Thursday 5 April 2018

జగతికి జ్యోతి

ప్రపంచం లో మనువు - 1

డా. కేవల్ మోత్వాని 

అనుసరణ : ఎం.వి.ఆర్.శాస్త్రి

..........

   మనకు తెలిసినా తెలియక పోయినా ప్రాచీన ఆధునిక ప్రపంచాలలో ప్రబలంగా వినిపించే పేరు మనువు . ఋగ్వేదంలో విశిష్ట స్థానం గల మనువు పేరును ఆర్యులు తాము పోయిన చోటి కల్లా తీసుకు వెళ్ళారు .

   ఉత్తర చైనా లో మనుధర్మ శాస్త్రం ఉనికి కనిపిస్తుంది. పూర్వకాలంలో  ఇండియా, ఇరాన్, సుమేరియా , ఈజిప్ట్, , బాబిలోనియా, అస్సీరియా, అనటోలియా , పాలస్తీనా , గ్రీస్, రోమ్ లలో మనువు పేరు సుపరిచితం.

   తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలలో మనువుకు అత్యంత గౌరవ స్థానం ఉంది. బర్మా, సయాం ,  మలయా,ఇండోచైనా , ఇండోనీసియా, బాలి, ఫిలిప్పీన్స్ దీవులు, సిలోన్ మనువు జ్ఞాపకాన్ని పదిలపరచుకుని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల్లోని న్యాయ విధానాలు, సామాజిక వ్యవస్థలు మనువు బోధల పైనే ఆధారపడ్డాయి. సాంఘిక సంబంధాల సైన్సు అయిన మనుధర్మ శాస్త్రాన్ని  చరిత్ర తొలినాళ్ళ నుంచే భారతదేశం  అధ్యయనం చేసి , అమలుపరచింది. ఉటోపియా సృష్టికర్తలు , న్యాయ సంహితలకర్తలు అయిన పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలందరూ మనువు సంతానమే.

   మనుధర్మశాస్త్రాన్ని అనేక కోణాలనుంచి , పలువిధాలుగా  అధ్యయనం చేయవచ్చు, మతం, ఫిలాసఫీ ,సైకాలజీ , బయాలజీ , ఎథిక్స్ , హిస్టరీ , లా , పొలిటికల్ సైన్స్ ,జూరిస్ ప్రూడేన్స్ తదితర సబ్జెక్టుల విద్యార్థులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు మనువు దగ్గర దొరుకుతాయి. కొన్ని విషయాలలో పాశ్చాత్యుల సాంఘిక చింతన కంటే మనువు సాంఘిక చింతన ఎంతో ముందుంది .

    చరిత్రకారుడు చరిత్ర ఆరంభాన్ని ఎంత వెనకకి అయినా  నెట్టనీ ! అతడికి మనువు ఎదురవుతాడు ...మొరటు మానవ పదార్థాన్ని నైతికంగా , తాత్వికంగా ప్రగతిశీల వ్యక్తులుగా మార్చుతూ ! మనువు  మరచిపోయిన, మరణించిన గతానికి చెందిన వాడు కాదు. నాగరికత నేర్చిన ప్రతి మానవుడి జీవితంలోనూ అతడు జీవశక్తిగా నేటి భూమండలం ముఖాన ఊపిరులూదుతున్నాడు .

   Manu is the only teacher among the elect of the human race , whose teachings have done the greatest good ,to the greatest number of people , over the largest area of the world and for the longest period of time .

  మొత్తం మానవ జాతి చరిత్రలో తన ఉపదేశాల ద్వారా ప్రపంచంలో అత్యంత విశాల ప్రాంతంలో , అత్యధిక కాలం , అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మేలును చేకూర్చిన ఏకైక బోధకుడు మనువు . కాని మానవ జాతిచరిత్రలోని ఈ దశ చరిత్రకారుల దృష్టిని ఆకర్షించలేదు.ప్రపంచమంతటా స్కూళ్ళు ,కాలేజీలు , యూనివర్సిటీల హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో ఎంత వెదికినా దీనిజాడ మచ్చుకైనా కానరాదు. మనువు ఏ ఒక జాతికో కాదు - మొత్తం ప్రపంచానికి చెందిన వాడు .మనువు బొధలకు ప్రసారకేంద్రం , కష్టోడియన్ అయిన ఇండియా మీద అతడి స్ఫూర్తిని , దార్శనికతను  పునరుజ్జీవింప జేయాల్సిన ప్రత్యెక బాధ్యత ఉంది .

మనుధర్మశాస్త్రాన్ని The Code of Manu ,the Law Giver అని సాధారణంగా అనువాదం చేస్తున్నారు .ఇది సరి కాదు . ఇండియా యొక్క సామాజిక , న్యాయపరమైన సంబంధాలను అనాదిగా మనువు నియంత్రించినా ఆయన ఇండియాకు న్యాయ ప్రదాత కాదు. ఆయన ఉపదేశాలకు చట్టానికి ఉండే లీగల్ అథారిటీ లేదు. వ్యక్తికీ , సమాజానికీ సౌహార్ద సంబంధాలు నెలకొనేందుకు దోహదించే ధర్మ సూత్రాలను మాత్రమే మనువు ప్రకటించాడు.

                          దూరప్రాచ్యంలో మనువు ప్రభావం 


1932 వ సంవత్సరం లో మంగోలియాలోని చైనా గోడలో ఒక భాగం జపనీయుల బాంబు దాడికి ధ్వంసమైంది .  అక్కడ   గోడ కింద నేలలో చాలా లోతుకు తవ్వితే ఒక లోహపు పెట్టె కనిపించింది .  చైనా ప్రాచీన చరిత్రకు సంబంధించి ఒక విలువైన డాక్యుమెంటు అందులో దొరికింది. ఆ లిఖిత పత్రాన్ని సంపాందించిన సర్ ఆగస్టస్ ఫ్రిజ్ జార్జ్ దానిని లండన్ కొనిపోయి ప్రొఫెసర్ ఆంథోనీ గ్రేమ్ అనే చైనీస్ భాష నిపుణుడికి  అందచేశాడు .నిపుణుల బృందం సాయంతో ఆయన తెగ కష్టపడ్డాడు. అనువాదమైతే చేయగలిగాడు  కానీ ఆ రాతప్రతి విలువను మదింపు చేయలేకపోయాడు.  ఆంగ్ల అనువాదాన్ని బ్రిటిష్ మ్యుజియం లోని Sir Wallis Budge కి చూపిస్తే ఆ దొరగారు దాని తబిసీలును తేల్చాడు.

   జరిగిందేమిటంటే -

   ప్రాచీన కాలంలో  చిన్ ఇజా వాంగ్ అనే చైనా చక్రవర్తి ఉండేవాడు .చరిత్ర అనేది తనతోనే మొదలైందనీ , చైనా నాగరికత సాధించిన ఘనతంతా తనవల్లే ఒనగూడిందనీ భావితరాలవారు అనుకునేట్టు చేయాలని అతడు ఉబలాటపడ్డాడు . ఇంకేం? తనకు పూర్వపు చరిత్ర గ్రంథాలను అన్నింటినీ అతడు తగలబెట్టించాడు. చైనా పూర్వ వైభవాన్ని సూచించే రికార్డులనన్నింటినీ చక్రవర్తి నాశనం చేయించాడు . అదిగో అ దశలో ఒకానొక చరిత్రకారుడు తాను ఎరిగిన చైనా పూర్వచరిత్ర నంతటినీ రాసి లోహపు పెట్టెలో భద్రపరిచి భూమిలో పాతేశాడు. ఏ పరిస్థితులలో తాను ఆ పని చేయవలసి వచ్చిందో కూడా ముందుమాటగా అందులో రాసిపెట్టాడు.

    'In the manuscript , I find direct refereences to the Laws of Manu which were first written in India in the  Vedic language  ten thousand years ago ' ( పదివేల సంవత్సరాల కింద వైదిక భాషలో రాయబడ్డ మనువు ధర్మసూత్రాలను ఆ ప్రాచీన రాతప్రతిలో నేరుగా ప్రస్తావించారు ) అని సర్ వాలిస్ వెల్లడించాడు . ఆ కాలంలో ఇండియా , చైనా , అమెరికా ల మధ్య సరాసరి సంబంధాలు ఉన్నట్టు ఆ రాత ప్రతి రుజువు చేసింది అన్నాడాయన .

ఇంకా ఉంది 





No comments:

Post a Comment