Friday 26 October 2018

హిందూ మతానికి పెనుగండం

మొదట - వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను నోరెత్తలేదు -  నేను కమ్యూనిస్టును కాను కనుక

తరవాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు 
నేను నోరెత్తలేదు - నేను యూదును కాను కాబట్టి

తరవాత వాళ్ళు కాథలిక్కుల కోసం వచ్చారు 
నేను  నోరెత్తలేదు - నేను ప్రొటెస్టంటును కాబట్టి

ఇక అప్పుడు వాళ్ళు నా కోసం వచ్చారు
నాకోసం నోరెత్తటానికి ఎవరూ మిగలలేదు

నాజీలు చేలరేగి ఒక సమూహం తరవాత ఒక సమూహాన్ని మట్టుపెడుతున్న సమయంలో జర్మన్ మేధావుల నిర్లిప్తత గురించి మార్టిన్  నీమోలర్ (  MARTIN NIEMOLLER ) రాసిన సుప్రసిద్ధ కవిత ఇది . ఏదీ పట్టని ఇప్పటి హిందూ సమాజం ఉదాసీనతకూ చక్కగా సరిపోతుంది.

దీని గురించి చెప్పాలంటే చేటభారతమంత . వెనకటి సంగతులు వదిలేసి ఈ ఒక్క ఏటి అనుభవాలనే గమనించండి.

కలియుగ వైకుంఠమనుకునే తిరుమల దేవస్థానంలో క్రిస్టియన్లు చొరబడి పెత్తనాలు కూడా చేస్తున్నారని దశాబ్దాలుగా, శ్రీవారి సేవలూ కైంకర్యాలలో అపచారాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా లో గగ్గోలు లేస్తే ఏమైంది ?    అది టి టి డి అధికారులు , గవర్నమెంటు తేల్చాల్సిన సమస్య అయినట్టూ , దానిపై కడుపు మండిన హిందూ సంఘాలూ , చిన్న పాటి సంస్థలూ మొదలెట్టిన ఆందోళనలకు కనీసం అండగా నిలవాల్సిన బాధ్యత కూడా తమకు లేనట్టూ హిందూ సమాజంలో సో కాల్డ్ పెద్ద తలకాయలు , పేరుగొప్ప హిందూ సంస్థలు మిన్నకున్నాయి. టి.టి.డి.కి వ్యతిరేకంగా మాట్లాడితే తమ ఆలయమర్యాదలకూ , దర్శనాలకూ , కొండ మీద వైభోగాలకూ ఎక్కడ మోసం వస్తుందోనని పెద్ద పీఠాధిపతులూ , మఠాధిపతులూ నోళ్ళు మూసుకున్నారు. గుడి ఆంధ్రా లో ఉన్నది కాబట్టి అది ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తేల్చుకోవలిసిన స్థానిక  వ్యవహారమైనట్టూ , దానితో తమకేమీ సంబంధం లేనట్టూ  ఇతర రాష్ట్రాల వాళ్ళు వదిలేశారు.

ఇప్పుడు శబరిమల గోడు పైనా అదే వరస .



శబరిమల సన్నిధానంలో నిష్టకూ నియమాలకూ ఎనలేని ప్రాధాన్యం . అక్కడ ఎప్పటినుంచో వస్తున్న , భక్తులెవరికీ  ఎలాంటి అభ్యంతరం లేని ఆచారాన్ని నిష్కారణంగా తుంగలో తొక్కి ,
ఆలయ పవిత్రతను చెడగొట్టేందుకు హిందూ మత ద్వేషులైన అన్య మతస్థులూ , నాస్తికులూ , కమ్యూనిస్టులూ పెద్ద కుట్ర పన్నారు. అందులో భాగంగా - అయ్యప్ప మీద భక్తిగాని, హిందూ మతమంటే విశ్వాసం గాని లేని పనికిమాలిన వాళ్ళు పెట్టిన పేచీకి సుప్రీం కోర్టు పెద్ద బెంచి తగని విలువ ఇచ్చి తెంపరి తీర్పు చెప్పింది . ఋతుస్రావం అయ్యే వయసు లోని ఆడవాళ్ళు రాకూడదన్న గుడి కట్టుబాటును కొట్టేసి , అన్ని వయసుల మహిళలనూ అనుమతించాల్సిందేనని హుంకరించి హుకుం వేసింది. ఆడవాళ్ళు కంట పడితేనే అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యం పాడవుతుందా , ప్రకృతి ధర్మమైన ఋతుస్రావాన్ని దోషం అంటారా , మహిళలను అంటరాని వాళ్ళలా చూస్తారా - అంటూ ఆ సందర్భంలో జడ్జీలు వంకర మాటలు చాలా అన్నారు. సుప్రీం కోర్టే చెప్పాక ఇక మమ్మల్ని ఎవరు ఆపగలరు , ఇదుగో ఋతుస్రావ సమయంలోనే వచ్చి  ముట్టు బట్టలు అయ్యప్ప మొగాన పడేస్తాం , అయ్యప్ప ఎదుటే మా బాయ్ ఫ్రెండ్సు తో సెక్స్ చేస్తాం అంటూ వీర ఫెమినిస్టులు కొందరు పేట్రేగారు . ఆరు నూరైనా కోర్టు తీర్పును అమలు జరిపి తీరుతామని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తొడ గొట్టింది.

కేసు శబరిమలదైనా ఇది ఈ జాతికి ప్రాణమైన సనాతన ధర్మానికీ , దాన్ని ఆచరించే హిందూ మతానికీ , మొత్తంగా హిందూ సమాజానికీ వచ్చిన ఆపద. తమ మతాన్నీ , మతాచారాలనూ స్వేచ్చగా నిరాఘాటంగా అనుసరించేందుకు రాజ్యాంగ 25 వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాధమిక హక్కు జనాభాలో 80 శాతమైన హిందువులకు మాత్రం వర్తించదా ?! ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇంగ్లీషువాళ్ళు " డినామినేషన్ " పదానికి ఇచ్చిన కిరస్తానీ అర్థాలకు సరిపోనంత మాత్రాన శతాబ్దాలుగా నడుస్తున్న , కోట్ల మంది పాటిస్తున్న అయ్యప్ప సంప్రదాయం మతపరమైన " డినామినేషను " కాకుండా పోతుందా ? ఆ కారణం చేత  అయ్యప్ప భక్తులు " జస్ట్ హిందువులే " నని తేల్చి , 26 వ అధికరణం కింద మతసంస్థలను , మత వ్యవహారాలను ఇష్టానుసారం నడుపుకునే ప్రాప్తం వారికి లేదని సుప్రీం కోర్టు ఎలా చెప్పగలదు ? అంటే హిందువులు కాని మైనారిటీలకే   తప్ప హిందూ దేశంలో హిందువులకు మతహక్కులు ఉండవా? దేవుడి గుడిలో దేవుడి నియమాలు చెల్లవా ? పవిత్రమైన దేవాలయంలో ఆచారానికీ కట్టుబాటుకూ విలువ లేదా ? పార్కులాగా , పబ్లిక్ రోడ్డులాగా హిందూ దేవాలయం కూడా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా యధేచ్చగా వెళ్ళగలిగిన " పబ్లిక్ ప్లేసా"  ?

సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం లో మెజారిటీ జడ్జీలు చేసిన ఈ " ధర్మ " నిర్ణయాన్ని సహించి ఊరుకుంటే ఇక దేశం లో ఏ హిందూ ఆలయం లోనూ పవిత్రత అనేది మిగలదు. హిందూ ద్వేషులైన ఏ తిరుగుబోతులైనా ఎటువంటి జులాయిలైనా ఏ గుడిలోనైనా  చొరబడి ఆచారాలను చెడిపి , నియమాలను ఉల్లంఘించి  ఆగమాగం చేయగలరు. అదేమంటే సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించి , 14, 15 వగైరా నంబర్ల రాజ్యంగ హక్కులను ఏకరువు పెట్టగలరు. ఏ మతానికి చెందిన పెద్దలు , పూజ్య ఆచార్యులు  చూసుకోవలసిన మత వ్యవహారాలలోకి , మతాచారాల లోకి కోర్టుల విచ్చలవిడి జోక్యాన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే ఇక హిందూ మతానికి నానా భ్రష్టత్వాలు తప్పవు . మతంలో  ఏది అతిముఖ్య  ఆచారమో ,( essential practice) ఏది కాదో నిర్ణయించేది కోర్టులు అయితే  ఒక్కో కోర్టు తీర్పును బట్టీ, దాని మీద పై కోర్టు , మళ్ళీ దానిమీద ఆ పై కోర్టు చేసే నిర్ణయాలను బట్టి ఆచారాలు , ఆలయ నియమాలూ , మత కట్టుబాట్లు తడవకో విధంగా మారిపోతుంటాయి. ఇక ఆగమాలనూ , ధర్మశాస్త్రాలనూ గుంటబెట్టి గంట వాయించవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ముంచుకొచ్చింది కేవలం శబరిమల సన్నిధానానికీ , ఒక్క అయ్యప్ప భక్త కూటమికే కాదు . మొత్తం హిందూ సమాజం హక్కులకూ , హిందూ ధర్మం మనుగడకూ పెనుముప్పు. ధర్మం పట్ల , మతం పట్ల , మతానికి పట్టుగొమ్మ అయిన ఆలయ వ్యవస్థ మీద  విశ్వాసం , గౌరవం ఉన్న  ప్రతి హిందువూ , ప్రతి హిందూ సంస్థా ప్రమాద తీవ్రతను గుర్తించి కలిసికట్టుగా పోరాడవలసిన సందర్భమిది . మరి అలాంటి సమయాన హిందూ సమాజం ఎలా స్పందించింది ?

చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇంతకుముందు తిరుమల విషయం లో లాగే ఈ సారీ ! శబరిమల కేరళ లో ఉన్నది కాబట్టి అదేదో కేరళ వాళ్ళు కిందా మీదా పడవలసిన స్థానిక తగవు అయినట్టు మిగతా రాష్ట్రాలవారు చోద్యం చూశారు. సాధారణంగా దక్షిణాత్యులంటే ఉత్తరాది వారికి ఉండే దూరభావం ఈ ఘట్టంలోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది.

అయ్యప్ప సంప్రదాయం వ్యాప్తి ప్రధానంగా దక్షిణాదికి పరిమితం . కాబట్టి శబరిమల మూర్తి నైష్థిక బ్రహ్మచారి కావటం , 41 రోజుల కఠోర వ్రతం చేస్తేగానీ ఆయన దర్శనానికి యోగ్యత రాకపోవటం , ఒక వయసు స్త్రీలు అక్కడికి వెళ్ళకూడదనటం లోని అంతరార్థం ఉత్తరాది రాష్ట్రాల వారికి అంతుబట్టకపోతే ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ అయ్యప్ప భక్తి కొల్లలుగా పొంగిపొరలే దక్షిణ రాష్ట్రాల వారికి ఏమయింది ? కేరళకు ఆనుకునే ఉండే తమిళనాడు, కర్ణాటకలలో కూడా శబరిమల మహాపోరాటం ప్రకంపనాలు పెద్దగా లేవు. ఏటా కోట్లమంది మాలలు వేసి , మండల దీక్ష పట్టి ప్రవాహంలా శబరిమల దారిపట్టే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సామూహిక పడిపూజలలో రివాజుగా కనిపించే హడావిడిలో పదోవంతు అయినా అయ్యప్పకు జరిగిన అపచారానికి నిరసనగా కానరాలేదు.

 అంటే మన అయ్యప్ప భక్తులలో అసలు చలనమే లేదని కాదు. వేలమంది భక్తులు రెండు తెలుగు  రాష్ట్రాలలోనూ గట్టిగా స్పందించారు. తమకున్న పరిమితుల్లో , తమకు చేతనైన రీతిలో బాగానే ప్రతిఘటించారు. అయ్యప్ప గుళ్ళలో , ఇతరత్రా నిరసన సభలు , బహిరంగంగా నిరసన కార్యక్రమాలు బాగానే చేసారు. మొన్న సన్నిధానంలో గుడి రక్షణ కార్యంలోనూ మనవాళ్ళు కొంతమంది స్వయంగా పాల్గొన్నారు. సోషల్ మీడియా లో  సరే సరి . కానీ ఈ రెండు రాష్ట్రాలలోనూ అయ్యప్ప కూటములకు ఉన్న సంఘటిత బలంతో , జన సమీకరణ శక్తితో పోల్చితే ఇక్కడ  నిరసనల పరిమాణం , ప్రభావం తక్కువే.

మొత్తం మీద క్రికెట్ మాచిలను చూసినట్టు , టీవీ చానెళ్ళ లో పనికిమాలిన పంచాయితీలను తిలకించినట్టు కేరళలో లక్షలాది అయ్యప్ప భక్తులు , భక్తురాళ్ళు గుడి పవిత్రతను కాపాడటానికి ఎన్నో రోజుల పాటు జరిపిన అత్యద్భుత పోరాటాన్ని కూడా మిగతా దేశం ఎంతో ఉత్కంఠతో వీక్షించింది. వీర హిందువులమని చెప్పుకునే లక్షోపలక్షల మాటలరాయుళ్ళు ఫేస్ బుక్కులో , వాట్సప్ లో , ట్విట్టర్ లో నీడ పట్టున తెగ ఆవేశపడ్డారు. హోరాహోరీ గా ట్రోలారు. ట్రోలించుకున్నారు. పళ్ళబిగువున ప్రాణాలకు తెగించి ప్రతిఘటించి అయ్యప్ప స్వామి మహిమవల్ల ఒక్క పాతకిని కూడా గుడిలోకి అడుగు పెట్టనివ్వకుండా వేలాది భక్తులు జయప్రదంగా నిరోధించగలగటంతో యుద్ధం గెలిచినట్టు సోషల్ మీడియా శూరులు అమందానందం చెందారు . హిందూ శిబిరం దిగ్విజయం సాధించి , శబరిమల కథ సుఖాంతమయిందని బోలెడు సంతోష పడ్డారు.

నిజానికి అసలు యుద్ధం ఇప్పుడే మొదలయింది. అసలు ఉపద్రవం ఇప్పుడు తరుముకొస్తున్నది.

ఎవరెన్ని విధాల కవ్వించినా , వేధించినా హిందువులలో చలనం ఉండదని సాధారణంగా అందరూ అనుకుంటారు. కేరళ కమ్యూనిస్టు సర్కారు కూడా  మొదట అదే ధీమాతో ఉన్నది. ఎంత ధీమా అంటే అయ్యప్ప భక్తులు కోర్టు తీర్పుతొ కుతకుతలాడుతున్నారని ఎరిగి కూడా వారేమి చేయగలరు లెమ్మన్న దిలాసాతో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సకుటుంబంగా విదేశాలకు విహారయాత్ర  వెళ్లాడు. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనట్టు రామజన్మభూమి ఉద్యమం తరవాత మళ్ళీ ఆ స్థాయిలో - కొమ్ములు తిరిగిన కమ్యూనిష్టులకే దిమ్మతిరిగే రీతిలో హిందువులు లక్షల సంఖ్యలో అనేక పట్నాల్లో వీధుల్లోకి వస్తారని ఎర్ర దొరలు ఊహించలేదు. నేషనల్ మీడియా మొత్తం మహిళా హక్కుల కోసమే చొక్కాలు చించుకుంటున్నప్పుడు , ప్రత్యేకంగా ఏ పార్టీ , ఏ మత సంస్థా భక్తుల పక్షాన నిలబడనప్పుడు వెర్రి భక్తులు ఎంతమంది ఉన్నా ఏమీచేయలేరు  అని  కామ్రేడ్లు వేసిన లెక్క తప్పింది. శబరిమల వెళ్ళే కొండ దారుల పొడవునా స్థానిక భక్తులు ఆర్ ఎస్ ఎస్ , బి జె పి కార్యకర్తల తోడ్పాటుతో వ్యూహాత్మకంగా మొహరించి వాహనాలను తనిఖీ చేసి , వెళ్లకూడని మహిళలను వెనక్కి పంపేశారు. ఆలయ సన్నిధానంలో వేలాది భక్తులు కంటికి కునుకు లేకుండా కాపలా కాసి ,  పోలీసు శిరస్త్రాణాలతో పోలీసు వేషాలతో పోలీసుల రక్షణలో చొరబడి , మూటకట్టుకొచ్చిన ముట్టు బట్టను స్వామి ఎదుట విసరాలనుకున్న ఆడవాళ్ళను లోనికి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు.  దైవబలం , సంఖ్యాబలం దండిగా ఉన్న భక్తశక్తి ముందు నిలవలేక పోలీసులు  తోక ముడిచారు. తాము అతి రహస్యంగా వెంటబెట్టుకుని వచ్చిన జాణలను  తామే వెనక్కి పంపేశారు. అలా నిరంతర అప్రమత్తతతో అపచారాలను , అవాంఛనీయ ఘటనలను  గుడి తెరిచి ఉన్న ఐదు రోజులూ నిలవరించగలగటం తో " స్వామి శరణం " అని భక్తకోటి ఊపిరి పీల్చుకుంది.



కాని అక్కడితో గండం తప్పలేదు. అంతకంటే పెద్ద గండం మీద పడింది . కంగు తిన్న ఎర్ర దొరలు భంగపాటు నుంచి పాఠం నేర్చారు. భక్తుల సంఘబలాన్ని చిన్నాభిన్నం చేసి , ప్రతిఘటనను ఉక్కు పాదాలతో అణచి , గుడి కట్టు ను చెడగొట్టి తీరేందుకు భయానక వ్యూహం పన్నారు.  శాంతియుతంగా , ప్రజాస్వామ్యబద్ధంగా ఊరూరా  నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న సాధారణ పౌరుల మీద , అవాంఛనీయ మహిళల చొరబాటును అడ్డుకున్నారని అనుమానం కలిగిన వారి మీద తప్పుడు కేసులుపెట్టి పోలీసులు పిశాచాల్లా పీడిస్తున్నారు. ఒక్క రాత్రే 1400 మందిని ఇళ్ళమీద పడి  విచ్చలవిడిగా అరెస్టులు చేశారు.  బెయిలు రాని తీవ్ర అభియోగాలు బనాయించి ఇప్పటికే మూడు వేల మందిని పైగా నిర్బంధించారు. దేవుడికి జరుగుతున్న అపచారానికి పౌర నిరసన తెలపడమే నేరమైనట్టు , శబరిమలను  కాపాడాలని ఫేస్ బుక్కులో పోస్టు షేర్ చెయ్యటమే దేశద్రోహమంత మహాపరాధమైనట్టు కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపుతున్నారు. వారేదో అంతర్జాతీయ టెర్రరిష్టులయినట్టు సామాన్య గృహస్థుల , గృహిణుల ఫోటోలతో నోటీసులు జారీచేసి భయోత్పాతం సృష్టిస్తున్నారు.




 ఇది కమ్యూనిస్టు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తెచ్చిపెట్టిన అప్రకటిత ఎమర్జెన్సీ . బరితెగించింది వామపక్ష ప్రభుత్వం కాబట్టి , బాధితులు అమాయక హిందువులు కాబట్టి ఈ ఘాతుకానికి ఏ హక్కుల రాయుళ్ళూ పెదవి మెదపటం లేదు. ఐదుగురు అర్బన్ నక్సల్స్ ని అరెస్టు చేస్తేనే మహాఘోరం జరిగినట్టు యాగీ చేసిన మీడియా , మేధావి భూత గణాలకు ఒకే రాత్రి 1400 మంది పౌరులను కేరళ పోలీసులు  పగపట్టి అరెస్టు చేయటం పౌరహక్కుల ధిక్కారమన్న ఆలోచనే లేదు. శబరిమలలో మహిళాహక్కులకేదో పుట్టిమునిగినట్టు కల్లు తాగిన కోతిలా చిందులేసి , పనిగట్టుకుని ఆడ రిపోర్టరును పంపి నానా గోల చేసిన అర్నబ్ ముఖర్జీ అనే రిపబ్లిక్ చానెల్ అబద్ధాలకోరుకు  మహిళా భక్తులపై పోలీసుల వేధింపులు కంటపడనే లేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే కేసులూ , జైళ్ళ పీడాకారం తప్పదన్న హడలు పుట్టించి , సామాన్య కుటుంబీకులు ఇంకో సారి అయ్యప్ప పనుపున వీధుల్లోకి రాకుండా చేయాలన్నది కమ్యూనిస్టు ప్రభువుల పన్నాగం . ఇలాంటి దుర్మార్గపు దాడిని తట్టుకునే శక్తి మామూలు గృహస్థులకు సహజంగా ఉండదు. జనం వెనక్కి తగ్గినప్పుడు పోరాటం నీరు కారుతుంది . కామ్రేడ్లకు కావలసింది అదే .

దీనితో పాటు విజయన్ సర్కారు ఇంకో పాపిష్టి ఎత్తు వేసింది. సన్నిధానం లో భక్తులు గుమికూడి నిషిద్ధ వ్యక్తులను ఆపేందుకు ఆస్కారం ఉండకుండా ఆలయం లోకి ప్రవేశాలను క్రమబద్దం పేరుతొ తన చేతుల్లోకి తీసుకోదలచింది. ఆన్ లైన్ లో ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారినే , అదీ అనుమతించిన సమయాన మాత్రమే గుడిలో ఉండనిస్తామని కొత్త రూలు తలపెట్టింది. పోలీసులు విచారించి అనుమతి ఇస్తేతప్ప ఎవరూ అయ్యప్ప సన్నిధికి వెళ్ళలేకుండా చేస్తే ఏ రెహనా ఫాతిమా అయినా ఎన్ని నెత్తుటి నాప్కిన్ల పవిత్ర చిహ్నాలతో అయినా పోలీసు పహారాలో ప్రవేశించి  అయ్యప్ప స్వామి నిష్ఠను  అపహాస్యం చెయ్యగలదు. కోర్టు తీర్పును అమలుపరచటం లో భాగంగానే ఇదంతా - అనటం వల్ల ఏ కోర్టూ తప్పుపట్టదు . ఏ మీడియా వాడికీ కళ్ళు చెవులు పనిచేయవు. భ్రష్టమయ్యేది హిందూ ధర్మం ! హిందూమత నాశనం కోరే అన్యమతాలకు, వాటి తై నాతీలకూ, చెడబుట్టిన హిందువులకూ కావలసింది అదే.

ఇదీ ప్రమాదం. దీన్ని ఎదుర్కోవటం ఒక్క కేరళ రాష్ట్రం వల్ల , కేవలం అయ్యప్ప భక్తుల వల్ల అయ్యేపని కాదు. ఇది మొత్తంగా హైందవ ధర్మం మీద , హిందూ మత విశ్వాసాల మీద , హిందువులకు పవిత్రమైన దేవతా మూర్తులమీద ఎక్కుపెట్టిన దాడిగా పరిగణించి మొత్తం హిందూ సమాజం ఒక్కటై ఈ ఆటలు ఇక సాగవని గర్జిస్తే గాని ఆగడాలు ఆగవు. అందుకు తక్షణం నడుము కట్టవలసింది జాతీయ హిందూ  సంస్థలు  . కదలవలసింది , ప్రజలను కదిలించవలసింది హైందవ ధర్మాచార్యులు , సమస్త పీఠాదిపతులు , ఆద్యాత్మిక సద్గురువులు !  అయ్యప్ప సంప్రదాయానికి చేటు వస్తే మనకేమి పట్టిందని మిగతా సంప్రదాయాల వాళ్ళు మిన్నకుంటే మునుముందు ఏ ధార్మిక సంప్రదాయమూ మిగలదు. తస్మాత్ జాగ్రత !

ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించటం భారత ప్రభుత్వం పాత్ర, ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. జల్లికట్టు తరహాలో  ఆర్డినెన్సు జారీ చేసి , శబరిమలను 26వ అధికరణం కింద మత డినామినేషనుగా ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఉంది. అలాగే పౌర హక్కులను కాలరాచి అధికార దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని కన్నుగానని కేరళ ప్రభుత్వానికి  తొడపాశం పెట్టటం కేంద్రం చేతిలోని పని. దానికి కావలసిందల్లా కొంచెం తెగువ . మహోన్నత హిందూ మతం పట్ల కాస్త గౌరవం. హిందూ దేశం లోనే  దిక్కులేని హిందువుల పట్ల కొంచెమైనా  కనికరం .

అవన్నీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్నాయనే హిందువుల ఆశ.











Wednesday 17 October 2018

హిందువులకు మత హక్కు లేదా ?


పెక్యులరిజం - 18

ఎం.వి.ఆర్‌.శాస్త్రి

....................


'తమాషా ఏమిటంటే సమాజం ముందుగా సమర్ధించరాని ఒక రూలు తెచ్చిపెడుతుంది. తరవాత దాన్ని సమర్థించుకుందుకు వివరణలు, నిరూప ణలు ! మానవత్వాన్ని బాధపెట్టే వైఖరి సమర్ధింపు కోసం మానవాళి ప్రాచీనకాలం నుంచీ కారణాలు వెతుకుతున్నది. మానవ విలువలనేవి కాగితాల మీదే మిగిలాయి. చారిత్రకంగా స్త్రీలు అసమానతకు గురయ్యారు. అందుకే వారు హక్కుల కోసం పోరాడేది. ప్రసిద్ధ ఫెమినిస్టు సుసాన్‌ ఆంథోనీ చక్కగా చెప్పింది ఇలా :

మగాళ్లకు హక్కుల కంటే ఎక్కువ ఏమొద్దు

మహిళలకు హక్కుల కంటే తక్కువ ఏమొద్దు

ఇది స్పష్టమైన సందేశం'.

ఏమిటిది ? ఫెమినిస్టు పార్టీ మేనిఫెస్టోనా ? మహిళా ఉద్యమ విధాన పత్రమా ? స్త్రీ విమోచనపై సిద్ధాంత వ్యాసమా ?

కాదండి ! కాదు ! ఈ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఈ సెప్టెంబర్‌ 28న శబరిమల ఆలయప్రవేశం కేసులో వెలువరించిన ప్రశస్తమైన తీర్పులోని మొట్టమొదటి వాక్యాలివి !!

విచారణాంశం సామాన్యమైనది కాదు. వందకోట్ల హిందువుల సెంటిమెంటుకూ, కోట్లాది అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసానికీ, జాతీయ హిందూ సమాజానికి జీవనాడి అయిన ఆలయ వ్యవస్థ పవిత్రతకూ, మతాచారాలను పాటించడానికి దేశ జనాభాలో 80 శాతం ఉన్న మెజారిటీ కమ్యూనిటీ రాజ్యాంగ హక్కులకూ సంబంధించిన అతిముఖ్య సమస్య అది. పన్నెండేళ్లుగా రగులుతూ కోటానుకోట్ల అయ్యప్ప భక్తులకూ, భక్తురాళ్లకూ చికాకు కలిగిస్తున్న వృధా వివాదమది.

ఒక మహమ్మదీయుడు నడిపే న్యాయవాద సంఘం శబరిమలలోని హిందూ ఆలయంలో ఒక వయోవర్గపు స్త్రీలను రానివ్వకపోవటం రాజ్యాంగవిరుద్ధమంటూ పెట్టిన తనకుమాలిన కేసును మొదట ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచి విచారించింది. అసలు ఆ దశలోనే ఆ పనికిమాలిన పితూరీని సుప్రీంకోర్టు విచారణకు కూడా తీసుకోకుండా కొట్టివేసి ఉండాల్సింది.

ఎందుకంటే - శబరిమల ఆలయంలో తరతరాలుగా వస్తున్న ఆ ఆచారంలో అభ్యంతరకరమైనది, కోర్టు కలగచేసుకోవలసింది ఏమీ లేదని కేరళ హైకోర్టు ఎప్పుడో 1993లోనే తీర్పు చెప్పింది. (AIR 1993 Kerala 42). దానిని ఎవరూ సవాలు చేయలేదు. అపీలు చేయకుండా అన్ని పక్షాలూ ఆ తీర్పును అంగీకరించినప్పుడు అదే ఖరారు ! పదమూడేళ్ల తరవాత పనిలేని వాళ్లెవరో వచ్చి పేచీ పెట్టినంతమాత్రాన, బలమైన కారణాలు లేకుండా సుప్రీంకోర్టు దానిని తిరగదోడాల్సిన పనిలేదు.

కాని ముగ్గురు జడ్జిల బెంచి కొట్టివేయకపోగా ఆ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్‌ చేసింది. ఇంతోటి కేసును భేదించటానికి స్వయానా భారత ప్రధాన న్యాయమూర్తి (జస్టిస్‌ దీపక్‌మిశ్రా) పెద్దరికంలో ఐదుగురు జడ్జిల పెద్ద బెంచి కొలువుతీరింది. ఈ సెప్టెంబర్‌ 28న సదరు ధర్మాసనం ప్రకటించిన సంచలనాత్మక తీర్పు సొగసుకు పైన ఉటంకించిన తొలివాక్యాలు మచ్చుతునకలు!

అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీలను శబరిమల సన్నిధానానికి అనుమతించకపోవటం సబబేననీ, 15,25,26 అధికరణాల ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం కాదనీ 1993 తీర్పులో హైకోర్టు ప్రకటించింది. అది తప్పు అని ఇప్పుడు సుప్రీంకోర్టు పెద్ద బెంచి తేల్చింది.

ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆచరించి, మతాచారాలను పాటించుకునేందుకు రాజ్యాంగం 25వ అధికరణం... తమ మత సంస్థలను తాము కావలసినరీతిలో నడుపుకునేందుకు 26వ అధికరణం గొప్ప వరం ఇచ్చినట్టు ఇప్పటిదాకా హిందువులు తెగ మురిసిపోతున్నారు. వారి మొగాలకు అంతటి ప్రాప్తం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు చెప్పకనే చెప్పింది.

మత వ్యవహారాలను సొంతంగా మేనేజ్‌ చేసుకునేందుకు, మత సంస్థలను నడుపుకునేందుకు ప్రతి religious denomination  (మత శాఖ) కూ హక్కు ఉన్నదని 26వ అధికరణం గ్యారంటీ ఇచ్చిన మాట నిజమే. కాని ఆ గ్యారంటీ శబరిమల అయ్యప్ప గుడికి వర్తించదని తాజా తీర్పులో మెజారిటీ జడ్జిలు ప్రకటించారు.

ఎందుకు వర్తించదట ?

అయ్యప్ప గుడి 'రిలిజియస్‌ డినామినేషన్‌' కిందికి రాదట!

ఎందుకు రాదు - అన్నదానికి తాజా తీర్పులో మెజారిటీ జడ్జిలు చెప్పింది ఇది :

'డినామినేషన్‌' అన్న పదానికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అనేక అర్థాలను ఇచ్చిందట! వాటి ప్రకారం చూస్తే 'డినామినేషను'గా గుర్తింపు పొందాలంటే కొన్ని లక్షణాలు ఉండి ఉండాలట. అవి         ఏవనగా -

1. కొన్ని నమ్మకాలు, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తుల సముదాయమై ఉండటం

2. ఉమ్మడి వ్యవస్థకు చెంది ఉండటం

3. ఒక ప్రత్యేకమైన పేరుతో పిలవబడటం.

ఈ పై యోగ్యతల్లో ఏ ఒక్కటీ అయ్యప్ప భక్త సమాజానికి లేదని సుప్రీంకోర్టు వారు ఇప్పుడు తేల్చారు.

అలా ఎలా అనగలరు ? అయ్యప్ప భక్తులకు ప్రత్యేకమైన నమ్మకాలు, సూత్రాలు ఉన్నాయి కదా? అయ్యప్ప సమాజానికి పెద్ద వ్యవస్థే ఉంది కదా? మాల వేసుకున్న ప్రతి భక్తుడూ 'అయ్యప్ప' అనే ప్రత్యేకమైన పేరుతోనే పిలవబడుతున్నాడు కదా?

కావొచ్చు. కాని సుప్రీంకోర్టు ఒప్పుకోదు.

'There is no identified group called Ayyappans. Every Hindu devotee can go to the temple... There is nothing on record to show that the devotees of Ayyappa have any  common religious tenets peculiar to themselves... other than those which are common to the Hindu religion. Therefore, the devotees of Lord Ayyappa are just Hindus and do not constitute a separate religious denomination. For a religious denomination, there must be a new methodology provided for a religion. Mere observance of certain practices, even though from a long time, does not make it a district, religion on that count.
(అయ్యప్పలు అని గుర్తింపు పొందిన గ్రూపు ఏదీ లేదు... హిందూ మతానికి కామన్‌ అయినవి కాకుండా, తమకు మాత్రమే ప్రత్యేకమైన మత సిద్ధాంతాలు అయ్యప్ప భక్తులకు ఉన్నాయని చూపేందుకు ఏ రికార్డూ లేదు. కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు జస్ట్‌ హిందువులు. వేరే రిలిజియస్‌ డినామినేషను దేనికీ వారు చెందరు. రిలిజియస్‌ డినామినేషను అనేదానికి ఒక మతానికి నిర్దేశించబడిన కొత్త మెథడాలజీ ఉండి తీరాలి. ఏవో కొన్ని ఆచారాలను చాలాకాలం నుంచీ పాటిస్తున్నారన్న ఒక్క కారణం చేతనే వారిది ఆ ప్రకారంగా ప్రత్యేకమైన మతం అయిపోదు.)

సుప్రీంకోర్టు వారు ఏమన్నారో విన్నారా ? అయ్యప్పస్వామి భక్తులు జస్ట్‌ హిందువులట! ఏవో కొన్ని ఆచారాలను చాలాకాలం నుంచీ పాటిస్తున్నంతమాత్రాన మతపరంగా ప్రత్యేకమైన డినామినేషను అనిపించుకునే యోగ్యత వారికి ఉండదట.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన ఈ ఒక్కమాటతో హిందూ సమాజానికి ఇప్పటిదాకా కమ్మిన భ్రమలు తొలగాలి. తాను గొప్పగా మురిసిపోతున్న రాజ్యాంగంలో తన స్థానం ఏమిటో, విలువ ఏమిటో దానికి అర్థం కావాలి.

దేవాలయాలలాంటి మత సంస్థలను నడుపుకోవటానికీ, మతానికి సంబంధించిన ఆచారాలను స్వేచ్ఛగా పాటించడానికీ, మత వ్యవహారాలను కోరుకున్న రీతిలో జరిపించుకోవడానికీ మతపరమైన ప్రతి డినామినేషనుకూ హక్కు ఉన్నదని 26వ అధికరణంలో రాసిపెట్టారు. తమది దేశంలోకెల్లా పెద్ద మతం కాబట్టి, అందులో ఎన్నోశాఖలు, ఎన్నో సంప్రదాయాలు, మార్గాలు, పరంపరలు ఉన్నాయి కనుక 26వ అధికరణంలో చెప్పిన ప్రాథమిక హక్కులన్నీ వాటన్నిటికీ సహజంగా వర్తిస్తాయని హిందూసమాజం ఇప్పటిదాకా భావిస్తున్నది.

ఆ అభిప్రాయం శుద్ధ తప్పు. శాఖ అనండి; సంప్రదాయం అనండి; మార్గం అనండి; పరంపర అనండి. వాటికీ హిందూమతానికీ కామన్‌గా కొన్ని సిద్ధాంతాలో, విశ్వాసాలో కర్మంచాలక ఉన్నాయా? ఇక వాటికి 26వ అధికరణం కింద వేరే డినామినేషనుగా గుర్తింపు పొందే యోగ్యత ఉండదు. వ్రతాలూ, పూజా విధానాలూ, డ్రస్‌కోడు, కట్టుబాట్లు ఎంత వేరు అయినాసరే ! వాటిని అనుసరించే వారందరూ జస్ట్‌ హిందువులే - అని సుప్రీంకోర్టు తాజా తీర్పు ఉవాచ !

'అయ్యప్ప భక్తులది ప్రత్యేకమైన మతం అయిపోదు. 26వ అధికరణం కింద వారిది వేరే డినామినేషను కాదు. వారు జస్ట్‌ హిందువులే' అని సుప్రీంకోర్టు అన్నదంటే అర్థమేమిటి ? వేరే మతాలకే తప్ప హిందూమతానికీ, అందులోని అనేకానేక శాఖలకూ, సంప్రదింపులకూ 26వ అధికరణం కింద మతస్వాతంత్య్రానికి రాజ్యాంగ రక్షణ లేదనే కదా? ఆ రక్షణ కావాలనుకునే వారు హిందూమతంతో తెగతెంపులు చేసుకోవలసిందేనా? హిందూ మతానికీ తమకూ కామన్‌గా ఏదీలేదని రుజువు చేసుకుంటేగానీ మత డినామినేషనుగా గుర్తింపు రాదా ?

ఔను - అయ్యప్ప భక్తులు హిందూమతంలో భాగమే! అయితే ఏమిటట? వారికంటూ పూర్వం నుంచీ వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయి కదా? వాటికి విలువ లేదా? శబరిమల సన్నిధానంలో సాక్షాత్తూ అయ్యప్పస్వామే చేసిన శాసనాన్ని పాటించనక్కర్లేదా? అక్కడి స్వామి నైష్ఠిక బ్రహ్మచారి అయినందున 50 ఏళ్లలోపు మహిళలు దర్శించకూడదన్న పూర్వాచారాన్ని గౌరవించవద్దా?

అవసరం లేదట. ఎందుకని?

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో 'డినామినేషను' అన్నమాటకు దొరలు కొన్ని అర్థాలు ఇచ్చారు.

వాటిని పట్టుకుని సుప్రీంకోర్టు వారు అరవై ఏళ్ల కింద శిరూర్‌మఠం కేసులో రిలిజియస్‌ డినామినేషనుకు ఫలానా లక్షణాలు ఉండాలని కనిపెట్టారు.

కాబట్టి 26వ అధికరణం కింద మాదీ డినామినేషనే అని ఎవరైనా అనదలచుకుంటే సుప్రీంకోర్టు తెచ్చిపెట్టిన ఆ ఫలానా లక్షణాలు తమకూ ఉన్నాయని రుజువు చేసుకోగలగాలి.

ఆ లక్షణాలు అయ్యప్ప సమాజానికి లేవు. కాబట్టి వారిది డినామినేషను కాదు. డినామినేషను కానప్పుడు ఆచారాలు, పూర్వం నుంచి వస్తున్న కట్టుబాట్లు అంటే కుదరదు. డినామినేషను కిందికి రానప్పుడు శబరిమల ఆలయం మామూలు పబ్లిక్‌ టెంపుల్‌ మాత్రమే అవుతుంది.

పబ్లిక్‌ టెంపుల్‌లోకి వెళ్లే హక్కు అందరికీ ఉంది. 'అందరికీ' అని 25వ అధికరణం చెప్పిందీ అంటే - ఆడామగా అన్న తేడా లేదని అర్థం. హిందువు అయితే చాలు - ఏ స్త్రీ అయినా పురుషుడు అయినా గుడిలోకి వెళ్లవచ్చు. మహిళలను రానివ్వము అంటే 25వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు భంగకరం. 15వ అధికరణం కింద అది మహిళల పట్ల వివక్ష.

ఇదిగో ఇదీ రాజ్యాంగ ధర్మాసనంలోని 5గురిలో నలుగురు జడ్జిల లాజిక్‌!

ఏడ్చినట్టుంది. అసలు 'డినామినేషను' అన్నమాటే క్రైస్తవ మతపరంగా పుట్టుకొచ్చినట్టిది. కాథలిక్‌, ప్రొటెస్టంటు, ఈస్టర్న్‌ ఆర్థోడాక్స్‌ చర్చి, ఓరియంటల్‌ ఆర్ధొడాక్స్‌ అంటూ క్రైస్తవంలో ఉన్నటువంటి డినామినేషన్లు హైందవంలో లేవు. ఇతర మతాలు కళ్లు తెరవటానికి వేల సంవత్సరాల పూర్వం నుంచీ ఉన్న సనాతన ధర్మంలోని శాఖలను, ఉపశాఖలను, సంప్రదాయాలను ఈ దేశ పరిస్థితులను బట్టి కదా వింగడించవలసింది? పాశ్చాత్యపు తూనికలతో మన ప్రాచీన మత వ్యవస్థలను తూచటమేమిటి? వేర్వేరు సంప్రదాయాలు, మార్గాలు ఎన్ని ఉన్నా అవేవీ లెక్కలోకి రావా? అన్నీ హిందూమతం పులుసులోనే పడతాయా? డినామినేషను కాని పాపానికి హిందూమతానికి, అందులోని శాఖోపశాఖలకు మతహక్కుల ఉండవా? మతాచారాలను, కట్టుబాట్లను నిష్ఠగా పాటించే ప్రాప్తం వాటికి లేదు - అనేకదా సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు అంతరార్థం! అది ఎంత అన్యాయం?!

"Having stated that the devotees of Lord Ayyappa do not constitute a religious denomination... (they) are the followers of Hindu religion. Now what remains to be seen is whether the exclusion of women of the age group of 10 to 50 years is an essential practice under the Hindu religion... the exclusionary practice being followed at the Sabarimala Temple can not be designated as one, the non-observance of which will change or alter the nature of Hindu religion... It is neither an essential nor an intagral part of the Hindu religion without which the Hindu religion will not survive".

'అయ్యప్పస్వామి భక్తులది మతపరమైన డినామినేషను కాదు; వారు హిందూ మతానికి చెందినవారు - అని చెప్పాక ఇక చూడాల్సిందల్లా ఒకటే! 10 నుంచి 50 లోపు వయోవర్గం మహిళలను బయట ఉంచటం హిందూ మతం ప్రకారం అత్యవసరమైన ఆచారమా - అని! శబరిమలలో అనుసరిస్తున్నటువంటి పద్ధతిని పాటించటం మానేస్తే హిందూమతం స్వభావమే మారిపోతుందని ఎవరూ చెప్పలేరు. అది హిందూమతంలో అత్యవసరమైన, సమగ్రభాగం కాదు. అది లేనంతమాత్రాన హిందూమతం బతకకుండానూ పోదు'.

ఇది పెద్ద బెంచివారి మెజారిటీ నిర్ణయం.

చూశారా - ఎక్కడి నుంచి ఎక్కడికి లాగారో?!

అయ్యప్ప భక్త సమాజాన్ని, దానికి ప్రాణమైన శబరిమల సన్నిధానాన్ని, అక్కడ తప్పనిసరి అయిన ఆచారాన్ని ధర్మాసనంలోని ఏకైక మహిళాజడ్జి ఇందూ మల్హోత్రా వలె సానుభూతితో, మతధర్మాల పట్ల కాస్త గౌరవంతో పరిశీలించి ఉంటే ఆమెలాగే మిగతా జడ్జిలు కూడా 'it is an essential religious practice at the Sabarimala Temple' (శబరిమల గుళ్లో అది అత్యవసరమైన మతాచారం) అని అంగీకరించవలసి వచ్చేది. కాని సుసాన్‌ ఆంథోనీ లెవెల్లో మహిళా హక్కులను, స్త్రీ వాదాన్ని నిలబెట్టి తీరాలని ముందే కంకణం కట్టుకున్న న్యాయమూర్తులకు సహజంగానే అది ఇష్టం లేకపోయింది. అందుకని వారు అయ్యప్ప సమాజం లాగా చూడకుండా దాన్ని తీసుకుపోయి హిందూమతానికి ముడిపెట్టారు.

గుళ్లోకి ఒక వయసు ఆడవాళ్లని రానివ్వకపోవటం హిందూమత ఆచారమేమీ కాదు కదా ? అలాంటి ఆచారం లేకపోయినా హిందూమతం బతుకుతుంది కదా? కాబట్టి శబరిమలలో ఆ ఒక్క గుళ్లోకి ప్రత్యేక కారణాల వల్ల ఒక వయోవర్గపు మహిళలను రానివ్వకపోవటం కూడా తప్పనిసరి మతాచారం - అని మెజారిటీ జడ్జిల భలే వాదన!



Wednesday 10 October 2018

అయ్యప్పకు అపచారం

పెక్యులరిజం - 17

ఎం.వి.ఆర్‌.శాస్త్రి

......................




వినేవాళ్లు ఉండాలేగాని - చాడీలు చెప్పే సోంబేరులకు ఏమి కొదవ?

నౌషాద్‌ అహ్మద్‌ఖాన్‌ అని ఒక హక్కులరాయుడు ఉన్నాడు. ఆయన పుట్టింది మహమ్మదీయ మతంలో. ఆ మతంలో మసీదులో నమాజును మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఏ వయసు ఆడవాళ్లనూ వారితో కలవనివ్వరు. స్త్రీలను అనుమతించే కొన్ని మసీదుల్లో కూడా వారికంటూ ప్రత్యేక స్థలం కేటాయిస్తారు.  మగవారితో సమానంగా కూర్చోనివ్వరు.

అందులో మహిళల పట్ల వివక్ష ఏదీ నౌషాద్‌ సాహెబ్‌కి కనపడలేదు. ఎప్పటి నుంచో వస్తున్న ఆ మతాచారంవల్ల ఆడవారి హక్కులకు పుట్టి మునిగినట్టు అతడు ఏనాడూ కంగారుపడలేదు.

కాని- తనది కాని హిందూమతంలో తనకు ఎంత మాత్రమూ సంబంధం లేని ఒకానొక అయ్యప్ప గుళ్లో కొన్ని వయసుల ఆడవాళ్లని రానివ్వటం లేదు అని తెలిసీ తెలియగానే ఆ మనిషి తెగ తల్లడిల్లిపోయాడు. హిందూ మహిళలకు జరుగుతున్న ఆ దారుణ దురన్యాయాన్ని అరికట్టి, వారికి గల రాజ్యాంగ హక్కులను రక్షించి తీరాలని కంకణం కట్టుకున్నాడు. కట్టినదే తడవుగా తన చేతిలో ఉన్న ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ అనే దుకాణం చేత పన్నెండేళ్ల కింద సుప్రీంకోర్టులో పిల్లు (పబ్లిక్‌ ఇంటరెస్టు లిటిగేషను) వేయించాడు.

ఆ వార్త తెలియగానే పనికిమాలిన ముగ్గురు జర్నలిస్టులు (అందులో ఒకరు స్త్రీలింగం- పేరు బర్ఖాదత్‌) హిందూ మతంమీద బురద చల్లేందుకు సందు దొరికింది అంతే చాలునని ఆనందపడుతూ మూడు పత్రికల్లో ఎవరిదారిన వారు వ్యాసాలు రాశారు. వాటిని ఇంకొందరు పనికి మాలినవాళ్లు చదివి, ఔరా ఇంత అన్యాయమా అని ఆవేశపడి అర్జంటుగా అటు నుంచి అటే పోయి సుప్రీంకోర్టు వ్యాజ్యంలో ఇంటర్వీనర్లుగా తలదూర్చారు.



ఈ కొత్తవాళ్లకి శబరిమల ఎక్కడుందో తెలియదు. వాళ్లది పంజాబ్‌ రాష్ట్రం. మహిళల సమాన హక్కులు అంటూ కిందామీదా పడుతూండే వీరు ఆలయాలు వాటి ఆచారాల సంగతి బొత్తిగా ఎరుగరు. కేరళలోని శబరిమల గుళ్లో 10 నుంచి 50 ఏళ్ల లోపు ఆడవాళ్లని రానివ్వటం లేదన్న సంగతి 2006 జులైలో ఆ పత్రికల్లో చదివేంతవరకూ తమకు తెలియదని సుప్రీంకోర్టు విచారణలో చెప్పారు కూడా.

ఇలా- తమకు ఏమీ తెలియని, తమకు ఎంత మాత్రం సంబంధంలేని విషయంలో ఎవరో పనిలేనివాళ్లు అర్థంపర్థంలేని దావాను వేస్తే అన్నీ తెలిసిన సర్వోన్నత న్యాయపీఠం వారి మాటలకు విలువిచ్చి అనాదిగా వస్తున్న ఒక ఆలయ ఆచారాన్ని తుంగలో తొక్కించబూనింది.

స్వతంత్రమనబడేది వచ్చాక హిందూ సమాజానికి న్యాయవ్యవస్థ చేసిన అతి పెద్ద అన్యాయమిది. ఎవరి మతాన్నివారు, ఎవరి మత విశ్వాసాలను వారు స్వేచ్ఛగా ఆచరించటానికి రాజ్యాంగం 25వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కోట్లాది అయ్యప్ప భక్తులకు అకారణంగా నిరాకరించిన రాజ్యాంగ ఉపద్రవమిది.

మత హక్కులకు సంబంధించిన వివాదాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకున్న ఉదంతాలు మన దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. మత స్వాతంత్య్రం ఇమిడిన ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇంతకు ముందు సుప్రీం కోర్టే ప్రశస్తమైన తీర్పులు ఎన్నో ఇచ్చింది. అయితే - ఫలానా మతానికి, లేక ఫలానా మత శాఖ (డినామినేషను) కు చెందిన వ్యక్తులు తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు ప్రభుత్వం వల్లో మరొకరివల్లో భంగం వాటిల్లుతున్నదని మొరపెట్టుకున్న సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానం ఇప్పటిదాకా కలగజేసుకుంటూ వచ్చింది. ఉదాహరణకు - సుప్రసిద్ధమైన శిరూర్‌ కేసులో సర్కారీ ఎండోమెంట్సు బోర్డు 25, 26 అధికరణాల కింద తనకున్న ప్రాథమిక హక్కులను భగ్నపరచిందని శిరూర్‌ మఠాధిపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చరిత్రాత్మకమైన చిదంబరం కేసులో తమిళనాడు ప్రభుత్వం బారినుంచి తమ మత హక్కులను రక్షించమంటూ నటరాజాలయ దీక్షితార్లు సుప్రీంకోర్టు శరణువేడారు.

అలాగే - శబరిమల ఆలయంలో తమని అనుమతించకపోవడంవల్ల తమ మత స్వాతంత్య్రానికి భంగం వాటిల్లిందని, నిజమైన అయ్యప్పభక్తురాళ్లు ఎవరైనా మనస్తాపం చెందితే, తమకు న్యాయం చేయవలసిందంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరటం ఎంత మాత్రం తప్పుకాదు. వారి వేడుకోలును కోర్టు ఆలకించటాన్నీ ఎవరూ ఆక్షేపించజాలరు. కాని ఇప్పటి కేసు ఆ రకమైనది కాదు, తీరి కూర్చుని సుప్రీంకోర్టుకు పితూరీ చేసిన శాల్తీలకు అయ్యప్ప పట్ల భక్తీ లేదు, విశ్వాసమూ లేదు. అవి ఉన్నాయని వారెవరూ చెప్పుకోలేదు.

నిజంగా అయ్యప్ప మీద భక్తి , విశ్వాసం ఉన్న మహిళల్లో ఏ ఒక్కరికీ ఆలయ ఆచారం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు. దానివల్ల తమ వ్యక్తిగత హక్కులు కొల్లబోయాయనిగాని, తాము అనుచిత వివక్షకు గురి అవుతున్నామనిగాని వారిలో ఏ ఒక్కరూ అనుకోవడంలేదు.

ఎందుకంటే - అది వివక్ష కానే కాదని వారికి తెలుసు.

కేవలం మహిళలన్న కారణంచేత మహిళలెవరినీ గుళ్లలోకి రానివ్వకపోతేనే అది మహిళల పట్ల వివక్ష అవుతుంది. అలాంటిదేదీ అయ్యప్ప సంప్రదాయంలో లేదు. దేశమంతటా వేల సంఖ్యలో ఉన్న అయ్యప్ప గుళ్లకు ఏ వయసు స్త్రీలైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. ఆంక్ష ఉన్నదల్లా ఒకే ఒక శబరిమల సన్నిధానంలో- అక్కడైనా నిషేధం స్త్రీలందరి మీద లేదు. 10 నుంచి 50 లోపు వయసున్నవారికి మాత్రమే.

అది కూడా అడ్డగోలు నిబంధనేమీ కాదు. దానికీ సబబైన కారణం ఉంది. ఆ కారణానికి హేతుబద్ధతా ఉంది. శబరిమల సన్నిధానం ఎవరు పడితేవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా సరదాగా వెళ్లగలిగిన పిక్నిక్‌ కేంద్రం కాదు. అది పరశురామ క్షేత్రం. అక్కడ ప్రతిష్ఠించబడిన అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రహ్మచారి. ఈడేరిన స్త్రీలను చూడనే కూడదని ఆయన నియమం. దైవసన్నిధిలో దైవాజ్ఞే శిలాశాసనం. దానిని ప్రశ్నించే తాహతు భూమిమీద ఏ శక్తికీ లేదు- అత్యున్నతమైన లౌకిక న్యాయపీఠాలతో సహా!

విచిత్రమేమిటంటే - శబరిమల సన్నిధానంలోకి ఫలానా వయసుల ఆడవారిని అనుమతించక పోవటం స్త్రీల పట్ల వివక్ష; స్త్రీలకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు అంటూ తమ ముందుకు వచ్చిన ప్రజాహిత (లేక ప్రజ+ అహిత ?!) వ్యాజ్యాన్ని విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులున్నారు. వారందరూ ఆలకించినది ఒకే  ప్రార్థనను. అందరూ పరిశీలించింది అవే డాక్యుమెంట్లను. అందరూ విన్నవి అవే సాక్ష్యాలను. అవే వాదనలను. అందరిముందూ ఉన్నవి అవే పరిశీలనాంశాలు. అందరికీ ఒకే రాజ్యాంగం ప్రమాణం.




అయినా - నలుగురు న్యాయమూర్తులకు సత్యం ఒకలా కనపడితే ఒక న్యాయమూర్తికి వేరొకలా పొడగట్టింది. అంతేకాదు- విచారణాంశం మహిళా వివక్షకు, స్త్రీల హక్కులకు సంబంధించినది. దానిని విచారించిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మహిళ. పైగా ఆమె స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించే రకం కాదు. తమ ముందుకు వచ్చిన అభియోగంలో ఏ మాత్రం పస ఉన్నా మిగతావారికంటే గట్టిగా మహిళా జడ్జే స్త్రీలకు అనుకూలంగా తీర్పు చెబుతారు. కాని- ఈ కేసులో బెంచిమీది నలుగురు మగ జడ్జిలు స్త్రీల పట్ల తగని వివక్ష, సహించరాని అస్పృశ్యత అంటూ ఆలయ ఆచారాన్ని తుంగలో తొక్కాలన్నారు. ఏకైక మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా మాత్రం ఇందులో వివక్ష లేదు, అస్పృశ్యత లేదు, స్త్రీ హక్కులకు ముప్పు ఎంత మాత్రం లేదు- అని నిష్కర్షగా ప్రకటించారు.

సాధారణంగా మైనారిటీ తీర్పును ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని - శబరిమల తాజా కేసుకు సంబంధించి అందరినీ ఆకట్టుకున్నది, భక్త ప్రజానీకం నెత్తిన పెట్టుకుని కొనియాడుతున్నదీ జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఇచ్చిన అక్షర లక్షలు విలువచేసే చరిత్రాత్మక తీర్పును.

మెజారిటీ తీర్పు వెలువరించిన జడ్జిలు సామాన్యులు కారు. ఒకరు సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి. మిగతా ముగ్గురూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి, న్యాయరంగంలో తల పండిన గండర గండలు. వారితో పోల్చితే ఇందూ మల్హోత్రా అనుభవం ఎందుకూ కొరగాదు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితమై కొద్ది నెలలే అయింది. అంతటి హేమాహేమీల ఉమ్మడి అభిప్రాయం ముందు సత్రకాయలాంటి జూనియర్‌ మోస్టు జడ్జి వెలిబుచ్చిన అసమ్మతికి విలువేమిటి అని తక్కువ చేయటం తప్పు. బెంచిలోని మిగతా జడ్జిల తీర్పుల కంటే జస్టిస్‌ ఇందూ మల్హోత్రా తీర్పు నిడివి తక్కువే. అయితేనేమి? మిగతా పెద్దలందరి వైఖరిలోని బోలుతనాన్ని ఆమె ఏ ఒక్క పాయింటునూ వదలకుండా, తిరుగులేని కేస్‌లా ఉటంకింపులతో ఎంతో చక్కగా బయటవేశారు. మచ్చుకు కొన్ని భాగాలు చూడండి:

  The right to move the Supreme Court under Article 32 for violation of fundamental rights, must be based on a pleading that the petitioners  personal rights to worship in this temple have been violated. The petitioners do not claim to be devotees of the Sabarimala Temple.

(ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ 32వ అధికరణం కింద సుప్రీంకోర్టు ముందుకు వచ్చేటప్పుడు ఈ దేవాలయంలో పూజించేందుకు తమకున్న వ్యక్తిగత హక్కులు భగ్నమైనట్టు చూపించగలగాలి. శబరిమల ఆలయానికి తాము భక్తులమని పిటీషనర్లే క్లెయిము చేయడం లేదు.)

Permitting PILs in religious matters would open the floodgates to interlopers to question religious beliefs and practices, even if petitioner is not a believer of a particular religion, or a worshipper of a particular shrine.

(మత వ్యవహారాల్లో ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించడం వల్ల సంబంధిత మతంలోగాని, సంబంధిత పూజామందిరం మీదగాని ఎలాంటి విశ్వాసంలేని కజ్జాకొర్లకు ఆయా మత విశ్వాసాలను, విధానాలను సవాలు చేసేందుకు ఫ్లడ్‌ గేట్లను తెరిచినట్లు అవుతుంది.)

మరి భారత రాజ్యాంగం (14వ అధికరణం) పౌరులందరికీ సమానత్వ హక్కును ఇచ్చింది కదా? ఒక వర్గం మహిళలను శబరిమల గుడిలోనికి అనుమతించకపోవటం ఆ ప్రాథమిక హక్కుకు భంగకరం కాదా?

ఔను. కచ్చితంగా భంగకరమే అని మెజారిటీ తీర్పు బల్లగుద్ది చెప్పింది. జస్టిస్‌ ఇందు మల్హోత్రా అది ఎంత మాత్రం భంగకరం కాదని సహేతుకంగా వివరించారు ఇలా :

''14వ అధికరణం సమానత్వ హక్కును ఇచ్చినట్టే 25, 26 అధికరణాలు మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కును ఇచ్చాయి. అది కూడా ప్రాథమిక హక్కు కిందికే వస్తుంది. మత విషయాలు, మతాచరణకు సంబంధించినంతవరకూ 14వ అధికరణం కింద సమానత్వ హక్కు ఆ ఫలానా మతానికి, విశ్వాసానికి మతశాఖకు చెందినవారికి మాత్రమే ఉంటుంది. తాము అయ్యప్పస్వామి భక్తులమనిగాని, శబరిమల ఆలయంలో పాటిస్తున్న పద్ధతులవల్ల తమకు అన్యాయం జరిగిందనిగాని పిటిషనర్లు చెప్పడం లేదు. అక్కడ అనుసరిస్తున్న పద్ధతి మహిళల పట్ల వివక్ష అని పిటిషనర్లు వాదిస్తున్నారు. కాదు; మా మతవిశ్వాసాల ప్రకారం మేము నడుస్తున్నామని ప్రతివాదులు అంటున్నారు. ఆ ఆలయానికి సంబంధించినంత వరకూ అది తప్పనిసరి అయిన మతాచారం (essential religious practice) అని వారి వాదన. మతాచరణ స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కే. కాబట్టి మత వ్యవహారాల్లో 14వ అధికరణపు సమానత్వ సూత్రాన్ని బయటివారి నిమిత్తం చొప్పించాలని చూస్తే ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా మత విశ్వాసాల, మతవిధానాల మంచి చెడ్డల హేతువులను న్యాయస్థానం సమీక్షించవలసి వస్తుంది.

“It is not for the courts to determine which of these practices of a faith are to be struck down, except if they are pernicious, oppressive, or a social evil like sati... the issue of what constitutes as essential religious  practice is for the religious community to decide.’’

(సతీసహగమనం వంటి నికృష్టమైన సామాజిక దురాచారాలను మినహాయిస్తే ఒక మతానికి చెందిన ఆచారాలలో వేటిని కొట్టివేయాలన్నది నిర్ణయించటం కోర్టుల పని కాదు.... ఏది అతి ముఖ్యమైన మతాచారం అన్నది ఆ మతంవారే నిర్ణయించుకోవాలి.)

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీలను రానివ్వకపోవటం దురాచారం కాదా? పైన పేర్కొన్న మినహాయింపు దానికి వర్తించదా? ఈ సందేహానికి జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఇచ్చిన జవాబు ఇది :

''ఒక్క శబరిమలలో తప్ప అయ్యప్పస్వామి దేవాలయాలు వేటిలోనూ మహిళల ప్రవేశానికి పరిమితి లేదు. అన్ని వయసుల మహిళలందరూ ఆ గుళ్లకు వెళ్లి స్వేచ్ఛగా అర్చించవచ్చు. కాబట్టి లింగపరమైన సమానత్వానికి ఢోకా లేదు.

''కేవలం లింగ ప్రాతిపదికన వివక్ష చూపటం 15వ అధికరణం కింద నేరం. శబరిమలలో మొత్తంగా స్త్రీల ప్రవేశం మీద నిషేధం లేదు. అక్కడ ప్రవేశాన్ని రిస్ట్రిక్ట్‌ చేసింది కేవలం ఒక వయోవర్గానికి చెందిన మహిళల మీదనే. అదికూడా వివక్ష చూపాలని కాదు. అక్కడ దేవుడు 'నైష్ఠిక బ్రహ్మచారి'గా ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసం వల్లనే అలాంటి పరిమితి పెట్టారు. అది కూడా రాజ్యాంగానికంటే ముందు నుంచే అమలులో ఉంది. 'భూతనాథ గీత' అనే స్థల పురాణంలో అనేక శతాబ్దాల కిందటే ఆ నిషేధం విధించబడింది.

''వయసు మళ్లిన స్త్రీలు, చిన్న అమ్మాయిలు ఈ గుడికి వెళ్లవచ్చు. కాని రజస్వల అయ్యాక ఒక వయసు వచ్చేంతవరకు మహిళల మీద నిషేధం ఉంది.'' అని  1893,1901 సంవత్సరాల్లో ప్రచురించిన ''Memoir of the Travancore and cochin states'' సర్వే రిపోర్టులో Lieuntenants ward and conner శబరిమల ఆలయ విషయంలో పేర్కొన్నారు.

''ఆచారం, వాడుక కూడా శాసనం కిందే పరిగణింపబడుతాయని  రాజ్యాంగ 13(3)(ఎ) అధికరణం నిర్దేశిస్తున్నది. చెల్లుబాటయ్యే ఆచారానికి లక్షణమేమిటంటే అది పూర్వం నుంచీ చిరకాలంగా పాటింపబడాలి. సమంజసమైనదిగా ఉండాలి. అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉండాలి. పైన ప్రస్తావించిన ఆచారాలు, వాడుకలు శబరిమలలో అనేక శతాబ్దాలుగా అమలవుతున్నాయనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. దేవతామూర్తి 'నైష్ఠిక బ్రహ్మచారి' అన్న కారణంతో అక్కడ అనుమతించని ఒక వయోవర్గంవారు మినహా మిగతా, మహిళల మీద శబరిమలలో కూడా నిషేధం లేదు. దేవతామూర్తి పవిత్రతను, దేవతాతత్వాన్ని పరిరక్షించే ఉద్దేశంలో మాత్రమే ఆ పరిమితి ఆంక్షను విధించారు. దానిమీద అయ్యప్పను కొలిచే భక్తురాళ్లలో ఎవరికీ అభ్యంతరం ఉన్న దాఖలాలు లేవు. "

(ఇంకా ఉంది)

Saturday 6 October 2018

అయ్యప్పకు అపచారం

అయ్యప్పకు అపచారం -1
ఎం.వి.ఆర్. శాస్త్రి
.............

యతో ధర్మస్తతో జయః

ధర్మం ఎక్కడుంటే అక్కడ జయం - అనేమో మన సుప్రీం కోర్టు అధికార చిహ్నం ఘనం గా చెబుతుంది.



ధర్మం ఎక్కడుంటే అక్కడ మాత్రమే జయం లేకుండానేమో అదే సుప్రీం కోర్టు ఈ మధ్య వరసబెట్టి తీర్పులిస్తున్నది.

స్వలింగ సంపర్కం తప్పు కాదట.
అక్రమ సంబంధం నేరం కాదట.
అయ్యప్ప గుళ్ళో ఫలానా ఈడు ఆడవాళ్ళని రావద్దనటం మాత్రం తప్పున్నర తప్పుట ! మహా నేరం కూడానట !!

అనాదిగా ఈ దేశానికి ప్రాణం అయిన సనాతన ధర్మం మాట దేవుడెరుగు. సుప్రీం కోర్టుకూ ,సో కాల్డ్ సెక్యులర్ వ్యవస్థకూ పరమ ప్రామాణికం అనబడే రాజ్యాంగ ధర్మం ప్రకారమే చూసినా ఆ ఒక ఆలయంలో అలాంటి ఆచారం తప్పా ? అది మహిళల పట్ల వివక్ష అవుతుందా ?

ఎంత మాత్రం కాదు. దానికి రుజువుల కోసం వేరెక్కడికో పోనక్కరలేదు. అదే రాజ్యాంగ ధర్మాసనం లోని ఒకే ఒక మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా విడిగా ఇచ్చిన తీర్పును ఒక మారు తిరగేస్తే చాలు.

అసలు విషయం మహిళల పట్ల వివక్షే అయితే ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తే అందరికంటే ముందు దానిని తెగనాడేది. మంచి తీర్పు ఇచ్చారని మహిళా సమాజం యావత్తూ సుప్రీం కోర్టును మెచ్చుకునేది.

జరిగిందేమిటి ? ఐదుగురు జడ్జీల బెంచిలో నలుగురు మగానుభావులేమో అయ్యప్ప గుళ్ళో ఆ ఆచారం మహిళల పట్ల అపచారం ; సహించరాని వివక్ష ; రాజ్యాంగ విరుద్ధం అని నిర్ధారించారు. మహిళా హక్కుల విషయంలో ఎప్పుడూ ముందుండే మహిళా జడ్జి ఏమో అందులో అపచారం లేదు ; వివక్ష లేదు ; రాజ్యాంగ విరుద్ధమూ కాదు అని విడమర్చి వివరించారు . అంతే కాదు . దేశంలోని మహిళా సమాజం కూడా ఆమెనే సమర్ధించి , మెజారిటీ తీర్పునే తూర్పార పడుతున్నది. అదీ - ఇటీవలి కాలంలో కనీ వినీ ఎరుగని విధంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ! అనేక రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఊళ్లలో బాహాటంగా నిరసన ప్రదర్శనలు జరిపి !



అన్నిటికంటే విశేషం ! తరతరాలుగా కమ్యూనిస్టుల , ధర్మ విరోధుల ముదనష్టపు పాలనలో అతలా కుతలం అయిన కేరళ హిందువుల లోనే శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పు అపూర్వ చైతన్యం తెచ్చింది. అయ్యప్ప స్వామి జన్మస్థలమైన పందళం ఊరు మీద ఊరు పడ్డట్టు మహిళా ప్రదర్శకులతో కిక్కిరిసిపోయింది.

సాధారణం గా తోలు మందం అయిన హిందూ సమాజంలో గొప్ప కదలిక తెచ్చి ధర్మాన్ని చుట్టుముట్టిన ముప్పును అందరూ గుర్తించేట్టు చేసినందుకు సుప్రీం కోర్టువారికి మనం రుణపడి ఉండాలి.

Friday 5 October 2018

విద్యారంగంలో మహా వివక్ష


పెక్యులరిజం - 16

 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...................




సెక్యులర్‌ స్కూల్లో సరస్వతీ ప్రార్థన నిషిద్ధం.

'వందేమాతర' మూ నిర్బంధం కాదు.

ఆఖరికి 'జనగణమన'ను పాడము పొమ్మని మైనారిటీల పిల్లలు మొరాయించినా చేయగలిగింది లేదు. అది ఎంత జాతీయ గీతమైనా - మైనారిటీల మతస్వేచ్ఛ ముందు బలాదూరు. దాన్ని పాడేందుకు మత కారణంతో నిరాకరించే హక్కు మైనారిటీలకు న్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చాటింది.

అదే - మిషనరీ స్కూల్లోనో ?హిందువుల పిల్లలకు క్రిస్టియన్స్‌ ప్రేయర్లు కంపల్సరీ! 'మా దేవుళ్లు మాకుండగా మీ ఏసయ్యను, మీ మేరమ్మనూ మేమెందుకు ప్రార్థించాలని అడిగే హక్కు హిందువులకు లేదు. వారి మత హక్కుకు దిక్కులేదు. ప్రేయరు మాట దేవుడెరుగు. సంప్రదాయం ప్రకారం మొఖాన బొట్టు, చేతికి గాజులు, గోరింటాకు అలం కరించుకునేందుకూ కిరస్తానీ స్కూళ్లు సాధారణంగా ఒప్పుకోవు. హైందవ మతాన్ని, దేవీదేవతలను పాఠాల నెపంతో పొద్దస్తమానం పంతుళ్లు ఎన్ని దుర్భాషలాడినా, విద్యాబోధన పేరిట తెగబడి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నా హిందువులు కిక్కురుమనక భరించాల్సిందే. వాటి వల్ల తమ మత స్వాతంత్య్రానికి హాని కలుగుతున్నదని మొత్తుకున్నా ప్రభుత్వాలు ఆలకించవు. కోర్టులూ పట్టించుకోవు.

ఎందుకంటే మైనారిటీ విద్యా సంస్థల్లో మైనారిటీ లది ఇష్టారాజ్యం. సెక్యులర్‌ పప్పులు అక్కడ ఉడకవు. హిందువులు నడిపే స్కూళ్లలో ఏమి నేర్పాలి, ఎలా నేర్పాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు - అంటూ అడ్డమైన రూల్సుతో సవాలక్ష ఆంక్షలు పెట్టే ప్రభుత్వాల పవరు మైనారిటీల దగ్గర పనిచేయదు. ఎంచేతంటే మైనారిటీలకు ప్రత్యేక హక్కులను, ప్రత్యేక ప్రతిపత్తిని భారత రాజ్యాంగమే ఇచ్చింది - 30వ అధికరణంలో!

మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో 25 నుంచి 30 వరకు ఉన్న ఆరు అధికరణాల్లో అన్నిటికంటే అభ్యంతరకరమైనదీ, హిందూ సమాజానికి తీరని హాని చేసిన వాటిలో మొట్టమొదట పేర్కొనవలసిందీ 30వ నెంబరు అధికరణం. మిగతా అధికరణాల వల్ల చెరుపు విపరీతార్థాలు, వక్రభాష్యాల మూలంగా జరిగింది. 30వ అధికరణం మాత్రం మైనారిటీల పట్ల బాహాటంగా పక్షపాతం చూపి మెజారిటీ ప్రజలను దారుణ వివక్షకు గురిచేసింది. 'సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు' అని పేరైతే పెట్టి, ఆ హక్కులను మెజారిటీకి ఎగ్గొట్టిన 30వ అధికరణంలో ఉన్నదిది :

Article 30. Rights of minorities to establish and administer educational institutions.1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice.2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution on the ground that it is under the management of a minority, whether based on religion or language.

30వ అధికరణం. విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకోవటానికి మైనారిటీల హక్కు.

1. మతం లేక భాష పరంగా మైనారిటీలందరికీ తమకు ఇష్టమైన విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకునే హక్కు ఉండును.

2. విద్యా సంస్థలకు సహాయం మంజూరులో ప్రభుత్వం ఏ విద్యాసంస్థకిన్నీ అది మత లేక భాష పరమైన మైనారిటీ యాజమాన్యంలో ఉన్నదన్న కారణంతో వివక్ష చూపరాదు.



మెజారిటీనా, మైనారిటీనా అన్న తేడా లేకుండా ఏమతమైనా, ఏ భాష అయినా క్షేమంగా ఉండి అభివృద్ధి చెందాలంటే విద్య ఒక అతిముఖ్య సాధనం. మతపరమైన, భాషాపరమైన విజ్ఞానాన్ని, వారసత్వాన్ని పదిలపరచుకోవటానికి విద్యాసంస్థలు మైనారిటీలకు ఎంత అవసరమో మెజారిటీకీ అంతే అవసరం. సాంస్కృతిక హక్కులూ, విద్యాహక్కుల విషయంలో సంఖ్యాబలంతో నిమిత్తం లేదు. దేశంలో అన్ని వర్గాల పౌరులకూ సమానంగా వర్తించవలసిన ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 'సాంస్కృతిక, విద్యాహక్కులు' అన్న గ్రూపు కింద ఈ అధికరణాన్ని పొందుపరచారు అంటే దీన్ని కేవలం మైనారిటీలకే పరిమితం చేయాలన్న ఉద్దేశం రాజ్యాంగకర్తలకు ఉండే ఆస్కారం లేదు. ఈ హక్కు మైనారిటీలకు కూడా ఉంటుందని నొక్కి చెప్పటమే వారి ఆశయమని భావించవచ్చు.  ప్రభుత్వ సహాయం మంజూరులో మైనారిటీ విద్యాసంస్థల పట్ల వివక్ష కూడదని 2వ క్లాజులో చెప్పటం ఈ సందర్భంలో గమనార్హం. ప్రభుత్వ సహాయాన్ని మొత్తం మెజారిటీ వర్గం సంస్థలకే ఇచ్చెయ్యకుండా మైనారిటీల సంస్థలకు కూడా న్యాయం చేయాలని చెప్పాలన్నదే రాజ్యాంగ రచయితల ఉద్దేశమని ఈ క్లాజును చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.

ఉద్దేశం మంచిదే కావచ్చు. కాని పాఠంలో కేవలం మతపరమైన, భాషాపరమైన మైనారిటీలనే పేర్కొనడంతో ఈ అధికరణం లక్షించిన రాజ్యాంగ రక్షణ ఆ మైనారిటీలకు మాత్రమే! ఆ కేటగిరీ కిందికి రాని ఇతర వర్గాలకు, ముఖ్యంగా మైనారిటీకి అది వర్తించదు- అని వాదించటానికి రాజ్యాంగకర్తలే చేజేతులా అవకాశం ఇచ్చారు. అదీ అనర్థానికి ఆదిమూలం.

మతాన్ని, భాషను కాపాడుకోవటానికి విద్య ద్వారా అవకాశాలు కొరవడి, మైనారిటీలు అణగారిపోకూడదన్న ఆరాటంతో రాజ్యాంగంలో వారికి ప్రత్యేకంగా ఒక రక్షణ కల్పించినప్పుడు, ఆ రక్షణ దేనికి వర్తించాలి? తమతమ మతాన్నో, భాషనో ముందుకు తీసుకువెళ్లే ధ్యేయంతో, దానికి తగిన విధంగా, మైనారిటీలు నెలకొల్పే విద్యా సంస్థలకు మాత్రమే కదా?

న్యాయంగా అయితే అంతే. కాని, 'కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత' అన్న సామెత లాగా - రాజ్యాంగంలో ఇచ్చిన కాస్తంత సందును ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చెప్పి పెద్ద అగడ్తగా మార్చారు. అపార్థాలను, వక్రభాష్యాలను సరిదిద్దవలసిన న్యాయవ్యవస్థ పొంతనలేని తీర్పులతో గందరగోళాన్ని మరింత పెంచింది. వివక్షను తొలగించేందుకు ఉద్దేశించబడిన రాజ్యంగ నిబంధన కాస్తా కోర్టుల సృజనాత్మక ప్రజ్ఞ మూలంగా పౌర సమాజంలో సరికొత్త మహావివక్షను తెచ్చిపెట్టింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.

‘The advantage of article 30 is available to all minority institutions and not only those whose object is to conserve or promote the language of minority’.

కేవలం మైనారిటీ భాషకు సంబంధించిన విద్యాసంస్థలకే గాక అన్ని రకాల మైనారిటీ సంస్థలకూ 30వ అధికరణ ప్రయోజనం లభిస్తుంది అని Indulal Hiralal Shah Vs. S.S.Salgaonkar కేసులో బొంబాయి హైకోర్టు వారి తీర్పు(AIR 1983 Bom 192).

‘The minorities can choose to establish an educational institution which is purely of a general secular character and is not designed to conserve their distinct language, script, or culture’ 

భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించేందుకు ఉద్దేశించినవే కాకుండా సెక్యులర్‌ స్వభావం కలిగిన సాధారణ విద్యాసంస్థలనూ మైనారిటీలు ఎంచుకొనవచ్చు -  అని Ahmedabad St. Xavier's College (1974 AIR 1389) కేసులో సుప్రీంకోర్టు సెలవిచ్చింది.

30వ అధికరణాన్ని మన న్యాయస్థానాలు ఎలా చూస్తాయి, ఎలా అర్థం చేసుకున్నాయి అన్నదానికి 1958లో కేరళ ఎడ్యుకేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి చేసిన రిఫరెన్సు మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (1959 1 SCR 995) లోని ఈ కింది వాక్యాలు ఒక మచ్చుతునక :

'The educational institutions of the minorities are different from the educational institutions established by the majority communities who require no special privilege or protection.. There is no limitation on the subjects to be taught in such institutions.. Article 30 leaves it to their choice to establish such educational institutions'.

(మెజారిటీ కమ్యూనిటీలు నెలకొల్పే విద్యాసంస్థలకు ప్రత్యేక హక్కులు, రక్షణ అవసరం లేదు. వాటికీ మైనారిటీ విద్యాసంస్థలకు నడుమ తేడా ఉంది. ఏ రకమైన విద్యాసంస్థలను స్థాపించాలన్నది 30 వ అధికరణం మైనారిటీల ఛాయిస్‌కి వదిలేసింది. ఆ సంస్థల్లో బోధించే సబ్జెక్టులపై పరిమితి ఏదీలేదు.)

అల్ప సంఖ్యాకులకు ప్రత్యేక అవకాశాలు ఉండాలనటంలో పేచీలేదు. ఢిల్లీలోని తెలుగువాళ్లు తమ భాష, సంస్కృతిని కాపాడుకోవటానికి తెలుగు స్కూలును నడుపుకోవచ్చు. ఇస్లామిక్‌ మతాన్ని, సంస్కృతిని పదిల పరచేందుకు మహమ్మదీయులు ఒక మదరసానో, ఇస్లామిక్‌ అధ్యయన సంస్థనో నెలకొల్పాలనుకోవచ్చు. అలాంటి వాటికి అవరోధం ఉండకూడదని, నిబంధనల మేరకు ప్రభుత్వ ఎయిడ్‌లో అటువంటి విద్యాసంస్థల పట్ల వివక్ష చూపకూడదని అన్నంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని మైనారిటీలు నడిపే ఏ విద్యాసంస్థలైనా, అందులో బోధించేది ఎలాంటి విద్య అయినా 30వ అధికరణం కింద రాజ్యాంగ ప్రత్యేక రక్షణ ఉంటుందనటం విడ్డూరం కాదా? ఉదాహరణకు ఒక ఇంజనీరింగు కాలేజినో, మెడికల్‌ కాలేజినో నడుపుకోవటానికి మైనారిటీ విద్యాసంస్థ అన్న టాగ్‌ ఎందుకు? దానికి రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు, ఒక ప్రత్యేక రక్షణ ఎందుకు?

బోధించేది మైనారిటీలకు సంబంధించిన విద్యే అయి ఉండాలన్న నియమం లేదు. స్థాపించినవారు, నడిపేవారు మైనారిటీలు అయితే చాలు, చెప్పే చదువు ఏదైనా అది మైనారిటీ విద్యా సంస్థగానే 30వ అధికరణం కింద గుర్తింపబడుతుంది - అని సుప్రీంకోర్టు వారు తేల్చారు . చాలా బాగుంది. చెప్పే చదువు మైనారిటీలకు సంబంధించింది కానక్కరలేదు, కనీసం ఆ చదువు వల్ల లబ్ధి పొందేది మైనారిటీలే అయి ఉండాలన్న కట్టడి ఏమైనా ఉందా?

అదీ లేదు. మైనారిటీ విద్యా సంస్థను మైనారిటీల కోసమే నడపాలని ఉద్దేశించినట్టయితే 'వారి సొంత కమ్యూనిటీ కోసమే' అని అధికరణ పాఠంలో పేర్కొని ఉండేవారట. అలా పేర్కొనలేదు కాబట్టి పూర్తిగా మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసమే అలాంటి విద్యా సంస్థ నడవాలని చెప్పేందుకు వీల్లేదని St.Stephen's College (AIR 1992 SC 1630) కేసులో సుప్రీంకోర్టు ధర్మ నిర్ణయం.

మైనారిటీలు కాని విద్యార్థులకు కనీసం 50 శాతం సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు చెప్పినా అది దాటకూడదని సీలింగు ఏమీ లేదు. మొత్తం సీట్లను మైనారిటీలు కాని వారికి అమ్ముకున్నా అడిగేవారు లేరు. పెట్టేవాడు, నడిపేవాడు మైనారిటీ అయితే చాలు - విద్యార్థుల్లో మైనారిటీల సంఖ్య ఎంత తక్కువైనా, మైనారిటీ విద్యాసంస్థగా ప్రత్యేక రాజ్యాంగ రక్షణ పొందడానికి ఇబ్బంది ఉండదు.

ఏ విద్యాసంస్థ అయినా సవ్యంగా నడిచేట్టు చూడటానికి ప్రభుత్వం ఉంది. చట్టాలున్నాయి. విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతి, తరవాత ప్రభుత్వ గుర్తింపు, గవర్నమెంటు ఎయిడ్‌ మంజూరు, అఫీలియేషను వంటి విషయాల్లో, విద్యా ప్రమాణాల పర్యవేక్షణలో ప్రభుత్వం చేతిలో అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. హిందువులకు సంబంధించిన విద్యాసంస్థలపై వాటిని ఎడాపెడా వాడేస్తూ, గవర్న మెంట్లు కర్రపెత్తనం మహా కర్కశంగా చేస్తుంటాయి. అదే మైనారిటీ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని బహు జాగ్రత్త చూపుతాయి. ఏ కాస్త కరకుతనం చూపినా రాజ్యాంగం తమకిచ్చిన ప్రాథమిక హక్కులకు మోసం వచ్చిందంటూ మైనారిటీ విద్యా సంస్థలు కోర్టులెక్కు తాయి. 30వ అధికరణం మైనారిటీలకు ఇచ్చిన ప్రాథమిక హక్కును గుర్తుపెట్టుకుని, ఆ హక్కుకు ఏ విధంగానూ భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండా లంటూ కోర్టులు ప్రభుత్వాలకు రివాజుగా సుద్దులు చెబుతుంటాయి. మైనారిటీలమీద వల్లమాలిన ప్రేమ ఎంతదాకా పోయిందంటే - సాక్షాత్తూ సుప్రీంకోర్టే  Rev. Siddhajbhai Sabhai (1963 AIR 540) కేసులో ఇదిగో ఈ గొప్ప ధర్మనిర్ణయం చేసింది :

‘Right established by Article 30 (1) is an absolute fundamental right... it is not subject to reasonable restrictions. The right is not to be whittled down by so called regulative measures conceived in the interest not of the minority educational institution, but of the public or the nation as a whole'.

30(1) అధికరణంలో ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కుట. అది సహేతుకమైన పరిమితులకు లోబడేది కాదట! మైనారిటీ విద్యాసంస్థ ప్రయో జనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసమో, మొత్తం జాతి ప్రయోజనాల కోసమో సోకాల్డ్‌ రెగ్యులేషన్లు పెట్టి ఆ హక్కును దిగజార్చకూడదట!

ఇదీ 1962 ఆగస్టు 30న అన్నీ తెలిసిన సర్వోన్నత న్యాయస్థానం మాన్య న్యాయమూర్తులు ఆరుగురు కలిసి వెలువరించిన అత్యుద్భుత తీర్పు ! ప్రజా ప్రయోజనాలకంటే, జాతి ప్రయోజనాల కంటే మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాలే మిన్న అని సుప్రీంకోర్టు సర్వజ్ఞులే తేల్చి చెప్పారంటే నవ్వాలా ఏడవాలా? మైనారిటీ విద్యా సంస్థలకు 30వ అధికరణంలో రాజ్యాంగం ఇచ్చింది నిర్నిబంధమైన, సహేతుక పరిమితులకు సందే లేని ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయపీఠమే ప్రకటించాక మైనారిటీ గండరగండలకు పట్టపగ్గాలుంటాయా?



బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్లను రాజ్యాంగం సమకూర్చింది. మైనారిటీ విద్యా సంస్థలకు ఆ కట్టుబాటు వర్తించదు. విద్యాహక్కు చట్టంకింద విద్యాసంస్థల్లో ప్రవేశానికి బలహీన వర్గాలకు సమకూడిన హక్కు మైనారిటీ విద్యా సంస్థలలో చెల్లదు. అడ్మిషన్ల విషయంలో మిగతా సంస్థలలో వలె ప్రభుత్వం సవాలక్ష రూల్సు, రెగ్యులేషన్లు పెట్టటానికి మైనారిటీ విద్యా సంస్థలలో వీలు లేదు. వాటి మేనేజిమెంట్లు ఇష్టానుసారం సీట్లు ఇచ్చుకోవచ్చు, అమ్ముకోనూవచ్చు. బోధనా భాష, సిలబసు, కరిక్యులం గట్రాలకు సంబంధించి హిందూ సంస్థలపై చేసినట్టు మైనారిటీ సంస్థలపై ప్రభుత్వం ఇష్టానుసారం స్వారీ చేయటం కుదరదు. టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్ల నియామకాల విషయంలో మిగతా విద్యాసంస్థల వలె మైనారిటీ విద్యాసంస్థలపై ప్రభుత్వ పెత్తనం నడవదు. విద్యాసంస్థల ప్రారంభం, నిర్వహణ, యాజమాన్య విధానాలపై హిందువుల సంస్థల మీదేమో అడ్డమైన ఆంక్షలు. అడగడుగునా వేధింపులు. అదే మైనారిటీ సంస్థలదేమో ఆడింది ఆట, పాడింది పాట.

మైనారిటీలు రాజ్యాంగ వరప్రసాదులు. మెజారిటీ ప్రజలేమో ఏ హక్కుకూ నోచుకోక దిక్కులేని శాపగ్రస్తులు. మైనారిటీల పట్ల వివక్షను నిరోధిం చేందుకు చేసిన కట్టడి ఫలితం మెజారిటీ పట్ల దారుణ వివక్ష! ఈ వైపరీత్యం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?