Friday 30 March 2018

ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ

పాత ముచ్చట్లు - 10

ఎం.వి.ఆర్.శాస్త్రి
.......

     అది 1993 డిసెంబర్ 23.  ఉదయం పదిన్నర కావస్తోంది. .  నల్లకుంట లోని మా ఇంట్లో అసెంబ్లీకి వెళ్లటానికి తయారవుతున్నాను. ప్రతిపక్ష నాయకుడు ఎన్.టి.రామారావు గారిని మా ఆంధ్రప్రభ కోసం  ఇంటర్వ్యూ  చెయ్యాలి.

     తొందరలేదు. మా రిపోర్టర్ పొలిశెట్టి అంజయ్య ( ఇప్పుడు 'మన తెలంగాణ ' దినపత్రిక ఎడిటర్ ) తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ( టి.డి.ఎల్.పి. ) ఆఫీసు లో కాచుకుని ఉన్నాడు.  "11-15 కు ఇంటర్వ్యూ అన్నారు సార్! ఆ లోపు మీరు వస్తే సరిపోతుంది " అని పదినిమిషాల కిందటే ఫోన్ చేశాడు.  మా ఇంటి నుంచి అసెంబ్లీ కి  వెళ్లటానికి  ఇరవై నిమిషాలు  చాలు. ఇంకా బోలెడు టైం ఉంది కదా అని తాపీగా ఉన్నాను.

     అంతలో మళ్ళీ ఫోను . అంజయ్య నుంచే . " టైము కి వచ్చేస్తా బ్రదర్ ! ఇంకో పావుగంటలో బయలుదేరతా " అన్నా రిసీవర్ ఎత్తగానే. మా వాడు కాస్త  కంగారుగా ఉన్నాడు. " వెంటనే బయలుదేరండి సార్ ! రామారావుగారు మీ కోసం వెయిట్ చేస్తున్నారు. " అన్నాడు.

 " అదేమిటయ్యా ? 11-15 కి అన్నావుకదా ?"

 " మీరు వచ్చాక చెబుతాను సార్. మీరైతే అర్జెంటుగా వచ్చేయండి "

   హడావిడిగా తయారై   కారెక్కి అదృష్టవశాత్తూ  యాక్సిడెంటు కాకుండా ఆగమేఘాల మీద  అసెంబ్లీ కాంప్లెక్సు చేరేసరికి 11 కావస్తోంది. అంజయ్య గేటు బయటే వెయిట్ చేస్తున్నాడు.

   టి.డి.ఎల్.పి. ఆఫీసు వాళ్ళు మేము వస్తున్నట్టు రామారావుగారికి ముందే చెప్పారట. ఇంటర్వ్యూ 11- 15 కు  ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారట . కానీ పెద్దాయన 10-30 కే బెల్లు కొట్టి " వారిని రమ్మనండి " అన్నారట. అవతలి వారు రావటానికి ఇంకా టైం పడుతుంది అని పెద్దాయనకు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదట. ఇప్పటికే సారు రెండు సార్లు బెల్లు కొట్టి " ఏరీ వారు ? " అన్నారట కోపంగా . దాంతో అంతా మహా టెన్షన్ గా ఉన్నారట. లోపలికి వెళ్ళాలంటే ప్రతివాడూ భయపడుతున్నాడట.

   నేను కనపడగానే ఎన్.టి.ఆర్. గారి పర్సనల్ సిబ్బంది తినేసేలా చూసారు. " సార్  మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారండి ." అన్నాడు సెక్రటరీ నిష్టూరంగా  .

   చెప్పొద్దూ . కాస్తంత భయం వేసింది . అసలే ఎన్.టి.రామారావు. ఆ పైన కోపంగా ఉన్నాడు. పోగానే ఏమంటాడో!  అసలు ఇంటర్వ్యూనే ఇవ్వను పొమ్మంటాడేమో !



   సరే తెగించి , సింహం గుహలోకి అడుగు పెట్టినట్టు లోపలికి వెళ్లాం. ముందు ఫోటోగ్రాఫరు. వెనక అంజయ్య , తరవాత నేను. ఫోటోగ్రాఫరు వెళ్ళీ వెళ్ళగానే కెమెరా క్లిక్ మనిపిస్తూ పనిలో పడ్డాడు. ఎంతయినా షోమాన్ కదా ? కెమెరాను చూడగానే కుదురుగా , ముచ్చటగా పోజు ఇవ్వసాగారు ఎన్టీఆర్ ! బయటవాళ్ళు భయపెట్టినంత భయంకరంగా ఏమీ లేదాయన 'మూడు '.

   పరిచయాలు కాగానే ఆలస్యం చెయ్యకుండా మొదటి  ప్రశ్న వేశాను   :

  " ఏమిటి రామారావుగారూ ! కొత్తగా పెళ్ళయ్యాక మీ గ్లామర్ రోజురోజుకీ తెగ పెరిగిపోతున్నది ! మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా జనం విరగబడి మిమ్మల్ని  నెత్తిన పెట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడే మీకు ప్రజాభిమానం  మరీ ఎక్కువైంది.  ఇంత బ్రహ్మాండమైన ప్రజాదరణను మీరెలా సాధించారండి ? "

  ఎన్టీఆర్ మొగంలో అప్పటిదాకా ఉన్న చిరు చిరాకు కూడా మాయమయింది. ఆయన చాలా ప్రసన్నంగా ఉన్నాడు. కొత్తపెళ్లికొడుకు కొంచెం ముసిముసిగా నవ్వాడు కూడా.
ప్రశాంతంగా సావకాశంగా మాతో సంభాషణ సాగించాడు.

     అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి. ప్రతిపక్షనాయకుడు ఎన్.టి.రామారావు. అసెంబ్లీలో ఏదో గొడవ జరిగి అప్పటికి చాలారోజుల కింద రామారావు, చంద్రబాబులతో సహా మొత్తం తెలుగు దేశం ఎం.ఎల్.ఏ . లందరినీ స్పీకర్ బయటికి పంపారు. దాన్ని అవమానం గా భావించి రామారావు మళ్ళీ అసెంబ్లీ లో అడుగు పెట్టనని శపథం చేశారు.  మిగతా ఎం ఎల్ ఏ లు కొద్దిరోజులతరవాత సభకు వెళ్ళసాగారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షనాయక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామారావుగారు రోజూ ఉదయం వేల తప్పకుండా అసెంబ్లీ కి వెళుతున్నారు. పార్టీ వారితో మాట్లాడతారు. సభలో ఏమి జరుగుతున్నదీ కనిపెట్టి ఎప్పటికప్పుడు తమ లెజిస్లేటర్లకు సూచనలిస్తారు. కానీ సభలోపల కాలు పెట్టరు .

   " ప్రతిపక్షనాయకుడు అలకపాన్పు ఎక్కాడు. సంతకం పెడతాడు కాని సభలోకి రాడు. సభానాయకుడైన ముఖ్యమంత్రికి సభలోకి వచ్చి కూర్చునే తీరిక ఎప్పుడో తప్ప దొరకదు. అగ్రసనాధిపతి స్పీకరు. ఇంగ్లీషులో ఆ మాటకు అర్థం " మాట్లాడేవాడు " అని . అందుకేనేమో మన స్పీకరు (శ్రీపాదరావు ) అందరికంటే ఎక్కువ తానే మాట్లాడుతారు " అని ఆంధ్రప్రభ  ఆదివారం అనుబంధంలో 1994 ఏప్రిల్ 10 న నా "ఉన్నమాట " కాలమ్ లో రాశాను.

  "మీరు సభలోకి ఎందుకు పోరు ? " అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇంటర్వ్యూలో నేను అడిగాను .

 " రమ్మని నన్ను ఎవరు పిలిచారు " అని రామారావు గారి జవాబు.




  మునుపటిమీద ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది. లోగడ పత్రికల వారితో మాట్లాడేటప్పుడు తనకు తోచింది తన ధోరణిలో అనర్గళంగా ఉపన్యసించటమే తప్ప ఎదుటివారు చెప్పేది సాధారణంగా వినేవారుకాదు. మధ్యమధ్య పృచ్చకులు అంతరాయం కలిగించ బోయినా పట్టించుకోకుండా వాక్ప్రవాహాన్ని కొనసాగించే వారు. అలాంటిది ఆయన ఇప్పుడు ఎదుటివారు అనేది వింటున్నారు .ప్రశ్నలకు అవకాశమిస్తున్నారు. అడిగిన ప్రశ్న బోధపడనప్పుడు మళ్ళీ అడిగి ఓపికగా సమాధానమిస్తున్నారు. ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు సహనం కోల్పోకుండా సాధ్యమైనంత తెలివిగా సమాధానం చెపుతున్నారు.

  ముప్పావుగంట సాగిన ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలు తరువాయి భాగంలో.

No comments:

Post a Comment