Thursday 15 February 2018

ఇదెక్కడి న్యాయం ?

మను ధర్మ శాస్త్రం -2 


ఎం.వి.ఆర్. శాస్త్రి



   అనుమానం అక్కర్లేదు. ఈ మాట ఒప్పుకోవటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండనక్కరలేదు.

   " మనుస్మృతి " పేర ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్రంథాల్లో ఎవరు వేసింది , లేక ఎవరు రాసింది చదివినా , అందులో శూద్రుల పట్ల , చండాలాది అంత్య జాతుల పట్ల కొట్టవచినట్టు కనపడే క్రూరత్వం , దుర్వివక్ష లను చూస్తె మనిషన్న ప్రతి ఒక్కడికీ వొళ్ళు మండుతుంది. మరీ ఇంత అమానుషమా అని తీవ్రమైన జుగుప్స కలుగుతుంది. కడగొట్టు జాతులను ఉద్దేశించి అందులో నిర్దేశించిన శిక్షలను గానీ , వాటి వెనుక ఉన్న బ్రాహ్మణాధిక్య భావజాలాన్ని కానీ ఈ కాలం లో ఎవరూ సమర్ధించరు.  సమర్ధించ కూడదు.

   అదే సమయంలో సో కాల్డ్ " మనుస్మృతి ' ని సాక్ష్యం గా చూపెట్టి , అందులో పేర్కొన్న దుర్మార్గపు శిక్షలు , వివక్షలు అన్నిటినీ హిందూ సమాజం లేక హిందూ మతం అనాదిగా , యుగ యుగాలుగా కింది వర్ణాల పట్ల అమలు జరిపిందని ఆరోపించటం తప్పున్నర తప్పు.

  ఈ సందర్భంలో ముఖ్యంగా గమనించవలసిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి.

   1. మను ధర్మ శాస్త్రం వేరు. ఆధునిక కాలంలో " మనుస్మృతి " పేర చలామణి లో ఉన్న అతుకుల బొంత పుస్తకాలు వేరు.

   2. రామాయణం లో ,  మహాభారతం లో మనువు , అతడు నుడివిన మానవ ధర్మం ప్రస్తావన అత్యంత గౌరవ పూర్వకంగా, పరమ ప్రమాణంగా కనిపిస్తుంది.  శ్రీరాముడి పూర్వీకులైన రఘువంశం రాజులు అందరూ మనువును అనుసరించి ధర్మపాలన చేశారని  " రఘువంశం " లో కాళిదాసు పేర్కొన్నాడు. 
   ఈ మధ్య రామసేతు కు సంబంధించి వెలువడిన ఒక శాస్త్రీయ రుజువును బట్టి చూసినా రాముడు కనీసం 7 వేల ఏళ్ళ కిందటి వాడు. చరిత్రకారులు చాలామంది తేల్చిన ప్రకారం మహాభారత యుద్దం క్రీస్తు శకానికి వెనుక 3102  సంవత్సరంలో అంటే కనీసం 5 వేల ఏళ్ళ కింద జరిగింది. దీన్ని బట్టే మనువు , మనుధర్మం ఎన్నో వేల ఏళ్ళుగా సుప్రసిద్ధమైనవని స్పష్టం.

   3. ఇక మనం చూస్తున్న ' మనుస్మృతి " సంగతి.  ఇది ఏకాలం లో రాసింది అన్నదాని మీద  చరిత్రకారులు తలా ఒక రకంగా చెబుతారు.  కొందరు ఇది క్రీ. పూ. 2 వ శతాబ్దం నాటిది అంటారు. మరికొందరు క్రీ.శ.3 వ శతాబ్దం నాటిది అని చెబుతారు. అందరు చెప్పేదీ చూసినా ఇది మహా అయితే అటూ ఇటూగా 2000 సంవత్సరాల నాటిది.

   4. పోనీ ఈ 2 వేల ఏళ్ళుగా అయినా వ్యవహారం లో ఉన్న మనుస్మృతి ఇదీ  అని కచ్చితంగా చెప్పగలమా?

   Over fifty manuscripts of the Manusmriti are now known, but the earliest discovered, most translated and presumed authentic version since the 18th century has been the "Calcutta manuscript with Kulluka Bhatta commentary". Modern scholarship states this presumed authenticity is false, and the various manuscripts of Manusmriti discovered in India are inconsistent with each other, and within themselves, raising concerns of its authenticity, insertions and interpolations made into the text in later times.

[ Wikipedia , quoting Patrick Olivelle in  "Manu's Code of Law", Oxford University Press ]

   ( మనుస్మృతి కి సంబంధించి 50 కంటే ఎక్కువ రకాల రాతప్రతులు బయటపడ్డాయి . కనుగొన్నవాటి  అన్నిటిలోకీ పాతదీ, ఎక్కువగా అనువదించబడ్డదీ ,  ప్రామాణికమని 18 వ శతాబ్దం నుంచీ ఊహించబడినదీ కుల్లూక భట్టు వ్యాఖ్యానంతో కూడిన " కలకత్తా రాతప్రతి ". దాని ప్రామాణికత కూడా  అబద్ధమని ఆధునిక విద్వాంసులు తేల్చారు. భారతదేశం లో కనుగొన్న వివిధ రాతప్రతుల్లో ఒకదానికీ ఇంకొకదానికీ పొంతన లేదనీ, ఒక ప్రతిలో  చెప్పినవాటి విషయాల్లోనే పొంతనలేదనీ పరిశోధకులు చాటారు.  దీనివల్ల ఏ రాతప్రతికి ఆ రాతప్రతి ఎంత వరకూ అసలైనది . అనంతర కాలాల్లో వాటిలోకి    చేర్చిన  , చొప్పించిన ప్రక్షిప్తాలు ఏమిటి అన్న అనుమానాలు రేకెత్తాయి. )

   కాళిదాసు కవిత్వం కొంత , నా పైత్యం కొంత అన్నట్టు ఒక్కో కాలంలో ఒక్కకరు , తమకు తోచినట్టు, ఇష్టం  వచ్చినట్టు లేనిపోనివి జోడించి గ్రంథం పెంచుకుంటూ పోవటంతో ఇప్పుడు మనం మనుస్మృతి అనుకుంటున్నది  నానా చేతివాటాల కంగాళీ గా తయారయింది.

    5. మహమ్మదీయులకు షరియత్ లాంటిది కాదు హిందువులకు మనుస్మృతి. అది ధర్మ శాస్త్రమే తప్ప శిక్షా స్మృతి ఎంతమాత్రమూ కాదు. నేటి ఇండియన్ పీనల్ కోడ్ వలె దానిలో సూచించిన శిక్షలకు చట్టప్రతిపత్తి లేదు. శాసనపరమైన  ఆమోదమూ లేదు. హిందూ దేశంలో ఏ కాలంలో ఏ రాజూ మనుస్మృతి ని ఆధికారిక , ఏకైక రాజ్యాంగం గా ప్రకటించిన దాఖలా కంచు కాగడాతో  వెతికినా ఒక్కటీ కనపడదు. పూర్వకాలంలో ఏ జాతికి ఆ జాతి, ఏ జనపదానికి ఆ జనపదం తన ఆచారం, సంప్రదాయం, ఆలోచనా విధానాన్ని బట్టి నేరాలకు శిక్షలను నిర్ణయించడమే తప్ప మన కాలంలో వలె మొత్తం రాజ్యమంతటికీ కలిపి ఒకే న్యాయవిధానం , ఒకే శిక్షాస్మృతి ఉండేవి కావు. 

    6. రామాయణం , భగవద్గీత ల వలె మనుస్మృతి హిందువులకు పవిత్ర మతగ్రంథం ఎన్నడూ కాదు. "మనుస్మృతి" విధిగా పాటించి తీరవలసిన , అనుల్లంఘనీయమైన ధర్మ శాసనమని అది  వ్యవహారంలోకి వచ్చిన ఈ  2 వేల ఏళ్ళలో ఏనాడూ హిందూ సమాజం భావించలేదు. అది ధర్మశాస్త్రమే తప్ప న్యాయశాసనం ఏనాడూ కాదు. అటువంటి ధర్మశాస్త్రాలు యాజ్ఞ్యవల్క్య స్మృతి , గౌతమస్మృతి వంటివి మనకు ఇంకా డజన్ల కొద్దీ ఉన్నాయి. 

   కృతేతు మానవాః ప్రోక్తా : 
   త్రేతాయాం గౌతమ స్మృతి : 
   ద్వాపరే శంఖ లిఖితౌ
   కలౌ పారాశర స్మృతి : 


   కృతయుగంలో  మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి , ద్వాపరంలో శంఖలిఖిత స్మృతి , కలియుగం లో పారాశర స్మృతి ఆచరణీయమని పెద్దల మాట.  మనం ఉన్న కలియుగం లో మనుస్మృతిని విధిగా పాటించాలని ఎంతటి చాందసుడూ చెప్పలేడు . ఈ యుగంలో  ఎవరూ పాటించని  మనుస్మృతి లో ఎవరో ఎప్పుడో బనాయించిన  రాతలకు మొత్తం హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని నిందించటం ఎంతవరకు న్యాయం ? 

   6. మనుస్మృతిలో మనకు కనపడుతున్న శూద్ర , దళిత ద్వేషం గానీ , కడజాతులను అన్యాయంగా , అమానుషంగా కాల్చుకు తినడం గానీ  వేదకాలపు, పౌరాణిక యుగాలలోనైనా ఉన్నదా అంటే నిర్దిష్టమైన ఆధారం ఒక్కటీ కనపడదు. 

   తపస్సు చేస్తున్నందుకు రాముడు శూద్ర శంబూకుడిని చంపాడు.
   ఆదివాసి ఏకలవ్యుడి బొటన వేలును ద్రోణుడు తెగగొట్టాడు.
   కర్ణుడిని సూతపుత్రుడా అని అవమానించారు.
   హరిశ్చంద్రుడు ఆలిని అమ్మాడు.
   ధర్మరాజు భార్యను జూదంలో పణం పెట్టాడు. 
   రాముడు సీతను అడవికి గెంటాడు.

    ఎవరు ఎప్పుడు ఎన్ని తీర్ల ఎంత తిట్టిపోసినా  , అనాదిగా జరిగినవనబడే అన్యాయాలకు దృష్టాంతంగా చూపించేవి ప్రధానంగా ఇవే కదా? ఇవన్నీ , వ్యక్తిగతమైన , వ్యక్తుల పరంగా జరిగిన అరుదైన ఘటనలే కాదా ? వీటిని పట్టుకొని, ఆ కాలాల్లో రాజులందరూ శూద్రులను చంపారు ;అస్త్రవిద్య నేర్చిన గిరిజనులందరి బొటన వేళ్ళు తెగగొట్టారు ; శూద్రులందరినీ అవమానించారు ; భర్తలందరూ కట్టుకున్న పెళ్ళాలను అమ్ముకునేవారు ; వారిని జూదంలో పణం పెట్టేవారు ; అనుమానం రాగానే భార్యలను కారడవులకు గెంటేసేవారు .. అని జనరలైజ్ చేయటం సమంజసమేనా ?
     అలాంటి చెదురుమదురు ఘటనలే తప్ప ..

   వేదం వినిన శూద్రుడి చెవుల్లో సీసం మరగబెట్టి పోశారనీ ...
   వేదం చదివిన శూద్రుడి నాలుక కోశారనీ.. 
   బ్రాహ్మడిని తిట్టినా శూద్రుడి నోట్లో సలసల కాలే ఇనుప కడ్డీని దోపారనీ ..
   బ్రాహ్మలిని ఏ అంగంతో శూద్రులు అవమానిస్తే ఆ అంగాన్ని నరికేశారనీ ..
   
ఏ పురాణంలో నైనా , ఏ ఇతిహాసంలో నైనా, ఏ చరిత్ర గ్రంథంలోనైనా ఎక్కడైనా ఉందా ? 
లేనప్పుడు..  మనుస్మృతిలో కనపడుతున్నాయి కాబట్టి అలాంటి  క్రూరమైన , అమానుషమైన శిక్షలన్నీ పూర్వం అన్ని కాలాల్లో అమలు జరిగే ఉంటాయని ఊహించటం , మొత్తం హిందూ మతాన్ని శూద్ర వ్యతిరేకిగా , దళిత ద్వేషిగా ముద్రవేయటం సబబేనా ? మనకాలంలో అనేకానేక కారణాల వల్ల వెర్రితలలు వేసి , సమాజంలోని , అట్టడుగు కులాలను, బడుగు బలహీన వర్గాలను కాల్చుకు తింటున్న కుల రక్కసి చేస్తున్న  అఘాయిత్యాలు, అత్యాచారాలు అన్నిటికీ మనుధర్మాన్ని ముద్దాయిని చేయటం న్యాయమేనా? 

[ తరువాయి భాగం : ఏది ప్రక్షిప్తం ? ఏది మను ధర్మం ? ]






No comments:

Post a Comment