Saturday 6 January 2018

మనుధర్మంతో మొదలుపెడదాం

ఎం.వి.ఆర్.శాస్త్రి


ఈ రోజుల్లో కూచుంటే లేవలేని వారు కూడా హిందూ మతం మీద , హిందువుల విశ్వాసాలు, సెంటిమెంట్లు , ఆచారాలు, సంప్రదాయాలమీద ఒంటి కాలి మీద లేస్తున్నారు .పనికి మాలిన పత్రికలూ. టీవీచానెళ్ళు తీరికూర్చుని వివాదాలను పనిగట్టుకుని సృష్టిస్తున్నాయి.అడ్డమైన వాళ్ళని పోగేసి , అడ్డగోలుగా వాగించి హిందూ మతం మీద బురద చల్లి సూకరానందం పొందుతున్నాయి. నిరాధారమైన నిందలు, అభాండాలు, అభూతకల్పనలు  , పచ్చి అబద్దాలు కూడా శాస్త్రీయత ముసుగు వేసుకుని, హేతువాదం పేరు పెట్టుకుని మీడియా వత్తాసుతో విరగబడుతుంటే అమాయక జనం అవే నిజాలు కాబోలని మోసపోతున్నారు. వామాచార వామపక్షులు, మెదడు లేని మేధావులు, అన్యమతాలకు అమ్ముడు పోయిన అడ్డగాడిదలు చేస్తున్న తెరపిలేని దుర్మార్గపు దాడుల దుష్ప్రభావం వల్ల సిసలైన హిందువులకు కూడా లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే మన మతంలో సిగ్గుపడవలసినవి ,దాచిపుచ్చవలసినవి,  తలదించుకోవలసినవి ఉన్నాయేమోనని కలవరపడుతున్నారు. అస్తమానం అన్ని వైపులనుంచి వినపడే సూటిప్రశ్నలకు సమాధానం ఏమిచెప్పాలో , తమ పక్షాన్నిఎలా సమర్థించుకోవాలో , ఎదిరిపక్షం దాడిని ఎలా తిప్పికొట్టాలో  తెలియక సతమతమవుతున్నారు.

నిజానికి ఇది అనవసరపు గుంజాటన. వెర్రి గొర్రెలు, గొర్రెలకాపరులు, కాసులకు కక్కుర్తిపడి వారి కొమ్ము కాసే మిడిమిడి మీడియా కబోదులు , సైన్సు తెలియని సైన్సు వాదులు, సెన్సు లేని కిరాయి మేధావులు, హేతువెరుగని హేతువాదులు వేసే ప్రతి ప్రశ్నకూ దిమ్మ తిరిగే జవాబు మనం చెప్పగలం. విరోధులు విసిరే ప్రతి సవాలునూ తిరుగులేని సాక్ష్యాధారాలతో, నికార్సైన చారిత్రక రుజువులతో, నోరెత్తలేని ప్రమాణాలతో తిప్పికొట్టగలం.

కానీ ఆ సంగతి మనవారిలో చాలామందికి తెలియదు. హిందూ పక్షం తరఫున వాదించటానికి హిందూ వ్యతిరేక మీడియా ఏరికోరి ఎంపిక చేసే బడుద్దాయిలకు ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. సబ్జెక్టు మీద పట్టు అసలే ఉండదు. పట్టు ఉన్నవారికి అవకాశం సాధారణంగా రాదు.ఒకవేళ వచ్చినా,  వివాదాలలో తల దూర్చేందుకు వారిలో చాలామంది ఉత్సుకత చూపరు.

హిందూ పక్షాన పోరాడటానికి నెత్తురు మండే యువతీయువకులు లక్షల సంఖ్యలో సిద్ధంగా ఉన్నారు. కాని వారి చేతిలో సరైన ప్రచార ఆయుధాలు లేవు. ఎదిరి పక్షం వాదాన్ని తిప్పికొట్టటానికి తిరుగులేని రుజువులూ, ప్రమాణాలతో మేధోపరమైన ఆయుధాలను వారికి అందించగలిగితే వీరభద్రులలా ముందుకు ఉరకగలరు. అభాండాల భాండాలను బద్దలుకొట్టి , అబద్దాలకోర్లను తరిమికొట్టగలరు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఉప్పొంగుతున్న హిందువుల చైతన్యానికి వాదబలం కూడా తోడైతే బహుముఖాలుగా సాగుతున్న హిందూ ద్రోహుల , హిందూ వ్యతిరేకుల కుట్రలు, కూహకాలు పటాపంచలు కాగలవు. ప్రతి హిందువూ ధైర్యంగా, సమర్థంగా పాయింటు ప్రకారం మాట్లాడటం మొదలయితే 60,70 ఏళ్ళుగా మన దేశం మీద ,ధర్మం మీద పథకం ప్రకారం చెలరేగుతున్న కుహనా సెక్యులరిష్టుల , కుహనా మేధావుల, దుష్ట రాజకీయ ,మత శక్తుల దుర్మార్గపు ఆటలు కట్టగలవు.

ప్రస్తుత దేశకాల పరిస్థితులలో అతిముఖ్యమైన ఈ జాతీయ అవసరానికి నా వంతు దోహదం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను. హిందూ సమాజాన్ని,హిందూ దేశాన్ని చీకాకు పెడుతున్న సమస్యలను, సవాళ్ళను ,సామాన్య హిందువులను తికమక పెడుతున్న ఇస్స్యూలను ఒకటితరువాత ఒకటి కూలంకషంగా , సప్రమాణంగా ఇందులో చర్చించదలిచాను.

హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు.  కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం.

మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో  వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు.  హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి , వాటి మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టి తీరాలన్న పట్టుదల, తపన ఉండి , విరోధుల నోళ్ళు ఎలా మూయించాలా అని తహతహలాడుతున్న వారితో మాత్రమే నేను ఇక్కడ సంభాషించ దలిచాను.

 వారికి  ఒక మనవి. నేను చెప్పదలుచుకున్నది  ఎంత చెప్పినా మీకున్న సందేహాలు మిగిలే పోవచ్చు. మీ దృష్టిలో అతి ముఖ్యమనుకున్న ప్రశ్నలు అసలు ప్రస్తావనకే రాకపోవచ్చు. కాబట్టి ముందుగా మనుధర్మ శాస్త్రం గురించి మీకున్న అనుమానాలు ఏమిటో నాకు తెలపండి.   ప్రతివాదులతో మనుస్మృతి విషయం చర్చించినప్పుడు మీకు కలిగిన అనుభవాలను , ఎదురైన ఇబ్బందులను  పంచుకొండి.  మీకు సమాధానం కావలసిన ప్రశ్నలు , ఎలా బదులివ్వాలన్నది మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఏమిటో చెప్పండి. నాకు తెలిసినంతలో వాటికి సాక్ష్యాధారాలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

 మీ స్పందన కోసం రెండు మూడు రోజులు ఆగి , తరవాత మనుధర్మశాస్త్రం పై నా వ్యాసాలు మొదలు పెడతాను. మళ్ళీ వాటి మీదా ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తెలపవచ్చు . ఈ చర్చ పూర్తి అయ్యేసరికి ఈ సబ్జెక్టు మీద అందరికీ చక్కని క్లారిటీ వస్తే మంచిదే.

 మనుధర్మాన్ని కూలంకషంగా చర్చించిన తరవాత వివాదాస్పదమైన ఇంకో విషయాన్ని ఎత్తుకుందాం.