Monday 26 March 2018

బ.మ. - లో. మ. ప్రహసనం

స్టార్స్ X సైన్స్ - 4


ఎం.వి.ఆర్.శాస్త్రి

.......

   సినిమాల్లోనే కాదు ... ద్విపాత్రాభినయాలు నిజ జీవితాల్లోనూ మామూలే. కొద్దిమంది మహానుభావులను మినహాయిస్తే మనలో ప్రతి మనిషీ రోజూ డబుల్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు. లోపలి మనిషి (లో.మ) వేరు; బయటి మనిషి (బ.మ) వేరు. బయటికి కనిపించే మనిషి చెప్పేదొకటి. లోపలి శాల్తీ చేసేది ఇంకొకటి. పెద్దమనిషి డ్రస్సు వేసుకుని నలుగురిలో ఉన్నంతసేపూ బయటి మనిషి ఆలోచనలెప్పుడూ ఆకాశమంత ఎత్తున విహరిస్తుంటాయి. పలికే ప్రతి పలుకులో ఉన్నత ఆదర్శం, ఉత్తమ సంస్కారం, వైజ్ఞానిక దృక్పథం ఎట్సేట్రాలు ఉట్టి పడుతుంటాయి. ఆ డ్రస్సు కాస్తా విప్పేసి తన ఒరిజినల్ కలుగులోకి వచ్చాక లోపలి మనిషి తరహా గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. అయ్యగారి అసలు స్వరూపం మురుగు సుగంధాలతో బయటపడుతుంది.

   అందరికీ తెలిసి కూడా ఎవరూ గుర్తించినట్టు కనిపించని ఈ బ.మ. - లో.మ.  వైరుధ్యానికి  జోస్యం మీద (అప) నమ్మకం చక్కటి దృష్టాంతం.

   జ్యోతిషాన్ని మీరు నమ్ముతారా అని అడగండి. సైన్సు పాంటు, మోడరన్ షర్టు వేసుకున్న ఏ పెద్ద మనిషి అయినా 'నమ్మను' అనే జవాబు చెబుతాడు. ఒకవేళ ఎవరన్నా అమాయకులు తమకు నమ్మకం ఉందని చెబితే నవ నాగరికులు వారిని వెర్రోళ్ళలా చూస్తారు. ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉండగా అందరి అదృష్టమూ జోస్యుడు పది ముక్కల్లో చెప్పిన ప్రకారమే నడుస్తుందని నమ్మటం మూర్ఖత్వమంటూ సైన్సు కత్తితో జ్యోతిషాన్ని పదిమందిలో చీల్చిచెండాడుతుంటారు.

   కాని చిత్రం ! పత్రిక చేతికి రాగానే వీరిలో చాలామంది కళ్ళు జ్యోతిషం కాలమ్ మీదకే మళ్ళుతుంటాయి. రోజూ ఒక పేపరు చూసేవాళ్ళు కూడా ఆదివారంనాడు నాలుగు పేపర్లు తిరగేసి, రాశిఫలాల్లో తమ గురించి ఏమి రాశారో రహస్యంగా చదివి బేరీజు వేసుకుంటారు.

   ఒక విప్లవ రచయిత శకునాలను నమ్మడు. కాని... పిల్లి ఎదురైతే ఇల్లు కదలడు. మరో ఆధునిక మేధావి జోస్యాల మీద, జాతకాల మీద పిసరంత నమ్మకం లేదంటాడు. కాని - కొడుక్కు పెళ్ళి చేయాల్సి వస్తే మొట్టమొదట ఆయన అడిగించేదే అమ్మాయి జాతకాన్ని. ఇంకో కమ్యూనిస్టు నాయకుడికి పూర్వాచారాలూ, సంప్రదాయాలూ బొత్తిగా గిట్టవు. పిల్లలకు కూడా దండల పెళ్ళిళ్ళే చేస్తాడు. కాని - దండలు మార్చుకునే టైమును మాత్రం (ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ఇల్లాలి ద్వారా) పంచాంగం పంతులు నిర్ణయిస్తాడు . ఒక్క సెకను కూడా అటూ ఇటూ కాకుండా మన కామ్రేడు గారు గొప్ప పంక్చువాలిటి పాటించి ఆదర్శవివాహాన్ని యథావిధిగా జరిపిస్తారు. హేతువాద సంఘంలో లైఫ్ టైమ్ మెంబరైన పెద్ద డిగ్రీల ప్రొఫెసరు గారొకరు హస్తసాముద్రికాన్ని ససేమిరా అంగీకరించరు. కాని - 'ఈయన గొప్ప పామిస్టు! మీ చేయి చూపించరాదా' అని ఏ దగ్గర బంధువో, స్నేహితుడో, చెబితే చాలు ఆయన అరచేయి ఆయనకు తెలియకుండానే తెరుచుకుని ముందుకు ఉరుకుతుంది. నమ్మకం ఉండి కాదు. ఉత్తినే! ఏమి చెబుతాడో సరదాగా విందామనే!!!

   రేషనలిస్టు, సోషలిస్టు, ఇంకో ఇస్టు అయిన ఒక వీర సైన్సు వాదికి రత్నాలనా, న్యూమరాలజీ అన్నా వాస్తు అన్నా ఒళ్ళు మంట. కాని అదేమి చిత్రమో! గ్రహచారం బాగోలేదు కనక నక్షత్రాన్ని బట్టి ఆయన ఏ రాయి వాడితే మంచిదని ఆయన ఇల్లాలికి చెట్టుకింద జ్యోతిష్కుడు మూడు రోజుల కిందట చెప్పాడో, సరిగ్గా అదే రాయి పొదిగిన ఉంగరం ఆయన కుడిచేతి అనామిక (చిటికిన వేలు పక్కన ఉండే ఉంగరపు వేలు)ను అర్జంటుగా అలంకరిస్తుంది. ఆయన కారు నెంబరు, ఫోను నెంబరు ఎటు నుంచి కూడినా 9 అంకె వస్తుంది. చాలా కాకతాళీయంగా! ఆయన కొనదలచిన ఇంటికి ఆగ్నేయంలో కిచెన్ లేకపోయినా, నైరుతిలో ద్వారం ఉన్నా ఆయనకు 'వేరే ఈస్తటిక్ కారణాల వల్ల' ఇల్లు నచ్చదు. ఈశాన్యం పెరిగి ఉన్న స్థలమైతే మాత్రం - ఆ సంగతి ఆయన గమనించకుండానే - ఆయనకు బోలెడు నచ్చేస్తుంది.

   బహిరంగంగా అడిగితే దేశంలో నూటికి 80 మంది జ్యోతిషం మీద నమ్మకం లేదనే చెబుతారు. అదే నిజమైతే మన దేశంలో జ్యోతిష్కులు, జ్యోతిషం చెప్పే సంస్థలు పనిలేక ఎప్పుడో దివాలా తీసి ఉండవలసింది. కాని... ఇవాళ వీధికో కంప్యూటర్ హారోస్కోప్ దుకాణం. ఊరికి నాలుగు ఆస్ట్రాలజీ సలహా కేంద్రాలు.

      ఆపి సాగర పర్యన్తా విచేతవ్యా వసున్ధరా
      దేశ హ్యారత్నిమాత్రోపి నాస్తి దైవజ్ఞ వర్జితః

   (ఈ భూమండలాన్నంతనీ సముద్రం దాకా వెదకండి. జ్యోతిష్కుడు లేనిదే జానెడు ప్రదేశం కూడా ఉండదు)

    -అని 17వ శతాబ్దం వాడైన నీలకంఠ దీక్షితులు కలివిడమ్బన శతకంలో చెప్పాడు. సైన్సు విజ్ఞానం వికసించని అంధ  యుగాలని మనం అనుకునే నాలుగొందల ఏళ్ళ కిందటే జానె కొక జ్యోతిష్కుడు ఉండగా శాటిలైట్లు, ఇంటర్నెట్ల ఈ ఆధునిక కాలంలో అంగుళానికి ఆరుగురు జ్యోతిష్కులు. అంతాహేతువాదులే అయి 'వెర్రి జోస్యాలను' ఎవరూ నమ్మకపోతే ఇంతమంది జ్యోతిష్కులను తామరతంపరగా వర్దిల్లజేస్తున్నదెవరు?

   మనిషి పుట్టినప్పుడే అతని భవిష్యత్తు మొత్తం నిర్ణయమై పోతుందంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. అన్నీ ముందే డిసైడ్ అయిపోతే మనిషి చొరవకు ఆస్కారమేమిటి ?  ఇక మనం చేయగలిగింది ఏమిటి - అన్న శంక చాలామంది జిజ్ఞాసువులకు సహజంగానే కలుగుతుంది. పంచాంగాలు, లగ్నాల లెక్కలనుబట్టి గ్రహాలు నడుస్తాయని, వాటి నడకనుబట్టి మనిషి జీవితం మరబొమ్మలా సాగుతుందని నమ్మడం మానవ మేధకు అవమానమని, వైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమని, సైన్సుకు అపచారమని గట్టిగావాదించేవారు ఎందరో ఉన్నారు. వారు చెప్పేది సహేతుకం, సమంజసం కూడా, కాని... వింతల్లోకెల్లా విడ్డూరం ఏమిటంటే - ఈ రకమైన ఆధునిక భావాలకు స్పూర్తినిచ్చి, శాస్త్రీయ మార్గంలోకి ఎంతోమంది ఆలోచనలు మరలడానికి కారణభూతులైన సుప్రసిద్ధ మహానీయుల్లో కూడా వ్యక్తిగత జీవితంలో జ్యోతిషాలను, జాతకాలను నమ్మేవారు చాలామందే ఉన్నారు.

   ఉదాహరణకు-
   నమ్ముతారో లేదో!
   జవహర్ లాల్ నెహ్రూ!!

   నెహ్రూ పేరు చెబితే ఒకటి రెండు తరాల కిందటి వరకూ యువకులకు ఒళ్లు పులకరించేది. దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని, బూజుపట్టిన పాత భావాల నుంచి బయట పడాలని, ప్రతిదాన్నీ శాస్త్రీయ దృష్టితోనే  చూసి, శాస్త్ర పరీక్షకు నిలబడినదాన్నే అంగీకరించాలని, ఆధునిక విజ్ఞాన జ్యోతులతో నవభారతాన్ని ఉజ్జ్వలంగా ప్రకాశింపజేయాలని నేషనల్ కాంగ్రెసు వేదికల నుంచి, ఇండియన్ సైన్సు కాంగ్రెసు అధ్యక్ష పీఠం నుంచి,  ఆయనచేసిన ఉత్తేజపూరిత ప్రసంగాలే యువతకు అనుక్షణం గుర్తుకొచ్చేవి. అంతటి నెహ్రూ పండితుడే తన కుమార్తె ఇందిరకు కొడుకు (రాజీవ్) పుట్టాడని తెలియగానే సరైన జాతకం వేయించమని చెప్పాడంటే నమ్ముతారా? అహ్మద్ నగర్ ఫోర్ట్ చెరసాల నుంచి 1944 ఆగస్టు 28న సోదరి కృష్ణ హతీసింగ్ కు రాసిన ఉత్తరంలో జవహర్లాల్ ఇలా అన్నారు:

  "In my letter to Indu, I suggested to her to ask you to get a proper horoscope made by competent person. Such permanent record of the date and the time of birth are desirable. As for the time, I suppose the proper solar time should be mentioned and not the artificial time which is being used outside now. War time is at least an hour ahead of the normal time."

   (సమర్ధుడైన వ్యక్తితో సరైన జాతకం వేయించాల్సిందిగా నీకు చెప్పమని ఇందూకు ఉత్తరం రాశాను. పుట్టిన తేది, సమయం గురించి అలాంటి పర్మనెంటు రికార్డు ఉండటం మంచిది. టైముకు సంబంధించినంత వరకూ సరైన సోలార్ టైమునే పేర్కొనాలి తప్ప ఇప్పుడు వాడుతున్న కృత్రిమ సమయాలను పేర్కొనకూడదు. మామూలు టైము కంటే వార్ టైము గంట ముందుంటుంది.)

  Faber and Faber అనే లండన్ ప్రచురణ సంస్థ వారు ముద్రించిన - సోదరికి నెహ్రూ లేఖలలో 74వ నెంబరు లేఖలోని భాగమిది. ఇది బయటకి తెలిస్తే నెహ్రూకున్న 'సెక్యులర్' ప్రతిష్ట దెబ్బతింటుందని కాబోలు భారత ప్రభుత్వం పబ్లికేషన్స్ డివిజన్ వారు అనంతర కాలంలో ప్రచురించిన నెహ్రూ లేఖల గ్రంథం నుంచి ఈ భాగాన్ని తీసేశారు. దాని మీద జ్యోతిష వర్గాలు అభ్యంతరం తెలిపిన మీదట - తరువాత వచ్చిన నెహ్రూ లేఖల 13వ వాల్యూంలో ఇందిరకు తండ్రి రాసిన లేఖను యథాతథంగా ప్రచురించారు. అందులో ఇలా ఉంది:

  "Betty nodoubt will take necessary steps to have Janmapatri made. This should be done for that is our traditional way to record the exact date and time of birth... Betty writes time of birth was 8.11 a.m. But what time? The time observed now is war time which is at least one hour ahead of normal time, possibly more. It is thus the artificial time and not the real time, according to which Moon should be when Sun is highest in the heaven..."

   ('జన్మపత్రిక'ను రాయించటానికి అత్త ఏర్పాటు చేస్తుందనుకో. పుట్టిన సమయాన్ని, తేదీని రికార్డు చేయడానికి అది మన సాంప్రదాయక పధ్ధతి కనక ఆ పని చేయాల్సిందే. పుట్టిన తేది ఉదయం 8.11 ని.లు అన్నారు. కాని - అది ఏ టైము? ఇప్పుడు వాడుకలో ఉన్నది వార్ టైము. అది అసలు సమయం కంటే గంటో అంతకంటే ఎక్కువో ముందుంటుంది. అది కృత్రిమం. అసలు టైములోనైతే సూర్యుడు ఆకాశంలో ఉన్నదాన్నిబట్టే చంద్రుడి స్థితీ ఉంటుంది.) 

    ఇది చదివాక ఒక అనుమానం రావచ్చు. కేవలం పుట్టిన తేదీని, సమయాన్ని రికార్డు చేయించటం కోసమే మనవడి జాతకాన్ని నెహ్రూ రాయించమన్నారా? అదే ఆయన ఉద్దేశమైతే జన్మపత్రికే రాయించనక్కర్లేదు. గడియారం, కేలండరు చూసి తేది ఫలానా, టైము ఫలానా అని ఒకచోట రాసి పెడితే సరిపోతుంది. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. మిగతా దేశాలతో మిలిటరీ సమన్వయం కోసం ఇండియాలోని గడియారాలను ( 1942 సెప్టెంబర్ 1 నుంచి 1945 అక్టోబర్ 15 వరకూ ) గంట ముందుకు తిప్పారు. పుట్టిన సమయం గుర్తు కోసమే అయితే ఉదయం 8-11 (వార్ టైం) అయినా 7-11 (అసలు టైం ) అయినా ఇబ్బంది లేదు. కానీ- జ్యోతిషం లెక్కలకు మాత్రం గంట తేడా వస్తే జాతకం మొత్తం మారుతుంది. రాశి, నక్షత్ర పాదం , లగ్నం, నవాంశ , గ్రహస్థితి అన్నీ మారిపోతాయి. అసలు టైం నే లెక్కలోకి తీసుకోవాలని తాతగారు అంతగా నొక్కిచెప్పటాన్ని బట్టే మనవడి జాతకం సరిగా ఉండాలనే, దాన్ని బట్టి ఫలితాలూ సరిపోవాలనే ఆయన ఆరాటమని స్పష్టం. అందుకే పుట్టిన టైం ను రికార్డు చేసి ఉంచమని కుమార్తె తో చెప్పి ఊరుకోకుండా , సరైన జాతకం వేయించమని చెల్లెలు కృష్ణ ను కోరాడు. ఆ పనిని ఆమె సరిగా చేయిస్తుందో లేదోనన్న ఆరాటం తోమనవడి జాతకం రాయమని వారణాసి లోని మాలవ్యాలనూ ఆయన అడిగాడు. ఆ పని  వాళ్ళు కాస్త ఆలస్యం చేసే సరికి చిరాకుపడుతూ మళ్ళీ గుర్తు చేశాడు.  ఈ వైనమంతటినీ నెహ్రూ జీవితకాలంలోనే యు.పి. మాజీ ముఖ్యమంత్రి సంపూర్ణానంద్ బహిరంగపరిచారు.

   ఇక్కడో సంగతి గమనించాలి. జవహర్ లాల్ నెహ్రూ జ్యోతిషాన్ని బాహాటంగా వ్యతిరేకించినా ఆ విద్యను ఇప్పటి మన కుహనా మేధావుల్లా గుడ్డిగా ద్వేషించలేదు.  వ్యక్తిగత జీవితంలో జాతకాల పట్ల తనకున్న ఆదర భావాన్ని దాచిపుచ్చెందుకూ ఈ కాలపు హిపోక్రైట్లలా తంటాలు పడలేదు. నెహ్రూ పుట్టిన సమయాన్ని జ్యోతిష్యులు తలా ఒక రకంగా లెక్కకడుతున్న సమయంలో ఆయన ప్రైవేటు సెక్రటరీ 1962 జూన్ 19 న ' ది ఆస్ట్రలాజికల్ మాగజిన్ ' కు రాసిన లేఖలో ఇలా తెలిపారు :

   The Prime Minister has asked me to write to you , that , so far as he knows , the time ogf his birth was 11-30 p.m. on November 14, 1889

    ( తనకు తెలిసినంతవరకూ తాను పుట్టింది 1889 నవంబర్ 14 రాత్రి గం. 11-30 ని.కు అని ప్రధానమంత్రి మీకు తెలియపరచమన్నారు.)

[19 ఆగస్టు 2001న ఆంధ్ర భూమి దినపత్రికలో వచ్చిన వ్యాసం ]




   


1 comment:

  1. ఎంత హిపోక్రసీ ఉంటే అంత లెవెల్ మేధావులు అవుతాము కాబోలు!మరి,మనమేమో ముక్కు సూటి తనానికి అలవాటు పడ్డాము - ఎట్లా పైకొస్తామండీ?

    ReplyDelete