Friday 16 November 2018

ధర్మానికి చోటులేని దయ్యాలదిబ్బ



- ఎం.వి.ఆర్‌.శాస్త్రి

పెక్యులరిజం-21



“My friends tell me that I have made the Constitution. But I am quite prepared to say that I shall be the first person to burn it out. I do not want it. It does not suit anybody.”

(రాజ్యాంగాన్ని నేను తయారు చేశానని నా మిత్రులు చెబుతారు. కాని దాన్ని తగలబెట్టే మొట్టమొదటి మనిషి నేనే. అది నాకొద్దు. అది ఎవరికీ పనికిరాదు.)

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌గారు 1953 సెప్టెంబర్‌ 2న రాజ్యసభలో అన్న మాటలివి.

భారత రాజ్యాంగం భక్తితో కళ్లకద్దుకోవలసిన పవిత్ర ధర్మ గ్రంథమన్నట్టూ, అది బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనకందించిన మహా ప్రసాదమైనట్టూ ఓవరై పోతూండేవాళ్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన యథార్థమిది.

రాజ్యాంగ నిర్మాత అని అందరం ప్రస్తుతించే అంబేద్కరేమిటి? ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే మొట్టమొదటి వ్యక్తి తానేనని చెప్పడమేమిటి? ఈ సందేహం అందరికీ వస్తుంది. 'ఎందుకలా అన్నారు' అని ఏణ్నర్థం తరువాత (1955 మార్చి 19న) రాజ్యసభలోనే ఏదో చర్చ సందర్భంలో డాక్టర్‌ అనూప్‌సింగ్‌ నేరుగా అంబేద్కర్‌నే అడిగాడు. దానికి అంబేద్కర్‌ ఇచ్చిన జవాబు చూడండి.

“The reason is this : We built a temple for God to come in and reside, but before the God could be installed, if the devil had taken possession of it, what else could we do except destroy the temple? We did not intend that it should be occupied by the Asuras. We intended it to be occupied by the Devas. That’s the reason why I would rather like to burn it.”

(కారణం ఇది : దేవుడు కోసం మేము గుడి కట్టాము. కాని దేవుణ్ని ప్రతిష్టించేలోపే దాన్ని దయ్యం వశపరచుకుంటే గుడిని కూల్చెయ్యటం తప్ప ఇంకేం చెయ్యగలం? అందులో దేవతలు నివసించాలనే కోరుకున్నాం. అసురులు ఆక్రమిస్తారని మనం ఆనుకోలేదు. ఇదిగో ఈ కారణం వల్లే దాన్ని తగలబెట్టటం మంచిదని నేను అంటాను.)

''దానికి గుడినెందుకు కూల్చటం? అందులో చేరిన దయ్యాన్ని హతమార్చితే చాలుగదా?'' అని కె.పి.సిన్హా ప్రశ్న. అందుకు అంబేద్కర్‌ జవాబు ఇది :

“You can not do it. We have not got the strength. If you will read the Satapatha Brahmana, You will see that the gods have always been defeated by the Asuras and that the Asuras had the Amrit with them..”

(అది మీ వల్ల కాదు. అంతబలం మనకు లేదు. శతపథ బ్రాహ్మణం చదివితే తెలుస్తుంది. అసురుల దగ్గర అమృతం ఉండేది. దాంతో వాళ్లు ప్రతిసారీ దేవతలని ఓడించేవారు.)



డ్రాఫ్టింగు కమిటీ ఛైర్మన్‌గా ఎంతో కష్టపడి, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయంకోసం ఎందరితోనో కొట్లాడి తాను రాసిపెట్టిన రాజ్యాంగాన్ని తన చేతులతో తానే తగలబెట్టాలనుకునేంతగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కి మనసు విరగడానికి కారణాలు వేరుకావచ్చు. కాని, మన పేరుగొప్ప రాజ్యాంగం తీరుతెన్నులను పరికిస్తే - ఈ దేశం పట్ల ప్రేమ, భక్తి, ధైర్యంగా ఆలోచించే శక్తి ఉన్న విజ్ఞులెవరైనా అంబేద్కర్‌ గారిలాగే అనుకుంటారు!

స్వతంత్రమనబడేది వచ్చి, స్వయం పరిపాలనకు కొత్తగా రాజ్యాంగమొకటి రూపొందుతున్నదంటే భారతమాతకు భవ్యమైన గుడి కడుతున్నారనే దేశవాసులు ఆశపడ్డారు. భారతదేశపు ఆత్మ శోభిల్లే రీతిలో, భారతీయ ఉజ్జ్వల సంస్కృతిని, దాని ఉత్కృష్ట వారసత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా భారతాంబిక పునర్వైభవానికి నూతన రాజ్యాంగం చక్కని రాచబాట వేస్తుందని ఆకాంక్షించారు. అనుకున్నదొకటైతే తీరా జరిగింది వేరొకటి.

భారతదేశానికి ప్రాణం సనాతన ధర్మం. భారతీయతకు మూలశక్తి ధర్మం. ధర్మం మీద ఆధారపడి, ధర్మాన్ని నమ్ముకుని, ధర్మమే అన్నిటికంటే మిన్నగా భావించింది కాబట్టే వరసగా ఎన్ని శతాబ్దాల పాటు విదేశీయులు, విదేశీ మతాలు ఎన్ని దండయాత్రలు చేసి, ఎంతలా హింసించి, ఎంతగా అణగదొక్కినా భారతదేశం భారతదేశంగా నిలబడింది. ప్రపంచంలో ఎన్నో ప్రాచీన నాగరికతల వలె నామరూపాలు మిగలకుండా పోకుండా భారతీయత ఎన్ని సవాళ్లనైనా తట్టుకుని గర్వంగా తలెత్తుకు నిలబడగలిగింది. శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్‌ దాష్టీకంలో, దీర్ఘకాలం బ్రిటిషు దాస్యంలో ముప్పతిప్పలు పడి, భయానక నష్టాలను, అంతులేని కష్టాలను అనుభవించి, ఎట్టకేలకు పరదాస్యం నుంచి బయటపడ్డాక, స్వరాజ్యంలో అత్యంత గౌరవ స్థానం కల్పించవలసింది జాతికి జీవశక్తి అయిన ధర్మానికి! రాజ్య వ్యవస్థకు చోదకశక్తిగా తక్షణం ప్రకటించవలసింది ధర్మాన్ని. ఎటునుంచి ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు ఎదురవకుండా ఆవశ్యం పరిరక్షించవలసింది ధర్మాన్ని.

దౌర్భాగ్యం ఏమిటంటే అతి ముఖ్యమైన, ప్రాణప్రదమైన ''ధర్మం'' అన్న పదమే ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలోకి దీర్ఘమైనదైన భారత రాజ్యాంగంలో కంచుకాగడాలతో వెతికినా ఎక్కడా కానరాదు. ధర్మం ఊసే లేనప్పుడు రాజ్యాంగం ధర్మాన్ని రక్షించే ప్రసక్తే లేదు. ధర్మానికి ఫలానావిధంగా గ్లాని కలుగుతోంది, ధర్మ వ్యతిరేకంగా ఈ అక్రమం జరుగుతున్నది, అడ్డుకోండంటూ ఏ భారత పౌరుడూ ఏ న్యాయస్థానాన్నీ అర్థించలేడు. ఏమిటా 'ధర్మం', రాజ్యాంగంలో ఎక్కడుంది ఆ 'ధర్మం', దాన్ని ఉల్లంఘించటం రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నేరం, ఏ విధంగా శిక్షార్హం అని కోర్టు అడిగితే అతడి దగ్గర జవాబు లేదు.

ప్రపంచంలో మరే జాతికీ లేని లక్షల సంవత్సరాల మహోజ్వల జీవన స్రవంతిలో శ్రుతులు, స్మృతులు, ధర్మశాస్త్రాలు, కౌటిల్యాది రాజ్యతంత్ర గ్రంథాలు అనన్య ప్రాధాన్యం ఇచ్చిన ధర్మాన్ని కనీసం తలవనైనా తలవకుండా భారతదేశాన్ని శాసిస్తున్నది నడమంత్రపు రాజ్యాంగం!

ధర్మం అన్న కాన్సెప్టు భారతదేశానికి ప్రత్యేకం. అటువంటి భావన ఏ పాశ్చాత్య నాగరికతలోనూ కనపడదు. ధర్మానికి కచ్చితంగా సమానార్థకమైన పదం ఎన్ని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఎన్ని భూతద్దాలతో గాలించినా దొరకదు. విదేశీయులకు తెలియకపోవచ్చుగాని ధర్మం అంటే ఏమిటో భారతదేశంలో మారుమూల పల్లెలో గొడ్లు కాసుకునే పామరుడు కూడా ఎరుగును. ఆంగ్ల మానసపుత్రులు, మెకాలే వారసులు అయిన మన సోకాల్డ్‌ జాతీయ నాయకుల దృష్టిలో తెల్లవాడు నేర్పిందే బెస్టు; సంప్రదాయంలో ఉన్నదంతా నాన్సెన్సు! తమకు పరమ ప్రామాణికమైన పాశ్చాత్య నాగరికతలో ధర్మమనే కాన్సెప్టు లేదు కాబట్టి ఆధునిక రాజ్యాంగంలో అలాంటి పాతకాలపు చాదస్తాన్ని చొప్పించాలన్న ఆలోచనే వారికి కలనైనా కలగలేదు.

ధర్మం అంటే మతం కాదు. ఒక హిందూమతానికి, కేవలం భారతదేశానికి పరిమితమైన భావన కాదు. అది సార్వకాలికం, విశ్వజనీనం. ఏ మతాన్ని అనుసరించే వారికైనా, ఏ దైవాన్ని కొలిచేవారికైనా, ఏ దేవుడినీ నమ్మనివారికైనా, ఏ వర్గానికి, ఏ భావజాలానికి చెందినవారికైనా సమాన న్యాయం చేసేది, కర్తవ్యం బోధించేది, సమాజాన్ని సత్యమార్గంలో ముందుకు నడిపించేది ధర్మం.

ఇది విదేశీ దురహంకారుల బుద్ధికి అందదు. వారికి తెలిసిందల్లా మతం. అందులో ఒక్క దేవుడికే స్థానం. ఒక్క ప్రవక్త చెప్పిందే సత్యం. దానిని విశ్వసించని వాడు ద్రోహి. వాడికి పుట్టగతులు నాస్తి. రెండు సత్య మతాలు ఉండేందుకు వీలే లేదు. మనది కాని మతాన్ని అంగీకరించే, కనీసం గౌరవించే ప్రసక్తే లేదు.



ఇదీ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సెమెటిక్‌ మతాల ఆలోచనా రీతి. ధర్మాన్ని ఒగ్గేసిన మన మహానుభావులు ప్రపంచమంతటా అల్లకల్లోలాలకు మూలమైన ''రిలిజియన్‌''ను మాత్రం పదిలంగా రాజ్యాంగంలో చొప్పించారు. మత స్వాతంత్య్రానికంటూ 25 నుంచి 30 దాకా ఏకంగా ఆరు అధికరణాలను కేటాయించారు.

మంచిదే. కనీసం వాటిలోనైనా మనదేశానికి సొంతమైన, ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన, ఇప్పటికీ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ మతానికి గౌరవస్థానం ఇచ్చారా?

గౌరవం మాట దేవుడెరుగు. అసలు ''హిందూమతం'' అన్న పదమే మొత్తం రాజ్యాంగంలో ఎక్కడా కానరాదు. ఎంతసేపూ జనాభాలో నిండా ఐదో వంతు లేని మైనారిటీల హక్కులూ రక్షణల సంగతే తప్ప, అసలైన మెజారిటీ గురించి, అది అనుసరించే హిందూమతం గురించి, దాని హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కనీసం ప్రస్తావనే లేదు.

మైనారిటీ అనేది సాపేక్ష పదం. పెద్ద సమూహం ఒకటి ఉంటేనే దానికి భిన్నమైన చిన్న సమూహానికి ఉనికి. మనం సెక్యులర్‌ మడి కట్టిన వాళ్లం; మతాల విషయంలో మనకు పెద్దా చిన్నా తేడా లేదు. ఏ మతానికి చెందినా పౌరులందరూ సమానమే - అన్న మంచి బుద్ధి మనకుంటే రాజ్యాంగంలో అసలు మతాల ఊసే ఎత్తకూడదు. మెజారిటీ మతం గురించి మాట్లాడనట్టే మైనారిటీలనూ ఎక్కడా ప్రస్తావించకూడదు.

అలాకాదు; అందరూ సమానమే అని ఊరుకుంటే మెజారిటీ హిందువులు మైనారిటీ మతాలను అణగదొక్కేస్తారు. అలా జరక్కుండా మైనారిటీలకు తగిన రక్షణలు ఉండాలి అనుకుంటారా? మెజారిటీ అనుభవించే హక్కులు మైనారిటీలకూ దక్కి తీరాలి; ఆ విషయంలో మైనారిటీలు ఎలాంటి వివకక్షూ గురి కాకూడదు - అని ఆరాటపడతారా? అప్పుడు మతపరమైన హక్కులు, రక్షణలు ఏమిటో ముందుగా నిర్వచించాలి. అవి అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తాయని తరవాత స్పష్టం చేయాలి.

మన రాజ్యాంగంలో జరిగింది దీనికి పూర్తిగా రివర్సు. 25 నుంచి 30 వరకూ ఆరు అధికరణాల వంపు సొంపుల మీద ఇంతకు ముందు మనం పైపైన చేసిన పరిశీలనలోనే ఎన్నో వైరుధ్యాలు, అసంబద్ధతలు బయటపడ్డాయి. అన్నింటికంటే పెద్ద లొసుగు రాజ్యాంగంలో మైనారిటీల హక్కులూ, రక్షణల వైనమే తప్ప మెజారిటీ గురించి, వారి మత హక్కుల గురించి ఎక్కడా పేర్కొనకపోవటం!

దానివల్ల ఏమైంది? మైనారిటీలకేమో రెండు రకాల హక్కులు. వారు జనరల్‌ కేటగిరీలో భారత పౌరులుగానూ న్యాయం కోరవచ్చు. స్పెషల్‌ కేటగిరీలో మైనారిటీలుగానూ కోర్టు లెక్కవచ్చు. ఆ విధంగా డబుల్‌ ధమాకా!

అదే దురదృష్టవంతులైన హిందువులో? వారికి భారత పౌరులుగా మాత్రమే గుర్తింపు. మైనారిటీల్లాగా వారికి స్పెషల్‌ కేటగిరీ ఏదీ లేదు. మెజారిటీ వర్గంగానో, హిందూ మతానికి చెందిన వారిగానో తమ హక్కులకు భంగం కలిగాయని వారు ఎప్పుడు ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే 'హిందూ' అనిగాని, 'మెజారిటీ' పదంగాని రాజ్యాంగంలో ఎక్కడా కానరావు. రాజ్యాంగంలో ఏ అధికరణం కింద మిమ్మల్ని గుర్తించాలి, ఏ క్లాజు ప్రకారం మీకు న్యాయం చేయాలి అని అడిగితే హిందువుల దగ్గర జవాబు లేదు. ఇందాక ధర్మం విషయంలో చెప్పుకున్నట్టే ధర్మానికి ప్రతిరూపమైన మతం విషయంలోనూ హిందువులకు ప్రత్యేకంగా ఏ హక్కూ లేదు. మతపరంగా హక్కులన్నీ మైనారిటీలకు! జన సంఖ్యలో 80 శాతం ఉండికూడా హిందువులు తమ దేశంలోనే రాజ్యాంగరీత్యా రెండో తరగతి పౌరులు.

దీని పర్యవసానం ఇప్పుడు శబరిమల విషయంలో చూస్తూనే ఉన్నాము కదా?

'ధర్మం' లాగే 'మతం' అన్న పదానికీ దాని విస్తృతార్థంలో సరైన మాట ఇంగ్లీషు భాషలో దొరకదు. బహు సంకుచితమైన, ఒకే మూసకు చెందిన ఇస్లాం, క్రిస్టియన్‌, యూదు మతాలకు ఉద్దేశించిన 'రిలిజియన్‌', 'డినామినేషన్‌' వంటి పదాలు అనంత వైవిధ్యానికి, అపార బహుళత్వానికి నెలవైన హిందూమతానికి ఎంతమాత్రమూ సరిపోవు. మత సంస్థలను నడుపుకునే స్వేచ్ఛ వగైరాలకు సంబంధించి 26వ అధికరణంలో ఒక మతానికి చెందిన అన్ని శాఖలకూ, సంప్రదాయాలకూ, మార్గాలకూ, పరంపరలకూ అవి వర్తిస్తాయని స్పష్టంగా చెప్పకుండా మతపరమైన 'డినామినేషన్లు' అంటూ ద్రావిడ ప్రాణాయామం చేశారు. డినామినేషను అన్న ఇంగ్లీషు మాటకు ఆక్స్‌ఫర్ట్‌ డిక్షనరీలో చెప్పిన అర్థాల్లో ఏదీ అయ్యప్ప కూటమికి సరిపోవడం లేదు కాబట్టి కోట్లాది భక్తులు శతాబ్దాలుగా నిష్ఠతో అనుసరిస్తున్న అయ్యప్ప సంప్రదాయం 'డినామినేషను' కిందికి రాదని సుప్రీంకోర్టు తేల్చింది. 26వ అధికరణం కింద మతస్వేచ్ఛ హిందువులకు ప్రాప్తం లేదు కాబట్టి 'జస్ట్‌ హిందువులు' అయిన అయ్యప్పల మూల దేవాలయం పబ్లిక్‌ టెంపుల్‌ అని, అందులోకి ఫలానా వయసు ఆడవాళ్లు రాకూడదని అడ్డగించడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనం ఆజ్ఞ! రుతుస్రావం జరిగే వయసులో శబరిమల సన్నిధానానికి స్త్రీలు రాకూడదని సాక్షాత్తూ అయ్యప్ప స్వామే చెప్పాడు కదా అంటే ''ఎందుకని? స్త్రీల పొడ సోకితే ఆ స్వామి బ్రహ్మచర్యం చెడుతుందా? రుతుక్రమం మహిళల శరీరధర్మం కదా? ఆ కారణం చేత వారికి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కును ఎలా అడ్డగిస్తారు'' - అంటూ పెద్ద కోర్టువారు బోలెడు కోప్పడ్డారు.

దానివల్ల ఏమైంది? హిందూ మతాన్ని పాడు చేయటమే పనిగా పెట్టుకున్న అన్యమతాల మైనారిటీలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇంతకుముందు దాకా రుతుస్రావం కావచ్చన్న భయంతోనే ఆ వయసు మహిళలు దర్శనానికి వెళ్లేవారు కాదు. వారిని అనుమతించేవారూ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన లైసెన్సుతో మతవిరోధులు బరితెగించి, రుతుస్రావ చిహ్నాలతోనే ఆలయంలో అడుగెడతామని బెదిరిస్తున్నారు. దానివల్ల భక్తుల విశ్వాసాలు, ఆలయ పవిత్రత, దేవుడి నిష్ఠ ఎంతలా దెబ్బతిన్నా కోర్టులకు పట్టదు.

అదే - అయ్యప్ప గుళ్లోలాగే మసీదుల్లోనూ మహిళలను అనుమతించండి - అని ఎవరో దావా వేస్తే కేరళ హైకోర్టు దాన్ని విచారణైనా లేకుండా కొనగోటితో కొట్టివేసింది. శబరిమలలో అలా.. మసీదుల విషయంలో ఇలా - ఏమిటి? ఎందుకీ వివక్ష అని గుండెలు బాదుకోవటం దండుగ. సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూర్చున్న న్యాయమూర్తులను నిందించీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అసలు లొసుగు రాజ్యాంగంలో ఉంది. మైనారిటీలకే తప్ప మెజారిటీ వర్గం విశ్వాసాలకూ, ఆచారాలకూ, మత హక్కులకూ రాజ్యాంగం గుర్తింపు లేదు. చెబుతూ పోతే ఇలాంటి విపరీతాలు కావలసినన్ని.

దేవుడి గుడిలా వెలుగొందవలసిన రాజ్యాంగం దయ్యాల దిబ్బ అయిందని అరవై ఐదేళ్లకిందటే సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే బాధపడుతూ అన్నమాట కరక్టే కదా? మొగమాటం లేకుండా రాజ్యాంగ వైపరీత్యాన్ని తెగనాడటానికి ఆనాడు ఆయన చూపిన తెగువలో శతాంశమైనా ఇవాళ మనకు ఉన్నదా?


No comments:

Post a Comment