Friday 3 August 2018

మతమార్పిళ్లకు లైసెన్సు

పెక్యులరిజం - 7 ఎం.వి.ఆర్‌.శాస్త్రి

..................

The Indian Church has reason to be glad that the Constitution of the country guarantees her an atmosphere of freedom and equality with other much stronger religious communities. Under this protection of this guarantee she is able, ever since independence, not only to carry on but to increase and develop her activity as never before without serious hindrance or anxiety.

[The Catholic church in India; Yesterday and Today, Felix Alfred Plattner, P.6 ] "ఇండియాలో చర్చ్‌ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే దానికంటే ఎంతో బలమైన మత సముదాయాలతో సమానతనూ, స్వేచ్ఛాయుత వాతావరణాన్నీ భారత రాజ్యాంగం దానికి గ్యారంటీ చేసింది. ఈ రాజ్యాంగ రక్షణ మూలంగా.. స్వాతంత్య్రం తరువాత తన కార్యకలాపాలను పెంచుకుంటూ.. గట్టి ఆటంకం గానీ, ఆందోళన గానీ లేకుండా.. గతంలో ఎన్నడూ లేనంత చక్కగా.. చర్చ్‌ అభివృద్ధి చెందగలుగుతున్నది". 'ఇండియాలో కాథలిక్‌ చర్చ్‌ : నిన్న, నేడు' అనే గ్రంథం 6వ పేజీలో స్వయానా క్రైస్తవ మిషనరీ అయిన ఫెలిక్స్‌ ఆల్‌ఫ్రెడ్‌ ప్లాట్‌నర్‌ 1964లో వెలిబుచ్చిన పరమానందమిది! ఇది వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 1947లో స్వాతంత్య్రం అనబడేది వచ్చేంతవరకూ దేశాన్ని ఏలింది తెల్లవాళ్లు. వారు స్వతహాగా క్రైస్తవులు. క్రైస్తవ మత ప్రచారానికి వీలైన మేరకు తోడ్పడ్డ క్రైస్తవ పక్షపాతులు. ఇండియాలో చర్చ్‌కి స్వర్ణయుగం అనేది ఏదైనా ఉంటే అది బ్రిటిష్‌ పరిపాలన నిరాఘాటంగా సాగిన సుమారు రెండు శతాబ్దాల కాలమే అని సాధారణంగా మనం అనుకుంటాం కదా? మరి ఈ జెస్యూట్‌ మిషనరీ ఇలా అంటున్నాడేమిటి? వెనకటికంటే - అనగా తెల్లవాళ్లు ఏలిన సుదీర్ఘకాలంలో కంటే - స్వాతంత్య్రం వచ్చిన తరవాతే అడ్డూ, బెంగా లేకుండా చర్చ్‌ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని తెగ సంతోషపడుతున్నాడేమిటి? మునుపెన్నడూ లేనంతటి వల్లమాలిన స్వేచ్ఛకు భారత రాజ్యాంగం తమకు గ్యారంటీ ఇచ్చిందన్న అమందానందం అతడికి కలగజేసిన రాజ్యాంగ రక్షణ ఇంతకూ ఏమిటి? విదేశీ మతాలకు అపరిమిత స్వేచ్ఛను, అపూర్వ అవకాశాలను భారత రాజ్యాంగంలో ఒకటీ రెండూ కాదు ఏకంగా ఆరు అధికరణాలు ప్రసాదించాయి. రాజ్యాంగం 3వ విభాగంలో ప్రాథమిక హక్కుల పరిచ్ఛేదంలో 25వ అధికరణం నుంచి 30వ అధికరణం వరకూ మత స్వాతంత్య్రానికీ, మైనారిటీల హక్కులకూ సంబంధించినవి. రాజ్యం దృష్టిలో పౌరులందరూ సమానమని, చట్టాల రక్షణ అందరికీ సమానంగా వర్తిస్తుందనీ 14వ రాజ్యాంగ అధికరణం ఇచ్చిన వరం మతాల విషయంలో మసకబారింది. మనలను ఏలేవారి దృష్టిలో మతాలన్నీ సమానమే కాని విదేశీయ మైనారిటీ మతాలు ఎక్కువ సమానులు! అది కేవలం వారి దృష్టి దోషమే కాదు. మెజారిటీ (హిందూ) మతస్థులను రెండో తరగతి వారిలా, మైనారిటీలనేమో ప్రత్యేక హక్కులు గల ప్రత్యేక తరగతి వారిలా తగని వివక్ష చూపేందుకు భారత రాజ్యాంగమే కావలసినంత వెసులుబాటు కల్పించింది. ఈ సంగతి తేటపడాలంటే మతస్వేచ్ఛ గురించిన రాజ్యాంగ అధికరణాలను ఒకటి తరువాత ఒకటి కాస్త నిశితంగా చూడాలి. మొట్టమొదటిది 25వ అధికరణం.

"Subject to public order, morality and health and to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practise and propagate religion".

(ప్రజా భద్రత, నైతికత ఆరోగ్య విషయాలకు లోబడి - మత స్వాతంత్య్రమూ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకూ సమానంగా ఉండును) అని 25వ అధికరణంలో మొదటి క్లాజు పేర్కొంటుంది. ఈ సందర్భంలో ఒక చారిత్రక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగాన్ని తమ కోసం రాసుకుంటున్నది భారత ప్రజలు. వారిలో నూటికి 80 మందికి పైగా హిందువులు. వారు మతాన్ని ఆచరిస్తారు. ప్రకటిస్తారు. కాని ప్రచారం చేయరు. గట్టిగా మత ప్రచారం చేయాలన్న ధ్యాసగాని, ఇతరులను తమ మతంలోకి చేర్పించాలన్న ఆలోచన గాని హిందూ సమాజానికి ఎన్నడూ లేదు. విదేశీ పీడపోయి, స్వాతంత్య్రం వచ్చాక, కొత్తగా రాసుకుంటున్న రాజ్యాంగంలో మత ప్రచార హక్కును పొందుపరచాలన్న ఊహే ఏ హిందువుకూ - అంటే జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలకు లేదు. ఆ కోరికైతే లేదు గాని అన్యమత ప్రచారాల భయం మాత్రం వారికి జాస్తి. ఎందుకంటే ఐదు శతాబ్దాలకు పైగా సాగిన ముస్లిం పాలనలో ఇస్లాంలోకి బలవంతపు మత మార్పిళ్ల బెడద వల్ల.. దాదాపు రెండు శతాబ్దాలుగా బ్రిటిష్‌ హయాంలో క్రైస్తవ మిషనరీల ముమ్మర మతాంతరీకరణల వల్ల వారు నానా అగచాట్లు పడ్టారు. భయానక చిత్తక్షోభను అనుభవించారు. కనీసం స్వరాజ్యం వచ్చాకైనా విచ్చలవిడి మతాంతరీకరణల పీడ లేకుండా, తమ మానాన తాము నిశ్చింతగా బతికి, తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే సావకాశం ఉంటే చాలు, అదే పదివేలు అన్న భావనతో 80 శాతానికి పైగా ప్రజలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టమే శిరోధార్యం. నూటికి 80 శాతంకి పైగా ప్రజలు మత ప్రచారం హక్కును కోరనప్పుడు ప్రత్యేకంగా ఏరికోరి దాన్ని దేశ రాజ్యాంగంలో పొందుపరచవలసిన అవసరం లేదు. అన్ని మతాలనూ ఆదరిస్తూ, ఎవరు ఏ మతాన్ని వ్యాప్తిచేసినా, ఎవరు ఏ మతంలోకి ఇష్టపడి చేరినా ఏనాడూ అభ్యంతరం తెలపని హిందూదేశంలో తమ మతం మనుగడ గురించి ఏ మతానికి చెందిన వారికీ అనుమానం గాని, భయం గాని ఉండటానికి ఆస్కారమే లేదు. మైనారిటీ మతాల వారికి పనిగట్టుకుని హామీలు, గ్యారంటీలు రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. అందుకే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన డ్రాఫ్టింగ్‌ కమిటీ రూపొందించిన రాజ్యాంగం తొలి ముసాయిదాలో మత ప్రచారం హక్కు ఊసే లేదు. "All citizens are equally entitled to freedom of conscience and to the right freely to profess and practise religion.." (మత స్వాతంత్రానికీ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి, ఆచరించడానికీ పౌరులందరికీ సమాన హక్కు ఉండును...) అదే తొలి ముసాయిదాలో ఉన్నది. Propagate religion (మతాన్ని వ్యాప్తి చేసుకొనే హక్కు) ఆ అధికరణంలో తరవాత వచ్చి చేరింది. All citizens (పౌరులందరికీ) అని ముసాయిదాలో ఉన్న మాట కాస్త తుది ప్రతిలో All persons (అందరు వ్యక్తులకూ) గా మారిపోయింది. దీనికి కారణమేమిటి?
భారత రాజ్యాంగంలో విస్తృత అధ్యయనం చేసిన విఖ్యాత అమెరికన్‌ మేధావి Donald E.Smith తన India as a Secular State గ్రంథంలో చెప్పిందేమిటంటే-
“The insistence from the Christian minority seemed to have largely contributed to the specific inclusion of this right. The Joint Committee of the Catholic Union of India and the All India Council of Indian Christians passed a resolution in October 1945 which (demanded) practice and propagation of religion should be guaranteed, and the change of religion should not involve civil or political disability”.
[Quoted in http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/77961/9/09_chapter%2004.pdf]
       (ఈ హక్కును ప్రత్యేకంగా చేర్చడానికి క్రిష్టియన్‌ మైనారిటీ పట్టుదల విశేష ప్రభావం చూపింది. కాథలిక్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రిస్టియన్స్‌ సంస్థల జాయింట్‌ కమిటీ 1945లో చేసిన తీర్మానం  మత ప్రచార హక్కుకు గ్యారంటీ ఉండాలని, మతమార్పిడి మూలంగా సివిల్‌ లేక రాజకీయ పరమైన అనర్హత కలగరాదని డిమాండు చేసింది.)

       మత ప్రచారాన్ని హక్కుగా ఆమోదిస్తే అది పెద్ద ఎత్తున మతమార్పిళ్లకు దారి తీయవచ్చని రాజ్యాంగ సభలో కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. మోసం చేసో, బలవంతానో, ఒత్తిడి పెట్టో ఎవరిని మతం మార్పించినా, అది చట్టరీత్యా చెల్లకూడదంటూ కె.ఎం.మున్షీ ఒక సవరణ ప్రతిపాదించారు. క్రైస్తవ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్‌ కూడా ప్రతిఘటించడంతో మున్షీ సవరణ వీగిపోయింది.

       భారతదేశం మొదటి నుంచీ బహుళత్వానికి వేదిక. ఒక మతం మాత్రమే గొప్పది; మిగిలినవన్ని చెడ్డవి అన్న సంకుచితత్వం భారతీయులకు ఏనాడూ లేదు. తమ మతంలోని మంచి అంశాలను, దాని ప్రత్యేకతలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. వాటికి ఆకర్షితులై ఎవరైనా వారి మతంలోకి ఐచ్ఛికంగా చేరితే అభ్యంతరం అక్కర్లేదు. ఇతర మతాల ప్రభావం గాని, ప్రచారం గాని ఏ మాత్రం సోకుండా హిందూ సమాజం చుట్టూ దడి కట్టాలని ఎవరూ కోరరు. అదే సమయంలో డబ్బో, మరొకటో ఎరవేసి, తగని ఒత్తిడి తెచ్చి, బలవంత పెట్టి అమాయకులను మతం మార్పించటం దుర్మార్గం. మిషనరీ స్కూళ్లు, కాలేజీలలో విద్యాబోధన నెపంతో.. మిషనరీ ఆస్పత్రులలో ఉచిత వైద్యం ఎరతో క్రైస్తవంలోకి మతమార్పిళ్లు చేయటం లాంటి ఆగడాలు ఈస్టిండియా కంపెనీ కాలం నుంచీ, అసంఖ్యాకంగా జరిగాయి. అన్నన్ని చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టే మత ప్రచారాన్ని హక్కుగా స్థిరపరిస్తే అది విశృంఖల మతాంతరీకరణలకు ఎక్కడ దారితీస్తుందోనని హిందువులు భయపడ్డారు.

       
       మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కల్పించినంత మాత్రాన విశృంఖల మతాంతరీకరణలకు లైసెన్సు ఇచ్చినట్టు కాదు. రాజ్యాంగం రాసిన వారికి, దానిని ఆమోదించిన వారికి ఆ విషయంలో స్పష్టత ఉంది. న్యాయ స్థానాలకూ స్పష్టత ఉంది.

       What article 25(1) grants is not the right to convert another person to one's own religion, but to transmit or spread one's religion by an exposition of its tenets.. What is freedom for one is freedom for the other, in equal measure, and there can be no such thing as a fundamental right to convert any person to one's own religion.
       (25 (1) అధికరణం ప్రసాదించింది తన మత సూత్రాలను వివరించి, తన మతాన్ని వ్యాప్తి చేసుకొనే హక్కును మాత్రమే. వేరొక వ్యక్తిని తన మతంలోకి మార్పించే హక్కును కాదు... ఒకరికి ఉన్న స్వేచ్ఛ వేరొకరికి కూడా సమానంగా ఉంటుంది. ఏ వ్యక్తినీ తన మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు అంటూ ఏదీ లేదు.)

-అని Rev.Stainslaus Vs. State of Madhya Pradesh కేసులో సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. చిత్రమేమిటంటే, ఈ చిన్న కామన్‌సెన్స్‌ పాయింటే 'పెక్యులరిజం' ప్రవక్త జవహర్లాల్‌ నెహ్రూగారి పెద్ద బుర్రకు ఎక్కలేదు.

        We permit, by our constitution, not only freedom of conscience but also proselytism" (కేవలం మత స్వాతంత్య్రాన్నే కాదు; మత మార్పిడిని కూడా మనం మన రాజ్యాంగం ద్వారా అనుమతిస్తాం) అని 1952 అక్టోబరు 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ రాసిన గొప్ప లేఖలో తొలి భారత ప్రధాని నెహ్రూగారు పచ్చి అబద్ధమాడారు.

       విదేశీ మిషనరీలు, స్వదేశీ మిషనరీలు యథేచ్ఛగా క్రైస్తవమతం వ్యాప్తి చేస్తూ, క్రైస్తవంలోకి మత మార్పిళ్లు చేసుకుపోవడానికి అన్ని విధాల సహకరించమంటూ అందులో ముఖ్యమంత్రులను ఆదేశించారు.

       బ్రిటిషు పరిపాలన సాగినంత కాలమూ క్రైస్తవ మత వ్యాప్తి మీద, మిషనరీల మత మార్పిడి కార్యకలాపాల మీద తగు మాత్రం ఆంక్షలు ఉండేవి. విదేశాల నుంచి మిషనరీలు వచ్చిపడి, విదేశీ నిధులు ధారాళంగా విరజిమ్మి, జనాలను టోకున క్రైస్తవంలోకి అడ్డగోలుగా మార్పించడానికి బ్రిటిష్‌ ఇండియాలో అంతగా వీలు ఉండేది కాదు. తెల్లవాళ్లు పోయి, స్వదేశీ మారాజులు వచ్చి కూచున్నాక ఆపాటి అదుపూ మృగ్యమైంది. మత స్వాతంత్య్రం ''పౌరులకు'' మాత్రమే కాక దేశంలోని 'అందరు వ్యక్తులకూ' ఉంటుందని రాజ్యాంగం 25(1) అధికరణం చేత చెప్పించడంతో దేశంలోకి వచ్చిపడ్డ విదేశీ మిషనరీలకు ఆడింది ఆట అయింది. మత మార్పిడి రాజ్యాంగ హక్కు అని ఏకంగా దేశ ప్రధానమంత్రే డబాయించి, ఫారిన్‌ మిషనరీల కొమ్ము కాయడం కంటే క్రైస్తవ పెద్దలకు జాక్‌పాట్‌ ఏమి కావాలి? రాజ్యాంగ రక్షణ పుణ్యమా అని మన పంట భలే పండింది అని మిషనరీలు మురిసిపోయారంటే ఆశ్చర్యం ఏముంది?

No comments:

Post a Comment