Thursday 30 August 2018

నటరాజస్వామి చూపిన దారి

పెక్యులరిజం-11
- ఎం.వి.ఆర్‌.శాస్త్రి

.....................


ఉండుండి ఎక్కడో దేవుడు వెలుస్తాడు. లేక వెలవాలనుకుంటాడు. ఒక పుణ్యాత్ముడికి బుద్ధి పుడుతుంది. ఇంకొందరు ధర్మాత్ములు సాయం పడతారు. గుడి ఏర్పడుతుంది. భక్తులూ, దాతల సౌజన్యంతో అభివృద్ధి చెందుతుంది. కాస్త పేరు, ప్రఖ్యాతి రాగానే సర్కారు వారి వంకరచూపు పడుతుంది. గుడిని ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ లాగేసుకుంటుంది.

ముందు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు వస్తాడు. వచ్చీ రాగానే హుండీ పెడతాడు. ప్రతి పూజకు, ప్రతి సేవకు, ఆఖరికి దైవ దర్శనానికి కూడా టిక్కెట్లు పెడతాడు. వాటి లెక్కలు చూడటానికి, పూజారులు కానుకల్ని కాజెయ్యకుండా కనిపెట్టటానికి మందీ మార్బలం! వాటి అజమాయిషీకి ఆఫీసులు, వాహనాలు, ఇంకా ఇంకా ! భక్తుల నుంచి వచ్చే రాబడిలో సింహభాగం అధికార యంత్రాంగాన్ని మేపడానికి చెల్లు! అసలు అవినీతి, అక్రమాలు అప్పుడే మొదలు! పార్టీ రాజకీయాలు, హైలెవల్‌ దందాలు మొదలయ్యాక ఘరానా దొంగల భుక్తికే తప్ప భక్తికి చోటుండదు.

రాజ్యాంగం ప్రభుత్వాలకు సందు ఇచ్చింది మత సంస్థల్లో, వాటి ఆస్తుల అజమాయిషీలో ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దేందుకు శాసనపరంగా తగుమాత్రం చర్యలను తీసుకోవటానికి! కాని ఇప్పుడు ఏ తప్పు జరగకముందే ప్రభుత్వాలు గుళ్లమీద పడుతున్నాయి. అవసరం ఉందా లేదా అన్నది కానకుండా కంటికి నదరుగా కనిపించే అన్ని గుళ్లలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లను నియమించి, శాశ్వత ప్రాతిపదికన కర్ర పెత్తనం చేస్తున్నాయి.

ఇది తప్పు; రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు నాలుగేళ్ల కింద చిదంబరం నటరాజాలయానికి సంబంధించిన కేసులో మొగం వాచేట్టు చివాట్లు పెట్టింది- ఇదిగో ఇలా :

“Even if the management of a temple is taken over to remedy the evil, the management must be handed over to the person concerned immediately after the evil stands remedied. Continuation thereafter would tantamount to usurpation of their property rights or violation of the fundamental rights guaranteed by the constitution in favour of the persons deprived. Therefore, taking over the management in such circumstances must be for a limited period”.

(ఒక చెడుగును సరిచేయటం కోసం ఒక దేవాలయ యాజమాన్యాన్ని (ప్రభుత్వం) టేకోవర్‌ చేసినప్పటికీ - ఆ చెడుగును పరిహరించే పని కాగానే యాజమాన్యాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పగించాలి. ఆ తరువాత కూడా ప్రభుత్వ యాజమాన్యాన్ని కొనసాగించడమంటే పదవి నుంచి తొలగించబడిన వారికి రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను భంగపరచి, వారి ఆస్తి హక్కులను హరించడమే అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం యాజమాన్యాన్ని చేపట్టటమనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి.)

ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు తమకు హిందూ దేవాలయాలు హక్కుభుక్తం అనుకుంటున్నాయి. తమ ఇలాకాలోని దేవస్థానాలన్నిటినీ సొంత ఆస్తులుగా పరిగణించి ఇష్టానుసారం పాలించడానికి రాజ్యాంగం తమకు గుండుగుత్త అధికారమేదో ఇచ్చినట్టు తెగ ఫీలైపోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని తీరవలసిన అవసరం ఉన్నదా లేదా అన్న విచక్షణ లేకుండా.. చక్కగా నడుస్తున్న గుళ్లతో సహా తగు మాత్రం ఆదాయం వచ్చే అన్ని దేవాలయాలనూ ఒకే ఒక చట్టంతో టోకున టేకోవర్‌ చేసి, ప్రతి గుడికీ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును నియమించి, గవర్నమెంటు  శాశ్వతంగా పెత్తనం చలాయిస్తున్నది.

అరవై డెబ్భై ఏళ్లుగా సాగుతున్న ఈ సర్కారీ జులుం అక్రమం, దుర్మార్గం అని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయింది. తీవ్రమైన తప్పిదం ఏదో జరిగిన సందర్భంలో ఒక ఆలయాన్ని ప్రభుత్వం టేకోవర్‌ చేసినా, ఆ తప్పును సరిదిద్దే పని పూర్తి కాగానే ఆలయాన్ని దాని హక్కుదారులకు తిరిగి ఒప్పగించాలి; ప్రభుత్వ కంట్రోలు అనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది! అంటే- సరిదిద్దాల్సిన తప్పు ఏదీ లేని, సవ్యంగా నడుస్తున్న దేవాలయాలను స్వాధీన పరచుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పినట్టే కదా? ప్రభుత్వ పెత్తనం అనేది కొద్ది కాలానికి మాత్రమే పరిమితం కావాలి; ఎల్లకాలం దాన్ని కొనసాగించడమంటే ఆలయ హక్కు దారులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును భంగపరచడమే అని సర్వోన్నత న్యాయస్థానం కరాఖండిగా ప్రకటించింది. దీన్ని బట్టి - ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో దేవాలయాలపై నిరవధికంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనం రాజ్యాంగ విరుద్ధం; ప్రాథమిక హక్కులకు విఘాతం - అని తేలిపోలేదా ?

చిదంబరంలోని దీక్షితార్ల దీక్ష, దక్షత చూసి మొత్తం హిందూ సమాజం గర్వపడాలి. సుప్రసిద్ధ నటరాజాలయాన్ని సర్కారీ గద్దల బారి నుంచి రక్షించటానికి వారు బ్రిటిషు పాలన కాలం నుంచే అలుపు లేకుండా పోరాడుతున్నారు. 1951లో మద్రాసు హిందూ రిలిజియస్‌ & చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ చట్టం తెచ్చిన వెంటనే చిదంబరం ఆలయానికీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును వేశారు. దీక్షితార్లు మద్రాసు హైకోర్టుకు వెళ్లి ఆ ఆర్డరు రద్దు చేయించారు. చారిత్రాత్మకమైన శిరూర్‌ మఠం కేసులో సుప్రీంకోర్టు ముక్కచివాట్లు పెట్టాక ఉన్న చట్టాన్ని ఎత్తివేసి ప్రభుత్వం 1959లో కొత్త ఎండోమెంట్స్‌ చట్టాన్ని తెచ్చింది. దానికింద 1987లో మళ్లీ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును నియమించారు.

దీక్షితార్లు మళ్లీ కోర్టుకెక్కారు. హైకోర్టు స్టే అయితే ఇచ్చింది. కానీ పదేళ్ల తరువాత కేసు కొట్టేసింది. చెప్పాల్సింది ప్రభుత్వానికి చెప్పుకుని అక్కడ న్యాయం జరగకపోతే మా దగ్గరికి రావాలని తుది తీర్పులో చెప్పింది. దీక్షితార్లు ఆ ప్రకారమే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. న్యాయం జరగలేదు. దీక్షితార్లు ఇంకోసారి హైకోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టు సింగిల్‌ జడ్జి వారి రిట్‌ను కొట్టేశారు.

2009 ఫిబ్రవరి 2న హైకోర్టు తీర్పు వెలువడింది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అధికార గణానికి ముందే ఉప్పందింది. మధ్యాహ్నానికల్లా అధికారులు గుడి దగ్గర కాచుకుని ఉన్నారు. తీర్పు ప్రకటించిన వెంటనే లోపలికి చొరబడ్డారు. ముందు హుండీలు పెట్టారు. ఆ వెనుక ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు ప్రవేశించాడు. గుడి ప్రాంగణం లోపల, బయట మారేజీ హాళ్లు, వాణిజ్య కేంద్రాలు నెలకొల్పి సర్కారు వారు షరామామూలుగా పక్కా వ్యాపారం మొదలెట్టారు. ఆలయాన్ని టూరిస్టు కేంద్రంగా ఆకర్షణీయం చేయడానికి ప్లాన్లు వేశారు. మతం, ఆచారం, భక్తి అడుగున పడ్డాయి.

ఆ స్థితిలో దిక్కుతోచని దీక్షితార్లకు అదృష్టవశాత్తు ధర్మవీరుడు సుబ్రహ్మణ్య స్వామి తోడు దొరికింది. ఆయన వారితో కలిసి హైకోర్టుకు అపీలు చేశాడు. కేసు పోయింది. పట్టువదలని స్వామి సుప్రీంకోర్టు గడప తొక్కాడు. అదిగో ఆ అపీలు మీదే 2014 జనవరి 6న జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేలతో కూడిన డివిజన్‌ బెంచి పైన ఉటంకించిన చరిత్రాత్మక తీర్పును ప్రకటించింది.

ప్రత్యేక మతశాఖ (రిలిజియస్‌ డినామినేషను)కు చెందిన తాము 1500 సంవత్సరాలకు పైగా ఏ వంక లేకుండా నడుపుకుంటున్న నటరాజాలయాన్ని ఇష్టానుసారం హస్తగతం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు అన్న స్మార్త బ్రాహ్మణ దీక్షితార్ల వాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. దీనివల్ల ఒక్క చిదంబరం గుడికే కాక మొత్తం హిందూ ఆలయ వ్యవస్థకు గొప్ప మేలు జరిగింది. వ్యాజ్యం ఒక రిలిజియస్‌ డినామినేషన్‌కు సంబంధించినది అయినా దేవాలయాలను స్వాధీన పరచుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న హద్దులు, జోక్యం చేసుకోవలసిన సందర్భాలు, ఆ జోక్యానికి కాలపరిమితుల గురించి సర్వోన్నత న్యాయస్థానం చేసిన న్యాయ నిర్ణయం ప్రభుత్వ గ్రహణం పట్టిన అన్ని దేవాలయాలకు సరిపోతుంది.

“Power under the Act for appointment of an Executive officer could not have been exercised in the absence of any prescription of circumstances/conditions in which such an appointment maybe made. Even otherwise, the order in which no period of its operation is prescribed, is not substainable being ex facie arbitrary, illegal and unjust”.

(''ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరును ఏ పరిస్థితుల్లో నియమించవలసిన వచ్చిందన్నది నిర్దేశించకుండా ఇ.ఒ. నియామకం చేయడానికి చట్టప్రకారం వీలులేదు. అదీగాక నియామకం ఎంతవరకు అన్న కాలపరిమితి నిర్దేశించబడని ఉత్తర్వు నిరంకుశం, చట్టవిరుద్ధం , అన్యాయం''.)

- అని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు చేసిన ధర్మ నిర్ణయం మిగతా రాష్ట్రాల్లోని దేవాలయాలకూ సహజంగా అన్వయిస్తుంది. హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌ (హెచ్‌.ఆర్‌. & .సి.ఇ.) చట్టం ఒకటి చేసి, దాని ద్వారా ఏ గుడిని పడితే ఆ గుడిని తలచిందే తడవుగా గవర్నమెంటు పులుసులో కలిపేయటం, మామూలు గవర్నమెంటు డిపార్టుమెంట్లలో చేసినట్టు ఆలయాలకు కూడా ఇ.ఒ.లను రొటీన్‌గా అపాయింటు చేయటం నిరంకుశం, చట్టవిరుద్ధం అని ఇప్పుడు విస్పష్టంగా తేలిపోయింది. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో వేలాది దేవాలయాల్లో ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్న ఇ.ఒ.ల నియామకం చట్టరీత్యా చెల్లదని సాధికారికంగా ధ్రువపడింది. బలమైన కారణం ఉంటేనే, అదీ కేవలం కొద్ది కాలానికి మాత్రమే కార్యనిర్వహణ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు విడమర్చి చెప్పాక మొత్తంగా ఆలయ వ్యవస్థ మీద ప్రభుత్వ నడమంత్రపు పెత్తనానికి అడుగు ఊడిపోయింది.గుళ్లమీద అయినదానికీ కానిదానికీ ఎండోమెంట్స్‌ డిపార్టుమెంటు అత్తరికానికి ఆస్కారం పోయింది. ఆయా గుడుల అసలు హక్కుదారులను పక్కకు నెట్టి రాజకీయ జీవులు, అయోగ్యులు, అప్రాచ్యులు ధర్మకర్తల బోర్డులలో చేరి చేస్తున్న ఆగడాలకు ఇది ఆటకట్టు.



ఏ రకంగా చూసినా ఇది హిందూ సమాజానికి దిగ్విజయం. కాని ఒక కల కనగానే తెల్లవారిపోదు. చిదంబరం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గొప్ప తీర్పుతోటే హైందవ దేవాలయాలకు రాజకీయ తిప్పలు తీరవు. కారణం చూపకుండా, కాలపరిమితి చెప్పకుండా ప్రభుత్వం ఆలయాలను స్వాధీనం చేసుకోవటం తప్పు అని సుప్రీంకోర్టు అనగానే రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని అక్రమ కబ్జాలు మానుతాయన్న ఆశలేదు. సుప్రీంకోర్టు ప్రకటించిన న్యాయసూత్రం ఆటోమేటిగ్గా అన్ని దేవాలయాల్లో వెంటనే అమల్లోకి రాదు. ఆ పని జరగాలంటే మళ్లీ సుప్రీంకోర్టునే ఆశ్రయించాలి. చిదంబరం కేసులో తమరు చేసిన న్యాయనిర్ణయం అన్ని రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో అన్ని రకాల ప్రభుత్వ జోక్యాలకూ వర్తించేవిధంగా ఉత్తర్వు చేయమంటూ ఇంకో వ్యాజ్యం వేయాలి.

ఆ పని ఇప్పటికే మొదలైంది. పూజ్య దయానంద సరస్వతి స్వామి పూనికతో, సుబ్రహ్మణ్యస్వామి చొరవతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల ఎండోమెంట్స్‌ చట్టాలను సవాలు చేస్తూ గట్టికేసు సుప్రీంకోర్టులో చాలా కాలం కిందటే పడింది.కాని అది ఎప్పటికి తెములుతుందో ఎవరికీ తెలియదు. పూజ్య దయానంద సరస్వతి స్వామి ఈవరకే స్వర్గస్థులయ్యారు. 2016లోనే తుది తీర్పు వెలువడుతుందనుకున్నారు. వేగంలో నత్తకు మేనత్త అయిన మన న్యాయవ్యవస్థలో ఏ కేసుకు ఎప్పుడు మోక్షం వస్తుందో దేవుడికెరుక.

నిజానికి అసలు లోపం న్యాయ విధానంలో కాదు - మన ఆలోచనా విధానంలోనే ఉంది. ఎంతసేపటికీ ఏ సుబ్రహ్మణ్యస్వామో కాళ్లరిగేట్టు కోర్టుల చుట్టూ తిరిగి కార్యం సాధించాలనే మనం అనుకుంటాం. అంతేగాని ఇందులో మనం చేయవలసింది, చేయగలిగింది ఏముంది అని ఆలోచించం. ఎనభయ్యేళ్లు దాటినా పాపం సుబ్రహ్మణ్య స్వామి రేయింబవళ్లు ఎన్నో ప్రజా సమస్యలపై కొట్లాడుతూనే ఉన్నాడు. కాని మన వరకు మనం ఏమి చేస్తున్నాం? తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో దేవాలయాలపై సర్కారీ దాదాగిరీ రాజ్యాంగ విరుద్ధమని స్వయానా సుప్రీంకోర్టే ధ్రువీకరించాకయినా ఆ దాదాగిరీని అంతమొందించి తీరాలని హిందూ సమాజం కదిలిందా? చిదంబరం తీర్పు వచ్చి నాలుగున్నరేళ్లు దాటినా అక్రమ పెత్తనాన్ని కిమ్మనక భరిస్తున్నామే తప్ప.. ప్రభుత్వం మీద, దాన్ని నడిపే పార్టీల మీద గట్టి ఒత్తిడి తెచ్చి, గుళ్లకు రాజకీయ గ్రహణం తప్పించేందుకు కనీసం ఒక గట్టి ప్రయత్నం జరిగిందా?

మరికొన్ని నెలల్లో దేశమంతటా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అధికారం అపేక్షించే ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను ప్రసన్నం చేసుకుని, ఓట్ల అక్కర తీర్చుకోవడానికి ఆపసోపాలు పడుతుంటుంది. అడిగిన వారికి లేదనకుండా ఆపద మొక్కులు మొక్కుతుంటుంది. ఓటర్లలో ముప్పాతిక భాగానికి పైగా హిందువులు. ఆ హిందువులందరూ తమ గుళ్లపై గవర్నమెంటు జులుం పోవాలనుకుంటున్నారు అని అర్థమైతే ఏ పార్టీ అయినా దారికొచ్చి 'సరే' అనదా? ఓటు వంటి వజ్రాయుధం చేతిలో ఉండికూడా వాడుకోవటం చేతగానివాళ్లను ఏ పార్టీ లెక్క చేస్తుంది? ఏ కోర్టు ఆదుకుంటుంది?

No comments:

Post a Comment