Friday 5 October 2018

విద్యారంగంలో మహా వివక్ష


పెక్యులరిజం - 16

 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

...................




సెక్యులర్‌ స్కూల్లో సరస్వతీ ప్రార్థన నిషిద్ధం.

'వందేమాతర' మూ నిర్బంధం కాదు.

ఆఖరికి 'జనగణమన'ను పాడము పొమ్మని మైనారిటీల పిల్లలు మొరాయించినా చేయగలిగింది లేదు. అది ఎంత జాతీయ గీతమైనా - మైనారిటీల మతస్వేచ్ఛ ముందు బలాదూరు. దాన్ని పాడేందుకు మత కారణంతో నిరాకరించే హక్కు మైనారిటీలకు న్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చాటింది.

అదే - మిషనరీ స్కూల్లోనో ?హిందువుల పిల్లలకు క్రిస్టియన్స్‌ ప్రేయర్లు కంపల్సరీ! 'మా దేవుళ్లు మాకుండగా మీ ఏసయ్యను, మీ మేరమ్మనూ మేమెందుకు ప్రార్థించాలని అడిగే హక్కు హిందువులకు లేదు. వారి మత హక్కుకు దిక్కులేదు. ప్రేయరు మాట దేవుడెరుగు. సంప్రదాయం ప్రకారం మొఖాన బొట్టు, చేతికి గాజులు, గోరింటాకు అలం కరించుకునేందుకూ కిరస్తానీ స్కూళ్లు సాధారణంగా ఒప్పుకోవు. హైందవ మతాన్ని, దేవీదేవతలను పాఠాల నెపంతో పొద్దస్తమానం పంతుళ్లు ఎన్ని దుర్భాషలాడినా, విద్యాబోధన పేరిట తెగబడి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నా హిందువులు కిక్కురుమనక భరించాల్సిందే. వాటి వల్ల తమ మత స్వాతంత్య్రానికి హాని కలుగుతున్నదని మొత్తుకున్నా ప్రభుత్వాలు ఆలకించవు. కోర్టులూ పట్టించుకోవు.

ఎందుకంటే మైనారిటీ విద్యా సంస్థల్లో మైనారిటీ లది ఇష్టారాజ్యం. సెక్యులర్‌ పప్పులు అక్కడ ఉడకవు. హిందువులు నడిపే స్కూళ్లలో ఏమి నేర్పాలి, ఎలా నేర్పాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు - అంటూ అడ్డమైన రూల్సుతో సవాలక్ష ఆంక్షలు పెట్టే ప్రభుత్వాల పవరు మైనారిటీల దగ్గర పనిచేయదు. ఎంచేతంటే మైనారిటీలకు ప్రత్యేక హక్కులను, ప్రత్యేక ప్రతిపత్తిని భారత రాజ్యాంగమే ఇచ్చింది - 30వ అధికరణంలో!

మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో 25 నుంచి 30 వరకు ఉన్న ఆరు అధికరణాల్లో అన్నిటికంటే అభ్యంతరకరమైనదీ, హిందూ సమాజానికి తీరని హాని చేసిన వాటిలో మొట్టమొదట పేర్కొనవలసిందీ 30వ నెంబరు అధికరణం. మిగతా అధికరణాల వల్ల చెరుపు విపరీతార్థాలు, వక్రభాష్యాల మూలంగా జరిగింది. 30వ అధికరణం మాత్రం మైనారిటీల పట్ల బాహాటంగా పక్షపాతం చూపి మెజారిటీ ప్రజలను దారుణ వివక్షకు గురిచేసింది. 'సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు' అని పేరైతే పెట్టి, ఆ హక్కులను మెజారిటీకి ఎగ్గొట్టిన 30వ అధికరణంలో ఉన్నదిది :

Article 30. Rights of minorities to establish and administer educational institutions.1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice.2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution on the ground that it is under the management of a minority, whether based on religion or language.

30వ అధికరణం. విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకోవటానికి మైనారిటీల హక్కు.

1. మతం లేక భాష పరంగా మైనారిటీలందరికీ తమకు ఇష్టమైన విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకునే హక్కు ఉండును.

2. విద్యా సంస్థలకు సహాయం మంజూరులో ప్రభుత్వం ఏ విద్యాసంస్థకిన్నీ అది మత లేక భాష పరమైన మైనారిటీ యాజమాన్యంలో ఉన్నదన్న కారణంతో వివక్ష చూపరాదు.



మెజారిటీనా, మైనారిటీనా అన్న తేడా లేకుండా ఏమతమైనా, ఏ భాష అయినా క్షేమంగా ఉండి అభివృద్ధి చెందాలంటే విద్య ఒక అతిముఖ్య సాధనం. మతపరమైన, భాషాపరమైన విజ్ఞానాన్ని, వారసత్వాన్ని పదిలపరచుకోవటానికి విద్యాసంస్థలు మైనారిటీలకు ఎంత అవసరమో మెజారిటీకీ అంతే అవసరం. సాంస్కృతిక హక్కులూ, విద్యాహక్కుల విషయంలో సంఖ్యాబలంతో నిమిత్తం లేదు. దేశంలో అన్ని వర్గాల పౌరులకూ సమానంగా వర్తించవలసిన ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 'సాంస్కృతిక, విద్యాహక్కులు' అన్న గ్రూపు కింద ఈ అధికరణాన్ని పొందుపరచారు అంటే దీన్ని కేవలం మైనారిటీలకే పరిమితం చేయాలన్న ఉద్దేశం రాజ్యాంగకర్తలకు ఉండే ఆస్కారం లేదు. ఈ హక్కు మైనారిటీలకు కూడా ఉంటుందని నొక్కి చెప్పటమే వారి ఆశయమని భావించవచ్చు.  ప్రభుత్వ సహాయం మంజూరులో మైనారిటీ విద్యాసంస్థల పట్ల వివక్ష కూడదని 2వ క్లాజులో చెప్పటం ఈ సందర్భంలో గమనార్హం. ప్రభుత్వ సహాయాన్ని మొత్తం మెజారిటీ వర్గం సంస్థలకే ఇచ్చెయ్యకుండా మైనారిటీల సంస్థలకు కూడా న్యాయం చేయాలని చెప్పాలన్నదే రాజ్యాంగ రచయితల ఉద్దేశమని ఈ క్లాజును చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.

ఉద్దేశం మంచిదే కావచ్చు. కాని పాఠంలో కేవలం మతపరమైన, భాషాపరమైన మైనారిటీలనే పేర్కొనడంతో ఈ అధికరణం లక్షించిన రాజ్యాంగ రక్షణ ఆ మైనారిటీలకు మాత్రమే! ఆ కేటగిరీ కిందికి రాని ఇతర వర్గాలకు, ముఖ్యంగా మైనారిటీకి అది వర్తించదు- అని వాదించటానికి రాజ్యాంగకర్తలే చేజేతులా అవకాశం ఇచ్చారు. అదీ అనర్థానికి ఆదిమూలం.

మతాన్ని, భాషను కాపాడుకోవటానికి విద్య ద్వారా అవకాశాలు కొరవడి, మైనారిటీలు అణగారిపోకూడదన్న ఆరాటంతో రాజ్యాంగంలో వారికి ప్రత్యేకంగా ఒక రక్షణ కల్పించినప్పుడు, ఆ రక్షణ దేనికి వర్తించాలి? తమతమ మతాన్నో, భాషనో ముందుకు తీసుకువెళ్లే ధ్యేయంతో, దానికి తగిన విధంగా, మైనారిటీలు నెలకొల్పే విద్యా సంస్థలకు మాత్రమే కదా?

న్యాయంగా అయితే అంతే. కాని, 'కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత' అన్న సామెత లాగా - రాజ్యాంగంలో ఇచ్చిన కాస్తంత సందును ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చెప్పి పెద్ద అగడ్తగా మార్చారు. అపార్థాలను, వక్రభాష్యాలను సరిదిద్దవలసిన న్యాయవ్యవస్థ పొంతనలేని తీర్పులతో గందరగోళాన్ని మరింత పెంచింది. వివక్షను తొలగించేందుకు ఉద్దేశించబడిన రాజ్యంగ నిబంధన కాస్తా కోర్టుల సృజనాత్మక ప్రజ్ఞ మూలంగా పౌర సమాజంలో సరికొత్త మహావివక్షను తెచ్చిపెట్టింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.

‘The advantage of article 30 is available to all minority institutions and not only those whose object is to conserve or promote the language of minority’.

కేవలం మైనారిటీ భాషకు సంబంధించిన విద్యాసంస్థలకే గాక అన్ని రకాల మైనారిటీ సంస్థలకూ 30వ అధికరణ ప్రయోజనం లభిస్తుంది అని Indulal Hiralal Shah Vs. S.S.Salgaonkar కేసులో బొంబాయి హైకోర్టు వారి తీర్పు(AIR 1983 Bom 192).

‘The minorities can choose to establish an educational institution which is purely of a general secular character and is not designed to conserve their distinct language, script, or culture’ 

భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించేందుకు ఉద్దేశించినవే కాకుండా సెక్యులర్‌ స్వభావం కలిగిన సాధారణ విద్యాసంస్థలనూ మైనారిటీలు ఎంచుకొనవచ్చు -  అని Ahmedabad St. Xavier's College (1974 AIR 1389) కేసులో సుప్రీంకోర్టు సెలవిచ్చింది.

30వ అధికరణాన్ని మన న్యాయస్థానాలు ఎలా చూస్తాయి, ఎలా అర్థం చేసుకున్నాయి అన్నదానికి 1958లో కేరళ ఎడ్యుకేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి చేసిన రిఫరెన్సు మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (1959 1 SCR 995) లోని ఈ కింది వాక్యాలు ఒక మచ్చుతునక :

'The educational institutions of the minorities are different from the educational institutions established by the majority communities who require no special privilege or protection.. There is no limitation on the subjects to be taught in such institutions.. Article 30 leaves it to their choice to establish such educational institutions'.

(మెజారిటీ కమ్యూనిటీలు నెలకొల్పే విద్యాసంస్థలకు ప్రత్యేక హక్కులు, రక్షణ అవసరం లేదు. వాటికీ మైనారిటీ విద్యాసంస్థలకు నడుమ తేడా ఉంది. ఏ రకమైన విద్యాసంస్థలను స్థాపించాలన్నది 30 వ అధికరణం మైనారిటీల ఛాయిస్‌కి వదిలేసింది. ఆ సంస్థల్లో బోధించే సబ్జెక్టులపై పరిమితి ఏదీలేదు.)

అల్ప సంఖ్యాకులకు ప్రత్యేక అవకాశాలు ఉండాలనటంలో పేచీలేదు. ఢిల్లీలోని తెలుగువాళ్లు తమ భాష, సంస్కృతిని కాపాడుకోవటానికి తెలుగు స్కూలును నడుపుకోవచ్చు. ఇస్లామిక్‌ మతాన్ని, సంస్కృతిని పదిల పరచేందుకు మహమ్మదీయులు ఒక మదరసానో, ఇస్లామిక్‌ అధ్యయన సంస్థనో నెలకొల్పాలనుకోవచ్చు. అలాంటి వాటికి అవరోధం ఉండకూడదని, నిబంధనల మేరకు ప్రభుత్వ ఎయిడ్‌లో అటువంటి విద్యాసంస్థల పట్ల వివక్ష చూపకూడదని అన్నంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని మైనారిటీలు నడిపే ఏ విద్యాసంస్థలైనా, అందులో బోధించేది ఎలాంటి విద్య అయినా 30వ అధికరణం కింద రాజ్యాంగ ప్రత్యేక రక్షణ ఉంటుందనటం విడ్డూరం కాదా? ఉదాహరణకు ఒక ఇంజనీరింగు కాలేజినో, మెడికల్‌ కాలేజినో నడుపుకోవటానికి మైనారిటీ విద్యాసంస్థ అన్న టాగ్‌ ఎందుకు? దానికి రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు, ఒక ప్రత్యేక రక్షణ ఎందుకు?

బోధించేది మైనారిటీలకు సంబంధించిన విద్యే అయి ఉండాలన్న నియమం లేదు. స్థాపించినవారు, నడిపేవారు మైనారిటీలు అయితే చాలు, చెప్పే చదువు ఏదైనా అది మైనారిటీ విద్యా సంస్థగానే 30వ అధికరణం కింద గుర్తింపబడుతుంది - అని సుప్రీంకోర్టు వారు తేల్చారు . చాలా బాగుంది. చెప్పే చదువు మైనారిటీలకు సంబంధించింది కానక్కరలేదు, కనీసం ఆ చదువు వల్ల లబ్ధి పొందేది మైనారిటీలే అయి ఉండాలన్న కట్టడి ఏమైనా ఉందా?

అదీ లేదు. మైనారిటీ విద్యా సంస్థను మైనారిటీల కోసమే నడపాలని ఉద్దేశించినట్టయితే 'వారి సొంత కమ్యూనిటీ కోసమే' అని అధికరణ పాఠంలో పేర్కొని ఉండేవారట. అలా పేర్కొనలేదు కాబట్టి పూర్తిగా మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసమే అలాంటి విద్యా సంస్థ నడవాలని చెప్పేందుకు వీల్లేదని St.Stephen's College (AIR 1992 SC 1630) కేసులో సుప్రీంకోర్టు ధర్మ నిర్ణయం.

మైనారిటీలు కాని విద్యార్థులకు కనీసం 50 శాతం సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు చెప్పినా అది దాటకూడదని సీలింగు ఏమీ లేదు. మొత్తం సీట్లను మైనారిటీలు కాని వారికి అమ్ముకున్నా అడిగేవారు లేరు. పెట్టేవాడు, నడిపేవాడు మైనారిటీ అయితే చాలు - విద్యార్థుల్లో మైనారిటీల సంఖ్య ఎంత తక్కువైనా, మైనారిటీ విద్యాసంస్థగా ప్రత్యేక రాజ్యాంగ రక్షణ పొందడానికి ఇబ్బంది ఉండదు.

ఏ విద్యాసంస్థ అయినా సవ్యంగా నడిచేట్టు చూడటానికి ప్రభుత్వం ఉంది. చట్టాలున్నాయి. విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతి, తరవాత ప్రభుత్వ గుర్తింపు, గవర్నమెంటు ఎయిడ్‌ మంజూరు, అఫీలియేషను వంటి విషయాల్లో, విద్యా ప్రమాణాల పర్యవేక్షణలో ప్రభుత్వం చేతిలో అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. హిందువులకు సంబంధించిన విద్యాసంస్థలపై వాటిని ఎడాపెడా వాడేస్తూ, గవర్న మెంట్లు కర్రపెత్తనం మహా కర్కశంగా చేస్తుంటాయి. అదే మైనారిటీ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని బహు జాగ్రత్త చూపుతాయి. ఏ కాస్త కరకుతనం చూపినా రాజ్యాంగం తమకిచ్చిన ప్రాథమిక హక్కులకు మోసం వచ్చిందంటూ మైనారిటీ విద్యా సంస్థలు కోర్టులెక్కు తాయి. 30వ అధికరణం మైనారిటీలకు ఇచ్చిన ప్రాథమిక హక్కును గుర్తుపెట్టుకుని, ఆ హక్కుకు ఏ విధంగానూ భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండా లంటూ కోర్టులు ప్రభుత్వాలకు రివాజుగా సుద్దులు చెబుతుంటాయి. మైనారిటీలమీద వల్లమాలిన ప్రేమ ఎంతదాకా పోయిందంటే - సాక్షాత్తూ సుప్రీంకోర్టే  Rev. Siddhajbhai Sabhai (1963 AIR 540) కేసులో ఇదిగో ఈ గొప్ప ధర్మనిర్ణయం చేసింది :

‘Right established by Article 30 (1) is an absolute fundamental right... it is not subject to reasonable restrictions. The right is not to be whittled down by so called regulative measures conceived in the interest not of the minority educational institution, but of the public or the nation as a whole'.

30(1) అధికరణంలో ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కుట. అది సహేతుకమైన పరిమితులకు లోబడేది కాదట! మైనారిటీ విద్యాసంస్థ ప్రయో జనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసమో, మొత్తం జాతి ప్రయోజనాల కోసమో సోకాల్డ్‌ రెగ్యులేషన్లు పెట్టి ఆ హక్కును దిగజార్చకూడదట!

ఇదీ 1962 ఆగస్టు 30న అన్నీ తెలిసిన సర్వోన్నత న్యాయస్థానం మాన్య న్యాయమూర్తులు ఆరుగురు కలిసి వెలువరించిన అత్యుద్భుత తీర్పు ! ప్రజా ప్రయోజనాలకంటే, జాతి ప్రయోజనాల కంటే మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాలే మిన్న అని సుప్రీంకోర్టు సర్వజ్ఞులే తేల్చి చెప్పారంటే నవ్వాలా ఏడవాలా? మైనారిటీ విద్యా సంస్థలకు 30వ అధికరణంలో రాజ్యాంగం ఇచ్చింది నిర్నిబంధమైన, సహేతుక పరిమితులకు సందే లేని ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయపీఠమే ప్రకటించాక మైనారిటీ గండరగండలకు పట్టపగ్గాలుంటాయా?



బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్లను రాజ్యాంగం సమకూర్చింది. మైనారిటీ విద్యా సంస్థలకు ఆ కట్టుబాటు వర్తించదు. విద్యాహక్కు చట్టంకింద విద్యాసంస్థల్లో ప్రవేశానికి బలహీన వర్గాలకు సమకూడిన హక్కు మైనారిటీ విద్యా సంస్థలలో చెల్లదు. అడ్మిషన్ల విషయంలో మిగతా సంస్థలలో వలె ప్రభుత్వం సవాలక్ష రూల్సు, రెగ్యులేషన్లు పెట్టటానికి మైనారిటీ విద్యా సంస్థలలో వీలు లేదు. వాటి మేనేజిమెంట్లు ఇష్టానుసారం సీట్లు ఇచ్చుకోవచ్చు, అమ్ముకోనూవచ్చు. బోధనా భాష, సిలబసు, కరిక్యులం గట్రాలకు సంబంధించి హిందూ సంస్థలపై చేసినట్టు మైనారిటీ సంస్థలపై ప్రభుత్వం ఇష్టానుసారం స్వారీ చేయటం కుదరదు. టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్ల నియామకాల విషయంలో మిగతా విద్యాసంస్థల వలె మైనారిటీ విద్యాసంస్థలపై ప్రభుత్వ పెత్తనం నడవదు. విద్యాసంస్థల ప్రారంభం, నిర్వహణ, యాజమాన్య విధానాలపై హిందువుల సంస్థల మీదేమో అడ్డమైన ఆంక్షలు. అడగడుగునా వేధింపులు. అదే మైనారిటీ సంస్థలదేమో ఆడింది ఆట, పాడింది పాట.

మైనారిటీలు రాజ్యాంగ వరప్రసాదులు. మెజారిటీ ప్రజలేమో ఏ హక్కుకూ నోచుకోక దిక్కులేని శాపగ్రస్తులు. మైనారిటీల పట్ల వివక్షను నిరోధిం చేందుకు చేసిన కట్టడి ఫలితం మెజారిటీ పట్ల దారుణ వివక్ష! ఈ వైపరీత్యం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?

No comments:

Post a Comment