Thursday 8 December 2022

మన గాంధార్ ... మన కాబూల్

        గొప్పింటి సంబంధం  వెతుక్కుంటూ వచ్చింది. దేశాన్నేలే మహారాజులు  వాళ్ల అబ్బాయికి మన పిల్లని ఇమ్మని కబురంపారు. చేసుకుంటే  అమ్మాయి మహారాణి అవుతుంది. 

       ఒక్కటే లోపం . అబ్బాయికి కళ్ళు లేవు. బంగారంలాంటి పిల్లను చూస్తూ చూస్తూ చూపులేనివాడికి ఎలా ఇస్తాం అని మథనపడ్డాడు తండ్రి. పదిమందిని సంప్రదించాడు. కులం, వంశం, కీర్తి, ఆచారం లాంటి విషయాలు బాగా విచారించాక నా కూతురిని మీ అబ్బాయికి ఇస్తానని అవతలివారికి  మాట ఇచ్చాడు. 

       ఇచ్చాక ఆ సంగతి అమ్మాయికి తెలిసింది. అమ్మానాన్నా తనకు పెళ్లిచేయదలచిన అబ్బాయి  గుడ్డివాడు అని విన్నవెంటనే ఆమె ఒక పని చేసింది.  నా తరఫున నిర్ణయం చెయ్యటానికి మీరెవరు అని కన్నవాళ్ళ మీద కేసు పెట్టిందా? లేదు. మొగుడూ మొద్దులూ -పెళ్ళీ పెటాకులూ – సెక్సూ నీడ్సూ గురించి మోడరన్ పాఠాలు చెప్పే విశృంఖల  స్వేచ్చలమ్మలు  అప్పటికింకా పుట్టలేదు . 

      నా భర్త చూడలేని లోకాన్ని ఇకపై  నేనూ చూడను అని నిశ్చయించి ఒక వస్త్రాన్ని తెప్పించింది. దాన్ని చాలా మడతలు వేసి కళ్ళకు కట్టేసుకున్నది. ఆమె పేరు గాంధారి. అదిమొదలు మళ్ళీ ఆమె గంతను విప్పలేదు. నూరుగురు పిల్లలను కన్నా ఒక్కరినీ ఎన్నడూ కళ్ళారా చూడాలనీ అనుకోలేదు. మొత్తం ప్రపంచ వాజ్మయం లో ఇటువంటి మహాసాధ్వి మరొకరు ఉన్నారా? 

      ఆ గాంధారి మన ఆడపడుచు. ఆమె తండ్రి సుబలుడు , అన్న శకుని, అనంతరం అతడి కొడుకు ఏలిన గాంధార రాజ్యం నిన్నమొన్నటి వరకూ విశాల భారత దేశంలో భాగం. 

   ......              ........ 

      మహా శక్తివంతమైన  ఖలీఫాలకే ఎదురొడ్డి నిలవటం తో కాబూల్ రాజు రణబల్ లేక రత్నపాల్ పేరు మధ్య ఆసియా అంతటా మారుమోగిపోయింది. అతడిని హీరోగానో, విలన్ గానో పెట్టి చాలా జానపద కథలు ప్రచారంయ్యాయి.  రణబల్ లేక రత్నపాల్  పేరు చెపితేనే అరబ్బులు ఉలిక్కిపడేవారు. 

       రెండు శతాబ్దాలు పైగా లెక్కలేనన్ని దాడులు చేసి , తాత్కాలిక విజయాలు ఎన్ని సాధించినా కాబూల్, జాబూల్ హైందవ రాజ్యాలను లొంగతీయటం కొమ్ములు తిరిగిన అరబ్బు మహాసామ్రాజ్యం వల్ల కాలేదు.  పరాజయాలకు గురైన ప్రతిసారీ హిందువులు శక్తులు కూడతీసుకుని తిరిగి పుంజుకుని పోగొట్టుకున్నవి తిరిగి రాబట్టుకునేవారు. 18 భీకర దండయాత్రలను తట్టుకుని తమ దేశాన్నీ, ధర్మాన్నీ విదేశీయుల బారి నుంచి కాపాడుకున్నారు.


https://youtu.be/Gc2FTU3pWTE


Thursday 3 November 2022

పాత్రికేయానికి పెద్ద దిక్కు

 అదేమిటో ఇవాళ వరసగా రెండు దుర్వార్తలు. కె.ఎల్.రెడ్డి మరణవార్త వెనువెంటనే పాత్రికేయ పితామహుడు జి.ఎస్. వరదాచారి గారు మరి లేరన్న కబురు. రెడ్డి గారి లాగే వరదాచారి గారు కూడా  ఈనాడులో నా పూర్వ సహచరులు. నేను లీడర్ రైటర్ గా ఉండగా ఆయన ఆంధ్రభూమి నుంచి అసిస్టెంట్ ఎడిటర్ గా వచ్చారు. డెస్క్ బాధ్యత పంచుకుంటూ అడపాదడపా సంపాదకీయాలూ రాసేవారు. ఆయన సమర్థతకు తగినట్టు ఆయన సేవలను ఈనాడు ఉపయోగించుకోలేక పోయింది. తరవాత కొద్ది కాలానికే అక్కడ నుంచి తెలుగు యూనివర్సిటీకి వెళ్లి జర్నలిజం కోర్సుకు కొత్త రూపునిచ్చారు. 





వరదాచారి గారు పెద్ద మనిషి. అజాతశత్రువు. నిండు కుండ . ఎంత ఒత్తిడిలోనూ సంయమం కోల్పోడు. మెత్తగా కూడా కత్తిలా రాయటం ఎలాగో  ఆయనను చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా సినిమా జర్నలిజంలో వరదాచారి గారిది ప్రత్యేక ముద్ర. 


సజ్జనుడు, సాత్వికుడు కాబట్టి తను అంతగా పట్టించుకున్నట్టు లేదు గాని వరదాచారికి వృత్తిపరంగా రావలసినంత గుర్తింపు లేదు. ముఖ్యంగా ఆంధ్రభూమిలో . గోరా శాస్త్రిగారి కంటే ముందు నుంచీ ఆయన ఆ పత్రికలో ఉన్నారు. తొలి సంపాదకుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు ముందు అనుకున్న ప్రకారం ఏడాది కల్లా నిష్క్రమించాక వరదాచారి గారిని ఎడిటర్ చేస్తామని చెప్పి యాజమాన్యం మాట తప్పింది . గోరాశాస్త్రి గారి హయాంలో ఎడిటోరియల్ విభాగం మొత్తాన్ని వరదాచారి గారే చక్కగా నిభాయించేవారు. గోరాశాస్త్రి గారి తరవాతా ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. అది ఆయనకంటే కూడా పత్రికా రంగానికి ఎక్కువ నష్టం.

నేను ఆంధ్రభూమి ఎడిటర్ అయ్యాక ఆయనతో సమకాలిక పత్రికలలో లోటుపాట్లు ఎత్తిచూపే "దిద్దుబాటు" కాలమ్ చాలాకాలం రాయించాను. అది  జర్నలిస్టులకు పెద్ద బాలశిక్ష. అందులో మొదట్లో వేరే పత్రికల తప్పులను ఆయన తూర్పార పడితే మావాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. తరవాత ఆయన కలం మా పత్రికలో తప్పులనూ చూపించి చెవులు మెలేసింది. "అది వెయ్యాలా వద్దా" అని మా స్టాఫ్ అడిగారు. తప్పకుండా వెయ్యాల్సిందే నని చెప్పాను. రేపు మీ ఎడిటోరియల్ లోనూ ఆయన  తప్పులెన్నుతారేమో అని ఎవరికో సందేహం వచ్చింది. అదీ వెయ్యాల్సిందే అన్నాను. అదృష్ట వశాత్తూ నేను ఆయనకు చిక్కలేదు. 

ఈ సంగతులే ఈమధ్య ప్రెస్ క్లబ్ లో "పరిణత పాత్రికేయం" ఆవిష్కరణ సభలో ఆయన ముందే చెప్పాను‌ . హాయిగా నవ్వారు. అదే  ఆయనను చివరి సారి చూడటం. 

వరదాచారి గారి నిష్క్రమణంతో తెలుగు పాత్రికేయం  పెద్ద దిక్కు ను కోల్పోయింది. 









Wednesday 2 November 2022

ఆదర్శ జర్నలిస్టు కె.ఎల్.రెడ్డి

 ఎందరో జర్నలిస్టులను  తయారుచేసిన సీనియర్ జర్నలిస్టు కె.ఎల్.రెడ్డి గారు ఈ తెల్లవారుఝూమున వరంగల్ లో ప్రశాంతంగా కన్నుమూసినట్టు మిత్రులు మాడభూషి శ్రీధర్ గారు ఇప్పుడే తెలిపారు. ఆయన వయసు 92. 


ముక్కు సూటితనానికి మారు పేరు కె.ఎల్. రెడ్డి. 1978 ఫిబ్రవరి లో నేను ఈనాడులో చేరిన వెంటనే రామోజీరావు గారు అప్పజెప్పిన మొదటి పని న్యూస్ బ్యూరో లో అప్పటి బ్యూరో చీఫ్ ఎస్.ఎన్. శాస్త్రి గారికి సహాయంచేయమని. అవి అసెంబ్లీ ఎన్నికల రోజులు.  శాస్త్రి గారి ఇంగ్లీషు రిపోర్టులను నేను తెలుగులోకి మార్చి ఎదురుగా ఉండే డెస్క్ కు పంపుతుండేవాడిని.డెస్క్ ఇన్ చార్జి కె.ఎల్.రెడ్డి .నాలుగురోజుల తరవాత కేంటీన్లో పరిచయం చేసుకుని  "నీకు భాష ఉంది. కాని రాయ రాదు. నాదగ్గర ట్రెయినింగు తీసుకో . నేర్పిస్తా " అన్నాడు. ట్రెయినింగు అయితే తీసుకోలేదు కాని  డెస్క్ లో పనిచేసిన కాలంలో  అతడిని చూసి చాలా నేర్చుకున్నాను. 


తరవాత  నేను ఆంధ్రభూమి ఎడిటర్ అయి చాలా ఏళ్లు గడిచాక కె.ఎల్.రెడ్డి కలిశాడు. "నాకు రాయరాదు అని 1978 లోనే గుర్తించిన వాడు" అని మా స్టాఫ్ కు పరిచయం చేశాను. "అప్పుడే కాదు . ఇప్పటికీ నీకు రాయరాదు" అని మొహమాటం లేకుండా ప్రకటించాడు కె.ఎల్.రెడ్డి . "గత సంవత్సరం" ఏమిటి "నిరుడు" అనలేవా అని నలభై ఏళ్ల కింద రెడ్డి గారు అన్న మాట ఇప్పటికీ గుర్తుంది. 


అప్పట్లో రామోజీరావు గారు రోజూ ఉదయానే పేపరు మొత్తం చదివి , తప్పులు  మార్క్ చేసి ఘాటుగా కామెంట్లు రాసి అందరికీ సర్క్యులేట్ చేయించేవారు. ప్రతి మంగళవారం ఎడిటోరియల్ హెడ్స్ తో మీటింగు పెట్టి లోటుపాట్లు నిశితంగా చర్చిస్తుండేవారు. ఎప్పుడు చివాట్లు పడతాయోనని న్యూస్ ఎడిటర్ సంతపురి రఘువీరరావు , చీఫ్ సబ్ వేమూరి సుబ్రహ్మణ్యం అంతటి ఉద్దండులు కూడా భయపడుతుండేవారు. అలాంటి చండశాసనుడైన చైర్మన్ ను పట్టుకుని "మీరసలు పేపర్ చదువుతారాండి" అని ఒక రోజు మీటింగులో అడిగినవాడు కె.ఎల్.రెడ్డి. ఆమాటకు ఫకాల్న నవ్వాడు చైర్మన్. 


కె.ఎల్.రెడ్డి ఎవరినీ లెక్క చెయ్యడు. నచ్చకపోతే ఎవరిమాటా వినడు . మొహాన్నే దులిపేస్తాడు. రోజుకు 14 గంటలు గొడ్డులా పనిచేస్తూ ఎప్పుడు చూసినా ఆఫీసులోనే పని చేసేవాడు. సోమాజిగూడ ఆఫీసులోనే లైబ్రరీ మీది సింగిల్ రూములో ఉండేవాడు. ఆజన్మ బ్రహ్మచారి. నిప్పులాంటి మనిషి. నిజాయతీ పరుడు. అల్ప సంతోషి. మాడభూషి శ్రీధర్ వంటి ఎందరో జర్నలిస్టులను తీర్చి దిద్దిన గురువు. మంచి మనిషి. స్నేహశీలి. కడదాకా నాకు మంచి మిత్రుడు.  ఈనాడు తరవాత ఎన్నో కొత్త పత్రికలలో పని చేశాడు. ప్రతి పత్రికనూ మొత్తం తానే రాసి  ఒంటి చేత్తో నెట్టుకొచ్చేవాడు. అలా ఎన్ని పత్రికలను నిర్వహించాడో అతడికే లెక్క లేదు.


తెలంగాణా ఊసే ఎవరికీ, ఏ నాయకుడికీ పట్టని కాలాన 1980లలోనే "తెలంగాణ" పత్రిక పెట్టి అన్యాయాలపై ధ్వజమెత్తి తెలంగాణ క్షేమం కోసం  తపించి, నిస్వార్థంగా పోరాడిన వాడు కె.ఎల్.రెడ్డి. అప్పట్లో ఫతేమైదాన్ ప్రాంగణంలో చిన్నగదిలో ఉండి అక్కడినుంచే పత్రిక నడిపేవాడు. 


2016 లో ఒక రోజు ఆంధ్రభూమి ఆఫీసులో కె.ఎల్.రెడ్డి  నన్ను కలిశాడు. "నెలకు 15 వేలు ఉంటే హాయిగా గడిచిపోతుంది. రోజూ వచ్చి రాసి పెడతాను." అన్నాడు .అప్పటికే 80 దాటాడు. గూని వచ్చింది. ఇంకా రాయటం నీ వల్ల కాదు. అది పరిష్కారం కూడా కాదు . నీ గురించి పత్రికలో ప్రత్యేక వ్యాసం వేద్దాం. దాన్ని చూపించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయానికి ప్రయత్నం చేద్దాం- అన్నాను. 


సీనియర్ జర్నలిస్టు , రెడ్డి గారికి ఆప్తుడు గోవిందరాజు చక్రధర్ గారు చక్కని వ్యాసం రాశారు. దానిని మా డైలీ ఫీచర్స్ సప్లిమెంటు "భూమిక" మొదటిపేజీలో ప్రముఖంగా వేశాము. ఎవరూ పనిగట్టుకుని పైరవీ చేయాల్సిన అవసరం లేకుండా అందరికంటే ముందు  ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు పొద్దున్నే ఆ వ్యాసం చూసి నేరుగా తానే కె.ఎల్.రెడ్డికి ఫోన్ చేసి పిలిచారు. 



ముఖ్యమంత్రి అంతటివాడు తనను పిలిచి నీకు పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను అంటే "దాని వల్ల నాకు నెలకు 12 వేలు మిత్తి వస్తుందా"అని అడిగాడు కె.ఎల్.రెడ్డి . ముఖ్యమంత్రి నవ్వి ఎవరో ఆఫీసరును పిలిచి ఈయనకు ఎంత ఇస్తే నెలకు 12 వేలు మిత్తి వస్తుంది? "అని అడిగారట. "15 లక్షలు " అని ఆన్సర్ వచ్చింది. సరే 15 లక్షలు ఇస్తున్నాను పొమ్మని చెప్పి అక్కడికక్కడే 15 లక్షల చెక్కును కె.ఎల్.రెడ్డి చేతికిచ్చారట ముఖ్యమంత్రి. ఈసంగతి చెప్పి, పదే పదే గుర్తు చేసుకుని ఆ మానవుడు ఎంత సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను . ఆనాడు ముఖ్యమంత్రి చూపిన ఆ సౌజన్యం వల్ల కె.ఎల్.రెడ్డికి వృద్ధాప్యంలో రాసుకుని బతకాల్సిన అగత్యం తప్పింది. అవసాన దశ సుఖంగా జరిగి పోయింది. 

https://telugu.oneindia.com/news/telangana/kcr-donates-donattes-rs-15-lakhs-kl-reddy-179140.html

జర్నలిస్టులు, ఎర్నలిస్టులు ఎంత మంది ఉన్నా కె.ఎల్. రెడ్డి ఒక్కడు చాలు పాత్రికేయ వృత్తి గర్వంగా చూపించుకోవటానికి. ఎక్కడ ఉన్నా ప్రతి దసరాకూ ఫోన్ చేసి పట్టుబట్టి తన దగ్గరికి పిలిపించుకునే కె.ఎల్.రెడ్డి కన్నుమూయటం నాలాగే చాలా మంది జర్నలిస్టులకు తీరని వెలితి. 













Friday 21 October 2022

అపర ధన్వంతరి డాక్టర్ కె.జి.కె. శాస్త్రి

 నేనెరిగిన అపర ధన్వంతరి డాక్టర్ కె.జి.కె. శాస్త్రి (కురుగంటి గోపాలకృష్ణ శాస్త్రి )గారు 86 ఏళ్ల పండు వయసులో మొన్న సాయంత్రం పరమపదించారు. 



సాధారణంగా ఎవరికైనా ముందు చదువు తరవాత ఉద్యోగం ,ఆ మీదట ఉద్యోగ విరమణ , విశ్రాంత జీవనం. శాస్త్రి గారి ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ రామంతపూర్ లోని జయసూర్య ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాక గుల్బర్గా కాలేజిలో చేరి  ఎం.డి. చేశారు. చిన్న రూము లో అద్దెకుండి వంట వండుకుని రెండేళ్లు చాలా కష్టపడ్డారు. ప్రతి శుక్రవారం రాత్రి బయలుదేరి గతుకుల రోడ్డుపై  గుల్బర్గా నుంచి హైదరాబాద్ కు ఆర్.టి.సి. బస్సులో తెల్లవారేసరికి వచ్చేవాడు. 

ఎందుకు రెండు రోజులు ఇంటి పట్టున ఉండి రిలాక్స్ అవటానికా ? కాదు. నల్లకుంట శంకర మఠం కాంప్లెక్సు లోని  క్లినిక్ లో తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వందలాది పేషంట్లను చూడటానికి!  శని, ఆది వారాలలో భోజన విరామం మినహా నాన్ స్టాపుగా వైద్యం చేసి అటునుంచి అటే గుల్బర్గా బస్సు ఎక్కేవారు. అలా రెండేళ్ళు ఇష్టంగా కష్టపడి ఎం.డి. కోర్సు చేశారు. 

విశేషమేమిటంటే కె.జి.కె. శాస్త్రి గారు హోమియో వైద్యుడు. కాని అల్లోపతిలో హేమాహేమీలైన  సూపర్ స్పెషలిస్టు డాక్టర్లు ఎందరికో ఆయన ఫామిలీ డాక్టరు. స్పెషలిస్టుల తరం కాని మొండి రోగాల కేసులు ఆయనకు రిఫర్ చేయటం పరిపాటి. 

వ్యాధి నిర్ధారణ లో డాక్టర్ కె.జి.కె. గారికి తిరుగు లేదు. నా మిత్రుడు, పర్యావరణ ఉద్యమకారుడు బొలిసెట్టి సత్య గారికి ఒక మారు అమెరికాలో ఉండగా ప్రాణాపాయం వచ్చింది. US లో కొమ్ములు తిరిగిన డాక్టర్లు చాలా రోజులు గుంజాటన పడి , చాలా పరీక్షలు చేసి చేసి చివరికి అది Sarcoidosis వ్యాధి అని తేల్చారు. మూడు వారాలకు మించి బతకటం కష్టమని చెప్పారు. ఇండియా తిరిగివచ్చాక , ఆయన ఆప్త మిత్రుడు విశాఖపట్నం  కాన్సర్ స్పెషలిస్టు  డాక్టర్ రొక్కం గోపాలకృష్ణ గారు హైదరాబాద్ లో వైద్య నిపుణులను సంప్రదించి చేసిన ఆఖరు ప్రయత్నాలూ నిష్ప్రయోజనం అయ్యాక  ఒక సారి మా శాస్త్రి గారికి చూపిద్దాం అని నేనన్నాను. హోమియో వైద్యం  అంటే మహా చిన్న చూపు గల డాక్టర్ గోపాల కృష్ణ గారు నా బలవంతం మీద మహా చిరాకుగా మా వెంట వచ్చారు. హోమియో నాటు వైద్యుడికి అసలు రోగం పేరు చెప్పినా అదేమిటో  అర్థమవుతుందా అని ఆయనకు సందేహం.

 డాక్టర్ శాస్త్రిగారు స్కానింగ్ ఫిల్ము చూసీ చూడగానే "ఇది Sarcoidosis అన్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గారు షాక్ అయ్యారు. "ఔను. కాని నయమవుతుందా?" అని గౌరవంతో కూడిన గొంతుతో అడిగారు. "అవుతుంది. మందు ఇస్తాను" అన్నారు మా డాక్టర్ గారు.

మూడు వారాలలో పోతాడని 2001లో అమెరికా టాప్ డాక్టర్లు చెప్పిన బొలిశెట్టి సత్య నారాయణ గారు 21 ఏళ్ల తరవాత ఇప్పటికీ పర్యావరణ ఘాతకులను, జనసేన వైరి వర్గాలను టీవీ చానెళ్ళలో రోజూ దుంప తెంచుతూనే ఉన్నాడు. హోమియోపతిని క్వాకరీ అన్న డాక్టర్ రొక్కం గోపాలకృష్ణ గారు మా శాస్త్రి గారి చేత నేను రాయించిన "హోమియోవైద్యం" గ్రంథానికి ముందుమాట రాశారు.

కేర్ హాస్పిటల్ లో డాక్టర్ గారికి  బైపాస్ సర్జరీ తరవాత వయసు రీత్యా శరీరం సహకరించక సమస్యలు చుట్టుముట్టాయి. చాలారోజులు ఐసియు లో ఉండీ కోమాలోకి వెళ్లేంతవరకు తన మందులు తాను వేసుకుంటూనే ఉన్నారు. "ఫాస్ఫరస్" డ్రగ్ మంచిదని శిష్యులు సూచిస్తే 'కాదు. ఈ లక్షణాలకు "చైనా" పడతుందని చెప్పి తెప్పించి వేసుకున్నారు.

మా అమ్మకు "ఆస్టియో పొరోసిస్" వైద్యంకోసం ఎవరో రిఫర్ చేస్తే ఆయన దగ్గరికి మొదటి సారి వెళ్లాను. పేషంటు కదలటం కష్టం అంటే తానే మరునాడు కారు డ్రయివ్ చేసుకుంటూ ఈనాడు ఆఫీసుకు వచ్చి నన్ను తీసుకుని మా ఇంటికి వెళ్లారు. అది మొదలు 35 ఏళ్లుగా మా ఫామిలీ మొత్తానికీ ఆయనే వైద్యుడు.

కెజికె గారు  మాకు మెడికల్ కన్సల్టెంటు. నేను ఆయనకి జ్యోతిషం కన్సల్టెంటును. బైపాస్ "ఆపరేషన్ రోజు  ద్వాదశి  అయింది ఫరవాలేదా అని ఎం.వి.ఆర్. శాస్త్రి గారిని అడగాలి" అనుకున్నారట. అడగకుండానే వెళ్లిపోయారు. 36 ఏళ్ల ఆప్త బంధువు, మంచి మనిషి, స్నేహశీలి, అజాత శత్రువు అయిన డాక్టర్ కెజికె శాస్త్రి గారి కాలధర్మం వ్యక్తిగతంగా నాకు తీరని వెలితి. తన ప్రియమైన దత్త పుత్రిక డాక్టర్ అనన్య ఎం.బి.బి.ఎస్. చేత   ఎం.డి. చేయించాలని, తన ప్రాక్టీసును హోమియో డాక్టరు  అయిన నాగ‌హరిత కొనసాగించాలని ఆయన కోరిక. రెండూ తప్పక నెరవేరాలని ఆశిస్తున్నాను.  




Wednesday 7 September 2022

అపోలోకెళ్లిన నిమ్స్!!

 హైదరాబాద్ నడిగడ్డన ప్రభుత్వం నడిపే నిమ్స్ లో ‌స్టంట్లు వేస్తారు. బైపాస్ సర్జరీలూ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడినుంచీ అలాంటి అవసరాల కోసం ‌సామాన్య రోగులు అక్కడికి విరివిగా వెళతారు. కాని ఆ నిమ్స్ ను నడిపే  డైరెక్టరుగారు తనదాకా వచ్చేసరికి మాత్రం తన సంస్థను తానే బైపాస్ చేసి అక్కడికి దగ్గరే ఉన్న అపోలో హాస్పిటల్లో చేరి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడని వార్త.



తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రిగారు కూడా ఏ కా‌స్త నలత అనిపించినా యశోదా హాస్పిటల్ కే వెళతారు తప్ప అదే సోమాజిగూడలో కూతవేటు దూరంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ నిమ్స్ కేసి పొరపాటున కూడా  చూడరు. 


ప్రభుత్వాన్ని నడిపేవాడికీ , సంస్థను నడిపేవాడికే ప్రభుత్వరంగ పెద్దాసుపత్రి మీద నమ్మకం లేనప్పుడు మిగతా మంత్రులూ , ఎమ్మెల్యేలూ , ఐఎఎస్ దొరలూ గవర్నమెంటు హాస్పిటల్స్ లో వైద్యం తమ ప్రిస్టేజికి భంగమని అనుకుంటున్నారంటే ఆశ్చర్యమెందుకు ? 


ఆఖరికి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న నిరుపేదల కు అత్యవ‌సర వైద్యసాయం కోసం   ఆరోగ్యశ్రీ లాంటి పథకాల కింద వెచ్చించే  వందల కోట్ల పబ్లిక్ సొమ్మును కూడా చాలావరకూ  కార్పొరేట్ హాస్పిటల్స్ సొరచేపలకే సమర్పించుకుంటున్నారు . సామాన్య రోగులకు ఏకైక దిక్కు అయిన ఉస్మానియా, గాంధి వంటి-  ఒకప్పుడు పెద్ద పేరున్న ధర్మాసుపత్రులకేమో నిధులు బిగదీసి , అతీగతీ పట్టించుకోకుండా వాటి కర్మానికి , పేద రోగుల ప్రారబ్ధానికి వదిలేస్తారు. ఇక వైద్య,ఆరోగ్య సేవలు బాగుపడమంటే ఎలా బాగుపడతాయి? 


ఈ మాయరోగం వదిలించాలంటే ఒకటే మందు. పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా వైద్యం  నిమిత్తం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లోనే విధిగా చేరాలని, అత్యవసరంగా కావలసిన ‌సదుపాయాలు, వనరులు అక్కడ నిజంగా లేని సందర్భాలలో మాత్రమే‌ ప్రైవేటు రంగ సేవలు పొందాలని కట్టడి చేయాలి. అలా కాదు; మాకు కార్పొరేట్ వైభోగమే కావాలి అంటారా? తప్పక వెళ్లండి. కాని పబ్లిక్ సొమ్ముతో కాదు; మీ సొంత ఖర్చుతో ..  అని రూలుపెడితే చాలా రోగాలు కుదురుతాయి. మెడికల్ మాఫియా నెక్సస్ తీవ్రత కొంతవరకైనా కంట్రోలు అవుతుంది. కాని దానికి పూనుకునేవారు ఎవరు?


https://twitter.com/mvrsastry/status/1567386367273086977?t=PI67iz8ssEg1Fqat3MieKw&s=19