Tuesday 19 February 2019

భయపడకు ఇమ్రాన్.. మావాళ్ళున్నారులే !!

జి.ఎస్. కుమార్

................

జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ దార్ పుల్వామాలో 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుని నాలుగు రోజులు గడిచింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలకు ఎలా బదులిచ్చుకోవాలో తెలియక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజులు ఇల్లుదాటి బయటకు రాలేదు. కానీ, ఆ దాడి జరిగిన రోజు నుంచి పలువురు భారత నేతలు 'అయ్యో పాకిస్థాన్ పై నిందలు వేస్తున్నారే..' అంటూ చేసిన వ్యాఖ్యలు విని ఇమ్రాన్‌కు ధైర్యం వచ్చింది. మంగళవారం (19 ఫిబ్రవరి) నాడు మీడియా ముందుకొచ్చి పాత పాటే పాడాడు. పుల్వామా దాడితో పాక్‌కు సంబంధం లేదని, అన్యాయంగా తమపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని, యుద్ధం జరిగితే సిద్ధమేనని, తిప్పికొడతామని పాకిస్థాన్ పాత ప్రధానులు, అధ్యక్షుల మాటల్ని వల్లెవేశాడు.


ఇమ్రాన్‌కు ధైర్యం నూరి పోసిన ఆ భారతీయులెవరనేది తెలియాలంటే ఇమ్రాన్ మీడియా ముందుకొచ్చిన మంగళవారం నాటి పత్రికలు తిరగేస్తే సరిపోతుంది. అసలు దాడి జరిగిన రోజునే పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శివాలెత్తిపోయాడు. పంజాబ్‌ను ఏమన్నా ఫరవాలేదు గానీ... అమాయక పాకిస్తాన్‌ను పల్లెత్తు మాట అనొద్దు... అన్నట్టుగా ఉన్నాయి అతని వ్యాఖ్యలు. ఇదంతా పిరికిపందల చర్య అని, వారి దుశ్చర్యలకు పాకిస్తాన్‌ని నిందించడమేమిటని పొర్లి పొర్లి ఏడ్చాడు... ఇది చాలక తాను నిన్న మొన్నటి వరకూ బీజేపీలోనే ఉన్న సంగతి మర్చిపోయి 1999 నాటి కాందహార్ సంఘటనలో హస్తమున్నవారిని విడిచిపెట్టిందెవరని ఇప్పుడు అడుగుతున్నాడు.

ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కూడా పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలే చేశాడు. పాకిస్తాన్ పాత్రపై ఆధారాలుంటే చూపాలన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారత కశ్మీరీ అయితే పాకిస్తాన్‌ని నిందిస్తారా? అంటూ నికార్సైన పాకిస్తాన్ పౌరుడిలా భారత ప్రభుత్వాన్ని నిలదీశాడు.

చట్టబద్దమైన పదవిలో ఉన్న సిద్దు, సామాజిక కార్యకర్తగా ఎందరినో ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న స్వామి అగ్నివేశ్ ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని సామాన్య పౌరులు సైతం చీదరించుకుంటున్నారు. ఆదిల్ దార్‌తో ఈ ఘోరం చేయించిన ఉగ్రవాద సంస్థ జైషేమహమ్మద్ సంస్థ అతనితో రికార్డ్ చేసిన రెండు వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ జైషేమహమ్మద్ అధినేత మసూద్‌ అజర్‌ పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నాడు. ఇతని కుడి భుజం ఘాజీ రషీద్ నుంచే ఆదిల్ దార్ ఉగ్రవాద శిక్షణ పొందినట్లు ఆధారాలన్నీ బయటకొచ్చాయి. ఈ లోగా మంగళవారం నాడు జైషేమహమ్మద్ సంస్థ మరో వీడియో విడుదల చేసి పుల్వామా తరహా దాడి మరొకటి చేస్తామని హెచ్చరించింది. సిద్దూకి, అగ్నివేశ్‌కి ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?

గత ప్రభుత్వాల పాలనలోనూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో ఇలాంటి దాడులు చేసిన సంగతి తెలిసిందే... అప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా పాకిస్తాన్‌ని నిందించాయి. మరి ఆనాడు ఈ సిద్దు, అగ్నివేష్‌లు ఆధారాలు ఎందుకు అడగలేదు?

సిద్దు, అగ్నివేశ్‌ల ఆవేశం తగ్గిందో లేదో.. తాను మాట్లాడకపోతే కొంపమునిగిపోతుందన్నట్టు తమిళనాడు నుంచి కమల్ హాసన్ సీన్‌లోకి వచ్చాడు.  కశ్మీర్‌లో ఫ్లెబిసైట్ అంటూ వ్యాఖ్యలు చేసి చరిత్రకు సంబంధించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఈ విశ్వరూపుడికి కశ్మీర్‌లో పండిట్ల కష్టాలకు కారకులెవరో, లక్షలాది మంది పండిట్లను కశ్మీర్ నుంచి తరిమేసిందెవరో అవసరం లేదు. ప్లెబిసైట్ ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అక్కర్లేదు. ప్లెబిసైట్ ఫలితాన్ని బట్టి కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కి ఇచ్చేయాలని లేదా ప్రత్యేక దేశం చెయ్యాలని అడిగేవారిలో బహుశా ఈయనే ముందుంటాడేమో...

భారత్‌లో సిద్దూ , అగ్నివేశ్ , కమల హాసన్ లాంటివారున్నప్పుడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు అంతకంటే ఇంకేం కావాలి?

Monday 18 February 2019

ఇంత ఘోరం జరిగినా ఆ ఫోటో అక్కడే ఉంది...

జి.ఎస్. కుమార్

..............
మన రక్షణ కోసం జీవితాల్ని అంకితం చేసిన 40 మంది జవాన్లను కోల్పోయి జాతి యావత్తూ కన్నీరు పెడుతోంది. అసలు ఈ కన్నీటికి కారణం పాక్ ప్రేరేపిత ఉగ్రభూతం కాగా... ఆ ఉగ్రవాదానికి మూలం మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగిన దేశవిభజన. ఆ జిన్నా ఫోటో ఇప్పటికీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లో భారత్‌ను వెక్కిరిస్తూ వేలాడుతూనే ఉంది. దేశ విభజనకు కారకుడై లక్షలాది ప్రజల జీవితాల్ని అథోగతి పాలు చేసిన ఈ జిన్నా ఫోటోను తొలగించేందుకు ప్రయత్నిస్తే గతేడాది ఎంత గొడవ చేశారో తెలియంది కాదు. అక్కడి జిన్నా ఫోటోకు ఓటు వేసినవారిలో కాంగ్రెస్ నేతలు కూడా ఉండటం దురదృష్టకరం.

ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA). మొహాలీ క్రికెట్ స్టేడియంలోని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, గ్యాలరీ, లాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌ తదితర ప్రదేశాల్లో ఉన్న 15 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల ఫొటోలటన్నింటినీ తీసి పక్కన పడేసింది. వీటిలో పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, జావేద్‌ మియాందాద్‌, వసీమ్‌ ఆక్రమ్‌, అఫ్రీది ఫోటోలున్నాయి.


ఇక జిన్నా ఫోటో ఇంకా ఏఎంయులో ఎందుకని అడిగితే... ఆయనకు స్టూడెంట్ యూనియన్ సభ్యత్వం ఉందని, పైగా అదెప్పుడో ఆయన పాకిస్తాన్ డిమాండ్ చెయ్యక ముందటి ఫోటో అని కథలు చెబుతున్నారు. అలాగైతే హిట్లర్, ముస్సోలినీ లాంటి క్రూర నియంతల చిన్నప్పటి ఫోటోలు పెట్టుకుని... వీళ్ళు పెద్దయ్యాక కదా తప్పులు చేసిందని పూజలు చేస్తారా? PCA నిర్ణయం తెలిస్తే... దేశవిభజనకు, ఉగ్రవాదానికి నేరుగా సంబంధాలు లేని పాక్ క్రికెటర్ల ఫోటోలు ఎందుకు తొలగించారని కూడా రేపోమాపో ప్రశ్నిస్తారేమో... ఇలా ఉన్నాయి వీళ్ళ తెలివి తేటలు. ఆ వివాదం తర్వాత గతేడాది అక్టోబర్ నెలలో AMUలో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో గాంధీ-జిన్నాలు పక్కపక్కనే ఉన్న ఫోటోలను ప్రదర్శించారు.


ఒకవైపు దేశంలో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అందరూ ఏకమవుతున్నారు. చైనా, పాక్ తప్ప ప్రపంచమంతా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. గత నాలుగైదు రోజుల్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించడం, పోలీసులు కేసులు పెట్టి విచారణ చేపట్టడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా... ఈ మొత్తం దుష్పరిణామాలకు మూలమైన పాకిస్తాన్ కన్నతండ్రి జిన్నా ఫోటో మాత్రం.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ లో - మన చేతగాని సర్కారులను, జవాన్ల త్యాగాలను వెక్కిరిస్తూ ఇంకా అక్కడే ఉంది.

Sunday 17 February 2019

సిగ్గులేని మీడియా... సైన్యం పరువు తీస్తోంది*

జి.ఎస్. కుమార్

.........

కశ్మీర్‌లో ఉగ్రవాది ఆదిల్ దార్ నీచ కృత్యానికి 40 మంది జవాన్లు బలైపోయి జాతి యావత్తూ కంటతడి పెడుతుంటే, ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన ఒక వార్త ఉగ్రవాదికి వత్తాసు పలికేలా ఉంది. అమరులైన జవాన్ల ప్రాణత్యాగానికి తగిన నివాళి అర్పించడం వదిలేసి పరమ నీచస్థాయికి దిగజారిపోయింది మన మీడియా. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ చిన్నప్పుడు సైన్యం చేతిలో అవమానం పాలయ్యాడని, అందువల్లే అతను కక్ష పెంచుకుని ఈ పాపానికి ఒడిగట్టాడంటూ ఉగ్రవాది పట్ల సానుభూతి కలిగేలా అతని తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని గొప్ప వార్తగా చిత్రీకరించి జనం మీదకు వదిలారు.

అదే నిజమైతే, దాడికి మూలకారణమైన ఈ విషయాన్ని "మీరు ఈ వీడియో చూసేసరికి నేను స్వర్గంలో ఉంటా"నని దాడికి ముందు ఆదిల్ విడుదల చేసిన వీడియోలో ఎందుకు ప్రస్తావించలేదు? ఆ వీడియోను చిత్రీకరించిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు కూడా ఆ మాటలు రికార్డ్ చేయించే వారు కదా? ఆదిల్ తల్లిదండ్రులు మరో మాట కూడా చెప్పారని మన మీడియా రాసింది. అదేంటంటే... భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఆదిల్ భారత్‌కే మద్దతు పలికేవాడట. ఇదంతా అస్సలు పొంతన లేకుండా ఉందని మన మీడియా ఆ మాత్రం గ్రహించలేక పోయిందా? భారత సైన్యం చేతిలో అవమానం పాలై ఈ దేశాన్ని ద్వేషించి ఉగ్రవాది అయిన అదిల్, క్రికెట్ విషయంలో మాత్రం భారత్‌ను ప్రేమిస్తున్నాడంటే నమ్మాలా...

ఆ వీడియోలో ఆదిల్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. గోమూత్ర సేవనం చేసేవారి ప్రాణాలు తీయడమే తన లక్ష్యమన్నాడు. అంటే హిందువులే తన టార్గెట్ అని తేల్చి చెప్పాడు. ఇది పూర్తిగా మతపరమైన దాడి అని తెలుస్తూనే ఉంది. మరి మీడియా ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చెయ్యలేదు? వాస్తవాలను దాచాల్సిన అవసరమేంటి? ఇది ఇస్లామిక్ టెర్రర్ కాదా? హిందువుల విషయంలో అయితే ఏమీ లేనిదానికే హిందూ టెర్రర్ అని గగ్గోలు చేసిన మీడియాకు ఆదిల్ చేసిన పని ఇస్లామిక్ టెర్రర్ అనిపించలేదా? ఇదంతా మన పిరికిపంద మీడియా చేతగానితనం తప్ప మరొకటి కాదు.


ఇక Times of India తీరు మరీ ఘోరంగా ఉంది. దాడి చేసిన ఉగ్రవాది ఆదిల్ local youth అట. భారత ప్రభుత్వమే పాకిస్తాన్ పై నిందలు వేస్తోందట. ఆదిల్ ద్వారా ఈ దారుణం చేయించింది జైషే మహ్మద్ అని స్పష్టంగా తెలిసి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ పాక్ తీరును తప్పు పడుతుంటే Times of India లాంటి పత్రికలు మాత్రం భారత ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాయి. ఈ చర్య మన అమర జవాన్లను అవమానించడమే. మీడియా నైచ్యానికి పరాకాష్ట ఇది.

ఇదిలా ఉంటే, ఆప్ఘనిస్థాన్ నుంచి సేనల్ని ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయం తమ విజయమేనని తాలిబన్లు చేసిన ప్రకటన స్ఫూర్తితోనే అదిల్ సూసైడ్ బాంబర్‌గా మారాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ప్రచురించింది.
https://timesofindia.indiatimes.com/india/pulwama-suicide-bomber-was-inspired-by-taliban-victory-over-us-in-afghanistan/articleshow/68000323.cms

*దాడికి ముందు ఆదిల్‌తో రెండు వీడియోల్ని జైషే మహ్మద్ సంస్థ రికార్డ్ చేయించింది. ఈ రెండు వీడియోల్లోనూ సైన్యం చేతిలో అవమానం గురించి అతను మాట్లాడలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన తమ కుమారుడి పట్ల, తన కుటుంబం పట్ల సమాజంలో ద్వేషం కలుగుతుందేమోనన్న భయంతో సానుభూతి కోసం ఆదిల్ తల్లిదండ్రులు ఈ ప్రకటన చేసి ఉంటారు. కానీ, మీడియాకు బుర్ర ఉండాలి కదా. ఆ ప్రకటన ముందువెనుకలు ఆలోచించకుండా జనం మీదకు వదలటం ఎంతవరకూ సబబు?

ఈ సందర్భంగా మన మీడియా ఒక ముఖ్యమైన విషయాన్ని ఘోరంగా పక్కన పడేసింది...  ఒకనాడు ఉగ్రవాదిగా ఉన్న నజీర్ అహ్మద్ వాని ఆ తర్వాత వాస్తవాలు గ్రహించి ఆ మార్గాన్ని వదిలేస్తే భారత సైన్యం అక్కున చేర్చుకుని జవానుగా సేవలందించే భాగ్యం కలిగించింది. అతను కూడా అంతే చిత్తశుద్ధితో దేశం కోసం పనిచేసి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. అతని త్యాగాన్ని భారత ప్రభుత్వం గుర్తించి మరణానంతరం అశోక్ చక్ర అవార్డుతో గౌరవించింది. అలాంటి మన సైన్యం ఆదిల్‌ని అవమానించిందని ఆ కుటుంబం చెప్పడం... అది నమ్మి వార్తలివ్వడం ఎంత సిగ్గు చేటు?

*125 ఏళ్ల కిందట స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగంతో మన దేశం పట్ల విదేశీయులకు ఎంతో గౌరవం పెరిగింది. ఎందరో ఆయన శిష్యులై ఈ దేశానికి వచ్చారు. మన జాతి ఔన్నత్యాన్ని గురించి విదేశీయులు అర్థం చేసుకున్నారు గానీ, మన స్వదేశీ మీడియాకు ఇవేమీ అక్కర్లేదు. వీళ్ళను మార్చడానికి ఆయన మరోసారి పుట్టాలేమో...*