Friday 27 July 2018

అయ్యప్ప నిష్ఠ చెడగొట్టే తీరాలా ?

ఉన్నమాట

...... ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.......
[ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వివాదంమీద పన్నెండేళ్ళ కింద(20-8-2006 న) ఆంధ్రభూమి దినపత్రిక మొదటి పేజిలో రాసిన వ్యాసం యథాతథంగా ]
మసీదులలో మగవారితోబాటు ప్రార్థనలకు మహిళలను అనుమతించరు. ఈ సంగతి దేశంలోని ఏ హేతువాదికైనా చెప్పండి. 'ఔనా?' అని అదిరిపడడు. మహిళలు రాజ్యాలేలుతూ రాకెట్లు తోలుతున్న ఈ 21వ శతాబ్దంలో కూడా మహిళలపట్ల ఇంత దారుణమైన దుర్విచక్షణా అని మామూలు బాణిలో బోలెడు షాకైపోడు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వానికి, సమాన హక్కులకు, మత స్వేచ్ఛకు కొంపలంటుకున్నాయని గుండెలు బాదుకుంటూ ఏ రోడ్డుముందూ యాగీ చేయడు. పైగా- ఆ సంగతి చెప్పిన మిమ్మల్నే వింతజంతువును చూసినట్టు ఎగాదిగా చూస్తాడు. ''ఔను, ఐతే ఏమిటట? అది ఎప్పణ్ణించో వస్తున్న వారి మతాచారం. మసీదుకు వెళ్లగోరే స్త్రీలకు విడిగా వేరే ఏర్పాటు ఉంటుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా, ఆఖరికి స్వేచ్ఛ, సమానత్వం ఎక్కువై బాధపడుతున్న అమెరికాలో కూడా మసీదుల్లో మగవారి సరసన ప్రార్థనలు చేసుకోవడానికి మహిళలను అనుమతించరు. ఆడా, మగా భుజాలు రాచుకుంటూ మోకరిల్లితే ప్రార్థనాస్థలంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుందని ఆ కట్టడిచేసి ఉండొచ్చు. అయినా దాని జోలి నీకేల? మహమ్మదీయులకు, ముస్లిం మహిళలకు లేని అభ్యంతరం నీకెందుకు?'' అంటూ క్లాసు తీసుకుంటాడు. శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించడం లేదు అని అదే హేతువాదికి చెప్పండి. 'చాలా దుర్మార్గం' అంటాడు. ఈ లైంగిక వివక్ష స్త్రీజాతికి అవమానం; రాజ్యాంగానికి అపచారం అని ఎగిరెగిరిపడతాడు. ఎప్పణ్ణించో వస్తున్న ఆచారం అయినా సరే ఈ భ్రష్టాచారాన్ని ఇంకేమాత్రమూ కొనసాగనివ్వటానికి వీల్లేదంటూ మీడియా నిండా రాద్ధాంతం చేస్తాడు. దుష్టాచారాన్ని తక్షణం ఆపించి మహిళా సమానత్వానికి, మహిళల ప్రాథమిక హక్కులకు అర్జంటు న్యాయం చేయాల్సిదంటూ కోర్టుకెక్కి పిల్లు (ప్రజాహిత వ్యాజ్యం) మీద పిల్లు వేస్తాడు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని ఏ హిందూ దేవాలయంలోనైనా ఆడా, మగా కలిసే గుడికి వెళతారు. కలిసే పూజలు చేస్తారు. మిగతా సంగతులు ఎలా ఉన్నా ఆలయాల విషయంలో హిందూమతం మహిళలను పెద్దచూపే తప్ప చిన్నచూపు చూడదు. గర్భగుడి మూలవిరాట్టులో మగాయన పక్కనే ఆడామె ఉంటుంది. అమ్మవారి గుళ్లలోనేకాక మగదేవుడి గుడిలోకీ మగవారితో సమానంగా మహిళలకు ప్రవేశం ఉంటుంది. ఒకే ఒక్క గుడిలో తప్ప!
      
      శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలోకి ఆడవారిని రానివ్వనిదీ స్త్రీలంటే ద్వేషంతో కాదు. అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి. దేవుడికే కాదు.. అక్కడికి వెళ్ళే భక్తులకూ బ్రహ్మచర్యం తప్పనిసరి. 41 రోజుల అయ్యప్ప దీక్షకు మాలవేసుకున్న తరవాత కుబేరుడైనా, చక్రవర్తి అయినా కటిక నేలమీద ఆడ వాసన తగలకుండా ఒంటరిగా పడుకోవలసిందే. కఠోర బ్రహ్మచర్య దీక్షకు ముక్తాయింపుగా వేలూ లక్షల భక్తులు కిక్కిరిసి దర్శనం చేసుకునే ఇరుకైన దివ్య సన్నిధిలోకి వయస్సులోని స్త్రీలను అనుమతిస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. అవాంఛనీయ ధోరణులు ప్రకోపించవచ్చు. మామూలు మనుషులకు దేవుడినుంచి ధ్యాసమళ్లి, భక్తిపోయి రక్తి కలిగి, మగరాయుళ్లకు గుబులు పుట్టవచ్చు. అది ఆయా మహిళల క్షేమానికి మంచిది కాదు. 

       పైగా పరువంలోని స్త్రీలను చూడనని వ్రతంపట్టిన స్వామి గర్భగుడిలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లను అతిక్రమిస్తే స్వామికి ఆగ్రహం వస్తుంది. క్షేత్రం పవిత్రత చెడుతుంది. స్థల మహత్మ్యం సన్నగిల్లుతుంది. దివ్యశక్తిని కోల్పోయాక ఆ క్షేత్రానికి వెళ్ళే ప్రయోజనం ఉండదు. నాస్తికుల, హేతువాదుల సరదా షికారుకు విహార కేంద్రంగా మాత్రమే అది పనికొస్తుంది. భక్తిగల పురుషులూ, స్త్రీలూ ఇక అక్కడికి పొమ్మన్నా పోరు.

       ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే శబరిమల దేవస్థానం దైవసన్నిధిలో మహిళల ప్రవేశాన్ని మొదటినుంచీ నిషేధించింది. ఈ నిషేధం కూడా బహిష్టు ప్రాయమైన 10 నుంచి 50 ఏళ్ళలోపు స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. 10 లోపు, 50 పైన వయస్సుగల స్త్రీలను రానివ్వటానికి అభ్యంతరం లేదు. కనుక అయ్యప్ప స్వామిని పక్కా స్త్రీ ద్వేషి అనడానికి వీల్లేదు. ఈ ఆంకక్షూడా ఆ ఒక్క గుడిలోనే. దేశమంతటా, ఊరూరా ఉన్న ఏ అయ్యప్ప గుడిలోకైనా 10-50 వయోవర్గం సహా అన్ని వయస్సుల మహిళలూ నిక్షేపంలా వెళ్లవచ్చు. ఎక్కడాలేని ఆంక్ష ఒక్కచోటే పెట్టారంటే అది ఎందుకు పెట్టారో, తరతరాలుగా వస్తున్న కట్టడిని ఉల్లంఘిస్తే దేవుడికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో, ఏ అనర్థం వాటిల్లుతుందోనని బాధ్యతగల వారు ఆలోచించడం తప్పా? దేశమంతటా లక్షోపలక్షల దేవాలయాల్లో అన్నిటా స్త్రీ పురుషులకు సమాన ప్రవేశం ఉన్నా సరే... ఒక్కచోటే వేరే ట్టుబాటు ఉన్నది కనుక మహిళా హక్కులు మంట కలిశాయంటూ గగ్గోలు పెట్టాలా? ఆ ఒక్కచోట కట్టుబాటును పనిగట్టుకుని చట్టుబండలు చేస్తే తప్ప హేతువాదులు, హక్కులమ్మల కళ్ళు చల్లబడవా?

       అసలు దేవుడు అన్నదే ఒక భావన. ఒక నమ్మకం. దేవసంబంధమైన ప్రతిదీ విశ్వాసానికి సంబంధించిన విషయం. శాస్త్రీయత, అశాస్త్రీయతల చర్చకు, హక్కుల పేచీలకు, సమానత్వపు కబుర్ల రొడ్డకొట్టుడుకు దైవసన్నిధి వేదిక కాదు; సందర్భమూ కాదు. దేవాలయాల వ్యవహారాల్లో ఆచారానికి మాత్రమే ప్రాధాన్యం. ఏది ఆచారం, ఏది నియమం అన్నది సంబంధిత దేవస్థాన యాజమాన్యామే తేల్చాల్సిన విషయం. నచ్చినా, నచ్చకున్నా, వ్యక్తిగత విశ్వాసాలకు, ప్రకటిత విధానాలకు నప్పినా, నప్పకపోయినా అదే అందరికీ శిరోధార్యం.

       అదిగో - ఆ ఉద్దేశంతోటే కేరళ హైకోర్టు శబరిమల క్షేత్రంలో 10-50 మధ్య వయస్సుగల స్త్రీల ప్రవేశాన్ని నిషేధించటం సబబేనని 15 ఏళ్ల కిందటే తేల్చి చెప్పింది. శబరిమల క్షేత్రంలో యాత్రికుల సౌకర్యాల ఏర్పాట్లను సమన్వయం చేయవచ్చుగానీ గర్భాలయంలో అడుగుపెట్టరాదని కె.బి.వలసకుమారి అనే జిల్లా కలెక్టర్‌ను గతంలో న్యాయస్థానం ఆదేశించింది. కేరళలో కమ్యూనిస్టు, కాంగ్రెసు అన్న తేడాలేకుండా ఏ పార్టీ రాజ్యమేలినా అనుస్యూతపు సంప్రదాయాన్ని ఆ విజ్ఞతతోటే రాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తూవచ్చింది. మతాచారాల్లో, మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదన్న వివేకంతోటే ఇప్పుడున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఆలయ సంప్రదాయం విషయాన్ని దేవస్థానం బోర్డు నిర్ణయానికి వదిలేసింది. 10 -50 వయస్సు స్త్రీల ప్రవేశంపై శతాబ్దాలుగా అనుసరిస్తున్న నిషేధం కొనసాగుతుందని స్పష్టీకరించింది.

        ఇందులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. ఇది తప్పు అని అయ్యప్పను ఆరాధించే ఏ భక్తురాలూ అనలేదు. హిందూ స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే ఏ మహిళా సంఘం నోరెత్తలేదు. ఫలానా మతాచారంవల్ల తమ హక్కుకు భంగం కలిగిందా లేదా అన్నది ఆ మతానికి చెందిన ఆ వర్గం వారే కదా చెప్పవలసింది? కందకు లేని దురద కత్తిపీటకెందున్న సామెతలాగా సంప్రదాయిక హిందూ మహిళలకు లేని అభ్యంతరం పనిలేని కొందరు ప్లీడరమ్మలకు పొడుచుకొచ్చింది. వారిలో ఎంతమందికి దైవభక్తి ఉందో తెలియదు. ఆంక్ష ఎత్తేస్తే వారిలో ఎంతమంది శబరిమలను దర్శిస్తారో అంతకంటే తెలియదు. తీరికూర్చుని, అర్థంలేని రాద్ధాంతంచేసి, కేసు పెట్టగానే సర్వోన్నత న్యాయస్థానమే హుటాహుటిన కదిలింది. బకాయిపడి కొండలా పేరుకున్న కేసుల విషయంలో చూపని వేగాన్ని, శ్రద్ధను ఈ సంచలనాత్మక వ్యాజ్యంపై కనపరచింది. నిషేధం గురించి ఏమి చెబుతారని సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చేసరికి స్త్రీలు సైతం ఆలయ ప్రవేశం చేయవచ్చునని సహజంగానే కేరళ ప్రభుత్వం బదులిచ్చింది. సున్నితమైన ఆచార వ్యవహారంలో బాధ్యత గుర్తెరిగి ప్రభుత్వం చూపిన సంయమాన్ని అర్థం చేసుకోకుండా 'గుళ్లోకి ఆడవాళ్లను రానివ్వరా' అని అడిగితే 'రానివ్వము' అని ఏ ప్రభుత్వం మాత్రం ఎలా చెప్పగలదు? 

       లైంగిక వివక్షలా బయటి వారికి కనపడే కట్టుబాట్లు వేరే మతాల్లో లేవా? ఏ దేశంలోనైనా మొనాస్టరీలలోకి మహిళలను రానిస్తారా? క్రైస్తవ సన్యాసినులుండే నన్నరీలలోకి మగవారిని అనుమతిస్తారా? జెస్యూట్లు, బెనెడిక్ట్‌ ఆర్డర్లలో స్త్రీలకు ప్రవేశం ఉంటుందా? లోరెలా ఆర్డరులోకి క్రైస్తవ పురుషులను పోనిస్తారా? క్రైస్తవమతంలో ఒక మహిళ పోప్‌ కాగలదా? కనీసం బిషప్‌ అవుతుందా? హిందువో, ముస్లిమో ఎవరూ చెప్పలేని షిర్డీ సాయిబాబాగారి చావడి గదిలోకి తమను పోనివ్వక పోవటం తమ సమానత్వానికి, రాజ్యాంగ హక్కులకు, విఘాతక మని ఏ స్త్రీలైనా అనుకుంటున్నారా? 

         ఎప్పుడూ ఎక్కడాలేని గొడవ శబరిమలలో ఎందుకు మొలైంది? పత్రికలు, టీవీలు, చానెళ్ల చచ్చుచర్చల్లో పాల్గొనే తెలియని పెద్దనోటిరాయుళ్లు ఊదరపెడుతున్నట్టు ఇదంతా నిజంగా స్త్రీల హక్కులమీద మక్కువతోనేనా? రాద్ధాంతం వెనుక వేరే మతలబు ఉందా?

        దేవుడి పేరు చెప్పి మనుషులు చేసే పనులకు దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకునేందుకు శబరిమలలో అప్పుడప్పుడూ 'దేవప్రశ్నం' నిర్వహిస్తారు. జ్యోతిష సంబంధమైన లెక్కలువేసి, శకునాలను, నిమిత్తాలను గమనించి, ఇతర విధాల దేవుడి మౌనభాషను యథాశక్తిగా అర్ధం చేసుకుని ఆస్థాన దైవజ్ఞులు భక్తులకు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం మొన్నీమధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నిక ష్ణ పణిక్కర్‌ అనే దైవజ్ఞుడు ఆలయ వ్యవహారాలు నడుస్తున్న తీరుపట్ల స్వామి చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కనుక్కొన్నాడు. నీళ్ళు నమలకుండా, మొహమాటం లేకుండా తనకు స్ఫురించింది నిష్కర్షగా చెప్పాడు. ఆ సందర్భంలో బయటపడ్డ అనేక విషయాల్లో నిషిద్ధ స్త్రీల ఆలయ ప్రవేశం ఒకటి. శబరిమలలో అనాచారాలు, పాపాలు పెరిగిపోయాయి. మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారులు, లైంగిక విశ ంఖలత్వాలు పెట్రేగుతున్నాయి. దేవస్థానం అధికారులు, వ్యాపారాలు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడుతున్నారు.  స్వార్ధ ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నారు. సంప్రదాయాలు కట్టుతప్పాయి. నియమానికి విరుద్ధంగా ఒక మహిళ శ్రీకోవిల్‌లో అడుగుపెట్టి స్వామిని తాకింది... అంటూ దైవజ్ఞుడు వరసగా ఏకరవు పెడుతూంటే భక్తులు నివ్వెరపోయారు. 

        అతడు చెప్పేది నిజమనడానికి శకునాలు కూడా కనిపించాయట. ఒక మహిళ గర్భాలయంలోకి ప్రవేశించిందని అంటూండగా దేవప్రశ్నం నడుస్తున్న హాలులోకి ఒక మహిళ అడుగుపెట్టిందట. డబ్బులకోసం పిల్లుల్లా కొట్లాడుకుంటున్నారు అంటుండగా మూడు పిల్లులు అక్కడికి వచ్చి కలబడసాగాయట. దాంతో దేవుడికే ఆగ్రహంవస్తే దేవస్థానం ఏమవుతుంది. ఇక తమగతి ఏమిటి అన్న భయం భక్త జనానికి పట్టుకుంది. దేవప్రశ్నం విశేషాలు బయటికి వచ్చాక దైవాగ్రహానికి ఎక్కడ గురి అవుతానోనన్న హడలుతో జయమాల అనే కన్నడ నటి తాను పందొమ్మిదేళ్లకింద 27 సంవత్సరాల వయస్సులో గర్భగుడిలో ప్రవేశించి స్వామిని తాకినట్టు ఒప్పుకుంటూ దేవస్థానానికి రాసింది. చేసింది తప్పని లెంపలేసుకుందే తప్ప మూలవిరాట్టును తాకటం తన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని ఆమె కూడా అనలేదు. ఆలయ నిబంధనను, హైకోర్టు తీర్పును ఉల్లంఘించి ఆలయంలో ప్రవేశించిన నేరానికి న్యాయంగా అయితే ఆమెను ప్రాసిక్యూట్‌ చేయాలి. తప్పు ఒప్పుకున్నది లెమ్మని దయతలిస్తే, అటువంటి అపరాధం ఇంకెవరూ చేయకుండా గట్టి కట్టుదిట్టాలుచేసి ఊరుకోవాలి. అదీ ఇదీ కాకుండా తప్పుచేసిన మనిషిని నారీ హక్కుల ప్రతినిధిగా, మతఛాందసపు బాధితురాలిగా చూపించి నాలుక భుజాన వేసుకుని లొల్లి చేయటం మన కూహనా లౌకిక మేధావులకే చెల్లింది.

        ఎప్పుడో పందొమ్మిదేళ్లకింద జరిగి, సందర్భవశాత్తూ ఇప్పుడు బయటపడ్డ ఆచారభంగం ఉదంతానికి మితిమించిన ప్రాముఖ్యత ఇవ్వటం దండుగ. దానికంటే తీవ్రమైన విషయాలెన్నో దేవప్రశ్నంలో ప్రస్తావనకు వచ్చాయి. లైంగిక భ్రష్టత్వాల గురించి అందులో చెప్పినట్టే ఆలయం ప్రధాన 'తంత్రి'గారి వ్యభిచారపు విక తలీలలు రచ్చకెక్కాయి. ఇలాంటి భ్రష్టుల పెత్తనాలు, బాధ్యతా యుతస్థానాల్లోని వారి ఆవినీతి, అక్రమాలు, కంట్రాక్టర్లతో లాలూచీలు దేవుడికే ఆగ్రహం తెప్పించాయని తెలిశాక ఆందరూ ద ష్టి కేంద్రీకరించవలసింది- అలాంటి నీచ, నిక ష్ట భ్రష్టాచారాలమీద! వాటి సంగతి వదిలేసి ఇరవైఏళ్ల కిందటి ఘటనకు తగని ప్రాధాన్యమిచ్చి, ఆలయ వ్యవహారాల ప్రక్షాళన తక్షణావసరాన్ని కాస్తా మహిళా హక్కుల రాద్ధాంతంగా మార్చి తిమ్మినిబమ్మి చేయటం ఏ స్వార్ధశక్తుల కొమ్ముగాసేందుకు?

        ఇంకో సంగతి. 'దేవప్రశ్నం'లో దేవుడుకోరినట్టుగా వెల్లడైన ముఖ్య విషయమేమిటంటే భక్తులిచ్చే కానుకల దుర్వినియోగాలను ఆపాలని! వసతులులేక అవస్థపడుతున్న యాత్రికుల అగచాట్లను పట్టించుకోవలసిందని వారికోసం ఆలయ నిధులతో నిత్యాన్నదానానికి ఏర్పాటు చేయాలని! ఆ పని కనుకచేస్తే శబరిమలలోనూ, ఎరుమేలీ, కరిమల, రణ్నీ మార్గాల వెంబడి ఉన్న చాలా హోటళ్లకు వ్యాపారం దెబ్బతింటుంది. ఆ హోటళ్లు నడిపేవారిలో క్రైస్తవులు, ముస్లింలు చాలామంది ఉన్నారు. అలాగే ఆయ్యప్పకు సన్నిహితుడైన వావర్‌ మసీదును శబరిమల దేవస్థానం స్వాధీన పరచుకుని, అక్కడ సాగుతున్న అక్రమాలను అరికట్టాలని 'దేవప్రశ్నం'లో చెప్పింది. ఆది అమలుచేస్తే ఆ మసీదు పెత్తనంవల్ల అనుచిత లబ్ధిపొందుతున్న మోతుబరులకు నష్టం వస్తుంది. తమ ఇష్టారాజ్యానికి ఇబ్బంది లేకుండా చూడటానికే స్వార్ధశక్తులు ఏకమై, సమస్యను పక్కదారి పట్టించి మతాచారానికి మహిళా హక్కులకు నడుమ సంఘర్షణగా పనిగట్టుకుని చిత్రిస్తున్నారా? దుష్టశక్తులు దుర్బుద్ధితో పన్నిన ఉచ్చులో హక్కుల వాచాలురు తమకు తెలియకుండా తలదూర్చారా? కులమతాలకు అతీతంగా కఠోరదీక్షతో అయ్యప్పను సేవించే కోట్లాది భక్తుల సెంటిమెంట్లకు కోర్టులు, ప్రభుత్వాలు కనీసపాటి విలువ ఇవ్వవద్దా? హిందువులంటే అంత చులకనా?


No comments:

Post a Comment