Monday 12 February 2018

మనకు గిట్టని మనువు


[మను ధర్మ శాస్త్రం  - 1 ]

ఎం. వి. ఆర్. శాస్త్రి

Manu belongs to no single nation or race; he belongs to the whole world. His teachings are not addressed to an isolated group , caste or sect , but to humanity. They trascend time and address themselves to the eternal in man .There is need for a fresh statement , in the light of modern knowledge and experience , of the fundamental teachings of Manu. 

( మనువు ఏ ఒక జాతికి కాదు.. మొత్తం ప్రపంచానికి చెందిన వాడు. ఆయన బోధలు విసిరేసినట్టు విడిగా ఉండే ఏ ఒక సమూహానికో, కులానికో , తెగకో కాక మొత్తం మానవాళికి  ఉద్దేశించినవి . అవి కాలాతీతమైనవి. మానవుడి లోని శాశ్వత తత్వానికి ఉద్దేశించబడినవి. ఆధునిక విజ్ఞానం, అనుభవాల వెలుగులో మనువు మౌలిక బోధనలను పునః ప్రకటించవలసిన అవసరం ఉంది .)

   ఈ మాటలన్న వాడు కళ్ళకు అగ్రవర్ణ దురహంకారం పొరలు కమ్మిన , మూఢత్వం జడలు కట్టిన , ఏ చాందస బ్రాహ్మణుడో కాదు. బ్రాహ్మణాధిక్యాన్ని నిలబెట్టాలని, అడుగు కులాలను అణగదొక్కాలని కంకణం కట్టుకున్న మిడి మిడి జ్ఞానపు  ఏ బ్రాహ్మణ పక్షపాతో కూడా కాదు. నేటికి 60 ఏళ్ళ  కింద అమెరికా లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం లో పి హెచ్ డి పట్టా పొందిన థీసిస్ లో విఖ్యాత సోషియాలజిస్టు Dr. Kewal Motwani చెప్పిన మాట ఇది. " Manu Dharma Sastra .. A Sociological And Historical Study " అనే పేరుతో 1958 లో ఇది గ్రంథంగా వెలువడి దేశ దేశాల మేధావుల మన్ననలు పొందింది. 

   మనువు పేరు చెబితే చాలు మన మేధావులు చాలామందికి కంపరం పుడుతుంది. అతడేదో భయంకర బ్రహ్మ రాక్షసుడు అయినట్టూ , కింది కులాలను , ముఖ్యంగా దళితులనూ,  మహిళలనూ అమానుషంగా కాల్చుకు తిన్న కర్కోటక కుల వ్యవస్థకు అతడే మూలపురుషుడైనట్టూ వారి భావన.   బ్రాహ్మణాధిక్యాన్ని ,  బ్రాహ్మణాధిపత్యాన్ని  ,పురుష దురహంకారాన్ని  బలవంతంగా రుద్దిన  అతడి    "మను ధర్మ శాస్త్రం " లేక  "మనుస్మృతి" వందల, వేల సంవత్సరాలపాటు కోటానుకోట్ల బడుగు బలహీన దళిత వర్గాలను దారుణ అవమానాలకు, అన్యాయాలకు, క్రూరాతిక్రూర శిక్షలకు గురి చేసిందని ఎంతోమంది నమ్ముతున్నారు. 

    మరి అటువంటి నీచ , నికృష్ట , మహాదుష్టుడిని పట్టుకుని " మొత్తం మానవాళికి మూలపురుషుడు , గర్వకారకుడు " అంటూ ఈ మొత్వాని ఆకాశానికి ఎత్తేస్తున్నాడేమిటి ? 

     ఆశ్చర్యమేముంది ? ఇతడూ ఒక మనువాది. బ్రాహ్మణ పక్షపాతి , చదువుకున్నా బుద్ధి లేని మూర్ఖుడు - అని తక్షణ నిశ్చయానికి వచ్చే ముందు అతడు ఏమంటున్నాడో కాస్త ఆలకించండి :


      " ఇది కేవలం ఒక ధర్మ శాస్త్రమే తప్ప శాసనాల సంహిత కాదు . శాసించే నియమావళీ కాదు. ఇది ఏ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న ఏ వర్గాన్నీ , సమూహాన్నీ శాసించేందుకు ఉద్దేశించిన న్యాయ సంహిత కాదు. 
      " ప్రధానంగా ఈ ధర్మ శాస్త్రం లో అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో మానవుడి సాంఘిక జీవితానికి వర్తించే సూత్రాలు ఉన్నాయి. మనిషి యొక్క, సమాజం యొక్క జీవనం లో నిత్యము, శాశ్వతము అనదగ్గ అంశాలను నొక్కిచెప్పే బోధలు ఉన్నందువల్ల దీని ప్రాముఖ్యం  విశ్వ వ్యాప్తమైనది."

     
[ Manu Dharma Sastra , Kewal Motwani , p. xi ]

      " మనకుతెలిసి ఉండక పోవచ్చు. కానీ ప్రాచీన, ఆధునిక ప్రపంచాలలో ప్రబలంగా వినిపించే పేరు మనువు. ఆర్య నాగరికత విస్తరించిన ప్రతి చోటికీ మనువు ప్రభావం వెళ్ళింది. ఉత్తర చైనా , జపాన్, ఫార్మోసా , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇరాన్. సుమేరియా, ఈజిప్టు లకు .. అనంతర కాలంలో బాబిలోన్ , అస్సీరియా, పాలస్తీనా,  గ్రీస్, రోమ్ లకు మనువు బోధలు చేరాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల్లో మనువు అత్యంత గౌరవ పాత్రుడు. బర్మా, సయాం, మలయా, ఇండోనేసియా, ఇండో చైనా , బాలి, ఫిలిప్పీన్స్ దీవులు , సిలోన్ లు మనువు జ్ఞాపకాన్ని పదిలపరుచుకుని , అతడి ధర్మశాస్త్రాన్ని ఈనాటికీ ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల న్యాయ విధానాలు , సామాజిక వ్యవస్థలు అతడి ఉపదేశాలపైనే ఆధారపడ్డాయి. " 
[ అదే గ్రంథం పే.5-6 ]

     వట్టిగా  పేర్లు ఏకరువు పెట్టటం కాదు. ఆయా దేశాలకు మనువుతో ఉన్న ప్రగాఢ చారిత్రక అనుబంధం గురించి మోత్వాని తన పుస్తకంలో విపులంగా వివరించాడు.

      ఆ గ్రంథకర్త ఒకడే కాదు.మానవ జాతి కి మూలపురుషుడుగా , మొట్టమొదటి న్యాయ ప్రదాత గా , తొలి సామాజిక తత్త్వవేత్తగా మనువు కున్న ప్రఖ్యాతి ని కేంబ్రిడ్జి హిస్టరీ ఆఫ్ ఇండియా ,  బ్రిటిష్  ఎన్ సైక్లోపీడియా, అమెరికన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ లు గుర్తించాయి. మనుస్మృతి లో పేర్కొన్న న్యాయాలు విశ్వజనీనమైనవని, మానవాళికి మేలు చేసేవని A.A. Macdonnel, A.B. Keith , P.Thomas, Louis Renoy వంటి పాశ్చాత్య గ్రంథకర్తలు ప్రస్తుతించారు. ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త  FrederichNeitsche అయితే మనుస్మృతి బైబిల్ కంటే గొప్ప పవిత్ర గ్రంథమని అభివర్ణించాడు.


      చేసే వృత్తిని బట్టి మనువు ఏర్పరిచిన వర్ణ వ్యవస్థ బాలి , బర్మా  ఫిలిప్పీన్స్,కంబోడియా ,వియత్నాం,  థాయిలాండ్, మలేసియా, నేపాల్, శ్రీలంక లలో అమలు జరిగినట్టు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనువు నిర్దేశించిన ధర్మ సూత్రాల ప్రకారమే పూర్వం అనేక దేశాల ప్రభువులు న్యాయ నిర్ణయం చేసే వారు. తాము మనువును అనుసరిచేవారమని  మనుధర్మానికి చెందిన శ్లోకాలు వివిధ దేశాల శిల్పాలలో కనపడతాయి. తాము మనువును అనుసరించేవారమని చెప్పుకోవటానికి అనేక దేశాల రాజులు , చక్రవర్తులు గర్వపడేవారు. ఉదాహరణకు చంప ( వియత్నాం ) రాజా  జయేందర్ వర్మ దేవ తాను మనువాదినని ఒక శిలా శాసనంలో  గర్వంగా చెప్పుకున్నాడు. ఉదయన వర్మ, రాజా  జయవన్న శిలా శాసనాల లోనూ మనువు, మానవ నీతిసార ల ప్రస్తావన  ప్రశంసా పూర్వకంగా కనిపిస్తుంది. 

   ఈ కింది చిత్రాన్ని చూడండి :



ఫిలిప్పీన్స్  లోని నేషనల్ అసెంబ్లీ హాల్ లో సభాపతి ఆసనం వెనుక కనిపించే మనువు విగ్రహమిది." Manu, the first ,the greatest , and the wisest lawgiver of mankind. " ( మానవాళికి న్యాయప్రదానం చేసిన వారిలో మొట్టమొదటివాడు , అందరికంటే గొప్పవాడు, అందరిలోకీ విజ్ఞుడు అయిన మనువు ) అని దాని కింద రాసి ఉంటుంది.  ఎక్కడో హిందూ దేశంలో వేల సంవత్సరాల కిందట ఏదో ధర్మశాస్త్రాన్ని రాసిన వాడి బొమ్మను తెఛ్చి ఇక్కడెందుకు పెట్టారని ఫిలిప్పీన్స్ లోని ఏ మేధావీ , పాత వాసనలు గిట్టని ఏ పార్టీకి చెందిన ఏ రాజకీయ వాదీ ఇంతవరకు ఆక్షేపణ చెప్పలేదు. 

    కానీ అదే మనువు పుట్టిన మన పుణ్యభూమి లోనో .. ?
    1989 సంవత్సరం లో జైపూర్ లోని రాజస్థాన్ హై కోర్ట్  ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం మనువు విగ్రహాన్ని ప్రతిష్టించింది. ( కింది బొమ్మ చూడండి ) 


 దాని మీద నానా గత్తర అయింది. తక్షణం దాన్ని అక్కడి నుంచి తొలగిస్తారా లేదా అని మనువును, మనువాదాన్ని అసహ్యించుకునే సంఘాలు, సంస్థలు పట్టుబట్టాయి. వాటి ఫిర్యాదులను మన్నించి రాజస్థాన్ హై కోర్టు ఆ విగ్రహాన్ని తొలగించమని ఒక దశలో ఉత్తర్వు చేసింది. దాని మీద ఆర్య సమాజ్ కు చెందిన ఒక ప్రముఖుడు అప్పీల్ చేసి స్టే పొందటం తో కూల్చివేత ఆగింది. అప్పీలు పావు శతాబ్దానికి పైగా అదే హై కోర్టు లో నానుతున్నది. ఈ మధ్యనే ప్రభుత్వానికి నోటీసులు వెళ్లాయి.

   ఆశ్చర్యమేమిటంటే .. మొట్ట మొదటి శాసన కర్త గా మనువు ను మిగతా ప్రపంచమంతా గుర్తించి సముచిత గౌరవం ఇస్తున్నా ...
      అతడి జన్మభూమి లో మాత్రం మనువును ఏవగించుకోవలసిన ఒక దుష్టుడిగా , భారతీయ సమాజాన్ని , సాంఘిక వ్యవస్థను దారుణ దుర్ణయాలకు గురి చేసిన ఒక మహాపాపిగా , క్రూరాతిక్రూరుడిగా చదువుకున్నవారూ, సంస్కారవంతులలోనే చాలామంది తిట్టిపోస్తున్నారు. మనువాదమే దేశాన్ని పీడిస్తున్న చెడుగులన్నింటికీ మూల కారణమని దృఢంగా నమ్ముతున్నారు.
       
        ఈ విచిత్ర వైరుధ్యానికి హేతువు ఏమిటి?  లోపం మనువుదా ?    అతడు చెప్పిన ధర్మ శాస్త్రానిదా ? లేక మనువాదాన్ని తెగనాడుతున్న వారి ఆలోచనా విధానానిదా? నిజానికి మనువు చెప్పినదేమిటి ? అతడికి ఆధునికులు అంటగడుతున్న నేరాలకు అతడు ఎంతవరకు బాధ్యుడు ? మనువాదం పూర్తిగా దోష భూయిష్టమేనా ? లేక అందులో ఈ కాలానికి కూడా పనికి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా ? 

       తరువాయి భాగాలలో చర్చిద్దాం.

3 comments:

  1. Ippudu manuvu meedha evaru matladina dairyam ga javaabu cheppochuga..
    Thanks sir..

    ReplyDelete
  2. Ippudu manuvu meedha evaru matladina dairyam ga javaabu cheppochuga..
    Thanks sir..

    ReplyDelete
  3. మన బడుద్ధాయలకి మనువు గిట్టట్తం లేదు నిజమే!కానీ క్రైస్తవానికి మూలపురుషుడైఅన్ మోజెస్/మోషే గారికి ఆ జ్ఞానాన్ని బోధించింది హిందువులే!చెప్తునది హిందూ అమత్తత్వవాదులు కాదు.ఈ కలపు రాజకీయాల సెగ అతగలని 17వ సతాబ్దపు ఇంగ్లీషు మేధావియే.అతను అంటున్నది ఇది:A. Maconochie advocated, on the other hand (first in 1783 and then again in 1788), the taking of such measures by ‘our monarch, the sovereign of the banks of the Ganges...as may be necessary for discovering, collecting and translating whatever is extent of the ancient works of the Hindoos.’ He thought that if the British ‘procured these works to Europe, astronomy and antiquities, and the sciences connected with them would be advanced in a still great proportion.’ He observed further that ‘the antiquities of the religion and Government of the Hindoos are not less interesting than those of their sciences’; and felt that ‘the history, the poems, the traditions, the very fables of the Hindoos might therefore throw light upon the history of the ancient world and in particular upon the institutions of that celebrated people from whom Moses received his learning and Greece her religion and her arts.’ Prof. Maconochie also stated that the centre of most of this learning was Benares, where ‘all the sciences are still taught’ and where ‘very ancient works in astronomy are still extant.

    అతను ప్రత్యేకించి వేటి మీద శర్ద్ధ పెట్టి హిందువూల్ నుంచి నేర్చుకోమంటున్నాడో అర్ధం అయితే క్రైస్తవ మతానికి తల్లివేరు హిందూమతమే అని తెలుస్తుంది.Please note that He is refering indians/hindus as celebrated people from whom Moses received his learning andGreece her religion and her arts. అక్కద అసంపదే కాదు జ్ఞానం కూడా ఎంత ఉంటే అంత తవ్వి తీసుకుటేఅ బాగుపదతాం అని అంటున్నాడు.

    మనవాళ్ళకి తెలియని అసలైన వింత యేమిటంటే ఇక్కడ మన ఓరియంటల్ స్కూళ్ళలో అన్ని కులాల్ వాళ్ళూ లెక్కలూ,సైన్సూ,మెడిసినూ చదివి మంచి ఆఅయాలు పొందుతూ ఉన్న ఇదే కాలంలో అకక్ద సందే స్కూళ్ళలో బైబిలు తప్ప ఇంకేమీ చదివించేవాళ్ళు కాదు!

    ReplyDelete