Wednesday 21 March 2018

జ్యోతిషాన్ని తిట్టటం మూర్ఖత్వం

జ్యోతిషం అంటే అలుసా ? -1 

ఎం.వి.ఆర్.శాస్త్రి

( 2001సెప్టెంబర్ 9 తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో నేను రాసిన వ్యాసమిది. ఈ మధ్య టీవీ  చానెళ్ళలో జ్యోతిషం మూఢత్వం అంటూ  కొందరు మూర్ఖులు తెగ బురద చిమ్ముతున్న నేపథ్యంలో  మిత్రుల కోరిక పై  17 ఏళ్ల కింద నేను రాసిన వ్యాసాలను  మిత్రుల కోరిక పై మళ్ళీ ప్రచురిస్తున్నాను.)  
                                                 

   రాము, సోము అనే వాళ్ళ దగ్గర చెరికాస్త డబ్బు ఉంది. రాము కనుక 30 రూపాయలు సోముకు ఇస్తే - రాము దగ్గర మిగిలే దానికంటే సోము డబ్బు రెట్టింపు అవుతుంది. అదే - సోము కనుక 10 రూపాయలు రాముకు ఇస్తే సోము దగ్గర మిగిలే దానికంటే రాము డబ్బు మూడురెట్లు అవుతుంది. రాము, సోముల దగ్గర మొదట ఉన్నడబ్బు ఎంతెంత?

   ఈ లెక్క స్కూలు కుర్రాడికి ఇస్తే ముందు రాముదగ్గర ఉన్న డబ్బు 'ఎక్స్' - సోము దగ్గర ఉన్నది 'వై' అనుకుందాం - అని మొదలెడతాడు.

   అది చూసి ఏ తిక్క శంకరయ్యయినా ' డబ్బు ఎంతరా అని అడిగితే ఎక్స్ అనుకో, వై అనుకో అంటావేమిటి? అలా ఎందుకనుకోవాలి? డబ్బు ఎక్కడైనా రూపాయలు, పైసల్లో ఉంటుంది కాని - ఎక్స్ లు, వైలలో ఉంటుందా? నాగరికత ఎంతో అభివృద్ధి చెంది, రిజర్వు బ్యాంకులు, కరెన్సీ నోట్లు, రూపాయలను ముద్రకొట్టే ప్రింటింగ్ ప్రెస్సులు కళ్ల ముందు కనపడుతున్నా ఇంకా ఎక్స్ లు , వైలు అని మాట్లాడతావేమిటిరా మూర్ఖుడా?' అని ఎగిరిపడితే మీరు ఫక్కున నవ్వరా? వాడు ఎక్స్ అనుకుంటేనేమి? వై అనుకుంటేనేమి? రాము దగ్గర 62, సోము దగ్గర 34 రూపాయలు ఉన్నాయని ఆన్సరు సరిగా చెప్పాడా లేదా? ఆ ఆన్సరు కనుక్కోవడానికి వాడు దేన్ని ఏమి అనుకుంటే నీకెందుకు' అని శంకరయ్యకు బుద్ది చెప్పరా?

   మరి- ఇదే సూత్రం జ్యోతిషానికి వర్తించదా?!

   ఫలానా విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒకడు జ్యోతిష్కుడిని అడుగుతాడు. అతడేమో గ్రహచక్రం వేసి సూర్యుడు ఆ గడిలో ఉన్నాడు. చంద్రుడు ఈ ఇంట్లో ఉన్నాడు. రాహుదశలో కేతుభుక్తి నడుస్తున్నది కాబట్టి ఫలితం ఇలా ఉంటుంది అని చెబుతాడు. అప్పుడు సైన్సువాసన లేని ఓ సైన్సు శంకరయ్య కలగజేసుకుని - సూర్యుడు గ్రహం కాదు... నక్షత్రం ! చంద్రుడు, భూమికి ఉపగ్రహమే తప్ప గ్రహంకాదు. రాహు, కేతువులనే గ్రహాలు అసలు లేనేలేవు. లేనివాటిని ఉన్నట్టుగా ఊహించుకుని, వాటి సాయంతో ఫలితాలను చెప్పే ఈ విద్య పూర్తిగా మిథ్య! దీన్ని నమ్మడం మూర్ఖత్వం అని తిట్లకు లంకించుకుంటే ఏమనాలి?

   సూర్యుడు గ్రహమైతేనేమి? కాకపోతేనేమి? రాహు కేతువులకు అస్తిత్వం లేకపోతేనేమి? అపార్టుమెంట్లలో ఒకరింట్లో ఒకరు అద్దెకున్నట్లుగా కుజుడింట్లో శని ఉండి అక్కడ నుంచి మూడో నెంబరు ఇంట్లో ఉన్న శుక్రుడినీ పదో ఇంట్లో ఉన్న బుధుడినీ చూడటం నిజమైతేనేమి? కాకపోతేనేమి? అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్టుగా వచ్చినంతవరకూ, వాస్తవానుభవానికి ఫలితం సరిపోయినంత వరకూ ఆ ఫలితాన్ని ఏ లెక్క ప్రకారం చేబితేనేమి? ఆల్జీబ్రాలో 'ఎ' 'బి' 'ఎక్స్' 'వై' అంటూ లెక్కకోసం ఊహించుకున్నట్టే గ్రహాల స్థితి, చూపు వగైరాలనూ జ్యోతిష్కులు ఊహించుకోకూడదా?

   పోనీ జ్యోతిష్కుడికి ఇచ్చే ప్రశ్నకు ఆల్ కరెక్టు సమాధానం పక్కా సైంటిఫిక్ పధ్ధతిలో చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఏ లెక్కాయినా మా పద్ధతిలోనే చేయాలి: ఇదే ఆన్సరును ఇంకో రకంగా రాబట్టటానికి ససేమిరా ఒప్పుకోము - అని దబాయించవచ్చు. అలాంటి సావకాశం మనకుందా?

    లేదు!

   జోస్యాలు చెప్పాల్సిన కర్మ సైన్సుకేమి వచ్చింది అంటారా? జోస్యం సైన్సు తత్వానికే విరుద్ధం అని కోప్పడతారా? నిజమే. " నా పెళ్ళి ఎప్పుడవుతుంది? ఉద్యోగం ఎన్నడొస్తుంది? ఇల్లు కడతానా? " లాంటి వ్యక్తిగత ప్రశ్నలు సైన్సు పరిధిలోకి రావు. రావాలనీ అనుకోకూడదు. కాని - వచ్చే సీజనులో వానలు పడతాయా? ఈ నెలలో తుఫాన్లేమైనా వస్తాయా? బంగాళాఖాతంలో పుట్టిన ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి బీభత్సం సృష్టిస్తుందా? ఫలానా ప్రాంతంలో భూకంపమేదైనా వస్తుందా? ఈ రోగికి పట్టిన జబ్బేమిటి? అది కాన్సరుగా మారుతుందా? ఇదిగో ... ఇలాంటి ప్రశ్నలు మోడరన్ సైన్సుకు చాలా తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా మానవమేధ ఆర్జించిన విజ్ఞానాన్ని మధించి, వందల కోట్ల రూపాయలు విలువచేసే ఇన్సాట్ ఉపగ్రహాల ద్వారా అందే టన్నుల బరువు సమాచారాన్ని విశ్లేషించి, అధునాతన, అతి ఖరీదైన సీస్మోగ్రాఫ్ లాంటి సాధనాలను, అల్ట్రాసోనిక్, అల్ట్రామోడరన్ స్కానింగు హంగులను ఉపయోగించి ఆయా ఫలితాల గురించి సైన్సు 'జ్యోసం' చెబుతూనే ఉంటుంది.

   ఆ జోస్యాలు తరచూ తప్పుతూనే ఉంటాయి.

   అత్యాధునిక శాస్త్రీయ హంగుల సాయంతో వాతావరణ శాస్త్రజ్ఞులు ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముతాయన్న రోజున సూర్యుడు క్షణం రెస్టు లేకుండా డ్యూటీ చేస్తాడు. వాన వస్తుందన్న రోజున రాదు. వేగంగా తీరం దాటుతుందని చెప్పిన వాయుగుండం సముద్రంలోనే తిష్ట వేస్తుంది. లేదా రూటు మార్చుకుని వేరే దిశగా వెళుతుంది. ఒక్కోసారి నోటిసు ఇవ్వకుండానే ఉప్పెన మీద పడుతుంది.

   ఇక భూకంపాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆధునిక విజ్ఞానం ఎన్ని కాంతి సంవత్సరాల వేగంతో దూసుకువెళుతున్నా, శాటిలైట్లు రిమోట్ సెన్సర్లూ కళ్లలో వత్తులు వేసుకుని ఎంతగా కనిపెట్టినా ఫలానా సమయంలో ఫలానా చోట భూకంపం రానున్నదని కచ్చితంగా చెప్పగలగడం మన సైంటిస్టుల చేతకావడంలేదు. తుఫాన్లు, వానల వంటి విషయాల్లో ఒక్కోసారి అంచనాలు తప్పినా, కనీసం అవి రాబోతున్నాయని ముందుగా ఊహించటం వరకూ సైన్సుకు సాధ్యమే. భూకంపాల తాకిడి మాత్రం నేటికి దానికి ఊహకైనా అందడంలేదు. అందుకే - లాతూరు, గుజరాత్ వంటి చోట్ల భయానక భూకంపాలు ప్రళయ భీకరంగా విరుచుకుపడ్డప్పుడు వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు.

   కానీ ... సైన్సు వల్ల కానిది జ్యోతిష్యం వల్ల అవుతుంది. వందల కోట్ల రూపాయల యంత్ర పరికరాల సాయంతో ఒక పూట ముందు కూడా సైంటిస్టులు చెప్పలేని దానిని వంద రూపాయల ఎఫిమెరీల సాయంతో రెండేళ్ళు ముందుగా జ్యోతిష్కులు చెప్పగలరు.

   నమ్మబుద్ది కావడం లేదా?

   1967 డిసెంబర్ మొదటి పక్షంలో కొయినాలో భూకంపం రావచ్చని పూణే జ్యోతిష్కుడు ఎస్.కె.కేల్కర్ 1965 లోనే జ్యోస్యం చెప్పాడు. దివ్యదృష్టితో కాదు; అంజనాలు వేసి కాదు. 1967 అక్టోబర్ 18న పట్టే చంద్రగ్రహణాన్ని బట్టి భూమి తత్వంగల మకరంలో అంగారకుడి ఉనికివల్ల ఫలానా చోట భూకంపం రాగలదని ఆయన శాస్త్ర ప్రకారం లెక్కవేశాడు. ఆయన చెప్పినట్లు సరిగ్గా డిసెంబర్ పూర్వార్థంలోనే 10వ తేదిన 6.5 తీవ్రతతో పెనుభూకంపం కొయినాను కుళ్ళబొడిచింది.

   2001 జనవరిలో గుజరాత్ లో భయంకరమైన ప్రకృ తి వైపరీత్యం రావచ్చని సౌరాష్ట్ర జ్యోతిష్కుడు జయప్రకాశ్ మధాక్ చెప్పిన జోస్యం చాలా పత్రికలలో అచ్చయింది. సరిగ్గా ఆ నెలలోనే పెనుభూకంపం భుజ్ ను నేలమట్టం చేసింది.

   " ప్రకృతి వైపరీత్యం  అంటే భూకంపమే కానక్కరలేదు కదా ? తుఫానూ కావొచ్చు కదా ? సందిగ్ధంగా ఫలితం చెప్పి అది కాస్తా గురికి తగిలాక అదే కచ్చితమైన జోస్యమని దబాయిస్తే ఎలా ? ఆ వచ్చేది ముమ్మాటికీ భూకంపమేనని జ్యోతిష్కుడికి తెలుసా ?  " అని సంశయాత్ములు ఆక్షేపించవచ్చు. కనుక ఇంకొకరి జోస్యాన్ని పరిశీలిద్దాం .

   " The planetary configurations reveal that within about one month from 25 December 2000 some explosions ,fires and violence may be feared . Some calamity like earthquake can not be ruled out ... A strange tragedy is possible on 26 January 2001. It shall take place on the 26 January around 9-25 A.M...."
  ( గ్రహస్థితిని బట్టి చూస్తే 2000 డిసెంబరు 25 నుంచి నెలలోపు కొన్ని పేలుళ్లు, అగ్నిప్రమాదాలు హింసాకాండ సంభవించవచ్చు .భూకంపం లాంటి ఉపద్రవం రాదనీ చెప్పలేము. ఒక విచిత్రమైన విషాదం 2001 జనవరి 26 న జరగవచ్చు. ఆ రోజు ఉదయం 9-25 ప్రాంతంలో అది జరగవచ్చు. ) అని ' బాబాజీ " పత్రిక 2000 డిసెంబరు 14 న , 2001 జనవరి 7న    వెలువడ్డ సంచికలలో రాసింది. కచ్చితంగా వాటిలో పేర్కొన్న రోజున అదే సమయంలో గుజరాత్ ను భూకంపం కబళించింది .

   ఉత్పాతాలు , ఉపద్రవాలకు సంబంధించిన జోస్యాలు పాతికేళ్లలోనో , పదేళ్ళలోనో ఎంతమంది ఎన్ని చెప్పారు ? వాటిలో ఎన్ని నిజమయ్యాయి ? మొత్తం జోస్యాలలో ఫలించినది ఎంత  శాతం ... అని వాదులాడటం మతిమాలిన పని. మాటవరసకు నూరు జోస్యాలలో రెండు మాత్రమె నిజమైనా అక్కడికదే గొప్ప. ఆకార పుష్టి గల శాస్త్రీయ సంస్థలు ఎంత సైంటిఫిక్ గా , ఎంత అత్యాధునికంగా పాటుపడ్డప్పటికీ ఒక్క భూకంపాన్ని కూడా ముందుగా పసికట్టలేనప్పుడు 0 శాతం విజయం రికార్డు కలవారు 2 శాతం వారిని ఆక్షేపించటమంటే చక్కిలాన్ని చూసి జంతిక నవ్వినట్టే ఉంటుంది.

   అదీ కాక ఇక్కడ చెప్పుకుంటున్నది విశేష జననష్టాన్ని , విపరీత ఆస్తి నష్టాన్ని కలగజేసి వందల, వేల కుటుంబాలను వీధిన పడవేయగల భయంకర వైపరీత్యం గురించి ! ఫలానా రోజున ఫలానా చోట అది విరుచుకు పద వచ్చని సూచన మాత్రంగా తెలిపినా , ఆ సమాచారాన్ని సక్రమంగా ఉపయోగించుకుని సాధ్యమైన ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే కనీసం నష్టం తీవ్రతను తగ్గించ వచ్చు .99 జోస్యాలు అబద్దమైతేనేమి  ? కనీసం ఒక్క భూకంపాన్నైనా తేదీ , సమయం, ప్రాంతంతో సహా కచ్చితంగా పోల్చుకోగలిగితే చాలదా? సైన్సుకు సాధ్యం కానిది జ్యోతిషానికి ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస , తెలుసుకోవాల్సిన బాధ్యత వేల  కోట్ల రూపాయల  ప్రజాధనాన్ని వెచ్చించే సైంటిష్టుల మీద లేదా ? ఆ టెక్నిక్ ఏమిటో అర్థం చేసుకుని అందులో తమకి పనికి ఉపకరించేది ఏదైనా ఉంటే దాన్ని స్వీకరిస్తే ఆ మేరకు సైన్సుకూ తద్వారా సమాజానికీ మేలు జరుగుతుంది కదా? సైంటిష్టులకు చిన్నచూపు గల " నాటు జ్యోతిష్కుల " చేతిలోని విద్య విజ్ఞాన ఖనులైన శాస్త్రజ్ఞుల చేతిలో పడి నలిగితే మరింత పదునుదేరుతుంది కదా ?

( ఇంకా ఉంది )


2 comments:

  1. నేను ఒక పోష్టు రాస్తున్నాను దీని గురించే.ఎవరికీ అంత తెలివి లేదనో ఏమో గోగినేని బాబు తను కూడా కొన్న్ని అబద్ధాలు చెప్తున్నాడు.వాటిల్లో ఒకటి రాశులను గురించి గ్రీకులు చెప్పేవరకు మన ప్రాచీనులకి అసలు రాశులు అంటే ఏమిటో తెలియాద్ట!పైన్ అవేదాల్లో లేవు,తర్వాత గ్రీకుల నుంచి నేర్చుకున్నాల్కనే వాటిని తీసుకుని వాదేసుకుంటున్నారు అని దబాయిస్తున్నాడు.నాకు అనుమానం వచ్చి వెతికితే ఱ్గ్వేదం లోనే ఉన్నాయి.దీర్ఘతమసుడు చాలా వివరమైన విశ్లేషనతో అన్ని అర్కాల గణీత్శాస్త్ర నియాలను చెప్పాడు.చారిత్రకంగ అచూస్తే వైదిక కాలం ఎంత్ ముందుకి లాగిన అక్రీ.పూ 15ఊ కన్న ఇవతలికి ఉందటానికి వీల్లేదు.గ్రీకు నాగరికాత్ వాళ్ళు ఝమాయించి చెప్పుకున్న దాన్ని బట్టే క్రీ.పూ 1000 కన్న వెనక్కి జరపటానికి వీల్లేదు.ఏమిటీ విచిత్రం?తెలివి ఉండే మాట్లాడుతున్నాడా!దీనికి తోడు ఎదటివాళ్ళని గద్దించటం "నీకేం తెలుసు?అన్నీ నాకు తెలుసు!" అని.

    ReplyDelete
  2. మూర్ఖులతో మనం ఏమి మాట్లాడినా మనల్నే మూర్ఖులుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. జ్యోతిషం వేదాంగాలలో ఒకటి. ఋగ్వేదం మానవచరిత్రలోనే అత్యంత ప్రాచీన వాజ్మయం అని పాశ్చాత్యులే అంగీకరించారు. అంటే అధమ పక్షం పది వేల సంవత్సరాల పై మాటే. రామాయణం మొత్తం ఖగోళ వర్ణనలతోనే నిండి వుంది. అంత కంటే ఋజువులేమి కావాలి.

    ReplyDelete