Wednesday 26 December 2018

హిందువులు అల్పసంఖ్యాకులే!!

సామవేదం షణ్ముఖశర్మ

...............

     భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు.        ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుతాం. హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.
        మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.
        ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.
        ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే.         నిజమైన హిందువులు వీరే.        దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.
        ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి.        వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే.        వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు.        ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ మా కులం వాడే రావాలి - కావాలిఅనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.        భారతదేశంలో నిన్న కాక మొన్న జరిగిన తాజా ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి పాకిస్తాన్‍కీ జై .....అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.
        ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న  పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు. కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.        కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు.        ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి.   గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు. వారు నోటావర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు.        ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం! స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని  వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం!

[ ఋషిపీఠం పత్రిక సౌజన్యంతో ]

Thursday 6 December 2018

ముస్లింలకేనట మొదటి హక్కు !

పెక్యులరిజం-23
ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.....................



మండువేసవి. మిట్ట మధ్యాహ్నం. స్కూలు నుంచి 3 కిలోమీటర్లు చెమటలు కక్కుతూ నడిచి 14 ఏళ్ల శ్రుతి ఇంటికొచ్చింది. ఒంటిమీద చెంబెడు నీళ్లు కుమ్మరించుకుందామంటే పెరట్లో కుండ ఖాళీ. వీధి నల్లాలో రెండురోజులుగా నీళ్లు రావటం లేదు.

ఉసూరుమంటూ కూలబడి 'అమ్మా! ఆకలేస్తోంది అన్నం పెట్టు' అంది. కంచంలో అన్నం తెచ్చిన తల్లికి బిడ్డ కళ్లనీళ్లతో కనిపించింది. 'ఎందుకమ్మా! ఏమైంది' అంటే జవాబివ్వలేదు. వెక్కుతూ అన్నం తిని, కాసేపటికి స్థిమిత పడ్డాక రెట్టించి అడిగితే కారణం చెప్పింది.

తనతోపాటు చదువుకునే అమీనాకు గవర్నమెంటు  కొత్త సైకిలు ఇచ్చిందట. తనలాగా కాళ్లుకాలే ఎండలో బోలెడు దూరం నడవాల్సిన బాధ లేకుండా ఆ పిల్ల హాయిగా సైకిలెక్కి తిరుగుతున్నదట. ఈ సంగతి చెప్పి 'అమ్మా! నాకూ సైకిల్‌ కావాలి' అంది శ్రుతి ఆశగా.

'నీకు సైకిల్‌ కొనిచ్చేంత శక్తి మీ నాన్నకు లేదమ్మా' అంది తల్లి.

'అమీనాకు ఇచ్చినట్టు గవర్నమెంటు నాకెందుకు సైకిల్‌ ఇవ్వదు?'

'అమీనా ముస్లింకదమ్మా! 9, 10 క్లాసుల్లోని ముస్లిం, క్రిస్టియన్‌ అమ్మాయిలకే తప్ప హిందువుల పిల్లలకు సర్కారు సైకిళ్లను ఇవ్వదు తల్లీ!'

'అలాంటప్పుడు మనమెందుకు ముస్లింలము కాకూడదు? అప్పుడు నాకూ అమీనా లాగా సైకిలు దొరుకుతుంది కదా?'

కూతురు వేసిన ప్రశ్నకు తల్లి మనసులో తుఫాను లేచింది.

'లేదమ్మా లేదు. సైకిలు కోసం మనం మతం మారకూడదు. దిగులు పడకు. నా గాజులైనా కుదవబెట్టి నీకు సైకిల్‌ కొనిస్తానులే' అంది తల్లి. శ్రుతి సంతోషంతో గంతులేసింది.

ఐదారేళ్ల కింద సోషల్‌ మీడియాలో తెగ తిరిగిన కథ కాని కథ ఇది.

సంకర సెక్యులర్‌ భారతదేశంలో హిందువుగా పుట్టటం శాపం! జనాభాలో 80 శాతం ఉంటేనేమి వారు ప్రభుత్వాల నుంచి ఏ ఉపకారానికీ నోచుకోరు. కడుపేద హిందూ పిల్లల మీద కూడా సర్కారుకు కనికరం ఉండదు. సైకిళ్లయినా, స్కాలర్‌షిప్పులైనా, లోన్లయినా, ఫీజుల రాయితీలైనా ఇతర మతాల వారికి మాత్రమే.

మహమ్మదీయుల పాలన నడచినన్ని శతాబ్దాలూ ఏ రంగంలోనైనా ఏ విషయంలోనైనా మహమ్మదీయులకే ప్రాధాన్యం. తెల్లవాళ్లు రాజ్యమేలిన నూట యాభై ఏళ్లూ క్రైస్తవులది రాజభోగం. స్వతంత్రం అనబడేది వచ్చిందన్న తరువాత కూడా హిందువులు సెకండ్‌ క్లాసు సిటిజన్లు. సహాయాలు, రాయితీలు అన్నీ ముస్లింలూ క్రిస్టియన్లకే.

ఇది 'నవభారత నిర్మాత'గా కీర్తించబడే నెహ్రూ చాచా పెట్టిన ఒరవడి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెసు సర్కార్లన్నీ నిష్ఠగా పాటిస్తున్నదే కాబట్టి ఆధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదని అర్థశతాబ్దం పాటు అనుకున్నారు. హిందువులకు అంతో ఇంతో అనుకూలమైన ప్రభుత్వం వచ్చి పడ్డాకగానీ హిందూ ద్వేషులు తమ పొరపాటును గ్రహించలేదు. వెలిగిపోతున్నాననుకున్న వాజపేయి సర్కారు మలగిపోయి సోనియామాత చల్లని రాజ్యం వచ్చీరాగానే హిందువులను ఆధికారికంగా అణగదొక్కే పుణ్యకార్యం పకడ్బందీ పథకం ప్రకారం చకచకా జరిగిపోయింది.

ఏదైనా వెధవ పని చేయాలనుకున్నప్పుడు జనాన్ని మభ్యపెట్టేందుకు బతకనేర్చిన సర్కార్లకు అలవాటైన విద్య ఒకటుంది. ముందుగా ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను వేస్తారు. తమకు కావలసిన రీతిలో దానినుంచి నివేదిక రాబడతారు. తరవాత కమిషన్‌ను పీటల మీద కూచోబెట్టి అది సూచించిందే చేస్తున్నామంటూ - తాము చేయదలిచింది చేసి పడేస్తారు. ఇక్కడా అదే నాటకం ఆడారు.



2004 ఎన్నికల తరవాత ప్రధానమంత్రి కుర్చీలో తన బినామిగా ఇటలీ పెద్దమ్మ కూచోబెట్టిన మన్‌మోహన్‌సింగ్‌ అనే కీలుబొమ్మ దగ్గరికి 26 గురు ముస్లిం ఎంపీలు, ముగ్గురు ముస్లిం మంత్రుల ప్రతినిధి వర్గం వెళ్లి ఓ మెమోరాండం ఇచ్చింది. అది చేతికందీ అందగానే 2005 మార్చి 9న ఓ హైలెవెల్‌ కమిటీని వేశాడు. ఇండియాలో ముస్లిం సమాజం తాజా స్థితిగతులను పరిశీలించి రిపోర్టు ఇమ్మని దానిని పురమాయించారు. పాలకవర్గానికి సన్నిహితుడుగా పేరుపడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌జస్టిస్‌ రాజీందర్‌ సచార్‌ను ఏరికోరి దానికి అధిపతిగా నియమించారు. మెంబర్‌ సెక్రటరీ ముస్లిం. ఐదుగురు మెంబర్లలో నలుగురు ముస్లింలు. ఐదవవాడు కమ్యూనిస్టు అడ్డా అయిన ఢిల్లీ జవహర్లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసరు.

సచార్‌ కమిటీ తనకు అప్పజెప్పిన పనిని నమ్మకంగా పూర్తి చేసి 2006 నవంబర్‌ 17న నివేదిక సమర్పించింది. కీలుబొమ్మ సర్కారు అసాధారణ వేగంతో కదిలింది. నివేదిక ఇలా అందగానే అలా, మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి జనాబ్ ఎ.ఆర్‌.అంతూలే నవంబర్‌ 30న పార్లమెంటు ముందు ఉంచాడు. అన్నట్టు మున్నెన్నడూ లేని మైనారిటీ వ్యవహారాల శాఖను అంతకుముందే (2006 జనవరి 29న) కేంద్ర కేబినెట్లో కొత్తగా గజ్జె కట్టించారు.

403 పేజీల మహా నివేదికలో ఏమి తేల్చారో తెలుసుకుందుకు మొత్తం గ్రంథం చదవాల్సిన పనిలేకుండా తమ అద్భుత పరిశోధన సారాన్ని రెండో పేజీలోనే ప్రకటించారు ఇలా :

“The Muslims, the largest minority community constituting 13.4 per cent of the population, are seriously lagging behind in terms of most of the human development indicators”.
(జనాభాలో 13.4 శాతం ఉన్న అతిపెద్ద మైనారిటీ సమాజమైన ముస్లింలు మానవ అభివృద్ధికి పరిగణించే సూచీలలో అత్యధిక సూచికల ప్రకారం సీరియస్‌గా వెనకబడ్డారు.)

అది పచ్చి అబద్ధం. అయితేనేమి? రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడన్నట్టు యు.పి.ఎ. సర్కారు కావాలనుకున్నదే హైలెవెల్‌ కమిటీ నివేదికలో ఉంది. అందుకు బినామీ ప్రధాని బోలెడు సంతోషపడ్డాడు. నివేదికను పార్లమెంటు ముందు పెట్టి పదిరోజులు తిరక్కుండా (2006 డిసెంబర్‌ 9న) జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌.డి.సి.) సమావేశంలో అదే ఊపున ఈ దేశ ప్రధానమంత్రి ఒక అద్భుతమైన విధాన ప్రకటన చేశాడు :

“Minorities, particularly Muslims must have the first claim on national resources.”
(మైనారిటీలు, అందునా ముఖ్యంగా ముస్లింలకు జాతీయ వనరులపై మొదటి హక్కు ఉంది.)

ఏ రకంగా చూసినా ఇది బుద్ధి తక్కువ మాట. ఎక్కడైనా జాతీయ వనరుల మీద జాతి జనులందరికీ సమాన హక్కు ఉంటుంది. జనాభాలో కేవలం 20 శాతం ఉన్న మైనారిటీలకు (అందులోనూ ముఖ్యంగా మహమ్మదీయులకు) మొదటి హక్కు ఉంటుంది అనడమంటే 80 శాతం ఉన్న మెజారిటీకి ప్రథమ హక్కును నిరాకరించడమే ! 80 శాతం ఉన్న హిందువులను దేశంలో రెండో తరగతి కింద దిగజ్చారడమే !

''రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకుని, ఎవరి మీద కక్షగాని, పక్షపాతం లేకుండా ప్రజలందరి పట్లా సవ్యంగా వ్యవహరిస్తానని'' ప్రధానమంత్రిగా పదవీ స్వీకారానికి ముందు ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి ముస్లిముల పట్ల పక్షపాతం చూపి, వనరుల్లో మొదటిహక్కు వారిదేనని, 80 శాతం ప్రజలకు హక్కు లేదని సిగ్గుఎగ్గు లేకుండా ఎలా అనగలిగావని అప్పుడే అందరూ కీలుబొమ్మ ప్రధానమంత్రి గొంతు పట్టుకుని ఉండాల్సింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని శాఖల అధికారులు కొలువుతీరిన ఎన్‌.డి.సి. వేదిక మీద ఈ తెంపరి ప్రకటన చేసినందుకు, ఒక్క రాజకీయ వికర్ణుడూ ఆక్షేపించలేదు. మతం కారణంగా ఏ పౌరుడి పట్లా రాజ్యం వివక్ష చూపదని 15వ అధికరణం ఇచ్చిన రాజ్యాంగ వరాన్ని కాలరాచి వనరుల వినియోగంలో మమ్మల్ని దారుణ వివక్షకు గురి చేసే హక్కు మీకెక్కడిదని హిందూ సమాజం మండిపడలేదు. ఏ పత్రికా, ఏ టీవీ ఛానెలూ, ఏ హిందూ మేధావీ ఈ దుర్మార్గానికి పెద్దగా స్పందించలేదు. భయపడినంత ప్రతిఘటన హిందూ సమాజం నుంచి లేకపోవటంతో యు.పి.ఎ. దొరతనం పట్టపగ్గాలు లేకుండా బరితెగించింది. విద్య, ఉపాధి, ఆర్థిక విషయాలకు సంబంధించి ముస్లింలకు, ఇతర మైనారిటీలకు ప్రధానమంత్రి 15 పాయింట్ల కొత్త ప్రోగ్రాం'' కింద వేలకోట్ల రూపాయల భూరివరాలు ప్రకటించింది.

ఆ వివరాల్లోకి వెళ్లేముందు కొన్ని వాస్తవాలను గమనించాలి.

1. సచారయ్య హై లెవెల్‌ కమిటీకి ప్రధానమంత్రి పురమాయించిన పని సాంఘిక, ఆర్థిక, విద్యారంగాల్లో ముస్లింల స్థితిగతులపై నివేదిక ఇమ్మని! ముస్లింలు కాక ఇతర మైనారిటీ వర్గాల పరిస్థితి పరిశీలించమని ప్రభుత్వం అడగలేదు. కమిటీ పరిశీలించనూ లేదు.

2. తాము సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని గాని, తమను ఆదుకుని పైకి తేవాలని గాని క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, పార్శీ మైనారిటీలు ప్రభుత్వాన్ని ఏనాడూ దేబిరించలేదు. అసలు తాము వెనకబడి ఉన్నామన్న భావనే ఆ వర్గాలకు లేదు. వారికి లేని వెనుకబాటును మన్‌మోహన్‌ సర్కారు పనిగట్టుకుని వారికి అంటగట్టింది. ముస్లింల సంగతి చూడమని సచార్‌ కమిటీకి చెప్పి, దాని నివేదికను అడ్డం పెట్టుకుని ముస్లింలకు, వారితోబాటు ఇతర మైనారిటీలకూ ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అది మిగతా మైనారిటీల మీద వల్లమాలిన ప్రేమతో కాదు. కేవలం ముస్లింలకే ఉపకారం చేస్తే ఒక్క మతం వారి మీద పక్షపాతం చూపారన్న చెడ్డపేరు వస్తుంది. అందుకే ఎవరూ అడగకపోయినా మిగతా మతాలవారినీ ఈ ఛత్రం కిందికి తెచ్చి, మైనారిటీల సంక్షేమం వంకన ప్రధానంగా ముస్లింలకు భూరి వరుమానాలు విరజిమ్మారు.

3. మైనారిటీలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి, వారి అవసరాలేమిటో కనుక్కోవాలి అన్న నిజాయతీ యు.పి.ఎ. సర్కారుకు నిజంగా ఉండి ఉంటే దానికోసం ప్రత్యేకంగా ఒక హైలెవెల్‌ కమిటీని వేయాల్సిన అవసరమే లేదు. మైనారిటీల మంచిచెడ్డలు చూడటం కోసమే, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు సూచించడం కోసమే, వారికి అన్ని విధాల న్యాయం జరిగేందుకు పాటుపడటం కోసమే ఎప్పుడో 1993 లోనే చట్టబద్ధంగా ఏర్పాటైన నేషనల్‌ మైనారిటీస్‌ కమిషన్‌ ప్రభుత్వానికి అందుబాటులో ఉండనే ఉన్నది. ఒక్క ముస్లింలే కాదు, ఏ మతానికి, ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా సాధికారికంగా సేకరించడానికి కావలసిన అన్ని హంగులు దానికి ఉన్నాయి. రాజ్యంగబద్ధంగా పార్లమెంటు ప్రత్యేక చట్టంకింద ఏర్పాటైన ఆ సాధికారిక సంస్థను వదిలేసి, కేవలం ఒక మైనారిటీ మతం కోసం పనిగట్టుకుని ఒక హైలెవెల్‌ కమిటీని వేయటమే ఆక్షేపణీయం, అభ్యంతరకరం.

4. పోనీ ఆ హైలెవెల్‌ కమిటీ అయినా తిన్నగా పని చేసిందా? ఏ దేశంలో ఏ సామాజిక వర్గమైనా ఏ స్థితిలో ఉంది, ఏ మేరకు అభివృద్ధి చెందింది అన్నది మదింపు చేయడానికి ప్రపంచమంతటా అందరూ అంగీకరించిన సూచికలు ఇవి.

1. శిశు మరణాలు, 2. ఆయుః ప్రమాణం, 3. పట్టణీకరణ స్థాయి, 4. అక్షరాస్యత, 5. ఆర్థిక స్తోమత.

వీటికి సంబంధించి వాస్తవ గణాంక వివరాలు పబ్లిక్‌ డొమెయిన్‌లో ఎవరికైనా అందుబాటులో ఉన్నాయి. ఒక్క అక్షరాస్యత విషయంలో మాత్రమే హిందువుల (65%) కంటే ముస్లింలు (59%) కొంచెం వెనకబడి ఉన్నారు. సగటు గణాంకం కంటే స్వల్పంగా వెనకబడినంత మాత్రాన ఒక సామాజిక వర్గం విద్యావిషయకంగా వెనకబడిందని చెప్పటానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (AIR 1963 SC 649) ప్రకారం ముస్లింల అక్షరాస్యత జాతీయ సగటు కంటే 5 శాతం తగ్గటం భారీ వెనకబాటు కిందికి రానేరాదు.

ఇక పట్టణ ప్రాంతాల శిశుమరణాల్లో హిందువుల (54.7శాతం) కంటే ముస్లింలు (44.8శాతం) చాలా నయం అని 2005-06 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-3) గణాంకాలు చెబుతాయి. గ్రామ ప్రాంతాల్లోనూ ముస్లిం శిశుమరణాలు (82.2 శాతం) హిందువుల (82.5 శాతం) కంటే మేలే!

పట్టణీకరణలో హిందువుల (26 శాతం) కంటే ముస్లింలు (36 శాతం) ఎంతో ముందున్నారు. హిందువుల సగటు ఆయుః ప్రమాణం 65 ఏళ్లు కాగా ముస్లింలది దానికంటే 3 ఏళ్లు ఎక్కువ (68). అలాగే 2006-07 జాతీయ సర్వే ప్రకారం సగటు కుటుంబ వ్యయం హిందువులది రూ.40,009 కాగా ముస్లింలది రూ.40,327. తేడా చాలా స్వల్పం.

ఇలా ప్రపంచంలో నిపుణులందరూ అనుసరించే ఏ కొలమానాన్ని బట్టి చూసినా దేశంలో మహమ్మదీయుల పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదు. శిశుమరణాలు, ఆయుఃప్రమాణం వంటి మూడు ముఖ్యమైన మానవాభివృద్ధి సూచికల ప్రకారం ముస్లింల స్థితి హిందువులకంటే మెరుగ్గా ఉన్నదని సచార్‌ కమిటీ నివేదికే అంగీకరించింది. అయినా - వంకపెట్టలేని జాతీయ సర్వేలనూ, 2001 జనాభా లెక్కలనూ, శాస్త్రీయ అధ్యయనాలనూ కమిటీ పక్కకు నెట్టింది. ముస్లింలు మహా దరిద్రంలో గంపెడు సంసారాలతో కొట్టుమిట్టాడుతున్నారని కొన్ని దశాబ్దాలుగా మార్క్సిస్టు, ముస్లిం మేధావులు ఏ ఆధారాలు లేకుండా వినిపిస్తూ వచ్చిన వాదనకే సచార్‌ బృందం తందాన తాన అంది. దేశంలో అన్ని మతాలలోకీ మహమ్మదీయులే మహా వెనకబడి, నానా బాధలు పడుతున్నారని రడీమేడ్‌ నివేదిక ఇచ్చి హైలెవెల్‌ కమీటి లోలెవెల్‌కి దిగజారింది.



దాన్నే అక్షర సత్యంగా ఔదలదాల్చి, పనిలో పనిగా ఇంకో నాలుగు మైనారిటీ మతాలను కూడా ముస్లింలకు తోడు చేసి, మైనారిటీ సంక్షేమం పేరుపెట్టి, వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని హిందువులకు మాత్రం అందనివ్వకుండా సోనియా జమానా విరజిమ్మింది ఇలా :

- ఏడాదికి 25 లక్షల చొప్పున ప్రీమెట్రిక్యులేషన్‌ స్కాలర్‌షిప్పులు. వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించని ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ, సిక్కు, పార్శీల పిల్లలకు మాత్రమే! వారి పిల్లలకు కిందటి ఫైనల్‌ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కన్నవారి వార్షిక ఆదాయం అరలక్ష కంటే తక్కువ అయి, కిందటి ఫైనల్‌ పరీక్షలో 90శాతం మార్కులు తెచ్చుకున్నా సరే హిందువుల పిల్లలకు మాత్రం పైసా కూడా ఇవ్వరు.

- 2 లక్షల లోపు సాలుసరి ఆదాయం, మెట్రిక్‌ (10వ తరగతి) పరీక్షలో 50 శాతం మార్కులు ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ, సిక్కు, పార్శీ పిల్లలకు 11వ తరగతి నుంచి పి.హెచ్‌.డి. స్థాయి వరకూ ఏడాదికి 5 లక్షలకు పైగా స్కాలర్‌షిప్పులు. 99 శాతం మార్కులు తెచ్చుకున్న నిరుపేద హిందూ పిల్లలకు మాత్రం నోట్లో మట్టిగడ్డ.

- వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలలోపు ఉన్న మైనారిటీ పిల్లలకు పై చదువులకు తీసుకునే లోన్లమీద వడ్డీ పూర్తిగా సబ్సిడీ. షెడ్యూల్డు కులాలు, తెగలు, ఒ.బి.సి.లకు చెందిన హిందువుల పిల్లలకు ఈ సదుపాయం ససేమిరా వర్తించదు.

- టెన్త్‌లో కనీసం 55 శాతం మార్కులు తెచ్చుకుని ప్లస్‌టు (ఇంటర్‌)లో చేరిన మైనారిటీల అమ్మాయిలకు తండ్రి ఆదాయం సాలుకు లక్ష లోపు అయితే - మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అనబడే కేంద్ర ప్రభుత్వ పోషిత సంస్థ ద్వారా ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్పులు.

- హయ్యర్‌ సెకండరీ, డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకున్న మైనారిటీల పిల్లలకు పై చదువుల్లో 20 వేల స్కాలర్‌షిప్పులు.

- ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. లాంటి టాప్‌ విద్యాసంస్థల్లో చేరే మైనారిటీల పిల్లలకు మొత్తం ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది.

- కాలేజి అడ్మిషన్ల కోసం కోచింగ్‌ సెంటర్లలో చేరే మైనారిటీల పిల్లలకు ఫీజులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపు.

- 9, అంతకంటే పై తరగతిలో చదువుతున్న మైనారిటీల అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఫ్రీగా సైకిళ్లు.

(ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలకు ఆధారం : ఢిల్లీకి చెందిన రిటైర్డ్‌ ఐ.పి.ఎస్‌. ఆధికారులు రామ్‌కుమార్‌ ఓహ్రీ, జైప్రకాశ్‌ శర్మలు వెలువరించిన పరిశోధన గ్రంథం "The Majority Report")

Saturday 24 November 2018

మైనారిటీల స్వర్గం... హిందువులకు తప్ప !

పెక్యులరిజం - 22
ఎం.వి.ఆర్.శాస్త్రి

........

ఇంటిపేరు సమానత్వం ! ఇల్లంతా అసమానతల దుర్గంధం !! చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం.
కాని 'ఇండియా దటీజ్‌ భారత్‌'లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు.

ఉన్నవి రెండే తరగతులు

1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. ఈ రకం అసమానత ప్రపంచమంతటా ఉన్నదే ననుకోండి.

సంఖ్యాపరంగా బలవంతులైన వాళ్లు ఎక్కువ సమానులు. అల్పసంఖ్యాకులైన బలహీనులు తక్కువ సమానులు. ఇది సాధారణం లోకరీతి. మన విషయం దీనికి పూర్తిగా విరుద్ధం.

జనాభాలో 80 శాతం ఉన్న హిందువులు ఏ ప్రత్యేక హక్కుకూ నోచుకోని తక్కువ సమానులు.

నిండా 20 శాతం లేని అన్యమతస్థులేమో సమస్త ప్రత్యేక హక్కులూ ఉన్న ఎక్కువ సమానులు. మతం కారణంగా ఏ భారత పౌరుడిపట్లా వివక్ష చూపే ముచ్చటే లేదంటుంది 15వ అధికరణం.

కాని వాస్తవానికి ఉన్న వివక్షంతా మతం కారణం గానే. మైనారిటీ అన్న గుర్తింపు ఉంటే చాలు. గవర్నమెంటు పోరు, పీడ లేకుండా గుళ్లూ గట్రా నడుపుకోవచ్చు.

ప్రభుత్వం గొంతు పట్టుకొని నిధులూ, అనుమతులూ రాబట్టి మతపరమైన చదువులు పిల్లలకు చెప్పించవచ్చు.

ఎవరికి లాభసాటి అయిన విద్యాసంస్థను వారు ప్రభుత్వ పెత్తనాల బాధలేకుండా యధేచ్ఛగా పెట్టుకోవచ్చు.

చదువుల్లో, కొలువుల్లో, సంక్షేమ పథకాల్లో సెక్యులర్‌ సర్కార్ల నుంచి పబ్లిగ్గానో, గుంభనంగానో బోలెడు

ఉపకారాలు పొందవచ్చు. ఈ రకంగా మన నాయకులూ, పార్టీలూ, ప్రభుత్వాలూ బహు కష్టపడి మనదేశాన్ని 'మైనారిటీల స్వర్గం' చేశారు. చాలా బాగుంది. దీనంతటికీ కారణం మైనారిటీల మీద ప్రేమా? మెజారిటీ మతం మీద ద్వేషమా? మైనారిటీల మీద ప్రేమ ధారాళంగా కారి పోతూండటం వల్లే ఈ ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక హక్కులూ

ధారపోశారనుకుంటే- ఆ ప్రత్యేక సౌకర్యాలన్నీ ఏ మతానికి చెందిన మైనారిటీలకైనా సమానంగా సమకూర్చాలి కదా? తమ దేశంలో తాము మైనారిటీలుగా మారే దుర్గతి కలలోకూడా పట్టకూడదనే ఏ హిందువైనా కోరుకుంటాడు.

కాని అడ్డూ అదుపూ లేకుండా చిరకాలంగా సాగుతున్న అడ్డగోలు మతాంతరీకరణల వల్ల, ఇంకా ఇతర కారణాల

వల్ల ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో హిందువుల సంఖ్య దారుణంగా పడిపోయింది.

2011 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్రాల్లో హిందువుల శాతం ఇదిగో ఇలా ఉంది :

1. మిజోరం - 2.75% 2. నాగాలాండ్‌ - 8.75% 3. మేఘాలయ - 11.53% 4. జమ్మూ, కాశ్మీర్‌ - 28.44% 5. అరుణాచల్‌ప్రదేశ్‌ - 29.00% 6. మణిపూర్‌ - 31.39% 7. పంజాబ్‌ - 38.40% కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లోనైతే హిందువులు కనాకష్టంగా 2.5 శాతం.
మరి ఈ రాష్ట్రాల్లో మైనారిటీలైన హిందువులకు 'మైనారిటీ' అన్న గుర్తింపు ఉందా? రాజ్యాంగపరంగా,

చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మిగతా మైనారిటీలు పొందుతున్న ఉపకారాలకూ, ప్రత్యేక హక్కులకూ లేక

రక్షణలకూ ఆ రాష్ట్రాల్లో హిందువులకు అర్హత ఉన్నదా? లేదు. మైనారిటీ అయిన రాష్ట్రాల్లో కూడా హిందువులు మెజారిటీ కిందే లెక్క. జనాభాలో అన్యమతాల వారే

అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో సైతం అన్యమతాల వారు మైనారిటీ కిందే పరిగణన! ఉదాహరణకు మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు. అయినా చట్టం

దృష్టిలో ఆ రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులు పాపం మైనారిటీలే! ఉన్నదంతా వారే! పెత్తనం, అధికారం యావత్తూ

వారిదే! అయినా రాజ్యాంగ రక్షణలు, మైనారిటీ హక్కులు కూడా వారివే. నిండా పదిశాతం లేని హిందువులు

ఆ రాష్ట్రాల్లో సైతం ఏ రక్షణకూ నోచుకోని, ఏ ప్రత్యేక సహాయమూ అవసరం లేని మెజారిటీయే -

మన దిక్కుమాలిన చట్టాల దృష్టిలో. జమ్మూకాశ్మీర్‌ సంగతి ఇంకా ఘోరం. అక్కడ హిందువులు ఒకప్పుడు బాగా బతికిన వారే.

పావుశతాబ్దం కిందట ముస్లింలు వారి ఇళ్లు తగలబెట్టి, ఊచకోత కోసి, దారుణంగా హింసించి కాశ్మీర్‌లోయ

నుంచి లక్షల మందిని బలవంతంగా వెళ్లగొట్టారు. మాన, ప్రాణాలకు భద్రత లేనందున ఎన్నో లక్షలమంది

వలసపోయారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు మహమ్మదీయులు 69 శాతం. హిందువులది 28 శాతం. అయితేనేమి?

చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అక్కడ కూడా దిక్కులేని హిందువులే మెజారిటీ అనుకోవాలిట. మైనారిటీ

హక్కులు కూడా మెజారిటీ అయిన మహమ్మదీయులకేనట! ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఎందుకిలా? మహమ్మదీయులకు, క్రైస్తవులకు మాత్రమే మైనారిటీ హోదా;

జన సంఖ్య ఎంత తక్కువైనా హిందువులకు ఆ ప్రాప్తం లేదు - అని రాజ్యాంగం చెప్పిందా? దాదాపుగా లక్షన్నర (1,45,000) పదాలు, 5 తక్కువగా 400 అధికరణాలు ఉన్న మన అతి పేద్ధ

రాజ్యాంగ గ్రంథంలో మైనారిటీల ప్రస్తావన ఉన్నది నాలుగే నాలుగు చోట్ల! 30వ అధికరణంలో 2 సార్లు;

29, 30 అధికరణాల హెడ్‌నోట్లలో చెరోసారి. అంతే! 1947 ఏప్రిల్‌ 16న ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ నిర్మాణ సభకి సబ్‌కమిటీ నివేదించిన

ముసాయిదాలో ఇప్పటి 30వ అధికరణం ఊసే లేదు. తరువాత కె.ఎం.మున్షీ ఉబలాటం వల్ల ఆ ముసాయిదాలోకి

ఇప్పటి 29వ అధికరణం వచ్చిచేరింది. అందులో కూడా 'మైనారిటీ' అన్న పదాన్ని అంబేద్కర్‌ గారు తీసివేసి,

దానిలో పేర్కొన్న హక్కులను 'అన్ని వర్గాల పౌరులకూ' చెందేట్లు మార్చారు. పాఠాన్ని సరిదిద్దిన తరువాత కూడా 29వ అధికరణం హెడ్‌ నోటులో 'మైనారిటీ' పదం పొరపాటున మిగిలిపోవడం వేరే సంగతి. రాగా పోగా రాజ్యాంగంలో మైనారిటీల ప్రస్తావన ఉన్నది నికరంగా ఒక్క 30వ అధికరణంలోనే! తాము కోరుకున్న విద్యాసంస్థలను నెలకొల్పి, నడుపుకునేందుకు, ప్రభుత్వం నుంచి ఎయిడ్‌ పొందేందుకు

30వ అధికరణం మైనారిటీలకు వరమిచ్చింది. ఆ వరం జాతీయ స్థాయిలో మైనారిటీలైన ముస్లిం, క్రిస్టియన్‌ వగైరా మతాల వారికి మాత్రమేననీ - హిందూ మతానికి అది ఎంతమాత్రమూ వర్తించదనీ రాజ్యాంగంలో రాసిపెట్టారా? లేదు. 30వ అధికరణంలో పేర్కొన్నది కేవలం జాతీయ స్థాయి మైనారిటీలను కాదు. ఆ మాటకొస్తే మతపరమైన

మైనారిటీలను మాత్రమే కాదు. "All Minorities, Whether based on religion or language"

(మతము లేక భాష రీత్యా మైనారిటీలు అయిన వారందరు) అని ఆ అధికరణంలో ఉంది. మరి ఆ మైనారిటీలను నిర్ధారించటం ఎలా? నాలుగు చోట్ల 'మైనారిటీలు' అన్నారే తప్ప మైనారిటీ అనగా ఏమి? దానిని ఎలా నిర్ణయించాలి?

అన్నది రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు. జాతీయ స్థాయి జనాభా శాతాలను బట్టి మైనారిటీ ప్రతిపత్తి

ఉంటుందన్న షరా అసలే లేదు. కోరిన విద్యా సంస్థలను యథేచ్ఛగా నడుపు కోవటానికి 30వ అధికరణం.. సంస్కృతినీ, భాషనూ,

లిపినీ కాపాడుకునేందుకు 29వ అధికరణం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని వినగానే 'మైనారిటీ'

అన్న గుర్తింపు కోసం వెంపర్లాట ఎక్కడెక్కడి వారికీ మొదలైంది. మత పరంగా, భాష పరంగా తమను మైనారిటీగా

గుర్తించాలంటూ కోర్టులో విరివిగా కేసులు పడ్డాయి. ఆ స్థితిలో 'మైనారిటీ' అన్న మాటకు అర్థమేమిటి?

దానిని ఎలా నిర్ణయించాలి అన్న అంశంపై పదకొండు మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం

TMA Pai Foundation కేసులో (2002 (8) SCC 481) దృష్టి సారించి, ఈ కింది ధర్మనిర్ణయం చేసింది: “Linguistic and religious minorities are covered by the expression ‘minority’ under

Article 30 of the Constitution. Since reorganisation of the States in India has been on

linguistic lines, for the purpose of determining the minority, the unit will be the State
and not the whole of India. Thus religious and linguistic minorities, who have been put on
a par in Article 30, have to be considered statewise.”

(30వ అధికరణంలో 'మైనారిటీ' అన్న పదం కిందికి భాషపరమైన, మతపరమైన మైనారిటీలు వస్తారు.

ఇండియాలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాష ప్రాతిపదికన జరిగింది కాబట్టి భాషాపరంగా మైనారిటీలను


నిర్ణయించడానికి మొత్తం దేశాన్ని కాక, రాష్ట్రాన్ని మాత్రమే యూనిటుగా తీసుకోవాలి. భాష, మత పరమైన


మైనారిటీలను 30వ అధికరణం ఒకే ఫాయాలో ఉంచినందువల్ల ఆ రెండు రకాల మైనారిటీలనూ రాష్ట్రాల


వారీగానే నిర్ణయించాలి.)


ఒక భాష మాట్లాడే హిందువులు వేరే భాష మాట్లాడే ప్రాంతానికి వలసపోతే కొత్తచోట వారు భాషాపరమైన

మైనారిటీగా గుర్తింపు పొందుతారు. మరి జాతీయ స్థాయిలో మెజారిటీ అయిన హిందువులు తమ రాష్ట్రంలోనే

అల్పసంఖ్యాకులైతే..? మైనారిటీల నిర్ధారణకు రాష్ట్రం ప్రాతిపదిక అన్న సూత్రాన్ని బట్టి ఆ రాష్ట్రంలో వారు

మైనారిటీలే కావాలి కదా? 'ఔను' అని ఉన్నత న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో ప్రకటించాయి. ఉదాహరణకు పంజాబ్‌లో ఇలాంటిదే
ఒక సమస్య వచ్చింది. అక్కడ డి.ఎ.వి.కళాశాలలు నడిపే ఆర్యసమాజ్‌ వారు తాము మైనారిటీలమన్నారు.

దేశవ్యాప్తంగా హిందువులు మెజారిటీ కాబట్టి ఒక రాష్ట్రంలో మీరు మైనారిటీ అనడం కుదరదని ప్రభుత్వ పక్షం

వాదించింది. దానిపై సుప్రీంకోర్టు-
“Arya Samaj is who were Hindus, were a religious minority in the State of Punjab, even though

they may not have been so in relation to the entire country. What constitutes a linguistic or


religious minority must be judged in relation to the State and not in relation to the whole of


India.”

(మొత్తం దేశంలో కాకపోయినా పంజాబ్‌ రాష్ట్రంలో హిందువులు మతపరంగా మైనారిటీలు.

కాబట్టి హిందువులైన ఆర్య సమాజికులు పంజాబ్‌లో మైనారిటీలే. భాషాపరంగా గాని, మతపరంగా గాని ఏది


మైనారిటీ అనేది మొత్తం దేశాన్ని బట్టి కాక రాష్ట్రాన్ని బట్టే తేల్చాలి).
- అని 1971 మే 5న ఒకే రోజు వెలువరించిన రెండు తీర్పుల్లో స్పష్టం చేసింది.
(1971 AIR 1731, 1971 AIR 1737)

“This court has consistently held that, with regard to a state
law, the unit to determine a religious or linguistic minority can only be the State”.

(రాష్ట్ర చట్టానికి సంబంధించినంత వరకూ మత లేక భాష పరంగా మైనారిటీ నిర్ణయానికి రాష్ట్రాన్నే యూనిట్‌గా


తీసుకోవాలని ఈ కోర్టు అనేక సందర్భాల్లో ప్రకటించింది.) అని పైన ఉటంకించిన TMA Pai Foundation కేసులో (2002 అక్టోబరు 31న) సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అత్యున్నత న్యాయపీఠాలు చేసిన ఈ ధర్మ నిర్ణయంలో సందిగ్ధత ఉందా? మైనారిటీల నిర్ణయం దేశం మొత్తాన్ని

బట్టి కాదు; ఏ రాష్ట్రానికారాష్ట్రంలో జన సంఖ్యను బట్టి జరగాలి - అని సుప్రీంకోర్టే ఢంకా కొట్టి చాటినప్పుడు

ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? ఏడు రాష్ట్రాల్లో అల్ప సంఖ్యాకులైన హిందువులు 'మైనారిటీ' కాక

ఏమవుతారు? చట్ట పరంగా, ప్రభుత్వపరంగా మైనారిటీల చేయూతకు ఉద్దేశించిన సౌకర్యాలు, అవకాశాలు,

రక్షణలు ఆ రాష్ట్రాల్లో హిందువులకు ఎందుకు అందడం లేదు?
ఎందుకంటే మనది ఒక విచిత్ర వ్యవస్థ కనుక! సంఖ్యాపరంగా మైనారిటీలే కావచ్చు. కాని మైనారిటీల కమిషన్‌

శంఖంలో పోస్తేగాని గుర్తింపు తీర్థం దక్కదు.
రాజ్యాంగం 1950లో మొదలైతే, అందులో మైనారిటీల రక్షణకు పొందు పరచిన రక్షణలు సరిగా అమలయేట్టు

చూడటానికి, మైనారిటీల నిర్ధారణకు తగు చర్యలు తీసుకోవటానికి ఒక మైనారిటీస్‌ కమిషన్‌నంటూ ఏర్పాటు

చేయటానికి, ఏలినవారికి 28 ఏళ్లు పట్టింది. దానికి చట్ట ప్రతిపత్తినిస్తూ 'నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ మైనారిటీస్‌

యాక్ట్‌' అనే జాతీయ చట్టాన్ని తేవడానికి ఇంకో పదిహేనేళ్లు పట్టింది. ఆ చట్టంలో మైనారిటీల నిర్ధారణకు ఒక

పద్ధతి అంటూ ఏదీ లేదు. కేంద్ర సర్కారు వారు ఎవరిని నోటిఫై చేస్తే వారు మైనారిటీగా గుర్తించబడుదురు!

శాసనంలోని 2 (సి) సెక్షన్‌ కింద భారత సర్కారు వారు 1993 అక్టోబరు 23న ఐదు కమ్యూనిటీలను గుర్తించారు.

వారెవరంటే 1. ముస్లింలు, 2. క్రైస్తవులు, 3. సిక్కులు, 4. బౌద్ధులు, 5. పార్శీలు.
ఈ లిస్టులో సిక్కులను చేర్చటమే తప్పు. ఎందుకంటే సిక్కులు మొదటి నుంచీ హిందూ మతానికి బాసటగా

నిలిచారు. కాశ్మీరీ హిందువులను ఔరంగజేబ్‌ రాక్షసత్వం నుంచి రక్షించటం కోసమే గురుతేజ్‌ బహాదూర్‌

చిత్రవధకు సిద్ధపడి తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు. ప్రఖ్యాత మేధావి కుష్వంత్‌ సింగ్‌ సేకరించిన వివరాల

ప్రకారం సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆదిగ్రంథ్‌లో భగవంతుని నామ స్మరణ 15వేల చోట్ల ఉంటుంది.

వాటిలో హరినామం 8000 సార్లు, 'రామ' నామం 2,533 సార్లు, గోపాల, గోవింద, పరబ్రహ్మ నామాలు

కొన్నివేల సార్లు కనిపిస్తాయి. సిసలైన సిక్కు నామం 'వాహెగురు' 16 చోట్ల మాత్రమే ఉంటుంది. సిక్కులకు

పరమ పవిత్రమైన స్వర్ణదేవాలయానికీ హరిమందిరమని పేరు. తెల్లవాళ్ల కుట్రల వల్ల, రాజకీయ దుష్ప్రభావాల

కారణంగా హిందువులకు దూరమైన సిక్కు కమ్యూనిటీని నచ్చచెప్పి, నమ్మకం కలిగించి, హిందూ స్కంధావారంలోకి

చేర్చవలసింది పోయి దాన్ని వేరే మైనారిటీ మతంగా ముద్రవేయటం హిందూ సమాజానికి పెద్ద దెబ్బ.
 
 అనాదిగా హిందూ మతంలో అంతర్భాగమైన ఇంకో వర్గం జైనులది. 2014 ఎన్నికలకు ముందు ఓట్ల కక్కుర్తితో 

సోనియమ్మ బినామీ సర్కారు జైనులనూ మైనారిటీగా ప్రకటించి, హిందువుల ఐక్యతకు ఇంకో గండి కొట్టింది. 

ఈ దుష్ట సంప్ర దాయాన్నే పుణికి పుచ్చుకుని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక కాంగ్రెసు సర్కారు 

లింగాయతులను మైనారిటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

'మైనారిటీ' గుర్తింపు ఎరను విసిరి ఒక కమ్యూనిటీ తరవాత ఒక కమ్యూనిటీని వేరు చేసి హిందూ సమాజాన్ని 

అంతకంతకూ బలహీన పరచాలని కుయుక్తులు పన్నే పాలకులు మొత్తంగా హిందువులే మైనారిటీ అయిన 

రాష్ట్రాల్లో మాత్రం వారికి మైనారిటీ 'ప్రతిపత్తి' ఇవ్వరు.ముస్లిం మెజారిటీ జమ్మూ కశ్మీర్‌కు అసలు మైనారిటీల కమిషన్‌ జాతీయ చట్టమే వర్తించదు. కేంద్ర ప్రభుత్వం

పట్టుబడితే దాన్ని వర్తింప జేయగలదు. కాని సర్కారు పట్టుబట్టదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోని ముస్లిం 

సమూహాలతో, పార్టీలతో అధికారపార్టీకి సవాలక్ష మొగమాటాలు. జమ్మూ కాశ్మీర్‌ వలె ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి

లేని మిగతా రాష్ట్రాల్లోనైనా హిందూ మైనారిటీల బాగోగులు తిన్నగా పట్టించుకున్నారా అంటే ఆ ఆశా లేదు. 

రాష్ట్రస్థాయిలో మైనారిటీలను చట్టరీత్యా నోటిఫై చేయవలసింది రాష్ట్రాల్లోని మైనారిటీ కమిషన్లు. రాష్ట్రస్థాయి 

మైనారిటీల కమిషన్‌ ఏర్పాటుకే తొమ్మిది రాష్ట్రాల్లో ఇంతవరకు దిక్కులేదు. అవి గజ్జెకట్టిన రాష్ట్రాల్లో కూడా 

హిందువులు కానివారికే తప్ప హిందూ మైనారిటీలకు న్యాయం సున్న. మైనారిటీల గుర్తింపు, వారి యోగక్షేమాల

విషయంలో జాతీయ, రాష్ట్ర కమిషన్ల నడుమ సమన్వయం లేదు. రాష్ట్రాల్లో మైనారిటీల గుర్తింపు మా పనికాదని

ఎవరికి వారు చేతులు దులుపుకోవటంతో, హిందూ వ్యతిరేక రాజకీయ లాబీ కేంద్రంగా నేషనల్‌ కమిషనే 

తయారవడంతో అన్ని విధాల చితికిన హిందువులకు దిక్కుతోచని దుస్థితి.

ఆ ఘోష అంతా ఏకరువు పెట్టి అశ్వనికుమార్‌ ఉపాధ్యాయ అనే ఢిల్లీ బిజెపి ప్రముఖుడు హిందువులు 

మైనారిటీ అయిన రాష్ట్రాల్లో వారిని మైనారిటీలుగా గుర్తించేట్టు చేయమంటూ నిరుడు సుప్రీంకోర్టును 

ఆశ్రయించాడు. అదేదో నేషనల్‌ మైనారిటీస్‌ కమిషన్‌ వారికే చెప్పుకోమని చెప్పి కోర్టు వారు కేసు కొట్టేశారు. 

నేషనల్‌ కమిషనే సవ్యంగా పనిచేస్తే లేనిదేముంది? కోర్టుకెక్కాల్సిన అవసరమేమిటి?

అసలు చట్టప్రకారం మైనారిటీలను నోటిఫై చేయాల్సింది ప్రభుత్వమే కదా? కేంద్రంలో నాలుగున్నరేళ్లుగా 

రాజ్యమేలుతున్న మోదీ సర్కారు గట్టిపట్టుబడితే ఏడు రాష్ట్రాల హిందువులను మైనారిటీగా గుర్తించేట్టు 

చెయ్యలేదా? కనీసం ఆ దిశగా ప్రయత్నమైనా జరిగిందా? ఇప్పుడు కూడా కాకపోతే హిందువులకు మరెప్పుడు 

న్యాయం జరుగుతుంది?

ఏమో! వారే చెప్పాలి.

Friday 16 November 2018

ధర్మానికి చోటులేని దయ్యాలదిబ్బ



- ఎం.వి.ఆర్‌.శాస్త్రి

పెక్యులరిజం-21



“My friends tell me that I have made the Constitution. But I am quite prepared to say that I shall be the first person to burn it out. I do not want it. It does not suit anybody.”

(రాజ్యాంగాన్ని నేను తయారు చేశానని నా మిత్రులు చెబుతారు. కాని దాన్ని తగలబెట్టే మొట్టమొదటి మనిషి నేనే. అది నాకొద్దు. అది ఎవరికీ పనికిరాదు.)

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌గారు 1953 సెప్టెంబర్‌ 2న రాజ్యసభలో అన్న మాటలివి.

భారత రాజ్యాంగం భక్తితో కళ్లకద్దుకోవలసిన పవిత్ర ధర్మ గ్రంథమన్నట్టూ, అది బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనకందించిన మహా ప్రసాదమైనట్టూ ఓవరై పోతూండేవాళ్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన యథార్థమిది.

రాజ్యాంగ నిర్మాత అని అందరం ప్రస్తుతించే అంబేద్కరేమిటి? ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే మొట్టమొదటి వ్యక్తి తానేనని చెప్పడమేమిటి? ఈ సందేహం అందరికీ వస్తుంది. 'ఎందుకలా అన్నారు' అని ఏణ్నర్థం తరువాత (1955 మార్చి 19న) రాజ్యసభలోనే ఏదో చర్చ సందర్భంలో డాక్టర్‌ అనూప్‌సింగ్‌ నేరుగా అంబేద్కర్‌నే అడిగాడు. దానికి అంబేద్కర్‌ ఇచ్చిన జవాబు చూడండి.

“The reason is this : We built a temple for God to come in and reside, but before the God could be installed, if the devil had taken possession of it, what else could we do except destroy the temple? We did not intend that it should be occupied by the Asuras. We intended it to be occupied by the Devas. That’s the reason why I would rather like to burn it.”

(కారణం ఇది : దేవుడు కోసం మేము గుడి కట్టాము. కాని దేవుణ్ని ప్రతిష్టించేలోపే దాన్ని దయ్యం వశపరచుకుంటే గుడిని కూల్చెయ్యటం తప్ప ఇంకేం చెయ్యగలం? అందులో దేవతలు నివసించాలనే కోరుకున్నాం. అసురులు ఆక్రమిస్తారని మనం ఆనుకోలేదు. ఇదిగో ఈ కారణం వల్లే దాన్ని తగలబెట్టటం మంచిదని నేను అంటాను.)

''దానికి గుడినెందుకు కూల్చటం? అందులో చేరిన దయ్యాన్ని హతమార్చితే చాలుగదా?'' అని కె.పి.సిన్హా ప్రశ్న. అందుకు అంబేద్కర్‌ జవాబు ఇది :

“You can not do it. We have not got the strength. If you will read the Satapatha Brahmana, You will see that the gods have always been defeated by the Asuras and that the Asuras had the Amrit with them..”

(అది మీ వల్ల కాదు. అంతబలం మనకు లేదు. శతపథ బ్రాహ్మణం చదివితే తెలుస్తుంది. అసురుల దగ్గర అమృతం ఉండేది. దాంతో వాళ్లు ప్రతిసారీ దేవతలని ఓడించేవారు.)



డ్రాఫ్టింగు కమిటీ ఛైర్మన్‌గా ఎంతో కష్టపడి, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయంకోసం ఎందరితోనో కొట్లాడి తాను రాసిపెట్టిన రాజ్యాంగాన్ని తన చేతులతో తానే తగలబెట్టాలనుకునేంతగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కి మనసు విరగడానికి కారణాలు వేరుకావచ్చు. కాని, మన పేరుగొప్ప రాజ్యాంగం తీరుతెన్నులను పరికిస్తే - ఈ దేశం పట్ల ప్రేమ, భక్తి, ధైర్యంగా ఆలోచించే శక్తి ఉన్న విజ్ఞులెవరైనా అంబేద్కర్‌ గారిలాగే అనుకుంటారు!

స్వతంత్రమనబడేది వచ్చి, స్వయం పరిపాలనకు కొత్తగా రాజ్యాంగమొకటి రూపొందుతున్నదంటే భారతమాతకు భవ్యమైన గుడి కడుతున్నారనే దేశవాసులు ఆశపడ్డారు. భారతదేశపు ఆత్మ శోభిల్లే రీతిలో, భారతీయ ఉజ్జ్వల సంస్కృతిని, దాని ఉత్కృష్ట వారసత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా భారతాంబిక పునర్వైభవానికి నూతన రాజ్యాంగం చక్కని రాచబాట వేస్తుందని ఆకాంక్షించారు. అనుకున్నదొకటైతే తీరా జరిగింది వేరొకటి.

భారతదేశానికి ప్రాణం సనాతన ధర్మం. భారతీయతకు మూలశక్తి ధర్మం. ధర్మం మీద ఆధారపడి, ధర్మాన్ని నమ్ముకుని, ధర్మమే అన్నిటికంటే మిన్నగా భావించింది కాబట్టే వరసగా ఎన్ని శతాబ్దాల పాటు విదేశీయులు, విదేశీ మతాలు ఎన్ని దండయాత్రలు చేసి, ఎంతలా హింసించి, ఎంతగా అణగదొక్కినా భారతదేశం భారతదేశంగా నిలబడింది. ప్రపంచంలో ఎన్నో ప్రాచీన నాగరికతల వలె నామరూపాలు మిగలకుండా పోకుండా భారతీయత ఎన్ని సవాళ్లనైనా తట్టుకుని గర్వంగా తలెత్తుకు నిలబడగలిగింది. శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్‌ దాష్టీకంలో, దీర్ఘకాలం బ్రిటిషు దాస్యంలో ముప్పతిప్పలు పడి, భయానక నష్టాలను, అంతులేని కష్టాలను అనుభవించి, ఎట్టకేలకు పరదాస్యం నుంచి బయటపడ్డాక, స్వరాజ్యంలో అత్యంత గౌరవ స్థానం కల్పించవలసింది జాతికి జీవశక్తి అయిన ధర్మానికి! రాజ్య వ్యవస్థకు చోదకశక్తిగా తక్షణం ప్రకటించవలసింది ధర్మాన్ని. ఎటునుంచి ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు ఎదురవకుండా ఆవశ్యం పరిరక్షించవలసింది ధర్మాన్ని.

దౌర్భాగ్యం ఏమిటంటే అతి ముఖ్యమైన, ప్రాణప్రదమైన ''ధర్మం'' అన్న పదమే ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలోకి దీర్ఘమైనదైన భారత రాజ్యాంగంలో కంచుకాగడాలతో వెతికినా ఎక్కడా కానరాదు. ధర్మం ఊసే లేనప్పుడు రాజ్యాంగం ధర్మాన్ని రక్షించే ప్రసక్తే లేదు. ధర్మానికి ఫలానావిధంగా గ్లాని కలుగుతోంది, ధర్మ వ్యతిరేకంగా ఈ అక్రమం జరుగుతున్నది, అడ్డుకోండంటూ ఏ భారత పౌరుడూ ఏ న్యాయస్థానాన్నీ అర్థించలేడు. ఏమిటా 'ధర్మం', రాజ్యాంగంలో ఎక్కడుంది ఆ 'ధర్మం', దాన్ని ఉల్లంఘించటం రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నేరం, ఏ విధంగా శిక్షార్హం అని కోర్టు అడిగితే అతడి దగ్గర జవాబు లేదు.

ప్రపంచంలో మరే జాతికీ లేని లక్షల సంవత్సరాల మహోజ్వల జీవన స్రవంతిలో శ్రుతులు, స్మృతులు, ధర్మశాస్త్రాలు, కౌటిల్యాది రాజ్యతంత్ర గ్రంథాలు అనన్య ప్రాధాన్యం ఇచ్చిన ధర్మాన్ని కనీసం తలవనైనా తలవకుండా భారతదేశాన్ని శాసిస్తున్నది నడమంత్రపు రాజ్యాంగం!

ధర్మం అన్న కాన్సెప్టు భారతదేశానికి ప్రత్యేకం. అటువంటి భావన ఏ పాశ్చాత్య నాగరికతలోనూ కనపడదు. ధర్మానికి కచ్చితంగా సమానార్థకమైన పదం ఎన్ని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఎన్ని భూతద్దాలతో గాలించినా దొరకదు. విదేశీయులకు తెలియకపోవచ్చుగాని ధర్మం అంటే ఏమిటో భారతదేశంలో మారుమూల పల్లెలో గొడ్లు కాసుకునే పామరుడు కూడా ఎరుగును. ఆంగ్ల మానసపుత్రులు, మెకాలే వారసులు అయిన మన సోకాల్డ్‌ జాతీయ నాయకుల దృష్టిలో తెల్లవాడు నేర్పిందే బెస్టు; సంప్రదాయంలో ఉన్నదంతా నాన్సెన్సు! తమకు పరమ ప్రామాణికమైన పాశ్చాత్య నాగరికతలో ధర్మమనే కాన్సెప్టు లేదు కాబట్టి ఆధునిక రాజ్యాంగంలో అలాంటి పాతకాలపు చాదస్తాన్ని చొప్పించాలన్న ఆలోచనే వారికి కలనైనా కలగలేదు.

ధర్మం అంటే మతం కాదు. ఒక హిందూమతానికి, కేవలం భారతదేశానికి పరిమితమైన భావన కాదు. అది సార్వకాలికం, విశ్వజనీనం. ఏ మతాన్ని అనుసరించే వారికైనా, ఏ దైవాన్ని కొలిచేవారికైనా, ఏ దేవుడినీ నమ్మనివారికైనా, ఏ వర్గానికి, ఏ భావజాలానికి చెందినవారికైనా సమాన న్యాయం చేసేది, కర్తవ్యం బోధించేది, సమాజాన్ని సత్యమార్గంలో ముందుకు నడిపించేది ధర్మం.

ఇది విదేశీ దురహంకారుల బుద్ధికి అందదు. వారికి తెలిసిందల్లా మతం. అందులో ఒక్క దేవుడికే స్థానం. ఒక్క ప్రవక్త చెప్పిందే సత్యం. దానిని విశ్వసించని వాడు ద్రోహి. వాడికి పుట్టగతులు నాస్తి. రెండు సత్య మతాలు ఉండేందుకు వీలే లేదు. మనది కాని మతాన్ని అంగీకరించే, కనీసం గౌరవించే ప్రసక్తే లేదు.



ఇదీ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సెమెటిక్‌ మతాల ఆలోచనా రీతి. ధర్మాన్ని ఒగ్గేసిన మన మహానుభావులు ప్రపంచమంతటా అల్లకల్లోలాలకు మూలమైన ''రిలిజియన్‌''ను మాత్రం పదిలంగా రాజ్యాంగంలో చొప్పించారు. మత స్వాతంత్య్రానికంటూ 25 నుంచి 30 దాకా ఏకంగా ఆరు అధికరణాలను కేటాయించారు.

మంచిదే. కనీసం వాటిలోనైనా మనదేశానికి సొంతమైన, ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన, ఇప్పటికీ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ మతానికి గౌరవస్థానం ఇచ్చారా?

గౌరవం మాట దేవుడెరుగు. అసలు ''హిందూమతం'' అన్న పదమే మొత్తం రాజ్యాంగంలో ఎక్కడా కానరాదు. ఎంతసేపూ జనాభాలో నిండా ఐదో వంతు లేని మైనారిటీల హక్కులూ రక్షణల సంగతే తప్ప, అసలైన మెజారిటీ గురించి, అది అనుసరించే హిందూమతం గురించి, దాని హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కనీసం ప్రస్తావనే లేదు.

మైనారిటీ అనేది సాపేక్ష పదం. పెద్ద సమూహం ఒకటి ఉంటేనే దానికి భిన్నమైన చిన్న సమూహానికి ఉనికి. మనం సెక్యులర్‌ మడి కట్టిన వాళ్లం; మతాల విషయంలో మనకు పెద్దా చిన్నా తేడా లేదు. ఏ మతానికి చెందినా పౌరులందరూ సమానమే - అన్న మంచి బుద్ధి మనకుంటే రాజ్యాంగంలో అసలు మతాల ఊసే ఎత్తకూడదు. మెజారిటీ మతం గురించి మాట్లాడనట్టే మైనారిటీలనూ ఎక్కడా ప్రస్తావించకూడదు.

అలాకాదు; అందరూ సమానమే అని ఊరుకుంటే మెజారిటీ హిందువులు మైనారిటీ మతాలను అణగదొక్కేస్తారు. అలా జరక్కుండా మైనారిటీలకు తగిన రక్షణలు ఉండాలి అనుకుంటారా? మెజారిటీ అనుభవించే హక్కులు మైనారిటీలకూ దక్కి తీరాలి; ఆ విషయంలో మైనారిటీలు ఎలాంటి వివకక్షూ గురి కాకూడదు - అని ఆరాటపడతారా? అప్పుడు మతపరమైన హక్కులు, రక్షణలు ఏమిటో ముందుగా నిర్వచించాలి. అవి అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తాయని తరవాత స్పష్టం చేయాలి.

మన రాజ్యాంగంలో జరిగింది దీనికి పూర్తిగా రివర్సు. 25 నుంచి 30 వరకూ ఆరు అధికరణాల వంపు సొంపుల మీద ఇంతకు ముందు మనం పైపైన చేసిన పరిశీలనలోనే ఎన్నో వైరుధ్యాలు, అసంబద్ధతలు బయటపడ్డాయి. అన్నింటికంటే పెద్ద లొసుగు రాజ్యాంగంలో మైనారిటీల హక్కులూ, రక్షణల వైనమే తప్ప మెజారిటీ గురించి, వారి మత హక్కుల గురించి ఎక్కడా పేర్కొనకపోవటం!

దానివల్ల ఏమైంది? మైనారిటీలకేమో రెండు రకాల హక్కులు. వారు జనరల్‌ కేటగిరీలో భారత పౌరులుగానూ న్యాయం కోరవచ్చు. స్పెషల్‌ కేటగిరీలో మైనారిటీలుగానూ కోర్టు లెక్కవచ్చు. ఆ విధంగా డబుల్‌ ధమాకా!

అదే దురదృష్టవంతులైన హిందువులో? వారికి భారత పౌరులుగా మాత్రమే గుర్తింపు. మైనారిటీల్లాగా వారికి స్పెషల్‌ కేటగిరీ ఏదీ లేదు. మెజారిటీ వర్గంగానో, హిందూ మతానికి చెందిన వారిగానో తమ హక్కులకు భంగం కలిగాయని వారు ఎప్పుడు ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే 'హిందూ' అనిగాని, 'మెజారిటీ' పదంగాని రాజ్యాంగంలో ఎక్కడా కానరావు. రాజ్యాంగంలో ఏ అధికరణం కింద మిమ్మల్ని గుర్తించాలి, ఏ క్లాజు ప్రకారం మీకు న్యాయం చేయాలి అని అడిగితే హిందువుల దగ్గర జవాబు లేదు. ఇందాక ధర్మం విషయంలో చెప్పుకున్నట్టే ధర్మానికి ప్రతిరూపమైన మతం విషయంలోనూ హిందువులకు ప్రత్యేకంగా ఏ హక్కూ లేదు. మతపరంగా హక్కులన్నీ మైనారిటీలకు! జన సంఖ్యలో 80 శాతం ఉండికూడా హిందువులు తమ దేశంలోనే రాజ్యాంగరీత్యా రెండో తరగతి పౌరులు.

దీని పర్యవసానం ఇప్పుడు శబరిమల విషయంలో చూస్తూనే ఉన్నాము కదా?

'ధర్మం' లాగే 'మతం' అన్న పదానికీ దాని విస్తృతార్థంలో సరైన మాట ఇంగ్లీషు భాషలో దొరకదు. బహు సంకుచితమైన, ఒకే మూసకు చెందిన ఇస్లాం, క్రిస్టియన్‌, యూదు మతాలకు ఉద్దేశించిన 'రిలిజియన్‌', 'డినామినేషన్‌' వంటి పదాలు అనంత వైవిధ్యానికి, అపార బహుళత్వానికి నెలవైన హిందూమతానికి ఎంతమాత్రమూ సరిపోవు. మత సంస్థలను నడుపుకునే స్వేచ్ఛ వగైరాలకు సంబంధించి 26వ అధికరణంలో ఒక మతానికి చెందిన అన్ని శాఖలకూ, సంప్రదాయాలకూ, మార్గాలకూ, పరంపరలకూ అవి వర్తిస్తాయని స్పష్టంగా చెప్పకుండా మతపరమైన 'డినామినేషన్లు' అంటూ ద్రావిడ ప్రాణాయామం చేశారు. డినామినేషను అన్న ఇంగ్లీషు మాటకు ఆక్స్‌ఫర్ట్‌ డిక్షనరీలో చెప్పిన అర్థాల్లో ఏదీ అయ్యప్ప కూటమికి సరిపోవడం లేదు కాబట్టి కోట్లాది భక్తులు శతాబ్దాలుగా నిష్ఠతో అనుసరిస్తున్న అయ్యప్ప సంప్రదాయం 'డినామినేషను' కిందికి రాదని సుప్రీంకోర్టు తేల్చింది. 26వ అధికరణం కింద మతస్వేచ్ఛ హిందువులకు ప్రాప్తం లేదు కాబట్టి 'జస్ట్‌ హిందువులు' అయిన అయ్యప్పల మూల దేవాలయం పబ్లిక్‌ టెంపుల్‌ అని, అందులోకి ఫలానా వయసు ఆడవాళ్లు రాకూడదని అడ్డగించడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనం ఆజ్ఞ! రుతుస్రావం జరిగే వయసులో శబరిమల సన్నిధానానికి స్త్రీలు రాకూడదని సాక్షాత్తూ అయ్యప్ప స్వామే చెప్పాడు కదా అంటే ''ఎందుకని? స్త్రీల పొడ సోకితే ఆ స్వామి బ్రహ్మచర్యం చెడుతుందా? రుతుక్రమం మహిళల శరీరధర్మం కదా? ఆ కారణం చేత వారికి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కును ఎలా అడ్డగిస్తారు'' - అంటూ పెద్ద కోర్టువారు బోలెడు కోప్పడ్డారు.

దానివల్ల ఏమైంది? హిందూ మతాన్ని పాడు చేయటమే పనిగా పెట్టుకున్న అన్యమతాల మైనారిటీలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇంతకుముందు దాకా రుతుస్రావం కావచ్చన్న భయంతోనే ఆ వయసు మహిళలు దర్శనానికి వెళ్లేవారు కాదు. వారిని అనుమతించేవారూ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన లైసెన్సుతో మతవిరోధులు బరితెగించి, రుతుస్రావ చిహ్నాలతోనే ఆలయంలో అడుగెడతామని బెదిరిస్తున్నారు. దానివల్ల భక్తుల విశ్వాసాలు, ఆలయ పవిత్రత, దేవుడి నిష్ఠ ఎంతలా దెబ్బతిన్నా కోర్టులకు పట్టదు.

అదే - అయ్యప్ప గుళ్లోలాగే మసీదుల్లోనూ మహిళలను అనుమతించండి - అని ఎవరో దావా వేస్తే కేరళ హైకోర్టు దాన్ని విచారణైనా లేకుండా కొనగోటితో కొట్టివేసింది. శబరిమలలో అలా.. మసీదుల విషయంలో ఇలా - ఏమిటి? ఎందుకీ వివక్ష అని గుండెలు బాదుకోవటం దండుగ. సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూర్చున్న న్యాయమూర్తులను నిందించీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అసలు లొసుగు రాజ్యాంగంలో ఉంది. మైనారిటీలకే తప్ప మెజారిటీ వర్గం విశ్వాసాలకూ, ఆచారాలకూ, మత హక్కులకూ రాజ్యాంగం గుర్తింపు లేదు. చెబుతూ పోతే ఇలాంటి విపరీతాలు కావలసినన్ని.

దేవుడి గుడిలా వెలుగొందవలసిన రాజ్యాంగం దయ్యాల దిబ్బ అయిందని అరవై ఐదేళ్లకిందటే సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే బాధపడుతూ అన్నమాట కరక్టే కదా? మొగమాటం లేకుండా రాజ్యాంగ వైపరీత్యాన్ని తెగనాడటానికి ఆనాడు ఆయన చూపిన తెగువలో శతాంశమైనా ఇవాళ మనకు ఉన్నదా?


Thursday 8 November 2018

మెజారిటీ కావటమే శాపమా?



పెక్యులరిజం-20
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి
..................



పావు శతాబ్దం కిందటి మాట. కర్ణాటకలోని మలయాళీలు టీచర్స్‌ ట్రెయినింగుకు ఓ కాలేజి పెట్టాలని ముచ్చటపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం కుదరదు పొమ్మంది. మలయాళీ సొసైటీ కోర్టుకెక్కింది - తమ మైనారిటీ హక్కులకు పుట్టి మునిగిందంటూ.



అలాంటి శిక్షణ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ఒకటుందండి. ఇంకోటి పెట్టనిస్తే రెండిటి మధ్య అవాంఛనీయమైన పోటీ ఏర్పడి, శిక్షణ ప్రమాణాలు పలచబడవచ్చు కదాండి. అందుకే వద్దన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది. కర్ణాటక హైకోర్టు కస్సుమంది. కోరుకున్న విద్యా సంస్థను నడుపుకునే హక్కు మైనారిటీలకు ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును అడ్డుకోవటానికి మీరెవరు? అని ముక్క చివాట్లు పెట్టి పర్మిషన్‌ ఇప్పించింది.

గుజరాత్‌లోనూ ఒక టీచర్స్‌ ట్రెయినింగ్‌ కాలేజి ఉంది. దాన్ని నడిపేది క్రిస్టియన్‌ మైనారిటీ. అందులో 80 శాతం సీట్లను మేము చెప్పిన వాళ్లకు కేటాయించండి అని గుజరాత్‌ ప్రభుత్వం అడిగింది. యాజమాన్యం ఒప్పుకోలేదు. కాలేజికి ఇచ్చే ఎయిడ్‌ని ప్రభుత్వం నిలిపేసింది. క్రిస్టియన్‌ సొసైటీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ప్రజా ప్రయోజనం, జాతీయ ప్రయోజనం అని చెప్పి మైనారిటీ విద్యాసంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీయటానికి వీల్లేదు. మైనారిటీల ప్రాథమిక హక్కా? మజాకా? అని ప్రభుత్వాన్ని తిట్టి , ఆపేసిన ఎయిడ్‌ను సుప్రీంకోర్టు మళ్లీ ఇప్పించింది. (సిద్ధరాజ్‌ భాయ్‌ సభాయ్‌ కేసు 1963 AIR 540).

అదీ 30వ అధికరణం పవరు. అందులో మైనారిటీలకు ఇచ్చింది తిరుగులేని ప్రాథమిక హక్కు. శాసనాలు చేసే లెజిస్లేటివ్‌ పవరు అయినా దానికి తల ఒగ్గవలసిందేనని ఇంకో సందర్భంలో సుప్రీంకోర్టే చెప్పింది. అంతటి రాజ్యాంగ రక్ష ఉన్నది కాబట్టి మైనారిటీలకు చెందిన విద్యాసంస్థల తెరువు పోవటానికి సర్కారువారు భయపడతారు. తమ హద్దుల్లో తాముంటారు.

విద్యాసంస్థల్లో వెనకబడిన కులాలు వగైరా బలహీనవర్గాల రిజర్వేషన్లకు రాజ్యాంగం వరమిచ్చింది. కాని అది మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదు. నడిపేవాళ్లు మైనారిటీ అయితే వారు విద్యాసంస్థల్లో ఏ రిజర్వేషన్లూ పాటించనక్కర లేదు.

ప్రభుత్వ ఎయిడ్‌ తీసుకునే ఏ విద్యాసంస్థలోనూ మతం, కులం, భాష కారణంగా ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) రాజ్యాంగ అధికరణం చెబుతుంది. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా, కంపల్సరీగా విద్య నేర్పించాలని వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించిన '21ఎ' అధికరణం నిర్దేశిస్తుంది. ఈ విద్యా హక్కుకు శాసన రూపం ఇస్తూ యు.పి.ఎ. సర్కారు Right to Education (RTE) చట్టం తెచ్చింది. ఆ చట్టం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకూ చచ్చినట్టు వర్తిస్తుంది.

- ఒక్క మైనారిటీ విద్యాసంస్థలకు తప్ప.

కుల, మతాల కారణంగా విద్యాసంస్థల్లో ఎవరికీ ప్రవేశం నిరాకరించరాదని 29(2) అధికరణం స్పష్టంగా కట్టడి చేసినప్పుడు, పిల్లలకి నిర్బంధ, ఉచిత విద్య చెప్పించాలని 21 'ఎ' అధికరణం అంటున్నప్పుడు - వీటికి విరుద్ధంగా విద్యాహక్కు చట్టంలో మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇస్తే గొడవ అవుతుంది. లీగల్‌ చిక్కులూ వస్తాయి. కాబట్టి మైనారిటీలకి రక్ష, మెజారిటీపై కక్ష - వ్రతంగా పెట్టుకున్న సోనియమ్మ తల్లి గారి  బినామీ సర్కారు రాజ్యాంగ రక్షణను వమ్ము చేయడానికి పనిగట్టుకొని ఒక దిక్కుమాలిన రాజ్యాంగ సవరణ తెచ్చింది. 'మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం కారణంగా ఎవరిపట్ల వివక్ష కూడదు' అని ప్రకటించే రాజ్యాంగం 15వ అధికరణంలో 5వ నెంబరు క్లాజును అడ్డగోలుగా చొప్పించింది. ఇదిగో ఇలా :

"Nothing in this article shall prevent the state from making any special provision, by law, for the advancement of any socially and economically backward classes of citizens or for the scheduled castes or the Scheduled Tribes in so far as such provisions relate to their admission to educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in clause (1) of Article 30"

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు, షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన పౌరుల అభివృద్ధి నిమిత్తం -

ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ విద్యా సంస్థలు సహా -

30 (1) అధికరణంలో పేర్కొన్న మైనారిటీ విద్యాసంస్థలు మినహా అన్ని విద్యా సంస్థలలోనూ -

అట్టివారి ప్రవేశానికి సంబంధించి చట్టరీత్యా ఎలాంటి ప్రత్యేక ఏర్పాటును ప్రభుత్వం చేయడానికైనా ఈ అధికరణంలో పేర్కొన్నదేదీ అడ్డురాదు.)

బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన విద్యాహక్కును కూడా తుంగలో తోక్కేందుకు ఈ 93వ రాజ్యాంగ సవరణ మైనారిటీల విద్యా సంస్థలకు వాటమైన అవకాశం ఇచ్చింది.



నిరక్షరాస్యత దేశం చిరకాలంగా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. దాన్ని ఒక దారికి తెచ్చేందుకు సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన అట్టడుగు వర్గాల పిల్లలకి ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్బంధంగా విద్య నేర్పించాలన్నది ప్రశస్తమైన యోజన. ప్రభుత్వమే అందరికీ సరిపడా పాఠశాలలను కట్టించటం కష్టం కాబట్టి ఇప్పటికే నడుస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనూ చదువుకునే అవకాశం అలాంటి పిల్లలకి కల్పించటం మంచిపని. అందుకయ్యే వ్యయాన్ని ఎలాగూ ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల వారికి నష్టం లేదు. జాతి శ్రేయస్సు దృష్ట్యా ఒక అతిముఖ్య బృహత్కార్యంలో ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ అనే తేడా లేకుండా అన్ని ప్రైవేటు స్కూళ్లనూ కంపల్సరీగా ఇన్వాల్వు చేసినప్పుడు, మైనారిటీ స్కూళ్లకు మాత్రం ఆ బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వడంలో అర్థం లేదు. మైనారిటీ విద్యాసంస్థలలో మైనారిటీలు కాని పిల్లలనూ చేర్చుకోవడానికి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వెసులుబాటు కల్పించింది. మైనారిటీలు కాని విద్యార్థులకు విచ్చలవిడిగా సీట్లు ఎలాగూ అమ్ముకుంటూనే ఉన్నారు. హిందువులు నడిపేస్కూళ్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎయిడూ పొందకపోయినా సరే ప్రభుత్వం చెప్పిన ప్రకారం బడుగు, బలహీన వర్గాల వారికి, సర్కారు నిర్ణయించే ధర్మ రుసుమును మాత్రం తీసుకుని చదువు చెప్పాల్సిందే అన్నప్పుడు- అదే రూలు మైనారిటీలు నడిపే స్కూళ్లకు మాత్రం ఎందుకు వర్తించకూడదు?

దానికి జవాబు సుప్రీంకోర్టు చెప్పింది వినండి :

"The minority character of the minority educational institutions may be affected by admissions of socially and educationally backward classes or the Scheduled Castes and the Scheduled Tribes, and it is for this reason that minority institutions, aided or unaided are kept outside the enabling power of the state under clause (5) of Article 15 with a view to protect the minority institutions from a law made by the majority.. This court has repeatedly held that the state has no power to interfere with the administration of minority institutions and has no power to force admission of students from amongst non-minority communities".
[Pramati Case, 2014, https://indiankanoon.org/doc/32468867/]

(సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలవారికి అడ్మిషన్లు ఇవ్వడం వల్ల మైనారిటీ విద్యా సంస్థల యొక్క మైనారిటీ శీలం దెబ్బతినవచ్చు. మెజారిటీ చేసే శాసనాల నుంచి మైనారిటీని రక్షించటానికి 15వ అధికరణం 5వ క్లాజు ప్రభుత్వ అధికారం నుంచి ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ మైనారిటీ విద్యాసంస్థలకు ఈ కారణం చేతే మినహాయింపు ఇచ్చింది. మైనారిటీ సంస్థ నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం, నాన్‌ మైనారిటీ వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని బలవంతం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అని ఈ న్యాయస్థానం పదేపదే ప్రకటించింది.)

ఇదెక్కడి న్యాయం?

పార్లమెంటు చేసే ఏ చట్టమైనా మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే శాసన రూపం దాల్చుతుంది. మెజారిటీ సభ్యులు సహజంగా మెజారిటీ (లేక నాన్‌ మైనారిటీ) వర్గాలకు చెందినవారే అయి ఉంటారు. "Law made by majority" (మెజారిటీ చేసిన లా నుంచి) మైనారిటీ సంస్థలను రక్షించటానికే 15(5) అధికరణం ఉన్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు అన్నమాటకు అర్థమేమిటి? దీన్నిబట్టి సర్వసత్తాకమైన పార్లమెంటు చేసే శాసనాలకు కూడా అతీతమైన మహా ప్రత్యేక రాజ్యాంగ రక్షణకవచం మైనారిటీలకు తొడగబడిందని మనం అనుకోవాలా? నూటికి 80 మంది దేశవాసులకు ప్రాతినిధ్యం వహించే మతంకంటే.. మెజారిటీ ప్రజలకు వర్తించే చట్టాలకంటే.. మైనారిటీలు, మైనారిటీ విద్యా సంస్థలు ఎక్కువా?

మెజారిటీ వర్గంతో సమానంగా మైనారిటీలకూ తమ మతం, భాష, సంస్కృతి కాపాడుకోవటానికి, విద్యాసంస్థల్లో ప్రవేశానికి, కోరిన విద్యాసంస్థలను పెట్టుకోవటానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలన్న పెద్ద మనసుతో రాజ్యాంగ కర్తలు 29, 30 అధికరణాలను పెట్టారు. వాటివెనుక ఉద్దేశాన్ని విస్మరించి, వాటిలో కనపడే 'మైనారిటీ' ప్రస్తావనలను భూతద్దంలో చూసి, వాటి ప్రాముఖ్యాన్ని అతిగా ఊహించుకుని న్యాయస్థానాలు విపరీతార్థాలు తీయటం అనవసరపు అనర్థాలకు ముఖ్యకారణం. ప్రజా ప్రయోజనాల కన్నా, జాతీయ ప్రయోజనాల కన్నా మైనారిటీ సంస్థల ప్రయోజనాలు మిన్న - అని అర్థ శతాబ్దం కింద ప్రకటించిన సిధాజ్‌భాయ్‌ సభాయ్‌ కేసు (1963 AIR 540) భలే తీర్పును ఇంతకు ముందు చూశాం. మైనారిటీలకు ఎక్కడాలేని, ఎవరూ ఊహించని స్పెషల్‌ కాటగిరీ రాజ్యాంగ ప్రతిపత్తిని ఆపాదించిన 2014 ప్రమతి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు కేసులో పైన ఉటంకించిన తీర్పూ ఆ కోవలోదే.

మనం ఎంచుకున్నదీ, అనుసరిస్తున్నదీ మైనారిటీస్వామ్యం కాదు - ప్రజాస్వామ్యం! ఏదైనా మెజారిటీ ఇష్టాన్ని బట్టే జరగాలన్నది ప్రజాస్వామ్య మూల సూత్రం. మెజారిటీకి లేని హక్కు ఏదీ మైనారిటీకి ఉండటానికి వీలేలేదు. మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటమైనా.. కోరుకున్న విద్య నేర్వడమైనా.. ప్రభుత్వ అనుచిత జోక్యం లేకుండా విద్యాసంస్థలను నడుపుకోవటమైనా మెజారిటీ, మైనారిటీ తేడా లేకుండా అన్నివర్గాల ప్రజల న్యాయమైన హక్కు. మైనారిటీలకు అది ఉంటుందని నొక్కి చెప్పటానికి రాజ్యాంగంలో వాడిన పదాలకు కోర్టులు పెడ అర్థం తీసి మైనారిటీలకు మాత్రమే ఆయా హక్కులు ఉంటాయని, మెజారిటీ సంగతి వాచ్యంగా పేర్కొనలేదు కనుక మెజారిటీకి ఆ హక్కులు వర్తించవని చెప్పటంతో నానా గత్తర అయింది. గవర్నమెంటు పెట్టే అడ్డమైన ఆంక్షలనుంచి, సవాలక్ష సతాయింపుల నుంచి తప్పించుకోవాలంటే 'మైనారిటీ గుర్తింపు'ను ఎలాగైనా పొందటం ఒకటే మార్గమన్న దురభిప్రాయం ప్రబలింది.

మెజారిటీ వర్గపు విద్యాసంస్థల్లో మైనారిటీలను చేరనివ్వరేమో.. దానివల్ల మైనారిటీలు చదువులో వెనకబడతారేమోనని అతిగా భయపడి మైనారిటీలకు సొంతంగా విద్యాసంస్థలు నడుపుకునే హక్కును రాజ్యాంగంలో చేర్చారు. చాలా బాగుంది. కాని మైనారిటీల కోసం ఉద్దేశించిన స్కూళ్లలో మైనారిటీల పిల్లలే చదువుకోవాలి కదా? వారి మతాన్ని, సంస్కృతిని పెంపొందించే రీతిలోనే వాటిలో నేర్పే చదువులు ఉండాలి కదా? మెజారిటీ వర్గాల పిల్లలని కూడా  ఇష్టమొచ్చినట్టు చేర్చుకోవచ్చు అన్నప్పుడు అని మైనారిటీ విద్యాసంస్థ ఎలా అవుతుంది? అన్ని స్కూళ్లలో నేర్పే సెక్యులర్‌ చదువే అక్కడా చెప్పేటప్పుడు దానిని మైనారిటీ విద్య అని ఎలా అనగలం? నడిపేవాడు మైనారిటీ అయితే చాలు, పిల్లలందరూ మెజారిటీ అయినా సరే అది మైనారిటీ విద్యాసంస్థ అయిపోతుందా?

'ఔను' అనే అంటాయి మన కోర్టులూ, గవర్నమెంట్లు! దాంతో ఈ దేశంలో మైనారిటీలుగా పుట్టే భాగ్యం పట్టని దురదృష్టవంతులు షార్ట్‌కట్లు వెతకసాగారు. అవసరార్థం ఒక మైనారిటీ సొసైటీని సృష్టించి, లేక ఒక మైనారిటీని బినామిగా పెట్టి విద్యాసంస్థను నడిపి, ప్రభుత్వపు అత్తపెత్తనపు కత్తిని 'మైనారిటీ' డాలుతో కాచుకోవటం విద్యారంగంలో పరిపాటి అయింది. విద్యాహక్కు చట్టంకింద బలహీనవర్గాల బికారి పిల్లలను చేర్చుకోకుండా తప్పించుకోవటానికీ 'మైనారిటీ' టాగ్‌ పనికొస్తున్నది. బడుగువర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన శాసనం మైనారిటీ విద్యాసంస్థల్లో చెల్లుబాటు కావటంతో విద్యాహక్కు దిక్కుమాలిన వివక్షకు లోనైంది .

అంతేకాదు . మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవటానికి మైనారిటీ ప్రతిపత్తి వాటంగా ఉపకరిస్తుంది అని తేలిపోవడంతో ఎక్కడెక్కడి వారూ ఆ ప్రతిపత్తి కోసం ఆరాటపడసాగారు. ఏ ఆదరణకూ నోచుకోని హిందూమతంలో భాగమని చెప్పుకోవడం తమకు నామోషీగా అనేక వర్గాలు భావించసాగాయి. అన్ని రకాల వివక్షలకూ టార్గెట్‌ అయిన హిందూ మతం నుంచి వేరుపడి, అన్ని హక్కులూ తెచ్చిపెట్టే మైనారిటీ గుర్తింపును ఏదో ఒకరకంగా సాధించాలన్న తపన పెరిగింది.

వివేకానందుడంతటి జగదేక హైందవ వీరుడు స్థాపించిన రామకృష్ణ మిషనే హిందూమతంతో తెగతెంపులు చేసుకుని, తనది వేరే మైనారిటీ మతమని ఆఫ్టరాల్‌ ఒక కాలేజిని నిలుపుకోవటం కోసం అడ్డదారి పట్టిన వైనాన్ని ఇంతకు ముందు చూశాం. వివేకానందుడి కంటే పూర్వం, ఆయనకంటే చండప్రచండంగా పోరాడి, సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టిన ఆధునిక ఋషి దయానంద సరస్వతి స్వామి స్థాపించిన ఆర్యసమాజ్‌ సైతం ఇదేరకమైన దౌర్బల్యానికి, అవకాశవాదానికి లోనవటం ఇంకో పెద్ద విషాదం.

స్వామి దయానంద సరస్వతి స్మారకార్థం ఆర్యసమాజ్‌ దేశంలోని పలు ప్రాంతాల్లో స్థాపించిన దయానంద ఆంగ్లో వేదిక్ (డి.ఎ.వి.) విద్యా సంస్థలకు పంజాబ్‌ యూనివర్సిటీ, గురునానక్‌ యూనివర్సిటీలలో కాలేజిల అఫీలియేషను, బోధనాభాష, పరీక్షల నిర్వహణలకు సంబంధించి అర్ధశతాబ్దం కింద గొడవలొచ్చాయి. ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం తమది హిందూ మతంతో సంబంధం లేని మైనారిటీ మతమని, కాబట్టి 30(1) అధికరణం రక్షణ తమకూ వర్తిస్తుందని చెబుతూ డి.ఎ.వి. కాలేజి ట్రస్టు ఏకంగా 15 రిట్లు వేసింది. వాటిమీద 1971 మే 5న ఇచ్చిన రెండు వేరు వేరు (1971 AIR 1731, 1971 AIR 1737) తీర్పుల్లో ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగమైన రిలిజియస్‌ డినామినేషనే తప్ప వేరే మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తంగా హిందువులు మైనారిటీ అయినందువల్ల, హిందూ మతానికి చెందిన శాఖగా ఆర్య సమాజానికీ 30(1) రక్షణ వర్తిస్తుందని కోర్టు అంగీకరించడంతో వేరేమతం వాదం వీగిపోయినా డి.ఎ.వి. కాలేజిలకు ఉపశమనం దొరికింది.)

పంజాబ్‌లో హిందువులు మైనారిటీ కాబట్టి ఆ పద్దు కింద జలంధర్‌, భటిండాలలోని డి.ఎ.వి. కాలేజిలకు 30(1) మేలు జరిగింది సరే. కాని హిందువులు మెజారిటీ అయిన మిగతా రాష్ట్రాల మాటేమిటి? అక్కడా 30(1) అధికరణం కింద విద్యాసంస్థలు నిశ్చితంగా నడుపుకోవాలంటే మైనారిటీ బిళ్ల తప్పనిసరి. దానికో సం ఢిల్లీలోని ఆర్యసమాజ్‌ ట్రస్టు 1975లో తమది మైనారిటీ మతంగా గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఆర్యసమాజ్‌ హిందూ మతంలో భాగమే తప్ప వేరే మతం కాదని, మైనారిటీ మతమన్న గుర్తింపు దానికి రాదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. (AIR 1976 Delhi 207). ఈ సందర్భంలో  ఢిల్లీ హైకోర్టు ఒక మంచి మాట చెప్పింది. ఏమనంటే -

"There are so many classes and sections among Hindus with varieties of religions opinions. If each of them were to constitute a minority under Article 30(1) the Hindus would not remain a majority at all but would consist of numerous religious minorities".

(మత విషయంలో రకరకాల అభిప్రాయాలు కలిగిన వర్గాలు, తరగతులు హిందువులలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ 30(1) అధికరణం కింద మైనారిటీగా ఏర్పడే పక్షంలో హిందువులు అసలు మెజారిటీగా మిగలరు. అసంఖ్యాకమైన మత మైనారిటీలుగా విడిపోతారు.)

ఆ ఇంగితజ్ఞానమే మనలనేలే రాజకీయ క్షుద్రజీవులకు కొరవడింది. తమ రాజకీయ స్వార్థంకోసం హిందూసమాజంలో చీలికలు ప్రోత్సహించి, మైనారిటీ ఎరలను పలుకుబడిగల కొన్ని వర్గాలకు విసరటం వారికి ఎప్పటినుంచో అలవాటుగా మారింది. 1927లో హిందూ రిలిజియస్ ,  ఎండోమెంట్సు బిల్లును మద్రాసు అసెంబ్లీలో పెట్టారో లేదో తమను స్వతంత్ర కమ్యూనిటీలుగా గుర్తించాలంటూ కెనరా, మలబార్‌ ప్రాంతాలలోని హిందూ వర్గాల నుంచి వేర్పాటు రాగాలు మొదలయ్యాయి. కొద్దినెలల కింద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలన్న యావతో కాంగ్రెసు ప్రభుత్వం లింగాయతులను మైనారిటీగా గుర్తిస్తూ హిందూ సమాజంలో చిచ్చుపెట్టింది.

రామకృష్ణ మిషన్ ,ఆర్యసమాజ్ ,   బ్రహ్మ సమాజ్ , స్వామి నారాయణ్‌  వంటి హిందూ మతశాఖలు  మైనారిటీ ముద్రను లంకించుకోవాలని తహతహలాడుతూ కోర్టు తలుపులు తడుతున్నాయంటే దానికి కారణం హిందూమతం మీద ద్వేషం కాదు; హిందువులమని చెప్పుకోవడానికి సిగ్గుపడీ కాదు. అస్తమానం దిక్కుమాలిన రూల్సు రెగ్యులేషన్లతో సతాయించే ప్రభుత్వపు పీడ నుంచి తప్పించుకోవడానికి అంతకంటే దారిలేక! మైనారిటీ రక్షా కవచం ఉంటేగాని స్థిమితం ఉండని దౌర్భాగ్యపు దురవస్థను మన సంకర సెక్యులర్‌ అవ్యవస్థ తెచ్చిపెట్టటం వల్ల!!

Tuesday 6 November 2018

Hindus !Awake , Arise !!

https://www.pgurus.com/kerala-police-unleashes-reign-of-terror/

How dare they lock toilets , cut off water supply , starve devotees and unleash reign of terror in Sabarimala ?

It is the indifference of  Hindus that is bane of this country and responsible for all the incessant assaults on Dharma  since 1947. If even Sabarimala doesnt awaken them from Kumbhakarna mode and start nationwide struggle , one can write off Hinduism from Hindustan.

There is no point in expecting some Hindu outfit to lead Hindus in this ultimate struggle for survival . Had Ayyappa devotees waited for such a lead , Sannidhanam  would be brimming with menstruating Fatimas by now. Hindus have to rise spontaneously and start nationwide protests. Organisations will follow in due course.

Ayodhya-centric Sadhus and Sants should also pay some urgent attention on the Communist Government's atrocities on Sanatan Dharma . Northern India should realise gravity of the situation in Sabarimala , it's implications and consequences.

This is not time for cool electoral calculations and strategizing Modi's 2019 comeback . Hindus are not pawns on BJP's political chessboard. Ayodhya can wait. Sabarimala can not.Commie Sarkar of Kerala is deadlier than Aurangzeb. Its not Kerala's but Dharma's battle for survival .


Friday 2 November 2018

విన్నావా వివేకానందా ?!

పెక్యులరిజం - 19
ఎం.వి.ఆర్.శాస్త్రి

............






రాజ్యాంగ రక్షరేకు మైనారిటీలకే తప్ప మెజారిటీకి లేదు. కాబట్టి హిందువులు నడిపే స్కూళ్లూ, కాలేజీల మీద గవర్నమెంటు ఒంటికాలిపై లేస్తుంది. సంస్థ దైనందిన నిర్వహణ, చదువులు, సిలబసు, నియామకాలు వగైరాల్లో అడ్డమైన ఆంక్షలు. ఒకేరకమైన చట్టాలకు లోబడి ఒకే లాంటి చదువు చెప్పే విద్యాసంస్థల్లో మైనారిటీల ప్రాప్తం ఒకలాగ; హిందువుల కర్మం ఒకలాగ!!

ఈ అన్యాయాన్ని ఎవరు ప్రతిఘటించాలి? వివక్షకు లోనవుతున్నవాళ్లు. అది అంత తేలిక కాదు. ఎందుకంటే అన్యాయం జరిగింది రాజ్యాంగంలో. దానిని సరిచేసి, మైనారిటీలకున్న హక్కులను మెజారిటికీ వర్తింపజేస్తేగాని వివక్ష పోదు. దానికి జాతీయ స్థాయిలో పెద్ద కదలిక తేవాలి. ఆ పని దేశమంతటా విస్తృతమైన నెట్‌వర్కు, ప్రజల్లో మంచిపేరు ఉండి విద్యారంగంలో అనేక సంస్థలను నడుపుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలకు మాత్రమే సాధ్యం.

అటువంటి జాతీయ మహా సంస్థలు హిందూ సమాజంలో ఏమున్నాయి అని ఆలోచిస్తే స్ఫురించే మొట్టమొదటి పేరు రామకృష్ణ మిషన్‌! అది ప్రధానంగా సేవా సంస్థ అయినా అనేక విద్యాసంస్థలనూ నడుపుతున్నది. వాటి నిర్వహణలో ప్రభుత్వాల నుంచి, అధికార గణాల నుంచి రకరకాల ఒత్తిళ్లను అది కూడా ఎదుర్కొంటున్నది. నాలుగు దశాబ్దాల కింద హిందూ మతాన్ని ద్వేషించే కమ్యూనిస్టు జమానాలో తన ప్రధాన కేంద్రం ఉన్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రామకృష్ణ మిషన్‌కు పెద్ద చికాకే కలిగింది.



వివేకానంద శతజ యంతి సందర్భాన బెంగాల్‌లోని రహరాలో 1962లో ఆయన పేరిట వివేకానంద సెంటినరీ కాలేజి వెలసింది. దాన్ని కట్టింది రామకృష్ణ మిషన్‌ స్థలంలో. కళాశాల నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిమరీ నిధులిచ్చినవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కాలేజి మిషన్‌ యాజమాన్యంలో నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. గవర్నింగ్‌ బోర్డూ ప్రభుత్వ ఆమోదంతో ఏర్పాటైంది. మిషన్‌ ఆధ్వర్యంలో ఇలా కాలేజిని పెట్టించాం, దానికి అవసరమైన అనుమతి ఇవ్వండి అని కోల్‌కతా యూనివర్సిటీకి రాసి, గుర్తింపు తెప్పించిందీ రాష్ట్ర విద్యాశాఖే.

సాధారణంగా ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు కళాశాలల గవర్నింగు బోర్డులన్నీ ఒకే మాదిరిగా ఉండాలని రాష్ట్ర విద్యాచట్టం చెబుతుంది. అయితే ఆ నియమం నుంచి క్రైస్తవ మిషనరీ, రామకృష్ణ మిషన్‌ వంటి కొన్ని సంస్థల కాలేజీలకు చట్టంలోనే మినహాయింపు ఇచ్చారు. మిగతా స్పాన్సర్డ్‌ కాలేజిలకు భిన్నంగా సొంత గవర్నింగు బోర్డు ఉండటానికి 1978 ఏప్రిల్‌ నాటి విద్యాశాఖ ఉత్తర్వు కూడా రామకృష్ణ మిషన్‌ కాలేజిని అనుమతించింది.

ఇలా కొంతకాలం సాఫీగా నడిచాక 1980లో గొడవ మొదలైంది. కాలేజి ప్రిన్సిపాల్‌ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బేలూరు మఠానికి చెందిన స్వామి శివమయానందను యాజమాన్యం నియమించింది. దానిని కాలేజి టీచర్ల కమ్యూనిస్టు సంఘం ప్రతిఘటించింది. టీచర్లు సమ్మెకట్టి కొత్త ప్రిన్సిపాల్‌ను పనిచేయనివ్వలేదు. కాలేజిని దౌర్జన్యంగా తమ చేతుల్లోకి తీసుకొని తమలో ఒక ప్రొఫెసరును ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా తామే నియమించారు. నడమంత్రపు పెత్తనాన్ని రద్దు చేసి, యథాపూర్వస్థితిని పునరుద్ధరించాలంటూ కాలేజి యజమాన్యం కోర్టుకెళ్లింది.

టీచర్ల సంఘం దీనికి పైఎత్తు వేసింది. మిగతా స్పాన్సర్డ్‌ కాలేజిల మాదిరిగా మా కాలేజి గవర్నింగ్‌ బోర్డునూ మార్పించండి; రాష్ట్ర విద్యాచట్టం మా కాలేజీకీ వర్తిస్తుందని ప్రకటించండి; కొత్త ప్రిన్సిపాల్‌ నియామకం రద్దు చేయండి అని అడుగుతూ కోల్‌కతా హైకోర్టులో ఉపాధ్యాయులు రిట్లు వేశారు. అదే సమయంలో నరేంద్రపూర్‌, హౌరాల్లో మిషన్‌ వారి మరో మూడు విద్యాసంస్థల గవర్నింగ్‌ బోర్డులను కూడా పునర్వ్యవస్థీకరించాలంటూ కోల్‌కతా యూనివర్సిటీ నోటీసులిచ్చింది. టీచర్ల యూనియన్‌ దూకుడు, ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంటు సతాయింపు, అదే సమయాన యూనివర్సిటీ పనిగట్టుకుని, వెంటపడ్డ తీరు చూస్తే లెఫ్ట్‌ ఫ్రంటు కామ్రేడ్లు, వారి చేతిలోని అధికారగణం పథకం ప్రకారం రామకృష్ణ మిషన్‌ను వేధిస్తున్నదని సామాన్యులకు సైతం అర్థమైంది. క్రిస్టియన్‌ మిషన్ల లాగే రామకృష్ణ మిషన్‌ కాలేజికి రాష్ట్ర విద్యా చట్టంలో మినహాయింపు ఇచ్చినందువల్ల మిగతా కాలేజిలలో వలె గవర్నింగు బోర్డులో టీచర్లకు ప్రాముఖ్యం లేకుండా పోయింది. యాజమాన్యం కరాఖండిగా ఉండటం వల్ల ట్రేడ్‌ యూనియన్లూ, కమ్యూనిస్టు లీడర్ల ఆటలూ సాగడం లేదు. ఈ అక్కసుతో మిషన్‌ నడుపుతున్న మిగతా విద్యాసంస్థల లోనూ మెల్లిగా గొడవలు మొదలెట్టారు.

ఇదీ 1980లో రామకృష్ణ మిషన్‌కు వచ్చిపడ్డ సమస్య. పశ్చిమబెంగాల్‌లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విషయం తీవ్రమైనదే. సందేహం లేదు. కాని మిషన్‌కి అది జీవన్మరణ సమస్య ఏమీ కాదు. యాజమాన్యం చట్టపరంగా ఏ తప్పూ చేయలేదు. ఏ నిబంధననూ ఉల్లంఘించలేదు. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో కూడా రామకృష్ణ మిషన్‌కి మినహాయింపు ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది. న్యాయం తన పక్షాన ఉన్నప్పుడు ఏ సంస్థా భయపడాల్సిన పనిలేదు. గొప్ప చరిత్ర, ప్రజల్లో ప్రతిష్ఠ ఉన్న రామకృష్ణ మఠానికి అలాంటి అగత్యం అసలే లేదు. న్యాయమైన తన హక్కులను నిలబెట్టుకోవటానికి చట్టపరంగా సంస్థకు అనేక అవకాశాలున్నాయి.

ఇది కేవలం ఒక రామకృష్ణ మిషన్‌కే దాపురించిన కష్టం కాదు. మైనారిటీల వలె ప్రత్యేక రక్షణకు నోచుకోని హిందువులకు చెందిన విద్యాసంస్థలన్నీ సర్కారీ జులుం మూలంగా ఏదో ఒక రీతిలో పడుతున్న అవస్థే అది. తనకే అది అనుభవమైనప్పుడు రామకృష్ణ మిషన్‌ సవాలును ధైర్యంగా స్వీకరించి, వివేకానందుడి తరహాలో అన్నిటికీ తెగించి దృఢంగా నిలబడి ఉంటే కాస్త ఆలస్యంగా అయినా న్యాయం జరిగేది. దానివల్ల మొత్తం హిందూసమాజానికి మేలు జరిగేది. ఒకవేళ ఓడిపోయినా మహా అయితే ఒక కాలేజిమీద ఆ సంస్థకు కంట్రోలు పోయేది. అనేక రాష్ట్రాల్లో ఎన్నో సంస్థలను నడుపుతున్న మహా వ్యవస్థకు ఆ నష్టం ఒక లెక్కలోనిది కాదు.



మరి రామకృష్ణ మిషన్‌ ఏమిచేసింది? సవాలును ఎంత ధైర్యంగా స్వీకరించింది?

చెప్పుకుంటే సిగ్గుచేటు. సింహంలాంటి వివేకానందుడు స్థాపించిన మహాసంస్థను నమ్మశక్యం కాని నైతిక దౌర్బల్యం ఆవహించింది. ఒత్తిళ్లను, ఆరళ్లను నియమబద్ధంగా ప్రతిఘటించలేదు సరికదా - వాటి నుంచి తప్పించుకు నేందుకు మైనారిటీ రక్షరేకు కోసం రామకృష్ణమఠం వెంపర్లాడింది. ఆ దిక్కుమాలిన గుర్తింపుకోసం అసలు తాము హిందువులమే కామని, తమది వేరే మైనారిటీ మతమని జంకు లేకుండా బుకాయించింది.

కోల్‌కతా హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిటులోనూ, రాతపూర్వక వాదనల్లోనూ రామకృష్ణ మిషన్‌వారు ఒట్టేసి చెప్పిందేమిటంటే -

వారిది రామకృష్ణ మతమట. 'ఠాకూర్‌ శ్రీరామకృష్ణ పరమహంస దేవ' ఇస్లాం సహా వివిధ మతాలను సాధన చేసి, వాటి వెనుక మూల సత్యాన్ని కనుగొని ఈ కొత్త మతాన్ని స్థాపించాడట. దానికీ, హిందూ మతానికీ  బొత్తిగా సంబంధం లేదట. దానికి దేవుడు వేరు; వ్యవస్థ వేరు; పూజా విధానం వేరు; ఫిలాసఫీ కూడా వేరు -ట! ఈ విశ్వమతాన్ని అనుస రించే వారిలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతాల వాళ్లు ఉన్నారట. హిందువుల తాత్వికత, బౌద్ధుల కరుణ, మహమ్మ దీయుల సోదరతత్వం కలగలిపి మనం ఒక విశ్వమతాన్ని (Universal Religion) మొదలెడుతున్నాం అని - దీని స్థాపకుడైన వివేకానంద స్వామి చెప్పాడట !

ఈ అడ్డగోలు వాదనే విడ్డూరం. అంతకంటే ఆశ్చర్యం కొల్‌కత్తా హైకోర్టు దీనిని ఆమోదించటం! ఔను నిజమే! వీరు చెబుతున్నట్టు వీరిది వేరే మతం. కాబట్టి భారత రాజ్యాంగం 30వ అధికరణం విద్యా సంస్థల విషయంలో మైనారిటీలకి ఇచ్చిన హక్కులు రామకృష్ణ మిషన్‌ వారికి కూడా వర్తించును - అని సింగిల్‌ జడ్జిగారు 1981లో తీర్పు చెప్పారు. మఠం వారికి కోరుకున్న పని అయిపోయింది. గండం గడిచింది.

అక్కడితో కథ అయిపోలేదు. ఎగస్పార్టీ వాళ్లు సింగిల్‌ జడ్జి తీర్పు మీద డివిజన్‌ బెంచికి అపీలు చేశారు. పై బెంచి ముందూ మఠం వారు పాతపాటే పాడారు. డివిజన్‌ బెంచి విని ఊరుకోలేదు. విచారణ సందర్భంలో ఒక సూటి ప్రశ్న వేసింది :

'మీరేమో మీ మతం స్థాపించింది వివేకానందుడని అంటున్నారు. ఆయనేమో తనది హిందూ మతం అని గర్వంగా చాటాడు. ఈ రెండిటికీ ఎలా పొసుగుతుంది?'

దానికి మఠం వారు తడబడకుండా భలే జవాబు చెప్పారు-

వివేకానంద స్వామి మొదట హిందూమత ప్రచారకుడేనట. కాని అమెరికా వెళ్లాక, పాశ్చాత్య ఆలోచనతో అక్కడి జీవన విధానంతో పరిచయం పెరిగాక మతము, దాని ప్రాముఖ్యత గురించి ఆయన భావాలలో మార్పు వచ్చిందట. మతాల యొక్క ఐక్యత మీద శ్రద్ధ పెట్టగా పెట్టగా ఆయనకు క్రమేణా 'విశ్వమతం' మీద విశ్వాసం కుదిరిందట. ఆ పళాన ఆయన 'ప్రపంచ మతము'ను ప్రబోధించాడట.  Miss Mary Louse Burk అనే ఆవిడ రాసిన 'Swami Vivekananda in the West' గ్రంథం రెండో సంపుటిని చదివితే ఈ దేవరహస్యం అర్థమవుతుందట. 'శ్రీ రామకృష్ణులు బోధించిందే అసలు వస్తువు. అదే హిందూయిజం అని హిందువులను అనుకోనివ్వండి. ఇతరులూ వారి పద్దతిలో దాన్ని పిలుచుకుంటారు' అని కూడా వివేకానందుల వారు చెప్పారటండోయ్‌!

ఇలా ఎక్కడెక్కడి గ్రంథాల నుంచో ఎవరెవరివో ఉటంకించి, చేంతాడంత వివరణ ఇచ్చేసరికి హైకోర్టు డివిజన్‌ బెంచికి కూడా జ్ఞానోదయమైంది. 'రామకృష్ణ మతము' యొక్క తత్వం బోధపడింది.

“Thoughts of Ramakrishna and Swami Vivekananda although were based on Vedanta, Writings and Speeches of Swami Vivekananda show that even though he had grown as a preacher of Hindu religion, he converted himself into a preacher of world religion different from Hindu religion, in latter years of his life being influenced by his greater acquaintance with western thought and way of life”.

(శ్రీరామకృష్ణ, స్వామి వివేకానందల ఆలోచనలు వేదాంతం మీద ఆధారపడిన మాట నిజమే. వివేకానందస్వామి హిందూమత ప్రచారకుడిగా పెరిగినప్పటికీ ఆయన రాతలను, ప్రసంగాలను గమనిస్తే హిందూ మత ప్రచారకుడి స్థాయి నుంచి ప్రపంచ మత ప్రబోధకుడుగా ఆయన పరివర్తన చెందినట్టు కనపడుతుంది. అనంతర సంవత్సరాల్లో పాశ్చాత్య ఆలోచన, జీవన విధానంలో పరిచయం పెరిగిన ప్రభావం వల్ల వచ్చిన మార్పు ఇది.)

- అని ప్రకటించి సింగిల్‌ జడ్జి తీర్పును ధ్రువీకరించి, రామకృష్ణ మతాన్ని ప్రత్యేక మైనారిటీ మతంగా 30వ అధికరణం కింద హైకోర్టు డివిజన్‌ బెంచి 1985లో నిర్ధారించింది.

 దాంతో రామకృష్ణ మఠం పంట పడింది. అక్కర తీరింది. హైకోర్టు ముద్రకొట్టి ఇచ్చిన 'మైనారిటీ' గుర్తింపు ' కవచంతో గవర్నమెంటు సతాయింపును వారు జయప్రదంగా నిరోధించి తమ కాలేజిని తాము నిశ్చింతగా పరిపాలించుకో సాగారు.

సమయానుకూలంగా వైఖరి మార్చి కార్యం సాధించటం రామకృష్ణ మిషన్‌ వారికి కొత్తకాదు. మునుపు 1969లోనూ తమది వేరే మతమని నమ్మించి బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాగే మైనారిటీ గుర్తింపును గుంభనంగా తెచ్చుకున్నారు. ఇప్పుడూ తమ నిర్వాకం బయటి ప్రపంచానికి పొక్కదనుకున్నారు. కాని హిందూమత పునరుజ్జీవానికి స్ఫూర్తి, చోదకశక్తి అయిన వివేకానందుడి సొంత సంస్థే తనకు హిందూమతంతో సంబంధమే లేదని చెప్పుకోవటమేమిటని, హిందూ సమాజం నిర్ఘాంతపోయింది. ముఫ్ఫై ఏళ్లకిందట దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

హైందవంతో పేగుబంధం తెంచుకొని, తనమీద హిందూముద్రను చెరిపేసుకోవటానికి రామకృష్ణ మిషన్‌ ఎన్ని ఆపసోపాలు పడ్డా, చివరికి కథ అడ్డం తిరిగింది. హైకోర్టు డివిజన్‌ బెంచి తీర్పుమీద కాలేజి టీచర్లు, కోల్‌కతా యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెంటనే అపీలు చేశాయి. తీర్పు రావటానికి షరామామూలుగా పదేళ్లు పట్టింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పక్షాన 1995 జూలై 2న జస్టిస్‌ వెంకటాచలయ్య వెలువరించిన తీర్పు మఠం వారి కట్టుకథను కొట్టిపారేసింది.

'హిందూమతం మాత్రమే సనాతన ధర్మం. ఎప్పుడూ ఉన్నది, ఎప్పటికీ ఉండేది హిందూమతం ఒక్కటే. ఇతర మతాలేవీ కలకాలం నిలిచేవి కావు'  - అని శ్రీరామకృష్ణులు -

'నేను హిందువునని చెప్పుకోవటానికి గర్వపడతాను. ప్రపంచంలోని మతాలన్నిటికి తల్లి అయిన హిందూమతానికి చెందినందుకు గర్విస్తాను' -  అని షికాగో విశ్వవేదిక మీద వివేకానందుడు పలికిన దివ్య వాక్కుల వంటివి ఎన్నిటినో ఉటంకించిన మీదట సుప్రీంకోర్టు ఇలా ప్రకటించింది.

It is a travesty of truth to say that Ramakrishna created a religion independent and apart from Hindu religion and called it a universal religion. That Swami Vivekananda changed his views in his latter years ,  even if true, the same cannot have the effect of Shri Ramakrishna himself bringing up a religion of his own according to the subsequent thinking of Swami Vivekananda. What Vivekananda proclaimed was that it is Vedanta and Hindu religion alone that can become the universal religion of man. The peculiar circumstances which led Ramakrishna Mission to make such claim, to save their college and other educational institutions from being taken away by the state Government...”
[1995 AIR 2089]

(హిందూ మతం నుంచి వేరుగా రామకృష్ణులు స్వతంత్ర మతాన్ని సృష్టించారని చెప్పటం సత్య దూరం. తరువాత సంవత్సరాలలో వివేకానంద స్వామి తన భావాలను మార్చుకున్నారని చెప్పటం ఒకవేళ నిజమే అనుకున్నా, భవిష్య కాలంలో వివేకానందుడి ఆలోచనల ప్రకారం రామకృష్ణులు సొంతంగా ఒక మతాన్ని పెట్టారని చెప్పటం కుదరదు. వేదాంతం, హిందూమతం మాత్రమే ప్రపంచమతం కాదగ్గదన్నదే వివేకానందుడు ప్రకటించిందల్లా! తమ కాలేజిని, ఇతర విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుపోకుండా కాపాడు కునేందుకే రామకృష్ణ మిషన్‌ విచిత్ర పరిస్థితుల్లో అలా చెప్పుకోవడాన్ని హైకోర్టు మాన్య న్యాయమూర్తులు సమర్థించి ఉండాల్సింది కాదు).