Thursday 10 September 2020

ఆటకెక్కిన ఆందోళన

 ఎం.వి.ఆర్.శాస్త్రి

....................................

    మన వాళ్లకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ .

    అంతర్వేది రథాన్ని తగలబెట్టిన కేసును సి.బి.ఐ. కి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయించారన్న వార్త చూసీ చూడగానే హిందూ ప్రముఖులు కొంతమంది ఆనందబాష్పాలు జలజల రాల్చారు. సాక్షాత్తూ అంతర్వేది శ్రీనరసింహస్వామే భక్తులను అనుగ్రహించి , సిబిఐ దర్యాప్తు వేయించినట్టు మరికొంతమంది ఓవరైపోయారు. కొద్దిరోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న హైందవ ప్రతిఘటన ఉద్యమానికి ఇది అద్భుత విజయమైనట్టు ఇంకొందరు సంబరపడ్డారు. మొత్తానికి – జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందువుల ధర్మాగ్రహానికి తలవంచి తోకముడిచిందని అందరూ తేల్చారు. ఇక ఆందోళనతో పనిలేదని తలచి, ఉద్యమాన్ని జమ్మి చెట్టు ఎక్కించి మళ్ళీ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు పడుతున్నారు.

    సర్కారు వారికి కావలసింది కూడా సరిగ్గా ఇదే. అర్జెంటుగా సిబిఐ పాత్రని రంగంలోకి దించింది హిందూ సమాజపు రౌద్రాన్ని శాంతింపచేసి గండంనుంచి బయటపడెందుకే ! సిబిఐ వచ్చి ఊడబొడిచేది ఏమీ లేదు ; తమకు ఇబ్బంది ఏమీ ఉండదు -అని ఏలిన వారికి తెలుసు. ఎటొచ్చీ మన జనాలకే ఆ సంగతి తెలియదు.

    ఉన్నత న్యాయ స్థానాలు  పట్టుబట్టి వెంటపడిన బహుకొద్ది సందర్భాల్లో తప్ప , ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకు పెట్టగల కేసులో సిబిఐ స్వతంత్రంగా కదలి , సమర్థంగా పనిచేసిన దృష్టాంతం దాని చరిత్రలో ఒక్కటీ లేదు. ఆ పేరు గొప్ప కేంద్ర దర్యాప్తు సంస్థకు అధిపతిగా పనిచేసిన అధికారే అనంతరకాలంలో ఒప్పుకున్నట్టు సిబిఐ అనేది పంజరంలో చిలుక ! కేంద్ర ప్రభువులు కరవమన్న వారిని కరవటం , వదలమన్నవారిని వదలటం , అరవమన్న వారిమీద అరవటం దాని నైజం. ఇది అనేక సందర్భాల్లో ఉన్నత , సర్వోన్నత న్యాయస్థానాలే చివాట్లు పెట్టి మరీ చెప్పిన నిజం.

    అప్పట్లో సెంటర్లో రాజ్యమేలిన ఇటాలియన్ మాత ఉసికొలిపినప్పుడు ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో సిబిఐ వెంటాడి వేటాడి దుంప తెంచింది . తరవాత సెంటర్ బాసులు దూకుడు తగ్గించమన్నప్పుడు తగ్గించింది.  ఇప్పుడు అంతర్వేది రథం కేసులో కూడా కేంద్రప్రభువులు పిసరంత సంకేతం అందిస్తే చాలు సిబిఐ చెలరేగి సూపర్ స్పీడుతో తడాఖా చూపించగలదు. కానీ ఆంధ్ర రాజకీయాల్లో కొన్నాళ్ళుగా సాగుతున్న చాటుమాటు  సరాగాలను,  బిజెపి ప్రముఖులనబడే కొందరి విచిత్ర విన్యాసాలను, వింత వైఖరులను గమనిస్తే ఈ విషయంలో ఆశ కంటే అనుమానానికే ఆస్కారం ఎక్కువ. రాష్ట్ర రాజధానిని ఎప్పుడైనా ఎన్ని చోట్లకైనా టూరింగు టాకీసులా తరలించ వచ్చునన్న జగన్ సర్కారు వాదనకు తాజాగా సుప్రీం కోర్టులో భారత ప్రభుత్వం వారు పలికిన వత్తాసును గమనించాక కూడా భ్రమలు వదలనివారి కళ్ళను భగవంతుడు కూడా తెరిపించలేడు.



    హిందూ మతం మీద , మతవిశ్వాసాలమీద , సెంటిమెంట్ల మీద , హిందూ దేవాలయ వ్యవస్థ మీద వరసగా ఎన్ని దాడులు జరుగుతున్నా, అంతర్వేది రథ దారుణ దహనానికి  మొత్తం హిందూ సమాజం మండిపడి, సామాన్య భక్తులు, మహిళలు సైతం అసాధారణ రీతిలో ధర్మాగ్రహం వెలిగక్కుతుంటే ఉలకని  పలకని  ముద్దులస్వామి సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని అందరికంటే ముందు ఎగబడి స్వాగతించటాన్ని బట్టే అర్థం కాలేదా – ఆ నిర్ణయం వెనుక మతలబు ఏమిటో !?

   


No comments:

Post a Comment