Thursday 6 September 2018

దగా పడ్డది హిందూమతం


పెక్యులరిజం - 12

ఎం.వి.ఆర్‌.శాస్త్రి
..............




ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః

తస్మా ద్ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతోవధీత్‌

ధర్మాన్ని మనం భక్షిస్తే ధర్మం మనల్ని భక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడూ చెడగొట్టకూడదు. చెరపబడని ధర్మం మనల్ని చెరపకుండును గాక!

ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా మన పుణ్యభూమిలో ప్రజలకూ, ప్రభువులకూ శిరోధార్యమైన ధర్మసూత్రం.
నాణెం లాగే ధర్మానికీ రెండు ముఖాలు. ధర్మం బొమ్మ అయితే దైవం బొరుసు. ఆ దైవాన్ని చేరడానికి దారి చూపేది మతం. కాబట్టి ధర్మం కాపాడబడాలంటే మతాన్ని కాపాడి తీరాలి.

ఆ వివేకంతోటే యుగయుగాల్లో తరతరాలుగా ఈ వేదభూమిని ఏలిన ధర్మ ప్రభువులందరూ సనాతన ధర్మానికి, దానికి ప్రతిరూపమైన వైదిక మతానికి.. ఆ మతంలో భాగమైన శాస్త్రాల అధ్యయన, బోధనలలో నిమగ్నమైన గురుకులాలకు, విద్యా పీఠాలకు.. మతానికి ఆలవాలమైన దేవాలయాలకు.. ధర్మ ప్రచారానికి, మతవ్యాప్తికి, దైవ సేవకు అంకితమైన పుణ్యాత్ముల పోషణకు సకల విధాల తోడ్పడ్డారు. విదేశీ రాకాసులు వచ్చిపడి హిందూ దేశాన్ని శతాబ్దాల పర్యంతం తమ కబంధ హస్తాల్లో చిక్కించుకోసాగిన తరవాత కూడా కృష్ణదేవరాయల వంటి మహారాజులు తిరుమల నుంచి సింహాచలం దాకా తెలుగునాట ఎన్నో ప్రాచీన దేవాలయాలకు వేల ఎకరాల మాన్యాలు, వెలలేని రత్నాభరణాలు, పూజాదికాలకు కైంకర్యాలకు లోటు రాకుండా శాశ్వతమైన ఏర్పాట్లు చేసి తరించారు. ఒక మోస్తరు సంస్థానాలకు మాత్రమే అధిపతి అయి, రాజకీయ ఆర్థిక సమస్యలు ఎన్నో ఉండికూడా అహల్యాబాయి హోల్కర్‌ అనే మహాసాధ్వి.. అన్యమత రాక్షస శక్తులు ధ్వంసం చేసిన సోమనాథ్‌, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించి చరితార్థురాలైంది. దేశమంతటా జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు, ప్రసిద్ధ దేవస్థానాల వైభవానికి, జగద్గురు శంకర పీఠాలకు, పుష్పగిరి, మంత్రాలయం వంటి ఎన్నో మఠాలకు, అనేకానేక మత సంబంధ సంస్థలకు హిందూ రాజులు, చిన్నా పెద్దా సంస్థానాధీశ్వరులు చేసిన దానధర్మాలకు లెక్కలేదు. మతపరమైన కార్యకలాపాలకు, దేవతామూర్తుల ఉత్సవాలకు, ధర్మ కార్యాలకు హిందూ ప్రభువులు ఇచ్చిన భూరి విరాళాలు ఎంత చెప్పినా తరగనివి.

పైన ఉదాహరించిన సహాయాలు, దానధర్మాలు అన్నిటికీ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహారాజులు, మహారాణులు, సంస్థానాధీశ్వరులు తమ ఇంట్లో ఇనప్పెట్టెలోంచి తీసి ఇచ్చారా? లేదు. రాజ్య కోశాగారం నుంచే ఆయా దైవ సేవలకు, ధార్మిక కార్యాలకు ఖర్చు పెట్టారు. ఆ కోశాగారం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పన్నులు, శిస్తులు, రుసుముల రూపేణా ప్రజలు చెల్లించిన సొమ్ము అది.

అనగా - పన్నులు వగైరాల రూపేణా ఖజానాకు జమపడే సొమ్మును అవసరమైన మేరకు మతం కోసం ప్రభువులు ఖర్చు పెట్టటం అనేది మన దేశంలో ఆది నుంచీ ఉన్న ఆనవాయితీ.

ఒక హిందూమతం, ఒక్క హిందూదేశం అనే ఏమిటి? తూర్పు, పడమర తేడా లేకుండా ప్రపంచమంతటా అన్ని కాలాల్లో ఉన్న పద్ధతే ఇది. 17వ శతాబ్దం వరకూ ఐరోపాలో రాజులు క్రైస్తవ మత ప్రచారకులుగా, చర్చి చేతిలో రాజకీయ ఆయుధాలుగా పనిచేసి, ప్రభుత్వ వ్యవస్థనంతటినీ క్రైస్తవ మతానికి ఎలా పాదాక్రాంతం చేశారో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మన దేశంలోనూ ఢిల్లీ సుల్తాన్ల హయాంలో, మొగలాయీల కాలంలో ఇస్లాం ఆధికారిక మతం. నవాబులు, పాదుషాలు ముస్లిం మతవ్యాప్తికి, మసీదుల నిర్మాణానికి, ముస్లిం సంస్థల నిర్వహణకు పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టేవారు. ఇస్లామిక్‌ మత సంస్థలకు, మత ప్రచారకులకు పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చేవారు. కాఫిర్లయిన హిందువులను చంపకుండా వదిలేసినందుకు ప్రతిగా ప్రతి హిందువు తలకూ లెక్కగట్టి జిజియా పన్ను వసూలు చేసేవారు. ముస్లింలు కానివారి మీద ఎడాపెడా పన్నులు బాదేవారు.




సెక్యులరిజం పొద్దుపొడిచి, చర్చి భల్లూకపు పట్టునుంచి ఐరోపా రాజ్యవ్యవస్థ విముక్తమైందని మనవాళ్లు చెప్పిన కాలంలోనూ క్రైస్తవ మతానికి ప్రభుత్వాల నుంచి రకరకాల ప్రోత్సాహకాలు దొరికేవి. ఎక్కడిదాకానో ఎందుకు? భారతదేశం సంగతే చూడండి. క్రైస్తవ మతం దూకుడుకు కాస్తో కూస్తో మూకుతాడు వేసిందని అందరూ భావించే బ్రిటిషు పాలనలోనూ దేశంలో ఎన్నో ఆంగ్లికన్‌ చర్చ్‌లు ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణమయ్యాయి. వాటికీ, కాథలిక్‌, ప్రొటెస్టంట్‌ అన్న తేడా లేకుండా దేశంలోని ఇతర చర్చ్‌ల నిర్వహణకూ బ్రిటిషు ప్రభుత్వం తన ఖజానా నుంచి నిధులు ఇచ్చేది. ఈ వ్యవహారాలు చూడటానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా Ecclesiastical (క్రైస్తవ మత సంబంధమైన) డిపార్టుమెంటు ఒకటి ప్రత్యేకంగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచీ నిరాఘాటంగా సాగుతూ వచ్చిన చర్చి సహాయ కార్యకలాపాల క్రమబద్ధం నిమిత్తం 1927లో The Indian Church Act అనే చట్టం వచ్చింది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రెవిన్యూల నుంచి చర్చిలకు వాటికి సంబంధించిన కార్యకలాపాలకు ప్రభుత్వ గ్రాంటు మంజూరు చేయడానికి అందులో అవకాశం ఇచ్చారు. కలకత్తాలోని బిషప్‌ ఆధ్వర్యంలో, గవర్నర్‌ జనరల్‌ ఆమోదంతో, ఇండియాకు సంబంధించిన బ్రిటిష్‌ విదేశాంగ మంత్రి ప్రమేయంతో ఈ వ్యవహారాలు నడిచేవి. ఇండియా నుంచి తట్టాబట్టా సర్దుకుని ఇంగ్లీషువాళ్లు పోయాక 1948 మార్చిలో Ecclesiastical డిపార్టుమెంటును ఎత్తేశారు.

ఇదీ చరిత్ర. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, ఆంగ్లమానస పుత్రులైన మన మేధావులు నెత్తిన పెట్టుకునే ఇంగ్లీషు దొరలు కూడా ఈ దేశంలో తమ పెత్తనం సాగినంత కాలమూ, పన్నుల రూపంలో ఈ దేశ ప్రజల నుంచి వసూలు చేసిన దానిలో పెద్ద మొత్తాలను తమ క్రైస్తవ మతం అభివృద్ధికి - దానికోసం ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటు పెట్టి మరీ ఖర్చు చేశారు. సెక్యులర్‌ మహామేధావుల దృష్టిలో వంక లేని అభ్యుదయ వాదులైన మహమ్మదీయులు కూడా తమ హయాంలో తమ మతానికి ప్రభుత్వం నుంచి పెద్ద సహాయాలు పొందారు.

మరి - విదేశీ పీడ విరగడై, స్వతంత్ర దేశానికి సొంత రాజ్యాంగం రాసుకునే సందర్భాన న్యాయంగా అయితే ఏమి చేసి ఉండవలసింది? ఇంచుమించు ఏడు శతాబ్దాలు విదేశీమతాల రాజకీయ ప్రాబల్యం కింద నలిగి, నానా విధాల ఆంక్షలతో సతమతమై, ఎన్నో ఒత్తిళ్ళను తట్టుకుని తన ఉనికిని కాపాడుకునేందుకు నానా అవస్థపడిన హిందూమతానికి స్వేచ్ఛగా వర్థిల్లేందుకు ప్రభుత్వపరంగా ఇవ్వగలిగిన తోడ్పాటునంతా ఇవ్వవద్దా? నూటికి 80 మందికి పైగా హిందువులైన దేశంలో పన్నుల రూపేణా వసూలయ్యే మొత్తంలో కొంతమేరకు హిందూమతం శ్రేయస్సుకు, అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టటానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి?

న్యాయంగా అయితే ఉండక్కర్లేదు. దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ మతాల దాష్టీకంలో నానా అగచాట్లు పడి, అన్ని విధాల కుంగిన దేశం మళ్ళీ తెప్పరిల్లాలంటే ఆ దేశానికి ప్రాణం అయిన సనాతన ధర్మం, దానికి ఆలంబనమైన హిందూమతం చల్లగా వర్ధిల్లాలి. దానికి స్వదేశీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి, సర్వవిధాల సహాయపడాలి. హిందూమతం సర్వతోముఖ వికాసానికి ఆర్థిక సమస్య తలెత్తకుండా రాజ్యాంగపరంగా గట్టి కట్టుదిట్టాలు చేయాలి.

- అని మీరు, నేను అనుకోవచ్చు. ఇది స్వతంత్ర భారతానికి ఒక రాజ్యాంగం రాసేందుకు కొలువుదీరిన వారికి ఇలాంటి పాతకాలపు చాదస్తాలు లేవు. హిందూమతం అంటూ ఒకటున్నదనీ, శతాబ్దాలపాటు పడిన బాధల నుంచి కోలుకోవడానికి దానికి రాజ్యం నుంచి తోడ్పాటు అవసరమనీ తలపోసేటంత సంకుచిత మనస్తత్వం వారికి లేదు. వారి ఆరాటమల్లా ఎంతసేపూ మైనారిటీ మతాలమీద! మైనారిటీలకు ఇవ్వటానికి వీలు పడనిది ఏదీ మెజారిటీ మతానికీ అనుమతించకూడదు అన్నదొక్కటే వారికి తెలిసిన సెక్యులర్‌ న్యాయం. ఆ సమవర్తిత్వంతోటే రాజ్యాంగం 27వ అధికరణంలో ప్రశస్తమైన కట్టడి చేశారు. ఇలా :

27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination.

(27. ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రోత్సహించడం కోసం పన్నులు కట్టడానికి సంబంధించిన స్వాతంత్య్రం. ప్రత్యేకంగా ఒక మతాన్ని గాని, మతశాఖను గాని ప్రోత్సహించడానికి లేక పోషించటానికి అయ్యే ఖర్చులను చెల్లించటానికి ఏ రకమైన పన్నుల రాబడిని అయినా నిర్దిష్టంగా ఉపయోగించదలిస్తే - అట్టి పన్నులను చెల్లించాలని ఏ వ్యక్తినీ బలవంత పెట్టకూడదు.)

ఇస్లాం మతాన్నో, క్రైస్తవ మతాన్నో పోషించటానికి ఒక పన్ను వేస్తామంటే మెజారిటీ అయిన హిందువులు ఎలాగూ ఒప్పుకోరు. మెజారిటీ ప్రజలకు ఆమోదయోగ్యంగా అలాంటి పన్ను వేస్తే గీస్తే మెజారిటీ అయిన హిందూమతం మీదే వేయాలి కదా! మెజారిటీ ప్రజలు కోరుకున్నా సరే అలాంటి పన్ను వనరు ఏదీ హిందూమతానికి ఎప్పటికీ అందుబాటులోకి రాకుండా 27వ అధికరణం శాశ్వతంగా తలుపులు మూసింది.

పన్ను అనేది వేస్తే పౌరులందరూ దానిని కట్టి తీరాలి. వారిలో అన్ని మతాలవారూ ఉంటారు. వేరే మతం కోసం ఉపయోగపడేదానిని తాను ఎందుకు చెల్లించాలి అని ఇతర మతాలవారు అభ్యంతరం తెలపటం సహజం. తమ మతం ఒక్కటే సత్యమని, మిగతావన్నీ తప్పుడు మతాలనీ నమ్మేవారు ముమ్మాటికీ దానికి అంగీకరించరు. అంగీకరించాలని వారిని బలవంతపెట్టటం అన్యాయం, దుర్మార్గం. అక్కడివరకూ పేచీ లేదు. ఇష్టపడని వేరే మతం వారి నుంచి ఏ మత పన్నునూ బలవంతంగా వసూలు చేయరాదు. ఒప్పుకుందాం. కాని ఇతర మతస్థులకు కూడా అభ్యంతరం ఉండని సందర్భాల సంగతేమిటి?



మాట వరసకు అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం హిందువుల చిరకాల వాంఛ. దానిపై హిందూ, ముస్లిం వర్గాల మధ్య నడుస్తున్న వ్యాజ్యం సుప్రీంకోర్టులో చివరి దశకు చేరింది. హిందువుల సెంటిమెంటు గాఢతను గుర్తించి మహమ్మదీయులు పెద్ద మనసుతో కాస్త వెనక్కి తగ్గే అవకాశం అత్యల్పంగా అయినా లేకపోలేదు. ఏ పెద్ద మనుషుల మధ్యవర్తిత్వమో ఫలించనూవచ్చు. లేదా సుప్రీంకోర్టు నిర్ణయం అనుకూలంగా రానూవచ్చు. ఇంకేదో అద్భుతం జరిగి రామాలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా సహకరించనూ వచ్చు. ఒకవేళ అలాంటిదేదో జరిగినా - నిర్మాణ వ్యయం నిమిత్తం ఏదైనా కొత్త పన్ను లేక లెవీని అందరి ఏకాభిప్రాయంతో ప్రభుత్వం విధించాలనుకుంటే రాజ్యాంగ 27వ అధికరణం దానిని అనుమతిస్తుందా? నిర్బంధమేమీ లేదు; ఎవరినీ బలవంతపెట్టం. ఐచ్ఛికంగా ఇచ్చేవారి నుంచే వసూలు చేస్తాం అనే పద్ధతిన ఏదైనా పన్నులాంటిది హిందూ మత ప్రయోజనం కోసం విధించగల అవకాశం రాజ్యాంగరీత్యా ఇప్పుడున్నదా?

ఇస్లాం, క్రైస్తవాలు విదేశీ మతాలు. ప్రపంచంలో క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయి. వాటి ప్రభుత్వాల చేతిలో అపార ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇండియా లాంటి దేశాల్లో ఆ మతాల వ్యాప్తికి లక్షల కోట్ల బడ్జెటుతో పనిచేసే మతవ్యవస్థలున్నాయి. జోషువా ఫౌండేషన్లు, ఇస్లామిక్‌ బ్రదర్‌ హుడ్‌లు సరేసరి. ఎన్నో సంపన్న దేశాల, విదేశీ సంస్థల అండ, దండ ఉన్న మతాలకు నిధుల లేమి ఉండదు. అంతర్జాతీయంగా ఏ అండా లేనిది ప్రపంచంలో మూడో పెద్ద మతమైన హైందవానికి! దానికి ఏకైక ఆలంబనం ఇండియా! ఉన్న ఆ ఒక్క హిందూ దేశంలోనూ ప్రభుత్వాదరణ కరువైతే.. పన్నుల రూపేణా జమపడే ప్రజల సొమ్మును ఆ ప్రజల్లో నూటికి 80 మంది ఆచరించే మతం అభివృద్ధికి ఖర్చుపెట్టే వీలు లేకపోతే ఇక హిందూమతం ఎలా బతకాలి? శతాబ్దాల పర్యంతం అన్యమతాల నుంచి ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడేందుకు స్వరాజ్యంలోనూ ప్రభుత్వం చేయూత ఇవ్వకపోతే హిందూమతం ముందుకు ఎలా పోతుంది?

విషాదం ఏమిటంటే మతానికి సాయపడటం ప్రభుత్వ బాధ్యత అని సహస్రాబ్దాలుగా ఈ దేశంలో పాటించబడిన రాజధర్మాన్ని మన్నించాలన్న వివేకం ఆధునిక కాలపు పాలకులకు లేదు. తెలియకపోతే దానిని వారికి తెలియజెప్పాలన్న విజ్ఞత హిందూసమాజానికీ లేదు. అసలైన బాధితులలోనే చలనం లేనప్పుడు ఆ అన్యాయాన్ని సరిచేయటం పాలకులకు, రాజకీయ గోమాయువులకు ఏమి పట్టింది?
1

No comments:

Post a Comment