Thursday 4 January 2024

హైందవమే విశ్వగురువు

 హిందూ నేషన్- 7                      



     ప్రస్తుతం ప్రామాణిక చరిత్ర గ్రంథాలు అని అందరూ అనుకునే వాటిని బట్టి చెప్పాలంటే – ఏ దేశ చరిత్రా ఎక్కువలో ఎక్కువ  5 వేల సంవత్సరాలు దాటదు. అంతకంటే పూర్వం  చరిత్ర లేదా అంటే ఉన్నది. కానీ మరపున పడ్డది. మన లాంటి మనుషుల విషయంలో కొన్ని తరాల లాగే , దేశాల విషయంలో  ఎన్నో శతాబ్దాలు ఇప్పుడు జ్ఞాపకం లేకుండా పోయాయి. లేదా నడమంత్రపు చరిత్రకారుల చేతితో తుడిచివేయబడ్డాయి.

     ఇప్పటికి కనీసం వెయ్యేళ్ళ  కంటే ముందునుంచీ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నవి క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలు. ప్రస్తుతం ప్రామాణిక  చరిత్రలుగా చలామణి అవుతున్న వాటిని రాసిన వారు, లేక ప్రభావితం చేసిన వారు ఆ రెండు మతాలకు చెందిన వారే. క్రైస్తవుల దృష్టిలో దేవుని బిడ్డ యేసు రాకడ తరవాతే అసలు చరిత్ర మొదలయింది. అంతకు ముందు ఉన్నవన్నీ పాపిష్టి పాగన్ మతాలే. నామరూపాలు లేకుండా నాశనం చేయాలే తప్ప వాటి గురించి పట్టించుకోకూడదు. అసలు తలవనే కూడదు.

     అలాగే ముసల్మాన్ల దృష్టిలో మహమ్మద్ ప్రవక్త సత్యమతమైన ఇస్లాం ను స్థాపించటానికి ముందు ఉన్నదంతా HEATHEN , కాఫిర్ చరిత్ర . దానిని స్మరించటమే పాపం. ఆనవాళ్ళు మిగలకుండా దానిని సర్వనాశనం చేయటమే దేవుడు మెచ్చే పవిత్ర కర్తవ్యం.

     ఇలా-  అటు క్రైస్తవులూ , అటు మహమ్మదీయులూ చెలరేగి తమ పాలిట పడ్డ దేశాలలో పూర్వ మతాలను, పూర్వ సంస్కృతినీ , పూర్వ చరిత్రలనూ, వాటి ఆనవాళ్లనూ పనిగట్టుకుని క్రూరాతిక్రూరంగా , దారుణాతిదారుణంగా ధ్వంసం చేయటంతో ఎన్నో వేలూ లక్షల సంవత్సరాల ప్రాచీన చరిత్ర అంతరించిపోయింది. క్రైస్తవ ప్రాబల్యానికి పూర్వం ఉన్న నాగరికతను, సంస్కృతిని క్రైస్తవులు...  ఇస్లాం ప్రాభవానికి ముందు ఉండిన నాగరికతను, సంస్కృతిని  మహమ్మదీయులు పగబట్టి మట్టుపెట్టటంతో - ఆ రెండు సోకాల్డ్ మతాలూ పేట్రేగెంత వరకూ - ప్రపంచమంతటా చక్కగా, చల్లగా విలసిల్లిన హిందూ  సంస్కృతి ఒకటుండేదన్న సంగతే ప్రపంచం మరచిపోయింది. అలాంటి  హిందూ నాగరికత ఒకప్పుడు ప్రపంచమంతటా వర్ధిల్లిందని  ఇప్పుడు ఎవరైనా అంటే వారిని మూర్ఖులు, మూఢత్వం జడలు కట్టిన మత ఛాందసవాదులు అని తాటాకులు కట్టటం ఆధునిక మహా మేధావులకు అలవాటు అయింది.

      రెండు వేల ఏళ్ల కిందటి వరకూ ప్రపంచమంతటా విస్తరించి ఉన్నది  హిందూ మతం, హిందూ  సంస్కృతి, ఆర్య నాగరికత ! ప్రపంచమంతటా వినిపించింది సంస్కృత భాష !  ఆ సంగతి దాచిపుచ్చటానికి , వాటి జ్ఞాపకాలను శాశ్వతంగా రూపుమాపటానికి చాలామంది చాలా కష్టపడ్డారు. గుళ్ళు కూల్చారు. దేవతావిగ్రహాలను, ఆలయ శిల్పాలను, అద్భుత కళాఖండాలను ధ్వంసం చేశారు. ప్రాచీన దేవాలయాలను ఆక్రమించి చర్చిలుగా , మసీదులుగా మార్చివేశారు. మహారాజ ప్రాసాదాలను , మహా సమాధులుగా మార్చారు. మెడమీద కత్తి పెట్టి , బలవంతంగా మతం మార్పించి ఆచారాలు, వ్యవహారాలు ... బొట్టు, కట్టు...  వేషం , భాష మార్చేసి మనుషులను  వారి దేశంలో వారినే పరాయివాళ్లను  చేశారు. జాతుల మూలాలు తెంచేశారు. లక్షలాది అపురూప గ్రంథాలను, విజ్ఞాన భాండాగారాలను బూడిద చేశారు. అబద్ధాల చరిత్రలు అల్లారు. తప్పుడు సాక్ష్యాలు బనాయించారు. కుహనా సంస్కృతులు తెచ్చిపెట్టారు.

      కానీ ఎన్ని చేసినా తమ ఆలోచనలలో , తమ ఆచార వ్యవహారాలలో , తమ భాషలో. తమ వాడుకలో హైందవ  సంస్కృతి, వైదిక నాగరికతల ఛాయలను, చిహ్నాలను తొలగించలేకపోయారు. హిందూ మత ద్వేషులు , వైదిక ధర్మానికి బద్ధ శత్రువులు , మహా విజ్ఞాన వంతులమని బోరవిరుచుకునే మహా నాగరికులు కూడా ఇవాళ తమకు తెలియకుండానే హిందూ  సంస్కృతిని అనుసరిస్తున్నారు. హైందవ పద్ధతులనే పాటిస్తున్నారు.

     మచ్చుకో ముచ్చట.

      ప్రపంచంలో ఎక్కడైనా , ఎవరైనా సూర్యోదయాన్ని బట్టే రోజులను లెక్కవేస్తారు . రాత్రి పడుకుని, మళ్ళీ తెల్లవారాకే అది నిన్న, ఇది నేడు అని గుర్తుపెట్టుకుంటారు . అంతేగానీ అర్ధరాత్రి 12 గంటలకు లేచి కాలెండరులో డేటు మార్చుకోరు. కదా? మరి మధ్య రాత్రి గడియారం ముల్లు 12  మీదికి రాగానే తేదీ , రోజు మారే పధ్ధతి ఎందుకు వచ్చింది ?

       జవాబు కోసం బుర్ర బద్దలు కొట్టుకోవలసిన పనీ లేదు. ఇప్పటికి యాభై ఏళ్ల కిందటే విఖ్యాత చరిత్రకారుడు పి.ఎన్.ఓక్ Some Missing Chapters Of World History అనే గ్రంథంలో దీనికి  సహేతుకంగా సమాధానం చెప్పాడు. సారాంశం ఏమిటంటే-

      సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకూ రోజును లెక్కగట్టటం అనాదిగా హిందూ దేశ సంప్రదాయం. ‘ఉదయాత్ ఉదయం వారం’ అని మన లెక్క. భారతదేశంలో సుమారుగా 5-30 కి సూర్యోదయం అవుతుంది. కాల గమనంలో మనకంటే ఐదున్నర గంటలు వెనక ఉండే యూరోపియన్ దేశాల్లో ఆ సమయానికి అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఇప్పుడు అమెరికా , ముప్పావు శతాబ్దం కిందటి వరకూ బ్రిటన్ లాగా ప్రాచీనకాలంలో ఇండియాయే ప్రపంచంలో సూపర్ పవర్. విద్యలో, విజ్ఞానంలో , ఆర్ధిక వ్యాపార పారిశ్రామిక రంగాల్లో , సైనిక శక్తిలో భారతదేశం మహా వైభవంగా వెలిగిపోతుండేది. హిందూ సంస్కృతి, వైదిక నాగరికత వివిధ రూపాల్లో, వేరువేరు పేర్లతో ప్రపంచమంతటా వర్దిల్లేవి. విద్య, వాణిజ్య, ఆర్ధిక పరమైన సంబంధాలు, సంపర్కాలు ప్రధానంగా ఇండియాతో కాబట్టి ఇండియా టైమును బట్టే ఇంగ్లాండు వంటి వెనకబడిన యూరోపియన్  దేశాలూ తమ రోజును లెక్కగట్టుకునేవి. ఇండియాలో సగటున సుమారుగా 5-30 కి తిథి , వారం మారుతాయి కాబట్టి తమ లెక్కా దానికి సరిపోయే విధంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇంగ్లాండ్ వంటి దేశాలు  డే అండ్ డేట్ మార్చుకునేవి.

     ప్రాబల్యం , ప్రభావం ఏ దేశానిది అయితే ఆ దేశ కాలమానాన్ని దానిపై ఆధారపడిన దేశాలు అనుసరించటం ప్రపంచంలో మామూలే. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ చేతికి చిక్కిన పసిఫిక్ రీజియన్ ప్రాంతాల్లో పెత్తనం చెలాయించిన జపనీస్ అధికారులు టోక్యో టైం ప్రకారం గడియారాలు సెట్ చేసి అధికారిక వ్యవహారాలను  ఆ ప్రకారమే జరిపేవారు.  అమెరికా తో వ్యాపార లావాదేవీలు చేసేవారు  అమెరికన్ టైమ్ ప్రకారం పని చేయటం , అమెరికన్ టైమును బట్టి నడవటం ఇప్పటికీ  చూస్తున్నాం. అదే విధంగా పూర్వకాలంలో పాశ్చాత్య దేశాలూ భారత కాలమానాన్ని అనుసరించాయంటే విస్తుపోవలసిన పనిలేదు. అనంతర కాలంలో   బ్రిటిష్ ఆధిపత్యం  కింద దాదాపుగా రెండు శతాబ్దాల పాటు ఉన్నాము కనుక , లండన్ ఇంపీరియల్ రాజధాని కాబట్టి, లండన్ ఆనవాయితీ ప్రకారం మనమూ అర్ధరాత్రి 12 గంటలకు తేదీ మార్చుకోవటానికి అలవాటు పడ్డాం. ఒకప్పుడు మనను బట్టి ఇంగ్లాండ్ నడిచింది; మన టైమును బట్టి తన రోజును వెనక్కి జరుపుకుంది  అన్న సంగతి మరచిపోయి ఇంగ్లిషు దొరల ను చూసి మనమూ మన టైమును వెనక్కి జరుపుకున్నాం. అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళ ‘గుడ్ మార్నింగ్’  అనటానికీ , ‘హాపీ న్యూయియర్’ కేరింతలు కొట్టటానికీ, బర్త్ డే కేకులు కోసి మళ్ళీ నిద్రపోవటానికీ అలవాటు పడ్డాం.

https://youtu.be/UFHehKAXvpo?si=JoEjK1-8b5qfecGZ

       సరే! ప్రపంచం మరచిపోవచ్చు . గమనించకపోవచ్చు.   జాత్యహంకారాలకొద్దీ , మత దురహంకారాల కొద్దీ భారతీయ గత వైభవాన్ని గుర్తించేందుకు విదేశీయ , దేశీయ ‘థాట్ పోలీసులు’ నిరాకరించవచ్చు . సైంధవుల్లా అడ్డం పడవచ్చు. మరి ఆ పూర్వ ప్రాభవానికీ , ఉజ్జ్వల నాగరికతకూ , మహోన్నత సంస్కృతికీ వారసులమైన మనం ఏమి చేశాం? చరిత్రకూ , సంస్కృతికీ , హెరిటేజ్ కీ అంటూ డిపార్ట్ మెంట్లు తెరిచి , దండిగా ప్రజాధనం ఖర్చుపెట్టే మన ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఏమి వెలగబెట్టాయి? భారత సంస్కృతి, నాగరికత, తాత్వికతల విశ్వ వ్యాప్తి సమగ్ర రూపాన్ని ఆవిష్కరించేటందుకు ఎన్ని ప్రాజెక్టులు పెట్టి అంతర్జాతీయంగా ఎన్ని అధ్యయనాలు, ఎన్ని  పరిశోధనలు చేయించాయి? ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేశాయి ? భారతీయ సాంస్కృతిక , వైజ్ఞానిక , తాత్విక వారసత్వ ప్రచారానికి సంబంధించి  వెనకటి శతాబ్దాలలో పాశ్చాత్య మేధావులు చేసినదానికి మించి స్వతంత్ర భారత ప్రభుత్వ పూనికతో  ఇన్నేళ్ళలో జరిగిన గొప్ప కృషి ఏమిటి? అసలు ఆ దిశగా ఏ ప్రభుత్వమైనా ప్రపంచ స్థాయిలో ఒక  బృహత్ ప్రణాళికను  చేపట్టిందా? 

       హైందవం ప్రపంచంలోకెల్లా గొప్పమతం, ప్రపంచంలో కెల్లా గొప్పధర్మం, ప్రపంచంలోకెల్లా గొప్ప జీవన విధానం అని,  దేశదేశాల మహాజ్ఞానులు, మహామేధావులు ఎన్నో శతాబ్దాలుగా కొనియాడుతున్నారు. వేద విజ్ఞానం, భారతీయ శాస్త్రం, హైందవ తత్వం, సారస్వతం, సాంస్కృతిక వైభవాల లోయలను, ఎత్తులను లీలగానైనా పోల్చుకోవటానికి పాశ్చాత్య దేశాల్లో విస్తృత పరిశోధనలు, సమగ్ర అధ్యయనాలు తరతరాలుగా సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు లాంటి ఎన్నో దేశాలు యూనివర్సిటీల్లో హిందూమతాన్ని ఎప్పటినుంచో బోధిస్తున్నారు. దాని తాత్త్విక, వైజ్ఞానిక, శాస్త్ర వారస్వతాల మీద క్షుణ్ణంగా రిసెర్చిలు చేయిస్తున్నారు. మరి అసలయిన భారత దేశం మాటేమిటి?

       తెల్లవాళ్లు ఏలిన కాలంలో కనీసం పాఠశాలల్లో హైందవ ధర్మానికి, హైందవ వీరులకు, హిందూ ఇతిహాస పురాణాలకు సంబంధించిన పాఠాలను అనుమతించేవారు.  హిందూ కాలేజీలను, హిందూ యూనివర్సిటీలను ప్రోత్సహించేవారు. తెల్లవాళ్లు పోయి దేశీయ ప్రభువులు వచ్చాక పరిస్థితి నానాటికీ దిగజారింది. స్వతంత్రం అనబడేది సిద్ధించిన  తరువాత తొలి దశాబ్దాల్లో 'రామాయణ, భారత, భాగవతాల పాఠాలను, హిందూ దేశ పవిత్రతను కొంతలో కొంతైనా పిల్లలకు బోధించనిచ్చేవారు. 1976లో ఇందిరమ్మ 'చేతబడి'తో దిక్కుమాలిన సెక్యులరిజం వచ్చిపడ్డాక ఆ పాఠాలు అటకెక్కాయి.  ఆ తరవాత రూలింగు పార్టీలు , ప్రభుత్వాలు ఎన్ని మారినా  చదువులూ పాఠాలూ మారలేదు. విద్య పట్ల , చరిత్ర పట్ల , విస్మృత చరిత్ర వెలికి తీత, జాతీయ చరిత్ర తిరగ రాత పట్ల పోచుకోలు కబుర్లూ , డొల్ల ప్రగల్భాలే తప్ప  మౌలికంగా మారింది, నికరంగా సాధించింది సున్న. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాల కోసం మెకాలే పెట్టిన విద్యావిధానమే , భారత జాతీయత పట్ల కలోనియల్ పాలకుల ఆలోచనా విధానమే కాస్మెటిక్ పైపూతలతో నేటికీ నిక్షేపంలా కొనసాగుతున్నాయి.   హిందూ మతం, హిందూ చరిత్ర, విశ్వ వ్యాప్త హిందూ నాగరికత విద్యార్థులకు ఎంతమాత్రమూ నేర్పుకూడని , ప్రభుత్వ పరంగా ప్రోత్సహించకూడని నిషిద్ధ పదార్థాలు అయ్యాయి. దేశంలో వందల సంఖ్యలో ఉన్న యూనివర్సిటీల్లో ఏ ఒక్కదానిలోనూ హిందూ మత, హిందూ సంస్కృతి, హైందవ జాతీయ వారసత్వాల , వేదాలూ వేదశాస్త్రాల  అధ్యయనానికి, రిసెర్చికి  ప్రత్యేక విభాగమంటూ ఉన్నట్టు , సవ్యంగా పనిచేస్తున్నట్టు, వాటి ఉనికి సార్థకమైనట్టు దాఖలాలు లేవు.

        అదేమిటి? అజాదీకి 75 ఏళ్ళు నిండి అమృతోత్సవాలు కూడా అయ్యాయి , మనకో గణతంత్రం , దానికో రాజ్యాంగం తరతరాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన వారిలో అందరూ కాకపొతే కొందరైనా నీతి, నిజాయతీ, జాతీయత , నిబద్ధత కలిగిన మహామహులు  ఉన్నారు. హిందుత్వాన్ని, హైందవాన్ని గౌరవించే, ఓన్ చేసుకునే పార్టీలూ గద్దె మీద ఉన్నాయి. అయినా నూటికి 75 మంది హిందువులైన హిందూ దేశంలో హిందూ జాతికి, హిందూ జాతీయతకు, హిందూ మతానికి, హిందూ ధర్మానికీ , హిందూ హెరిటేజ్ కీ దిక్కూ మొక్కూ లేకుండా పోవటానికి కారణమేమిటి?

    [ జవాబు తరువాయి భాగంలో ]


                  ---------------------------------                                    
      

No comments:

Post a Comment