్నలకు అవకాశమిస్తున్నారు. అడిగిన ప్రశ్న బోధపడనప్పుడు మళ్ళీ అడిగి ఓపికగా సమాధానమిస్తున్నారు. ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు సహనం కోల్పోకుండా సాధ్యమైనంత తెలివిగా సమాధానం చెపుతున్నారు.

  ముప్పావుగంట సాగిన ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలు తరువాయి భాగంలో.

Thursday 29 March 2018

ఇప్పటికివి చాలు

వాజపేయి హయాంలో జ్యోతిషాన్ని కాలేజీ కోర్సు ను చేసే ప్రతిపాదనపై దేశమంతటా వీర సైన్సువాదులు గగ్గోలు పెట్టినప్పుడు ఆ ప్రతిపాదనను సమర్థిస్తూ పదిహేడేళ్ళ కింద ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను వరసగా రాసిన వ్యాసాలలో కొన్నిటిని ఇవాళటి వరకూ ఇక్కడ పోస్ట్ చేసాను. 2001 సంవత్సరంలో ఈ విషయం మీద నాలుగు రోజులుదృష్టి సారిస్తే నేను తెలుసుకున్నజోస్య సంబంధ వాస్తవాలను ఆనాటి వ్యాసాల్లో ఉటంకించాను . టీవీల చచ్చు పుచ్చు ఏకపక్ష రచ్చల్లో సైన్సు తత్త్వం వంటబట్టని సైన్సు వకాల్తా దారులు , హేతుదృష్టి ఏ కోశానా లేని కుహనా హేతువాదులు అరిగిపోయిన రికార్డులా వినిపించే మూర్ఖపు వాదనల బోలుతనాన్ని అర్థం చేసుకోవటానికి నేను వెనుక రాసినవే చాలు.

ఇప్పుడు మళ్ళీ గట్టిగా దృష్టి పెడితే ఇటీవలి కాలంలో 100 శాతం ఫలించిన ఎన్నో రికార్డయిన జోస్యాలను బయటికి తీయవచ్చు. ఈ విషయం లో ఆసక్తి ఉన్న వాళ్ళు కాస్త ఓపికతో గూగుల్ సెర్చ్ చేస్తే కావలసినంత సమాచారం తెలుస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరమనుకుంటే ఈ విషయంలో నేనే కొత్తగా చేయి చేసుకుంటాను.

జ్యోతిషాన్ని మూఢనమ్మకమని పబ్లిక్ గా కొట్టిపారేసే వాళ్ళలో నూటికి 80 మంది నిజజీవితంలో జ్యోతిషానికి పైకి చెప్పుకోని వీరవిధేయులు. వారిలో నూటికి 80 మంది మూఢనమ్మకాల పుట్టలు. జ్యోతిషాన్ని , సంప్రదాయాన్ని, పూజా పునస్కారాలను పిచ్చి పిచ్చిగా అస్తమానం తూలనాడే పేరు గొప్ప తెలుగు టీవీ చానెల్ ను నడిపే పెద్దమనిషి కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటున్న లోకోత్తర దృశ్యాన్ని ఈ మధ్యే సోషల్ మీడియా బయటపెట్టింది. జ్యోతిషం మీద ఒంటి కాలి మీద లేచే దమ్మున్న ఇంకో మీడియా మోతుబరీ తన వరకూ వచ్చేసరికి జ్యోతిష్కుడిని కన్సల్ట్ చేయకుండా ఏ పెద్ద పనికీ ఉపక్రమించడు. ఇలాంటి హిపోక్రైట్ల చేతులోని మీడియాకూ , అది వాగించే మిడిమిడి జ్ఞానుల వాగుళ్ళకూ విలువేమిటి ? కల్లాకపటపు హేతువాద పిల్లుల నిర్హేతుక శాపాలకు జ్యోతిష శాస్త్రం ఉట్లు తెగుతాయా ?

జాతక కథలు - 2

స్టార్స్ X సైన్స్ - 6

ఎం.వి.ఆర్.శాస్త్రి

.........

   ప్రధాని నెహ్రూకు మరణం ఆసన్నమైందని 1963 ఆగస్టు నుంచి 1964 మే వరకు ఆయనకు మరీ గడ్డుకాలమని 'ది ఆస్ట్రలాజికల్ మేగజిన్' 1962 జూలై సంచికలో నెహ్రూకు నడుస్తున్న దశాంతర్దశలను బట్టి బి.వి.రామన్ జోస్యం చెప్పాడు . 1964 మే 27న నెహ్రూ మరణించాడు .

   చైనాతో యుద్ధాన్ని ముందుగా జోస్యం చెప్పింది దుర్గాదాస్ పుస్తకంలో ప్రస్తావించిన జ్యోతిష్కుడు ఒక్కడే కాదు. 1962లో గానీ చైనాతో యుద్ధం రాదని ఎనిమిదేళ్లు ముందుగా 1954 జనవరి ' ఆస్ట్రలాజికల్ మేగజిన్' లో  బి.వి.రామన్ రాశాడు. అలాగే 1965లో పాకిస్తాన్ తో యుద్ధాన్ని సంవత్సరం ముందూ ,  1971 యుద్ధాన్ని ఏడు నెలల ముందూ  ఆయన తన పత్రికలో గ్రహచారాన్ని బట్టి జోస్యం చెప్పాడు.

    ఇది కేవలం ఒక బి.వి.రామన్ కూ, ఒక ఆస్ట్రలాజికల్ మేగజిన్ కూ మాత్రమే పరిమితమైన ప్రత్యేక కళ కాదు. అలాంటి జ్యోతిష్కులకు, అలాంటి పత్రికలకు దేశంలో కొదవ ఏమీ లేదు. ఉదాహరణకు పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 1999 నవంబర్ 8 లోగా పడిపోయి అధికారం మిలిటరీ హస్తగతమవుతుందని ఆ సంవత్సరం సెప్టెంబర్ 12 సంచికలో జ్యోతిష పత్రిక Babaji రాసింది. ఈ ఆకస్మిక మార్పు అప్పట్లో ఎవరూ ఊహించనిది. కానీ సరిగ్గా నెలకల్లా (అక్టోబర్ 12న) అదే జరిగింది. యుద్ధాలనూ సైనిక కుట్రలనే కాదు. ఎన్నికల ఫలితాలను కూడా జ్యోతిష్కులు కచ్చితంగా చెప్పగలిగిన దృష్టాంతాలు లెక్కలేనన్ని.
 
   "Congress is likely to form a Government after the election with the help of some other parties under the leadership of a person other than Rajiv Gandhi" (ఎన్నికల తరవాత రాజీవ్ గాంధి కాక వేరొకరి నాయకత్వంలో ఇతర పార్టీల సాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది)

   -అని 1991 ఏప్రిల్ 9న Babaji పత్రిక జోస్యం చెప్పింది. అప్పటికి యునైటెడ్ ఫ్రంట్ రసాభాస ప్రయోగాలతో జనానికి మొగం మొత్తింది కనుక తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని చాలామంది అనుకున్నదే, కాని -తిరుగులేని ఏకైక నాయకుడు రాజీవ్ గాంధి ఉండగా మరొకరు కాంగ్రెస్ ప్రభుత్వాధినేత కావడమన్నది ఎవరూ కలనైనా ఊహించనది. కాని - అసంభవ మనుకున్నదే సంభవమైంది. సరిగ్గా ఆ పత్రిక రాసినట్టే రాజీవ్ కాక వేరొకరి నాయకత్వంలో కాంగ్రెస్ గద్దెనెక్కింది.

    అధికారంలోకి రాడనే తప్ప రాజీవ్ కు మృత్యుగండాన్ని జోస్యులు ముందుగా చెప్పలేక పోయారందామా ? Sorry Rajiv;No chance for the time being! Take care of your person (సారీ రాజీవ్! ప్రస్తుతం మీకు ఛాన్సులేదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి) అని 1990 జులై 10న వెలువడ్డ సంచికలో ఇదే 'బాబాజీ' పత్రిక జోస్యం చెప్పింది.

    కాంగ్రెస్ గెలిచినా రాజీవ్ ప్రధాని కాలేడన్నారు సరే! కాని - ప్రధానమంత్రి ఎవరు అవుతారో కచ్చితంగా ఎవరూ చెప్పలేదు కదా అని పెదవి విరుద్ధామా?

    రానున్న ఎన్నికల తరవాత పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి అవుతాడని వి.ఎల్.నరసింహన్ చెప్పిన జ్యోసాన్ని రాజీవ్ గాంధి జీవించి వుండగానే The Week ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

    ఇప్పుడు కీర్తిశేషుడైన  వి.ఎల్.నరసింహన్ సికింద్రాబాద్ వాస్తవ్యుడు. జ్యోతిషంలో నమ్మకం ఉన్నవారికి ఆయన చిరపరిచితుడు. కేవలం ఇంట్యూషన్ బట్టి తనకు ఏది స్ఫురిస్తే దాన్ని జోస్యం చెప్పే మనిషి కాదాయన. చెప్పే ప్రతి ఫలితానికీ ప్రాతిపదిక ఏమిటో, అది అలా జరుగుతుంది అనడానికి శాస్త్ర ప్రమాణమేమిటో ఆయన దాపరికం లేకుండా విడమర్చి చెప్పేవాడు.

    జ్యోతిష్యం మీద జోకులు, అవాకులు చవాకులు చాలానే వున్నాయి. యుద్ధంలో రెండుదేశాల మధ్య ... ఆటలో రెండు జట్ల మధ్య... సంఘర్షణ జరిగితే కొందరు జ్యోతిష్కులు వీరు గెలుస్తారంటారు. కొందరేమో వారిదే విజయం అంటారు. చివరికి ఎవరు గెలిచినా ఏదో ఒక వర్గం జ్యోతిష్కుల మాట నిజమైనట్టే! అలాగే ఒకడు కళ్లు మూసుకొని నూరు జోస్యాల రాళ్లు విసిరితే ఎనభై గురి తప్పినా ఇరవై పొరపాటున గురికి తగలవచ్చు. కాకతాళీయంగా నిజమైన పదో ఇరవయ్యో జోస్యాలను పటం గట్టుకుని తనను మించిన దైవజ్ఞుడు లేడంటూ ఊరేగడం పక్కా జనవంచన. ఇలాంటి తక్కువ అభిప్రాయం జ్యోతిషం మీద చాలామందికి ఉంది. మనకు కనపడే చాలామంది జ్యోతిష్కుల విషయంలో ఇది కరెక్టే కూడా. సాదారణంగా ఏ జోస్యుడైనా ఫలించిన జోస్యాల సంగతే గొప్పగా చెప్పుకుంటాడు. తుస్సుమన్న వాటి ఊసు ఎత్తనే ఎత్తడు. కాని - జోస్యాల్లో ఎన్ని నిజమవుతాయి. ఎన్ని కావు అన్నది కాదు పాయింటు. జ్యోతిషానికి శాస్త్రీయ ప్రాతిపదిక వుందా లేదా అన్నదే ఇక్కడ తేలాల్సిందల్లా.

    మాటవరసకు జ్యోతిష్కుల్లో నూటికి 90 మంది మోసగాళ్లని, అజ్ఞానులని అనుకుందాం. కాని కనీసం నూటికి పదిమంది అయినా భవిష్యత్తును కచ్చితంగా చెప్పగలుగుతున్నారా లేదా? మొత్తం జోస్యాల్లో నూటికి 80 నిజం కాదనీ, మిగతా 20లో కూడా 19 యాదృచ్చికంగా ఫలించేవేనని కాసేపు ఒప్పుకుందాం. కాని - నూటికి ఒక్క జోస్యమైనా వెంట్రుకవాసి తేడా లేకుండా, మానవ మేధకు, హేతువాదానికీ అంతుబట్టనిరీతిలో, గతితార్కిక భౌతిక శాస్త్ర సూత్రాలన్నిటినీ తల్లకిందులు చేసే విధంగా నిజం కావడం ఎలా జరుగుతున్నది? ఎన్నికల్లో ప్రధానంగా రెండు పక్షాల మధ్య పోటి జరిగేటప్పుడు వారో వీరో గెలుస్తారని చెబితే కొందరి జోస్యాలైనా నిజం కావడంలో వింతలేదు. కాని - రాజీవ్ గాంధి బతికి వుండగా, ఆయనలేని కాంగ్రెస్ ను సమీప భవిష్యత్తులో ఎవరూ ఊహించలేని స్థితిలో... మూలపడి, వానప్రస్థానికి ఆయత్తమై వున్న పి.వి.నరసింహారావు తదుపరి ప్రధాని కాబోతున్నాడని ఒక జ్యోతిష్కుడైనా ఎలా చెప్పగలిగాడు?ముసలితనంలో వున్నవారికి 'ఆరోగ్యం జాగ్రత్త' అనో, మరణం దగ్గరపడిందనో చెప్పడానికి జ్యోతిషమే తెలియనక్కర్లేదు. కరక్టే. కాని - ఒక నెహ్రూ, ఒక పటేల్, ఒక మౌలానా ఆజాద్ సరిగ్గా ఫలానా రోజునే మరణించనున్నట్టు కనీసం ఒక జోస్యుడైనా ఎలా ఊహించగలిగాడు? మన సైన్సువాదులు కొట్టి పారేస్తున్నట్టు జ్యోతిష్యమంతా మూఢనమ్మకమే అయితే ఆకాశంలో గ్రహస్థితికి భూమి మీద మనిషి భవిష్యత్తుకు 'సైన్సు పార్టీ' వారంటున్నట్టు ఎటువంటి సంబంధం లేకపోతే గ్రహస్థితిని బట్టి వేసిన జాతకాల ఆధారంతో కొద్దిమంది జ్యోతిష్కులైనా భవిష్యత్తును చాలా కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?

   పోనీ - వారు ఏదైనా అంజనం వేసో, మానవమాత్రుడు పోల్చుకోలేని తాంత్రిక విద్యతోటో, ఇంకేదో అతీంద్రియ శక్తితోనో భవిష్యత్తును ఊహించి చెబితే వేరే సంగతి. అటువంటి విద్యలు ఒకవేళ వున్నా మరొకరికి అర్థమయ్యేవి, పట్టుబడేవి కావు కనుక వాటి గురించి ఆలోచించడం టైము వేస్టు.

   జ్యోతిషం అలాకాదే?! దానికి నిర్దిష్టమైన, ఎవరైనా  తెలుసుకోగలగిన కొన్ని సూత్రాలున్నాయి. ఆయా సిద్ధాంతాలను వివరించి, నిత్య జీవితంలో వాటిని ఉపయోగించడం ఎలాగో బోధించటానికి ప్రామాణిక గ్రంథాలున్నాయి. అక్షాంశ రేఖాంశాల సాయంతో, ఆకాశంలో ప్రత్యక్షంగా కనపడే చుక్కలనుబట్టి గ్రహాల నక్షత్రాల ఉనికిని, సంచారాన్ని వాటి మధ్య దూరాన్ని , పరస్పర ప్రభావాలను విస్పష్టమైన గణితంతో లెక్కలువేసి, భూగోళం, వాతావరణాది ఇతర శాస్త్రాలలాగే కచ్చితమైన కాలిక్యులేషన్లు చేసి, శాస్త్ర గ్రంథాల్లో చెప్పినదానికి అనుభవంతో గ్రహించిన దానిని జోడించి భవిష్యత్తును ఊహించడమే జ్యోతిషం చేసే పని. ఓపిక, కోరిక వుంటే ఆ లెక్కలు ఎవరైనా చేయగలరు. ఆ సూత్రాలు ఎవరైనా నేర్వగలరు. ఆ ఫలితాలు ఎవరైనా చెప్పగలరు. ఇందులో మాయలు,, మర్మాలు ఏమీ లేవు. మూఢ నమ్మకాలకు చోటే లేదు. ఈ సంగతి మెడమీద తలకాయ వుండి, అందులో మెదడు పనిచేసే ప్రతివాడికి తెలుసు. మరి జ్యోతిషానికి ప్రాథమిక సూత్రాలంటూ ఏవీలేవని... తర్కబద్ధమైన రీతిలో నిర్దిష్ట నియమాలను ఎవరైనా విశ్లేషించి జ్యోతిష్కుడెవరన్న దానితో నిమిత్తం లేకుండా ఫలితాలు చెప్పగల ఆస్కారం లేనేలేదని సైన్స్ వాద యోధులు ఎలా దబాయించగలుగుతున్నారు? చేతబడులనూ, జ్యోతిషాన్ని ఒకే గాట ఎలా కడుతున్నారు?

       ఎంతటి గొప్పవాడైనా తన సబ్జెక్టు వరకూ మాత్రమే ప్రవీణుడు. మిగతా విషయాల్లో తెలిసీ తెలియక మాట్లాడితే , మూర్ఖంగా వ్యవహరిస్తే అతడినీ మామూలు మూర్ఖుల్లో ఒకడిగానె చూడాలి. ఒక సైంటిస్టు తన సబ్జెక్టులో ఎంత గొప్పవాడైనా తనకు తెలియని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని జ్యోతిషం గురించి అభూతకల్పనలు చేస్తే వాటన్నిటినీ శాస్త్రీయ అభిప్రాయాలుగా , సైన్స్ ఇచ్చిన తిరుగులేని తీర్పులుగా ఎందుకు గౌరవించాలి ?ఒకడికి ఒకటో రెండో సైన్స్సుకు సంబంధించిన డిగ్రీలు ఉంటె చాలు జ్యోతిషం లాంటి మూఢ నమ్మకాలను చిత్తం వచ్చినట్టు తూలనాడెందుకు తడికి అన్ లిమిటెడ్ లైసెన్సు ఉన్నట్టా ? అతడి నోట ఏది వస్తే అది శాస్త్ర ప్రామాణికమా ?జ్యోతిషశాస్త్రానికి ప్రమాణాలేమిటో, ప్రాతిపదికలేమిటో, గణితం ఎలా చేస్తారో ఫలితం ఎలా చెబుతారో తెలుసుకునే ప్రయత్నం వీరెప్పుడైనా చేశారా? ఏ బుక్ షాప్  లోనైనా విరివిరిగా కనపడే వందలాది జ్యోతిష సిద్ధాంత గ్రంథాల్లో ఏ ఒక్కదానినైనా అట్ట తెరిచి చూసిన పాపాన వీరు పోయారా? తాము ఊహిస్తున్నట్లు జ్యోతిషం పూర్తిగా మూఢనమ్మకమే అయితే దాని ఆధారంగా చెప్పే నిర్దిష్ట ఫలితాల్లో ఏ ఒక్కటి నిజం కాకూడదుకదా? వేయి జోస్యాల్లో ఒక్కటి నిజమైనా తమకు తెలిసినసైన్సుకూ భౌతిక సుత్రాలకూ అంతుబట్టనివిధంగా అది ఎలా జరిగిందో పరీక్షించి తెలుసుకోవాలన్న శాస్త్రీయ జిజ్ఞాస సోకాల్డ్ 'సైన్స్ బాడ్జిధారు' లలో ఎంతమందికి వుంది?

 ( 2 సెప్టెంబర్ 2001 న ఆంధ్రభూమి దినపత్రిక లో  వచ్చిన వ్యాసం )

అయిపోయింది.


 

Wednesday 28 March 2018

జాతక కథలు -1

స్టార్స్  X  సైన్స్ -- 5


ఎం.వి.ఆర్. శాస్త్రి

......

   ఒకాయనకు లేటు వయసులో లేకలేక కొడుకు పుట్టాడు. పుట్టగానే జాతకం ఎలా ఉందని జ్యోతిష్కులను అడిగాడు. వాళ్ళేమో - ఇరవయ్యో ఏడు తరువాత మీ వాడు గొప్ప సన్యాసి కావొచ్చని చెప్పారు.

   ఈ సంగతి మన వీర సైన్సు వాదులకు చెబితే ఫక్కున నవ్వుతారు. ఎక్కడో ఉన్న గ్రహాలూ, పుట్టిన క్షణంలోని నక్షత్రాలూ మనిషి భవిష్యత్తును నిర్ణయించడం 'నాన్సెన్స్' అని కొట్టిపారేస్తారు. మాయదారి జ్యోతిష్కులు ఏదో అన్నారని మరీ హడలిపోకు. అయితే గియితే అది ఇరవై ఏళ్ల తరవాత మాట కదా? కావలసినంత టైముంది. ఈలోపు కుర్రాడిని జాగ్రత్తగా పెంచు. మంచి స్కూల్లో చేర్పించు. దరిద్రగొట్టు వేదాంతం పుస్తకాలు చదవనియ్యకు. బైరాగుల్ని, సన్యాసుల్ని వాడి చాయలకు పోనివ్వకు. ఎప్పటికప్పుడు మంచి సైకాలజిస్టులకు చూపించు. బుర్ర చెడకుండా మధ్యమధ్య స్కానింగ్ చేయించు... అని విలువైన సలహాలు కూడా ఇస్తారు.

   ఆ తండ్రి వీరికంటే తెలివైనవాడు. ఆయన సామాన్యుడు కాదు. పెద్ద రాజ్యాన్నేలే మహారాజు. జోస్యం నిజం కాకూడదన్న ఆరాటంతో కొడుకుచుట్టూ దుర్భేధ్యమైన రక్షణ వలయం ఏర్పచాడు. కష్టం, దుఃఖం అనేది ఎరగకుండా పెంచాడు. రేయింబవళ్లూ, 365 రొజులూ సుఖాల్లో విలాసాల్లో ముంచెత్తాడు. కాస్త ఈడు రాగానే అప్సరసలాంటి అమ్మాయిని తెచ్చి పెళ్ళి చేశాడు. ముద్దులు మూటగట్టే మనవణ్నీ ఎత్తుకున్నాడు. బయటి ప్రభావాలేవీ పడకుండా, ప్రాపంచిక దుఃఖాలేవీ తెలియకుండా బహు జాగ్రత్తగా తాను కంట్రోలు చేస్తూ వచ్చినందువల్ల కొడుకు గురించి ఇక భయం లేదనే అనుకున్నాడు.

   ఏం లాభం? మానవ సాధ్యమైన జాగ్రత్తలన్నీ అనేక సంవత్సరాల ముందు నుంచే తీసుకున్నా. ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న భార్యతో, బిడ్డతో మమకార బంధాలను తెంచుకుని, సుఖాలనూ భొగాలనూ ఎడమకాలితో తన్నేసి 27వ ఏట ఎవరికీ చెప్పా పెట్టకుండా రాకుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యసించాడు.

   ఇదేమి కట్టుకథ కాదు. చరిత్ర పుస్తకాల కెక్కిన లోకారాధ్యుడు గౌతమ బుద్దుడి సుప్రసిద్ధ గాథ. ఇరవై ఏళ్ల తరవాత ఒక మనిషి జీవితం తిరగబోయే మలుపును అతడు పుట్టినప్పటి గ్రహగతుల ఆధారంతో జ్యోతిష్కులు చాలా కరక్టుగా చెప్పగాలిగారన్నదే ఈ చారిత్రక వాస్తవంలో గమనించాల్సిన పాయింటు.

   వేల సంవత్సరాల కిందటి బుద్దుడి జీవితంలో ఒక జోస్యం నిజమైతే ఏమిటట? అది కేవలం కాకతాళీయం కావొచ్చుకదా? జనానికి సైన్సు వాసన సోకని అజ్ఞానపుటంధయుగాల్లో జరిగిన వాటికి లెక్కేమిటి - అంటారా?

   సరే! వేల సంవత్సరాల కిందటి చరిత్ర గ్రంథాలను అవతల పారేసి ఆధునిక కాలానికే వద్దాం.

   దుర్గాదాస్ పేరు చాలామంది వినే ఉంటారు. గతంలో 'హిందుస్తాన్ టైమ్స్' దినపత్రికకు ప్రధాన సంపాదకుడు. నెహ్రూకు, పటేల్ కు బాగా సన్నిహితుడు. పటేల్ ఉత్తరాలను ఎడిట్ చేసి ఎనిమిది సంపుటులుగా ప్రచురించాడు. జాతీయ నాయకులతో ప్రత్యక్ష పరిచయాన్ని రంగరించి India from Curzon to Nehru and After పేరిట సుప్రసిద్ధ గ్రంథం రాశాడు. అందులో Enter the Soothsayer అధ్యాయం కింద అప్పటి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సత్యనారాయణ సిన్హాను ఉటంకిస్తూ, దుర్గాదాస్ ఇలా రాశాడు:

   ... సర్దార్ పటేల్ ఫలానా తేదీన మరణించనున్నట్టు ఒక జ్యోతిష్కుడు తొమ్మిది నెలల ముందుగా చెప్పాడు. కాని పటేల్ నమ్మలేదు. ఓ  రోజు రాత్రి సిన్హాకు మామూలుగా ఫోన్ చేసి, పార్లమెంటరీ వ్యవహారాలూ అవీ మాట్లాడాక 'ఏమంటున్నాడు మీ పత్రీవాలా?'  అని హాస్యమాడాడట కూడా. కానీ ఆ జోస్యుడు అన్నటే జరిగింది. సరిగ్గా అతడు చెప్పిన రోజునే పటేల్ కన్నుమూశాడు.

   1958లో టి.టి.కృష్ణమాచారి అధికార ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో ఇంకో పండితుడు వచ్చి ఆయన పతనమవనున్నాడని సిన్హాకు చెప్పాడు. మతిలేకుండా మాట్లాడుతున్నావని సిన్హా విసుక్కున్నాడు. అప్పుడా జ్యోతిష్కుడు 'కృష్ణమాచారి ప్రభుత్వం నుంచి నిష్క్రమించిన రోజునే మౌలానా ఆజాద్ బాత్ రూమ్ లో కాలుజారి పడి, నాలుగు రోజుల తరవాత మరణిస్తాడు' అన్నాడు. అలాగే ఆజాద్ కు యాక్సిడెంట్ అయింది. కలకత్తా నుంచి డాక్టర్ బి.సి.రాయ్ ను పిలిపించి చూపిస్తే కంగారు పడాల్సింది ఏమీ లేదన్నాడట. సిన్హా పార్లమెంటు లాబీలో నెహ్రూను కలిసి జోస్యం సంగతి చెబితే ' ఏం చెత్త నువ్వు మాట్లాడుతున్నది? ఆజాద్ కు ప్రమాదమేమీ లేదని బిధాన్ (డాక్టర్ రాయ్) గట్టిగా చెప్పాడు' - అని కోపంగా ఎగిరిపడ్డాడట. సరిగ్గా నాలుగు రోజుల తరవాత విద్యామంత్రి మరణించాడు. దీంతో నెహ్రూకు కూడా వణుకు పుట్టిందట.

   'నెహ్రూ మొదటిసారి తీవ్రంగా జబ్బు పడ్డది 1962 మార్చిలో. నెలపైగా మంచంమీద ఉన్న ఆ కాలంలో మీ జాతకం ఎవరైనా మంచి జ్యోతిష్కుడికి చూపించండి అని సిన్హా సలహా ఇస్తే నెహ్రూ పట్టించుకోలేదు.  అప్పుడు గుల్జారీలాల్ నందా నచ్చజెప్పి ఒప్పించాడు. డిల్లీలో బాగా పేరున్న జ్యోతిష్కుడు వచ్చి నెహ్రూ జాతకం పరిశిలించి 'మీ ఆప్తమిత్రుడు మీకు ద్రోహం చేస్తాడు. ఈ సంవత్సరంలోనే చైనా మన మీద దాడి చేస్తుంది' అన్నాడు. నెహ్రూ మండిపడి ' అది ఎన్నటికీ జరగదు. నీవి వట్టి మూర్ఖపు మాటలు' అనగా జ్యోతిష్కుడు జాతకాన్ని మడిచి వెనక్కి తిరిగిచ్చి వెళ్ళిపోయాడట.

   తరవాత ఎక్కువ వారాలు గడవకుండానే చైనా దండయాత్రకు దిగింది. నెహ్రూ జ్యోతిష్కుడిని ఆలకించే మనఃస్థితిలోకి వచ్చాడు. మళ్ళీ పిలిపిస్తే జ్యోతిష్కుడు వచ్చాడు. అతడు చెప్పింది వింటే దిగులు ఎక్కువైంది. 'నెహ్రూజీ జీవితకాలం ముగిసింది. ఇక పూజలు మాత్రమే ఆయన ఆయుస్సును పొడిగించగలవు' అని జోస్యుడు చెప్పాడట. ఆ తరవాత ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా యాభై మంది అర్చకుల చేత ఢిల్లీ శివారు కల్కాజీలోని గుడిలో నిర్ణీతమైన పూజలు చేయించారు. రోజూ పూజాదికాలు కాగానే బ్రాహ్మణ పండిట్లు ప్రధాని నివాసానికి వెళ్ళి ఆయన నుదుట బొట్టు పెట్టేవారు.

   దాని తరవాత ఇంకా తీవ్రస్థాయిలో 1964 జనవరిలో నెహ్రూ మళ్లీ జబ్బు పడతారని మే 27 తరవాత ఆయన ఉండరని జ్యోతిష్కుడు చెప్పాడు. సిన్హా ఎంత వారించినా వినకుండా కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనడానికి జనవరి 4న నెహ్రూ భువనేశ్వర్ వెళ్ళాడు. తర్వాత రెండు మూడు రోజులకు పక్షవాతం వచ్చింది. సరిగ్గా మే 27నే ఆయన తుదిశ్వాస విడిచాడు.

[India from Curzon to Nehru , Durga Das ..-pp374-375]

   దీనికేమంటారు?

   నిత్యశంకితులైన సోకాల్డ్ 'హేతువాదులు' దీన్నీ శంకించవచ్చు. పటేల్, ఆజాద్, నెహ్రూలు ఫలానా తేదీల్లో మరణించనున్నారని జోస్యుడు చెప్పాడనటానికి కాగితం మీద రుజువుందా? సత్యనారాయణ సిన్హా అనే ఆయన దుర్గాదాస్ అనే ఆయనకు ఎవరి గురించో చెబితే అంతా నిజమేనని నమ్మేయడమేనా? నోటి మాటకు విలువేముంది? పరోక్ష సాక్ష్యం ఎలా పనికొస్తుంది? అని సత్తెపెమాణకంగా కోప్పడవచ్చు.

   ఒకపెద్ద జాతీయ దినపత్రికకు సంపాదకుడుగా పనిచేసిన దుర్గాదాస్ అంతటి ప్రముఖుడు పుస్తకంలో రాసింది కూడా నిజం కాకపోవచ్చనే అనుకుందాం. ఎవరి మాటా నమ్మకుండా పూర్తిగా డాక్యుమెంటరీ రుజువులను బట్టే పోదాం.

ఇంకా ఉంది

Monday 26 March 2018

బ.మ. - లో. మ. ప్రహసనం

స్టార్స్ X సైన్స్ - 4


ఎం.వి.ఆర్.శాస్త్రి

.......

   సినిమాల్లోనే కాదు ... ద్విపాత్రాభినయాలు నిజ జీవితాల్లోనూ మామూలే. కొద్దిమంది మహానుభావులను మినహాయిస్తే మనలో ప్రతి మనిషీ రోజూ డబుల్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు. లోపలి మనిషి (లో.మ) వేరు; బయటి మనిషి (బ.మ) వేరు. బయటికి కనిపించే మనిషి చెప్పేదొకటి. లోపలి శాల్తీ చేసేది ఇంకొకటి. పెద్దమనిషి డ్రస్సు వేసుకుని నలుగురిలో ఉన్నంతసేపూ బయటి మనిషి ఆలోచనలెప్పుడూ ఆకాశమంత ఎత్తున విహరిస్తుంటాయి. పలికే ప్రతి పలుకులో ఉన్నత ఆదర్శం, ఉత్తమ సంస్కారం, వైజ్ఞానిక దృక్పథం ఎట్సేట్రాలు ఉట్టి పడుతుంటాయి. ఆ డ్రస్సు కాస్తా విప్పేసి తన ఒరిజినల్ కలుగులోకి వచ్చాక లోపలి మనిషి తరహా గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. అయ్యగారి అసలు స్వరూపం మురుగు సుగంధాలతో బయటపడుతుంది.

   అందరికీ తెలిసి కూడా ఎవరూ గుర్తించినట్టు కనిపించని ఈ బ.మ. - లో.మ.  వైరుధ్యానికి  జోస్యం మీద (అప) నమ్మకం చక్కటి దృష్టాంతం.

   జ్యోతిషాన్ని మీరు నమ్ముతారా అని అడగండి. సైన్సు పాంటు, మోడరన్ షర్టు వేసుకున్న ఏ పెద్ద మనిషి అయినా 'నమ్మను' అనే జవాబు చెబుతాడు. ఒకవేళ ఎవరన్నా అమాయకులు తమకు నమ్మకం ఉందని చెబితే నవ నాగరికులు వారిని వెర్రోళ్ళలా చూస్తారు. ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉండగా అందరి అదృష్టమూ జోస్యుడు పది ముక్కల్లో చెప్పిన ప్రకారమే నడుస్తుందని నమ్మటం మూర్ఖత్వమంటూ సైన్సు కత్తితో జ్యోతిషాన్ని పదిమందిలో చీల్చిచెండాడుతుంటారు.

   కాని చిత్రం ! పత్రిక చేతికి రాగానే వీరిలో చాలామంది కళ్ళు జ్యోతిషం కాలమ్ మీదకే మళ్ళుతుంటాయి. రోజూ ఒక పేపరు చూసేవాళ్ళు కూడా ఆదివారంనాడు నాలుగు పేపర్లు తిరగేసి, రాశిఫలాల్లో తమ గురించి ఏమి రాశారో రహస్యంగా చదివి బేరీజు వేసుకుంటారు.

   ఒక విప్లవ రచయిత శకునాలను నమ్మడు. కాని... పిల్లి ఎదురైతే ఇల్లు కదలడు. మరో ఆధునిక మేధావి జోస్యాల మీద, జాతకాల మీద పిసరంత నమ్మకం లేదంటాడు. కాని - కొడుక్కు పెళ్ళి చేయాల్సి వస్తే మొట్టమొదట ఆయన అడిగించేదే అమ్మాయి జాతకాన్ని. ఇంకో కమ్యూనిస్టు నాయకుడికి పూర్వాచారాలూ, సంప్రదాయాలూ బొత్తిగా గిట్టవు. పిల్లలకు కూడా దండల పెళ్ళిళ్ళే చేస్తాడు. కాని - దండలు మార్చుకునే టైమును మాత్రం (ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ఇల్లాలి ద్వారా) పంచాంగం పంతులు నిర్ణయిస్తాడు . ఒక్క సెకను కూడా అటూ ఇటూ కాకుండా మన కామ్రేడు గారు గొప్ప పంక్చువాలిటి పాటించి ఆదర్శవివాహాన్ని యథావిధిగా జరిపిస్తారు. హేతువాద సంఘంలో లైఫ్ టైమ్ మెంబరైన పెద్ద డిగ్రీల ప్రొఫెసరు గారొకరు హస్తసాముద్రికాన్ని ససేమిరా అంగీకరించరు. కాని - 'ఈయన గొప్ప పామిస్టు! మీ చేయి చూపించరాదా' అని ఏ దగ్గర బంధువో, స్నేహితుడో, చెబితే చాలు ఆయన అరచేయి ఆయనకు తెలియకుండానే తెరుచుకుని ముందుకు ఉరుకుతుంది. నమ్మకం ఉండి కాదు. ఉత్తినే! ఏమి చెబుతాడో సరదాగా విందామనే!!!

   రేషనలిస్టు, సోషలిస్టు, ఇంకో ఇస్టు అయిన ఒక వీర సైన్సు వాదికి రత్నాలనా, న్యూమరాలజీ అన్నా వాస్తు అన్నా ఒళ్ళు మంట. కాని అదేమి చిత్రమో! గ్రహచారం బాగోలేదు కనక నక్షత్రాన్ని బట్టి ఆయన ఏ రాయి వాడితే మంచిదని ఆయన ఇల్లాలికి చెట్టుకింద జ్యోతిష్కుడు మూడు రోజుల కిందట చెప్పాడో, సరిగ్గా అదే రాయి పొదిగిన ఉంగరం ఆయన కుడిచేతి అనామిక (చిటికిన వేలు పక్కన ఉండే ఉంగరపు వేలు)ను అర్జంటుగా అలంకరిస్తుంది. ఆయన కారు నెంబరు, ఫోను నెంబరు ఎటు నుంచి కూడినా 9 అంకె వస్తుంది. చాలా కాకతాళీయంగా! ఆయన కొనదలచిన ఇంటికి ఆగ్నేయంలో కిచెన్ లేకపోయినా, నైరుతిలో ద్వారం ఉన్నా ఆయనకు 'వేరే ఈస్తటిక్ కారణాల వల్ల' ఇల్లు నచ్చదు. ఈశాన్యం పెరిగి ఉన్న స్థలమైతే మాత్రం - ఆ సంగతి ఆయన గమనించకుండానే - ఆయనకు బోలెడు నచ్చేస్తుంది.

   బహిరంగంగా అడిగితే దేశంలో నూటికి 80 మంది జ్యోతిషం మీద నమ్మకం లేదనే చెబుతారు. అదే నిజమైతే మన దేశంలో జ్యోతిష్కులు, జ్యోతిషం చెప్పే సంస్థలు పనిలేక ఎప్పుడో దివాలా తీసి ఉండవలసింది. కాని... ఇవాళ వీధికో కంప్యూటర్ హారోస్కోప్ దుకాణం. ఊరికి నాలుగు ఆస్ట్రాలజీ సలహా కేంద్రాలు.

      ఆపి సాగర పర్యన్తా విచేతవ్యా వసున్ధరా
      దేశ హ్యారత్నిమాత్రోపి నాస్తి దైవజ్ఞ వర్జితః

   (ఈ భూమండలాన్నంతనీ సముద్రం దాకా వెదకండి. జ్యోతిష్కుడు లేనిదే జానెడు ప్రదేశం కూడా ఉండదు)

    -అని 17వ శతాబ్దం వాడైన నీలకంఠ దీక్షితులు కలివిడమ్బన శతకంలో చెప్పాడు. సైన్సు విజ్ఞానం వికసించని అంధ  యుగాలని మనం అనుకునే నాలుగొందల ఏళ్ళ కిందటే జానె కొక జ్యోతిష్కుడు ఉండగా శాటిలైట్లు, ఇంటర్నెట్ల ఈ ఆధునిక కాలంలో అంగుళానికి ఆరుగురు జ్యోతిష్కులు. అంతాహేతువాదులే అయి 'వెర్రి జోస్యాలను' ఎవరూ నమ్మకపోతే ఇంతమంది జ్యోతిష్కులను తామరతంపరగా వర్దిల్లజేస్తున్నదెవరు?

   మనిషి పుట్టినప్పుడే అతని భవిష్యత్తు మొత్తం నిర్ణయమై పోతుందంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. అన్నీ ముందే డిసైడ్ అయిపోతే మనిషి చొరవకు ఆస్కారమేమిటి ?  ఇక మనం చేయగలిగింది ఏమిటి - అన్న శంక చాలామంది జిజ్ఞాసువులకు సహజంగానే కలుగుతుంది. పంచాంగాలు, లగ్నాల లెక్కలనుబట్టి గ్రహాలు నడుస్తాయని, వాటి నడకనుబట్టి మనిషి జీవితం మరబొమ్మలా సాగుతుందని నమ్మడం మానవ మేధకు అవమానమని, వైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమని, సైన్సుకు అపచారమని గట్టిగావాదించేవారు ఎందరో ఉన్నారు. వారు చెప్పేది సహేతుకం, సమంజసం కూడా, కాని... వింతల్లోకెల్లా విడ్డూరం ఏమిటంటే - ఈ రకమైన ఆధునిక భావాలకు స్పూర్తినిచ్చి, శాస్త్రీయ మార్గంలోకి ఎంతోమంది ఆలోచనలు మరలడానికి కారణభూతులైన సుప్రసిద్ధ మహానీయుల్లో కూడా వ్యక్తిగత జీవితంలో జ్యోతిషాలను, జాతకాలను నమ్మేవారు చాలామందే ఉన్నారు.

   ఉదాహరణకు-
   నమ్ముతారో లేదో!
   జవహర్ లాల్ నెహ్రూ!!

   నెహ్రూ పేరు చెబితే ఒకటి రెండు తరాల కిందటి వరకూ యువకులకు ఒళ్లు పులకరించేది. దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని, బూజుపట్టిన పాత భావాల నుంచి బయట పడాలని, ప్రతిదాన్నీ శాస్త్రీయ దృష్టితోనే  చూసి, శాస్త్ర పరీక్షకు నిలబడినదాన్నే అంగీకరించాలని, ఆధునిక విజ్ఞాన జ్యోతులతో నవభారతాన్ని ఉజ్జ్వలంగా ప్రకాశింపజేయాలని నేషనల్ కాంగ్రెసు వేదికల నుంచి, ఇండియన్ సైన్సు కాంగ్రెసు అధ్యక్ష పీఠం నుంచి,  ఆయనచేసిన ఉత్తేజపూరిత ప్రసంగాలే యువతకు అనుక్షణం గుర్తుకొచ్చేవి. అంతటి నెహ్రూ పండితుడే తన కుమార్తె ఇందిరకు కొడుకు (రాజీవ్) పుట్టాడని తెలియగానే సరైన జాతకం వేయించమని చెప్పాడంటే నమ్ముతారా? అహ్మద్ నగర్ ఫోర్ట్ చెరసాల నుంచి 1944 ఆగస్టు 28న సోదరి కృష్ణ హతీసింగ్ కు రాసిన ఉత్తరంలో జవహర్లాల్ ఇలా అన్నారు:

  "In my letter to Indu, I suggested to her to ask you to get a proper horoscope made by competent person. Such permanent record of the date and the time of birth are desirable. As for the time, I suppose the proper solar time should be mentioned and not the artificial time which is being used outside now. War time is at least an hour ahead of the normal time."

   (సమర్ధుడైన వ్యక్తితో సరైన జాతకం వేయించాల్సిందిగా నీకు చెప్పమని ఇందూకు ఉత్తరం రాశాను. పుట్టిన తేది, సమయం గురించి అలాంటి పర్మనెంటు రికార్డు ఉండటం మంచిది. టైముకు సంబంధించినంత వరకూ సరైన సోలార్ టైమునే పేర్కొనాలి తప్ప ఇప్పుడు వాడుతున్న కృత్రిమ సమయాలను పేర్కొనకూడదు. మామూలు టైము కంటే వార్ టైము గంట ముందుంటుంది.)

  Faber and Faber అనే లండన్ ప్రచురణ సంస్థ వారు ముద్రించిన - సోదరికి నెహ్రూ లేఖలలో 74వ నెంబరు లేఖలోని భాగమిది. ఇది బయటకి తెలిస్తే నెహ్రూకున్న 'సెక్యులర్' ప్రతిష్ట దెబ్బతింటుందని కాబోలు భారత ప్రభుత్వం పబ్లికేషన్స్ డివిజన్ వారు అనంతర కాలంలో ప్రచురించిన నెహ్రూ లేఖల గ్రంథం నుంచి ఈ భాగాన్ని తీసేశారు. దాని మీద జ్యోతిష వర్గాలు అభ్యంతరం తెలిపిన మీదట - తరువాత వచ్చిన నెహ్రూ లేఖల 13వ వాల్యూంలో ఇందిరకు తండ్రి రాసిన లేఖను యథాతథంగా ప్రచురించారు. అందులో ఇలా ఉంది:

  "Betty nodoubt will take necessary steps to have Janmapatri made. This should be done for that is our traditional way to record the exact date and time of birth... Betty writes time of birth was 8.11 a.m. But what time? The time observed now is war time which is at least one hour ahead of normal time, possibly more. It is thus the artificial time and not the real time, according to which Moon should be when Sun is highest in the heaven..."

   ('జన్మపత్రిక'ను రాయించటానికి అత్త ఏర్పాటు చేస్తుందనుకో. పుట్టిన సమయాన్ని, తేదీని రికార్డు చేయడానికి అది మన సాంప్రదాయక పధ్ధతి కనక ఆ పని చేయాల్సిందే. పుట్టిన తేది ఉదయం 8.11 ని.లు అన్నారు. కాని - అది ఏ టైము? ఇప్పుడు వాడుకలో ఉన్నది వార్ టైము. అది అసలు సమయం కంటే గంటో అంతకంటే ఎక్కువో ముందుంటుంది. అది కృత్రిమం. అసలు టైములోనైతే సూర్యుడు ఆకాశంలో ఉన్నదాన్నిబట్టే చంద్రుడి స్థితీ ఉంటుంది.) 

    ఇది చదివాక ఒక అనుమానం రావచ్చు. కేవలం పుట్టిన తేదీని, సమయాన్ని రికార్డు చేయించటం కోసమే మనవడి జాతకాన్ని నెహ్రూ రాయించమన్నారా? అదే ఆయన ఉద్దేశమైతే జన్మపత్రికే రాయించనక్కర్లేదు. గడియారం, కేలండరు చూసి తేది ఫలానా, టైము ఫలానా అని ఒకచోట రాసి పెడితే సరిపోతుంది. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. మిగతా దేశాలతో మిలిటరీ సమన్వయం కోసం ఇండియాలోని గడియారాలను ( 1942 సెప్టెంబర్ 1 నుంచి 1945 అక్టోబర్ 15 వరకూ ) గంట ముందుకు తిప్పారు. పుట్టిన సమయం గుర్తు కోసమే అయితే ఉదయం 8-11 (వార్ టైం) అయినా 7-11 (అసలు టైం ) అయినా ఇబ్బంది లేదు. కానీ- జ్యోతిషం లెక్కలకు మాత్రం గంట తేడా వస్తే జాతకం మొత్తం మారుతుంది. రాశి, నక్షత్ర పాదం , లగ్నం, నవాంశ , గ్రహస్థితి అన్నీ మారిపోతాయి. అసలు టైం నే లెక్కలోకి తీసుకోవాలని తాతగారు అంతగా నొక్కిచెప్పటాన్ని బట్టే మనవడి జాతకం సరిగా ఉండాలనే, దాన్ని బట్టి ఫలితాలూ సరిపోవాలనే ఆయన ఆరాటమని స్పష్టం. అందుకే పుట్టిన టైం ను రికార్డు చేసి ఉంచమని కుమార్తె తో చెప్పి ఊరుకోకుండా , సరైన జాతకం వేయించమని చెల్లెలు కృష్ణ ను కోరాడు. ఆ పనిని ఆమె సరిగా చేయిస్తుందో లేదోనన్న ఆరాటం తోమనవడి జాతకం రాయమని వారణాసి లోని మాలవ్యాలనూ ఆయన అడిగాడు. ఆ పని  వాళ్ళు కాస్త ఆలస్యం చేసే సరికి చిరాకుపడుతూ మళ్ళీ గుర్తు చేశాడు.  ఈ వైనమంతటినీ నెహ్రూ జీవితకాలంలోనే యు.పి. మాజీ ముఖ్యమంత్రి సంపూర్ణానంద్ బహిరంగపరిచారు.

   ఇక్కడో సంగతి గమనించాలి. జవహర్ లాల్ నెహ్రూ జ్యోతిషాన్ని బాహాటంగా వ్యతిరేకించినా ఆ విద్యను ఇప్పటి మన కుహనా మేధావుల్లా గుడ్డిగా ద్వేషించలేదు.  వ్యక్తిగత జీవితంలో జాతకాల పట్ల తనకున్న ఆదర భావాన్ని దాచిపుచ్చెందుకూ ఈ కాలపు హిపోక్రైట్లలా తంటాలు పడలేదు. నెహ్రూ పుట్టిన సమయాన్ని జ్యోతిష్యులు తలా ఒక రకంగా లెక్కకడుతున్న సమయంలో ఆయన ప్రైవేటు సెక్రటరీ 1962 జూన్ 19 న ' ది ఆస్ట్రలాజికల్ మాగజిన్ ' కు రాసిన లేఖలో ఇలా తెలిపారు :

   The Prime Minister has asked me to write to you , that , so far as he knows , the time ogf his birth was 11-30 p.m. on November 14, 1889

    ( తనకు తెలిసినంతవరకూ తాను పుట్టింది 1889 నవంబర్ 14 రాత్రి గం. 11-30 ని.కు అని ప్రధానమంత్రి మీకు తెలియపరచమన్నారు.)

[19 ఆగస్టు 2001న ఆంధ్ర భూమి దినపత్రికలో వచ్చిన వ్యాసం ]




   


Sunday 25 March 2018

అంబేద్కర్ చెప్పిన మాట

మనుధర్మం -10


ఎం.వి.ఆర్. శాస్త్రి 

......

   మానవులందరూ సమానం.

   ఇది ఆదర్శం.

   ఎవరు ఎన్నికబుర్లు చెప్పినా మనుషులందరూ సమానం కాదు.

   ఇది వాస్తవం.

   సర్వమానవ సమానత్వాన్ని సాధించి , సమసమాజాన్ని స్థాపించి సోషలిస్టు స్వర్గాన్ని భూమిమీదికి కి తెస్తానని చెప్పి కొన్నితరాలతరబడి జనాన్ని మాయచేసిన కమ్యూనిస్టు పార్టీలలోనే సమానత్వం లేదు. ఆ సిద్ధాంతం ప్రపంచం లో బతికున్న కాలంలో సోషలిస్టు రాజ్యాలలోనే పార్టీ నాయకులకు ...  పార్టీలో , ప్రభుత్వం లో పలుకుబడి కలిగిన వారికి ఉండే ప్రత్యేక సౌకర్యాలకు , వైభోగాలకు - మామూలు పార్టీ మెంబర్లు , సాధారణ ప్రజలు ఎన్నడూ నోచుకోలేదు.

   కులాల అంతరాలను నిర్మూలించి , బడుగు బలహీన దళిత కులాలవారిని పైకి తెచ్చి సిసలైన సామాజిక న్యాయాన్ని సాధించటానికి అవతారమెత్టినట్టు చెప్పుకునే పార్టీలలో కూడా పెత్తనం చేసే పాలక వర్గానికి , నాయకుల బంధుమిత్ర ఆశ్రితగణానికి ఉండే ప్రాముఖ్యం , ప్రాధాన్యం బడుగుబలహీన దళిత కులాలకే చెందిన సాధారణ పార్టీ సభ్యులకు  ఉండదు.

  ప్రాచీన కాలంలో ఋషులు నెలకొల్పిన , వేల సంవత్సరాలు ఈ దేశం లో దివ్యంగా అమలుజరిగిన వర్ణ వ్యవస్థను ఈ కాలపు నానా భ్రష్టత్వాల దృష్టితో దుర్భాషలాడే వారు గుర్తించవలసిన కఠోర యథార్థమిది.

   వెనకపడిన కులాలకు, బడుగు బలహీన దళిత వర్గాలకు చెందిన సహోదరులందరినీ ఎక్కడా ఎందులో ఎటువంటి వివక్షచూపకుండా అందరితో సమానంగా ఆదరించాలని బస్తాలకొద్దీ పుస్తకాలు ,కట్టలకొద్దీ కవిత్వాలు రాసే పుణ్యాత్ములు కూడా తమ ఇళ్ళలో పనిచేసే పనిమనుషులను .. వారు కూడా తమలాగే దళిత కులానికో, తమలాగే బి.సి. కులానికో చెందినవారేనని తెలిసినా సరే -- వారిని పనిమనుషుల్లాగే చూస్తారు. తమతో పాటు సోఫాలలో కూచోబెట్టుకొని , రాగానే కాఫీ ఇచ్చి , దేశంలో బడుబలహీన దళిత కులాలకు జరుగుతున్న అన్యాయాల గురించి ముచ్చటించరు. ఎందుకంటే కులం ఒకటే అయినా పనిమనుషుల తరగతి వేరు .

    ఒక ఉన్నతాధికారికి, ఒక పెద్ద వ్యాపార ప్రముఖుడికి , ఒక పోలీసు ఆఫీసరుకు ఇచ్చే గౌరవాన్ని , చూపే ఆదరాన్ని ... కాయకష్టం చేసుకుని బతికే నౌకర్లూ చాకర్లమీద సాధారణంగా ఎవరూ చూపించరు. లేబర్ పని చేసే వాడు నీచుడనికాదు. ఉన్నతస్థానాలలో ఉన్నవారు ఉత్తములనీ కాదు. వారు చేసే పని హెచ్చుతగ్గులను బట్టి సమాజంలో వారికి ఉండే స్థానం హెచ్చుతగ్గులు ఆధారపడతాయి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా , ఏ సమాజంలో నైనా ఉన్నదే.

   గుర్రం , గాడిద మనిషి దృష్టిలో ఎప్పటికీ సమానం కాదు.  సమాజానికి ఉత్తమ సేవ చేస్తూ, అతి ముఖ్యమైన కీలక బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు ఉండే విలువ కూలీ పని చేసుకుని , కాయకష్టంతో బతికే మామూలు పనివాడికి ఉండదు. అది న్యాయమా అన్యాయమా అన్న చర్చ ఇక్కడ అనవసరం. చేసే వృత్తిని బట్టి మనిషి విలువ ఉంటుందన్నదే ఇక్కడ గమనించవలసిందల్లా !

   మరి మనువు చెప్పిందీ అదే కదా ? చేసే వృత్తిని బట్టి అతడు సమాజాన్ని నాలుగు తరగతులుగా వర్గీకరించాడు. చేసే పని ప్రాముఖ్యాన్ని బట్టి ఆయా తరగతుల ఎక్కువ తక్కువలను నిర్ణయించాడు. అందులో తప్పేమిటి ?

   ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా బలవంతుడు బలహీనులమీద పెత్తనం చేయటమే కనపడుతుంది. బలవంతుడు చెప్పినట్టే మిగతావారంతా నడవాల్సిందే. అధికారం చెలాయించేవాడు ఏమి చేసినా , ఏమి చెప్పినా మిగతావారు నోరుమూసుకుని చచ్చినట్టు పడి ఉండవలసిందే. ఎంతటి విద్వాంసుడైనా , ఎంత గొప్ప జ్ఞాని అయినా పరిపాలకుడి ఆధిపత్యానికి , అతడి దయా దాక్షిణ్యాలకు లోబడి బతకవలసిందే ! కదా ?

    ప్రపంచ మానవ చరిత్ర మొత్తంలో మొట్టమొదట  ఒక్క మనువు మాత్రమే జ్ఞానానికి , విద్వత్తు కు పెద్దపీట వేశాడు. విద్య నేర్పే , ధర్మం బోధించే , సదాచారం ఆచరించే శ్రేష్ఠుడు , రాజ్యమేలే వాడికంటే అధికుడు అన్న అత్యుత్తమ ప్రమాణాన్ని మనువు నెలకొల్పాడు. విద్య అధ్యయనం , అధ్యాపనం , సమాజ హితం కోసం యజ్ఞాలు చేయటం , చేయించటం విధిగా నిర్దేశించబడ్డ బ్రాహ్మణ తరగతికి సమాజంలో అత్యున్నత గౌరవ స్థానం ఇచ్చాడు. ప్రజలకు రక్షణ , భద్రత కల్పించి శాంతిని కాపాడే క్షత్రియ తరగతికి రెండో స్థానం కేటాయించాడు. వ్యవసాయం, పశుపాలన, వర్తక వాణిజ్యాలను నిర్వహించే వైశ్య వర్ణానికి మూడో ప్రాధాన్యం ఇచ్చాడు. ఏ నైపుణ్యం లేక , విద్య, సంస్కారాలకు దూరమై అధమస్థాయిలో జీవించే వారిని  శూద్ర నిర్ణయించి , పై వర్ణాలకు సేవచేసే పనిని అప్పగించాడు.

  అంతే కాదు. ఏ వర్ణానికి ఆ వర్ణానికి విధులను, బాధ్యతలను, ఉండవలసిన యోగ్యతలను మనువు  స్పష్టం గా నిర్వచించాడు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకను బట్టి నిర్ణయం కాదనీ , వారివారి చాయిస్ ను బట్టే ఉంటుందనీ కట్టడి చేశాడు. బ్రాహ్మణ తలిదండ్రులకు పుట్టినవాడైనాసరే , బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి శూద్రలక్షణాలను  సంతరించుకుంటే శూద్రుడుగానే పరిగణింపబడతాడన్నాడు. అలాగే శూద్ర కుటుంబం లో పుట్టినవాడు బ్రాహ్మణ లక్షణాలను , యోగ్యతను సంతరించుకుంటే బ్రాహ్మణుడుగానే గుర్తించబడాలని చెప్పాడు. ఇలా స్వభావాన్ని బట్టి , గుణాన్ని బట్టి. సామర్ధ్యాన్ని బట్టి ఒక వర్ణంనుంచి ఇంకో వర్ణానికి ప్రమోషనుకూ , ఆటోమేటిక్ డిమోషనుకూ మనువు గట్టి కట్టు బాటు పెట్టాడు. ఇందులో తప్పు పట్టవలసింది ఏముంది ?

  కాలక్రమంలో మనువు నిర్ణయించిన " గుణాన్ని బట్టి వర్ణాలు " కాస్తా " పుట్టుకను బట్టి కులాలు " గా వికృత రూపం సంతరించుకున్నాయి.  పోనుపోను ఆ కులవ్యవస్థ వికటించి వెర్రితలలు వేసింది . ఆ వికారపు అవకరాన్ని  చేతనైతే శాయశక్తులా రూపుమాపవలసిందే. కాని అనంతర కాలంలో జరిగిన వైపరీత్యానికి మనువు నెందుకు తిట్టిపోయటం ? అంబేద్కర్ ప్రభ్రుతులు రూపొందించిన భారత రాజ్యాంగవ్యవస్థలో  పోనుపోను చోటు చెసుకున్న విపరీతాలకు, వికృతాలకు అంబేద్కర్ బాధ్యుడని మతివున్నవాడెవడైనా అంటాడా ? మరి మనువు పెట్టిన ధర్మవ్యవస్థలో తరవాత జరిగిన వైపరీత్యాలకు మనువును ఎందుకు ముద్దాయిని చేయటం ?

  మనువు పేర్కొన్న బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య , శూద్ర తరగతులే కాలక్రమంలో అవే పేర్లతో కులాలుగా మారటంతో మనం చూస్తున్న కులాలు, మనువు పెట్టిన వర్ణాలు ఒకటేనన్న దురభిప్రాయం మనకు కలిగింది. అది మన అవగాహన లోపం. నిజానికి కులాలకూ వర్ణాలకూ ఎక్కడా అసలు పోలికే లేదు. ఆ మాట వేరెవరో కాదు. మనువాదానికి , కులవ్యవస్థకు  బద్ధవ్యతిరేకి అయిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కరే అంగీకరించాడు . Annihilation of Caste , Castes in India అనే గ్రంథాలలో ఆయన ఏమన్నాడో చూడండి :



  The principle underlying caste is fundamentally different from the principle underlying varna.Not only are they fundamentally different , but they are also fundamentally opposed .
[ Annihilation of Caste , B.R.Ambedkar , P.59 ]

( కులం వెనుక ఉన్న సూత్రం వేరు. వర్ణం వెనుక ఉన్న సూత్రం వేరు. ఆ రెండూ మౌలికంగా వేరు కావటం ఒకటే కాదు. అవి మౌలికంగా పరస్పర వ్యతిరేకమైనవి కూడా ) 

   We shall be well advised to recall at the outset that the Hindu society, in common with other societies, was composed of classes and the earliest known are the (1) Brahmins or the priestly class ; (2) the Kshatriya, or the military class ; (3) the Vaishya, or the merchant class and (4) the Shudra,or the artisan and menial class. Particular attention has to be paid to the fact that this was essentially a class system, in which individuals, when qualified, could change their class, and therefore classes did change their personnel.
[CASTES IN INDIA , Dr. B.R.Ambedkar , P.17 -18 ]
   
    ( అప్పటిలో మిగతా సమాజాల లాగే హిందూ సమాజం నాలుగు తరగతులుగా విభజింపబడినదని మనం గుర్తుంచుకోవాలి. ప్రాచీనకాలంనుంచీ తెలిసినవి ఏమిటంటే 1. బ్రాహ్మణులు అనే పురోహిత తరగతి. 2. క్షత్రియులు అనే  సైనిక తరగతి  3. వైశ్య అనే వర్తక తరగతి 4. శూద్ర అనే చేతిపని , పరిచారక తరగతి . ముఖ్యంగా గమనించవలసిన వాస్తవం ఏమిటంటే ఇది ప్రధానంగా తరగతి వ్యవస్థ . కావలసిన అర్హత సంపాదించినప్పుడు వ్యక్తులు తమ తరగతినీ మార్చుకొనగలరు.  తరగతులు వ్యక్తులను మార్చుకొనగలవు. )

   Varna and Caste are two very different concepts. Varna is based on the principle of each according to his worth, while Caste is based on the principle of each according to his birth. The two are as distinct as chalk is from cheese.
[Annihilation of Caste , B.R.Ambedkar , P.93 ]
  
   ( వర్ణం ,కులం అనేవి వేరువేరు భావనలు . వర్ణం యోగ్యతను బట్టి , కులం పుట్టుకను బట్టి నిర్ణయమవుతాయి. రెండిటికీ మధ్య జున్నుకూ , సుద్దకూ ఉన్నంత తేడా ఉంది. ) 

   వర్ణవ్యవస్థ గురించి మనవారికి ఉన్న రెండో పెద్ద దురభిప్రాయం ఏమిటంటే అందులో శూద్రులకు బొత్తిగా విలువ లేదని. వారిని నీచులుగా చూసి దారుణమైన వివక్షకు , అవమానాలకు గురి చేశారని. అసలు శూద్రులనబడే వారు ఈ దేశం లో ఆదినుంచి ఉన్న భూమిపుత్రులనీ , ఎక్కడినుంచో వచ్చిన ఆర్యులు వారిని లొంగదీసుకుని , "దస్యులు లేక దాసులు" అని వారికి పేరు పెట్టి , తమ వర్ణ వ్యవస్థలో అవమానకరమైన నాలుగో స్థానం ఇచ్చి కాళ్ళకింద తొక్కివేశారని  పిచ్చి పుస్తకాలు రాసిన వాళ్ళూ ఉన్నారు. ఆర్యులు తెల్లని వారనీ , ద్రవిడులు లేక శూద్రులు నల్లని వారని రంగుల తంపులు పెట్టిన మేధావులూ ఉన్నారు. వీరి  దుష్ప్రచారాలకు దిమ్మతిరిగే సమాధానం అంబేద్కర్ గారే ఇవ్వాలి .

   It is erroneous to believe that the Shudras were conquered by the Aryan invaders. In the first place the story that the Aryans came from outside India and invaded the natives has no evidence to support it. There is a large body of evidence that India is the home of the Aryans. In the second place there is no evidence anywhere of any warfare having taken place between Aryans and Dasyus but the Dasyus have nothing to do with the Shudras. 
[Dr. Babasaheb Ambedkar Writings and Speeches , Vol.3 , P. 420 ]

( దండెత్తివచ్చిన ఆర్యులు శూద్రులను జయించారనుకోవటం తప్పు. అసలు- ఆర్యులు భారతదేశం బయటినుంచి వచ్చి ఇక్కడి దేశీయులను ఆక్రమించారన్న కథకు పిసరంత సాక్ష్యం లేదు. భారతదేశమే ఆర్యుల స్వస్థలం అనటానికి బోలెడు సాక్ష్యాలున్నాయి. ఆర్యులకు , దస్యులకు మధ్య యుద్ధం జరిగిందనడానికి సాక్ష్యం లేదు. దస్యులకు, శూద్రులకు సంబంధమే లేదు. )

  The Shudras were Aryans i.e. they were believers in the Aryan way of life. The Shudra was accepted as an Aryan and as late as Kautilya’s Artha Shastra was addressed as Arya. The Shudra was an integral, natural and valued member of the Aryan Society ... ( ibid  P.421  )

   ( శూద్రులు ఆర్యులు .వారు ఆర్య జీవనవిధానాన్ని విశ్వసించేవారు. శూద్రుడు అర్యుడిగా అంగీకరించబడ్డాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రం నాటి కి కూడా "ఆర్యా" అనే శూద్రుడు సంబోధించబడ్డాడు. ఆర్య సమాజంలో శూద్రుడు సమగ్రమైన, సహజమైన , విలువగల సభ్యుడు )

    That the Shudras were invited to be present at the coronation of the King along with Brahmins, Kshatriyas and Vaishyas is proved by the description given in the Mahabharata of the coronation of Yudhisthira the eldest brother of the Pandavas. Shudra took part in the consecration of the King. According to ancient writer called Nilkantha speaking of the coronation ceremony expressly says: “that the four chief Ministers, Brahmin, Kshatriya, Vaishya and Shudra consecrated the new king. Then the leaders of each Varna and by the Castes lower still consecrated him with the holy water. (ibid , P. 421 )

   ( రాజు పట్టాభిషేక సమయంలో  బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్యులతో పాటు శూద్రులు కూడా అక్కడ ఉండేవారు.. పాండవుల అగ్రజుడు  యుధిష్తిరుడి పట్టాభిషేకం గురించి మహాభారతం లో ఉన్న వర్ణన దీనికి రుజువు. బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య, శూద్ర వర్ణాలకు చెందినా అమాత్యులు, తరవాత ప్రతివర్ణానికి , దిగువ కులాలకు చెందిన ప్రముఖులు కొత్తరాజును పవిత్ర జలం తో అభిషేకించారని నీలకంటుడనే ప్రాచీన గ్రంథకర్త స్పష్టంగా చెప్పాడు.)  

ఇంకా ఉంది .





 



























    

Saturday 24 March 2018

చెత్త తెచ్చిన చిక్కు

పాత ముచ్చట్లు - 9 


ఎం.వి.ఆర్.శాస్త్రి 

........

   అది ఉరుములేని పిడుగు.

   రాయ బెరేలి లో ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. దాని  మీద పత్రికలు  ,మేధావులు, రాజకీయవర్గాలూ తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు చేస్తూ , ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాలని దేశవ్యాప్తంగా  తీవ్ర ఆందోళన సాగుతుండగా 1975జూన్ 25 అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు రేడియోలో నివ్వెరపరిచే వార్త ! ఆ రాత్రికి రాత్రే దేశమంతటా వేల సంఖ్యలో అరెస్టులు. ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియకుండా  పత్రికల కళ్ళకు సెన్సార్ షిప్ గంతలు.

   అది అప్పటి తరానికి కనీవినీ ఎరుగని గత్తర . తెల్లవాళ్ళ హయాం లో పత్రికల మీద కరకు ఆంక్షలు ఉండేవని వెనకటివారు చెబితే వినటమే.  తన కుర్చీని కాపాడుకోవటానికి ఇందిరమ్మ దేశానికి తెచిపెట్టిన సెన్సార్ పీడ పాతతరం వాళ్ళు కూడా కలలోనైనా ఊహించనిది.

    స్వేచ్ఛ గా పనిచేసుకోవటానికి అలవాటుపడ్డ ఎడిటర్ల నెత్తిమీద రెవిన్యూ అధికారులు కత్తెర్లు పట్టుకుని తిష్ఠ వేశారు. ఏ పత్రికలో ఏ పేజీ లో ఏమి వేస్తున్నారనేది ప్రచురణ కేంద్రం లో పెద్ద అధికారి అయిన కలెక్టర్ కో ,  సబ్ కలెక్టర్ కో , ఆర్ డీ వొ కో , డీ.పీ.ఆర్.వొ కో ముందుగా చూపించాలి. అచ్చుకు వెళ్ళబొయ్యేముందు ఏ అర్ధరాత్రో పేజి ప్రూఫ్ లు సర్కారు వారికి సమర్పించుకోవాలి. అక్కడ జర్నలిజం అంటే ఏమిటో తెలియని... కామన్సెన్సు తక్కువ; అనుమానాలు ఎక్కువ అయిన ఆఫీసర్లు భూతద్దాలతో వాటిని పట్టిపట్టి గాలిస్తారు. ప్రభుత్వానికి, పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఏ మాత్రం వాసన తగిలినా ఒక వార్తలో పేరాలకు పేరాలు , ఒక పేజీలో వార్తలకు వార్తలను ఎర్ర సిరాతో కొట్టేస్తారు. సంపాదకీయాల , ఎడిట్ పేజీ వ్యాసాలనిండా  ఇష్టం వచ్చినట్టు  కత్తికోతలు పెడతారు. వాటిలో అభ్యంతరకరమైన విషయాలు, పదాలు ఏమీ లేవని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. ఇప్పటికిప్పుడు ఈ కొట్టివేతలను ఎలా సర్దుకోవాలి , పత్రికను ఎప్పుడు అచ్చు వెయ్యాలి , పాఠకులకు ఎప్పటికి చేరవెయ్యాలి అని అడుగుతే " అదంతా మాకు తెలవదు. మీ ఏడుపు మీరు ఏడవండి. " అనేవారు. కొట్టివేసిన వాటి బదులు వేరే మాటర్ పెట్టినా మళ్ళీ దాన్నీ పట్టుకొచ్చి ఈ అయ్యలకు దాఖలు చేసుకోవలసిందే.

   దానికి సమయం చాలక , లేక ఒళ్ళు మండి -  పేజీలలో సెన్సార్లు పెట్టిన కంతలను పూడ్చకుండా అలాఉంచే పత్రికల వారు పేజీలను ప్రచురించేవారు. కొంతమంది సంపాదకులు నిరసన సూచకంగా సంపాదకీయం స్పేసును ఖాళీగా ఉంచేవారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ వార్త లేక ఏ రాత తమ కొంప ముంచుతుందో, ఎక్కడ అరెస్టు అవుతామోనన్న భయంతో పత్రికల వాళ్ళకు దినదినగండం గా ఉండేది. కూచుంటే లేవలేని అధికారి కూడా పెద్ద పెద్ద జర్నలిస్టులకు ఏది ఎలా రాయాలన్న దాని మీద దిక్కుమాలిన పాఠాలు చెప్పేవాడు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారు తన దృష్టికి వచ్చిన విషయాలపై ఉదారంగా స్పందించి జర్నలిష్టులకు వీలైనంత ఊరట నిచ్చేవారు. కానీ నూటికి 99.9 వ్యవహారాలు ముఖ్యమంత్రిదాకా వెళ్ళవు. చాదస్తపు అధికారుల బారిన పడ్డ జర్నలిస్టులకు దేవుడే దిక్కు. పోను పోను ఆంక్షలు కాస్త సడలినా మొదట్లో అవి మహా కర్కశంగా ఉండేవి.

   అదిగో , ఆ తొలి దశలో నేను మా వూళ్ళో చెత్త సమస్య మీద ఆంధ్రజ్యోతి కి ఒక వార్త పంపాను.  " మురికివాడగా మారిన జగ్గయ్యపేట పంచాయతి " అన్న హెడ్డింగుతో అది మొఫసిల్ పేజీలో ప్రముఖంగా వచ్చింది. దాన్ని చూసి కొత్తగా వచ్చిన పంచాయతీ  స్పెషల్ ఆఫీసర్ అగ్గిరాముడయ్యాడు. రాసిందంతా అబద్ధం , అన్యాయం అంటూ పత్రిక ఎడిటర్ కి పెద్ద ఫిర్యాదు చేశాడు.

   అప్పుడు ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు.  ఆయన సంపాదకత్వ బాధ్యత  దాదాపుగా విరమించి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. విజయవాడ లో రెసిడెంట్ ఎడిటర్ నండూరి రామ మోహనరావుగారు. వాస్తవానికి ఎడిటర్ ఆయనే. ఆయన మంచివాడు. నాకు బాగా తెలిసిన వాడు . ఎప్పుడైనా బెజవాడ వెళ్ళినప్పుడు సాయంత్రాలు ఆయన డెస్క్ లో ఒక్కడే కూచుని ఉండే సమయంలో కలిస్తే బోలెడు కబుర్లు చెప్పేవారు. నాతొ పాటు బయటికి వచ్చి నా బస్సుస్టాప్ దగ్గర నిలబడి ఆంధ్రపత్రికలో తాను చేసిన మార్క్ ట్వేన్ నవలల అనువాదాలగురించో ఇంకొకటో  మాట్లాడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవారు.

  నాకు అంత బాగా తెలిసిన ఆ గొప్పమనిషి కూడా ఎమర్జెన్సీ కాలంలో పంచాయతీ అధికారి నుంచి ఫిర్యాదు చూసి కంగారు పడ్డారు. " ఇదుగో ఫలానా అధికారి మాకు ఇలా రాశాడు. ఇకపై అటువంటి ఫిర్యాదులకు ఏ విధమైన ఆస్కారం ఇవ్వ రాదని ఇందుమూలముగా ఆదేశించడమైనది - అంటూ నాకు శ్రీముఖం పంపారు. పైగా అత్యవసరపరిస్థితి నీ , దానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలనూ దృష్టిలో పెట్టుకొని వార్తల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆంధ్రజ్యోతి విలేఖరులందరికీ జారీచేసిన సర్క్యులర్ కూడా దానికి జతపరిచారు. ( అసలు ఆ సర్క్యులర్ కి కారణం నేనేనట!  నా మీద స్థానిక అధికారి ఫిర్యాదును సీరియస్ గా తీసుకునే రామమోహనరావుగారు అందరికీ హెచ్చరిక పంపారని అప్పట్లో విజయవాడ టౌన్ రిపోర్టర్ గా ఉన్న నా మిత్రుడు ఐ. వెంకట్రావుగారు తరవాత నాకు చెప్పారు. )

   నా వార్త అంత కదలిక తెస్తే సంతోషమే . కాని నండూరి వారి మందలింపు  నాకు ఎంత మాత్రం నచ్చలేదు. జగ్గయ్యపేటలో పారిశుద్ధ్యం సమస్యకీ అత్యవసర పరిస్థితికీ సంబంధం ఏమిటి ? మా ఊరి చెత్త గురించి రాస్తే దేశ భద్రతకో , జాతీయ ప్రయోజనాలకో ఏ విధంగా ఇబ్బంది ?  పోనీ నేను రాసింది అబద్ధమా ? కాదు ! ఇదిగో ఆధారాలు, ఫోటో సాక్ష్యాలు . నిజమేమిటో నిర్ధారించుకోకుండా అలా ఎలా మందలిస్తారు ? ఫిర్యాదుకు ఆస్కారమే ఇవ్వకూదదంటే ఏ విలేఖరి అయినా ఎలా పనిచేయగలడు - అంటూ ఆయనకి పెద్ద ఉత్తరం రాశాను . తరవాత కలిసినప్పుడు రామమోహనరావుగారు తన ఎమర్జెన్సీ ఈతిబాధల గురించి  చాలా చెప్పారు. అవి వింటే పాపం అనిపించింది.

  నా మీద కంప్లయింట్ చేసిన స్పెషల్ ఆఫీసరు కూడా పోను పోను నాకు దగ్గరి మిత్రుడు అయ్యాడు.  కానీ అప్పటి నా అనుభవం నా మీద పెద్ద ప్రభావం చూపింది.   తరవాత నేను ఈనాడుకు వెళ్లి సెంట్రల్  న్యూస్ బ్యూరో  కు ఇంచార్జి అయినప్పుడూ , దరిమిలా ఆంధ్రప్రభ డిప్యూటీ ఎడిటర్ గా రిపోర్టర్ల నెట్ వర్క్  మొత్తాన్నీ చూసినప్పుడూ వెనకటి నా అనుభవం ఎప్పుడూ గుర్తుకొచ్చేది. అప్పుడు నా లాగా , నా కింద పనిచేసే ఏ రిపోర్టరూ నిజం రాసినందుకు మాటపడకూడదు ; సమస్య ఏదైనా రానీ , సిన్సియర్ గా పనిచేసే రిపోర్టర్ కి అండగా నేను ఉండి తీరతాను అనుకున్నా. కంప్లయింట్లకు , లీగల్ కేసులకూ భయపడకండి. మీమీద ఎన్ని ఫిర్యాదులు వస్తే మీరు అంత బాగా పనిచేసినట్టు అని మా వాళ్లకు ( సక్రమంగా డ్యూటీ చేసే వాళ్ళకు మాత్రమే ) నేను చెప్పేవాడిని. ఆ మాట నిలబెట్టుకోవటానికి చాలా గొడవలే ఎదుర్కోవాల్సి వచ్చింది.

  జగ్గయ్యపేట లో గ్రామీణ విలేఖరిగా ఉన్నప్పుడు నా జీవితాశయం ఎప్పటికైనా ఐ. వెంకట్రావు గారిలా విజయవాడ టౌన్ రిపోర్టరు కావాలని ! లేదా మా ఊరు దగ్గరి ఖమ్మంలో  ఆంధ్రజ్యోతికి జిల్లా రిపోర్టర్ గా పనిచేయాలని. అది వీలుపడకపోతే  జగ్గయ్యపేట లోనే వార్తలు, వ్యాసాలు రాసుకుంటూ , ఎల్ ఐ సి ఏజెంటుగా పని కొనసాగిస్తూ, కమ్యూనిస్టు పార్టీ పని, అభ్యుదయ రచయితల సంఘం ( అరసం ) వగైరా విప్లవ కార్యక్రమాలను సాగిస్తూ జీవయాత్ర సాగించాలని ! ( అప్పటి కమ్యూనిస్టు పర్వం గురించి , తరవాత నాలో వచ్చిన మౌలిక పరివర్తన గురించి ఇంకోసారి రాస్తాను. )

   వ్యాపకాలు , రాచకార్యాలు చాలానే ఉన్నాయి. డబ్బులే ఇబ్బంది. ఆంధ్రపత్రిక ఏజెన్సీ మీద వచ్చేది తక్కువ. ఇన్సూరెన్సు ఏజెన్సీ ఫరవాలేదు. పెళ్లి కాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ . వాటికీ కటకటగానే ఉండేది. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంతో దయతో నెలసరి మొత్తాన్ని పది నుంచి పాతికకు పెంచారు.అప్పట్లో వారపత్రికలలో వస్తూండే వింత ఇంటర్వ్యూ లను పారడీ చేస్తూ " భా.మ. తో ఇంటర్వ్యూ " అనే రచనను నేను పంపితే రామమోహనరావుగారు దాన్ని ఆదివారం అనుబంధంలో వేసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు.


   దాన్ని చూసినవారు అది తను రాసింది అనుకున్నారని తరవాత ఒకసారి కలిసినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు అన్నారు. ఆ ఉత్సాహంతో అలాంటి వ్యంగ్య రచనలు చాలా చేసాను. నండూరివారు వాటిని ఎడిట్ పేజీ లోనో, ఆదివారం అనుబంధం లోనో కనీసం వారానికొకటి వేస్తూండే వారు. ఒక్కో దానికి పాతిక రూపాయలు పారితోషికం ఇచ్చేవారు.

   ఈ ప్రకారంగా నెలకు పాతిక రూపాయల జీతం , వారానికి ఒకటి చొప్పున నాలుగు వ్యాసాలకు పాతికేసి చొప్పున నెలకు వంద ... మొత్తం 125 రూపాయలు ఇస్తున్నారు కదా ? డబ్బులకు కాస్త ఇబ్బందిగా ఉంది . వీలయితే నా నెలసరి మొత్తాన్ని 25 నుంచి 50 చెయ్యగలరా ? అప్పుడు మొత్తం మీద150 రూపాయల సంపాదనతో నేను హాయిగా బతకగలవాడను .. ఏమంటారు ? అని ఓ సారి రామమోహనరావు గారిని అడిగాను. ఆయన ఆలోచించి చెపుతా అన్నారు.

    తరవాత బాగా అలోచించి ఆలోచించి చివరికి -  నా పారితోషికాన్ని 25 నుంచి 50 కి పెంచెట్టు చేయటం తన శక్తికి మించిన పని అని చెప్పారు. నా మీద అభిమానం తో ఒక సలహా ఇచ్చారు. ఏమనంటే - కొత్తగా ఈనాడు పత్రిక వచ్చింది కదా ? వాళ్ళు త్వరలో విజయవాడ లో ఎడిషన్ పెట్టబోతున్నారు . దానికి విలేఖరులు కావాల్సి వస్తుంది . వాళ్ళయితే నెలకు 50 రూపాయలు ఇవ్వగలరు. ప్రయత్నించి చూడండి  - అని !

   ఆనాడు రామమోహనరావుగారు ఇచ్చిన ఆ ఒక ఐడియా నా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. 


Thursday 22 March 2018

ఎవరు మూర్ఖులు ?

స్టార్స్ X సైన్స్ - 3


ఎం.వి.ఆర్.శాస్త్రి

.......
 ( "ఏది సైన్సు, ఏది నాన్సెన్సు" .... "జ్యోతిషాన్ని తిట్టటం మూర్ఖత్వం " ల తరవాతి భాగం )

   జ్యోతిష్కులు వేస్తున్నవేమైనా తలాతోకాలేని వెర్రి లెక్కలా? కాదు. వేల సంవత్సరాల కిందటి గర్గసంహిత గ్రహణాలను బట్టి, పూర్ణిమ అమావాస్యలనుబట్టి భూకంపాలను ఊహించటానికి స్పష్టమైన తోవ చూపింది. దాని ప్రకారం 20వ శతాబ్దంలో వచ్చిన 170 భూకంపాలను అధ్యయనం చేస్తే గ్రహణం నాటి నుంచి 30వ తిథి మొదలుకుని తరవాతి పక్షంలో రెండో తిథి లోపు (అంటే ఇంచుమించుగా మళ్లీ అమావాస్య - పౌర్ణమిల ప్రాంతంలో) భూకంపాలను ఆస్కారం ఉంటుందని తేలింది. (సూర్య గ్రహణం అమావాస్య రోజు, చంద్రగ్రహణం పౌర్ణమి నాడు పడతాయని తెలిసిందే.) అలాగని గ్రహణం తరవాత వచ్చే ప్రతి అమావాస్య, పున్నముల్లో భూమి కంపిస్తుందని కాదు. ఇంకా లెక్కలోకి తీసుకోవలసిన జ్యోతిష శాస్త్రపరమైన అంశాలు, గ్రహస్థితి గతులు చాలా ఉంటాయి.

    ఫలితాలు ఎంత బాగా చెప్పగలుగుతున్నా మన జ్యోతిష్కులు మూర్ఖుల్లా, వారి శాస్త్రం వెర్రి మూఢ నమ్మకంలా మన కుహనా మేధావుల కంటికి కనిపిస్తున్నప్పటికీ విదేశాలు వారి విద్యను ఆసక్తితో గమనిస్తున్నాయి. అవసరమైన మేరకు నిస్సంకోచంగా ఉపయోగించుకుంటున్నాయి కూడా. ఉదాహరణకు కొయినా తదితర భూకంపాలను పూణే జోస్యుడు కేల్కర్ ముందే ఊహించగలగటాన్ని  మనశాస్త్రజ్ఞులైతే పెద్దగా పట్టించుకోలేదు. కాని - కమ్యూనిస్టు రష్యా విశేష ఆసక్తి చూపింది. సోవియట్ సైంటిస్టులు ప్రత్యేకంగా పూణే వెళ్ళి కేల్కర్ ను కలిసి, గ్రహణాలకూ చంద్రుడి వృద్ది క్షయాలకూ భూకంపాలకూ మధ్య జ్యోతిషపు లంకెను బోధపరచుకుని, దాని ప్రాతిపదికపై అనేక శాస్త్రీయ అధ్యయనాలు జరిపారు. గర్గ మహర్షి సూత్రాలనే 'న్యూట్రాన్ ఫ్లాషింగు' పేరిట వారు అనుభవపూర్వకంగా అంగీకరించారు. జ్యోతిషానికి గల శాస్త్రీయ ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించే రష్యన్ అకాడమీ ఆఫ్ నాచురల్ సైన్సెస్ లో జ్యోతిషం అధ్యయనాన్ని ప్రోత్సహించసాగారు. మన దృష్టిలో జ్యోతిషం చేతబడి లాంటి క్షుద్రవిద్య కాబట్టి దాన్ని ఆదరిస్తున్న రష్యన్ సైంటిస్టులనూ మూఢులందామా?

   భూకంపాలనే గాక తుఫాన్లు, వర్షాల తాకిడినీ సైన్సు కంటే బాగా జ్యోతిషం అంచనా వేయగలదనడానికి డజన్ల కొద్ది దృష్టాంతాలున్నాయి. ఉదాహరణకు 1987లో వర్షాల జాడలేక శతాబ్దంలోకెల్లా భయంకరమైన దుర్భిక్షం మీద పడవచ్చునని రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని వాతావరణ నిపుణులు భయపెట్టారు. 1944లో వెలువడ్డ శతాబ్ది పంచాంగంలో చెప్పిన ప్రకారం 1987 గ్రహస్థితిని బట్టి భాద్రపద మాసం శుక్లపక్షం (ఆగస్టు - సెప్టెంబర్) వరకూ వానలు వెనకబట్టి తరవాత పరిస్థితి మెరుగవుతుందని జ్యోతిష్కులు చెప్పారు. వారిమాటే నిజమైంది.

    ఇక వైద్య జ్యోతిషానికి వస్తే - రోగ నిదానంలో, వ్యాధి నిరోధంలో ఆధునిక సైన్సుకు జ్యోతిషం చేయగల సహాయం ఎంతో ఉంది. మరి కొద్ది రోజుల్లో ఏ లివరుకో కాన్సరు సోకి పక్షం తిరక్కుండా మరణించబోతున్న రోగికి కూడా ఆపాదమస్తం ఎన్ని స్కానింగులు, ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి లక్షణం ఎక్కడా కనపడక పోవచ్చు. ఎయిడ్స్ పట్టిన రోగి హెచ్.ఐ.వి. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యేసరికి జబ్బు ధన్వంతరి దిగి వచ్చినా ఆదుకోలేని స్థితికి ముదిరిపోతుంది. బ్లడ్ ప్రెషరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ కింద సంఖ్య ఏ రోజు జాస్తి అయితే ఆ రోజు హైపర్ టెన్షన్ వచ్చిందని అనుకోవలసిందే. రక్తపరీక్షలో షుగర్ ఎక్కువగా ఎన్నడు కనిపిస్తే ఆనాటి నుంచీ డయాబెటిస్ పట్టిందని తెలుసుకోవలసిందే. అంతేతప్ప ఒక్క రోజు ముందు కూడా వైద్యపరిజ్ఞానం అడ్వాన్సు బెల్లు కొట్టదు. కీళ్ళ నొప్పులూ కాళ్ళ నెప్పులూ ఎముకల జబ్బులదీ అదే పరిస్థితి.
     జ్యోతిషం అయితే - మనిషి పుట్టగానే మునుముందు ఏ కాలంలో ఏ ఏ  శరీర భాగాలకు ఏ రకమైన జబ్బులు సోకవచ్చో లెక్కవేసి చెప్పగలదు. జన్మనక్షత్రాన్నిబట్టి, లగ్నాన్నిబట్టి, జాతకంలో రవి, చంద్ర, కుజ, రాహువుల వంటి గ్రహాల స్థితి, షడ్బలాలనుబట్టి, నవాంశ, ద్రేక్కాణాలనుబట్టి శారీరిక, మానసిక వైకల్యాలకు ఆస్కారాలను జ్యోతిష్కులు ఊహిస్తారు. వారు చెప్పేదే అనుభవంలోనూ సరిపోతున్నట్టు జ్యోతిష ప్రవేశంగల పెద్ద డాక్టర్లెందరో ధ్రువీకరించారు. ఫలానా మనిషికి ఫలానా రకాల రుగ్మతలు రావచ్చని ముందే తెలిసినప్పుడు ఆయా శరీర భాగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా వ్యాధి చిహ్నాలు సూక్ష్మంగా కనిపించీ కనిపించగానే అది వేరే జబ్బు కావొచ్చని తటపటాయించకుండా వెంటనే చికిత్స ప్రారంభించి గండం దాటించటానికి వీలవుతుంది. ఈ సౌలభ్యాన్ని గ్రహించడం వల్లే ఆధునిక వైద్యంలో పెద్ద డిగ్రీలు పొందిన డాక్టర్లు కొందరైనా మెడికల్ ఆస్ట్రాలజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వాస్తవానుభావంతో జ్యోతిష సూత్రాలను రుజువు పరుస్తూ, మిగితా వైద్యులకూ ఉపకరించే రీతిలో వైద్య జ్యోతిషాన్ని యథాశక్తి అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. జ్యోతిషాన్ని విశ్వసించినంత మాత్రాన వారందరూ మూర్ఖులు అయిపోరు. వారు నేర్చిన సైన్సు సైన్సు కాకుండానూ పోదు. భూకంపాల విషయంలోలాగే వైద్యంలోనూ 90 జోస్యాలు విఫలమై నూటికి 10 మాత్రమే నిజమైతేనేమి? కనీసం ఆ 10 శాతం రోగులకైనా ప్రాణం నిలబెట్ట గలిగితే ఆ మేరకు వైద్యశాస్త్రం లాభపడినట్టే కాదా? ఆమాటకొస్తే వైద్యుల జ్యోస్యాలు మాత్రం అన్నీ నిజమౌతున్నాయా?

    ఇంకో సంగతి. మిగతా భారతీయ శాస్త్రాల్లాగే ఆయుర్వేదాన్నీ ఇటీవలి దాకా నాటు వైద్యమని కొట్టిపారేసిన అల్లోపతీ భిషగ్వరులు - లివర్ జబ్బుల వంటి రుగ్మతల చికిత్సలో తమ పరిమితులను, ఆయుర్వేదం  ప్రయోజనాలను గ్రహించాక-  అదీ గౌరవనీయమైన వైద్య విదానమేనని అంగీకరించారు. యూనివర్సిటీ కోర్సుల్లో, ఆస్పత్రి విభాగాల్లో ఆయుర్వేదాన్ని చేర్చడానికి అభ్యంతరం లేదంటున్నారు. మంచిదే.  కాని - జ్యోతిషానికీ ఆయుర్వేదానికీ విడదీయరాని లంకె ఉంది. పంచాంగాల్లో ప్రతిరోజూ పేర్కొనే అమృత ఘటికలు ఔషధ సేవకు ఉద్దేశించినవే. కొన్నికొన్ని ఔషధాలను కొన్ని నక్షత్రాలలోనే, ఫలానా సమయాల్లోనే ఇవ్వాలని ఆయుర్వేదం చెబుతుంది. మరి - ఆయుర్వేదాన్ని యూనివర్సిటీల్లో అనుమతించి, దానికి అవినాభావ సంబంధంగల జ్యోతిషాన్ని మాత్రం గెంటేయటం ఎలా కుదురుతుంది?

    ఆయుర్వేదం దాకా ఎందుకు? ఆధునిక వైద్య శాస్త్రానికి ఆరాధ్యుడైన హిప్పోక్రేట్సే " A physician cannot safely administer medicine if he be unacquainted with Astrology"(జ్యోతిషంతో పరిచయం లేకపోతే ఏ వైద్యుడూ సక్రమంగా చికిత్స చేయలేడు ) అన్నాడు. భౌతిక శాస్త్రానికి మూలపురుషుడైన న్యూటన్ ను జ్యోతిషాన్ని నమ్ముతున్నందుకు ఎవరో అధిక్షేపిస్తే " Sir I have studied Astrology. You have not" (అయ్యా, జ్యోతిషాన్ని నేను చదివాను. మీరు చదవలేదు) అని దిమ్మతిరిగే జవాబు చెప్పాడు. జ్యోతిషం తప్పు అని నిరూపించడం కోసం ఆ శాస్త్రాన్ని నేర్చకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ బట్లర్ చివరికి జ్యోతిషానికి వీరాభిమానిగా మారాడు.

    జ్యోతిషాన్ని నమ్మిన ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరూ మూర్ఖాగ్రేసరులేనా? జ్యోతిషం మా కొద్ది బుర్రకు అంతు బట్టదు కనుక అది శాస్త్రమే కాదనీ, జోస్యాలన్నీ నిజం కావడం లేదు కనుక జ్యోతిష శాస్త్రమే శుద్దాబద్ధమనీ, ఒక్క జోస్యం విఫలమైనా మొత్తం శాస్త్రాన్నీ తోసిపుచ్చవలసిందేననీ అడ్డంగా వాదించే వెర్రిమొర్రి  మేధావులు మాత్రమే సైన్సుకు వారసులనుకోవాలా? వాతావరణ శాస్త్రవేత్తల జోస్యాలన్నీ నిజమవుతున్నాయా? రోగం ఫలానా అని అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో డాక్టర్ చేసే డయాగ్నసిస్ లన్నీ కరెక్టవుతున్నాయా? ఇదే వితండ వాదాన్ని బట్టి ఒక్క వైద్యుడు విఫలమైనా  మొత్తం వైద్యశాస్త్రాన్ని అవతల పారేయ్యాలా? ఒక వాతావరణ సూచన అబద్ధమైనా మొత్తం వాతావరణ శాస్త్ర యంత్రాంగాన్ని బంగాళాఖాతంలో విసిరేయాలా?

(2001 సెప్టెంబర్ 9 న ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన వ్యాసం )


Wednesday 21 March 2018

జ్యోతిషాన్ని తిట్టటం మూర్ఖత్వం

జ్యోతిషం అంటే అలుసా ? -1 

ఎం.వి.ఆర్.శాస్త్రి

( 2001సెప్టెంబర్ 9 తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో నేను రాసిన వ్యాసమిది. ఈ మధ్య టీవీ  చానెళ్ళలో జ్యోతిషం మూఢత్వం అంటూ  కొందరు మూర్ఖులు తెగ బురద చిమ్ముతున్న నేపథ్యంలో  మిత్రుల కోరిక పై  17 ఏళ్ల కింద నేను రాసిన వ్యాసాలను  మిత్రుల కోరిక పై మళ్ళీ ప్రచురిస్తున్నాను.)  
                                                 

   రాము, సోము అనే వాళ్ళ దగ్గర చెరికాస్త డబ్బు ఉంది. రాము కనుక 30 రూపాయలు సోముకు ఇస్తే - రాము దగ్గర మిగిలే దానికంటే సోము డబ్బు రెట్టింపు అవుతుంది. అదే - సోము కనుక 10 రూపాయలు రాముకు ఇస్తే సోము దగ్గర మిగిలే దానికంటే రాము డబ్బు మూడురెట్లు అవుతుంది. రాము, సోముల దగ్గర మొదట ఉన్నడబ్బు ఎంతెంత?

   ఈ లెక్క స్కూలు కుర్రాడికి ఇస్తే ముందు రాముదగ్గర ఉన్న డబ్బు 'ఎక్స్' - సోము దగ్గర ఉన్నది 'వై' అనుకుందాం - అని మొదలెడతాడు.

   అది చూసి ఏ తిక్క శంకరయ్యయినా ' డబ్బు ఎంతరా అని అడిగితే ఎక్స్ అనుకో, వై అనుకో అంటావేమిటి? అలా ఎందుకనుకోవాలి? డబ్బు ఎక్కడైనా రూపాయలు, పైసల్లో ఉంటుంది కాని - ఎక్స్ లు, వైలలో ఉంటుందా? నాగరికత ఎంతో అభివృద్ధి చెంది, రిజర్వు బ్యాంకులు, కరెన్సీ నోట్లు, రూపాయలను ముద్రకొట్టే ప్రింటింగ్ ప్రెస్సులు కళ్ల ముందు కనపడుతున్నా ఇంకా ఎక్స్ లు , వైలు అని మాట్లాడతావేమిటిరా మూర్ఖుడా?' అని ఎగిరిపడితే మీరు ఫక్కున నవ్వరా? వాడు ఎక్స్ అనుకుంటేనేమి? వై అనుకుంటేనేమి? రాము దగ్గర 62, సోము దగ్గర 34 రూపాయలు ఉన్నాయని ఆన్సరు సరిగా చెప్పాడా లేదా? ఆ ఆన్సరు కనుక్కోవడానికి వాడు దేన్ని ఏమి అనుకుంటే నీకెందుకు' అని శంకరయ్యకు బుద్ది చెప్పరా?

   మరి- ఇదే సూత్రం జ్యోతిషానికి వర్తించదా?!

   ఫలానా విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒకడు జ్యోతిష్కుడిని అడుగుతాడు. అతడేమో గ్రహచక్రం వేసి సూర్యుడు ఆ గడిలో ఉన్నాడు. చంద్రుడు ఈ ఇంట్లో ఉన్నాడు. రాహుదశలో కేతుభుక్తి నడుస్తున్నది కాబట్టి ఫలితం ఇలా ఉంటుంది అని చెబుతాడు. అప్పుడు సైన్సువాసన లేని ఓ సైన్సు శంకరయ్య కలగజేసుకుని - సూర్యుడు గ్రహం కాదు... నక్షత్రం ! చంద్రుడు, భూమికి ఉపగ్రహమే తప్ప గ్రహంకాదు. రాహు, కేతువులనే గ్రహాలు అసలు లేనేలేవు. లేనివాటిని ఉన్నట్టుగా ఊహించుకుని, వాటి సాయంతో ఫలితాలను చెప్పే ఈ విద్య పూర్తిగా మిథ్య! దీన్ని నమ్మడం మూర్ఖత్వం అని తిట్లకు లంకించుకుంటే ఏమనాలి?

   సూర్యుడు గ్రహమైతేనేమి? కాకపోతేనేమి? రాహు కేతువులకు అస్తిత్వం లేకపోతేనేమి? అపార్టుమెంట్లలో ఒకరింట్లో ఒకరు అద్దెకున్నట్లుగా కుజుడింట్లో శని ఉండి అక్కడ నుంచి మూడో నెంబరు ఇంట్లో ఉన్న శుక్రుడినీ పదో ఇంట్లో ఉన్న బుధుడినీ చూడటం నిజమైతేనేమి? కాకపోతేనేమి? అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్టుగా వచ్చినంతవరకూ, వాస్తవానుభవానికి ఫలితం సరిపోయినంత వరకూ ఆ ఫలితాన్ని ఏ లెక్క ప్రకారం చేబితేనేమి? ఆల్జీబ్రాలో 'ఎ' 'బి' 'ఎక్స్' 'వై' అంటూ లెక్కకోసం ఊహించుకున్నట్టే గ్రహాల స్థితి, చూపు వగైరాలనూ జ్యోతిష్కులు ఊహించుకోకూడదా?

   పోనీ జ్యోతిష్కుడికి ఇచ్చే ప్రశ్నకు ఆల్ కరెక్టు సమాధానం పక్కా సైంటిఫిక్ పధ్ధతిలో చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఏ లెక్కాయినా మా పద్ధతిలోనే చేయాలి: ఇదే ఆన్సరును ఇంకో రకంగా రాబట్టటానికి ససేమిరా ఒప్పుకోము - అని దబాయించవచ్చు. అలాంటి సావకాశం మనకుందా?

    లేదు!

   జోస్యాలు చెప్పాల్సిన కర్మ సైన్సుకేమి వచ్చింది అంటారా? జోస్యం సైన్సు తత్వానికే విరుద్ధం అని కోప్పడతారా? నిజమే. " నా పెళ్ళి ఎప్పుడవుతుంది? ఉద్యోగం ఎన్నడొస్తుంది? ఇల్లు కడతానా? " లాంటి వ్యక్తిగత ప్రశ్నలు సైన్సు పరిధిలోకి రావు. రావాలనీ అనుకోకూడదు. కాని - వచ్చే సీజనులో వానలు పడతాయా? ఈ నెలలో తుఫాన్లేమైనా వస్తాయా? బంగాళాఖాతంలో పుట్టిన ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి బీభత్సం సృష్టిస్తుందా? ఫలానా ప్రాంతంలో భూకంపమేదైనా వస్తుందా? ఈ రోగికి పట్టిన జబ్బేమిటి? అది కాన్సరుగా మారుతుందా? ఇదిగో ... ఇలాంటి ప్రశ్నలు మోడరన్ సైన్సుకు చాలా తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా మానవమేధ ఆర్జించిన విజ్ఞానాన్ని మధించి, వందల కోట్ల రూపాయలు విలువచేసే ఇన్సాట్ ఉపగ్రహాల ద్వారా అందే టన్నుల బరువు సమాచారాన్ని విశ్లేషించి, అధునాతన, అతి ఖరీదైన సీస్మోగ్రాఫ్ లాంటి సాధనాలను, అల్ట్రాసోనిక్, అల్ట్రామోడరన్ స్కానింగు హంగులను ఉపయోగించి ఆయా ఫలితాల గురించి సైన్సు 'జ్యోసం' చెబుతూనే ఉంటుంది.

   ఆ జోస్యాలు తరచూ తప్పుతూనే ఉంటాయి.

   అత్యాధునిక శాస్త్రీయ హంగుల సాయంతో వాతావరణ శాస్త్రజ్ఞులు ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముతాయన్న రోజున సూర్యుడు క్షణం రెస్టు లేకుండా డ్యూటీ చేస్తాడు. వాన వస్తుందన్న రోజున రాదు. వేగంగా తీరం దాటుతుందని చెప్పిన వాయుగుండం సముద్రంలోనే తిష్ట వేస్తుంది. లేదా రూటు మార్చుకుని వేరే దిశగా వెళుతుంది. ఒక్కోసారి నోటిసు ఇవ్వకుండానే ఉప్పెన మీద పడుతుంది.

   ఇక భూకంపాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆధునిక విజ్ఞానం ఎన్ని కాంతి సంవత్సరాల వేగంతో దూసుకువెళుతున్నా, శాటిలైట్లు రిమోట్ సెన్సర్లూ కళ్లలో వత్తులు వేసుకుని ఎంతగా కనిపెట్టినా ఫలానా సమయంలో ఫలానా చోట భూకంపం రానున్నదని కచ్చితంగా చెప్పగలగడం మన సైంటిస్టుల చేతకావడంలేదు. తుఫాన్లు, వానల వంటి విషయాల్లో ఒక్కోసారి అంచనాలు తప్పినా, కనీసం అవి రాబోతున్నాయని ముందుగా ఊహించటం వరకూ సైన్సుకు సాధ్యమే. భూకంపాల తాకిడి మాత్రం నేటికి దానికి ఊహకైనా అందడంలేదు. అందుకే - లాతూరు, గుజరాత్ వంటి చోట్ల భయానక భూకంపాలు ప్రళయ భీకరంగా విరుచుకుపడ్డప్పుడు వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు.

   కానీ ... సైన్సు వల్ల కానిది జ్యోతిష్యం వల్ల అవుతుంది. వందల కోట్ల రూపాయల యంత్ర పరికరాల సాయంతో ఒక పూట ముందు కూడా సైంటిస్టులు చెప్పలేని దానిని వంద రూపాయల ఎఫిమెరీల సాయంతో రెండేళ్ళు ముందుగా జ్యోతిష్కులు చెప్పగలరు.

   నమ్మబుద్ది కావడం లేదా?

   1967 డిసెంబర్ మొదటి పక్షంలో కొయినాలో భూకంపం రావచ్చని పూణే జ్యోతిష్కుడు ఎస్.కె.కేల్కర్ 1965 లోనే జ్యోస్యం చెప్పాడు. దివ్యదృష్టితో కాదు; అంజనాలు వేసి కాదు. 1967 అక్టోబర్ 18న పట్టే చంద్రగ్రహణాన్ని బట్టి భూమి తత్వంగల మకరంలో అంగారకుడి ఉనికివల్ల ఫలానా చోట భూకంపం రాగలదని ఆయన శాస్త్ర ప్రకారం లెక్కవేశాడు. ఆయన చెప్పినట్లు సరిగ్గా డిసెంబర్ పూర్వార్థంలోనే 10వ తేదిన 6.5 తీవ్రతతో పెనుభూకంపం కొయినాను కుళ్ళబొడిచింది.

   2001 జనవరిలో గుజరాత్ లో భయంకరమైన ప్రకృ తి వైపరీత్యం రావచ్చని సౌరాష్ట్ర జ్యోతిష్కుడు జయప్రకాశ్ మధాక్ చెప్పిన జోస్యం చాలా పత్రికలలో అచ్చయింది. సరిగ్గా ఆ నెలలోనే పెనుభూకంపం భుజ్ ను నేలమట్టం చేసింది.

   " ప్రకృతి వైపరీత్యం  అంటే భూకంపమే కానక్కరలేదు కదా ? తుఫానూ కావొచ్చు కదా ? సందిగ్ధంగా ఫలితం చెప్పి అది కాస్తా గురికి తగిలాక అదే కచ్చితమైన జోస్యమని దబాయిస్తే ఎలా ? ఆ వచ్చేది ముమ్మాటికీ భూకంపమేనని జ్యోతిష్కుడికి తెలుసా ?  " అని సంశయాత్ములు ఆక్షేపించవచ్చు. కనుక ఇంకొకరి జోస్యాన్ని పరిశీలిద్దాం .

   " The planetary configurations reveal that within about one month from 25 December 2000 some explosions ,fires and violence may be feared . Some calamity like earthquake can not be ruled out ... A strange tragedy is possible on 26 January 2001. It shall take place on the 26 January around 9-25 A.M...."
  ( గ్రహస్థితిని బట్టి చూస్తే 2000 డిసెంబరు 25 నుంచి నెలలోపు కొన్ని పేలుళ్లు, అగ్నిప్రమాదాలు హింసాకాండ సంభవించవచ్చు .భూకంపం లాంటి ఉపద్రవం రాదనీ చెప్పలేము. ఒక విచిత్రమైన విషాదం 2001 జనవరి 26 న జరగవచ్చు. ఆ రోజు ఉదయం 9-25 ప్రాంతంలో అది జరగవచ్చు. ) అని ' బాబాజీ " పత్రిక 2000 డిసెంబరు 14 న , 2001 జనవరి 7న    వెలువడ్డ సంచికలలో రాసింది. కచ్చితంగా వాటిలో పేర్కొన్న రోజున అదే సమయంలో గుజరాత్ ను భూకంపం కబళించింది .

   ఉత్పాతాలు , ఉపద్రవాలకు సంబంధించిన జోస్యాలు పాతికేళ్లలోనో , పదేళ్ళలోనో ఎంతమంది ఎన్ని చెప్పారు ? వాటిలో ఎన్ని నిజమయ్యాయి ? మొత్తం జోస్యాలలో ఫలించినది ఎంత  శాతం ... అని వాదులాడటం మతిమాలిన పని. మాటవరసకు నూరు జోస్యాలలో రెండు మాత్రమె నిజమైనా అక్కడికదే గొప్ప. ఆకార పుష్టి గల శాస్త్రీయ సంస్థలు ఎంత సైంటిఫిక్ గా , ఎంత అత్యాధునికంగా పాటుపడ్డప్పటికీ ఒక్క భూకంపాన్ని కూడా ముందుగా పసికట్టలేనప్పుడు 0 శాతం విజయం రికార్డు కలవారు 2 శాతం వారిని ఆక్షేపించటమంటే చక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్టే ఉంటుంది.

   అదీ కాక ఇక్కడ చెప్పుకుంటున్నది విశేష జననష్టాన్ని , విపరీత ఆస్తి నష్టాన్ని కలగజేసి వందల, వేల కుటుంబాలను వీధిన పడవేయగల భయంకర వైపరీత్యం గురించి ! ఫలానా రోజున ఫలానా చోట అది విరుచుకు పద వచ్చని సూచన మాత్రంగా తెలిపినా , ఆ సమాచారాన్ని సక్రమంగా ఉపయోగించుకుని సాధ్యమైన ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే కనీసం నష్టం తీవ్రతను తగ్గించ వచ్చు .99 జోస్యాలు అబద్దమైతేనేమి  ? కనీసం ఒక్క భూకంపాన్నైనా తేదీ , సమయం, ప్రాంతంతో సహా కచ్చితంగా పోల్చుకోగలిగితే చాలదా? సైన్సుకు సాధ్యం కానిది జ్యోతిషానికి ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస , తెలుసుకోవాల్సిన బాధ్యత వేల  కోట్ల రూపాయల  ప్రజాధనాన్ని వెచ్చించే సైంటిష్టుల మీద లేదా ? ఆ టెక్నిక్ ఏమిటో అర్థం చేసుకుని అందులో తమకి పనికి ఉపకరించేది ఏదైనా ఉంటే దాన్ని స్వీకరిస్తే ఆ మేరకు సైన్సుకూ తద్వారా సమాజానికీ మేలు జరుగుతుంది కదా? సైంటిష్టులకు చిన్నచూపు గల " నాటు జ్యోతిష్కుల " చేతిలోని విద్య విజ్ఞాన ఖనులైన శాస్త్రజ్ఞుల చేతిలో పడి నలిగితే మరింత పదునుదేరుతుంది కదా ?

( ఇంకా ఉంది )


Tuesday 20 March 2018

నెల జీతం పది రూపాయలు

పాతముచ్చట్లు - 8

ఎం.వి.ఆర్.శాస్త్రి
.......
   ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది .

   జర్నలిస్టుగా నా మొదటి జీతం నెలకు 10  రూపాయలు !

   నిజానికి అది జీతం కాదు ...   పారితోషికం .... అదికూడా తపాలా ఖర్చుల నిమిత్తం.

   అయితేనేమి ? 'ఆంధ్ర జ్యోతి ' దినపత్రికకు ఆనరరీ కరస్పాండెంటు గా మా ఊళ్ళో నన్ను నియమించినట్టు పత్రిక కార్యాలయం నుంచి నేటికి 44 ఏళ్ళ కింద ( 1974 ఏప్రిల్ లో ) ఉత్తరం అందుకున్నప్పుడు పట్టరాని పరమానందం .జన్మ ధన్యమైందన్న ఫీలింగు.




   అంతకుమునుపూ నేను విలేఖరినే. కాని బినామీని. అసలు విలేఖరి మా నాన్న . ఆంధ్రపత్రిక కు వార్తలు రాసేదీ , ఊళ్ళో కొత్తవాళ్ల చేత విలేఖరిగా గుర్తింపు పొందినదీ నేనే. అయినా సొంతంగా నా పేర విలేఖరిగా విజిటింగ్ కార్డు , లెటర్ హెడ్డు వేయించుకోవాలని , నా పేరు పేపర్లో చూసుకోవాలని మాచెడ్డ కోరిక.

   అప్పట్లో జగ్గయ్యపేట తాలూకా కేంద్రం కూడా కాదు. మేజర్ పంచాయితీ ! డిప్యూటీ తాసిల్దారు చాలా పెద్ద ఆఫీసరు. సబ్ ఇన్స్పెక్టర్ ఆ చుట్టుపట్ల ఊళ్లన్నిటికీ  కలిపి పెద్ద పోలీస్  అధికారి. సర్పంచ్, పంచాయతీ ఈవో , ప్రభుత్వాస్పత్రి డాక్టరు, ఎల్ ఎం బీ చైర్మను, పక్కనే చిల్లకల్లు కేంద్రం లో పంచాయతి సమితి ప్రెసిడెంటు ముఖ్యమైన న్యూస్ సోర్సులు. ఇప్పుడు మూడు మండలాల పెట్టు అయిన సబ్ తాలూకా అంతటికీ కలిపి జగ్గయ్యపేటలో ఇద్దరమే విలేఖరులం. కాబట్టి మాకు మహా గిరాకీ.

  రెండోవాడు పంగనామముల ( పి.వి.ఎం.ఎల్. ) నరసింహారావు. నా బాల్యమిత్రుడు. ఒకటో క్లాసు నుంచీ జిగ్రీ దోస్తు. పూర్వం వాళ్ళ నాన్న హిందూ పత్రికకూ , మా నాన్న ఆంధ్రపత్రికకూ విలేఖరులు. మా జమానాలో నేను ఆంధ్రజ్యోతికీ , వాడు ఆంధ్రప్రభకూ విలేఖరులం. మారం సత్యనారాయణ అని మూడో అయన ఆంధ్రజ్యోతి కి విలేఖరిగా ఉండేవాడు . ఒత్తిళ్లను తట్టుకోవటం తనవల్ల కాదని ఆయన మానుకున్నాడు. ఆ ఖాళీలోకి నేను వచ్చాను.

   నేనూ , మా వాడూ ఉదయమే బయలుదేరి ఊరంతా , ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టి వార్తలు సేకరించేవాళ్ళం. మీటింగులు , నేరాలు లాంటి రొటీన్ వార్తలు కలిసి రాస్తూనే ఎక్స్ క్లూజివ్  వార్తలు ఎక్కడ దొరుకుతాయా అని ఒకరికి చెప్పకుండా ఒకరం తెగ గాలిస్తుండే వాళ్ళం.   ఏమి రాస్తున్నావురా అని అడిగినా మామూలువాటి గురించే తప్ప ఎక్స్ క్లూజివ్ ల  సంగతి రెండోవాడికి వాసన రానిచ్చే వాళ్ళం కాదు. దాన్ని పేపర్లో చూసి అవతలివాడు కుళ్ళుకుంటూంటే చూడటం మజా.


                           
                            నరసింహారావు , సూర్యనారాయణ బాబు ,నేను 

  సమస్య ఏమిటంటే రాసిపంపింది పేపర్లో ఎప్పుడొస్తుందో , అసలు వస్తుందో రాదో తెలియదు. ఇప్పటివలె  రాత్రి పొద్దుపోయాక వార్త పంపినా మర్నాడు పేపర్లో ప్రముఖంగా వచ్చే రోజులు కావవి. ముఖ్యమైన వార్తలైతే ప్రెస్ టెలిగ్రాం ద్వారా పంపేవాళ్ళం. లేదా ఎవరన్నా పుణ్యాత్ములు లేక ఇంటరెస్టెడ్ పార్టీలు ఫోన్ చేసుకోమంటే ( అప్పుడు ఊరు మొత్తం మీద పాతికో ముప్ఫయో ఫోన్లు ఉండేవి. లోకల్ కాల్ మాట్లాడాలన్నా టెలిఫోన్ ఎక్స్చేంజి ని అడిగితే నంబర్ కలిపి ఇచ్చేవారు. మామూలు ట్రంక్ కాల్ అయితే దూరాన్ని బట్టి కనీసం గంట నుంచి పూట వరకూ లేక తేదీ మారే లోగా మన అదృష్టాన్ని బట్టి ఎప్పుడైనా రావచ్చు. దాని కోసం పడిగాపులు ) ట్రంక్ కాల్ లో రిపోర్ట్ పంపేవాళ్ళం. నిజంగా ఇంపార్టెంటు అని పత్రిక ఆఫీసు వాడు అనుకోకపోతే తన టైం వేస్టు చేసినందుకు చికాకు పడతాడు.

   అందుకని సాధారణంగా ఆర్డినరీ పోస్టులోనే రిపోర్టులు పంపేవాళ్ళం. మరునాడో, మూడో నాడో అవి 75 కిలోమీటర్ల దూరం లోని విజయవాడ చేరితే , దాన్ని చూసిన సబ్ ఎడిటర్ మూడ్ ని బట్టి , తత్వాన్ని బట్టి అది పత్రికలో ఎప్పుడు ఎంత ప్రాధాన్యంతో ఎలా అచ్చవుతుంది , లేక బుట్టదాఖలు అవుతుందా అన్నది ఆధారపడేది.  మా ఊరి దగ్గర కంభంపాడు వాడయిన భండారు శ్రీనివాస రావు గారు లాంటి సబ్ ఎడిటర్ ఆ సమయానికి డ్యూటీ లో ఉంటే వార్తలు బాగా వచ్చేవి. పేపర్ రాగానే పరీక్ష రిజల్ట్ కోసం చూసే విద్యార్థిలా వార్త పడిందా లేదా , నలుగురిలో పరువు నిలిచిందా లేదా అని ఆత్రంగా వెతుక్కునే వాళ్ళం. అప్పుడు మనం పంపిన స్పెషల్ స్టొరీ ఏ ఫస్టు పేజీలోనో ప్రముఖంగా వస్తే ఎనుగెక్కినంత సంబరం.  ఆ రోజంతా గాలిలో తేలిపోవటమే!

  ఫస్టు పేజీ దాకా ఎందుకు? మా ఊరి వార్త వారం రోజులు లేటుగా అయినా పేపర్లో వస్తే " జగ్గయ్యపేట పేరు పేపర్లో పడింది "అని నా చిన్నతనంలో జనం గొప్పగా చెప్పుకునే వాళ్ళు. నేను ఆంధ్రజ్యోతి విలేఖరి అయ్యాకే మా వూరి వార్తలు రోజూ రావటం మొదలైంది. అప్పుడు కూడా నాలుగైదు వార్తలు  ఒకే రోజున వస్తే ఆ రోజు ఊరంతా అది పెద్ద విశేషమే.

   కొన్ని రోజులు లేటుగా అయినా తమ వార్త పత్రికలో చూసుకోవాలని ప్రతివాడూ అనుకుంటాడు కాబట్టి ఊళ్ళో మాకు బోలెడు డిమాండు. మమ్మల్ని బతిమిలాడి , వెంటపడి ,   సభలకు సమావేశాలకు పిలిచుకు పోయేవారు. అయ్యవచ్చే దాకా అమావాస్య అగదేమో కానీ విలేఖరి వచ్చేదాకా ఆ రోజుల్లో సభ ఆగేది. ఎం ఎల్ ఏ అయినా మంత్రి అయినా సరే ప్రెస్ వాళ్ళు వచ్చారా అని అడిగి , వచ్చామని ధృవపరుచుకున్నాకే ఉపన్యాసం మొదలెట్టే వాళ్ళు .

  ఊరంతటికీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే హడల్. అతగాడు సాధారణంగా ఎంతటివారినైనా నిలబెట్టే మాట్లాడే వాడు. అలాంటివాడు మేము వెళ్తే గౌరవంగా కూచోబెట్టి మాట్లాడేవాడు. చేతులు కట్టుకుని నిలబడ్డ మోతుబరి ఆసాముల ముందు మేము ఎస్ ఐ గారి ఎదుట కూర్చోగలగటం చూసే వారికి పెద్ద గొప్ప. అది ఊళ్ళో మాకు పెద్ద ఇమేజి తెచ్చిపెట్టేది. పెద్ద బజారులో మమ్మల్ని చూసి ఎస్ ఐ గారు సైకిల్ ఆపి సరదాగా మాట్లాడుతున్నాడు అంటే చుట్టుపక్కలవాళ్ళు అబ్బురంగా చూసేవాళ్ళు. అప్పట్లో పోలీసు సబ్ ఇన్స్పెక్టరుగా వచ్చిన వాళ్ళు ఇంచుమించు మా ఈడువాళ్ళే. ముఖ్యంగా సూర్యనారాయణ బాబు అనే " నిప్పులాంటి మనిషి "  మాకు బాగా ఫ్రెండు. మా ఇంటికి కూడా తరచూ వస్తూండేవాడు. " ఎస్ ఐ గారు అయ్యగారి ఇంటికి వచ్చారట " అని బజారు జనం తెగ చెప్పుకుంటూంటే మా నాన్నకు మహా గర్వం గా ఉండేది.
 
   తరవాత కాలం లో ఐ జీ లు, డిజిపీలు ఎంతోమంది నాకు దగ్గరి మిత్రులయ్యారు. కానీ తొలిరోజుల్లో మా ఊరి సబ్ ఇన్స్పెక్టరు తో స్నేహం  ఇచ్చిన కిక్కు , తెచ్చిన పాప్యులారిటీ వేరు. స్టేట్ గవర్నమెంటు చీఫ్ సెక్రటరీలు చాలామందే నాకు స్నేహితులయ్యారు. కానీ మా ఊళ్ళో డిప్యూటీ తాసిల్దారు ముందు సమాన స్థాయిలో కూచోగలిగినప్పుడు కలిగిన గర్వం వేరు. నా దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళిన మంత్రులు ఎంతోమంది ఉన్నారు. అయినా ఆ రోజుల్లో మా ఊరి ఎం ఎల్ ఏ నా కోసం వచ్చినప్పుడు కలిగిన feeling of importance వేరు.

   అప్పట్లో జగ్గయ్యపేటలో ఫ్యాక్షన్ గొడవలు బాగా ఉండేవి. మా ఊరి సర్పంచ్ కీ , దగ్గరలోని బూదవాడ మునసబుకీ మధ్య హోరాహోరీగా ముఠా ఘర్షణలు  నడుస్తుండేవి. ఏదో సందర్భంలో సర్పంచ్ కీ , వైశ్యులకూ మధ్య చాలా రోజులు పెద్ద యుద్ధం అయింది. పట్టపగలు దొమ్మీలు, షాపుల లూటీలు, ఆస్తుల దహనాలు , ఒక్కోసారి నడివీధిలో మర్డర్లు యధేచ్చగా అవుతుండేవి. అప్పట్లో విజయవాడ రూరల్ డి ఎస్ పి గా ఉన్న రావులపాటి సీతారామారావు గారు లాంటి అధికారులు , ఒంటి చేత్తో ఎంతటి మాబ్ నైనా కంట్రోల్ చేయగలిగిన మా సూర్యనారాయణబాబు లాంటి ఎస్ ఐ లు ఉద్రిక్తత అదుపుచేయటానికి తెగ కష్టపడుతుండే వాళ్ళు.

   అలా గొడవలు బాగా ఉన్నప్పుడు న్యూసు కు కొదవ లేదు. కానీ గొడవలు ఎల్లకాలమూ ఉండవు. మామూలు రోజుల్లో పెద్ద నేరం ఏదీ జరగక... విశేషంగా చెప్పడానికి ఏ అధికారి దగ్గరా ఏమీ లేక ... ఏ సభా జరగక ఒక్కో సారి  వార్తలకు కరువొచ్చేది.  రోజూ ఇన్ని రిపోర్టులు పంపాలని కంపల్సరీ ఏమీ లేదు. రాయకపోతే అడిగే వాళ్ళు లేరు. ఎంత రాసినా నెలకు పది రూపాయలు మించి పత్రిక వాళ్ళు ఏమీ ఇవ్వరు. ఊళ్ళో విలేఖరి అన్న గుర్తింపుతో అడ్డదారిన ఎలా సంపాదించవచ్చు ; నెలసరి , వార్తవారీ మామూళ్ళు ఎలా రాబట్టవచ్చు ; వార్త రాస్తే ఇంత, రాయకపోతే ఇంత అని రుసుము ఎలా వసూలుచేయవచ్చు - అన్న విద్యలు  అప్పట్లో మేము ఎరుగము . జర్నలిజం అప్పటికింకా ఇంత ముందుకు పోలేదు.

    రాయాలన్న నిర్బంధం ఏమీ లేకపోయినా ... వార్త రాసి దాన్ని అచ్చులో చూసుకుంటే కలిగే ఆనందం కోసం ఏదో ఒకటి రాయాలని , రాసి పేరు తెచ్చుకోవాలని తపన.  జగ్గయ్యపేట చిన్న ఊరు. పెద్ద పంచాయతీ . ఉన్న ఆఫీసులు తక్కువ. పక్కన చిల్లకల్లు లో పంచాయతి సమితి ఆఫీసు. అక్కడ మాత్రం రోజూ వార్తలు ఏమి ఉంటాయి ? మామూలు వార్తలు దొరకనప్పుడు "వార్తల ఆకలి " తీర్చుకోవటానికి ప్రత్యేక వార్తలను కనిపెట్టి, లేక వాసన పట్టి వండటమే శరణ్యం.  ఆ రకంగా అదే పనిగా వెతికితే చాలా విషయాలు తెలిసేవి. కొత్త కోణాలను అన్వేషిస్తూ దగ్గరలోని ఊళ్ల వెంబడి తిరిగి హ్యూమన్ ఇంటరెస్టు స్టోరీలు , స్పెషల్ స్టోరీలు చాలా రాసేవాడిని. ఉత్తరోత్తరా నా కెరీర్లో రిపోర్టర్లకు గైడెన్స్ ఇవ్వటానికి అప్పటి అనుభవం , అప్పుడు చేసిన స్వయం కృషి బాగా పనికొచ్చింది.

   అప్పట్లో దినపత్రికల్లో వివిధ కేంద్రాలలోని రిపోర్టర్లు ఎలాంటి వార్తలు ఎలా రాస్తున్నారో చూసి , అలాంటివి మా దగ్గరా ఉన్నాయా అని కూపీ లాగితే   చాలా అక్రమాలు, అవకతవకలు , అధికారుల తప్పుడుపనులు బయటపడేవి. మొహమాటం లేకుండా అవన్నీ రాయగలిగిన మేరకు పత్రికకు రిపోర్ట్ చేసే వాడిని. పంపినవి చాలా వరకూ అచ్చయ్యేవి. తమకు ఇబ్బందికరమైన వార్త రాస్తే సంబంధిత అధికారులో, నాయకులో మొగాలు మాడ్చుకునే వాళ్ళు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు. అయినా   విలేఖరిగా విధినిర్వహణలో  మేము ఎవరినీ లెక్కచేసే వాళ్ళం కాము. లోపల ఎంత మంట ఉన్నా చేయగలిగింది ఏమీ లేక అధికారులు ఉడుక్కుని ఊరుకునే వాళ్ళు.

   ఇలా రోజులు జోరుగా హుషారుగా సాగుతున్నాయని నిశ్చింతగా ఉండగా మొత్తం పత్రికా రంగానికే పెద్ద ఆపద వచ్చింది. దాని సెగ నాకూ తగిలింది. పాత్రికేయ జీవితంలో మొదటి పెద్దసమస్య తరుముకొచ్చింది.

  దానిగురించి తరువాయి భాగంలో.


 



      .

   





 

   

Monday 19 March 2018

కులం వేరు... వర్ణం వేరు

మనుధర్మం -9

ఎం.వి.ఆర్.శాస్త్రి
......
   కులభూతం హిందూ సమాజానికి శాపం.

   నేటి హిందూ  సమాజం లోని చెడుగులకు దుర్మార్గపు కులవ్యవస్థ మూలం.

    నా కులం ఎక్కువ , నీ కులం తక్కువ అనే కావరమే రోత. సంకుచిత కులదృష్టితో వ్యవహరించటం, కింది కులాల వారిని తొక్కేయ్యాలని చూడటం,  అగ్రవర్ణ దురహంకారంతో దళిత కులస్తులను అంటరానివాళ్ళుగా అవమానించటం, దారుణ వివక్షకు గురి చేయటం అమానుషం . అనాగరికం. నిష్కృతిలేని నేరం .

    కులరక్కసి ని నామరూపాలు లేకుండా నిర్మూలిస్తేగాని హిందూ సమాజం బాగుపడదు.ముందుకు వెళ్ళదు.

     ఇందులో మరో మాటకు తావులేదు. వెయ్యేళ్ళ కింద భగవత్ రామానుజాచార్యుల నుంచి ఇటీవలి స్వామి దయానంద సరస్వతి ,స్వామి వివేకానంద ,స్వామి శ్రద్ధానంద , హెడ్గెవార్ ల వరకూ ఎందరో మహాత్ములు ఘంటాపథంగా చాటిన అక్షరసత్యమిది. మెడమీద తలకాయ, కాస్తంత ఇంగితజ్ఞానం , కొంచెం వివేకం ఉన్న ప్రతివాడూ ఒప్పుకున్న ,ఒప్పుకుని తీరాల్సిన విషయమిది.

      కాని కులవివక్షకు మూలం మనుధర్మం కాదు.  కులమనేది మనువు తెచ్చిపెట్టింది కాదు. ఈ కాలంలో దళిత ఎస్.సి.లూ , వెనకబడిన బి.సి.లు పడుతున్న అగచాట్లకు, తరతరాలుగా అనుభవిస్తున్న క్షోభకూ కారణం మనువాదం కానే కాదు.

      ఇంకా చెప్పాలంటే మనను చికాకు పెడుతున్న,  తలవంపులు తెస్తున్న కులసమస్యకు మనుధర్మం హేతువు కాదు ...  విరుగుడు! ఔను ...  విరుగుడే!!

      భారతదేశ వైభవానికి , ప్రాశస్త్యానికి మూలమైన మతాన్ని, ధర్మాన్ని కుళ్ళ పొడుస్తే గాని ఈ దేశాన్ని లొంగదీయలేమన్న దుర్బుద్ధితో రెండు మూడు శతాబ్దాలకింద ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు , వారి తైనాతీలైన క్రైస్తవ మిషనరీలు పథకం ప్రకారం మొదలెట్టిన దుష్ప్రచారం మన కళ్ళకు మాయపొరలు కమ్మించింది.   పాశ్చాత్య విద్య పేరు చెప్పి మిషనరీ స్కూళ్ళలో , కాలేజీలలో తరాలతరబడి భారతీయుల మెదళ్లలోకి ఎక్కించిన కాలకూట విషం కారణంగా మన ధర్మం, మన సంస్కృతి , మన వారసత్వం ఎంత గొప్పవో మనమే గుర్తించలేక ...  వాటిని చీదరించటమే  ఆధునికతకు , సంస్కారానికి కొలమానమనుకునే దౌర్భాగ్య స్థితి దాపురించింది. సిగ్గుచేటు కులవివక్షకు, దిక్కుమాలిన కుల వ్యవస్థకు మనువే మూలపురుషుడన్న ద్వేషం ఈ మానసిక వైకల్యం లోంచి పుట్టుకొచ్చిందే.

    మనువు, మనుస్మృతి చెప్పింది వర్ణం గురించి !  వర్ణం వేరు. కులం వేరు ! అ రెండిటి మధ్య హిమాలయానికీ , పెంటకుప్పకూ ఉన్నంత తేడా ఉంది. మనుధర్మశాస్త్రం లో పేర్కొన్న వర్ణాన్ని సరిగా అర్థం చేసుకోక ... ఇప్పుడు మనల్ని పీడిస్తున్న కులవ్యవస్థా , మనువు చెప్పే వర్ణ వ్యవస్థా ఒకటేనని పొరపడటం గందరగోళానికి మూలం.

    కులం అనేది పుట్టుకను బట్టి నిర్ణయమవుతుంది. వర్ణం అనేది చేసే పనిని బట్టి, మనిషి గుణాన్ని బట్టి , స్వభావాన్ని బట్టి, సామర్ధ్యాని బట్టి, యోగ్యతను బట్టి నిర్ణయమవుతుంది.

    కులం అనేది మారదు. బ్రాహ్మణుడుగా జన్మనెత్తినవాడు బతికినంతకాలం బ్రాహ్మణుడే! శూద్ర కులం లో పుట్టినవాడు బతికినంతకాలం శూద్రుడే! బ్రాహ్మణ కులంలో చెడబుట్టి, బ్రాహ్మణత్వం ఏ కోశానా లేక , అన్ని అవలక్షణాలూ ఉన్న దూర్తుడుకూడా  బతికినంతకాలం బ్రాహ్మణుడుగానే చెలామణీ కాగలడు. శూద్రుడుగానో, దళితుడుగానో పుట్టి వేదశాస్త్రాలను అభ్యసించి ఉత్తమ వైదిక సంస్కారం అలవరచుకుని నియమబద్దంగా జీవించే గుణవంతుడు బ్రాహ్మణుడిగా గుర్తించబడడు.  ఇది  జన్మ మీద ఆధారపడిన కులవ్యవస్థ లక్షణం.

    వర్ణం అనేది తరగతి ! చేసే  పనిని బట్టి, గుణం బట్టి, యోగ్యతబట్టి నిర్ణయమవుతుంది. దాన్ని మార్చుకోవటం మనిషి చేతుల్లో ఉంది. వర్ణం అంటే రంగు ;  ఆర్యులు తెల్లనివాళ్లు  ; ద్రవిడులు లేక దస్యులు నల్లని వాళ్ళు ; ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు అలా రంగును బట్టి వర్ణవ్యవస్థను నెలకొల్పారు - అని కొందరు మిడిమిడి జ్ఞానులు అంటారు .అది సరికాదు. వర్ణం అనేది వృణ్ అనే పదం నుంచి వచ్చింది .ఎంచుకోవటం అని దాని అర్థం . 'వర్ణః వృణోతే " ( ఎంచుకోబడేది వర్ణం ) అన్నాడు నిరుక్తకారుడు యాస్కుడు. "చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః " ( గుణాలనుబట్టి, కర్మలనుబట్టి నాలుగు వర్ణాలు నేను సృష్టించాను అని భగవద్గీత  ( 4-18 ) లో భగవానుడు చెప్పింది వర్ణవ్యవస్థకు ప్రమాణం. నాలుగు వర్ణాలు సమాజంలో నాలుగు తరగతులు.


  కులం అనేది  caste system. వర్ణం అనేది class system . వర్ణవ్యవస్థ లో పేర్కొన్న బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య శూద్ర తరగతులే ( classes) అవే  పేర్లతో  కులాలుగా (castes), మళ్ళీ వాటిలోనుంచి ఉపకులాలుగా మన దౌర్భాగ్యం కొద్దీ దాపురించటం వల్ల వర్ణమే కులం అన్న దురభిప్రాయం మనందరికీ కలిగింది.

   ఏ సమాజంలో నైనా ముఖ్యంగా అవసరమయ్యేవి : 1.విద్య 2.పరిపాలన , రక్షణ 3. ఉత్పత్తి, వ్యాపారం 4. శ్రమశక్తి . విద్యను గరిపి జ్ఞాన బోధ చేసేవాడు బ్రాహ్మణుడు : పరిపాలన , రక్షణ బాధ్యత నిర్వర్తించేవాడు క్షత్రియుడు ; వర్తకవాణిజ్యాలు  చేసేవాడు వైశ్యుడు: కాయకష్టం చేసే వాడు శూద్రుడు అని మనపూర్వులు పేర్లు పెట్టారు.

    ఇవి watertight compartments కావు. కావాలనుకుంటే అవసరమైన యోగ్యతను, నైపుణ్యాన్ని సంతరించుకుని ఒక వర్ణం వాడు అంతకంటే పై వర్ణానికి ఎగబాకవచ్చు. ఒక వర్ణంలో చేరినవాడు దానికి కావలసిన యోగ్యతను, సామర్థ్యాన్ని పోగొట్టుకుని భ్రష్టుడైతే దిగువవర్ణానికి నేట్టివేయబడనూ వచ్చు. దీనికి చాలా  దృష్టాంతాలు ఉన్నాయి.

*ఋగ్వేదం 10 వ మండలం లో పాచికల విద్యమీద 34 వ సూక్తం కర్త  కవష ఐలూషుడు దాసీ స్త్రీకి పుట్టాడు. జన్మతః తల్లిది శూద్ర వర్ణం . అయినా అత్యున్నతమైన ఋషిత్వాన్ని పొందాడు. మంత్రద్రష్ట కాగలిగాడు.
* శూద్ర స్త్రీకి జన్మించిన వత్సుడు, చండాల కుటుంబంలో  పుట్టిన మతంగుడు బ్రాహ్మణత్వం పొంది వేద ఋషులు కాగలిగారు.
*తన తండ్రి ఎవరో తల్లికే తెలియని సత్యకాముడు బ్రాహ్మణుడుగా గుర్తింపుపొంది బ్రహ్మవాది ఋషి అయ్యాడు.
*దాసీ కడుపున పుట్టిన విదురుడు కురుసభలో మంత్రిపదవిపొంది గొప్ప ధర్మవేత్తగా  పేరొందాడు.
*క్షత్రియ కుటుంబంలో పుట్టిన విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. మళ్ళీ అదే విశ్వామిత్ర బ్రహ్మర్షి కుమారులు శూద్రులకంటే దిగువకు పతితులయ్యారు.
*క్షత్రియ వంశంలో పుట్టిన రాముడు , యాదవ కుటుంబంలో పుట్టిన కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడి అవతారాలుగా లోకమంతా పూజలందుకున్నారు.
*శ్రీరాముడి వంశకర్త అయిన రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు సంఘబాహ్యుడై రాక్షసత్వం పొందాడు.
*బ్రాహ్మణ  జన్మ ఎత్తిన రావణుడు భ్రష్టుడై రాక్షసుడు అయ్యాడు.
*క్షత్రియుడుగా పుట్టిన త్రిశంకుడు చండాలుడయ్యాడు.

     మహాభారతకాలం దాకా ఉన్నదీ, మనువు ఉద్దేశించిందీ ఇలా  2 way motion కి వీలు ఉన్న  వర్ణమే. వర్ణమనేది పుట్టుకని బట్టి నిర్ణయమయితే బ్రాహ్మణ కులం లో పుట్టినవాడు  తనకు నిర్దిష్టమైన విధులు నిర్వర్తించకపోయినా ...చేసే పనులవల్ల భ్రష్టుడైనా నికృష్టుడైనా -బతికినంతకాలం బ్రాహ్మణుడుగానే గానే మిగిలిపోతాడు. జన్మతః శూద్రుడైనవాడు ఎన్ని ఉత్తమ లక్షణాలను సంతరించుకున్నా ఎదుగుబొదుగులేక శూద్రుడుగానే మిగిలిపోతాడు. అది మనువు మూల సూత్రానికే విరుద్ధం. మనుస్మృతి లో ఉన్నదంతా కిందినుంచి పైకి , పైనుంచి కిందికి మారడానికి వీలుకల్పించే వర్ణవ్యవస్థే .  మచ్చుకు ఈ కింది శ్లోకాలను గమనించండి :

     శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతాం
     క్షత్రియా జ్జాతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవచ  ( మనుస్మృతి 10 -65 )
     శూద్రుడు బ్రాహ్మణత్వం పొందును . బ్రాహ్మణుడు శూద్రత్వము పొందును. అలాగే క్షత్రియుడికి పుట్టినవాడు, వైశ్యుడికి పుట్టినవాడు చేసే పనులను బట్టి అన్య వర్ణము పొందుదురు 

     న తిష్ఠతి తు యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం
     స శూద్రవత్ బహిష్కార్యః సర్వస్మాత్ ద్విజకర్మణః   ( మనుస్మృతి 2 -103 )
      ఉదయము, సాయంత్రం ఎవడు సంధ్యను ఉపాసించడో వాడిని శూద్రుడి వలె అన్ని ద్విజ కర్మల నుండి బహిష్కరించవలెను. 

       యోనధీత్య ద్విజో వేదమన్యత్ర కురుతే శ్రమం 
       స జీవన్నేవ శూద్రత్వమాశు గచ్చతి సాన్వయః  ( మనుస్మృతి 2-168 ) 
        ఎవడు వేదాధ్యయనం చేయక ఇతర శాస్త్రములను ఎన్ని అభ్యసించినా అతడు తన వంశజులతో సహా శూద్రత్వము పొందును. 

     మనువు దృష్టిలో వర్ణమనేది flexible అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అక్కరలేదు. అనంతరకాలంలో జాతి ( అంటే  జన్మ ) ని బట్టి కులం అనేది వచ్చిపడ్డాక చాతుర్వర్ణాలలో ఎన్నో కులాలు, ఒక కులంలోనే గోత్రాలను బట్టి ఎన్నో ఉపకులాలు వచ్చిపడ్డాయి. ఆ జాబితా చాంతాడంత ఉంటుంది. మనుస్మృతిలో అలా జన్మనా కులవ్యవస్థ ప్రస్తావన  , ఉపకులాల ఊసు ఎక్కడాలేదు. పైగా ఇంటికి వచ్చిన అతిథి కులగోత్రాలు కనుక్కోకుండా భోజనం పెట్టాలని , అలా కనుక అడిగితే అది  వాంతి చేసుకున్న అన్నాన్ని పెట్టినట్టే అవుతుందని మనువు అంటాడు కింది శ్లోకంలో :

     న భోజనార్థం స్వే విప్రః కులగోత్రే నివేదయేత్ 
     భోజనార్థం హి తే శంసన్ వాంతాశీరుచ్యతే బుధై: ( 3 - 109 )

     కులగోత్రాలతో నిమిత్తం లేకుండా కలిసి భోజనం చేయాలని వేల ఏళ్ళ కిందే బోధించిన మనువును మనల్ని పట్టిన కులపిశాచానికి మూలపురుషుడు అనటం విజ్ఞత కాదు .. అది అన్యాయం ... దుర్మార్గం .

  ఇంకా ఉంది .










Thursday 15 March 2018

తేరగా దొరికింది హిందువులా ?

మనుధర్మం -8

ఎం.వి.ఆర్.శాస్త్రి
.....

     Let your women keep silence in the churches: for it is not permitted unto them to speak ; but they are commanded to be under obedience , as also saith the law.... And if they will learn anything let them ask their husbands at home; for it is a shame for women to speak in the church. ( I Corinthians , 14/ 34,35 )
   మీ ఆడవాళ్ళను సమావేశాలలో నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి.ఎందుకంటే వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు .అలా అని ధర్మశాస్త్రం చెబుతున్నది. వారు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో తమ భర్తలని అడగాలి. చర్చి సమావేశంలో  స్త్రీ మాట్లాడటం సిగ్గుచేటు. (  కోరింథీయులకు వ్రాసిన  మొదటి పత్రిక  , 14 / 34 , 35 )

  Wives, submit yourselves onto your own husbands , as unto the Lord. For the husband is the head of the wife, even as Christ is the head of the Church.. ( Ephesians , 5/22,23 )
 మహిళలారా ! ప్రభువునకు వలే  మీ సొంత భర్తలకు లోబడి యుండుడి ! క్రీస్తు చర్చికి శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ( ఎఫెసీయులకు పత్రిక  , 5/22,23 )

   Let the woman  learn in silence with all subjection . But I suffer not a woman to teach ,not to usurp authority over the man , but to be in silence. ( I Timothy , 2/ 11, 12) 
 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొన వలెను .స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని , ఉపదేశించుటకైనను , పురుషుని మీద అదికారము చలాయించుటకైనను ఆమెకు నేను సెలవియ్యను  (  తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2/11,12 ) 

 ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనిన యెడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను  ముట్టుదై కడగా నుండు దినములను బట్టి  పురిటాలై యుండవలెను.  ఆమె తన రక్తశుద్ధికై 33 దినములు కడగా నుండవలెను. పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు... ఆమె ఆడపిల్లను కనిన ఎడల రెండు వారములు పురిటాలై ఉండవలెను. 66 దినములు కడగా ఉండవలెను. ( లేవీయ కాండము , 12 వ అధ్యాయము , 2 -5 వాక్యాలు )

   స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీ పురుషుడి కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు.  ( కోరింథీయులకు   వ్రాసిన  మొదటి పత్రిక, 11/8,9 )

   విన్నారు గదా  ?!

 *ఆడది పుట్టింది మగవాడి అనుభవం కోసం.
*చర్చి లాంటి సమావేశ స్థలాల్లో ఆడది నోరెత్తకూడదు.
*ఓ భార్యలారా ! మీ మొగుళ్లకు లోబడి బతకండి. చర్చికి యేసు ప్రభువు అయినట్టు నీ మగడు నీకు ప్రభువు.
*ఆడది నోరుమూసుకుని పడి  ఉండాలి . మగాడికి ఎదురు చెప్పకూడదు.మగవాడి మీద అధికారం చలాయించడానికి  దేవుడి అనుమతి లేదు.
*పెళ్ళికి ముందు భర్త ఒకడికి దాసుడు అయితే .. పెళ్ళయ్యాక భర్త బయటికి వెళ్ళిపోయినా .. భార్యాబిడ్డలు మాత్రం యజమాని సొత్తుగానే పరిగణించాలి. భర్తకు తప్పినా భార్యకు దాస్యం తప్పదు.
*పెళ్ళయ్యాక కన్యాత్వపు " బట్టపరీక్ష"లో నవ వధువు కన్నె కాదని తేలితే  కన్నవాళ్ళ ఇంటిదగ్గర ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి.
*మొగుడికి కోపం వచ్చి తన భార్య వేరొకడితో వ్యభిచరించిందని ఆరోపణ చేస్తే "యాజకుడు " ఆమె కడుపు ఉబ్బి నడుము పడిపోయేట్టు చేసే చెడు నీళ్ళు తాగించాలి.
* ఆడడానిని రేప్ చేస్తే ఆ నేరం పొట్టేలు బలితో సరి.
*మగ బిడ్డను కంటే బాలింతకు  వారం రోజులు ముట్టు , 33 రోజులు మైల. అదే ఆడపిల్లను కంటేనో ? రెండు వారాలు ముట్టు , 66 రోజులు మైల!

   పుట్టే బిడ్డ ఆడ అయినా మగ అయినా ప్రసవ ప్రక్రియ ఒకటే. బాలింత శరీర ధర్మం ఒకటే. అయినా మగబిడ్డ కంటే  ... ఆడబిడ్డకు జన్మనిస్తే తల్లికి నెలరోజులు ఎక్కువ అంటు. ముట్టు కాలపరిమితి రెట్టింపు రోజులు ఎక్కువ.

   ఇవీ "పరిశుద్ధగ్రంథం" లో పలికిన స్త్రీ ధర్మాలు.

   ఇప్పుడు మన పెద్ద నోళ్ళ హేతువాదులను , సోకాల్డ్ స్త్రీవాదులను, భలే మానవతావాదులను కొన్ని ప్రశ్నలు అడుగుదాం .

   మనుస్మృతి లో స్త్రీ తండ్రి, భర్త ,పుత్రుల రక్షణలో ఉండాలని అన్నందుకే మనువు స్త్రీకి స్వాతంత్ర్యం హరించాడని మీరంతా పాపం చాలా ఆవేశపడుతున్నారు కదా ? మొగుడి కాళ్ల దగ్గర ఆడది నోరుమూసుకుని పడి ఉండాలని " పరిశుద్ధ గ్రంథం చెప్పటం స్త్రీకి చాలా  గొప్ప స్వాతంత్ర్యం ఇచ్చినట్టు అవుతుందా ?

   స్త్రీని ఆదిశక్తి గా , సృష్టి స్థితి లయ కారులైన త్రిమూర్తులకు జన్మనిచ్చిన మూలపుటమ్మగా కీర్తించే హిందూ మతం , స్త్రీలను గౌరవించి పూజిస్తేనే దేవతలు సంతోషిస్తారని చెప్పిన మనుధర్మం మీ కంటికి స్త్రీల పాలిటి ఆజన్మ శత్రువులుగా ...  పురుషాధిక్య పైత్యంతో స్త్రీ జాతిని కాళ్లకింద క్రూరాతి క్రూరంగా తొక్కివేసిన మహా పాపులుగా కనపడుతున్నారు కదా ? మగవాడు ఆడదాని కోసం పుట్టలేదు. ఆడదే మొగవాడు అనుభవించటం కోసం పుట్టింది అని బైబిల్ సెలవివ్వటం మాత్రం మీ దృష్టిలో స్త్రీజాతి ఔన్నత్యాన్ని పెంచటం అవుతుందా ? మగబిడ్డకు కంటే ఆడబిడ్డ విషయంలో రెండు రెట్లు ఎక్కువ అశౌచం పాటించాలని చెప్పటం స్త్రీల పట్ల తగని వివక్ష చూపటం కాదా ?

    మరి మనుస్మృతిలో ఉన్నదని మీరనునుకుంటున్న దానికంటే నూరు రెట్లు ఎక్కువ డామేజింగు గా ఉన్న బైబిల్ గురించి మీరు మాట్లాడరెందుకు ? మీ నోటి తీట అంతటినీ ఎంతసేపూ హిందూ మతం మీద , మనుధర్మం మీదే  చూపిస్తారెందుకు? హిందూసమాజం ఏనాడో మూలన పడేసిన మనుస్మృతి అనే  ఒక గ్రంథం లో ఎక్కడో ఏదో ఉన్నదని ఎవరో మీకు చెప్పినదానికే అఘాయిత్యాలేవో జరిగిపోతున్నట్టు మీరు పెడబొబ్బలు పెడుతూంటారు కదా ? ప్రపంచంలోకెల్లా పెద్దమతాల్లో ఒకటైన క్రైస్తవానికి సంబంధించి వందకోట్లకు పైగా జనం నేటికీ పవిత్రగ్రంథంగా పూజించే బైబిల్ లో మనుస్మృతి లో   ఉన్నదానికంటే వందరెట్లు ఎక్కువ పురుషాహంకారం, స్త్రీద్వేషం ఉన్న సంగతి మీ కళ్ళకు , చెవులకు ఆనవా ? ఇందులోని మతలబు ఏమిటి? హిందూ మతం మీద మీరు కక్కుతున్న విషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?

    ఇక చివరిగా ...

    ఇంద్రియాలు ఎంతటివారినైనా పడగొట్టగలవు కాబట్టి  కన్నతల్లి , కన్నబిడ్డ, తోబుట్టువు లతో  పురుషుడు ఒంటరిగా ఒకే ఆసనం మీద ఉండకూడదు అని మనుస్మృతి హితవు పలికితే ...  'చూశారా! కన్నతల్లికీ, కన్నకూతురికీ ,తోడబుట్టినడానికి కూడా వావివరసలేరుగని కాముకత్వాన్ని మనువు అంటగట్టాడ'ని మీలో కొందరు బుద్ధిమంతులు గావుకేకలు పెట్టారు కదా ? మరి బైబిల్ " పాతనిబంధన" లోని ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఉపాఖ్యానం గురించి మీరు ఏమంటారు? కావాలంటే ఆ పరిశుద్ధ వాక్కులు ఇక్కడ చూడండి :

   లోతు, అతడి ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి . అట్లుండగా అక్క తన చెల్లెలితో  - మన తండ్రి ముసలివాడు. లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగా చేసుకొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలి వెళ్లి అతనితో శయనించెను. ...మరునాడు రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము  త్రాగించిన తరువాత చిన్నది లేచి అతనితో శయనించెను. ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ( ఆది కాండము , 20 వ అధ్యాయము, 30 - 36 వాక్యాలు ) 

    మహాజ్ఞానులారా , చెప్పండి! పవిత్ర బైబిల్ లో  పేర్కొన్న ఆ  గొప్ప తండ్రికీ అతడి కన్నకుమార్తెలు ఇద్దరికీ మధ్య ఉన్నది మీ దృష్టిలో   " పవిత్ర, హేతుబద్ధ, ప్రగతి శీల మరియు సమాజాన్ని ముందుకు తీసుకుపోయే " సంబంధమా ?  కాల దోషం పట్టిన మనుస్మృతిలో స్త్రీపురుష సంబంధాలపై విధించిన పూర్వకాలపు కట్టుబాట్లకే ఇల్లెగిరిపోయేట్టు రంకెలు వేస్తున్న మీరు , ఇప్పటికీ ప్రపంచమంతటా కోట్లమంది భక్తితో పారాయణం చేస్తున్న పవిత్ర గ్రంథం లోని ఇలాంటి రోతల  గురించి   నోరు మెదపరెందుకు ?

    రోషం, పౌరుషం లేని హిందువుల మీదే తప్ప తమ జోలికి వస్తే శాస్తి చేసే  అన్య మతాల మీద మీ ప్రతాపం పనిచేయదా ?