Wednesday 4 April 2018

దళితుల ఊసు ఎక్కడ ?

మనుధర్మం -14

ఎం.వి.ఆర్.శాస్త్రి.

....... 


   "మనుస్మృతి" మీద మీకు ఎందుకు కోపం ? అని  ఈ దేశం లో ఏ అతితెలివి మేధావినైనా అడగండి .  రైటా , లెఫ్టా .. అన్న తేడా లేకుండా   అందరూ చెప్పేది ఏమిటంటే ... మనుస్మృతి శూద్రులపట్ల,  దళితులపట్ల దారుణమైన వివక్ష చూపిందని !  మాలమాదిగలు గాని వేదం వింటే వారి చెవుల్లో సలసల మరిగే సీసం పోయాలన్నదని ! వేదమంత్రాలను ఉచ్చరించినా , బ్రాహ్మణులను తిట్టినా వారి నాలుక కోసేయ్యాలన్నదని! అసలు దళితుల నీడ కూడా బ్రాహ్మణులకు సోకరాదని  కర్కశమైన ఆక్షలు పెట్టిందని. చిన్న తప్పులకు కూడా శూద్రులకు , దళితులకు సజీవ దహనం చెయ్యటం , శరీర భాగాలనో, మొత్తం మనిషినో నరికెయ్యటం లాంటి క్రూర శిక్షలు విధించిందని. పంచముల పట్ల అమానుషమైన అంటరానితనాన్ని పాటించాలన్నదని ! ఇంకా.. ఇంకా..

   ఇది అన్యాయం. ఈ కాలపు దృష్టితో మనుస్మృతిలో నడమంత్రంగా ఇరికించబడ్డ  కొన్ని శ్లోకాలను చూస్తె  ఎస్.సి. , ఎస్.టి, బి.సి. , ఎం.బి.సి. కులాలకు మనువు శత్రువు అన్న దురభిప్రాయం కలగటం సహజం. కాని నిజానికి ...మనం అనుకుంటున్న ఎస్.సి., ఎస్.టి. లనే దళిత కులాల ప్రస్తావనే మనుస్మృతిలో ఎక్కడా లేదు. ఫలానా ఫలానా పాపాలు, తప్పుడు పనులు చేసిన వారిని - వారు ఏ వర్ణానికి చెందినవారైనా  అంటరాని వాళ్ళుగా చూడాలనటమే తప్ప ఫలానా వర్గంలో పుట్టినవారందరిని జన్మ కారణం చేత అస్పృశ్యులుగా చూడాలని మనుస్మృతిలో ఎక్కడా చెప్పలేదు. బ్రాహ్మణ స్త్రీకి , శూద్ర పురుషుడికి పుట్టినవాడు చండాలుడు అని పేరు పెట్టారే తప్ప చండాల అనేది ఒక కులమనీ, అందులో పుట్టినవారు, వారు సంతతివారు అందరూ అంటరానివాళ్ళు అని మనువు ఎక్కడా అనలేదు. మాలమాదిగలో , మరొక పంచమ కులస్తులో అంటుకుంటే అగ్రవర్ణం కొంపలంటుకు పొతాయనో , వారి నాలుకలు చీరేయ్యాలనో ,  నిలువునా తగలబెట్టాలనో మనుస్మృతిలో ఎక్కడా కానరాదు . పుస్తకంలో ఏముందో చదవకుండానే, తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే హిందూ మతం మీద కసి కొద్దీ అభాండాల బండలు వేసే  మూర్ఖులకు నిజానిజాలతో పనిలేదు.

   బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః త్రయో వర్ణాః ద్విజాతయః 
   చతుర్థ  ఏకజాతిస్తు శూద్రః నాస్తి తు పంచమః       ( మనుస్మృతి 10 -4 )

  ద్విజులలో బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య అనేవి మూడు వర్ణాలు .. నాలుగోది ఏకజాతి ది అయిన శూద్రవర్ణం. ఇవి తప్ప ఐదో వర్ణం అనేది లేదు ... అని మనుస్మృతి విస్పష్టంగా చాటుతున్నప్పుడు పంచమ వర్ణాన్ని మనమే పుట్టించి దానిమీద పగబట్టాడని మనువుని తిట్టిపోయటం న్యాయమేనా ?!

   పోనీ ఇప్పటి దళిత కులాలను ప్రత్యేకంగా ఐదో నంబరు కేటగిరీ కింద మనువు చేర్చి ఉండకపొవచ్చు . కాని నాలుగోదైన శూద్రవర్ణం లోనే వాటినీ కలిపి ...   ఎస్.సి. , ఎస్.టి. , బి. సి. లు యావన్మందినీ శూద్ర ఖాతాలో వేసి ... మొత్తం అందరినీ అంటరానివాళ్ళు గా, అగ్రవర్ణాలకు వారి గాలే సోకకూడనంత నీచులుగా పరిగణించి ,వెలివేశారేమో ?!

  ఆ శంకకూ తావు లేదు. ఎందుకంటే  ద్విజులకు  ఇంటిపని వంటి సేవలు శూద్రులు చేయవచ్చునని మనువు చెప్పాడు. శూద్రులు అంటరాని వాళ్ళు అనుకుంటే ద్విజులైన బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య వర్ణాల గృహస్తుల ఇళ్ళలోకి వారిని ఎందుకు రానిస్తారు ?

   సమాపీ ప్రపా సహ వోన్నభాగః సమానే యోక్త్రే సహ 
   వో యునజ్మి . సమ్యంచోగ్నిం సపర్యతారా నాభిమివాభితః    ( అథర్వణ వేదం 3.30.6 )

    రథానికి నలువైపులా చక్రాలు సమంగా అమరినట్టు మానవులందరూ వేదవిహితమైన అగ్నికార్యాన్నిచేసి  , యజ్ఞేశ్వరుడిని కలిసి పూజించి  , కలిసి భోజనం చేయాలని  అథర్వణ వేదం  లో ఉంది .

   దశరథుడు చేసిన అశ్వమేథ యాగంలో " బ్రాహ్మణా భుంజతే నిత్యం నాథవంతశ్చ భుంజతే  "   ( బ్రాహ్మణులు  భోజనం చేశారు , శూద్రులు భోజనం చేశారు ) అని వాల్మీకి రామాయణం బాలకాండ ( 14-10 ) చెపుతుంది.

   శ్రీరాముడు వనవాసానికి వెళుతూ ( ఇప్పుడు షెడ్యూల్డ్ తెగ లో చేర్చాల్సిన ) గుహుడిని అభిమానంతో  ఆలింగనం చేసుకుంటాడు. ఆ నిషాదరాజు తన కాళ్ళు కడిగి నాలుగు రకాల ఆహార పానీయాలను చేతికందిస్తే  ఆరగిస్తాడు. నిషాదుడు అంటరానివాడు అన్న ఆలోచన ఆయనకు ఏ కోశానా లేదు.



    అదే కోదండ రాముడు సీత జాడ వెదుకుతూ శబరి ఆశ్రమానికి పోయినప్పుడు ఆ గిరిజన మహిళ కొరికి ఇచ్చిన పండ్లను ఎంగిలి అనుకోకుండా ఇష్టపడి తింటాడు. "తపోధనే" ( తపస్సే సంపద అయినదానా ) అని సంబోధించి " నీ తపస్సు సరిగా సాగుతున్నదా " అంటూ కుశలప్రశ్నలు వేస్తాడు. అంతేగాని నా అంతటి సుక్షత్రియుడిని ముట్టుకోవటమే కాక ఎంగిలి పండ్లు పెడతావా అంటూ ఆ ఆటవిక స్త్రీ మీద కత్తి దూయడు.

 ( తపస్సు బాగా అవుతున్నదా ? అని  ఒక గిరిజన మహిళనే ఆప్యాయంగా అడిగిన రాముడి మీద  - తపస్సు చేస్తున్న నేరానికి శంబూకుడు అనే శూద్రుడి తల నరికాడంటూ తరవాత పుట్టుకొచ్చిన వారు దారుణ హత్యాభియోగం మోపటం ఘోరం ! )

    అంతరాణ వీథ్యశ్చ సర్వే చ నటనర్తకాః
    శూదా నార్యశ్చ బహవో నిత్యం యౌవనశాలినః 

[ రామాయణం , ఉత్తరకాండ 91-22 ]

   పట్టాభిషేకం తరవాత తాను చేసిన యజ్ఞానికి వచ్చి విందు ఆరగించి పొమ్మంటూ శ్రీరామచంద్ర ప్రభువు -వీథుల్లోని వర్తకులకు, నటులు, నర్తకులు, స్త్రీలు , శూద్రులు యావన్మందినీ   పిలువనంపుతాడు .

    ధృతరాష్ట్ర మహారాజు చేసిన యజ్ఞాలలో , పెద్ద ఉత్సవాలలో సూపకారులు, ఆరాలికులు వంటలు చేసేవారని మహాభారత  ఆశ్రమ పర్వం (1.1.9 ) లో ఉంది. యుధిష్థిరుడు చేసిన అశ్వమేధం లో శూద్రవర్ణానికి చెందిన ఆ సేవకులు వేలాది బ్రాహ్మణులకు ఆహారం, నీరు వడ్డించారని భారత అశ్వమేధ పర్వం ( 85 : 41-42 ) అంటుంది. పశుపాలన , వ్యవసాయం చేసే వారు, ఇండ్ల లోని సేవకులు , క్షురకాది వృత్తులవారు పెట్టే ఆహారాన్ని ఎవరైనా తినవచ్చునని ఒక్క మనువే కాదు .. గౌతమ , పరాశర , యాజ్ఞ్యవల్క్య విష్ణు స్మృతులు కూడా చెప్పాయి.

   మన పవిత్ర గ్రంథాలలో ఇన్నిన్ని ప్రబల దృష్టాంతాలు కనపడుతున్నప్పుడు హిందూ మతం శూద్రులను , దళితులను అంటరానివాళ్ళు గా చిన్నచూపు  చూసిందని ఎంతటి బుద్ధిహీనుడైనా గుండెమీద చేయి వేసి చెప్పగలడా ?

   పుట్టుకను బట్టి కొన్ని వర్గాలను అంటరానివిగా చూడటం  అనేది తరవాత కాలాల్లో హిందూ సమాజానికి పట్టిన మాయరోగం. అలాంటి అస్పృశ్యతకు శ్రుతి , స్మృతి , పురాణాలలో ఇసుమంతైనా ఆమోదం లేదు. అనుమతి లేదు. ఆదినుంచీ ఉన్న , మనువు ఆమోదించిన " కర్మణా వర్ణ వ్యవస్థ " ను తరవాత వారు " జన్మనా జాతి వ్యవస్థ " గా భ్రష్టు పట్టించి , ముదనష్టపు కులవ్యవస్థను తెచ్చిపెట్టి , బడుగు బలహీన దళిత వర్గాలను దారుణ వివక్షకు గురి చేస్తే ఆ పాపం మనువుది కాదు.  హిందూ మతానిది అసలే కాదు. మహోదాత్తమైన , సమస్త మానవ జాతి  గర్వపడదగిన సనాతన ధర్మాన్నీ, వైదిక సంస్కృతినీ  కన్నుగానక మనం నెత్తికెత్తుకున్న పాపిష్టి కులవ్యవస్థకు ముద్దాయిని చేయటం దుర్మార్గం , దురుద్దేశ పూరితం . అన్యమతస్తులువిదేశీ దుష్ట శక్తులు హిందూ మతాన్ని కుళ్ళబొడిచేందుకు పన్నిన భయంకర కుట్రలో భాగం. 

   ..............

 ఇంతటితో  ఈ రచన పూర్తయింది.  దీనికి  అనుబంధంగా  ... మనుధర్మ శాస్త్ర విశ్వ జనీనతపై  శ్రీలంక  జాతీయుడు  కేవల్  మొత్వానీ  60 ఏళ్ల  కింద కాలిఫోర్నియా యూనివర్సిటీ కి  సమర్పించిన పిహెచ్.డి. థీసిస్ లో ఆసక్తికరమైన  కొన్ని అంశాలు  ఆయన మాటల్లోనే  రేపటినుంచి .   



 


4 comments:

  1. శాస్త్రిగారూ,
    11. శూద్రులకు గౌరవం
    https://mvrsastri.blogspot.in/2018/03/11.html
    అనే పేజీ తొలగించారు కదా? దానిలోని పాఠ్యాన్ని ఎక్కడ యిచ్చారు? మేమెక్కడ చూడగలం?

    ReplyDelete
  2. Sir
    శంభూక వధ గూర్చి నిజాలు తెలుపగలరు

    ReplyDelete
  3. Impressive
    It will be very impressive if you can bring the problems that hindu lower caste people are facing

    ReplyDelete
  4. Chandaluru evaru,various gurinchi Acharya Shankaracharyalu,ekkada prastavincharu,sodinchi vivarinchandi Sastrygaru.

    ReplyDelete