Wednesday 3 January 2024

హిందూ సమాజం 2024

హిందూ నేషన్ – 6

                 




      వైవస్వత మన్వంతరం ; 28వ మహాయుగం; కలియుగం; ప్రథమ పాదం; 2022 CE.

      భరతవర్షం లోని ఖండిత భరతఖండంలో ఇండియా అనే దేశంలో –

      ప్రస్తుత జనాభా 161 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం  ప్రజల్లో 79.8 శాతం హిందువులు. అడ్డూ అదుపూ లేకుండా , ప్రభుత్వాల వత్తాసుతో , నిర్విరామంగా 24X7 విశృంఖలంగా సాగుతున్న కన్వర్షన్ పాతాళహోమాల పర్యవసానంగా ఈ పదకొండేళ్ళలో పై 9.8 శాతం ఎగిరిపోయిందని అనుకున్నా రికార్డుల్లో హిందువులుగా నమోదైన వారు ఇప్పటికీ కనీసం నూటికి 70 మంది ఉంటారనుకోవచ్చు.

     వీళ్ళంతా ఉన్నది ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో . అక్కడ ఏ వ్యవహారమైనా నడిచేది నెంబర్లను బట్టి.  మెజారిటీ ఉన్నవాడే రాజు. మెజారిటీ కి కావలసింది కనీసం 50 శాతం ప్లస్ వన్. ఎవరికైనా సంఖ్యాబలం 70  శాతం ఉన్నదీ అంటే తిరుగులేని మెజారిటీ. ( ఎలక్షన్లలో ఏ పార్టీకైనా అంత వస్తే landslide మెజారిటీ అంటూ మీడియా వాళ్ళు ఘనంగా బాకా ఊదుతారు.)

      ఆ లెక్కన కనీసం 70 శాతం సంఖ్య ఉన్న హిందువు ఈ దేశానికి మహారాజు కావాలి. భూ ప్రపంచంలోని  ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అదే రూలు. కాని ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యం అయిన మనం చెప్పుకుంటున్న ఇండియా అనే దేశం లో 70 శాతం మెజారిటీ ఉన్నవాడు రాజు కాదు. బూజు.

     ప్రపంచంలో ఎక్కడైనా ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు ఏ మతానికి చెందినవారైతే ఆ మతానికి రాజపూజ్యత లభిస్తుంది.  ప్రభుత్వం , చట్టాలు, వ్యవస్థలు అన్నీ ఆ మతం ఆచారాలను , విశ్వాసాలను ఎంతో గౌరవిస్తాయి. ఏ విషయంలో అయినా , ఏ వ్యవహారంలో అయినా మెజారిటీ మతానికి మాత్రమే పెద్దపీట వేస్తాయి. మైనారిటీ మతాలను వాటి హద్దుల్లో అవి ఉన్నంతవరకూ సహిస్తాయి. వాటి బతుకు అవి బతకటానికి అవకాశం ఉన్నమేరకు అనుమతిస్తాయి.  ఏ దేశంలో అయినా మైనారిటీ మతాలు  పక్కన ఒదిగి ఉండి మెజారిటీ మతస్థులకు , ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని మనుగడ సాగిస్తాయి.

      ఇండియాలో అంతా రివర్సు. ఇక్కడ ప్రభుత్వాల , పాలక వ్యవస్థల దృష్టిలో మెజారిటీ మతానికి పూచికపుల్లపాటి విలువ ఉండదు.పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి  పుట్టినిల్లు అయిన  బ్రిటన్ లో 'ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌' ఆధికార మతం. దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు. Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు. సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్ట్ మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు. దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రొటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ, దాని సిద్ధాంతాన్నీ, పూజా విధానాన్నీ, క్రమశిక్షణను, చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు.


      క్రైస్తవం అధికార మతం కాని అమెరికాలో కూడా నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారం వంటి వేడుకల్లో క్రైస్తవ మతాచార్యులకు ప్రాముఖ్యం ఇస్తారు.

     ఇండియాలోనో? పార్లమెంట్లో సీట్లు , పాలకుల  ప్రమాణ స్వీకారాల్లో ప్రమేయాల మాట దేవుడెరుగు. మెజారిటీ మతానికి చెందిన పూజ్య ధర్మాచార్యుడు నేరం చేశాడని ఏ నక్క, కుక్క కూసినా అవునా కాదా అన్నది విచారించకుండా, ఆ అభియోగం నిజమని ముందే ఊహించి  ,   కోర్టుల చుట్టూ ఏళ్ళూ పూళ్ళూ తిరిగి నిర్దోషిత్వం నిరూపించుకోవలసిన భారం నిందితుడి మీదే వేసి , క్షణం ఆలస్యం చెయ్యకుండా  ఆగమేఘాలమీద అరెస్టు చేసి రెక్కపుచ్చుకుని  జైల్లో వేస్తారు.  అమానుషంగా అవమానాలకు గురి చేస్తారు. నిర్దోషిగా ఎప్పటికో రుజువు అయ్యేంత వరకు అతడు మహాపాపి ; అతడిలాగే ఆ మతంలోని ధర్మాచార్యులందరూ by default నేరగాళ్లు అయినట్టు మీడియావాళ్ళూ , మెదళ్ళు లేని మేధావులూ పిచ్చి వాగుళ్లు వాగుతుంటారు .

       అదే మైనారిటీ మతానికి చెందిన చిన్నా చితకా మతగురువు మీద ఎంత బలమైన అభియోగం వచ్చినా... సన్యాసినులను, చిన్నపిల్లలను రేప్ చేసినట్టు బాధితులే స్వయంగా ఫిర్యాదు చేసి బలమైన రుజువులూ సాక్ష్యాలూ చూపెట్టినా ... మీడియాలో దానిపై ఎంత గగ్గోలు లేచినా-  పోలీసులు కదలరు.మెదలరు.  గత్యంతరం లేక అరెస్టు చేయవలసి వచ్చినా మహా గౌరవంగా మర్యాదలు చేసి , బయటపడేందుకు శాయశక్తులా సహకరిస్తారు. ఫలానా  మతగురువు ఖూనీలు, దొమ్మీలు చేశాడు, చేయించాడు, ప్రార్థనాస్థలంలో బాంబులు, మారణాయుధాలు దాచిపెట్టాడు, విదేశీ టెర్రరిస్టులకు అశ్రయం ఇచ్చాడు అని ఫిర్యాదులు   ఎంత బలమైన సాక్ష్యాల సహితంగా వచ్చి దానిపై ఎంత వివాదం లేచినా పూజ్య నిందితులుం గారిని అరెస్టు చేయటానికి , ఆ ప్రార్థనాస్థలం దరిదాపులకేసి కన్నెత్తి చూడటానికి ప్రభుత్వాలకు దమ్ములుండవు.

     ప్రజాస్వామ్య సమాజంలో అనేక మతాలు ఉంటాయి.  మతస్వేచ్చ ను అనుమతిస్తూ చట్టాలు ఉంటాయి. రాజ్యాంగ రక్షణలు ఉంటాయి. ఇండియాలోనూ ఉన్నాయి. కాని అవి ఉన్నవి ప్రధానంగా మైనారిటీ మతాల కోసమే  . మెజారిటీ మతానికి   మత హక్కులంటూ ఉండవు . ఆ సంగతి  సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనమే నేటికి 48 ఏళ్ల కిందట  తేల్చి చెప్పింది ఇలా:

      The object of articles 25 to 30 was to preserve the rights of religious and linguistic minorities, to place them on a secure pedestal... These provisions enshrined a befitting pledge to the minorities in the Constitution of the country... It is only  the minorities who need protection. (1974 AIR 1389)
      (25 నుంచి 30 వరకు గల రాజ్యాంగం అధికరణాల ఉద్దేశం మతపరమైన, భాషా పరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించి, వారిని పదిలమైన పీఠం మీద ఉంచడమే... దేశ రాజ్యాంగం మైనారిటీలకు చేసిన సముచితమైన బాసను ఈ అధికరణాలు తాపడం చేశాయి... రక్షణ అవసరమైంది మైనారిటీలకు మాత్రమే.)
      దీనికి - అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు కేరళ హైకోర్టు 1978లో ఇచ్చిన ఈ కింది వివరణను కూడా చిత్తగించండి:
      “The real purpose and intendment of Articles 25 and 26 is to guarantee especially to the religious minorities in this country the freedom to profess, practise and propagate their religion, to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion.    (AIR 1978 Ker 68) 

       (25, 26 అధికరణాల వెనక అసలు ఉద్దేశం, ఆంతర్యం ముఖ్యంగా దేశంలోని మతపరమైన మైనారిటీలకు కొన్ని గ్యారంటీలు ఇవ్వటమే. వారి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించటానికి, వ్యాప్తి చేయటానికి మతపరమైన, ధార్మికమైన సంస్థలను స్థాపించి, నడుపుకునేందుకు... మతపరంగా వారి వ్యవహారాలను వారే నిర్వహించుకోవటానికి స్వేచ్ఛనిచ్చే గ్యారంటీలవి.)

     చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం.
కాని 'ఇండియా దటీజ్‌ భారత్‌'లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు. ఉన్నవి రెండే తరగతులు: 1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. జనాభాలో సుమారు 80 శాతం ఉన్న హిందువులు ఏ ప్రత్యేక హక్కుకూ నోచుకోని తక్కువ సమానులు. నిండా 20 శాతం లేని అన్యమతస్థులేమో సమస్త ప్రత్యేక హక్కులూ ఉన్న ఎక్కువ సమానులు.

       ఎంతసేపూ-  జనాభాలో నిండా ఐదో వంతు లేని మైనారిటీల హక్కులూ రక్షణల సంగతే తప్ప, అసలైన మెజారిటీ గురించి, అది అనుసరించే హిందూమతం గురించి, దాని హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కనీసం ప్రస్తావనే ఉండదు.  అసలు ''హిందూమతం'' అన్న పదమే మొత్తం రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు. . అలాగే భారత జాతికి ప్రాణ శక్తి అని వివేకానందుడు నుడివిన, అనాదిగా జాతి జీవితాన్ని , రాజ్యంగ వ్యవస్థలను నడిపించిన సనాతనధర్మం ఊసు  మన రాజ్యాంగంలో కళ్ళు పొడుచుకున్నా  కానరాదు.

       దానివల్ల ఏమైంది? మైనారిటీలకేమో రెండు రకాల హక్కులు. వారు జనరల్‌ కేటగిరీలో భారత పౌరులుగానూ న్యాయం కోరవచ్చు. స్పెషల్‌ కేటగిరీలో మైనారిటీలుగానూ కోర్టు లెక్కవచ్చు. ఆ విధంగా డబుల్‌ ధమాకా!  అదే దురదృష్టవంతులైన హిందువులో? వారికి భారత పౌరులుగా మాత్రమే గుర్తింపు. మైనారిటీల్లాగా వారికి స్పెషల్‌ కేటగిరీ ఏదీ లేదు. మెజారిటీ వర్గంగానో, హిందూ మతానికి చెందిన వారిగానో తమ హక్కులకు భంగం కలిగాయని వారు ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే 'హిందూ' అనిగాని, 'మెజారిటీ' పదంగాని రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు.  రాజ్యాంగంలో ఏ అధికరణం కింద మిమ్మల్ని గుర్తించాలి, ఏ క్లాజు ప్రకారం మీకు న్యాయం చేయాలి అని అడిగితే హిందువుల దగ్గర జవాబు లేదు.  మతపరంగా హక్కులన్నీ మైనారిటీలకే! జన సంఖ్యలో 80 శాతం ఉండికూడా హిందువులు తమ దేశంలోనే రాజ్యాంగరీత్యా రెండో తరగతి పౌరులు.  మైనారిటీలకు ఎలాంటి అసౌకర్యం ,  మనస్తాపం కలగకుండా అతి జాగ్రత్త చూపుతూ  అణగిమణగి ఉండటమే మెజారిటీ మతస్థుల ప్రారబ్దం .

            క్రైస్తవులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 126 ఉన్నాయి. వాటిని క్రిస్టియన్‌ దేశాలు అనడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. ముస్లింలు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 50 ఉన్నాయి. వాటిని ముస్లిం దేశాలు అనడానికి మన మేధావులకు అభ్యంతరం ఉండదు.
     
ప్రపంచంలో మూడవ పెద్ద మతం హైందవం. హిందువులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో మూడే మూడు. 1. భారత్‌, 2. నేపాల్‌ 3. మారిషస్‌. మూడింటిలోకి అతి ముఖ్యమైనదీ, అన్నిటికంటే పెద్దదీ, ప్రపంచంలో హైందవానికి ఏకైక ఆలంబనంగా చెప్పుకోగలిగిందీ భారతదేశం. అయినా దీన్ని హిందూ దేశం అంటే మన మహామేధావులు, రాజకీయ జీవులు చచ్చినా ఒప్పుకోరు! దేశ ప్రజల్లో నూటికి 80 మంది హిందువులే అయినా  ఇది హిందూజాతి కాదట! ఇక్కడున్న జాతీయ సమాజం హిందువులది కాదట! ఈ దేశంలో విలసిల్లేది హిందూ సంస్కృతి కానే కాదట.

       
https://m.facebook.com/story.php?story_fbid=10228192429409085&id=1027311077&mibextid=ZbWKwL
( ‘హిందూ మతాతీత లౌకిక రాజ్య’ అవ్యవస్థ గురించి అదనపు సమాచారం కోసం నేను రాసిన “పెక్యులరిజం’ పుస్తకం చదవండి. )                                           

                                             

No comments:

Post a Comment