Wednesday 17 April 2024

చిన్న ఊరిలో గొప్ప గోపురం

 

గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామచంద్రుని విశిష్ట ఆలయం

దుర్గరాజు స్వాతి , జర్నలిస్టు

ఆంధ్రదేశంలో రామాలయం లేని ఊరు వుండదని నానుడి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న రామాలయం ఏదీ అంటే అందరూ  ఠక్కున చెప్పే పేరు భద్రాచలం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఆ ఆలయానికి అంతటి ప్రాశస్త్యం వుంది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రాలో పురాతనమైన ఒంటిమిట్ట రామాలయం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఆ రెండు ప్రధాన ఆలయాలలో లేని విశిష్ట శిల్ప సంపదతో అలరారుతున్న ఓ గొప్ప గోపురం వున్న రామాలయం ఒకటి ఓ చిన్న ఊరిలో ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. అది కూడా మన ఆంధ్రాలోనే ఉన్నదన్న విషయము మాకు కూడా ఈ మధ్యనే తెలిసి దానిని దర్శించుకుని వచ్చాము. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఆ విశేషాల్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 



    తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ అనే చిన్న ఊరిలో నెలకొన్న ఆ ఆలయం పేరు శ్రీ కోదండ రామచంద్ర మూర్తి దేవస్థానం.

   ఆలయ పరిధి దృష్ట్యా చూస్తే ఇది చిన్నదే అయినా దాని విశిష్టత అంతా అద్భుత శిల్ప సంపదతో అలరారుతున్న గొప్ప గోపురంలోనే ఇమిడి వుంది. 

       శ్రీరామచంద్రుని చుట్టూ అస్త్ర దేవతలు ప్రదక్షిణ చేయడం; దశరధుడు తన సతులు కౌసల్య,సుమిత్ర, కైకేయిలతో ఇరువైపులా నిలుచుని ఊయలలో నిదురిస్తున్న బాలరాముని ఆనందంగా తిలకించడం; విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా విల్లంబులు ఎక్కుపెట్టి రామలక్ష్మణులు మారీచ, సుబాహులతో యుద్ధం చేయడం; సీతారాముల కళ్యాణం;    అరణ్యవాసంలో రామాలక్షమణులు ఓ వృక్షం కింద సేదదీరడం; సీతాపహరణం, పక్కనే హనుమ ఆశీనుడై వుండగా వానరులంతా రామయ్యకు నమస్కరించడం; అశ్వాలు పూన్చిన రథాన్ని రామ లక్ష్మణులు ఎక్కబోవడం; వారధి నిర్మాణానికి వానర సైన్యం రామ శిలలను మోసుకు రావడం;  రావణ వధానంతరం సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవడం; సీతా సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు పయనమవడం ఇలా ఎన్నో రామాయణ ఘట్టాలను అద్భుత శిల్పాలుగా చెక్కి గొప్పగా గోపురాన్ని నిర్మించడం ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం రామాయణ ఘట్టాలే కాకుండా, నరసింహస్వామి హిరణ్యకశిపును వధించడం, సింహవాహిని కనకదుర్గమ్మ, సప్తాశ్వ రథమారూడుడయిన సూర్యభగవానుడు,   క్షీరసాగర మధనం, గీతోపదేశం వంటి ఇంకా అనేక ఘట్టాలను కూడా ఈ గోపురంపై చక్కగా చెక్కారు. 



కాల ప్రామాణికంగా చూసినా ఈ ఆలయానికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర వుంది. కీ.శే. శ్రీ ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే సోదరుల సంకల్పబలంతో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగింది. అదీ 1889లో రామ కోలల ప్రతిష్ఠాపనతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1934లో సీతారామ లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానంగా నామకరణం చేశారు. తదనంతరం 1948లో 160 అడుగుల ఎత్తులో తూర్పు గోపురం, 1956లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురం నిర్మించారు. మొత్తం పది అంతస్తులుగా నిర్మించిన ఈ గొప్ప గోపురంలో ప్రతి అంతస్తుకు చేరుకునేలా లోపలివైపు మెట్లను నిర్మించారు. ప్రతి అంతస్తులో ఓ గవాక్షం ఏర్పాటు చేయడంతో భక్తులు ఒక్కో అంతస్తు ఎక్కుతూ అక్కడ నుండి బాహ్య పరిసరాల్నింటినీ చూడవచ్చు. ఒక్కో అంతస్తూ ఎక్కుతున్నకొద్ది మనకు ఇంకా విశాలమయిన పరిధి కనబడుతూ ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. అంతేకాదు కొన్ని అంతస్తుల్లో మరికొన్ని విశేషాలు కూడా జోడించారు. అందులో  1975లో నిర్మించిన అద్దాల మందిరం ఒకటి వుంది. దీనిని ద్వారంపూడి వారసుడు రామచంద్రారెడ్డి గారు నెలకొల్పారు. అక్కడ నిలుచుని దేవతల విగ్రహాలను ప్రత్యేక భంగిమల్లో చూడడమే గాక మనం కూడా మన రూపాలను వివిధ ఆకృతుల్లో చూసుకుని వినోదించే ఏర్పాటు వుంది. అంటే అవి మ్యాజిక్ అద్దాలు కావడంతో అది మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. అలా ఒక్కో అంతస్తూ ఎక్కుతూ అక్కడ నుంచి కనబడే మేరకు శిల్ప సౌందర్యాలను ఆసక్తిగా తిలకించవచ్చు. 






ఈ ఆలయానికి కొద్దిపాటి భూములే వున్నా అక్కడ పనిచేసే అర్చకులకు ఇతర సిబ్బందికి ధర్మకర్తలే జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్నారు. అంతేకాదు ఇక్కడ నిత్యాన్నదానం కూడా నిర్వహించడం గమనార్హం. 

 ఇక ఆలయ సందర్శన వేళలు ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటలవరకు వుంటుంది. గోపురం అంతస్తులు ఎక్కి చూసే సమయం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే. 

ఈ ఆలయానికి సమీపంలోనే సూర్యభగవానుని ఆలయం కూడా వుండడం మరో విశేషం.

 ఇంత విశిష్టతలు వున్న ఆ ఊరిని దర్శించాలనే ఆకాంక్ష మీలో కూడా కలుగుతోంది కదూ. ఇక కదలండి మరి.