Tuesday 29 January 2019

హిందువుల హక్కుల మాటేమిటి ?

Friday 25 January 2019

తెలుగు సిరి సిరి వెన్నెల


పమిడికాల్వ మధుసూదన్

..........

తెలుగు పాట అంపశయ్య మీద ఉంది . ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఊపిరి బిగబట్టి ముందుగానే ఊర్ధ్వలోకం కలలు కంటోంది . మైఖేల్ జాక్సనే మూర్ఛపోయే మూర్చనలతో తెలుగు పాట ఇంగ్లీషు పక్షపాతం , పక్షవాతంతో పల్లవి చరణాల కాలుచేతులు నిలువెల్లా కొట్టుకుంటున్నాయి . చెవులు చిల్లులు పడే వాద్య హోరులో మాటలు తమకు తాముగా పాడె మీద పదాల పిడకలు పేర్చుకున్నాయి .
కే అంటే ఐ అంటే ఎస్ అంటే అంటూ అక్షరాలు విరిగి విరిగి ఒకటో ఎక్కం కూడా గుర్తులేకుండా చేశాయి . భావం పాతాళంలో సంతలో తప్పిపోయిన పసిపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తోంది . తెలుగుపాటలో తెలుగుపదాలు , పలుకుబళ్లు , జాతీయాలు , వాడుకమాటలు , మాండలికాలు , తనదయిన వ్యక్తీకరణలు ఇంగువకట్టిన గుడ్డగా అయినా మిగల్లేదు . తెలుగు చదవలేని , రాయలేని , పొరపాటునకూడా మాట్లాడలేని , మాట్లాడకూడని హీరో హీరో ఇన్ ల ఇంగ్లీషు వాగ్ వైభవ వెస్ట్రన్ ప్రవాహంలో నిలువనీడలేక తెలుగు భాషా సరస్వతి ఆంధ్ర , తెలంగాణా పల్లెల్లో చదువురాని వారి గడపదాటి రావడంలేదు . షేక్స్ పియర్ ను చంపి పుట్టిన తెలుగు జాతి ఇప్పుడు పుట్టీ పుట్టగానే ఇంగ్లీషులోనే ట్విన్కిల్ ట్విన్కిల్ అని ఏడుస్తోంది . ఆపై ఉత్తమగతులకు , అమెరికా డాలర్ల సేద్యానికి కే జీ టు పీ జీ ఇంగ్లీషునే పీల్చి , తిని ,తాగి జీర్ణం చేసుకోవాలి కాబట్టి తెలుగు మన మెదళ్ల సాఫ్ట్ వేర్ లోనే ఎప్పుడో డిలిట్ అయిపొయింది . యథా ప్రేక్షక - తథా చిత్రం . ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? సారాంశం - సినిమాలు అభిమానులు అందరం ఇంగ్లీషునే మేస్తూ , మోస్తూ దాని పేరు తెలుగు అనుకుంటూ మురిసిపోతున్నాం .



ఇలాంటి బాధలు , నిట్టూర్పులు , ఆవేదనలు , ఆక్రోషాలు అన్నిటికీ సమాధానం సిరివెన్నెల కలం . తొలితరం మల్లాది , సముద్రాల , పింగళి నుండి నిన్నటి వేటూరి వరకు ఆ తెలుగుపాటలతోటమాలుల వరుసలో చివర అంత భారాన్ని మోస్తున్నవాడు , మోయకతప్పనివాడు ,మోయగలిగినవాడు సిరివెన్నెల .

సూర్యుడి కిరణాలను పగటి వీణకు తంత్రులుగా బిగిస్తాడు . జామురాతిరిని జాబిలమ్మ పాటతో జోకొడతాడు . తెలిమంచులో తేలిపోతాడు . ఇలగొంతులో పలుకు అవుతాడు . జాలిగా జాబిలమ్మను రేయి రేయి అంతా రెప్పవేయకుండా ఓదారుస్తాడు . ఎంతవరకు ఎందుకొరకు గమ్యం వైపు ఆగకుండా దూసుకుపోతాడు . పాటను పంచామృతం చేసి తీర్థంగా పంచుతాడు . పదాలను నిప్పులుగా చేసి సిగ్గులేనివారిని అగ్గితో కడుగుతాడు . మైనింగ్ మాఫియాల మధ్య కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ దశావతారాల పాట పాడతాడు . అణిమ గరిమ మహిమ లాంటి పారిభాషిక ప్రత్యేక నిఘంటువుల్లో తప్ప బయట దొరకని మాటలను తెలుగుపాటలో బంధిస్తాడు . రాత్రి దిగిన సూర్యుడిని పట్టి తూర్పుకు లాక్కొస్తాడు . మత్తు వదిలిస్తాడు . బుద్ధి చెబుతాడు . హెచ్చరిస్తాడు . మనం అడగలేని , మనకు అడగడం చేతకాని ప్రశ్నలను అడుగుతాడు . మూగబోయిన మన గొంతు తానవుతాడు . తెలుగు పాట మూగబోకుండా తను పదమవుతాడు . పాటలో తెలుగు దీపం కొడిగట్టకుండా తన పద పాదాల చేతులు అడ్డుపెట్టి ఉన్నాడు .

తనువు , మనసు , ఆలోచనలు అంతా వెన్నెల స్నానం చేస్తున్నవాడి చెంత ఇది ఒక పద్మం .

-
madhupamidikalva@gmail.com
9989090018

Monday 14 January 2019

మన కళ్లు తెరిపించే " పెక్యులరిజం "

భాస్కర్ కిల్లి

శివశక్తి

......

మన దేశపు హిస్టరీ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పే పుస్తకాలు చాలా తక్కువ.అలా వెదికితే ఒకటి అరా.. ఇంగ్లీష్, హిందీలో దొరుకుతాయేమో కానీ తెలుగు లో అలాంటి పుస్తకాలు దొరకడం బహు అరుదు.అటువంటి చరిత్రను తేట తెలుగులో.. ఉన్నది ఉన్నట్లు..జనాలకు సూటిగా గుచ్చుకునేటట్లు రాయడం లో ఎం.వి.ఆర్. శాస్త్రి గారు సిద్ధహస్తులు.

బహుశా..చరిత్రను ఈ విధంగా ఉన్నది ఉన్నట్లు అందించేవారిలో శాస్త్రి గారే మొదటివారు అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను.ఏది చరిత్ర,ఇదీ చరిత్ర,కాశ్మీర్ కథ , కాశ్మీర్ వ్యధ,మన మహాత్ముడు,ఆంధ్రుల చరిత్ర,భగతసింగ్ ఇత్యాది పుస్తకాలు ఈ కోవలోకి చెందినవే.

నన్ను ఈ కదన రంగంలోకి దింపింది,నాకు కర్తవ్య బోధ చేసింది పరోక్షంగా శాస్త్రి గారి పుస్తకాలే.ఆయన కలం నుండి లేటెస్ట్ గా వెలువడిన నూతన ఆవిష్కరణ ఈ "పెక్యులరిజం" అనే ఈ సరికొత్త పుస్తకం.


 ఈ పుస్తకానికి,శాస్త్రి గారి మునుపటి  పుస్తకాలకు ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. వెనకటి పుస్తకాలు మన వక్ర చరిత్ర నుండి నిజమైన చరిత్రని వేరు చేసి మనకు చూపిస్తే..ఈ ' పెక్యులరిజం' మన దేశంలో అత్యధిక జనాభా అయిన హిందువులు మన దేశంలోనే అత్యంత నికృష్టంగా రెండవతరగతి పౌరులుగా జీవింపబడుతున్న దుస్థితిని రుజువు లతో సహా నిరూపించింది.

ఒక పథకం ప్రకారం హిందూస్థాన్ ని హిందువులు లేని స్థానం గా మార్చడానికి బలమైన శక్తులు ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నాయి..కొంతవరకు విజయం సాధించాయి కూడా.
ఇది నిజంగా కలిచివేసే విషయం..ఇప్పటికే దీనిని చాలా మంది హిందువులు గ్రహించారు .కానీ దీనికి మూలం ఎక్కడో,ఏమిటో ఎవరికి తెలియదు.శాస్త్రి గారు విషయాన్ని తేటతెల్లం చేసేంతవరకు అసలు విషయం నాకు కూడా తెలియదు.

సెక్యులరిజం అనే " నడమంత్రపు సిరి" మన భారత రాజ్యాంగం లో ముందు నుండి లేదని..ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా చొప్పించింది అని ఈపుస్తకం లో తెలుసుకుని ఆశ్చర్యపోయాను.

తిరుగులేని అసలు మెజారిటీ అయిన హిందువులను దెబ్బకొట్టడం,మైనారిటీ లను నెత్తిన పెట్టుకోవడం అనే అన్యాయాన్ని రాజ్యాంగ కర్తలు తెలిసో, తెలియకో చేశారు అని..దానికి కోర్టులు తమ అడ్డదిడ్డపు తీర్పుఋలతో  సమస్యను జటిలం చేశాయి అని శాస్త్రి గారు విశదీకరించారు.
సెక్యులరిజాన్ని పెక్యులరిజం గా రాజ్యాంగం,కోర్టులు మార్చిన విధాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.

నేటి పెద్ద సమస్య అయిన శబరిమల అయ్యప్ప దేవాలయం  నుండి.. పిల్లలు చదువుకునే చదువులు వరకు ఎలా హిందువులకు , వారికి పవిత్రమైన విశ్వాసాలకు , మన దేశానికి ప్రాణమైన ధర్మానికి ఎంత  వ్యతిరేకంగా ఉన్నాయి.. దుష్టశక్తులు ఏ విధంగా హిందువులపై జులుం ప్రదర్శిస్తున్నాయి అనే విషయం చాలా బాగా చెప్పారు.

హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే..బహుశా ఇక కళ్ళు తెరవాల్సిన అవసరం ఉండదేమో..ఇక శాశ్వతంగా ఆ కళ్ళను తెరిపించి గొంతులో ప్రాణం తీసేస్తారేమో ఈ హిందూ వ్యతిరేక దుర్మార్గులు.

ఇప్పటికే చాలా నష్టం జరిగింది.కానీ సమయం ఇంకా మన వైపే ఉంది.నిద్రాణమై ఉన్న హిందూ శక్తి కళ్ళు తెరిచి, పరాశక్తి  గా మారి రాజ్యాంగంలోను,రాజకీయ నాయకుల లోను,ప్రభుత్వ యంత్రాంగం లోను ఉన్న హిందు వ్యతిరేకతను  ఎదుర్కోవాలి. అభారతీయ , అధార్మిక  అవ్యవస్థను  పెకలించాలి. ఓటు అనే ఆయుధం ద్వారా..ప్రభుత్వాల , పార్టీల మెడలు వంచి మనకు వ్యతిరేకం గా ఉన్న చట్టాలు,రాజ్యాంగ అధికరణాలు మనమే మార్చుకోవాలి.అప్పుడే మనకు నిష్కృతి.లేకపోతే అధోగతి.

ముందుగా చేయవలసింది శాస్త్రి గారి పెక్యులరిజం పుస్తకం తెప్పించుకుని చదవండి. విషయం అవగాహన చేసుకొండి.తదనుగుణంగా స్పందించి రాబోయే ప్రమాదాన్ని నివృత్తి చేసుకోండి.

శాస్త్రి గారి పుస్తకాలు అమెజాన్ వెబ్సైట్ లో దొరుకుతాయి.
తప్పకుండా చదవండి.నలుగురి చేత చదివించండి.
నిజమైన చరిత్ర తెలుసుకోండి.. తద్వారా..మీకు,మనకు,దేశానికి జరిగిన,జరుగుతున్న ఉపద్రవాన్ని తొలగించండి.
https://www.amazon.in/dp/9387171027/ref=mp_s_a_1_15?ie=UTF8&qid=1544842978&sr=8-15&pi=AC_SX118_SY170_FMwebp_QL65&keywords=mvr+sastry+books