Sunday 22 April 2018

Secular TTD !

She openly admits she is a Christian and boasts of carrying a Bible with her all the time . Secularly blind AP government makes this ruling party MLA  an august  TTD Board member . Even after being caught , she has audaucity to say she is a Hindu. Amen .

TTD Chairman Designate attends Christian Prayer meetings. TTD memeber designate carries a Bible in handbag all the time. TTD staff happily attend Churches in official vehicles. No surprise if they baptise Lord Venkateswara one of these days .

Now that Chandrababu Naidu stipulated professing Christianity and carrying Bible in handbag  eligibility criterion for  TTD Board Member , seculars should demand that Church and Mosque should have due representation in every Hindu Temple committee .

https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/mla-in-eye-of-ttd-row-says-never-baptised/articleshow/63865478.cms

Tuesday 17 April 2018

దిక్కుమాలిన గగ్గోలు

   మతోన్మాద రాజకీయాల బెడద మీద మహామేధావులు కలిసి హైదరాబాద్ సదస్సులో వెలిబుచ్చిన అధర్మాగ్రహం గురించి ఈ రోజు పత్రికలలో ఓ వార్త చూశాను . నరేంద్రమోది మీద పగ పట్టిన ఓ పెద్ద తెలుగు దిన పత్రిక సంపాదకుడు కూడా పాల్గొన్న ఆ సదస్సులో మహా తెలివిగలవాళ్ళు అందరూ కూడి తేల్చింది ఏమిటంటే నరేంద్రమోడి హిట్లర్ దారిలో నడుస్తున్నాడని. జమ్మూ కాశ్మీర్ లో ఎనిమిదేళ్ళ బాలిక ను దారుణంగా చెరిచి చంపిన ఘాతుకాన్ని మోదీ క్రూరత్వానికి తాజా నిదర్శనంగా ఒక బుద్ధిలేని బుద్ధిజీవి అంటాడు. కొద్ది రోజులుగా దేశమంతటా ఇదే గగ్గోలు.


   అస్సాంలో ,బెంగాల్లో , కమ్యూనిస్టులు విప్లవాత్మకంగా రాజ్యమేలుతున్న కేరళలో ఎన్ని డజన్ల మంది హిందూ బాలికలు ఎంతమంది ముస్లిం ముష్కరుల చేతిలో ఎంత దారుణంగా చెరచబడి చిత్రవధ కాబడ్డా సెక్యులర్ సుకుమారులు చీమ కుట్టినపాటి అయినా చలించరు. నేరాన్ని నేరంలాగే చూడాలి తప్ప నేరస్తుల మతం చూడకూడదని సుద్దులు చెపుతారు. అదే ముస్లిం అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే మాత్రం వీళ్ళకు ఆమె మతం మాత్రమె కనిపిస్తుంది. దేశంలోని హిందువులందరూ కూడబలుక్కుని , ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదిని ఉసిగొలిపి బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్. గూండాల ద్వారా ఆ దురంతానికి ముస్లిములమీద పగతీర్చుకోవటం కోసమే పాల్పడినట్టు మీడియా నిండా తెగ యాగీ చేస్తారు.


   ఎక్కడో మారుమూల కుగ్రామంలో మూడు నెలలకింద ఒక ముస్లిం బాలికను ఎవరో కామపిశాచులు ఘోరంగా చెరిచి చంపి ఒక హిందూ దేవాలయం దగ్గర పారవేసి పారిపోతే , ఆ నేరం హిందువులే చేసినట్టూ, గుడిలోనే రోజుల తరబడి ఆమెను జై శ్రీ రాం అంటూ సామూహిక మానభంగం చేసినట్టూ కాషాయకామెర్లు కమ్మిన మన హిందూవ్యతిరేక సెక్యులరిష్టు, లెఫ్టిస్టు, జిహాదిష్టు, కాంగ్రెస్ పిశాచ గణం దిక్కులదిరేలా గావుకేకలు పెడుతున్నది. మేము రోజూ గుడికి వెళుతూనే ఉన్నాము, అలాంటి ఘాతుకమేదీ అక్కడ జరగనే లేదని స్థానికులు చెబుతున్నా ఈ అబద్దాలకోర్లు పట్టించుకోరు.

   సామూహిక మానభంగకార్యక్రమం ఎన్నో రోజుల పాటు జరిగినట్టుగా చెప్పబడుతున్న ఆ గుడి వాలకం చూస్తే అటువంటి కిరాతకం అక్కడ జరిగే అవకాశం ఉందని బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్న వాడు ఎవడూ అనలేడు. అత్యాచారానికి లోనైన బాలిక మరణించింది. అత్యాచారం చేసిన వాళ్ళ జాడ లేదు. స్థానిక హిందువులు కొందరిని కేసులో ఇరికించి అరెస్టు చేసినా , అది కావాలని చేసిన బనాయింపు దుర్మార్గమని కనపడుతూనే ఉంది. గుడిలోనే అత్యాచారం జరిగింది అనడానికి వీసమెత్తు ఆధారం లేదు . హిందువుల పవిత్ర ఆలయం దగ్గర శవాన్ని వదిలారన్న దాని బట్టే అది వేరే మతానికి చెందిన వాళ్ళు చేసిన పని అని కామన్సెన్సు ఉన్నవారెవరికైనా అర్థమవుతుంది. కాని హిందూమత ద్వేషులైన " సిక్యులరిస్టు " వింత జంతువులకు లాజిక్ తో పనిలేదు. ఏ కాడికీ మోదీని భ్రష్టు పట్టించటమే , ఆర్. ఎస్.ఎస్. ను , హిందూ మతాభిమానులను నరరూప రాక్షసులుగా చిత్రించటమే వారి సింగిల్ పాయింట్ ఎజెండా . ఉచ్చ నీచాల పట్టింపు దేశ ద్రోహులమూకకు ఏ కోశానా లేదు. సువిశాల భారత దేశంలో హిందూ స్త్రీల మీద ముస్లిం రేపిష్టులు రోజూ లెక్కలేనన్ని అఘాయిత్యాలు చేస్తున్నా పెదవి మెదపని దౌర్భాగ్యులు ఒక చోట ఒక ముస్లిం బాలిక మీద అలాంటి అఘాయిత్యం జరిగిందని తెలియగానే రెచ్చిపోయి, చొక్కాలు చించుకుని, కొవ్వొత్తులూ ప్లకార్డులూ పట్టి , దేశంలో మైనారిటీలకు భద్రత లేదు , ఆడవాళ్ళకు కనీస రక్షణ లేదు అంటూ పొలికేకలు పెట్టటం జాతివ్యతిరేకుల భయానక కుట్రలో భాగం. మతిలేని సినిమా తారలూ, బుర్ర చెడిన మీడియా మూర్ఖులూ ఈ కోరస్ లో చేరటం వల్ల పోయేది వాళ్ళ పరువే.





   

Monday 9 April 2018

మనువు విశ్వరూపం

ప్రపంచంలో మనువు - 3

డా. కేవల్ మొత్వానీ , ప్రొ. ఆర్. సురేంద్రకుమార్ 

అనుసరణ : ఎం.వి.ఆర్. శాస్త్రి 

...........

   ఆసియా , ఆఫ్రికాలలో క్రీ.పూ. 5000- 3000 మధ్య విలసిల్లిన ప్రాచీన నాగరికతలన్నిటికీ మనువు బాగా తెలుసు. కాకపొతే వేరు వేరు పేర్లతో  ! ప్రాచీన ఇరాన్ ( పర్షియా ) లో అతడి పేరు  " వైవహంత్ " !  ఈజిప్టు వాసులకు " మినా " గా , క్రేట్ లో " మినోస్ " గా మనువు పరిచితుడు . ప్రాచీన సుమేరియన్లు మనువును ఎరుగుదురు అనడానికి ఆధారాలున్నాయి. మనువు కుమార్తె ఇళ , అతడి కుమారుడి ప్రస్తావన క్రీ.పూ. 1600 లో అస్సీరియా లో కానవస్తుంది. క్రీ.పూ. 1200 నాటికి అయోనియా లో మనువు పేరు మానెస్ , మెన్స్ అయింది . పాలస్తీనాలో మోజెస్ నిజానికి మనువేనని కొందరు విద్వాంసుల నమ్మిక !

   మనం మాట్లాడుతున్న కాలానికి మొత్తం మధ్య ప్రాచ్యమంతా ఆర్యమయమే. ఆర్య శాఖ అయిన Hittites తెగ ఆసియా మైనర్ , అనటోలియా లను ఆక్రమించి  విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించింది. Mittani అనేది ఇంకో ఆర్య రాజ్యం . దానికి తూర్పున  పర్షియా ఉంటుంది.

    సోమ  వంశపు తొలి రాజు అయిన విశ్వామిత్రుడి తో జరిగిన 5 రోజుల యుద్ధంలో  ప్రాచీన రాజ వంశీకుడైన వీన రాజు ఓడిపోయి తన అనుయాయులతోకలిసి మాశ్రా తీరం దాటి ఈజిప్ట్ కు వలసపోయినట్టు మనుస్మృతి వ్యాఖాత కుల్లుకభట్టు అభిప్రాయం. క్రీ. పూ. 3400 లో అతడు అడుగు పెట్టే వరకూ ఈజిప్టు అనాగరిక దేశం. మనువు అనే బిరుదు ధరించిన వేనుడు వచ్చాకే ఆ దేశం లో నాగరికత మొదలైంది అని ఈజిప్ట్ చరిత్ర ప్రవీణులు చెబుతారు. మినా లేక మెన్స్ అనబడే మనువు పేరుమీదే ప్రాచీన ఈజిప్ట్ లో Menouphis అనే రాష్టం ఏర్పడింది.

   క్రీ.పూ. 522- 486 మధ్య ప్రాచీన ఇరాన్ ను ఏలిన Darius The Great తన సామ్రాజ్యానికి లా కోడ్ ను తయారుచేయించదలచినప్పుడు మనుధర్మ శాస్త్రాన్నే నమూనాగా తీసుకున్నారు. వర్ణాల పేర్లతో సహా  మనువు చెప్పిన సాంఘిక వ్యవస్థను అక్కడి వారు ఆమోదించారు. జొరాస్ట్రియనల ద్వారా మనుధర్మశాస్త్రం పశ్చిమ ఆసియా , యూరప్ ల లోని ఇతర నాగరికతలకు  పరిచయమైంది.

    మొత్తానికి ఈ ప్రాంతమంతటా నెలకొన్నది  వైదిక భారతం నుంచి చీలివచ్చిన ఆర్య సంస్కృతే .  బాబిలన్ నె తీసుకోండి. దానిని ఏలిన నాభానేదిష్టుడు తనను తాను మనువు పుత్రుడిగా అభివర్ణించుకున్నాడు. ప్రపంచ సృష్టికి , మానవ జాతికి, యుగాలకు  సంబంధించి బాబిలోనియన్ల లెక్కలు మనువు  చెప్పినదానికి సరిగ్గా సరిపోతాయి. బాబిలోనియన్ల సాంఘిక , రాజకీయ వ్యవస్థలు మనువు మూసలో రూపు దిద్దుకున్నవే. అలాగే అస్సీరియన్లూ ఆర్య సంప్రదాయాలు, మనుధర్మం ఆధారంగానే తమ సాంఘిక జీవనాన్ని రూపొందించుకున్నారు . 90 అధికరణాలుగల వారి లా కోడ్ కు మనుధర్మశాస్త్రం తో దగ్గరి పోలిక ఉంది.

   దక్షిణ ఆసియా , ఆగ్నేయాసియా లోని అనేక దేశాలలో మనువు, అతడి ధర్మ శాస్త్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. ఈ దేశాలకు బౌద్దానికంటే  పూర్వమే మనుధర్మం వెళ్ళింది. అక్కడ వివాహాలు, దత్తత, వారసత్వం , ఆస్తిహక్కులు, భూమి యాజమాన్యం, ఆచారాలు, పరిపాలన, సాంఘిక వ్యవస్థలవంటి అంశాలలో  మనుధర్మ ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది ఎంతగా అంటే .. భారత దేశపు విస్తృత సాంస్కృతిక సామ్రాజ్యంలో ఈ దేశాలు  వెలుపలి భాగాలు అని  చరిత్రకారులు భావించేటంతగా ! ఈ సాంస్కృతిక సామ్రాజ్యానికి పునాదిని మనువు వేస్తే , గౌతమ బుద్ధుడు దాని పైన సౌధాన్ని లేపాడని చెప్పవచ్చు. మానవజాతి చరిత్రలో సాంఘిక చింతనకు సంబంధించి మొట్టమొదటి ప్రణాళికా బద్ధ సంఘటిత నిర్మాణం అనదగ్గది మనుధర్మశాస్త్రం. తరవాతి శతాబ్దాలలో వచ్చిన సాంఘిక తత్వవేత్తలకు , శాసనకర్తలకు అది నమూనా అయింది.

  Emigrants from India , who laid foundations of a new world in tropical East , took with them their law book, The Code of Manu . Everywhere throughout this region , Manu has left his mark , in Burma, in Siam , in Cambodia , Java and Bali.  
[ Manu in Burma , J.S.Furnival ( in Burmese Research Society Journal ,1940 ]

   ఉష్ణ మండలానికి చెందిన తూర్పు ప్రాంతాలలో నూతన ప్రపంచానికి పునాది వేసిన భారతీయ వలసదారులు తమతోబాటు మనుధర్మశాస్త్రాన్ని  తీసుకుపోయారు. బర్మా, సయాం, కంబోడియా , జావా, బాలి సహా ఈ ప్రాంతమంతటా వారు వెళ్ళిన చోటల్లా మనువు తన ముద్ర వేశాడు ... అంటాడు విఖ్యాత పాశ్చాత్య విద్వాంసుడు ఫర్నివాల్ . బర్మాలో పూర్వ న్యాయగ్రంథాలు  మనుధర్మశాస్త్రానికి తమ రుణాన్ని బాహాటంగా అంగీకరించాయి. బర్మాలో పాళీ భాషలో రాసిన " నీతిసార" లోని అనేక అంశాలకు మనుస్మృతితో పోలిక ఉంది. బర్మా, కంబోడియాలలో లాగే సయాం లోని ప్రాచీన న్యాయ శాసనాలు మనుస్మృతికి దగ్గరగా ఉంటాయని Siam , Vol.1 గ్రంథంలో W.A.Graham పేర్కొన్నాడు.

   బాలి ద్వీపం, బర్మా , ఫిలిప్పీన్స్ , థాయిలాండ్ , చంపా ( వియత్నాం ) , కంబోడియా , ఇండోనేసియా , మలేసియా , శ్రీలంక, నేపాల్ లలో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి ఆయాదేశాలలో మనువు చెప్పిన ... వృత్తినిబట్టి వర్ణవ్యవస్థ అమలులో ఉండేది. మనువు సూత్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి , తీర్పులను వాటి ఆధారంగానే అక్కడ వెలువరించే వారు. రాజులు , చక్రవర్తుల తాము మనువు అనుయాయులమని చెప్పుకోవటానికి గర్వపడేవారు. మనువు సంబంధమైన పేరును తమ బిరుదాలలో చేర్చుకోవటానికి ఉత్సాహపడేవారు.

    చంప ( వియత్నాం ) లో లభించిన ఒక శాసనాన్ని బట్టి రాజా జయేంద్ర వర్మదేవుడు మనువు అనుయాయి. మనుస్మృతి ఆధారంగా రూపొందిన " మను నీతి సార " ప్రస్తావన ప్రస్తావన ఉదయన వర్మ మహారాజు శిలాశాసనం లో కనిపిస్తుంది. అలాగే యశోవర్మ శిలాశాసనంలో మనుస్మృతి లోని ఒక శ్లోకం యథాతథం గా చెక్కబడి ఉంది. రాజా జయవర్మ శిలాశాసనంలో మనుస్మృతికి సంబంధించి  ప్రవీణుడైన ఒక అమాత్యుడి  ప్రస్తావన ఉంది. బాలి ద్వీపంలో మనువు సాంఘిక విధానం నేటికీ అమలులో ఉంది.దక్షిణ ఆసియా లోని ఇతరదేశాల కన్నా ఇండోనేసియా పై మనుధర్మశాస్త్ర ప్రభావం ప్రబలంగా ఉంది. ఇండోనేసియా లా కోడ్ కు అదే మాతృక. ఆ దేశం లోని గ్రంథాలన్నిటిలోకీ ప్రాచీనమైనదిగా భావించే Kutara Manawa 20 వ శతాబ్దం ఆరంభం వరకూ అక్కడ అమలులో ఉండేది. అది మనుధర్మ మీద ఆధారపడ్డదే. ఆ దేశపు మిగతా న్యాయ గ్రంథాలలో Dewagama కి   మనుస్మృతి 7వ అధ్యాయం   , Swara Jambu కి  మనువు 8వ అధ్యాయం ప్రాతిపదిక . ఇక  ఫిలిప్పీన్స్ ప్రజలు మనువుని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారంటే వారి జాతీయ పార్లమెంటు  లో సెనేట్ చాంబర్ ఆర్ట్ గాలరీ లో  మనువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ( దీని వివరాలు ఈ వ్యాసావళి లోని మొదటి వ్యాసంలో ఇచ్చాము ) .



   బ్రిటిష్ , అమెరికన్, జర్మన్ ఎన్ సైక్లోపీడియా లు మానవులలో అగ్రేసరుడిగా , మొదటి శాసన కర్తగా న్యాయవేత్తలలో అగ్రగామిగా ,సామాజిక తత్వవేత్తగా వర్ణించాయి. A.A.MacDonnel,A.B.Keith , P.Thomas, Louis Renov తదితర పాశ్చాత్య గ్రంథకర్తలు మనుస్మృతి ని కేవలం  మత గ్రంథం గా కాక , మానవాళికి మేలు చేసే ఒక న్యాయగ్రంథంగా పరిగణించారు. The Cambridge History Of India , The Encyclopaedia of Social Sciences ( USA) , Keith రాసిన  History Of Sanskrit Literature ,భారతరత్న  P.V.Kane రచించిన  A History of Dharma Sastra లలోప్రపంచంపై  మనుస్మృతి   ప్రభావం గురించి చెప్పిన విషయాలు చదివితే ప్రతి భారతీయుడు తన ఉజ్వల వారసత్వానికి గర్వపడతాడు.

   మానవుడు తన చరిత్రను రికార్డు చేయటానికి పూర్వమే అతడి సామాజిక, ఆధ్యాత్మిక చింతనలను మనువు ప్రభావితం చేశాడు. మనువు , అతడి బోధల ప్రభావాన్ని బట్టి మానవ చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఉంది. ప్రాచ్య , పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలలో మనువు కు సముచిత అగ్రాసనం ఇవ్వాలి. మానవాళిని సేవించిన తాత్వికులు, ఆదర్శ వాదులు అందరిలోకీ supreme thinker ,patron saint గా మనువు స్థానం సుస్థిరం, శాశ్వతం.

( కేవల్ మోత్వాని " Manu Dharma Sastra  "  గ్రంథంతో బాటు ప్రొ. సురెంద్రకుమార్ రాసిన " Opposition to Manu - why ? పుస్తకంలోని కొన్ని విషయాలు ఈ వ్యాసానికి ఉపయోగపడ్డాయి. )

అయిపొయింది. 


Saturday 7 April 2018

గ్రీకులకు గురువు మనువు

ప్రపంచంలో మనువు-2

కేవల్ మోత్వాని 

అనుసరణ  : ఎం.వి.ఆర్ . శాస్త్రి

......

   ఆధునిక న్యాయానికి , సాంఘిక వ్యవస్థకు ఆద్యులెవరు ?

   ఈ ప్రశ్నకి చదువుకున్నవాళ్ళు ఎవరైనా చప్పున జవాబు చెపుతారు : గ్రీకులు , రోమన్లు అని.

    కానీ చాలామందికి తెలియనిది ఏమిటంటే ఆ గ్రీకులకు, రోమన్లకు గురువు ... మన మనువు!

    పాశ్చాత్య తత్వ శాస్త్రానికి మూలపురుషులైన  సోక్రటిస్ , ప్లేటో లమీద మనువు ప్రభావం విశేషంగా ఉంది. మనుధర్మ శాస్త్రం ఈజిప్టు  , క్రేట్ ల ద్వారా ప్రాచీన గ్రీస్  లో ప్రవేశించింది .  మనువుని గ్రీకులు Mens, Manes , Menes అని వ్యవహరించేవారు .క్రీ.పూ. 7 వ శతాబ్దంలో స్పార్టా , ఏథెన్స్ ల నుంచి క్రేట్ కు  వెళ్ళిన లైకర్గస్ ,సోలోన్ అనే ఇద్దరు గ్రీకు ప్రముఖులకు Mina లేక  Manos అనబడే మనువు ధర్మసూత్రాలు పరిచయమయ్యాయి.వారు పట్టుకు వచ్చిన  మనుధర్మ శాస్త్రాన్ని ఆసరా చేసుకుని గ్రీకు స్థానికులు సొంతంగా శాసనాలను రాయసాగారు. Code of Zalencus ( 660 B.C. ) , Code of Charondas ( 610 B.C.) అలా వచ్చినవే. రెండు శతాబ్దాల తరవాత రోమన్లూ ఈ మాదిరిగానే  Twelve Tables  లాంటివి రాశారు.

  లైకర్గస్ , సోలోన్లు తీసుకు వచ్చింది కేవలం న్యాయ సంహితే కాదు . గ్రీకుల జీవితాన్ని  , వారి ఆలోచనను మౌలికంగా మార్చిన జీవన విధానమది. గుణగణాలను బట్టి మనుషులని నాలుగు తరగతులుగా విభజించటం అనేది గ్రీసుకు  మనువునుంచే వచ్చింది. సర్  విలియం రామ్ సే,  డాక్టర్ ఇ. జె. ఉర్విక్ అనే ఇద్దరు ప్రఖ్యాత బ్రిటిష్ విద్వాంసులు గ్రీసు మీద మనువు ప్రభావాన్ని విశేషంగా అధ్యయనం చేశారు.  సర్ విలియం చారిత్రక కోణం నుంచీ , ఉర్విక్ తాత్విక కోణం నుంచీ దీన్ని  పరిశోధించారు. లండన్ యూనివర్సిటీ లో ఈ అంశం మీద చాలా ఏళ్ళు బోధించిన ఉర్విక్ - గ్రీకు తత్త్వవేత్త ప్లేటో " రిపబ్లిక్ "ను మనువు సాంఘిక దృక్పథం నుంచి విశ్లేషిస్తూ రాసిన తన సుప్రసిద్ధ గ్రంథం లో ఇలా అన్నాడు :

   It will need a separate volume to show how the Indian thought may have filtered through Socrates and Plato . In order to understand Plato fully ,one must be familiar with the philosophical and social thought of Manu .Just as Manu of ancient India instituted the Caste System upon the basis of three principles in individual soul , so Plato divides his State into three Classes representing the three psychic elements. The lowest caste of Producres corresponding to the Vaisya Caste , reflects the element of ignorant desire , epithumia . The next above this , Auxiliaries , corresponding to the Kshatriya Class , reflects the passionate element, thumos   .. The Guardians corresponds to the Brahmin Caste, represents the principle of prudent reason , the logistikon 

[ The Message Of Plato , E.J.Urvick ,PP.28-29 ]


( సోక్రటిస్ , ప్లేటో ల ద్వారా భారతీయ చింతన ఎలా ప్రసరించింది అన్నది వివరించాలంటే పెద్ద గ్రంథమవుతుంది.  ప్లేటో ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనువు తాత్విక, సామాజిక ఆలోచన మనకు తెలియాలి . ప్రాచీన కాలంలో భారతదేశంలో  మనువు   వ్యక్తిగత గుణగణాలను బట్టి వర్ణ వ్యవస్థ ను స్థాపించినట్టు , ప్లేటో తన రాజ్యాన్ని  మానసిక గుణాలను బట్టి మూడు తరగతులుగా వర్గీకరిస్తాడు. ఉత్పత్తిదారులు, వర్తకులకు చెందిన వైశ్య వర్ణం Producers తరగతికీ  ,Auxililiaries క్షత్రియ వర్ణానికీ , Guardians బ్రాహ్మణ వర్ణానికీ సరిపోలుతాయి.   )

   క్రీ.పూ. 2000 ప్రాంతం లో డాన్యూబ్ బేసిన్ నుంచి ఇటలీ కి మొట్టమొదట  వలసవెళ్ళిన వారు ఆర్యులు . క్రీ.పూ. 6 వ శతాబ్దం వచ్చేసరికి  ఆ దేశం పూర్తిగా ఆర్య ప్రభావం లోకి వచ్చింది. మధ్యధరా సముద్రం పై తిరుగులేని పట్టు సాధించిన రోమ్ మీద వాణిజ్య , సాంస్కృతిక  సంబంధాల ద్వారా ఇండియా వంటి ప్రాచ్య దేశాల నాగరికత ప్రభావం బాగా పడింది. పర్షియన్ సైనికుల ద్వారా ఇటలీ లో ప్రవేశించిన 'మిత్రార్చన' పూజావిధానం లో వైవస్వతమనువు ప్రస్తావన ఉంటుంది. గ్రీసు, ఈజిప్ట్ దేశాల నుంచి మనువు గురించిన ఎరుక ఇటలీ కి కలిగింది. క్రీ.శ. 527- 63 లో రోమన్ సామ్రాజ్యాన్ని ఏలిన జస్టీనియన్ హయాంలో రోమన్ లా కి సంబంధించిన న్యాయసూత్రాలను క్రోడీకరించే పని చేపట్టిన సందర్భంలో మనుధర్మశాస్త్రం బాగా ఉపయోగపడింది.  అదీ ఎంత బాగా అన్నది జాకోలియట్ మాటల్లో వినండి :

   The Hindu laws were codified by Manu more than 3000 years before the Christian Era , copied by the whole antiquity and notably,by Rome, which alone has left us  a written law - The Code Of Justinian , which has been adopted as the basis of all modern legislation ....
   There are astonishing number of correspondences between Manu and Justinian Digest in regard to different phase of social life such as  marriage, paternal authority, adoption , property , the laws of contract, deposit,loan , sale , partnership , donations and testaments . These divisions have passed almost unaltered from the Hindu Law into the Roman Law and the French Law , and the greater part of their particular dispositions are still in vigour. 

[ Bible In India , L.A.Jacolliot , 1868, pp. 34-35



    ( క్రీస్తుకు 3000  సంవత్సరాల పూర్వం మనువు కూర్చిన హిందూ న్యాయ సంహితను ప్రాచీన సమాజం అనుసరించింది.  " జస్టీనియన్ కోడ్ " పేరిట  రోమ్  మనకు అందజేసిన లిఖిత న్యాయమే ఆధునిక శాసనాలన్నిటికీ ప్రాతిపదిక . పెళ్లి, తండ్రి అధికారం, దత్తత , ఆస్తి , కాంట్రాక్టులు , డిపాజిట్లు, అప్పులు, అమ్మకాలు , భాగస్వామ్యాలు, విరాళాలు , వీలునామాలు వంటి సమాజజీవనానికి సంబంధించిన అనేక అంశాలలో మనువుకూ ,  జస్టీనియన్ డైజెస్టు కూ ఆశ్చర్యం కలిగించే పోలికలు ఎన్నో ఉన్నాయి. హిందూ లా లోని ఈ  సూత్రాలే ఏ మాత్రం మార్పు లేకుండా రోమన్ లా లోనూ , ఫ్రెంచి లా లోనూ చేరాయి వాటిలో హెచ్చు భాగం నేటికీ అమలులో ఉన్నాయి . )

    పై అంశాలకు సంబంధించి మనువు చెప్పిన దానినీ , జస్టీనియన్ కోడ్ లో ఉన్న నిబంధనలనూ  పక్క పక్కన పెట్టి బేరీజు వేసి మనుధర్మ శాస్త్రానికి రోమన్ లా ఎంత రుణపడి ఉందొ జాకోలియట్ నిరూపిస్తాడు.  జస్టీనియన్ కోడ్ ఆధారంగా తయారయిందని అందరూ అనుకునే ఫ్రెంచి సివిల్ కోడ్ లో కూడా జామీను, వేతనాలు, తనఖా ,కవులు, లీజు, అద్దె, ఆస్తి హామీ వంటి అంశాలపై హిందూ లా చెప్పేదానినే యథాతథంగా అనుసరించినట్టు రుజువుచేస్తాడు .

కాబట్టి - ఆధునిక శాసనాలకు మాతృక జస్టీనియన్ కోడ్  కాదు ! ముమ్మాటికీ  మనుధర్మ శాస్త్రమే !

ఇంకా ఉంది 

Thursday 5 April 2018

జగతికి జ్యోతి

ప్రపంచం లో మనువు - 1

డా. కేవల్ మోత్వాని 

అనుసరణ : ఎం.వి.ఆర్.శాస్త్రి

..........

   మనకు తెలిసినా తెలియక పోయినా ప్రాచీన ఆధునిక ప్రపంచాలలో ప్రబలంగా వినిపించే పేరు మనువు . ఋగ్వేదంలో విశిష్ట స్థానం గల మనువు పేరును ఆర్యులు తాము పోయిన చోటి కల్లా తీసుకు వెళ్ళారు .

   ఉత్తర చైనా లో మనుధర్మ శాస్త్రం ఉనికి కనిపిస్తుంది. పూర్వకాలంలో  ఇండియా, ఇరాన్, సుమేరియా , ఈజిప్ట్, , బాబిలోనియా, అస్సీరియా, అనటోలియా , పాలస్తీనా , గ్రీస్, రోమ్ లలో మనువు పేరు సుపరిచితం.

   తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలలో మనువుకు అత్యంత గౌరవ స్థానం ఉంది. బర్మా, సయాం ,  మలయా,ఇండోచైనా , ఇండోనీసియా, బాలి, ఫిలిప్పీన్స్ దీవులు, సిలోన్ మనువు జ్ఞాపకాన్ని పదిలపరచుకుని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల్లోని న్యాయ విధానాలు, సామాజిక వ్యవస్థలు మనువు బోధల పైనే ఆధారపడ్డాయి. సాంఘిక సంబంధాల సైన్సు అయిన మనుధర్మ శాస్త్రాన్ని  చరిత్ర తొలినాళ్ళ నుంచే భారతదేశం  అధ్యయనం చేసి , అమలుపరచింది. ఉటోపియా సృష్టికర్తలు , న్యాయ సంహితలకర్తలు అయిన పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలందరూ మనువు సంతానమే.

   మనుధర్మశాస్త్రాన్ని అనేక కోణాలనుంచి , పలువిధాలుగా  అధ్యయనం చేయవచ్చు, మతం, ఫిలాసఫీ ,సైకాలజీ , బయాలజీ , ఎథిక్స్ , హిస్టరీ , లా , పొలిటికల్ సైన్స్ ,జూరిస్ ప్రూడేన్స్ తదితర సబ్జెక్టుల విద్యార్థులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు మనువు దగ్గర దొరుకుతాయి. కొన్ని విషయాలలో పాశ్చాత్యుల సాంఘిక చింతన కంటే మనువు సాంఘిక చింతన ఎంతో ముందుంది .

    చరిత్రకారుడు చరిత్ర ఆరంభాన్ని ఎంత వెనకకి అయినా  నెట్టనీ ! అతడికి మనువు ఎదురవుతాడు ...మొరటు మానవ పదార్థాన్ని నైతికంగా , తాత్వికంగా ప్రగతిశీల వ్యక్తులుగా మార్చుతూ ! మనువు  మరచిపోయిన, మరణించిన గతానికి చెందిన వాడు కాదు. నాగరికత నేర్చిన ప్రతి మానవుడి జీవితంలోనూ అతడు జీవశక్తిగా నేటి భూమండలం ముఖాన ఊపిరులూదుతున్నాడు .

   Manu is the only teacher among the elect of the human race , whose teachings have done the greatest good ,to the greatest number of people , over the largest area of the world and for the longest period of time .

  మొత్తం మానవ జాతి చరిత్రలో తన ఉపదేశాల ద్వారా ప్రపంచంలో అత్యంత విశాల ప్రాంతంలో , అత్యధిక కాలం , అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మేలును చేకూర్చిన ఏకైక బోధకుడు మనువు . కాని మానవ జాతిచరిత్రలోని ఈ దశ చరిత్రకారుల దృష్టిని ఆకర్షించలేదు.ప్రపంచమంతటా స్కూళ్ళు ,కాలేజీలు , యూనివర్సిటీల హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో ఎంత వెదికినా దీనిజాడ మచ్చుకైనా కానరాదు. మనువు ఏ ఒక జాతికో కాదు - మొత్తం ప్రపంచానికి చెందిన వాడు .మనువు బొధలకు ప్రసారకేంద్రం , కష్టోడియన్ అయిన ఇండియా మీద అతడి స్ఫూర్తిని , దార్శనికతను  పునరుజ్జీవింప జేయాల్సిన ప్రత్యెక బాధ్యత ఉంది .

మనుధర్మశాస్త్రాన్ని The Code of Manu ,the Law Giver అని సాధారణంగా అనువాదం చేస్తున్నారు .ఇది సరి కాదు . ఇండియా యొక్క సామాజిక , న్యాయపరమైన సంబంధాలను అనాదిగా మనువు నియంత్రించినా ఆయన ఇండియాకు న్యాయ ప్రదాత కాదు. ఆయన ఉపదేశాలకు చట్టానికి ఉండే లీగల్ అథారిటీ లేదు. వ్యక్తికీ , సమాజానికీ సౌహార్ద సంబంధాలు నెలకొనేందుకు దోహదించే ధర్మ సూత్రాలను మాత్రమే మనువు ప్రకటించాడు.

                          దూరప్రాచ్యంలో మనువు ప్రభావం 


1932 వ సంవత్సరం లో మంగోలియాలోని చైనా గోడలో ఒక భాగం జపనీయుల బాంబు దాడికి ధ్వంసమైంది .  అక్కడ   గోడ కింద నేలలో చాలా లోతుకు తవ్వితే ఒక లోహపు పెట్టె కనిపించింది .  చైనా ప్రాచీన చరిత్రకు సంబంధించి ఒక విలువైన డాక్యుమెంటు అందులో దొరికింది. ఆ లిఖిత పత్రాన్ని సంపాందించిన సర్ ఆగస్టస్ ఫ్రిజ్ జార్జ్ దానిని లండన్ కొనిపోయి ప్రొఫెసర్ ఆంథోనీ గ్రేమ్ అనే చైనీస్ భాష నిపుణుడికి  అందచేశాడు .నిపుణుల బృందం సాయంతో ఆయన తెగ కష్టపడ్డాడు. అనువాదమైతే చేయగలిగాడు  కానీ ఆ రాతప్రతి విలువను మదింపు చేయలేకపోయాడు.  ఆంగ్ల అనువాదాన్ని బ్రిటిష్ మ్యుజియం లోని Sir Wallis Budge కి చూపిస్తే ఆ దొరగారు దాని తబిసీలును తేల్చాడు.

   జరిగిందేమిటంటే -

   ప్రాచీన కాలంలో  చిన్ ఇజా వాంగ్ అనే చైనా చక్రవర్తి ఉండేవాడు .చరిత్ర అనేది తనతోనే మొదలైందనీ , చైనా నాగరికత సాధించిన ఘనతంతా తనవల్లే ఒనగూడిందనీ భావితరాలవారు అనుకునేట్టు చేయాలని అతడు ఉబలాటపడ్డాడు . ఇంకేం? తనకు పూర్వపు చరిత్ర గ్రంథాలను అన్నింటినీ అతడు తగలబెట్టించాడు. చైనా పూర్వ వైభవాన్ని సూచించే రికార్డులనన్నింటినీ చక్రవర్తి నాశనం చేయించాడు . అదిగో అ దశలో ఒకానొక చరిత్రకారుడు తాను ఎరిగిన చైనా పూర్వచరిత్ర నంతటినీ రాసి లోహపు పెట్టెలో భద్రపరిచి భూమిలో పాతేశాడు. ఏ పరిస్థితులలో తాను ఆ పని చేయవలసి వచ్చిందో కూడా ముందుమాటగా అందులో రాసిపెట్టాడు.

    'In the manuscript , I find direct refereences to the Laws of Manu which were first written in India in the  Vedic language  ten thousand years ago ' ( పదివేల సంవత్సరాల కింద వైదిక భాషలో రాయబడ్డ మనువు ధర్మసూత్రాలను ఆ ప్రాచీన రాతప్రతిలో నేరుగా ప్రస్తావించారు ) అని సర్ వాలిస్ వెల్లడించాడు . ఆ కాలంలో ఇండియా , చైనా , అమెరికా ల మధ్య సరాసరి సంబంధాలు ఉన్నట్టు ఆ రాత ప్రతి రుజువు చేసింది అన్నాడాయన .

ఇంకా ఉంది 





Wednesday 4 April 2018

దళితుల ఊసు ఎక్కడ ?

మనుధర్మం -14

ఎం.వి.ఆర్.శాస్త్రి.

....... 


   "మనుస్మృతి" మీద మీకు ఎందుకు కోపం ? అని  ఈ దేశం లో ఏ అతితెలివి మేధావినైనా అడగండి .  రైటా , లెఫ్టా .. అన్న తేడా లేకుండా   అందరూ చెప్పేది ఏమిటంటే ... మనుస్మృతి శూద్రులపట్ల,  దళితులపట్ల దారుణమైన వివక్ష చూపిందని !  మాలమాదిగలు గాని వేదం వింటే వారి చెవుల్లో సలసల మరిగే సీసం పోయాలన్నదని ! వేదమంత్రాలను ఉచ్చరించినా , బ్రాహ్మణులను తిట్టినా వారి నాలుక కోసేయ్యాలన్నదని! అసలు దళితుల నీడ కూడా బ్రాహ్మణులకు సోకరాదని  కర్కశమైన ఆక్షలు పెట్టిందని. చిన్న తప్పులకు కూడా శూద్రులకు , దళితులకు సజీవ దహనం చెయ్యటం , శరీర భాగాలనో, మొత్తం మనిషినో నరికెయ్యటం లాంటి క్రూర శిక్షలు విధించిందని. పంచముల పట్ల అమానుషమైన అంటరానితనాన్ని పాటించాలన్నదని ! ఇంకా.. ఇంకా..

   ఇది అన్యాయం. ఈ కాలపు దృష్టితో మనుస్మృతిలో నడమంత్రంగా ఇరికించబడ్డ  కొన్ని శ్లోకాలను చూస్తె  ఎస్.సి. , ఎస్.టి, బి.సి. , ఎం.బి.సి. కులాలకు మనువు శత్రువు అన్న దురభిప్రాయం కలగటం సహజం. కాని నిజానికి ...మనం అనుకుంటున్న ఎస్.సి., ఎస్.టి. లనే దళిత కులాల ప్రస్తావనే మనుస్మృతిలో ఎక్కడా లేదు. ఫలానా ఫలానా పాపాలు, తప్పుడు పనులు చేసిన వారిని - వారు ఏ వర్ణానికి చెందినవారైనా  అంటరాని వాళ్ళుగా చూడాలనటమే తప్ప ఫలానా వర్గంలో పుట్టినవారందరిని జన్మ కారణం చేత అస్పృశ్యులుగా చూడాలని మనుస్మృతిలో ఎక్కడా చెప్పలేదు. బ్రాహ్మణ స్త్రీకి , శూద్ర పురుషుడికి పుట్టినవాడు చండాలుడు అని పేరు పెట్టారే తప్ప చండాల అనేది ఒక కులమనీ, అందులో పుట్టినవారు, వారు సంతతివారు అందరూ అంటరానివాళ్ళు అని మనువు ఎక్కడా అనలేదు. మాలమాదిగలో , మరొక పంచమ కులస్తులో అంటుకుంటే అగ్రవర్ణం కొంపలంటుకు పొతాయనో , వారి నాలుకలు చీరేయ్యాలనో ,  నిలువునా తగలబెట్టాలనో మనుస్మృతిలో ఎక్కడా కానరాదు . పుస్తకంలో ఏముందో చదవకుండానే, తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే హిందూ మతం మీద కసి కొద్దీ అభాండాల బండలు వేసే  మూర్ఖులకు నిజానిజాలతో పనిలేదు.

   బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః త్రయో వర్ణాః ద్విజాతయః 
   చతుర్థ  ఏకజాతిస్తు శూద్రః నాస్తి తు పంచమః       ( మనుస్మృతి 10 -4 )

  ద్విజులలో బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య అనేవి మూడు వర్ణాలు .. నాలుగోది ఏకజాతి ది అయిన శూద్రవర్ణం. ఇవి తప్ప ఐదో వర్ణం అనేది లేదు ... అని మనుస్మృతి విస్పష్టంగా చాటుతున్నప్పుడు పంచమ వర్ణాన్ని మనమే పుట్టించి దానిమీద పగబట్టాడని మనువుని తిట్టిపోయటం న్యాయమేనా ?!

   పోనీ ఇప్పటి దళిత కులాలను ప్రత్యేకంగా ఐదో నంబరు కేటగిరీ కింద మనువు చేర్చి ఉండకపొవచ్చు . కాని నాలుగోదైన శూద్రవర్ణం లోనే వాటినీ కలిపి ...   ఎస్.సి. , ఎస్.టి. , బి. సి. లు యావన్మందినీ శూద్ర ఖాతాలో వేసి ... మొత్తం అందరినీ అంటరానివాళ్ళు గా, అగ్రవర్ణాలకు వారి గాలే సోకకూడనంత నీచులుగా పరిగణించి ,వెలివేశారేమో ?!

  ఆ శంకకూ తావు లేదు. ఎందుకంటే  ద్విజులకు  ఇంటిపని వంటి సేవలు శూద్రులు చేయవచ్చునని మనువు చెప్పాడు. శూద్రులు అంటరాని వాళ్ళు అనుకుంటే ద్విజులైన బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య వర్ణాల గృహస్తుల ఇళ్ళలోకి వారిని ఎందుకు రానిస్తారు ?

   సమాపీ ప్రపా సహ వోన్నభాగః సమానే యోక్త్రే సహ 
   వో యునజ్మి . సమ్యంచోగ్నిం సపర్యతారా నాభిమివాభితః    ( అథర్వణ వేదం 3.30.6 )

    రథానికి నలువైపులా చక్రాలు సమంగా అమరినట్టు మానవులందరూ వేదవిహితమైన అగ్నికార్యాన్నిచేసి  , యజ్ఞేశ్వరుడిని కలిసి పూజించి  , కలిసి భోజనం చేయాలని  అథర్వణ వేదం  లో ఉంది .

   దశరథుడు చేసిన అశ్వమేథ యాగంలో " బ్రాహ్మణా భుంజతే నిత్యం నాథవంతశ్చ భుంజతే  "   ( బ్రాహ్మణులు  భోజనం చేశారు , శూద్రులు భోజనం చేశారు ) అని వాల్మీకి రామాయణం బాలకాండ ( 14-10 ) చెపుతుంది.

   శ్రీరాముడు వనవాసానికి వెళుతూ ( ఇప్పుడు షెడ్యూల్డ్ తెగ లో చేర్చాల్సిన ) గుహుడిని అభిమానంతో  ఆలింగనం చేసుకుంటాడు. ఆ నిషాదరాజు తన కాళ్ళు కడిగి నాలుగు రకాల ఆహార పానీయాలను చేతికందిస్తే  ఆరగిస్తాడు. నిషాదుడు అంటరానివాడు అన్న ఆలోచన ఆయనకు ఏ కోశానా లేదు.



    అదే కోదండ రాముడు సీత జాడ వెదుకుతూ శబరి ఆశ్రమానికి పోయినప్పుడు ఆ గిరిజన మహిళ కొరికి ఇచ్చిన పండ్లను ఎంగిలి అనుకోకుండా ఇష్టపడి తింటాడు. "తపోధనే" ( తపస్సే సంపద అయినదానా ) అని సంబోధించి " నీ తపస్సు సరిగా సాగుతున్నదా " అంటూ కుశలప్రశ్నలు వేస్తాడు. అంతేగాని నా అంతటి సుక్షత్రియుడిని ముట్టుకోవటమే కాక ఎంగిలి పండ్లు పెడతావా అంటూ ఆ ఆటవిక స్త్రీ మీద కత్తి దూయడు.

 ( తపస్సు బాగా అవుతున్నదా ? అని  ఒక గిరిజన మహిళనే ఆప్యాయంగా అడిగిన రాముడి మీద  - తపస్సు చేస్తున్న నేరానికి శంబూకుడు అనే శూద్రుడి తల నరికాడంటూ తరవాత పుట్టుకొచ్చిన వారు దారుణ హత్యాభియోగం మోపటం ఘోరం ! )

    అంతరాణ వీథ్యశ్చ సర్వే చ నటనర్తకాః
    శూదా నార్యశ్చ బహవో నిత్యం యౌవనశాలినః 

[ రామాయణం , ఉత్తరకాండ 91-22 ]

   పట్టాభిషేకం తరవాత తాను చేసిన యజ్ఞానికి వచ్చి విందు ఆరగించి పొమ్మంటూ శ్రీరామచంద్ర ప్రభువు -వీథుల్లోని వర్తకులకు, నటులు, నర్తకులు, స్త్రీలు , శూద్రులు యావన్మందినీ   పిలువనంపుతాడు .

    ధృతరాష్ట్ర మహారాజు చేసిన యజ్ఞాలలో , పెద్ద ఉత్సవాలలో సూపకారులు, ఆరాలికులు వంటలు చేసేవారని మహాభారత  ఆశ్రమ పర్వం (1.1.9 ) లో ఉంది. యుధిష్థిరుడు చేసిన అశ్వమేధం లో శూద్రవర్ణానికి చెందిన ఆ సేవకులు వేలాది బ్రాహ్మణులకు ఆహారం, నీరు వడ్డించారని భారత అశ్వమేధ పర్వం ( 85 : 41-42 ) అంటుంది. పశుపాలన , వ్యవసాయం చేసే వారు, ఇండ్ల లోని సేవకులు , క్షురకాది వృత్తులవారు పెట్టే ఆహారాన్ని ఎవరైనా తినవచ్చునని ఒక్క మనువే కాదు .. గౌతమ , పరాశర , యాజ్ఞ్యవల్క్య విష్ణు స్మృతులు కూడా చెప్పాయి.

   మన పవిత్ర గ్రంథాలలో ఇన్నిన్ని ప్రబల దృష్టాంతాలు కనపడుతున్నప్పుడు హిందూ మతం శూద్రులను , దళితులను అంటరానివాళ్ళు గా చిన్నచూపు  చూసిందని ఎంతటి బుద్ధిహీనుడైనా గుండెమీద చేయి వేసి చెప్పగలడా ?

   పుట్టుకను బట్టి కొన్ని వర్గాలను అంటరానివిగా చూడటం  అనేది తరవాత కాలాల్లో హిందూ సమాజానికి పట్టిన మాయరోగం. అలాంటి అస్పృశ్యతకు శ్రుతి , స్మృతి , పురాణాలలో ఇసుమంతైనా ఆమోదం లేదు. అనుమతి లేదు. ఆదినుంచీ ఉన్న , మనువు ఆమోదించిన " కర్మణా వర్ణ వ్యవస్థ " ను తరవాత వారు " జన్మనా జాతి వ్యవస్థ " గా భ్రష్టు పట్టించి , ముదనష్టపు కులవ్యవస్థను తెచ్చిపెట్టి , బడుగు బలహీన దళిత వర్గాలను దారుణ వివక్షకు గురి చేస్తే ఆ పాపం మనువుది కాదు.  హిందూ మతానిది అసలే కాదు. మహోదాత్తమైన , సమస్త మానవ జాతి  గర్వపడదగిన సనాతన ధర్మాన్నీ, వైదిక సంస్కృతినీ  కన్నుగానక మనం నెత్తికెత్తుకున్న పాపిష్టి కులవ్యవస్థకు ముద్దాయిని చేయటం దుర్మార్గం , దురుద్దేశ పూరితం . అన్యమతస్తులువిదేశీ దుష్ట శక్తులు హిందూ మతాన్ని కుళ్ళబొడిచేందుకు పన్నిన భయంకర కుట్రలో భాగం. 

   ..............

 ఇంతటితో  ఈ రచన పూర్తయింది.  దీనికి  అనుబంధంగా  ... మనుధర్మ శాస్త్ర విశ్వ జనీనతపై  శ్రీలంక  జాతీయుడు  కేవల్  మొత్వానీ  60 ఏళ్ల  కింద కాలిఫోర్నియా యూనివర్సిటీ కి  సమర్పించిన పిహెచ్.డి. థీసిస్ లో ఆసక్తికరమైన  కొన్ని అంశాలు  ఆయన మాటల్లోనే  రేపటినుంచి .   



 


Tuesday 3 April 2018

కిల్లర్ రాముడి డాడీ !

   
   శ్రీరామచంద్రుడు ఇంకా పుట్టలేదు. అతడి తండ్రి దశరథుడికి ఇంకా పెళ్లి కాలేదు. సిహాసనమూ ఎక్కలేదు.

   కోడె వయసు యువరాజు ధనుర్బాణాలు ధరించి చీకటి వేళ సరయూ నది తీరానికి వెళ్లాడు. దూరాన నీటిలో కడవ ముంచిన చప్పుడు వినవచ్చింది. అది వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే సమయం. ఏ ఏనుగో నీళ్ళు తాగుతున్నదని దశరథుడు తలచాడు. శబ్దాన్ని బట్టి ఎంత దూరాన ఉన్న లక్ష్యాన్నైనా బాణంతో కొట్టగల తన  శబ్దభేది విద్యను సరదాకొద్దీ ప్రయోగించాడు. బాణం వదిలాడు. మదపుటేనుగు శరాఘాతానికి కుప్పకూలిన శబ్దానికి బదులు ఒక మనిషి ఆక్రందన వినిపించింది. యువరాజు తల్లడిల్లి పరుగున అక్కడికి వెళ్ళాడు. కిందపడి విలవిల లాడుతున్న తాపసిని చూశాడు.

  " వృద్ధులు , అంధులు అయిన నా తలితండ్రుల దప్పిక తీర్చటానికి నీటికోసం వచ్చిన నన్ను ఎందుకు చంపావు ? " అని మునికుమారుడు నిలదీశాడు. తలవాచేట్టు చివాట్లు పెట్టాక " నా తండ్రి శాపం పెడితే నువ్వు నాశనమవుతావు. దానికంటే ముందు నువ్వే వెళ్లి క్షమించమని అడుగు. బతికిపోతావ్ . ముందు ఈ బాణం బాధ తట్టుకోలేకపోతున్నాను. దాన్ని లాగేసి పుణ్యం కట్టుకో " అన్నాడు .

   దశరథుడు డైలమాలో పడ్డాడు. బాణం లాగితే తాపసి మరణిస్తాడు. తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. అతడేమో బాధ భరించలేను బాణం లాగెయ్యమంటున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి ? తపస్వి అతడి గుంజాటన కనిపెట్టి ఇలా అన్నాడు:

   బ్రహ్మహత్యాకృతం పాపం హృదయా దపనీయతామ్

   న ద్విజాతి రహం రాజన్ మాభూ త్తే మనసో వ్యథా 
   శూద్రాయా మస్మి వైశ్యేన జాతో జనపదాధిప   

[ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 63వ సర్గ , 49 , 50 శ్లోకాలు ]

   (నేను  మరణిస్తే నీకు బ్రహ్మహత్యా మహాపాపం వస్తుందనే శంక నీ మనసులోంచి తొలగించు. నేను బ్రాహ్మణుడిని కాను. నేనొక శూద్ర స్త్రీకి వైశ్యుడి వలన పుట్టినవాడను. )

   సరే ! దశరథుడు బాణం లాగాడు . ముని కుమారుడు ప్రాణం విడిచాడు. దశరథుడు కడవతో నీరు ఎత్తుకుని మునివాటికకు వెళ్లి కొడుకు రాక కోసం గంపెడాశ తో ఎదురు చూస్తున్న చూపులేని ముసలి దంపతులకు దారుణ దుర్వార్తను వినిపించాడు. నిశ్చేష్టుడైన వృద్ధముని  కాస్త తేరుకున్నాక " నువ్వే వచ్చి చెప్పుకున్నావు కాబట్టి బతికి పోయావ్. లేకపోతే నా శాపానికి నీ తల లక్ష ముక్కలయ్యేది. మమ్మల్ని వెంటనే మా కుమారుడున్న చోటికి తీసుకువెళ్ళు " అంటాడు. అక్కడికి వెళ్ళాక కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపిస్తూ తండ్రి ఇలా అంటాడు

  కస్య వా పరరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం 
  అధీయానస్య  మధురం శాస్త్రం వాన్య ద్విశేషతః 

   కో మాం సంధ్యా ముపా స్యైవ స్నాత్వా హుతహుతాశనః 
   శ్లాఘయిష్య త్యుపాసీనః పుత్రశోకభయార్దితం       

 [ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 64వ సర్గ , 33 , 34 శ్లోకాలు ]

   ( ఇటుపై ఎవడు అర్ధరాత్రి లేచి హృద్యంగా మధురస్వరం తో వేదశాస్త్రాలు , తక్కిన పురాణాలు చదువుతుండగా వినగలను ? ఎవడు ఇకపై స్నానం చేసి , సంధ్యవార్చి అగ్నిహోత్రమందు హోమం చేసి పుత్రశోకం తో పీడితుడనైన నాకు శుశ్రూష చేస్తాడు ? ) 

   ఇలా పరిపరివిధాల రోదించి  కుమారుడికి తండ్రి ఉత్తరక్రియలు చేస్తాడు. రెక్కలు తెగిన పక్షుల్లాంటి తాము కొడుకు లేనిదే జీవించజాలమని పలికి  అక్కడికక్కడే చితి పేర్చుకుని ధర్మపత్నితో సహా  అగ్నిప్రవేశం చేయబోతూ " నాలాగే నువ్వుకూడా  పుత్రశోకంతో మరణిస్తావు " అని దశరథుడికి శాపం పెడతాడు. అప్పుడే ఇంకో మాట కూడా అంటాడు :

   అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా ముని :
   తస్మా త్త్వాం నావిశ త్యాశు బ్రహ్మహత్యా నరాధిప      

[ వాల్మీకి రామాయణం , అయోధ్యా కాండ , 64వ సర్గ , 56 వ  శ్లోకం ]

   ( రాజా ! క్షత్రియుడివైన నీవు అజ్ఞానం వల్ల మునిని చంపావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం కలగదు. )




   ఇప్పటి లెక్క ప్రకారం షెడ్యూల్డ్ తెగ ( ఎస్.టి. ) అయిన బోయ కులంలో పుట్టి మహర్షి అయిన వాల్మీకి రాసిన ఆదికావ్యం లోని ఈ ఘట్టాన్ని బట్టి మనకు కొన్ని వాస్తవాలు  వెల్లడవుతాయి .

    మన సైన్సు తన శక్తి మేరకు కనుక్కొని మనకు చెప్పిన ప్రకారమే రామసేతువు కనీసం 7 వేల ఏళ్ల కిందటిది . దానిని కట్టిన రాముడు పుట్టటానికి చాలా ఏళ్ల పూర్వపు భారత వైదిక ఆర్య సమాజంలో ...

    1. శూద్ర స్త్రీని పెళ్ళాడిన  ఒక వైశ్యుడు ఋషి అయ్యాడు. దేశాన్నేలే రాజునే శపించగల తపశ్శక్తి సంపన్నుడయ్యాడు. ఆ రాజు తన కాళ్ళు పట్టుకుని వేడితే తల వక్కలు చేయకుండా కనికరించాడు.

    2. వైశ్య భర్త , శూద్ర భార్య , వారికి కలిగిన కుమారుడు రోజూ అగ్నిహోత్రం లో హోమం చేసేవారు. వేదశాస్త్రాలు చదివేవారు. బ్రాహ్మణుడుగా  జన్మించని కుమారుడు రోజూ సంధ్యావందనం చేసి తన వైశ్య తండ్రికీ , శూద్ర మాతకూ రాత్రి పొద్దుపోయేదాకా వేదాలను, పురాణాలను మధురస్వరంతో  వినిపించేవాడు. వేదం చదివితే నాలుక కోస్తారు , వింటే చెవుల్లో మరిగే సీసం పోస్తారన్న భయం ఆ ముని కుటుంబంలో ఎవరికీ లేదు.

   3. జన్మ చేత బ్రాహ్మణులు కాకపోయినా వారు దేశాన్నేలే రాజు చేతే పూజ్య తపస్వులుగా పాదాభివందనాలు అందుకున్నారు.

   4. తన తల్లిది శూద్ర వర్ణం , తండ్రిది వైశ్య వర్ణం కాబట్టి తాను బ్రాహ్మణుడు కాడని మునికుమారుడు అనుకున్నాడు. అందుకే నీ వల్ల నా ప్రాణం పోయినా నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకోదు అని రాజుకు భరోసా ఇచ్చాడు. కాని గుణ కర్మ ల రీత్యా అతడు నూటికి నూరు పాళ్ళూ బ్రాహ్మణుడే. ఆ సంగతి అతడికంటే విజ్ఞుడు, ధర్మజ్ఞుడు అయిన తండ్రికి తెలుసు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం  వారు  బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణ కుమారుడి మరణానికి కారకుడైన రాజుకు బ్రహ్మహత్యాపాతకం మామూలుగా అయితే తగలవలసిందే. కానీ అది తెలియక చేసిన నేరం కనుక , నేరస్తుడు తనను క్షమాబిక్ష వేడాడు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం తగలకుండు గాక అని వృద్ధ ముని తన తపశ్శక్తి చేత మినహాయింపు ఇచ్చాడు.

   ఈ కాలంలో మన మహామేధావులు మనకు నూరిపోస్తున్న ఘోర చరిత్రే కనుక నిజమయితే .. ఈ ఘట్టంలో దశరథుడు ఏమి చేయాల్సింది ? శూద్రుడు వేదం చదవకూడదు . వినకూడదు. తపస్సు చేయనే కూడదు అని దారుణమైన మనువాద ఆంక్షలు అమలులో ఉన్న కాలమట కదా అది ?! ఎవడో శూద్రుడు ఎక్కడో తపస్సు చేస్తున్నాడని ఒక బ్రాహ్మడు వచ్చ్చి పితూరీ చేయగానే దుష్ట రాముడు అర్జెంటుగా వెళ్లి శంబూకుడనే  శూద్రుడి తల నరికేశాడట గదా ?  కొడుకే అంత పని చేసి ఉంటే మరి  అతడిని కనబోయే దశరథుడు ఇంకెంత " కట్టర్ మనువాది " అయి ఉండాలి?

   శూద్ర సంతానమైన వాడు మునివాటికలో తపస్సు చేస్తున్నాడూ   అంటే అది ఎలాగూ తల నరకాల్సినంతటి నేరమే కాబట్టి రాత్రివేళ తన బాణం తగిలి అతడు చావటం న్యాయమే అని దశరథుడు డబాయించి ఉండాలి కదా ?" చావు !శూద్రా ! " అని గర్జించి వాడు అడగకుండానే బాణం లాగి చంపి ఉండాలి కదా ? తరవాత అడ్రెసు కనుక్కుని మునివాటిక వెళ్లి బ్రాహ్మణులుగా పుట్టకుండా తపస్సు చేస్తున్న నేరానికి ముసలి దంపతుల తలలు అక్కడికక్కడే తెగ వేసి ,  సామాజిక చైతన్యవంతులైన మన మహాజ్ఞానులకు  మనువాదాన్ని చీల్చిచెండాడడానికి ఇంకో గొప్ప ప్రచారాయుధం అందించి ఉండాల్సింది కదా ?

   మరి కిల్లర్ రాముడి డాడీ అవేమీ చేయనే లేదేమిటి ? అబ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తున్నారు , హోమాలు , తపస్సులూ ఎంచక్కా చేసుకుంటున్నారు అని తెలిసినా మండిపడకుండా ,  పోయిపోయి వాళ్ళ కాళ్ల మీదే పడ్డాడేమిటి ?

   దశరథుడి నాటికి మనుధర్మం లేదు .కొడుకు హయాంలోనే అది తగులడింది అని సర్ది చెప్పుకుందామా ? కుదరదు . మనువు దశరథుడి  కంటే బోలెడు తరాల ముందువాడు. ఇక్ష్వాకు వంశ మూలపురుషుల్లో ఒకడు.

    ఇంకా ఎన్నాళ్ళు వినిపిస్తారు శంబూకుడి కట్టుకథను ?

 







Monday 2 April 2018

మనువు శూద్ర ద్వేషా ?

మనుధర్మం - 12


ఎం.వి.ఆర్.శాస్త్రి
........
 

  ఫలానా కులంలో పుట్టుక చేతనే వీరు అధికులు, వారు నీచులు .. వీరిది ఎక్కువ కులం , వారిది తక్కువ కులం ... అని  జాతిదురహంకారులు ఎన్ని దరిద్రగొట్టు దురాలోచనలు వ్యాప్తి చేసినా -

    వాస్తవానికి  మనుషులందరిదీ ఒకటే కులం. భరతఖండంలో పుట్టినవారందరిదీ ఒకటే డి.ఎన్.ఏ. ! ఒకటే రక్తం ! ఆ జాతికి మన పూర్వులు పెట్టిన పేరు "శూద్ర " అని.

    జన్మనా జాయతే శూద్రః 
    సంస్కారాత్ ద్విజ ఉచ్యతే 
    వేద పఠనాత్ భవేత్ విప్రః
    బ్రహ్మ జానాతి  బ్రాహ్మణః
   - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి .

     అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.

    విద్యాసంస్కారానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉన్నది. నాకు విద్యనేర్పండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి కులగోత్రాలతో , తలిదండ్రుల  పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా గురుకులాలలోని గురువులు ఉపనయన సంస్కారం చేసి విద్య నేర్పాలి. ఆ విధంగా శూద్ర అనే "ఏకజాతి" గా పుట్టిన మానవులలో కొందరికి విద్యాసంస్కారం చేత విద్యాజన్మ అనే రెండో జన్మ వచ్చి ద్విజులు అవుతారు. ఆ ద్విజులలో పరిపాలన , రాజ్య రక్షణ ,ప్రజా సంరక్షణ వంటి వృత్తిని ఇష్టపడి  చేపట్టేవారు క్షత్రియులు అనబడతారు. వ్యవసాయం, పశుపాలన, వ్యాపారం వంటి వృత్తులను ఎంచుకునే వారు వైశ్యులు అనబడతారు. వేదాధ్యయనం, అద్యాపనం , యజ్ఞం చేయటం, చేయించటం వృత్తిగా ఎంచుకున్నవారు విప్రులుగా పిలవబడతారు. అహంకార మమకారాలను వదిలిపెట్టి, ఇంద్రియాలను జయించి , బ్రహ్మ తత్వం  ఎరిగి , బ్రహ్మజ్ఞానం కలిగి , లోక క్షేమం కాంక్షించి , సమాజ హితం కోసం పాటుపడేవారు బ్రాహ్మణులు అనే సర్వోత్తమ, సర్వ శ్రేష్ట తరగతికి చెందుతారు. వారిని అందరూ పూజిస్తారు. అత్యంత గౌరవ స్థానం ఇస్తారు.

    ఇదీ ఆర్ష ధర్మంలో వర్ణవ్యవస్థ. ఇందులో తప్పు ఉన్నదని మెడ మీద తలకాయ ఉన్న వాడు  ఎవడైనా అనగలడా? విద్వాంసుడికి, మానవోత్తములకు పూజ్య స్థానం ఇవ్వమని చెప్పటం నేరమా? పోనీ ఆ పూజ్య స్థానం కేవలం ఒక కమ్యూనిటీలో , ఫలానా కులం లో , లేక గోత్రాలలో పుట్టినవారు  మాత్రమే పొందగలరు ; ఇతర నిమ్న వర్ణాలకు చెందిన వారికి దాన్ని చేరే యోగ్యత లేదు - అంటే అది ముమ్మాటికీ నేరమే. అలాంటి నిషేధం ఆర్షధర్మం లో ఎక్కడా లేదు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడికీ ఆ అత్యున్నత గౌరవ స్థానం పొందే యోగ్యత ఉన్నదనే ధర్మ శాస్త్రం చెబుతుంది.

    శూద్రేణ హి సమస్తావత్ యావద్వేదే న జాయతే  ( మనుస్మృతి 2-172 )

    ఉపనయన , విద్యాసంస్కారం అయ్యేవరకు ప్రతివాడూ శూద్రుడే అని మనుస్మృతి చెపుతుంది. ఇది ఉపనయన సంస్కారాన్ని , విద్యాజన్మ అనే ద్విజత్వాన్ని శూద్రులకు నిషేధించటం అవుతుందా ? పుట్టుక చేత శూద్రత్వం నుంచి , విద్య,ఉత్తమ సంస్కారాల చేత ద్విజత్వం పొందే హక్కు, అధికారం ప్రతి మానవుడికీ ఉన్నదని చాటిన మనుస్మృతి శూద్రులను ద్వేషిస్తుందని, నీచంగా పరిగణిస్తుందని ముద్రవేయటం వివేకం ఉన్నవారు చేయవలసిన పనేనా ?

     ఫలానా చెడుపనులు చేసినందుకుగాను శూద్రవర్ణానికి చెందిన వారికి మనువు నిర్దేశించిన శిక్షను .. మనకాలంలో మూడువేల  శూద్రకులాల , ఉపకులాలలో మనం చేర్చిన వారందరిపట్ల మనువు కక్షగా, దారుణ వివక్షగా భావించటం తప్పు. నేరానికి శిక్షల విషయంలో మనువు ఆధునిక  శిక్షాస్మృతులకంటే  ఎన్నో యోజనాల ముందు ఉన్నాడు. పులినీ పిల్లినీ ఒకే గాటన కట్టి , బలవంతుడికీ బలహీనుడికీ ఒకే  రకమైన న్యాయం అమలుపరచే నేటి న్యాయ ప్రహసనానికి మనువు పూర్తిగా  విరుద్ధం . బ్రాహ్మణుడు ఎంత ఘోరనేరం చేసినా తక్కువ దండనతో సరిపెట్టాలనీ, అదే శూద్రుడికేమో చిన్న అపరాధానికి కూడా ఘోరమైన శిక్షలతో చిత్ర వధ చేయాలనీ కొందరు అగ్రవర్ణ దురహంకారులు తరవాత కాలంలో చొప్పించిన తప్పుడు శ్లోకాలకూ , మనుస్మృతి మౌలిక తత్వానికీ ఎక్కడా పోలిక లేదు. అవి దుర్మార్గపు ప్రక్షేపాలని మనుస్మృతి మొత్తాన్ని చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.

  విద్యాస్థాయి, ఉత్తమ గుణాలు, ఉన్నత సంస్కారాలను బట్టి పై మూడు వర్ణాలకూ ఒకదానిని మించిన గౌరవ స్థానం ఆ పై దానికి ఇవ్వడంతో మనువు ఆగలేదు. తప్పు చేస్తే ఆ వర్ణాలకు శిక్ష మోతాదును కూడా అదే దామాషాలో నిర్ణయించాడు. ఒకే నేరాన్ని శూద్రుడు చేస్తే విధించాల్సిన శిక్షకంటే రెట్టింపు శిక్షను అదే నేరాన్ని వైశ్యుడు చేస్తే విధించాలి. అదే విధంగా వైశ్యుడికి వేసే శిక్షకంటే రెండింతల శిక్షను క్షత్రియుడికి , దానికి రెట్టింపు , అంటే.. శూద్రుడికి వేయవలసిన దానికంటే ఎనిమిది రెట్ల శిక్షను బ్రాహ్మణుడికి వేయాలని మనువు న్యాయం.

   అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషం 
   షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రింశత్ క్షత్రియస్య చ  ( 8-337 )

   బ్రాహ్మణస్య చతుష్షష్టి: పూర్ణం వాపి శాతం భవేత్ 
   ద్విగుణా వా చతుష్షష్టిస్తద్దోష గుణవిద్ధి సః   (8-338 )

   ( తాను చేసిన నేరాన్ని తానే అంగీకరించిన శూద్రుడికి 8 యూనిట్ల శిక్షవేస్తే ... అతడి స్థానంలో వైశ్యుడు ఉంటే 16 యూనిట్లు , క్షత్రియుడికైతే 32 యూనిట్లు , అదే నేరం బ్రాహ్మణుడు చేస్తే 64 లేక 100 లేక 128 యూనిట్ల శిక్షను విధించాలి. సామాన్యుడి కంటే విజ్ఞానవంతుడికి ఎక్కువ దండన )


    ఏమీ తెలియని పామరుడి కంటే అన్నీ తెలిసిన పండితుడు ఎక్కువ దండనార్హుడు అని మనువు భావం.  మంచిదే కదా ?

    ఈనాడు  శూద్రకులాలు అని భావించబడుతున్నవి మనువుకాలంలో లేనే లేవు. బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య కులాలకింద చేర్చటానికి వీలులేని కులాలనన్నిటినీ శూద్ర కులాలు గా ఈ కాలం లో మనం పరిగణిస్తున్నాం . వాటిలో ప్రతికులానికీ, ప్రతి ఉపకులానికీ కచ్చితమైన ఒక పేరు ఉంది. వాస్తవానికి "శూద్రకులం" అంటూ ప్రత్యేకంగా ఒక కులం ఏనాడూ లేదు .

     గుణాలను , స్వభావాలను, , యోగ్యతలను , సామర్ధ్యాన్ని బట్టి మనుషులను బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య , శూద్ర అనే నాలుగు వర్ణాలుగా మనువు విభజించాడు. ఫలానా ఫలానా వృత్తులు, పనులు ఫలానా వర్ణాలవారు చేయాలన్న వర్గీకరణ మనుస్మృతిలో లేదు.ఫలానా వృత్తులు, కార్యాలుశూద్ర వర్ణం వారు చేయాలనిగాని , ఆయా వృత్తులు , లేక వ్యాపారాలు, లేక వ్యాపకాలు లేక సేవలు చేసేవారు , వారికుటుంబంలోని  వారు, వారికి పుట్టిన వారు యావన్మందీ శూద్రులుగానే బతికి తీరాలన్న కట్టడి మనువు పెట్టలేదు.  ఉపనయన సంస్కారం పొంది , విద్యాభ్యాసం చేసి , ఉత్తమ గుణాలను సంతరించుకొని ద్విజత్వం పొందే అవకాశం శూద్రులకు  ఇచ్చిన మనువును శూద్రద్వేషి గా చిత్రించటం అన్యాయం.

     పోనీ అలా సామాజిక నిచ్చెన లో పైకి పోవటానికి ప్రయత్నించక  ద్విజత్వాన్ని ఆశించక ఏకజాతి శూద్రులుగానే మిగిలిపోయినవారిని చులకన భావంతో నీచంగా చూడాలని మనువు చెప్పాడా ?

   వైశ్యశూద్రావాపి ప్రాప్తౌ కుటుంబేతిథి ధర్మిణౌ
   భోజయేత్ సహ భ్రుత్యైస్తావా నృశంస్యం ప్రయోజయన్   ( మనుస్మృతి 3-112 )

   భుక్త వత్ స్వథ విప్రేషు స్వేషు భ్రుత్యేషు  చైవ హి 
   భుంజీయాతాం తతః పశ్చాదవశిష్టం తు దంపతీ        ( మనుస్మృతి 3 -116 )

   శూద్రులు తమ ఇంటికి అతిథులుగా వస్తే వారికి , తమ సేవకులైన శూద్రులకు భోజనం పెట్టాకే  గృహస్థ దంపతులు భోజనం చేయాలని మనువు చెప్పాడు. ఇది శూద్రులను అవమానించటం అందామా ? మనుధర్మాన్ని పాతిపెట్టి , కులరహిత సమాజాన్ని స్థాపించే దిశలో వడివడిగా ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ  కాలంలో తమ పనివారికి భోజనం పెట్టాకే యజమానులు భోజనం చేసే సంప్రదాయాన్ని ఎవరైనా పాటిస్తున్నారా ? పనివాళ్ళు తిన్నాకే మనం తినాలని  చెప్పిన మనువేమో అమానుష శూద్రద్వేషి , మనం తిన్నాక మిగిలిన పదార్థాలను పనివాళ్ళ మొగాన పడేసే  మనమేమో మహా మానవతా మూర్తులమా ?

   మానార్హః  శూద్రోపి  దశమీం గతః       ( మనుస్మృతి 2- 137 )

   వయో వృద్దుడైన  శూద్రుడు - అందరూ గౌరవించవలసినవాడే  అన్న మనువు  శూద్ర వ్యతిరేకా ?

   అలాగే - నిర్దిష్ట యోగ్యతలు కలిగిన బ్రాహ్మణులు విరాట్ పురుషుడికి ముఖం అవుతారని , దేశాన్ని రక్షించే క్షత్రియులు బాహువులు , వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు ఊరువులు ( తొడలు ) , కాయకష్టం  చేసే శూద్రులు విశ్వాత్మకు పాదాలు అవుతారని పురుషసూక్తం లో చెప్పటం శూద్రులను అవమానించటం ఎలా అవుతుంది ? తన తలకాయ చాలా గొప్పది , తన పాదాలు చాలా నీచమైనవి అని ఏ మానవుడైనా అనగలడా ? సర్వ సమానత్వం సాదించటం కోసం శరీరంలో  చేతులు , తొడలు , పాదాలను ఒకే దగ్గర చేర్చటం ఎంతటి రష్యన్ సర్కస్ కళాకారుడికైనా  సాధ్యమయ్యే పనేనా ? కష్టజీవుల శ్రమ మీదే ప్రపంచం ఆధారపడి ఉన్నదని చెప్పటం శ్రమజీవులను కించపరచటం అని చెప్పేవాడికి మతి ఉన్నట్టా ? లేనట్టా ?