Thursday 22 March 2018

ఎవరు మూర్ఖులు ?

స్టార్స్ X సైన్స్ - 3


ఎం.వి.ఆర్.శాస్త్రి

.......
 ( "ఏది సైన్సు, ఏది నాన్సెన్సు" .... "జ్యోతిషాన్ని తిట్టటం మూర్ఖత్వం " ల తరవాతి భాగం )

   జ్యోతిష్కులు వేస్తున్నవేమైనా తలాతోకాలేని వెర్రి లెక్కలా? కాదు. వేల సంవత్సరాల కిందటి గర్గసంహిత గ్రహణాలను బట్టి, పూర్ణిమ అమావాస్యలనుబట్టి భూకంపాలను ఊహించటానికి స్పష్టమైన తోవ చూపింది. దాని ప్రకారం 20వ శతాబ్దంలో వచ్చిన 170 భూకంపాలను అధ్యయనం చేస్తే గ్రహణం నాటి నుంచి 30వ తిథి మొదలుకుని తరవాతి పక్షంలో రెండో తిథి లోపు (అంటే ఇంచుమించుగా మళ్లీ అమావాస్య - పౌర్ణమిల ప్రాంతంలో) భూకంపాలను ఆస్కారం ఉంటుందని తేలింది. (సూర్య గ్రహణం అమావాస్య రోజు, చంద్రగ్రహణం పౌర్ణమి నాడు పడతాయని తెలిసిందే.) అలాగని గ్రహణం తరవాత వచ్చే ప్రతి అమావాస్య, పున్నముల్లో భూమి కంపిస్తుందని కాదు. ఇంకా లెక్కలోకి తీసుకోవలసిన జ్యోతిష శాస్త్రపరమైన అంశాలు, గ్రహస్థితి గతులు చాలా ఉంటాయి.

    ఫలితాలు ఎంత బాగా చెప్పగలుగుతున్నా మన జ్యోతిష్కులు మూర్ఖుల్లా, వారి శాస్త్రం వెర్రి మూఢ నమ్మకంలా మన కుహనా మేధావుల కంటికి కనిపిస్తున్నప్పటికీ విదేశాలు వారి విద్యను ఆసక్తితో గమనిస్తున్నాయి. అవసరమైన మేరకు నిస్సంకోచంగా ఉపయోగించుకుంటున్నాయి కూడా. ఉదాహరణకు కొయినా తదితర భూకంపాలను పూణే జోస్యుడు కేల్కర్ ముందే ఊహించగలగటాన్ని  మనశాస్త్రజ్ఞులైతే పెద్దగా పట్టించుకోలేదు. కాని - కమ్యూనిస్టు రష్యా విశేష ఆసక్తి చూపింది. సోవియట్ సైంటిస్టులు ప్రత్యేకంగా పూణే వెళ్ళి కేల్కర్ ను కలిసి, గ్రహణాలకూ చంద్రుడి వృద్ది క్షయాలకూ భూకంపాలకూ మధ్య జ్యోతిషపు లంకెను బోధపరచుకుని, దాని ప్రాతిపదికపై అనేక శాస్త్రీయ అధ్యయనాలు జరిపారు. గర్గ మహర్షి సూత్రాలనే 'న్యూట్రాన్ ఫ్లాషింగు' పేరిట వారు అనుభవపూర్వకంగా అంగీకరించారు. జ్యోతిషానికి గల శాస్త్రీయ ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించే రష్యన్ అకాడమీ ఆఫ్ నాచురల్ సైన్సెస్ లో జ్యోతిషం అధ్యయనాన్ని ప్రోత్సహించసాగారు. మన దృష్టిలో జ్యోతిషం చేతబడి లాంటి క్షుద్రవిద్య కాబట్టి దాన్ని ఆదరిస్తున్న రష్యన్ సైంటిస్టులనూ మూఢులందామా?

   భూకంపాలనే గాక తుఫాన్లు, వర్షాల తాకిడినీ సైన్సు కంటే బాగా జ్యోతిషం అంచనా వేయగలదనడానికి డజన్ల కొద్ది దృష్టాంతాలున్నాయి. ఉదాహరణకు 1987లో వర్షాల జాడలేక శతాబ్దంలోకెల్లా భయంకరమైన దుర్భిక్షం మీద పడవచ్చునని రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని వాతావరణ నిపుణులు భయపెట్టారు. 1944లో వెలువడ్డ శతాబ్ది పంచాంగంలో చెప్పిన ప్రకారం 1987 గ్రహస్థితిని బట్టి భాద్రపద మాసం శుక్లపక్షం (ఆగస్టు - సెప్టెంబర్) వరకూ వానలు వెనకబట్టి తరవాత పరిస్థితి మెరుగవుతుందని జ్యోతిష్కులు చెప్పారు. వారిమాటే నిజమైంది.

    ఇక వైద్య జ్యోతిషానికి వస్తే - రోగ నిదానంలో, వ్యాధి నిరోధంలో ఆధునిక సైన్సుకు జ్యోతిషం చేయగల సహాయం ఎంతో ఉంది. మరి కొద్ది రోజుల్లో ఏ లివరుకో కాన్సరు సోకి పక్షం తిరక్కుండా మరణించబోతున్న రోగికి కూడా ఆపాదమస్తం ఎన్ని స్కానింగులు, ఎన్ని పరీక్షలు చేసినా వ్యాధి లక్షణం ఎక్కడా కనపడక పోవచ్చు. ఎయిడ్స్ పట్టిన రోగి హెచ్.ఐ.వి. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యేసరికి జబ్బు ధన్వంతరి దిగి వచ్చినా ఆదుకోలేని స్థితికి ముదిరిపోతుంది. బ్లడ్ ప్రెషరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ కింద సంఖ్య ఏ రోజు జాస్తి అయితే ఆ రోజు హైపర్ టెన్షన్ వచ్చిందని అనుకోవలసిందే. రక్తపరీక్షలో షుగర్ ఎక్కువగా ఎన్నడు కనిపిస్తే ఆనాటి నుంచీ డయాబెటిస్ పట్టిందని తెలుసుకోవలసిందే. అంతేతప్ప ఒక్క రోజు ముందు కూడా వైద్యపరిజ్ఞానం అడ్వాన్సు బెల్లు కొట్టదు. కీళ్ళ నొప్పులూ కాళ్ళ నెప్పులూ ఎముకల జబ్బులదీ అదే పరిస్థితి.
     జ్యోతిషం అయితే - మనిషి పుట్టగానే మునుముందు ఏ కాలంలో ఏ ఏ  శరీర భాగాలకు ఏ రకమైన జబ్బులు సోకవచ్చో లెక్కవేసి చెప్పగలదు. జన్మనక్షత్రాన్నిబట్టి, లగ్నాన్నిబట్టి, జాతకంలో రవి, చంద్ర, కుజ, రాహువుల వంటి గ్రహాల స్థితి, షడ్బలాలనుబట్టి, నవాంశ, ద్రేక్కాణాలనుబట్టి శారీరిక, మానసిక వైకల్యాలకు ఆస్కారాలను జ్యోతిష్కులు ఊహిస్తారు. వారు చెప్పేదే అనుభవంలోనూ సరిపోతున్నట్టు జ్యోతిష ప్రవేశంగల పెద్ద డాక్టర్లెందరో ధ్రువీకరించారు. ఫలానా మనిషికి ఫలానా రకాల రుగ్మతలు రావచ్చని ముందే తెలిసినప్పుడు ఆయా శరీర భాగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా వ్యాధి చిహ్నాలు సూక్ష్మంగా కనిపించీ కనిపించగానే అది వేరే జబ్బు కావొచ్చని తటపటాయించకుండా వెంటనే చికిత్స ప్రారంభించి గండం దాటించటానికి వీలవుతుంది. ఈ సౌలభ్యాన్ని గ్రహించడం వల్లే ఆధునిక వైద్యంలో పెద్ద డిగ్రీలు పొందిన డాక్టర్లు కొందరైనా మెడికల్ ఆస్ట్రాలజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వాస్తవానుభావంతో జ్యోతిష సూత్రాలను రుజువు పరుస్తూ, మిగితా వైద్యులకూ ఉపకరించే రీతిలో వైద్య జ్యోతిషాన్ని యథాశక్తి అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. జ్యోతిషాన్ని విశ్వసించినంత మాత్రాన వారందరూ మూర్ఖులు అయిపోరు. వారు నేర్చిన సైన్సు సైన్సు కాకుండానూ పోదు. భూకంపాల విషయంలోలాగే వైద్యంలోనూ 90 జోస్యాలు విఫలమై నూటికి 10 మాత్రమే నిజమైతేనేమి? కనీసం ఆ 10 శాతం రోగులకైనా ప్రాణం నిలబెట్ట గలిగితే ఆ మేరకు వైద్యశాస్త్రం లాభపడినట్టే కాదా? ఆమాటకొస్తే వైద్యుల జ్యోస్యాలు మాత్రం అన్నీ నిజమౌతున్నాయా?

    ఇంకో సంగతి. మిగతా భారతీయ శాస్త్రాల్లాగే ఆయుర్వేదాన్నీ ఇటీవలి దాకా నాటు వైద్యమని కొట్టిపారేసిన అల్లోపతీ భిషగ్వరులు - లివర్ జబ్బుల వంటి రుగ్మతల చికిత్సలో తమ పరిమితులను, ఆయుర్వేదం  ప్రయోజనాలను గ్రహించాక-  అదీ గౌరవనీయమైన వైద్య విదానమేనని అంగీకరించారు. యూనివర్సిటీ కోర్సుల్లో, ఆస్పత్రి విభాగాల్లో ఆయుర్వేదాన్ని చేర్చడానికి అభ్యంతరం లేదంటున్నారు. మంచిదే.  కాని - జ్యోతిషానికీ ఆయుర్వేదానికీ విడదీయరాని లంకె ఉంది. పంచాంగాల్లో ప్రతిరోజూ పేర్కొనే అమృత ఘటికలు ఔషధ సేవకు ఉద్దేశించినవే. కొన్నికొన్ని ఔషధాలను కొన్ని నక్షత్రాలలోనే, ఫలానా సమయాల్లోనే ఇవ్వాలని ఆయుర్వేదం చెబుతుంది. మరి - ఆయుర్వేదాన్ని యూనివర్సిటీల్లో అనుమతించి, దానికి అవినాభావ సంబంధంగల జ్యోతిషాన్ని మాత్రం గెంటేయటం ఎలా కుదురుతుంది?

    ఆయుర్వేదం దాకా ఎందుకు? ఆధునిక వైద్య శాస్త్రానికి ఆరాధ్యుడైన హిప్పోక్రేట్సే " A physician cannot safely administer medicine if he be unacquainted with Astrology"(జ్యోతిషంతో పరిచయం లేకపోతే ఏ వైద్యుడూ సక్రమంగా చికిత్స చేయలేడు ) అన్నాడు. భౌతిక శాస్త్రానికి మూలపురుషుడైన న్యూటన్ ను జ్యోతిషాన్ని నమ్ముతున్నందుకు ఎవరో అధిక్షేపిస్తే " Sir I have studied Astrology. You have not" (అయ్యా, జ్యోతిషాన్ని నేను చదివాను. మీరు చదవలేదు) అని దిమ్మతిరిగే జవాబు చెప్పాడు. జ్యోతిషం తప్పు అని నిరూపించడం కోసం ఆ శాస్త్రాన్ని నేర్చకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ బట్లర్ చివరికి జ్యోతిషానికి వీరాభిమానిగా మారాడు.

    జ్యోతిషాన్ని నమ్మిన ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరూ మూర్ఖాగ్రేసరులేనా? జ్యోతిషం మా కొద్ది బుర్రకు అంతు బట్టదు కనుక అది శాస్త్రమే కాదనీ, జోస్యాలన్నీ నిజం కావడం లేదు కనుక జ్యోతిష శాస్త్రమే శుద్దాబద్ధమనీ, ఒక్క జోస్యం విఫలమైనా మొత్తం శాస్త్రాన్నీ తోసిపుచ్చవలసిందేననీ అడ్డంగా వాదించే వెర్రిమొర్రి  మేధావులు మాత్రమే సైన్సుకు వారసులనుకోవాలా? వాతావరణ శాస్త్రవేత్తల జోస్యాలన్నీ నిజమవుతున్నాయా? రోగం ఫలానా అని అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో డాక్టర్ చేసే డయాగ్నసిస్ లన్నీ కరెక్టవుతున్నాయా? ఇదే వితండ వాదాన్ని బట్టి ఒక్క వైద్యుడు విఫలమైనా  మొత్తం వైద్యశాస్త్రాన్ని అవతల పారేయ్యాలా? ఒక వాతావరణ సూచన అబద్ధమైనా మొత్తం వాతావరణ శాస్త్ర యంత్రాంగాన్ని బంగాళాఖాతంలో విసిరేయాలా?

(2001 సెప్టెంబర్ 9 న ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన వ్యాసం )


No comments:

Post a Comment