ఎం.వి.ఆర్.శాస్త్రి
1925 సంవత్సరంలో సిద్ధాంతపరంగా , విధాన పరంగా, ఆలోచన పరంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలైన రెండు ప్రజా సంస్థలు ప్రస్థానం ప్రారంభించాయి.
1. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
2. భారత కమ్యూనిస్టు పార్టీ
రెండిటికీ గొప్ప చరిత్రే ఉన్నది. రెండు సంస్థలూ మేధో పరంగా, సామాజికంగా , సాంస్కృతికంగా తమదైన ముద్రను జాతి జీవనంలో బలంగా వేశాయి. కాని కాలక్రమంలో చీలికలు పేలికలయి, మూల సిద్ధాంతం చచ్చి , నైతిక ధ్రుతి సడలి, రాజకీయంగా దిగజారి , ప్రజల చేత తిరస్కరింపబడి భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా దివాలా తీసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖండంగా, అప్రతిహతంగా ముందుకు సాగి , శాఖోపశాఖలుగా మహా వట వృక్షం వలె విస్తరించి , నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నది. ఇన్ని కోట్ల కార్య కర్తల తో , ఇన్నిన్ని క్షేత్రాల్లో ఇన్నిన్ని బృహత్ వ్యవస్థలతో , ఇంత ఏకశిలాసదృశంగా , ఇంత క్రమశిక్షణా యుతంగా , ఇంత నిస్వార్థంగా ,నిరాడంబరంగా, వంకపెట్టలేనంత పకడ్బందీగా నూరేళ్లుగా నడుస్తున్న సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ మొత్తం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు.
ఆర్.ఎస్.ఎస్. ఏమి చేస్తుంది , దాని విజయరహస్యమేమిటి అన్నది ఆ సంస్థ గిట్టనివారికి ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. ఆరెస్సెస్ గర్జించదు. క్షాత్రం ప్రదర్శించదు. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు. ఎవరెంత దుమ్మెత్తి పోసినా చలించదు. ఎవరెంత మొత్తుకున్నా తాను ఎంచుకున్న దారి నుంచి అరంగుళం బెసగదు. తన ప్రభావం ఎంత ఘనమైనదైనా ఆరెస్సెస్ బహిరంగంగా చెప్పుకోదు. తన ప్రతాపాన్ని ఒప్పుకోదు.
సంఘ నిర్మాణానికి మనుషులను తయారుచేయటం, సహస్ర బాహువులతో వారి చేత పనిచేయించటమే సంఘ్ పని. అది తానుగా లైమ్ లైట్ లో ఎక్కడా కనపడదు. సంఘ్ జస్ట్ ఉంటుంది. అంతే. అది ఉన్నది కాబట్టే హిందూ సమాజం క్షేమంగా ఉన్నది. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని, హిందువుల ఉనికిని నిర్మూలించటానికి ప్రపంచ వ్యాప్తంగా రాక్షస , పైశాచిక అక్షౌహిణులు ఉమ్మడిగా విరుచుకుపడుతున్న ఈ విపత్కాలంలో ఆరెస్సెస్ లేని హిందూ సమాజాన్ని తలచుకుంటే భయం వేస్తుంది.
నేను స్వయం సేవక్ ను కాను. సంఘ్ శాఖకు ఏనాడూ హాజరుకాలేదు. ఆరెస్సెస్ తో కాని, దాని అనుబంధ సంస్థలతో కాని నాకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా అర్ధ శతాబ్దిగా సంఘ్ కార్యకలాపాలను నిశితంగా, సన్నిహితంగా గమనిస్తున్న మేధావిగా నాకు ఆరెస్సెస్ మీద అపార గౌరవం ఉంది. అచంచల విశ్వాసం ఉన్నది. కొన్ని తరాలుగా సంఘ్ వరిష్ఠ నాయకులతో నాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది. పూజ్య సర్ సంఘ్ చాలక్‌మోహన్ జీ తో , సర్ కార్యవాహ్ దత్తాజీతో పరిచయ భాగ్యం కూడా కలిగింది.
నాకు ఆరెస్సెస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా కరడుగట్టిన ఆరెస్సెస్ వాడిగానే నాకు హిందూ వ్యతిరేకుల దృష్టిలో గుర్తింపు. అందుకు నాకు సంతోషమే తప్ప సంతాపం లేదు. దిగ్విజయంగా , సగర్వంగా శతవసంతోత్సవం చేసుకుంటున్న వేళ హిందూ సమాజానికి కొండంత అండ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ అనే మేరునగానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, వినమ్ర ప్రణామాలు, మనసారా కృతజ్ఞతలు. "నమస్తే సదావత్సలే మాతృభూమే" అని దిగంతాలకు నినదిస్తూ తొలి శతాబ్దిలాగే సహస్రాబ్ది మైలురాయినీ మన "సంఘం" జయప్రదంగా చేరుకోవాలని నా శుభకామన.
No comments:
Post a Comment