Monday 9 April 2018

మనువు విశ్వరూపం

ప్రపంచంలో మనువు - 3

డా. కేవల్ మొత్వానీ , ప్రొ. ఆర్. సురేంద్రకుమార్ 

అనుసరణ : ఎం.వి.ఆర్. శాస్త్రి 

...........

   ఆసియా , ఆఫ్రికాలలో క్రీ.పూ. 5000- 3000 మధ్య విలసిల్లిన ప్రాచీన నాగరికతలన్నిటికీ మనువు బాగా తెలుసు. కాకపొతే వేరు వేరు పేర్లతో  ! ప్రాచీన ఇరాన్ ( పర్షియా ) లో అతడి పేరు  " వైవహంత్ " !  ఈజిప్టు వాసులకు " మినా " గా , క్రేట్ లో " మినోస్ " గా మనువు పరిచితుడు . ప్రాచీన సుమేరియన్లు మనువును ఎరుగుదురు అనడానికి ఆధారాలున్నాయి. మనువు కుమార్తె ఇళ , అతడి కుమారుడి ప్రస్తావన క్రీ.పూ. 1600 లో అస్సీరియా లో కానవస్తుంది. క్రీ.పూ. 1200 నాటికి అయోనియా లో మనువు పేరు మానెస్ , మెన్స్ అయింది . పాలస్తీనాలో మోజెస్ నిజానికి మనువేనని కొందరు విద్వాంసుల నమ్మిక !

   మనం మాట్లాడుతున్న కాలానికి మొత్తం మధ్య ప్రాచ్యమంతా ఆర్యమయమే. ఆర్య శాఖ అయిన Hittites తెగ ఆసియా మైనర్ , అనటోలియా లను ఆక్రమించి  విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించింది. Mittani అనేది ఇంకో ఆర్య రాజ్యం . దానికి తూర్పున  పర్షియా ఉంటుంది.

    సోమ  వంశపు తొలి రాజు అయిన విశ్వామిత్రుడి తో జరిగిన 5 రోజుల యుద్ధంలో  ప్రాచీన రాజ వంశీకుడైన వీన రాజు ఓడిపోయి తన అనుయాయులతోకలిసి మాశ్రా తీరం దాటి ఈజిప్ట్ కు వలసపోయినట్టు మనుస్మృతి వ్యాఖాత కుల్లుకభట్టు అభిప్రాయం. క్రీ. పూ. 3400 లో అతడు అడుగు పెట్టే వరకూ ఈజిప్టు అనాగరిక దేశం. మనువు అనే బిరుదు ధరించిన వేనుడు వచ్చాకే ఆ దేశం లో నాగరికత మొదలైంది అని ఈజిప్ట్ చరిత్ర ప్రవీణులు చెబుతారు. మినా లేక మెన్స్ అనబడే మనువు పేరుమీదే ప్రాచీన ఈజిప్ట్ లో Menouphis అనే రాష్టం ఏర్పడింది.

   క్రీ.పూ. 522- 486 మధ్య ప్రాచీన ఇరాన్ ను ఏలిన Darius The Great తన సామ్రాజ్యానికి లా కోడ్ ను తయారుచేయించదలచినప్పుడు మనుధర్మ శాస్త్రాన్నే నమూనాగా తీసుకున్నారు. వర్ణాల పేర్లతో సహా  మనువు చెప్పిన సాంఘిక వ్యవస్థను అక్కడి వారు ఆమోదించారు. జొరాస్ట్రియనల ద్వారా మనుధర్మశాస్త్రం పశ్చిమ ఆసియా , యూరప్ ల లోని ఇతర నాగరికతలకు  పరిచయమైంది.

    మొత్తానికి ఈ ప్రాంతమంతటా నెలకొన్నది  వైదిక భారతం నుంచి చీలివచ్చిన ఆర్య సంస్కృతే .  బాబిలన్ నె తీసుకోండి. దానిని ఏలిన నాభానేదిష్టుడు తనను తాను మనువు పుత్రుడిగా అభివర్ణించుకున్నాడు. ప్రపంచ సృష్టికి , మానవ జాతికి, యుగాలకు  సంబంధించి బాబిలోనియన్ల లెక్కలు మనువు  చెప్పినదానికి సరిగ్గా సరిపోతాయి. బాబిలోనియన్ల సాంఘిక , రాజకీయ వ్యవస్థలు మనువు మూసలో రూపు దిద్దుకున్నవే. అలాగే అస్సీరియన్లూ ఆర్య సంప్రదాయాలు, మనుధర్మం ఆధారంగానే తమ సాంఘిక జీవనాన్ని రూపొందించుకున్నారు . 90 అధికరణాలుగల వారి లా కోడ్ కు మనుధర్మశాస్త్రం తో దగ్గరి పోలిక ఉంది.

   దక్షిణ ఆసియా , ఆగ్నేయాసియా లోని అనేక దేశాలలో మనువు, అతడి ధర్మ శాస్త్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. ఈ దేశాలకు బౌద్దానికంటే  పూర్వమే మనుధర్మం వెళ్ళింది. అక్కడ వివాహాలు, దత్తత, వారసత్వం , ఆస్తిహక్కులు, భూమి యాజమాన్యం, ఆచారాలు, పరిపాలన, సాంఘిక వ్యవస్థలవంటి అంశాలలో  మనుధర్మ ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది ఎంతగా అంటే .. భారత దేశపు విస్తృత సాంస్కృతిక సామ్రాజ్యంలో ఈ దేశాలు  వెలుపలి భాగాలు అని  చరిత్రకారులు భావించేటంతగా ! ఈ సాంస్కృతిక సామ్రాజ్యానికి పునాదిని మనువు వేస్తే , గౌతమ బుద్ధుడు దాని పైన సౌధాన్ని లేపాడని చెప్పవచ్చు. మానవజాతి చరిత్రలో సాంఘిక చింతనకు సంబంధించి మొట్టమొదటి ప్రణాళికా బద్ధ సంఘటిత నిర్మాణం అనదగ్గది మనుధర్మశాస్త్రం. తరవాతి శతాబ్దాలలో వచ్చిన సాంఘిక తత్వవేత్తలకు , శాసనకర్తలకు అది నమూనా అయింది.

  Emigrants from India , who laid foundations of a new world in tropical East , took with them their law book, The Code of Manu . Everywhere throughout this region , Manu has left his mark , in Burma, in Siam , in Cambodia , Java and Bali.  
[ Manu in Burma , J.S.Furnival ( in Burmese Research Society Journal ,1940 ]

   ఉష్ణ మండలానికి చెందిన తూర్పు ప్రాంతాలలో నూతన ప్రపంచానికి పునాది వేసిన భారతీయ వలసదారులు తమతోబాటు మనుధర్మశాస్త్రాన్ని  తీసుకుపోయారు. బర్మా, సయాం, కంబోడియా , జావా, బాలి సహా ఈ ప్రాంతమంతటా వారు వెళ్ళిన చోటల్లా మనువు తన ముద్ర వేశాడు ... అంటాడు విఖ్యాత పాశ్చాత్య విద్వాంసుడు ఫర్నివాల్ . బర్మాలో పూర్వ న్యాయగ్రంథాలు  మనుధర్మశాస్త్రానికి తమ రుణాన్ని బాహాటంగా అంగీకరించాయి. బర్మాలో పాళీ భాషలో రాసిన " నీతిసార" లోని అనేక అంశాలకు మనుస్మృతితో పోలిక ఉంది. బర్మా, కంబోడియాలలో లాగే సయాం లోని ప్రాచీన న్యాయ శాసనాలు మనుస్మృతికి దగ్గరగా ఉంటాయని Siam , Vol.1 గ్రంథంలో W.A.Graham పేర్కొన్నాడు.

   బాలి ద్వీపం, బర్మా , ఫిలిప్పీన్స్ , థాయిలాండ్ , చంపా ( వియత్నాం ) , కంబోడియా , ఇండోనేసియా , మలేసియా , శ్రీలంక, నేపాల్ లలో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి ఆయాదేశాలలో మనువు చెప్పిన ... వృత్తినిబట్టి వర్ణవ్యవస్థ అమలులో ఉండేది. మనువు సూత్రాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి , తీర్పులను వాటి ఆధారంగానే అక్కడ వెలువరించే వారు. రాజులు , చక్రవర్తుల తాము మనువు అనుయాయులమని చెప్పుకోవటానికి గర్వపడేవారు. మనువు సంబంధమైన పేరును తమ బిరుదాలలో చేర్చుకోవటానికి ఉత్సాహపడేవారు.

    చంప ( వియత్నాం ) లో లభించిన ఒక శాసనాన్ని బట్టి రాజా జయేంద్ర వర్మదేవుడు మనువు అనుయాయి. మనుస్మృతి ఆధారంగా రూపొందిన " మను నీతి సార " ప్రస్తావన ప్రస్తావన ఉదయన వర్మ మహారాజు శిలాశాసనం లో కనిపిస్తుంది. అలాగే యశోవర్మ శిలాశాసనంలో మనుస్మృతి లోని ఒక శ్లోకం యథాతథం గా చెక్కబడి ఉంది. రాజా జయవర్మ శిలాశాసనంలో మనుస్మృతికి సంబంధించి  ప్రవీణుడైన ఒక అమాత్యుడి  ప్రస్తావన ఉంది. బాలి ద్వీపంలో మనువు సాంఘిక విధానం నేటికీ అమలులో ఉంది.దక్షిణ ఆసియా లోని ఇతరదేశాల కన్నా ఇండోనేసియా పై మనుధర్మశాస్త్ర ప్రభావం ప్రబలంగా ఉంది. ఇండోనేసియా లా కోడ్ కు అదే మాతృక. ఆ దేశం లోని గ్రంథాలన్నిటిలోకీ ప్రాచీనమైనదిగా భావించే Kutara Manawa 20 వ శతాబ్దం ఆరంభం వరకూ అక్కడ అమలులో ఉండేది. అది మనుధర్మ మీద ఆధారపడ్డదే. ఆ దేశపు మిగతా న్యాయ గ్రంథాలలో Dewagama కి   మనుస్మృతి 7వ అధ్యాయం   , Swara Jambu కి  మనువు 8వ అధ్యాయం ప్రాతిపదిక . ఇక  ఫిలిప్పీన్స్ ప్రజలు మనువుని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారంటే వారి జాతీయ పార్లమెంటు  లో సెనేట్ చాంబర్ ఆర్ట్ గాలరీ లో  మనువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ( దీని వివరాలు ఈ వ్యాసావళి లోని మొదటి వ్యాసంలో ఇచ్చాము ) .



   బ్రిటిష్ , అమెరికన్, జర్మన్ ఎన్ సైక్లోపీడియా లు మానవులలో అగ్రేసరుడిగా , మొదటి శాసన కర్తగా న్యాయవేత్తలలో అగ్రగామిగా ,సామాజిక తత్వవేత్తగా వర్ణించాయి. A.A.MacDonnel,A.B.Keith , P.Thomas, Louis Renov తదితర పాశ్చాత్య గ్రంథకర్తలు మనుస్మృతి ని కేవలం  మత గ్రంథం గా కాక , మానవాళికి మేలు చేసే ఒక న్యాయగ్రంథంగా పరిగణించారు. The Cambridge History Of India , The Encyclopaedia of Social Sciences ( USA) , Keith రాసిన  History Of Sanskrit Literature ,భారతరత్న  P.V.Kane రచించిన  A History of Dharma Sastra లలోప్రపంచంపై  మనుస్మృతి   ప్రభావం గురించి చెప్పిన విషయాలు చదివితే ప్రతి భారతీయుడు తన ఉజ్వల వారసత్వానికి గర్వపడతాడు.

   మానవుడు తన చరిత్రను రికార్డు చేయటానికి పూర్వమే అతడి సామాజిక, ఆధ్యాత్మిక చింతనలను మనువు ప్రభావితం చేశాడు. మనువు , అతడి బోధల ప్రభావాన్ని బట్టి మానవ చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఉంది. ప్రాచ్య , పాశ్చాత్య సాంఘిక తత్వవేత్తలలో మనువు కు సముచిత అగ్రాసనం ఇవ్వాలి. మానవాళిని సేవించిన తాత్వికులు, ఆదర్శ వాదులు అందరిలోకీ supreme thinker ,patron saint గా మనువు స్థానం సుస్థిరం, శాశ్వతం.

( కేవల్ మోత్వాని " Manu Dharma Sastra  "  గ్రంథంతో బాటు ప్రొ. సురెంద్రకుమార్ రాసిన " Opposition to Manu - why ? పుస్తకంలోని కొన్ని విషయాలు ఈ వ్యాసానికి ఉపయోగపడ్డాయి. )

అయిపొయింది. 


No comments:

Post a Comment