Wednesday 7 March 2018

కామ్రెడ్ల లబలబ

ఎం.వి.ఆర్.శాస్త్రి

   త్రిపుర లో ఆఫ్టరాల్ ఒక లెనిన్ విగ్రహం కూల్చేసరికే మన సుకుమారపు కామ్రేడ్లు జరగరాని ఘోర దురంతమేదో జరిగినట్టు అంత లబలబలాడుతున్నారేమిటి? 


   ఇంతకీ ఎవరా లెనిన్? అమ్మ చుట్టమా ? అయ్య చుట్టమా ? పావు శతాబ్దం కిందే చచ్చి కమురు కంపు కొడుతున్న కమ్యూనిస్టు మతానికి కొడిగట్టిన ఒక ప్రవక్త . తను పుట్టిన ,ఒకప్పుడు తాను ఏలిన సొంత రష్యా దేశం లోనే ఏనాడో చెత్తకుండీ లోకి గిరవాటు వేయబడ్డ ప్రేతం. సోవియట్ సామ్రాజ్యం లో భాగమైన ఉక్రేన్ లో ఇప్పటికి కొన్ని వందల లెనిన్ విగ్రహాలు మొగం మొత్తిన జనం చేతుల్లో ముక్కలైనాయి.
https://goo.gl/GEWdhv

   అసలైన రష్యా దేశం లోనే లెనిన్ విగ్రహాల కూల్చివేత చాలా  మామూలు అయినప్పుడు త్రిపురలో ఒక విగ్రహం విరిగితే పట్టించుకోవలసిన పని లేదనీ , దాని వల్ల భారత్ -రష్యా సంబంధాలకు  వచ్చిన పుట్టిమునక ఏమీ లేదని సాక్షాత్తూ రష్యన్ దౌత్య అధికారులే చెబుతున్నారట. 


   కమ్యూనిస్ట్ నియంతృత్వపు పాతికేళ్ల పీడ ఇటీవలి ఎన్నికలతో విరగడ అయిందన్న సంబరంలో చిరకాల బాధిత వర్గాలకు చెందిన ఉడుకు నెత్తురు వాళ్ళు తమకు కంటగింపుగా ఉన్న నిలువెత్తు విగ్రహాన్ని పెకలిస్తే అందులో దేశమంతా దృష్టి నిలపాల్సిన విశేషమేమిటి ? ఈ దేశం లో మీడియా నిండా లెఫ్టిస్టులు, మార్క్శిస్టులు పోగయ్యారు కనుక , జాతివ్యతిరేకుల, విదేశీ ఏజెంట్ల ప్రభావం , పెత్తనం మీడియా మీద చాల ఎక్కువగా ఉన్నది కనుకే దీని మీద ఇంతపెద్ద రాద్ధాంతం అయింది . నిజానికి జనాలకు సకారణంగానో , అకారణం గానో ఒళ్ళు మండినప్పుడు , ఆవేశాలు, ఉద్వేగాలు పెచ్చరిల్లినప్పుడు విగ్రహాలు విరగటం అబ్బురమా ? అపూర్వమా ? స్టాలిన్ హయంలో , మావో గారి సాంస్కృతిక విప్లవం ముసుగులో విగ్రహ కూల్చివేత జరగనే లేదా ? తెలంగాణా ఉద్యమ కాలంలో ఏ పాపమెరుగని తెలుగు దిగ్గజాల విగ్రహాలను కూల్చినప్పుడు ఏ కామ్రేడ్లకైనా పట్టిందా ?
http://www.independent.co.uk/news/world/europe/lenin-statues-removed-soviet-union-russia-crimea-ukraine-bolshevik-communist-petro-poroshenko-a7903611.html

   త్రిపురలో రెచ్చి పోయిన గుంపుల చేతిలో ఒక చోట ఒక విగ్రహం కూలితే దానికి నరేంద్ర మోదీ ఏమి చేస్తాడు ? బి.జి.పి. ఏమి చేస్తుంది ? కమ్యూనిస్టుల ఇష్టా రాజ్యానికి వోటర్లు భరతవాక్యం పలికిన తరవాత కూడా కమ్యూనిస్టు కులగురువుల , వారి విదేశీ చిల్లర దేవుళ్ళ విగ్రహాల జోలికి ఎవరూ పోకుండా కాపలా కాసి కంటికి రెప్పలా కాపాడే డ్యూటీ మోదీ , ఆయన పార్టీ , ప్రభుత్వం మీద ఉందా ? ఎక్కడ ఏ బొమ్మ కూలినా వారే చేయించినట్టా?
https://twitter.com/SatyaVijayi/status/971392074829398017

    ఒక లెనిన్ విగ్రహాన్ని కూలగొడితేనే మహా ఘోర మేదో జరిగిపోయినట్టు కామ్రేడ్లు విప్లవ రంకెలు వేస్తున్నారే ? మరి దానికి ప్రతీకారంగా కోల్ కతా కామ్రేడ్లు శ్యామా ప్రసాద్ ముఖర్జీ  విగ్రహాన్ని  కూల్చి పారేశారు కదా ? దానికి మరి ఏచూరి, కారత్ అండ్ కో బాధ్యత తీసుకోవద్దా ? వారి విగ్రహం కూలితే అది నిష్కృతి లేని నేరం , వారి విరోధుల విగ్రహాన్ని వారు కూల్చితేనేమో విప్లవ కార్యం అవుతుందా ? 

   కమ్యూనిస్టు అడ్డ  అయిన పశ్చిమ బెంగాల్ లో వందల ఏళ్ళ నాటి పవిత్ర శివాలయాన్ని కూల్చి పారేసినప్పుడు కామ్రెడ్ల సుకుమారపు సంస్కారం ఏమైంది? 

   ఏడాది కింద దంతేవాడ లో ఈ గణేష్ విగ్రహాన్ని కొండ మీది నుంచి కూల్చివేసినప్పుడు కామ్రెడ్ల విగ్రహ సంస్కారం ఎక్కడికి పోయింది ?



   ఆఫ్టరాల్ ఒక రాతి విగ్రహాన్ని కూల్చితేనే కామ్రేడ్లు ఇంత గగ్గోలు పెడుతున్నారు .. మరి వారి పార్టీ గూండాలు ఈ 20 ఏళ్లలో బి.జె.పి. , ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను ఎంతమందిని ఎంత క్రూరాతిక్రూరంగా, ఎంత పైశాచికంగా పొట్టన పెట్టుకున్నారు? మనుషుల ప్రాణాలను తీయటం విప్లవం .. విగ్రహాన్ని కూల్చటమేమో ఘాతుకం అవుతుందా ? 

విశాల భారత దేశం లో ఒక బుల్లి కేరళ మినహా ఎక్కడా పెత్తనం మిగలకుండా వరసగా ప్రతి రాష్ట్రంలో దేవిడీ మన్నా అయిన కంగారును, అంతో ఇంతో ఉనికి మిగిలిన ఈ దేశం లో కూడా చరిత్ర చెత్తకుండీలో పడుతున్నామన్న గగుర్పాటును కప్పిపుచ్చుకోవటానికి పనికి మాలిన వాదనలు కూడానా ? జనంలో లేని గౌరవాన్ని తమకుతాము ఆపాదించుకోవటానికి పోయి పోయి విప్లవ వీరుడు, జాతీయ వీరుడు అయిన భగత్ సింగ్ పేరు ను అడ్డం పెట్టుకో చూస్తారా?! ఉరి కంబం ఎక్కబోయే ముందు భగత్ సింగ్ లెనిన్ గురించిన పుస్తకం చదివినంతమాత్రాన లెనిన్ ఈ కాలానికి ఆరాధ్యుడు , అపర దేవుడు అయిపోతాడా ? భగత్ సింగ్ ఆ కాలంలో చాలామంది యువకులవలె లెనిన్ ,మార్క్స్ మైకంలో కొంతమేరకు పడ్డ నిజమే. కానీ ఆ చిచ్చర  పిడుగే కనుక ఇంకో నాలుగు కాలాలు బతికి ఉంటే కమ్యూనిస్టు ల దివాలాకోరు రాజకీయాలను, జాతివ్యతిరేక పోకడలను అంటే తీవ్రంగా అసహ్యించుకునే వాడే .

   భగత్ సింగ్ ఒక్క లెనిన్ నే కాదు .విప్లవ వీరుడు వీర సావర్కర్ ను కూడా అభిమానించాడు. హిందూత్వానికి, జాతీయ వాదానికి  పెద్దదిక్కు అయిన లాలా లాజ్ పతిరాయ్ కు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే సాండర్స్ ను హత్య చేసి ఉరికంబం ఎక్కాడు. ఆ సంగతి కామ్రేడ్లు ఒప్పుకుంటారా? 


5 comments:

  1. సరే భగత్ సింగ్ ఉరికంభం ఎక్కే ముందు లెనిన్ గురించి చదివి అభిమానించాడు కాబట్టి మనం అంతా లెనిన్ ని అభిమానించాలి అంటే, గాంధీ చచ్ఛే ముందు హే రామ్ అన్నాడు అని అందరికీ తెలిసిందే, మరి యావద్దేశానికీ శ్రీ రాముడు ఆరధుడవ్వాలి కదా!

    ReplyDelete
  2. భగత్ సింగ్ మావాడు అని బీరాలు పలికే కామీలు, భగత్ సింగ్ కు ఒక్క విగ్రహం అన్నా పెట్టారా! విదేశీ "బాస్" లమీద ఉండే అభిమానం దేశీయ (కనీసం వాళ్ళు కమ్యూనిష్టులు అనుకునే నాయకులైనా సరే) నాయకుల మీద వీళ్ళకు ఉన్నదా? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ కారత్ వర్గం, ఏచూరి వర్గం అని విడిపోయిన పార్టీ పరిపాలనా చేసేది. వాళ్ళల్లో వాళ్లకు యూనిటీ లేదు ఉన్న ఆ బుల్లి పార్టీల్లోనే వంద చీలికలు/పేలికలు.

    ReplyDelete
    Replies
    1. కోదాడలో ఓ విగ్రహం పెట్టారు బాంబుచేతపట్టిన భంగిమతో..

      హేము

      Delete
    2. బొమ్మ అప్లోడ్ చెయ్యండి, చూసి తరిస్తాము. కోదాడ ఐతే వ్యాసకర్త శాస్త్రి గారికి తెలిసే ఉండాలి.

      Delete
  3. విదేశీయుడైన చెగువెరా బొమ్మను మన కుర్రకారు టీ షర్టుల మీద వేసుకుని తిరుగుతారు కానీ, మన విప్లవ వీరులు వీరికి పనికి రారు.

    ReplyDelete