Friday 28 September 2018

తలకట్టు తెచ్చిన చేటు


పెక్యులరిజం - 15


ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.......



తెలిసి చేశారో తెలియక చేశారో గాని - రాజ్యాంగం రాసినవాళ్లు చేసిన ఒక తప్పు హిందూ సమాజానికి శాపమైంది. దేశంలో నూటికి 80 మందిని ప్రధానమైన ఒక ప్రాథమిక హక్కుకు నిష్కారణంగా అది దూరం చేసింది.

భారత రాజ్యాంగంలోని మూడోభాగం (Part III) లో ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో Cultural and Educational Rights (సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు) అనే సబ్‌ హెడ్డింగు కింద 29, 30 నెంబర్లు గల రెండు అధికరణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 29వ అధికరణం గురించి. అందులో ఉన్నదిది.

1. Any section of the citizens residing in the territory of India or any part thereof having a distinct language, script or culture of its own shall have the right to conserve the same.
2. No citizen shall be denied admission into any educational institution maintained by the state or receiving and out of state funds on grounds only of religion, race, caste, language or any of them.

(1. భారత భూభాగంలో నివసించే ఏ వర్గానికి చెందిన పౌరులకైనా తమకు నిర్దిష్టంగా ఉన్న భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉండును.

2. ప్రభుత్వం నడిపే లేక ప్రభుత్వ నిధులు పొందే ఏ విద్యా సంస్థలోనూ మతం, జాతి, కులం, భాషలలో దేనికారణంగానూ ఏ పౌరుడికీ ప్రవేశం నిరాకరించరాదు.)

ఇందులో వంక పెట్టటానికి ఏమీ లేదు. తమ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే హక్కును దేశంలోని అన్ని వర్గాల పౌరులకూ మొదటి క్లాజు దఖలు పరిచింది. కులం, మతం, జాతి, భాషల వివక్షతో ప్రభుత్వ రంగ విద్యాసంస్థలలో భారత పౌరులెవరికీ ప్రవేశం నిరాకరించకుండా రెండో క్లాజు కట్టడి చేసింది. అంతకంటే ఏమి కావాలి?

29వ అధికరణంలోని పదజాలాన్ని బట్టి ఒక విషయం స్పష్టం. ఒక కులం, ఒక మతం, ఒక జాతి, ఒక భాష అన్న తేడా లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు, అన్ని భాషలకు చెందిన భారత పౌరులు యావన్మందికీ అది వర్తిస్తుంది. మెజారిటీ, మైనారిటీ తారతమ్యం అందులో ఎక్కడా లేదు. మైనారిటీలకు మాత్రమే ఆ అధికరణం ఉద్దేశించబడింది అని గాని, అందులో పొందుపరచిన ప్రాథమిక హక్కు మెజారిటీ వర్గమైన హిందువులకు వర్తించదనిగాని మతి ఉన్నవాడెవడూ అనలేడు. ఈ రాజ్యాంగవరం ఉన్నదున్నట్టుగా అమలు జరగటం కంటే ఈ దేశ ప్రజలు కోరుకోగలిగింది ఉండదు. కులపరంగా, భాషాపరంగా, జాతిపరంగా హిందూ సమాజంలో ఎంతోమంది ఎన్నో విధాల ఈనాటికీ ఎదుర్కొంటున్న దారుణ వివక్షను పరిహరించటానికి పై అధికరణం ఎంతో ఉపయోగపడగలదు.

కాని ఏం లాభం? దేవుడు వరమిచ్చినా పుజారి వరమివ్వనట్టు 29వ అధికరణం సమస్త పౌరులకు ఎంతటి మేలు చేస్తేనేమి? రాజ్యాంగ రచయితలు దాని నెత్తిన 'Protection of interests of minorities' (మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ) అనే హెడ్డింగు పెట్టారు. మార్జినల్‌ హెడ్‌నోట్‌ అనబడే ఆ తలకట్టుతో ఈ రాజ్యాంగ అధికరణానికి అర్థం మొత్తం మారిపోయింది. కేవలం మైనారిటీల ప్రయోజనం కోసమే అది ఉద్దేశించబడిందనీ, మెజారిటీ వర్గానికి అందులోని హక్కులు అనుభవించే ప్రాప్తం లేదనీ వాదించేందుకు వాటమైన వీలు చిక్కింది. రాజ్యాంగం ప్రసాదించిన ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు జనాభాలో 80 శాతానికి అందకుండా పోవటంతో హిందువులు తమ దేశంలోనే రెండో తరగతి పౌరులుగా మారారు.

29వ అధికరణం శీర్షికకూ, దానికింది విషయానికీ మధ్య వైరుధ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో గుర్తించింది. ఉదాహరణకు T.M.A. Pai Foundation Vs. state of karnataka కేసులో 2002 అక్టోబరు 31న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ఈ వాక్యాలను చూడండి.

“Article 29(1) doesnot refer to any religion, even though the marginal note of the Article mentions the interests of minorities... Article 29(1) gives the right to all sections of citizens, whether they are in a minority, or the majority religions, to conserve their language, script or culture...

“Article 29(2) confers a special right on citizens for admission into educational institutions... to limit this right only to citizens belonging to minority groups will be to provide a double protection to such citizens and to hold that the citizens of the majority group have no special educational rights... We see no cogent reason for such discrimination "

(మార్జినల్‌ నోటు 'మైనారిటీల ప్రయోజనాల'ను పేర్కొన్నప్పటికీ 29(1) అధికరణంలో ఏ మతం ప్రస్తావనా లేదు. 29 (1) అధికరణం అన్ని వర్గాల పౌరులకూ - వారు మైనారిటీలైనా, మెజారిటీ మతానికి చెందిన వారైనా - తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కును ఇచ్చింది.

29 (2) అధికరణం విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో పౌరులకు ఒక ప్రత్యేక హక్కును ప్రసాదించింది. ఈ హక్కును మైనారిటీ వర్గాలకు చెందిన పౌరులకు మాత్రమే పరిమితం చేయడమంటే ఆ పౌరులకు డబుల్‌ రక్షణ ఇచ్చినట్టు అవుతుంది. మెజారిటీ వర్గానికి చెందిన పౌరులకు విద్యా విషయమై ప్రత్యేక హక్కులేవీ లేవు అని చెప్పినట్టు అవుతుంది... అటువంటి వివక్షకు సరైన కారణమేదీ మాకు కనపడటం లేదు.)

29వ అధికరణం హెడ్‌ నోట్‌లో మైనారిటీ ప్రయోజనాల పరిరక్షణ అని పేర్కొన్నా, పాఠంలో 'మైనారిటీ' అన్న పదాన్ని వాడలేదు అని పైన ఉటంకించిన తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అధికరణ పాఠంలో 'మైనారిటీలు' అన్నపదం లేనంత మాత్రాన అది మైనారిటీలకు ఉద్దేశించింది కాదు అని ఎలా నిర్ధారించగలం? ఆ ఉద్దేశం రాజ్యాంగ కర్తలకు లేకపోతే 'మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ' అన్న హెడ్‌ నోటును ఎందుకు పెడతారు? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వంటి మహమహులు తెలివి తక్కువ వాళ్లు అని ఎవరు అనగలరు? బలమైన కారణం లేకుంటే అలాంటి శీర్షిక ఎందుకు పెడతారు? శీర్షికలోనే 'మైనారిటీ'లను ప్రస్తావించారు కాబట్టి పాఠంలో మళ్లీ 'మైనారిటీ'లను నొక్కి చెప్పవలసిన అవసరం లేదని వారు భావించి ఉండొచ్చు కదా? లేదా 'మైనారిటీ'లకు మాత్రమే అన్నది పాఠంలో షరాగా చేర్చటం వారు పొరపాటున మరచి ఉండొచ్చుకదా?

సందేహం బాగానే ఉంది. మరి నిజమేమిటో ఎలా తేలాలి? రాజ్యాంగ అధికరణం పరమార్థమేమిటో, దానిని రచించిన వారి అసలు ఉద్దేశం ఏమిటో కనిపెట్టటం ఎలా?

దానికీ మనం బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన పనిలేదు. అటువంటి అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేసుకోవడం ఎలా అన్నది పైన ఉటంకించిన తీర్పులో సుప్రీంకోర్టే దారి చూపింది ఇలా :

'రాజ్యాంగంలోనే ఏ అంశానికి సంబంధించి అయినా రాజ్యాంగ కర్తల ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే దానిని ఖరారు చేసే ముందు రాజ్యాంగ నిర్ణయ సభలో నడిచిన చర్చలను పరిశీలించాలి అని కేశవానంద భారతి కేసులో ఈ న్యాయస్థానం ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనలను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభ డిబేట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నది అందరూ అంగీకరించారు.'

సుప్రీంకోర్టే చెప్పాక ఇక తిరుగులేదు. మరి 29వ అధికరణానికి సంబంధించి రాజ్యాంగ నిర్ణయ సభ రికార్డులు ఏమి చెబుతాయి?ౠ

రాజ్యాంగ ముసాయిదాలో ఈ అధికరణం నెంబరు ఒరిజినల్‌గా 23. రాజ్యాంగ సలహా సంఘం (అడ్వయిజరీ కమిటీ) పలుమార్లు చర్చించి, ఆమోదించిన ముసాయిదాలో 23వ అధికరణం కింద పేర్కొన్నది ఇది.

23 (1) any minority residing in the territory of India or any part thereof having a distinct language, script and culture of its own shall have the right to conserve the same.

2) No minority whether based on religion, community or language shall be discriminated against in regard to the admission of any person belonging to such minority into any educational institution maintained by the state.

దీనిపై రాజ్యాంగ నిర్ణయ సభలో చర్చ జరిగినప్పుడు పండిట్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవ ఒక సవరణ ప్రతిపాదించాడు. రెండవ క్లాజులో 'మైనారిటీ' స్థానంలో 'సిటిజన్‌'ను చేర్చి ఆయన చేసిన సవరణ ప్రతిపాదన ఇది.

“No citizen shall be denied admission into any educational institution by the state or receiving aid out of state funds on grounds only of religion, race, caste, language or any of them.”

1948 డిసెంబర్‌ 8న రాజ్యాంగ సభలో ఈ సవరణను ప్రతిపాదిస్తూ పండిట్‌ ఠాకూర్‌ దాస్‌ భార్గవ గొప్ప ప్రసంగం చేశారు. కేవలం మైనారిటీలకు పరిమితం చేయకుండా విద్యాహక్కును మొత్తం పౌరులందరికీ వర్తింపజేయటం ఎందుకు అవసరమో వివరిస్తూ ఆయన ఇలా అన్నారు:


''సర్‌! ఈ క్లాజులో మైనారిటీలకు అన్నామంటే మెజారిటీని, మైనారిటీని వేరు వేరు చేసినట్టే కదా? ఈ అధ్యాయానికి పెట్టిన హెడ్దింగ్‌ ఏమిటండి? 'సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు' !అవి పౌరులందరికీ ఉండాల్సినవే కదా? అక్కడ ప్రత్యేకంగా మైనారిటీల ప్రస్తావన ఎందుకు? ఈ 2వ క్లాజును చదివితే మైనారిటీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇచ్చినట్టు కనపడుతుంది. కాని జాతి శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయంలో మెజారిటీకి చెందినవారి పట్ల కూడా వివక్ష చూపకూడదు. మైనారిటీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఉండాలి అని, మెజారిటీ వర్గానికి ఉండకూడదు అనడం దురదృష్టకరమైన ఆలోచనా ధోరణి. ఇలా మైనారిటీ, మెజారిటీ మధ్య తేడాపాడాలను పెట్టే అలవాటు మన బ్రిటిషు ప్రభువులకు ఉండేది. విద్యకు సంబంధించిన విషయాల్లో ఎవరి పట్ల వివక్ష లేకుండా మెజారిటీకి, మైనారిటీకి సమాన ప్రతిపత్తిని ఇచ్చేట్టు చేయడం కోసమే ఈ సవరణ.''

ఈ దశలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కలగజేసుకున్నారు. పండిట్‌ భార్గవ అభిప్రాయంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. మైనారిటీ, మెజారిటీ అన్న తేడా లేకుండా ఈ ప్రాథమిక హక్కు పౌరులందరికీ సమానంగా వర్తించాలన్న ఉద్దేశంతో తాను మొదటి క్లాజులోని Any minority అన్న పదాన్ని"Any section of the citizens" గా డ్రాఫ్టింగ్‌ కమిటీ సవరించినట్టు ఆయన ప్రకటించారు. ఇక రెండో క్లాజుకు సంబంధించి ఠాకూర్‌ దాస్‌ భార్గవ చేసిన సవరణపై ఓటింగు జరిగింది. ఆ సవరణను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అదీ - 29వ అధికరణం రూపొంది, రాజ్యాంగంలోని ఎక్కిన కథాక్రమం. విద్యా హక్కుల విషయంలో మైనారిటీ, మెజారిటీ అన్న తారతమ్యం ఉండకూడదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ విస్పష్టంగా ప్రకటించిన తరువాత, ఆ మేరకు సవరణ ప్రతిపాదనలను రాజ్యాంగ నిర్ణయ సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత రాజ్యాంగ కర్తల ఉద్దేశానికి సంబంధించి సందిగ్ధతకు తావెక్కడ? ముసాయిదాలోని 'మైనారిటీ' ప్రస్తావనను సరిదిద్ది 'అన్ని వర్గాల పౌరులు'గా రాజ్యాంగ సభ ఖరారు చేసిన దరిమిలా ఈ అధికరణానికి మైనారిటీల హక్కుల పరిరక్షణ అన్న తలకట్టును పెట్టటం తప్పే కదా?

ఔను. ముమ్మాటికీ తప్పే. ఆ సంగతి స్వయానా సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో గుర్తించింది. కాని - రాజ్యాంగంలో ఆ తప్పు చలామణిలో ఉన్నంత కాలమూ కోర్టులు కూడా దానికి అనుగుణ్యంగానే నడుచుకోవాలి. రాజ్యాంగమనేది ఆషామాషీ పత్రం కాదు. చెల్లుబాటు అయినంత కాలమూ అందులోని ప్రతిమాట శిలాశాసనమే. పొరపాటు జరిగిందని రూఢి అయ్యాక అది చెల్లుబాటు కాకుండా సవరించి తీరవలసిందే.

చిక్కేమిటంటే - ఈ పెద్ద పొరపాటు ఇంకెక్కడో కాదు. పోయి పోయి ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో జరిగింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం మూలసూత్రాల కిందికి వస్తాయి. వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదని 1973లో చరిత్రాత్మకమైన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రకటించింది. అనుల్లంఘనీయమని తాను ప్రకటించిన రాజ్యాంగం బేసిక్‌ స్ట్రక్చర్‌లో భాగం కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనల మంచిచెడ్డల జోలికి సుప్రీంకోర్టు పోదు. 29వ అధికరణంలో లేకపోతేనేమి? మార్జినల్‌ హెడ్‌నోట్‌ అనే తలకట్టులో మైనారిటీల ప్రస్తావన ఉన్నది కదా? కాబట్టి ఆ అధికరణం మైనారిటీలకు మాత్రమే! అదీ మన న్యాయస్థానాల వైఖరి.

“The text and marginal notes of Articles 29 and 30 show that their purpose is to confer those fundamental rights on minority communities”

(29, 30 అధికరణాల పాఠం, మార్జినల్‌ నోట్సును బట్టి ఆ ప్రాథమిక హక్కులను మైనారిటీ కమ్యూనిటీలకు దఖలు పరచడమే వాటి ఉద్దేశమని స్పష్టం)

అని సుప్రసిద్ధమైన కేరళ ఎడ్యుకేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి రిఫరెన్సుకు 1958 మే 22న సుదీర్ఘ సమాధానం (1959 1 SCR 995)లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొనడం ఇందుకు ఒక నిదర్శనం.

పొరపాటు అని తాను ఎరిగినా దానిని సరిచేసేందుకు సుప్రీంకోర్టు చొరవ చూపనంత మాత్రాన చేతులు ముడుచుకొని కూర్చోనక్కరలేదు. ప్రాథమిక హక్కుల వంటి బేసిక్‌ స్ట్రక్చర్‌ను సవరించకూడదు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయమే తప్ప, రాజ్యాంగంలో అలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యంలో అసలు యజమానులు, అంతిమ నిర్ణేతలు ప్రజలు. వారు పట్టుబడితే ఒక అధికరణాన్నేఏమిటి, మొత్తం రాజ్యాంగాన్నే మార్చివేయగలరు. జనం నుంచి గట్టి ఒత్తిడి వస్తే ఎంతటి ప్రభుత్వమైనా కదలక తప్పదు.

కాని, ప్రభుత్వం, పార్లమెంటు కదిలేట్టు ఎవరు చేయాలి? అన్యాయానికి గురైన మెజారిటీ వర్గం ప్రజలు, అనగా హిందువులు. కాని ఇప్పటి పరిస్థితుల్లో సామాన్య హిందూ ప్రజలకు ఇలాంటి విషయాలు పట్టేట్టు లేవు.

అదీ అసలు సమస్య.

No comments:

Post a Comment