Friday 25 January 2019

తెలుగు సిరి సిరి వెన్నెల


పమిడికాల్వ మధుసూదన్

..........

తెలుగు పాట అంపశయ్య మీద ఉంది . ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఊపిరి బిగబట్టి ముందుగానే ఊర్ధ్వలోకం కలలు కంటోంది . మైఖేల్ జాక్సనే మూర్ఛపోయే మూర్చనలతో తెలుగు పాట ఇంగ్లీషు పక్షపాతం , పక్షవాతంతో పల్లవి చరణాల కాలుచేతులు నిలువెల్లా కొట్టుకుంటున్నాయి . చెవులు చిల్లులు పడే వాద్య హోరులో మాటలు తమకు తాముగా పాడె మీద పదాల పిడకలు పేర్చుకున్నాయి .
కే అంటే ఐ అంటే ఎస్ అంటే అంటూ అక్షరాలు విరిగి విరిగి ఒకటో ఎక్కం కూడా గుర్తులేకుండా చేశాయి . భావం పాతాళంలో సంతలో తప్పిపోయిన పసిపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తోంది . తెలుగుపాటలో తెలుగుపదాలు , పలుకుబళ్లు , జాతీయాలు , వాడుకమాటలు , మాండలికాలు , తనదయిన వ్యక్తీకరణలు ఇంగువకట్టిన గుడ్డగా అయినా మిగల్లేదు . తెలుగు చదవలేని , రాయలేని , పొరపాటునకూడా మాట్లాడలేని , మాట్లాడకూడని హీరో హీరో ఇన్ ల ఇంగ్లీషు వాగ్ వైభవ వెస్ట్రన్ ప్రవాహంలో నిలువనీడలేక తెలుగు భాషా సరస్వతి ఆంధ్ర , తెలంగాణా పల్లెల్లో చదువురాని వారి గడపదాటి రావడంలేదు . షేక్స్ పియర్ ను చంపి పుట్టిన తెలుగు జాతి ఇప్పుడు పుట్టీ పుట్టగానే ఇంగ్లీషులోనే ట్విన్కిల్ ట్విన్కిల్ అని ఏడుస్తోంది . ఆపై ఉత్తమగతులకు , అమెరికా డాలర్ల సేద్యానికి కే జీ టు పీ జీ ఇంగ్లీషునే పీల్చి , తిని ,తాగి జీర్ణం చేసుకోవాలి కాబట్టి తెలుగు మన మెదళ్ల సాఫ్ట్ వేర్ లోనే ఎప్పుడో డిలిట్ అయిపొయింది . యథా ప్రేక్షక - తథా చిత్రం . ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? సారాంశం - సినిమాలు అభిమానులు అందరం ఇంగ్లీషునే మేస్తూ , మోస్తూ దాని పేరు తెలుగు అనుకుంటూ మురిసిపోతున్నాం .



ఇలాంటి బాధలు , నిట్టూర్పులు , ఆవేదనలు , ఆక్రోషాలు అన్నిటికీ సమాధానం సిరివెన్నెల కలం . తొలితరం మల్లాది , సముద్రాల , పింగళి నుండి నిన్నటి వేటూరి వరకు ఆ తెలుగుపాటలతోటమాలుల వరుసలో చివర అంత భారాన్ని మోస్తున్నవాడు , మోయకతప్పనివాడు ,మోయగలిగినవాడు సిరివెన్నెల .

సూర్యుడి కిరణాలను పగటి వీణకు తంత్రులుగా బిగిస్తాడు . జామురాతిరిని జాబిలమ్మ పాటతో జోకొడతాడు . తెలిమంచులో తేలిపోతాడు . ఇలగొంతులో పలుకు అవుతాడు . జాలిగా జాబిలమ్మను రేయి రేయి అంతా రెప్పవేయకుండా ఓదారుస్తాడు . ఎంతవరకు ఎందుకొరకు గమ్యం వైపు ఆగకుండా దూసుకుపోతాడు . పాటను పంచామృతం చేసి తీర్థంగా పంచుతాడు . పదాలను నిప్పులుగా చేసి సిగ్గులేనివారిని అగ్గితో కడుగుతాడు . మైనింగ్ మాఫియాల మధ్య కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ దశావతారాల పాట పాడతాడు . అణిమ గరిమ మహిమ లాంటి పారిభాషిక ప్రత్యేక నిఘంటువుల్లో తప్ప బయట దొరకని మాటలను తెలుగుపాటలో బంధిస్తాడు . రాత్రి దిగిన సూర్యుడిని పట్టి తూర్పుకు లాక్కొస్తాడు . మత్తు వదిలిస్తాడు . బుద్ధి చెబుతాడు . హెచ్చరిస్తాడు . మనం అడగలేని , మనకు అడగడం చేతకాని ప్రశ్నలను అడుగుతాడు . మూగబోయిన మన గొంతు తానవుతాడు . తెలుగు పాట మూగబోకుండా తను పదమవుతాడు . పాటలో తెలుగు దీపం కొడిగట్టకుండా తన పద పాదాల చేతులు అడ్డుపెట్టి ఉన్నాడు .

తనువు , మనసు , ఆలోచనలు అంతా వెన్నెల స్నానం చేస్తున్నవాడి చెంత ఇది ఒక పద్మం .

-
madhupamidikalva@gmail.com
9989090018

No comments:

Post a Comment