Wednesday 2 June 2021

ఎన్నదగిన జర్నలిస్టు

  ఎం.వి.ఆర్.శాస్త్రి 

...................................    

     చిన్న వయసులోనే  కోవిడ్ బారిన పడి  ఈ మధ్యాహ్నం కన్నుమూసిన జర్నలిస్టు వై. శ్రీనివాసరావు విద్వత్తులో , వృత్తి నైపుణ్యంలో సాటిలేని ప్రజ్ణాశాలి. యోగ్యుడు , గుణవంతుడు.



     నేను ఆంధ్రప్రభ డిప్యూటీ ఎడిటర్ గా చేరిన కొత్తలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ ఉద్యోగం కోసం శ్రీనివాసరావు నాదగ్గరికి వచ్చాడు. చూడగానే నాకు నచ్చాడు. అప్పుడతడు ఆంధ్రపత్రికలో రిపోర్టర్ గా ఉన్నాడు. 

     ఆ సమయాన  కొత్త నియామకాల సంగతి ఆలోచించే స్థితిలో యాజమాన్యం లేదు. ఎందుకంటే ఉన్న ఉద్యోగులు సమ్మె కట్ట బోతున్నారు. సంప్రదింపులు ఫలించలేదు. రాష్ట్రమంతటా ప్రచురణ నిలిచిపోక తప్పదన్న ఆందోళన. 

     కొన్నాళ్లకు ( 1991 మొదటి పాదం లో ) సమ్మె ఉద్ధృతంగా మొదలైంది. హైదరాబాద్, విజయవాడ, విజయనగరం కేంద్రాలలో అన్ని డిపార్ట్మెంటుల వారూ సమ్మె లో చేరారు. ముద్రణ నిలిచిపోయింది. 

     ఆ మూడే కాక ఆంధ్రప్రభకు మద్రాసు , బెంగుళూరుల్లో కూడా ప్రచురణ కేంద్రాలున్నాయి. అక్కడి యూనియన్లు వేరు. అవి సమ్మెలో చేరలేదు. యథావిథిగా పని చేస్తున్నాయి. వాటికి ఆంధ్రప్రదేశ్ వార్తలు కావాలి. ఎప్పటిలాగే వాటిని ఆయా ప్రచురణ కేంద్రాలకు అందేట్టు చూడటం న్యూస్ నెట్వర్క్ చీఫ్ గా నా బాధ్యత. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో , రాజధానిలో నా రిపోర్టర్లందరూ సమ్మెలో ఉన్నారు. ఎవరైనా పని చేస్తామన్నా యూనియన్లు చేయనియ్యవు.   అప్పట్లో ఏడెనిమిది  మంది ఉండే హైదరాబాద్ న్యూస్ బ్యూరో ను ఒక్కడూ లేకుండా పనిచేయించటం ఎలా? మద్రాసు డెస్క్ వారు పిటిఐ , యు ఎన్ ఐ ఏజెన్సీ వార్తలతో కొంతవరకు లాగించగలరు.   కాని ఆ కవరేజి సరిపోదు. వార్తల్లో లోకల్ ఫ్లేవరు ,  బ్యూరోనుంచి ఎక్స్ క్లూజివ్ స్టోరీలు లేకపోతే పేపరు చప్పగా ఉంటుంది. వాటిని సమకూర్చుకోవటం ఎలా?

      పెద్ద చాలెంజి. ఆ సమయాన గుర్తుకొచ్చాడు వై. శ్రీనివాసరావు. పిలిచి , ఏమైనా సాయం పట్టగలవా అని అడిగాను. బిడియంగా నవ్వి , తప్పకుండా చేస్తానన్నాడు. ఎంతమందినైనా ఎంగేజ్ చేయి . కావలసినంత  ఖర్చుపెడదాం. కవరేజ్ బావుండాలి - అన్నాను. అతను అడిగిందల్లా ఒక్కటే - 'డెడ్ లైను ఏమిటి ? వార్తలు ఎక్కడ అందజేయాలి?'  చెప్పాను. 'చాలు;నేను చూసుకుంటాను' అన్నాడు.

     నిజంగానే అంత పనీ ఒంటి చేత్తో చక్కపెట్టాడు. ఏమి చేశాడో , ఎక్కడ తిరిగాడో , ఎలా మేనేజ్ చేశాడో తెలియదు . సాయంత్రం 5 గంటలకల్లా  సొంత దస్తూరీలో  రకరకాల వార్తలు, స్పాట్ రిపోర్టులు , స్పెషల్ స్టోరీలు రాసి పట్టుకొచ్చేవాడు. హడావుడిగా రాసినా వాటిలో అక్షరం కూడా సరిచేయవలసిన అవసరం సాధారణంగా ఉండేది కాదు. 

     అవి మొబైల్ ఫోన్లు , 4 జీ లూ , ఇంటర్నెట్లూ లేని రోజులు. పత్రికా కార్యాలయాల్లో  తెలుగు వార్తలన్నీ రోమన్ స్క్రిప్ట్ లో టెలిప్రింటర్ల ద్వారా పంపబడుతుండేవి. హైదరాబాద్ ఆఫీసుసమ్మెలో ఉన్నది కాబట్టి టెలిప్రింటర్లు అందుబాటులో లేవు. ఫాక్స్ లోనే పంపాలి. ఆ కాలాన ఫాక్స్ సదుపాయమూ ఎక్కడో గాని దొరికేది కాదు. బషీర్ బాగ్ బాబూఖాన్ ఎస్టేట్ దగ్గర ఒక ఫాక్స్ సెంటర్ తో ఏర్పాటు చేసుకున్నాము. రోజూ  సూర్యాస్తమయ సమయానికి కాపీలు అక్కడికి చేర్చేవాళ్లం. శ్రీనివాసరావు దగ్గరుండి వాటిని మద్రాసు పంపించేవాడు. ఆతరవాత కూడా రాత్రి  ముఖ్యమైన పరిణామాలను ఫాక్స్ సెంటరు మూసేంతవరకూ కవర్ చేయాలని చాలా తంటాలు పడేవాడు. మరునాడు మద్రాసు , బెంగుళూరు ఎడిషన్లు పంపిణీ కాగలిగిన చోట్ల పేపరు చదివిన వారు హైదరాబాదులో న్యూస్ బ్యూరో పూర్తి స్థాయిలో పని చేస్తున్నదనుకునేవారు. ఇప్పటికీ చాలా మందికి తెలియని రహస్యమేమిటంటే ఆంధ్రప్రభలో సమ్మె సాగిన ఆ ఆరేడు వారాలపాటూ మొత్తం న్యూస్ బ్యూరో పనిని వై.శ్రీనివాసరావు అనే ఒక పొట్టి జూనియర్ రిపోర్టరు వేరే పత్రికలో కొలువు చేస్తూనే ఒక్క చేత్తో గుంభనంగా చక్కబెట్టాడని. 

     రిస్కు తీసుకుని చాలా కష్ట పడుతున్నాడన్న అభిమానంతో డబ్బు ఇవ్వబోతే శ్రీనివాసరావు తాను ఖర్చు పెట్టినదానికి మించి రూపాయి కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. సమ్మె మగియగానే అతడిని హైదరాబాద్ బ్యూరోకి స్టాఫ్ రిపోర్టరుగా తీసుకున్నాను. ఏ ఎసైన్ మెంటు ఇచ్చినా వంక లేకుండా చేసేవాడు.అద్భుతమైన ఎక్స్ క్లూజివ్ లు కూపీ లాగేవాడు.  ఏ సబ్జెక్టు ఇచ్చినా ప్రామాణికమైన స్పెషల్ స్టోరీని సొగసుగా , సాధికారికంగా రాసేవాడు. అంత చిన్న జూనియర్ కు అంత ప్రాధాన్యం ఇవ్వటం అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ దీక్షితులు గారికి మొదట్లో నచ్చేది కాదు. పట్టి పట్టి చూసేకొద్దీ మపవాడి గట్టితనం ఆయనకు కూడా మెల్లిగా బోధ పడింది. 

     1994 చివరిలో నేను నిష్క్రమించాక శ్రీనివాసరావు ఎక్కవకాలం ఆంధ్రప్రభలో  ఇమడలేక పోయాడు. ఆంధ్రభూమి దిన పత్రికకు తీసుకుంటానని చెప్పినా  అతడు ఎందుకో ఇష్టపడలేదు. తరవాత ఏ పత్రికలోనూ కుదురుగా పనిచేసినట్టులేదు. 

     వై. ఎస్. ఆర్.  మంచివాడు ; గుణ వంతుడు ; భేషజాలు లేని స్నేహ శీలి ; ఎవరిగురించీ పరుషంగా మాట్లాడడు. ఎవరి పాండిత్యం పస ఎంతో ఇట్టే పసికట్టినా , ఆ సంగతి అవతలివారికి తెలియకుండా  వినయంగా ఉండేవాడు. ఎప్పుడైనా వారి ప్రస్తావన వస్తే చిన్న నవ్వు నవ్వేవాడు. చాలా అంతర్ముఖుడు. తాత్విక చింతన ఎక్కువ. తన లోతు , చూపు , ఆలోచన  ఏమిటన్నవి ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. దారి తప్పి మన మధ్యకు వచ్చిన యోగి అనిపించేవాడు. 

     ఇష్టం లేని పనిని అతడి చేత చేయించటం ఎవరి తరమూ కాదు. ఒక సారి తిరుపతి నుంచి వస్తూంటే రైలు కంపార్ట్ మెంటులో అనుకోకుండా శ్రీనివాసరావు తండ్రి నాకు పరిచయమయ్యాడు. " మా వాడికి మీరంటే గురి. ఎలాగైనా చెప్పి పెళ్లి కి ఒప్పించండి " అని ఆయన ఎంతగానో అడిగాడు. నేనూ ప్రయత్నించాను. కాని ఆ బ్రహ్మచారిని మార్చటం నా వల్ల కాలేదు. 

     ఎందరికి ఎంత పరిచయం ఉన్నా ఒక రకంగా శ్రీనివాసరావు అందరికీ అపరిచితుడే . అసాధారణ వ్యక్తిత్వం , బహుముఖ ప్రజ్ఞ , నిజాయతీ , వృత్తి నిబద్దత మూర్తీభవించిన  శ్రీనివాసరావు లేకపోవటం తెలుగు జర్నలిజానికి అది తెలుసుకోలేనంత లోటు.