Wednesday 28 February 2018

మాట తప్పని సిరివెన్నెల

పాత ముచ్చట్లు -3 


ఎం.వి.ఆర్.శాస్త్రి
........

   పందొమ్మిదేళ్ళ కిందటి మాట .

   " మార్చ్ 4 రాత్రి 11 - 26 కు హస్తినాపురం లో మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం  . ఇన్విటేషన్ కార్డు పంపిస్తున్నాను . మీరు ఎలాగూ రారనుకోండి. " అన్నాను ఫోనులో .

   " ఎందుకు రాను? కచ్చితంగా వస్తున్నాను . నేను రాకుండా మీ గృహప్రవేశం ఎలా అవుతుంది ? " అన్నారు  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు .

   "కబుర్లు బాగానే చెబుతారు . పాటల బిజీలో మర్చిపోతారు. మీ సంగతి నాకు తెలియదా " అంటే  సహజ శైలిలో గట్టిగా నవ్వి " లేదు లేదు. వస్తాను " అన్నారు.

   " వస్తే సంతోషమే.  అయినా అంత రాత్రి అంత దూరం రావటం మీకెక్కడ కుదురుతుంది ? మర్నాడు శుక్రవారం ఉదయం సత్యనారాయణ వ్రతం . మీకు వీలయితే ఫ్యామిలీ తో వచ్చి భోజనం చేసి వెళ్ళండి  మహానుభావా ! అది చాలు "

   " నా గురించి ఏమనుకుంటున్నారు మీరు ? దానికీ వస్తా .దీనికీ వస్తా "

   " నేను నమ్మను . మాటలు బాగా చెబుతారు. కానీ దేనికీ రారు. "

    నాకైతే ఏకోశానా డౌటు లేదు. మనిషి చాలా మంచివాడే. స్నేహశీలే . నేనంటే చాలా ప్రేమ ,గౌరవం ఉన్నవాడే. కానీ సినిమా పాటల ఫీల్డులో యమా బిజీ. పాపం ఆయనకెక్కడ టైం ఉంటుంది ? గ్యారంటీగా రాడు అనుకున్నా. కానీ ఆశ్చర్యం ! ( 1999 మార్చి) 4 అర్ధరాత్రి దాటాక ఏ ఒంటి గంటకో తమ్ముళ్ళను కూడా వెంటబెట్టుకుని  మెరుపుదాడి చేశారు  సిరివెన్నెల వారు.



    సాగర్ రోడ్డులో ఇన్నర్ రింగ్ రోడ్ దాటాక రెండు కిలోమీటర్లకు వస్తుంది హస్తినాపురం నార్త్. అప్పట్లో ఎక్కువ ఇళ్ళు లేవు. అర్ధరాత్రి జనసంచారం ఉండదు. చీకట్లో దారి వెతుక్కుని  కొత్త ఇంటికి చేరటానికి పాపం నానా  అవస్థ  పడ్డారు. అక్కడక్కడే చాలా సేపు తిరిగారు. మొత్తానికి కష్టపడి వచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు శాస్త్రిగారు. " చాలా లేట్ అయింది . మీకు పెట్టటానికి అరటిపళ్ళు, ప్రసాదం తప్ప ఏమీ లేవు " అంటే " ఎందుకు ? రేపు భోజనానికి వస్తున్నా కదా " అన్నారు .

   నిజంగానే అంత పనీ  చేశారు. ఏ 2 గంటలకో అక్కడినుంచి వెళ్లి మళ్ళీ మధ్యాహ్నానికల్లా సకుటుంబంగా వచ్చారు.


   అప్పటికే సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మగారు వచ్చి కవితాగానం చేస్తున్నారు. సిరివెన్నెల కూడా వచ్చేసరికి మజా ఎక్కువయింది. అందరూ వాళ్ళ చుట్టూ మూగారు. శాస్త్రిగారు శ్రోతలు కోరిన పాటలు ఏకధాటిగా వినిపించారు. అప్పటి శాసన సభాపతి , ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు , అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ సి.వెంకటేశన్ ,పోలీసు ఐ.జి.గా పనిచేస్తున్న సాహితీ ప్రియుడు కొడాలి సదాశివరావు గారు , సీనియర్  ఐ.పి.ఎస్. అధికారులు కె.ఆర్.నందన్ గారు  , శ్రీరాం తివారిగారు, అనుకోని పాటకచేరిని విని ఆనందించారు. ఆ సమయాన తీసింది ఈ ఫోటో.



   మాడుగుల వారు ఫోటో లో రామకృష్ణుడు గారి పక్క కుడివైపు చివరిలో ఉన్నారు.  పోలిస్ అధికారి అరవిందరావుగారు, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి స్వామినాథన్ గారు, కాంగెస్ నాయకులు మైసూరారెడ్డి గారు, కె.కేశవరావు గారు,  కెవిపి రామచంద్రరావు గారు కూడా ఆ నాటి వేడుకలో మాతో ఉన్నారు.



  హస్తినాపురం గృహప్రవేశం లో  అదృష్టం ఆ రోజు ఉదయం మా గురువుగారు పూజ్య సద్గురు శివానందమూర్తి గారికి కొత్త ఇంట్లో పాదపూజ చేసుకోగలగటం !







    పాదపూజ కాగానే గురువుగారితో కొద్దిమంది అతిథులు కాసేపు ఇష్టాగోష్టి జరిపారు. సిరివెన్నెల గారు. విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి దేవరకొండ రామకృష్ణ గారు, బి.జి.పి. నాయకుడు ఎన్.రామచంద్రరావు గారు వారిలో ఉన్నారు.






   అన్నట్టు ఆ రోజు పొద్దున్నే పుష్పగిరి పీఠం మహాస్వామి విద్యానృసింహ భారతీ స్వామి వారు నా మీద ప్రేమతో శ్రమ పడి కొత్త ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించి వెళ్ళారు.


   సిరివెన్నెల గారిని మొదట కలిసింది తిరుపతిలో. అప్పట్లో తి.తి.దే. సెక్యూరిటీ అధికారిగా ఉన్న నా ఆప్త మిత్రుడు వై.ఎస్.ఎన్.శర్మ గారి ఇంట్లో. చల్లటి రాత్రి చక్కని విందులో అద్భుతంగా  పాడిన "క్షీరసాగర మథనం"  కవితాధారను పరమానందం తో విన్నాక సిరివెన్నెల గారిని అడిగాను " మీరు సినిమారంగంలో  ఎందుకున్నారు ?" అని.

   ఆ మాట మేము కలిసినప్పుడల్లా  ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు శాస్త్రిగారు. .

   ఇప్పుడు హస్తినాపురం ఇల్లు లేదు. అమ్మేశాను. ఈ జ్ఞాపకాలు మిగిలాయి.

Saturday 24 February 2018

తగలబెట్టాల్సిందేనా ?

 మనుధర్మం -3


  ఎం.వి.ఆర్.శాస్త్రి 

    స్త్రీ స్వేచ్చ గురించి రంగనాయకమ్మ ఒకలా చెబుతుంది.  రాంగోపాల్ వర్మ ఇంకోలా అంటాడు.
    రెండిటి మధ్యా ఎక్కడా పొంతన ఉండదు. కానీ ఎవరి రాతలో వారు చెప్పే విషయాల వరకూ కనీసం పొంతన ఉంటుంది కదా ?
     సాధారణంగా లోకంలో ఏ రచయిత అయినా తాను రాసే మాటల్లో పొంతన ఉండేలా ,వైరుధ్యాలు  లేకుండా సాధ్యమైనంత జాగ్రత్త పడతాడే ?! విజ్ఞుడు, విశాల దృష్టి కలవాడు, విశ్వమానవులందరికీ అన్ని కాలాల్లో పనికొచ్చే విషయాలు చెప్పినవాడు అని ఎందరో పాశ్చాత్య మహా మేధావులే మెచ్చుకున్న మను మహర్షి తాను చాటే ధర్మసూత్రాలలో పొంతన , సూత్రబద్ధత ఉండేట్టు చూసుకోడా ? అతడే స్పష్టంగా ప్రకటించిన నియమాలు , ప్రమాణాలకు , మొత్తంగా అతడి ధర్మశాస్త్రం తీరుకు, తత్వానికి పూర్తి విరుద్దంగా ఏవైనా అసంబద్ధతలు, అపభ్రంశాలు   కనపడితే  అవి మధ్య కాలంలో ఎవరో ప్రబుద్ధులు  చొప్పించినవని స్పష్టమే కదా? నడమంత్రంగా చేర్చబడిన వాటి పాపాన్ని  మూల రచయితకు అంటగట్టటం న్యాయమేనా?

   యుగయుగాలుగా యావద్భారతానికి పరమ పవిత్ర గ్రంథమైన రామాయణం లోనే ఎన్నో ప్రక్షిప్తాలున్నాయని పండితులు చెబుతారు. నేపాల్ లో వెయ్యి సంవత్సరాల కింద భద్రపరిచిన తాళపత్ర మూల ప్రతిలో లేని  శ్లోకాలు ఈ కాలపు రామాయణ ప్రతులలో  చేరాయి. నిన్నమొన్నటి వేమన అసలు రాసింది శతకమే అయినా  , అతడు రాసినవేనంటూ ఇవాళ కొన్ని వేల పద్యాలు చలామణిలో ఉన్నాయి. వాటిని చూసి పామరులు మోసపోవచ్చు. కాని మూల తత్వాన్ని బట్టి ,  శైలిని బట్టి, భాషను బట్టి ఏవి అసలువి , ఏవి నకిలీవి అన్నది విద్వాంసులు కనుగొన్నారు. విశ్వదాభి రామ వినురవేమ అని చివరిలో ఉన్నది కాబట్టి ఎవడో కల్పించిన ప్రతి గాడిద పద్యానికీ  వేమనే ముద్దాయి అని బుద్ధి ఉన్న వాడెవడూ అనడు. నీతిని బోధించటానికి ఉద్దేశించిన ప్రాచీన గ్రంథాలలోనే, ఆధునిక నీతి శతకాలలోనే చేతి వాటాలు చోటు చేసుకున్నప్పుడు సమాజం లోని వివిధ వర్గాల జీవనానికి, అనేకానేక పబ్లిక్ కార్యకలాపాలకు, సామాజిక కట్టుబాట్లకు , నేరాలకు, వాటికీ విధించే శిక్షలకు సంబంధించి ప్రామాణికమనుకోబడే  ధర్మ శాస్త్రాలలో  కలగలుపులు , చేతివాటాలు లేకుండా ఎలాఉంటాయి ?

   ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన వాస్తవాలు ఇవి :

   1.  మనుస్మృతి లో ప్రక్షిప్తాల ఊసు బాధిత సామాజిక వర్గాలలో చైతన్యం పెరిగిన దరిమిలా ఇటీవలి కొన్ని దశాబ్దాలలో మాత్రమే వినవస్తున్నది కాదు. శతాబ్దానికి పైగా కాలంలో మహర్షి దయానంద సరస్వతి, విశ్వనాథ్ నారాయణ్ మండలిక్ , తులసీరాం ,  భారతరత్న పి.వి.కాణే  వంటి ఎందరో  పండితులు గుర్తించి వివరంగా చర్చించినదే.  మరుగునపడి ఉన్న మనుస్మృతి ని  ఆధునిక   ప్రపంచానికి ఘనంగా  పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగినవాడు   George Buhler. మనుస్మృతికి సంబంధించి ఆధునికులు ఎవరైనా నేటికీ ప్రామాణికంగా పరిగణిస్తున్నది బూలర్ గ్రంథాన్నే.   1886 లొ  LAWS OF MANU  పేరుతొ  వెలువరించిన పరిశోధనాత్మక గ్రంథం పీఠిక లో బూలర్ చెప్పింది  మచ్చుకు కొన్ని వాక్యాలు చూడండి :

    This work contains also an admixture of modern elements... If we examine Manu's text according to these principles, the whole first chapter must be considered as a later addition...Chapters II-VI, on the other hand, seem to represent with tolerable faithfulness the contents of the corresponding sections of the Manava Dharma-sutra ... Nevertheless, the hand of the remodeller is not rarely visible...There are a considerable number of smaller and some larger interpolations...More doubtful are the discussions on the duty of conjugal intercourse (vv. 46-50), on the honour due to women (vv. 55-60), on the excellence of the order of householders (vv. 79-80)...  ...

[LAWS OF MANU by George Buhler ,Introduction pp.Ixvi-Ixviii]

    (ఈ గ్రంథంలో తరవాత వచ్చి చేరిన అంశాలు కూడా ఉన్నాయి... పై నియమాల ప్రకారం  మను ప్రతిని పరీక్షిస్తే మొదటి అధ్యాయం మొత్తం తరవాత జోడించబడినదని భావించాలి...రెండు నుంచి ఆరు అధ్యాయాలు మానవ ధర్మ సూత్రాలకు మొత్తమ్మీద  అనుగుణంగానే ఉన్నట్టు కనిపించినా అక్కడ కూడా తిరిగి కూర్చిన వాడి చేతి వాటం లేదనలేము. ... చిన్నా పెద్దా ప్రక్షిప్తాలు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. వైవాహిక సంభోగానికి సంబంధించిన విధులు, మహిళలకు ఇవ్వదగిన గౌరవాలు ,  గృహస్థాశ్రమ ప్రాశస్త్యం వగైరాల పై చేసిన చర్చలు కూడా అనుమానించ దగ్గవే. ... ... )

   2. వర్ణాల మధ్య వివాహాలు,  ఎనిమిది రకాల వివాహాల మంచిచెడ్డలు, శ్రాద్ధాలూయజ్ఞాలలో జంతువధాలు, మాంస భక్షణలు, నిస్సంతులకు నియోగపు  విధానం ద్వారా సంతానం  వంటి విషయాలలో ....  శూద్రులూ , స్త్రీల కు సంబంధించిన అంశాలలో పరస్పర విరుద్ధ నిర్దేశాలు మనుస్మృతిలో  అనేకం కానవస్తాయి.  ఫలానా విధంగా చేయాలి అని చెప్పిన వెనువెంటనే అలా చేయటం చాల తప్పు , నికృష్టం అని ఖండించటం కద్దు.  ఒక చోట చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకో చోట ఇంకోలా పేర్కొనడం కూడా ఉంది. ఇది కాలక్రమంలో కలగలుపుల వల్ల  జరిగింది .

   3.ఏవి ప్రక్షిప్తాలు  అన్నవి పోల్చుకోవటం కష్టమే. కాని అసాధ్యం కాదు. తాను బోధిస్తున్న ధర్మానికి లక్షణాలేమిటో  మను మహర్షి విస్పష్టంగా ముందే ప్రకటించాడు ఇలా :

వేదో ఖిలో ధర్మ మూలం ... ( 2-6 )
(సమస్త ధర్మానికి వేదమే మూలం )

వేదః స్మృతిస్సదాచారః స్వస్య చ ప్రియమాత్మనం
ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణం (2-12 )
(వేదము, స్మృతి ,సదాచారము, తన మనస్సుకు ఇష్టము అనే నాలుగు ధర్మానికి లక్షణాలు )

    అన్నిటికంటే పరమ ప్రమాణం వేదం. దానిలో ప్రక్షిప్తాలు లేవు. వేరు వేరు పాఠాలు లేవు. ఎక్కడా ఒక అక్షరం పొల్లుపోకుండా, ఎవరూ మార్చటానికి వీలు లేకుండా తిరుగులేని కట్టడితో అనాదిగా కాపాడబడుతూ వసున్నది కాబట్టి వేదం విషయంలో సందిగ్ధత లేదు. ఆది మూలం వేదం అని మనువే చెప్పినందున వేదంలో చెప్పినదానికి విరుద్ధంగా మనుస్మృతిలో ఏదైనా చెబితే అది మనువు అభిప్రాయం కాదని నిర్ధారించ వచ్చు. " ధర్మశాస్త్రం తు వై స్మృతి: "  అని అంతకు ముందు (2- 10 ) శ్లోకం లో ఉన్నది కనుక  స్మృతి అంటే ధర్మశాస్త్రం. స్మృతులు ఎన్ని ఉన్నప్పటికీ వాటి బోధనల సారమైన ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది అన్నది విద్వాంసులకు తెలుసు. కాబట్టి ధర్మ విరుద్ధమైన అంశాలు ఎక్కడున్నా  గుర్తుపట్టవచ్చు. అందులో అనుమానమేదైనా ఉంటే మూడవ ప్రమాణమైన సదాచారాన్ని గమనించవచ్చు. వేదములనెరిగిన ధర్మవేత్తలు నిర్దేశించిన , అనుసరిస్తున్న మంచి ఆచారాలను బట్టి తప్పొప్పుల నిర్ణయం చేయవచ్చు. ఒకవేళ వేదం వారించకపోయినా, ధర్మ శాస్త్రం లో నిషేధం లేకపోయినా , శిష్టాచారానికి వ్యతిరేకం కాకపోయినా .. అవన్నీ తెలిసీ, వాటిమీద పరిపూర్ణ గౌరవం ఉండికూడా ఏదైనా విషయం తన అంతరాత్మ  అంగీకరించలేకపోతే మనసుని చంపుకుని దానిని పాటించాల్సిన పనిలేదని మనువే మినహాయింపు ఇచ్చాడు. ప్రపంచంలో వేరే  ఏ మతమూ , అన్యమతాలకు చెందిన  ఏ ధర్మశాస్త్రమూ మానవులకు అనుమతించని వెసులుబాటు ఇది. సైన్సు చెప్పే  ఆసిడ్ టెస్టులకు తీసిపోని ఈ నాలుగు ప్రమాణాల సాయంతో మనుస్మృతిలో తప్పాతాలూ వేరు చేయటం అసంభవమేమీ కాదు.

   4. ఈ దిశలో ఇప్పటికే కొంత ప్రయత్నం  జరిగింది కూడా. 1. విషయవిరుద్ధం 2. ప్రసంగ విరోధం ౩. పరస్పర విరోధం 4.పునరుక్తిదోషం 5. శైలీవిరోధం 6.అవాంతర విరుద్ధం  7. వేదవిరుద్ధం అనే ఏడు పెరామీటర్లను ఎంచుకుని...   ఆ దోషాలలో ఏ ఒకటైనా ఉంటే అది మనుధర్మానికి విరుద్ధమనీ , ఏడింటిలో ఏ దోషమూ అంటనిది  శుద్ధమనీ తెల్చుతూ ప్రొఫెసర్ ఆర్. సురేంద్రకుమార్ కొన్నేళ్ళ కింద  "విశుద్ధ మనుస్మృతి "అనే గ్రంథాన్ని హిందీలో వెలువరించారు. తెలుగులోనూ దాని అనువాదం వచ్చింది.  సురేంద్రకుమార్ పెట్టుకున్న పెరామీటర్ల వరకూ ఆక్షేపించవలసింది లేదు. కానీ వాటి ఆసరాతో..  తన దృష్టిలో ఈ కాలానికి సరిపడనివి , నేటి దేశకాల పరిస్థితులలో సమర్థనీయం కానివి , వివాదాస్పదమైనవి ఆయన టోకున ఎత్తివేయటంతో మొత్తం 2685 శ్లోకాలలో ఏకంగా 1471 శ్లోకాలు అంటే సగానికి పైగా ఎగిరిపోయాయి. మొదటి అధ్యాయంలో మనువుల ప్రజాసృష్టి  , యుగధర్మములు, తపః ప్రశంస  ... రెండవ అధ్యాయంలో ఓంకారము, గాయత్రీ మంత్రం మూడవ అధ్యాయంలో అతిముఖ్యమైన శ్రాద్ధ కర్మ విధానము, నాలుగవ అధ్యాయంలో ఆహితాగ్ని విధులు, అనధ్యయనాలు ... ఐదవ అధ్యాయంలో  సాపిండ్య లక్షణములు, అశౌచ విధి ... పదవ అధ్యాయం లో సంకీర్ణ జాతులు, ఆపద్ధర్మాలు ... పదకొండవ అధ్యాయంలో ప్రాయశ్చిత్తకాండ లకు సంబంధించి అతిముఖ్యమైన శ్లోకాలు వందల సంఖ్యలో  కత్తికోతకు గురి అయ్యాయి. ఈ కాలపు తెలిసీ తెలియని ఆక్షేపకుల మెహర్బానీ కోసమా అన్నట్టు గొప్ప ధర్మ శాస్త్రాన్ని అనవసరపు అతిజాగ్రత్తతో ముక్కలు చేయటంతో సురేంద్రకుమార్ పడిన విలువైన శ్రమ ఆర్య సమాజ్ వారిని మినహా విశాల విజ్ఞ సమాజాన్ని మెప్పించలేకపోయింది. మనుస్మృతి లో ప్రక్షిప్తాలను గుర్తించటానికి విశాల ప్రాతిపదికపై అఖిల భారత స్థాయిలో బృహత్ కృషి జరగవలసి ఉంది.

   5. ఈ కాలపు ప్రమాణాల , ఆధునిక ఆలోచనా రీతుల ప్రకారం చూసినా మనుస్మృతిలో అభ్యంతరకరమైన  శ్లోకాల సంఖ్య మహా అయితే మూడు వందలకు మించదు. " మనుస్మృతి " లోని మొత్తం 2685 శ్లోకాలలో అది తొమ్మిదో వంతు మాత్రమే. అంటే తొమ్మిదింట ఎనిమిది వందల శ్లోకాలకు ధర్మం, మనుస్మృతి పూర్వాపరాలు తెలిసిన వివేకవంతులెవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పని లేదు.  ఏ ధర్మశాస్త్రాన్ని అయినా అది వెలువడిన నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే చూడాలి తప్ప నేటి ఆలోచనా లోచనాలతో నాటి భావాలపై తీర్పు చెప్పకూడదు. అలా ఆధునిక ప్రమాణాలతో వెల గట్ట బోతే మన మేధావులకు ముద్దొచ్చే ఏ విదేశీ మతానికి చెందిన ఏ పవిత్ర గ్రంథమూ  నిలబడదు.

    6.మనుస్మృతిలో కొన్ని శ్లోకాలలోని అసంబద్ధతలు, విపరీతాంశాలు కొత్తగా బయటపడ్డవి కావు. ప్రపంచ  పండితులందరూ ప్రామాణికంగా పరిగణిస్తున్న కుల్లూక భట్టు వ్యాఖ్యానంతో కూడిన ప్రతిలో కూడా అవన్నీ ఉన్నాయి. ఆ " కలకత్తా మాన్యుస్క్రిప్టు"ను మూలంగా తీసుకునే సర్ విలియం జోన్స్ 1792 లో  The Institutes of  Hindu Law or Ordinances of Menu పేరిట మనుస్మృతికి మొట్టమొదటి ఇంగ్లీషు అనువాదాన్ని కలకత్తాలో ప్రచురించాడు.
https://www.lawbookexchange.com/pictures/43995.JPG?v=1374696346అందులో మనకు ఇప్పుడురోతపుట్టించే  వాటితో  సహా మొత్తం 2685 శ్లోకాలూ ఉన్నాయి. కలగలుపులు, ప్రక్షిప్తాలూ గట్రా అని మనం అనుకునేవి  చూసిన తరవాత కూడా మనుస్మృతిని అర్జెంటుగా తగలబెట్టెయ్యాలని జోన్స్ అనుకోలేదు. ఆయనేమీ అల్లాటప్పా మనిషి కాదు. కలకత్తాలోని అప్పటి సుప్రీం కోర్టులో  న్యాయ మూర్తి గా పని చేసిన వాడు. ఇండియా కు వచ్చాక పండితుల దగ్గర సంస్కృతం నేర్చుకుని ధర్మ శాస్త్రాలనే   అనువాదం చేయగలిగిన ప్రావీణ్యం సంపాదించిన వాడు. జన్మతః విదేశీయుడు , క్రైస్తవుడు అయికూడా మన మనుస్మృతి ని గ్రంథం తొలిపలుకులో జోన్స్ ఎంతగా కొనియాడాడో చూడండి :


   A spirit of sublime devotion of benevolence to mankind , and of amiable tenderness to all sentient creatures , pervades the whole work. The style of it has a certain austere majesty, that sounds like the language of legislation and extorts a respectful awe. The harsh admonitions even to the kings are truly noble ... Whatever opinion in short may be formed of Manu and his laws , in a country happily enlightened by sound philosophy and only true revelation, it must be remembered that those laws are actually revered as the words of the most high.
[Institutes of Hindu Law, Sir William Jones , preface]

  ( మానవాళి పట్ల అవ్యాజమైన ఔదార్యం , చైతన్యవంతమైన ప్రాణులన్నిటి మీదా  దయార్ద్రత ఈ గ్రంథం నిండా  పొంగిపొర్లుతాయి. దీని శైలి లో కఠోరమైన రాజసం ఉంది. దీని భాష  శాసనం లా ధ్వనిస్తూ వినమ్ర సంభ్రమాన్ని కలిగిస్తుంది. రాజులకు సైతం కఠినంగా శాసించటం నిజంగా ఉదాత్తం...మనువుమీద , అతడి అనుశాసనాల మీదా స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు .. గొప్ప తాత్విక చింతనతో , నిజమైన దివ్యజ్ఞానంతో విరాజిల్లే  దేశంలో ఆ శాసనాలు దైవవాక్కులుగా శిరసావహించబడుతున్నాయని  గుర్తుంచుకోవాలి.  )

   ఎక్కడో పరాయి  దేశం లో పుట్టి , వయసు మీరాక సంస్కృతం నేర్చుకుని మనుధర్మాన్ని అధ్యయనం చేసిన జోన్స్ దొరకేమో మనువు ఏ ప్రాణికీ హింసను తలపెట్టని దయాసముద్రుడైన మానవతామూర్తి గా , రాజులను సైతం కఠినంగా కట్టడి చేయగలిగిన శాసన కర్తగా పొడగట్టాడు. వేదభూమిలో, ఆర్ష సంస్కృతిలో పుట్టినందుకు సిగ్గుపడే  మనమేమో మనువును మహా క్రూరుడిలా, సభ్య సమాజానికి పీడాకారుడిలా  చూస్తున్నాం. మనుస్మృతి గ్రంథాన్ని చేత పట్టుకొని ఉన్న విలియం జోన్స్ విగ్రహాన్ని  ఆయన  మహోన్నత కృషికి నివాళిగా  లండన్ లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ లో ( బొమ్మ చూడండి ) ఇంగ్లీషు వారు నెలకొల్పారు. నాగరికులమనుకునే మనమేమో మనుస్మృతి ని తగలపెట్టటమే నాగరికతకు , సామాజిక న్యాయానికి  , అభ్యుదయ దృష్టికి గుర్తు అని గట్టిగా నమ్ముతున్నాం.

[ ఇంకా ఉంది ]









Thursday 15 February 2018

ఇదెక్కడి న్యాయం ?

మను ధర్మ శాస్త్రం -2 


ఎం.వి.ఆర్. శాస్త్రి



   అనుమానం అక్కర్లేదు. ఈ మాట ఒప్పుకోవటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండనక్కరలేదు.

   " మనుస్మృతి " పేర ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్రంథాల్లో ఎవరు వేసింది , లేక ఎవరు రాసింది చదివినా , అందులో శూద్రుల పట్ల , చండాలాది అంత్య జాతుల పట్ల కొట్టవచినట్టు కనపడే క్రూరత్వం , దుర్వివక్ష లను చూస్తె మనిషన్న ప్రతి ఒక్కడికీ వొళ్ళు మండుతుంది. మరీ ఇంత అమానుషమా అని తీవ్రమైన జుగుప్స కలుగుతుంది. కడగొట్టు జాతులను ఉద్దేశించి అందులో నిర్దేశించిన శిక్షలను గానీ , వాటి వెనుక ఉన్న బ్రాహ్మణాధిక్య భావజాలాన్ని కానీ ఈ కాలం లో ఎవరూ సమర్ధించరు.  సమర్ధించ కూడదు.

   అదే సమయంలో సో కాల్డ్ " మనుస్మృతి ' ని సాక్ష్యం గా చూపెట్టి , అందులో పేర్కొన్న దుర్మార్గపు శిక్షలు , వివక్షలు అన్నిటినీ హిందూ సమాజం లేక హిందూ మతం అనాదిగా , యుగ యుగాలుగా కింది వర్ణాల పట్ల అమలు జరిపిందని ఆరోపించటం తప్పున్నర తప్పు.

  ఈ సందర్భంలో ముఖ్యంగా గమనించవలసిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి.

   1. మను ధర్మ శాస్త్రం వేరు. ఆధునిక కాలంలో " మనుస్మృతి " పేర చలామణి లో ఉన్న అతుకుల బొంత పుస్తకాలు వేరు.

   2. రామాయణం లో ,  మహాభారతం లో మనువు , అతడు నుడివిన మానవ ధర్మం ప్రస్తావన అత్యంత గౌరవ పూర్వకంగా, పరమ ప్రమాణంగా కనిపిస్తుంది.  శ్రీరాముడి పూర్వీకులైన రఘువంశం రాజులు అందరూ మనువును అనుసరించి ధర్మపాలన చేశారని  " రఘువంశం " లో కాళిదాసు పేర్కొన్నాడు. 
   ఈ మధ్య రామసేతు కు సంబంధించి వెలువడిన ఒక శాస్త్రీయ రుజువును బట్టి చూసినా రాముడు కనీసం 7 వేల ఏళ్ళ కిందటి వాడు. చరిత్రకారులు చాలామంది తేల్చిన ప్రకారం మహాభారత యుద్దం క్రీస్తు శకానికి వెనుక 3102  సంవత్సరంలో అంటే కనీసం 5 వేల ఏళ్ళ కింద జరిగింది. దీన్ని బట్టే మనువు , మనుధర్మం ఎన్నో వేల ఏళ్ళుగా సుప్రసిద్ధమైనవని స్పష్టం.

   3. ఇక మనం చూస్తున్న ' మనుస్మృతి " సంగతి.  ఇది ఏకాలం లో రాసింది అన్నదాని మీద  చరిత్రకారులు తలా ఒక రకంగా చెబుతారు.  కొందరు ఇది క్రీ. పూ. 2 వ శతాబ్దం నాటిది అంటారు. మరికొందరు క్రీ.శ.3 వ శతాబ్దం నాటిది అని చెబుతారు. అందరు చెప్పేదీ చూసినా ఇది మహా అయితే అటూ ఇటూగా 2000 సంవత్సరాల నాటిది.

   4. పోనీ ఈ 2 వేల ఏళ్ళుగా అయినా వ్యవహారం లో ఉన్న మనుస్మృతి ఇదీ  అని కచ్చితంగా చెప్పగలమా?

   Over fifty manuscripts of the Manusmriti are now known, but the earliest discovered, most translated and presumed authentic version since the 18th century has been the "Calcutta manuscript with Kulluka Bhatta commentary". Modern scholarship states this presumed authenticity is false, and the various manuscripts of Manusmriti discovered in India are inconsistent with each other, and within themselves, raising concerns of its authenticity, insertions and interpolations made into the text in later times.

[ Wikipedia , quoting Patrick Olivelle in  "Manu's Code of Law", Oxford University Press ]

   ( మనుస్మృతి కి సంబంధించి 50 కంటే ఎక్కువ రకాల రాతప్రతులు బయటపడ్డాయి . కనుగొన్నవాటి  అన్నిటిలోకీ పాతదీ, ఎక్కువగా అనువదించబడ్డదీ ,  ప్రామాణికమని 18 వ శతాబ్దం నుంచీ ఊహించబడినదీ కుల్లూక భట్టు వ్యాఖ్యానంతో కూడిన " కలకత్తా రాతప్రతి ". దాని ప్రామాణికత కూడా  అబద్ధమని ఆధునిక విద్వాంసులు తేల్చారు. భారతదేశం లో కనుగొన్న వివిధ రాతప్రతుల్లో ఒకదానికీ ఇంకొకదానికీ పొంతన లేదనీ, ఒక ప్రతిలో  చెప్పినవాటి విషయాల్లోనే పొంతనలేదనీ పరిశోధకులు చాటారు.  దీనివల్ల ఏ రాతప్రతికి ఆ రాతప్రతి ఎంత వరకూ అసలైనది . అనంతర కాలాల్లో వాటిలోకి    చేర్చిన  , చొప్పించిన ప్రక్షిప్తాలు ఏమిటి అన్న అనుమానాలు రేకెత్తాయి. )

   కాళిదాసు కవిత్వం కొంత , నా పైత్యం కొంత అన్నట్టు ఒక్కో కాలంలో ఒక్కకరు , తమకు తోచినట్టు, ఇష్టం  వచ్చినట్టు లేనిపోనివి జోడించి గ్రంథం పెంచుకుంటూ పోవటంతో ఇప్పుడు మనం మనుస్మృతి అనుకుంటున్నది  నానా చేతివాటాల కంగాళీ గా తయారయింది.

    5. మహమ్మదీయులకు షరియత్ లాంటిది కాదు హిందువులకు మనుస్మృతి. అది ధర్మ శాస్త్రమే తప్ప శిక్షా స్మృతి ఎంతమాత్రమూ కాదు. నేటి ఇండియన్ పీనల్ కోడ్ వలె దానిలో సూచించిన శిక్షలకు చట్టప్రతిపత్తి లేదు. శాసనపరమైన  ఆమోదమూ లేదు. హిందూ దేశంలో ఏ కాలంలో ఏ రాజూ మనుస్మృతి ని ఆధికారిక , ఏకైక రాజ్యాంగం గా ప్రకటించిన దాఖలా కంచు కాగడాతో  వెతికినా ఒక్కటీ కనపడదు. పూర్వకాలంలో ఏ జాతికి ఆ జాతి, ఏ జనపదానికి ఆ జనపదం తన ఆచారం, సంప్రదాయం, ఆలోచనా విధానాన్ని బట్టి నేరాలకు శిక్షలను నిర్ణయించడమే తప్ప మన కాలంలో వలె మొత్తం రాజ్యమంతటికీ కలిపి ఒకే న్యాయవిధానం , ఒకే శిక్షాస్మృతి ఉండేవి కావు. 

    6. రామాయణం , భగవద్గీత ల వలె మనుస్మృతి హిందువులకు పవిత్ర మతగ్రంథం ఎన్నడూ కాదు. "మనుస్మృతి" విధిగా పాటించి తీరవలసిన , అనుల్లంఘనీయమైన ధర్మ శాసనమని అది  వ్యవహారంలోకి వచ్చిన ఈ  2 వేల ఏళ్ళలో ఏనాడూ హిందూ సమాజం భావించలేదు. అది ధర్మశాస్త్రమే తప్ప న్యాయశాసనం ఏనాడూ కాదు. అటువంటి ధర్మశాస్త్రాలు యాజ్ఞ్యవల్క్య స్మృతి , గౌతమస్మృతి వంటివి మనకు ఇంకా డజన్ల కొద్దీ ఉన్నాయి. 

   కృతేతు మానవాః ప్రోక్తా : 
   త్రేతాయాం గౌతమ స్మృతి : 
   ద్వాపరే శంఖ లిఖితౌ
   కలౌ పారాశర స్మృతి : 


   కృతయుగంలో  మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి , ద్వాపరంలో శంఖలిఖిత స్మృతి , కలియుగం లో పారాశర స్మృతి ఆచరణీయమని పెద్దల మాట.  మనం ఉన్న కలియుగం లో మనుస్మృతిని విధిగా పాటించాలని ఎంతటి చాందసుడూ చెప్పలేడు . ఈ యుగంలో  ఎవరూ పాటించని  మనుస్మృతి లో ఎవరో ఎప్పుడో బనాయించిన  రాతలకు మొత్తం హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నిందించటం ఎంతవరకు న్యాయం ? 

   6. మనుస్మృతిలో మనకు కనపడుతున్న శూద్ర , దళిత ద్వేషం గానీ , కడజాతులను అన్యాయంగా , అమానుషంగా కాల్చుకు తినడం గానీ  వేదకాలపు, పౌరాణిక యుగాలలోనైనా ఉన్నదా అంటే నిర్దిష్టమైన ఆధారం ఒక్కటీ కనపడదు. 

   తపస్సు చేస్తున్నందుకు రాముడు శూద్ర శంబూకుడిని చంపాడు.
   ఆదివాసి ఏకలవ్యుడి బొటన వేలును ద్రోణుడు తెగగొట్టాడు.
   కర్ణుడిని సూతపుత్రుడా అని అవమానించారు.
   హరిశ్చంద్రుడు ఆలిని అమ్మాడు.
   ధర్మరాజు భార్యను జూదంలో పణం పెట్టాడు. 
   రాముడు సీతను అడవికి గెంటాడు.

    ఎవరు ఎప్పుడు ఎన్ని తీర్ల ఎంత తిట్టిపోసినా  , అనాదిగా జరిగినవనబడే అన్యాయాలకు దృష్టాంతంగా చూపించేవి ప్రధానంగా ఇవే కదా? ఇవన్నీ , వ్యక్తిగతమైన , వ్యక్తుల పరంగా జరిగిన అరుదైన ఘటనలే కాదా ? వీటిని పట్టుకొని, ఆ కాలాల్లో రాజులందరూ శూద్రులను చంపారు ;అస్త్రవిద్య నేర్చిన గిరిజనులందరి బొటన వేళ్ళు తెగగొట్టారు ; శూద్రులందరినీ అవమానించారు ; భర్తలందరూ కట్టుకున్న పెళ్ళాలను అమ్ముకునేవారు ; వారిని జూదంలో పణం పెట్టేవారు ; అనుమానం రాగానే భార్యలను కారడవులకు గెంటేసేవారు .. అని జనరలైజ్ చేయటం సమంజసమేనా ?
     అలాంటి చెదురుమదురు ఘటనలే తప్ప ..

   వేదం వినిన శూద్రుడి చెవుల్లో సీసం మరగబెట్టి పోశారనీ ...
   వేదం చదివిన శూద్రుడి నాలుక కోశారనీ.. 
   బ్రాహ్మడిని తిట్టినా శూద్రుడి నోట్లో సలసల కాలే ఇనుప కడ్డీని దోపారనీ ..
   బ్రాహ్మలిని ఏ అంగంతో శూద్రులు అవమానిస్తే ఆ అంగాన్ని నరికేశారనీ ..
   
ఏ పురాణంలో నైనా , ఏ ఇతిహాసంలో నైనా, ఏ చరిత్ర గ్రంథంలోనైనా ఎక్కడైనా ఉందా ? 
లేనప్పుడు..  మనుస్మృతిలో కనపడుతున్నాయి కాబట్టి అలాంటి  క్రూరమైన , అమానుషమైన శిక్షలన్నీ పూర్వం అన్ని కాలాల్లో అమలు జరిగే ఉంటాయని ఊహించటం , మొత్తం హిందూ మతాన్ని శూద్ర వ్యతిరేకిగా , దళిత ద్వేషిగా ముద్రవేయటం సబబేనా ? మనకాలంలో అనేకానేక కారణాల వల్ల వెర్రితలలు వేసి , సమాజంలోని , అట్టడుగు కులాలను, బడుగు బలహీన వర్గాలను కాల్చుకు తింటున్న కుల రక్కసి చేస్తున్న  అఘాయిత్యాలు, అత్యాచారాలు అన్నిటికీ మనుధర్మాన్ని ముద్దాయిని చేయటం న్యాయమేనా? 

[ తరువాయి భాగం : ఏది ప్రక్షిప్తం ? ఏది మను ధర్మం ? ]






Saturday 3 February 2018

ఏది సైన్సు? ఏది నాన్సెన్సు?

{జ్యోతిషం వట్టి మూఢనమ్మకమని ,గ్రహ గతులు, గ్రహణాల గురించి జ్యోతిషులకు ఏమీ తెలియదని హేతు వాదులమని ,సైన్సుకు గుత్తదారులమని తమకు తాము ప్రకటించుకుంటున్న  కుహనా మేధావుల మూర్ఖత్వం గురించి 17 ఏళ్ళ కింద (26 ఆగస్టు2001 న) ఆంధ్రభూమి దినపత్రిక లో నేను వరసగా రాసిన వ్యాసాలలో ఇదొకటి : }

ఏది సైన్సు? ఏది నాన్సెన్సు?

ఎం.వి.ఆర్. శాస్త్రి


సైన్సు పార్టీ, జ్యోతిషం పార్టీ చాలాకాలంగా గొడవ పడుతున్నాయి. జ్యోతిషం అశాస్త్రీయమని వీరంటే సశాస్త్రీయమని వారంటారు. వారిది మూఢనమ్మకమని వీరనగా, వీరే తెలిసీ తెలియక మూర్ఖంగా వాదిస్తున్నారని వారంటున్నారు. సైన్సు గొప్పా, జ్యోతిష్యం గొప్పా అన్నది కాదు సమస్య. జ్యోతిషమనేది సైన్సు అవునా కాదా అన్నదే తేలాల్సిందల్లా. ఇది తేలాలంటే - సైన్సు అంటే ఏమిటో, దాని తత్వమేమిటో, లక్షణాలేమిటో ముందు అర్థం కావాలి.

జ్యోతిషానికీ సైన్సుకూ స్పర్ధ ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాల పాతది. జ్యోతిషానికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని, కేవలం మూఢ విశ్వాసమని, వట్టి బూటకమని ఎంతోమంది మేధావులు సైన్సు పుట్టినది మొదలు విడివిడిగా అంటూనే ఉన్నారు. అంతా కలిసి గొంతు కలిపి జ్యోతిషం మీద సామూహికంగా ద్వజమెత్తడం  నాలుగు దశాబ్దాల కిందే జరిగింది. వివిధ దేశాలకు చెందిన మొత్తం186 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు (అందులో 18 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు) కలిసి "Objections to Astrology" పేర వెలువరించిన సంయుక్త ప్రకటనను 'అమెరికన్ హ్యూమనిస్టు' పత్రిక 1975 సెప్టెంబర్ సంచికలో ప్రచురించింది. దానిపై అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.

   186 మంది సైంటిస్టులు జాయింటుగా చెప్పిందిది.

"...we the undersigned astronomers, astrophysicists and scientists in other fields - wish to caution the public against the unquestioning acceptance of the predictions and advice given ... by astrologers. Those who wish to believe in Astrology should realise that there is no scientific foundation for its tenets. 
   
   "In ancient times people looked upon celestial objects as abodes or omens of the gods and thus, intimately connected with events  here on earth, they had no concept of the vast distances from the earth to the planets and stars. Now that these distances can and have been calculated, we can see how, infinitesimally small are the gravitational and other effects produced by the distant planets and the far more distant stars. It is simply a mistake to imagine that the force exerted by stars and planets at the movement of birth can in any way shape our futures. Neither is it true that the positions of distant heavenly bodies make certain days or periods more favourable to particular kinds of action, or that the sign under which one was born determines one's compatibility or incompatibility with other people. 

   Why do we believe in astrology? In these uncertain times many would like to believe a destiny predetermined by astral forces beyond their control... We must realise that our futures lie in ourselves and not in the stars. 

   .... we are especially disturbed by the continued uncritical dissemination of astrological charts, forecasts and horoscopes by the media and by otherwise respectable newspapers, magazines and book publishers. This can only contribute to the growth of irrationanalism and obscuranism. We believe that the time has come to challenge directly and forcefully, the pretentious claims of astrological charlatans ..."

( ఈ కింద సంతకం చేసిన మేము ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ - తదితర రంగాలకు చెందిన సైంటిస్టులం. జ్యోతిష్కులు చెప్పే జ్యోస్యాలను, ఇచ్చే సలహాలను మారు మాట్లాడక అంగీకరించడం గురించి   ప్రజలను మేము హెచ్చరించదలిచాం. జ్యోతిష సూత్రాలకు శాస్త్రీయ పునాది ఏదీ లేదని జ్యోతిషాన్ని నమ్మేవారందరు గుర్తించాలి. 

ప్రాచీన కాలంలో వినువీధిలోని సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుళ్ళ నెలవులుగానో శకునాలుగానో జనం భావించేవారు. భూమిమీద జరిగే ఘటనలతో వాటికి సన్నిహిత సంబందం ఉందని నమ్మేవారు. భూమినుంచి గ్రహాలకు నక్షత్రాలకు ఉన్న అపార దూరాల గురించి వారికి అవగాహన ఉండేది కాదు. ఈ దూరాలను ఇప్పుడు లెక్క వేయగలం. లెక్కవేశాం కూడా. కాబట్టి దూరంలో ఉన్న గ్రహాలు, అంతకంటే దూరంలో ఉన్న నక్షత్రాలు ప్రసరించగల గురుత్వాకర్షణ, ఇతర ప్రభావాలు ఎంత సుక్ష్మాతిసూక్ష్మమైనవో మనం చూడగలుగుతున్నాం. పుట్టిన సమయంలో నక్షత్రాలు, గ్రహాలు ప్రసరించే బలాలుమన భవిష్యత్తులను ఏవిధంగానైనా మలచగలవని ఊహించడం శుద్ధ తప్పు. దూరాన గ్రహ నక్షత్రాల ఉనికి మూలంగా కొన్ని రకాల క్రియలకు కొన్ని రోజులు లేక కొన్ని వేళలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయనీ... ఒకడికి ఇతరులతో సరిపడుతుందా లేదా అన్నది అతడు పుట్టిన రాశి నిర్ణయిస్తుందనీ చెప్పడమూ నిజం కాదు. మనం జ్యోతిషాన్ని ఎందుకు నమ్ముతాం? ఈ అనిశ్చిత కాలంలో చాలామందికి తమ భవిష్యత్తు తమ అదుపులో లేదని , గ్రహాలు వాటిని ముందే నిర్ణయించేశాయని నమ్మడం ఇష్టం. మన భవిష్యత్తు నక్షత్రాల్లో కాక మన చేతుల్లోనే ఉందని మనం గుర్తించాలి. 

...జ్యోతిష చక్రాలకు, జాతకాలకు మీడియా వారు ఇతర విధంగా గౌరవనీయమైన వార్తాపత్రికలు, మాగజైన్లు పుస్తక ప్రచురణ కర్తలు విమర్శనాత్మకంగా చూడకుండా వ్యాప్తిచేస్తూ పోతున్నందుకు మేము ప్రత్యేకంగా కలవరపడుతున్నాం. ఇది  అహేతుక ఛాందసత్వం పెంపొందడానికి మాత్రమే తోడ్పడుతుంది. జ్యోతిష్కపు డాంబికుల బూటకపు వాదాలను నేరుగా, దృడంగా సవాలు చేయవలసిన సమయం వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం...)

ఈ సంయుక్త ప్రకటన "ది అమెరికన్ హ్యుమానిస్టు" పత్రికలో ప్రముఖంగా ప్రచురించడమే కాక దీని కాపీలను ప్రపంచంలోని వేలాది పత్రికల కార్యాలయాలకు పంపి, మీరు గనుక ఆస్ట్రాలజీ కాలంను నడుపుతుంటే (మీకు ధైర్యం ఉంటే) ఈ ప్రకటన కూడా వేయమని అడిగారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ప్రకటన మీద సంతకాలు చేసిన వారు సామాన్యులు కారు. పేరు మోసిన ఆస్ట్రానమర్లు, ఆస్ట్రోఫిజిస్టులు, శాస్త్రాన్ని ఔపోసన పట్టిన ఇతర రంగాల సైంటిస్టులూనూ. అంతటి ఘనాపాఠులకు ఎదురు మాట్లాడడం సామాన్య మానవులు కలనైన ఊహించలేని పని. అందులోనూ వారు అల్లాటప్పా  విషయాలను గాక గ్రహాల గురించి, నక్షత్రాల గురించి వాటిమధ్య దూరాల గురించి ఆ దూరాల ప్రభావాల గురించి ముక్కు మీద గుద్ది మరీ ప్రస్తావించారు. ఆ గ్రహాల గురించి అంతరిక్షం గొడవలు గురించి క్షుణ్ణంగా  తెలిసిన డాక్టరు కార్ల్ సాగన్ లాంటి దిగ్దంతులు తప్ప వారితో మాట్లాడలేరు.

Carl Sagan పేరు చాలామంది వినే ఉంటారు. ఆయన సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటిలో ఆస్ట్రానమీ ప్రొఫెసర్ గానూ, గ్రహ విషయక అధ్యయనాల లాబొరేటరీకి డైరెక్టరు గానూ పనిచేసిన ప్రవీణుడు. అంతరిక్ష రహస్యాలను భూమి, ఇతర గ్రహాల పుట్టుపుర్వోత్తరాలను మథించి "The Cosmic Connection" లాంటి ప్రామాణిక శాస్త్రీయ గ్రంథాలను రాసిన మనిషి,

అంత గొప్ప సైంటిస్టు పైన పేర్కొన్న జాయింటు స్టేట్ మెంటు మీద సంతకం పెట్టడానికి ఖండితంగా నిరాకరించాడు. జ్యోతిషం మీద నమ్మకం ఉండికాదు. దాన్ని ఆ శాస్త్రవేత్తలు వ్యతిరేకించిన తీరు నచ్చక ! హ్యుమనిస్ట్ పత్రికకు రాసిన ఉత్తరంలో తన అభిప్రాయాన్నిఆయన ఇలా తేటపరిచాడు :

I find myself unable to endorse the "Objections to Astrology" statement not because I feel that Astrology has any validity whatever, but because I felt and still feel that the tone of the statement is authoritarian. The fundamental point is not that the origins of Astrology are shrouded in superstition. This is true as well for chemistry, medicine and Astronomy, to mention only three. To discuss the psychological motivations of those who believe in Astrology seems to be quite peripheral to the issue of its validity...

Sentiments contradicting borderlines folk, or pseudo-science that appear to have an authoritarian tone can do more danger than good. They never convince those who are flirting with pseudo-science but merely seem to confirm their impression that scientists are rigid and close-minded. 

('జ్యోతిషానికి అభ్యంతరాలు' ప్రకటనను నేను ఆమోదించ లేకపోతున్నాను.జ్యోతిషానికి ఏదో చెల్లుబాటు ఉందని కాదు..స్టేట్ మెంటు స్వరం అధికార పూర్వకంగా ఉండడమే దీనికి కారణం. జ్యోతిషం మూలాలు  మూఢవిశ్వాసాల్లో ఉన్నాయన్నది ప్రాథమికాంశం కాదు. ఉదాహరణకు కెమిస్ట్రీ, మెడిసిన్, ఆస్ట్రానమీలదీ ఇదే పరిస్థితి. ప్రధానాంశమైన జ్యోతిషం సక్రమతను వదిలేసి, దానిని నమ్మేవారి మానసిక ప్రోద్బలాలను చర్చించటం అప్రస్తుతం...జ్యోతిషం కట్టుకథ అని, కుహనా శాస్త్రమనీ గద్దింపు స్వరంలో ఖండించటం వల్ల మంచికంటే కీడే ఎక్కువ జరుగుతుంది.  కుహనా శాస్త్రంతో కుస్తీపట్టేవారిని  అవి ఏనాటికి నమ్మించలేవు. కాని సైంటిస్టులు మరీ కఠినులని, వారివి మూసిన మనసులని ఇప్పటికే ఉన్న అభిప్రాయం దీనివల్ల ద్రువపడుతుంది.)

 కార్ల్ సాగన్ లాంటి విజ్ఞులు మూర్ఖపు వైఖరి తగదని ఎంత హెచ్చరించినా జ్యోతిషాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సైన్సు వాదులు మానలేదు. 18 మంది నోబెల్ గ్రహీతలు సహా 186 మంది సైంటిస్టులు వెలువరించినదేదో తిరుగులేని తామ్రపత్రమైనట్టు, అదే జ్యోతిషానికి డెత్ వారంటు అయినట్టు'సైన్సుపార్టీ' వారు మాటిమాటికి ప్రస్తావిస్తున్నారు. నిజానికి లోతుగా పరిశీలిస్తే ఈ చారిత్రాత్మక అభిశంసన పత్రం నిండా డబాయింపులూ ధర్మబోధలే తప్ప నిజమైన సైంటిస్టుల నోటినుంచి రావలసిన మాట ఒక్కటి కనపడదు. ముప్పై మూడు వైజ్ఞానిక శాస్త్రాలలో ఏదో ఒక దానిలో పోస్టుగ్రాడ్యుయేట్ పట్టానో, పి.హెచ్.డి. నో పొందినంత మాత్రాన ఏ ఆసామీ మొత్తం సైన్సుకు గుత్తదారు కాబోడు. సైన్సు డిగ్రీ ఉన్న ప్రతివాడికి సైంటిఫిక్ దృష్టి ఉన్నట్లు, సైన్సు తత్త్వం ఒంటబట్టినట్టు చెప్పలేము.

సైంటిస్టులుగా చలామణి అయ్యేవారు ఏమి మాట్లాడతే అదే శాస్త్రీయమని, వారికి అర్థం కానిదంతా అర్థం లేనిదని, వారి బుద్దికి అంతుబట్టనిదంతా ఆశాస్త్రీయమనీ, వారు మెచ్చి తీర్థం చిలకరిస్తే తప్ప ఏ విద్యకూ శాస్త్రీయ ప్రతిపత్తి సమకూడదనీ భావించటం తప్పు.

పైన ఉటంకించిన సైంటిస్టుల 'శిలాశాసనాన్నే' గమనించండి. గ్రహాలూ,  నక్షత్రాలూ వాటికీ భూమికీ మధ్య దూరాలు వీరికి తెలిసిన సైన్సుకు ఇటివలి వరకూ తెలియనంతమాత్రాన ఆ సంగతులు ప్రపంచంలో మరెవరికీ ఎన్నడూ తెలిసి ఉండే అవకాశమే లేదని ఊహించటం మూర్ఖత్వం.  ఆకాశంలో కనిపించేవన్నీ దేవుళ్ళు, వాళ్ళ ఇళ్ళు, శకునాలు అన్న వెర్రి నమ్మకాలు వీరు చెప్పిన ప్రాచీన కాలంలో కూడా భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్తలకు లేవు. గ్రహానికీ గ్రహానికీ మధ్య దూరాల గురించి, గ్రహ సంచారం గురించి, సౌరకుటుంబం అమరిక గురించి, అంతరిక్ష ఘటనా సంవిధానాల గురించి కచ్చితమైన, శాస్త్రీయమైన అవగాహనే లేకపోతే రానున్న గ్రహణాల గురించి తోకచుక్కల గురించి కరక్టు లెక్కలు కట్టడం మన జ్యోతిషులకు అనేక వేల సంవత్సరాలుగా సాధ్యమయ్యేదికాదు. అధునాతనమైన టెలిస్కోప్ లతో చూసి అత్యాధునిక ఉపగ్రహాలను వినియోగించి మోడరన్ సైన్సు ఈనాడు లెక్క కడుతున్న గ్రహణ కాలాలకూ, వేల సంవత్సరాలుగా మనదేశంలో వాడుకలో ఉన్నజ్యోతిస్సిద్దాంత గణితాల ప్రకారం పంచాంగ కర్తలు వేస్తున్న లెక్కలకూ పెద్ద తేడా లేకపోవడానికి సోకాల్డ్ సైన్సు వేత్తలు ఏమంటారు? వరాహమిహిరుడి కంటే ముందు నుంచీ ఈ దేశంలో పంచాంగకర్తలు వేస్తూ ఉన్న లెక్కల ప్రకారమే ఆయా నక్షత్రాల, గ్రహాల రాశి సంచారం ఆకాశంలో కనపడుతున్న వైనం వీరికి తెలియదా?

సర్వజ్ఞులమనీ, విశాల విశ్వం లోని సమస్త విజ్ఞానానికి తామే హక్కుదారులమనీ, తాతాచార్ల ముద్ర వేసి తాము అవునన్నదే శాస్త్రమనీ అహంకరించే కుహనా శాస్త్రవేత్తలకు బహుశా తెలియక పోవచ్చు. కాని - వీరు కాలేజీల్లో ముక్కున పట్టి పట్టాలు పొందిన భౌతిక శాస్త్రానికి మూల పురుషుడైన సర్ ఐజాక్ న్యూటన్ జ్యోతిషశాస్త్రంలో స్వయంగా అనేక పరిశోధనలు జరిపి, జ్యోతిషం కూడా విజ్ఞాన శాస్త్రాల్లో ఒకటని సాధికారికంగా ద్రువీకరించాడు. ఆకాశంలో గ్రహ చలనాలకు, భూమి మీద జరిగే విషయాలకు నిర్దిష్ట కార్యకారణ సంబంధం ఉన్నట్లు న్యూటన్ సిద్ధాంతీకరించాడు. క్రీస్తుశకం 2వ శతాబ్దంలో టోలేమీ చేసిన గ్రహగణితాన్ని లోతుగా అధ్యయనం చేసి దాని ఆధారంగా - ప్లూటో గ్రహం 248 ఏళ్ళ కొకసారి సూర్యునికి భూమి దగ్గరగా వచ్చిన కాలంలో భూమి మీద జరిగే పరిణామాలను పరిశోధించాడు. అలాగే గతంలో వచ్చిన భయంకర భూకంపాలను గమనించి సాధారణంగా సూర్య, చంద్రుల గ్రహణ కాలాల్లో యురేనస్, అంగారక గ్రహాల స్థితిని బట్టి భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ భూకంపం వచ్చేది న్యూటన్ కచ్చితంగా అంచనా వేయగలిగాడు. తాను మరణించాక 23 సంవత్సరాలకు 1750 సంవత్సరంలో లండన్ ఆకాశం కంపించి, ఉత్తర ధ్రువంలో కాంతులు ప్రజ్జర్విల్లి ప్రచండమైన గాడ్పులు చెలరేగి, ఆ వెనువెంటనే తుఫాను, భూకంపం విరుచుకుపడి వేల మందిని సజీవ సమాధి చేయబోయే భయానక ఘటనా క్రమాన్ని న్యూటన్ ముందుగానే చెప్పగలిగాడు. అందులో మాయలు, మంత్రాలు ఏవీ లేవని అందరికీ అర్థమయ్యేట్టుగా... తన శాస్త్రీయ పరిశోధనా  ఫలితాలను క్రమబద్దం చేసి చిరస్థాయిగా నిలిచే జ్యోతిష సిద్దాంతాలను ప్రకటించాడు కూడా.

ఆధునిక భౌతికశాస్త్రానికి ఆద్యుడైన న్యూటన్ కే జ్యోతిషం పట్ల అంత ఆదరభావం ఉన్నప్పుడు...అత్యాధునిక టెలిస్కోపులు,  ఎఫిమెరీలు ఏవీ లేని కాలంలోనే ఆయనంతటి వాడు జ్యోతిష సిద్దాంతాలను పరీక్షించి, పరిశోధించి, శాస్త్రీయమని ధ్రువపరిచినప్పుడు సైన్సు జాంబవంతుని అంగలు వేసిన ఈ కాలంలో ఆధునిక శాస్త్ర పరికరాల సాయంతో జ్యోతిష సిద్దాంతాలను శాస్త్రీయంగా పరిశీలించి నిగ్గు తేల్చడానికి మన సైన్సు వాదులకు అభ్యంతరమేమిటి?  వారి దృష్టిలో న్యూటన్ మూర్ఖుడా? లేక తాము నిజమని నమ్మేది మినహా మరొక నిజం దేన్నీ గుర్తించమని, తాము పెట్టుకున్న నమ్మకాలు తప్ప మరేది తమ బుర్రలోకి చొరనివ్వబోమని, గట్టిగా ముసేసుకున్న తమ కళ్ళకు కనపడనిదంతా శూన్యమే, సర్వం అశాస్త్రీయమే అని వితండ వాదం చేసే వీరే మహా ముర్ఖులా? గ్రహణాలు, గ్రహ సంచారాలూ, గ్రహ ప్రభావాల గురించి పర్యవసానంగా రాబోయే వైపరీత్యాల గురించి జ్యోతిష శాస్త్రం సరిగ్గా లెక్కకట్టగలదనడానికి సహస్ర నిదర్శనాలు కళ్ళముందు కనిపిస్తున్నప్పటికీ  జ్యోతిషాన్ని చేతబడులను ఒకే గాట కడుతూ జ్యోతిషానికి ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్దత లేదని ఢంకా బజాయిస్తూ వీర స్టేట్ మెంట్లు వెలువరిస్తున్నారంటే వీరిని శాస్త్రజ్ఞులనాలా? చదువుకున్న మూఢులనాలా? ఆకాశంలో చంద్రుడి వృద్ది క్షయాల ప్రభావం సముద్రంలో కెరటాల మీద ఉంటుందని, పౌర్ణమి అమావాస్యల్లో పిచ్చివాళ్ళ ఉన్మాదం ప్రకోపిస్తుందనీ ఎరుగని వాడున్నాడా? సంపూర్ణ సూర్యగ్రహణాల లాంటి అంతరిక్ష ఘటనల వేళల్లో ఆకాశం కేసి చూస్తే కంటిచూపు దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలే హెచ్చరించేటపుడు సుదూర గ్రహాల ప్రభావం భూమి మీద మనుష్యపైన ఉండనేరదనీ గవిడిగంతలుతగిలించుకున్న కుహనా సైన్సువాదులు ఎలా దబాయించగలరు?

- 26 ఆగస్టు 2001