Wednesday, 5 June 2024

బిజెపి కి ఎందుకు బెంగ ?

 ఎం.వి.ఆర్. శాస్త్రి 

నా మనవడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జాం రాశాడు. మొన్నీ మధ్య రిజల్స్ వచ్చాయి. CGPA  9.7 వచ్చింది అని చెప్పింది మా అమ్మాయి. అంటే మంచి గ్రేడే కదా అని సంతోషించి వాడికి ఫోన్ చేశా. వాడు మాత్రం సంతోషంగా లేడు. 10కి 10 రాలేదు కదా 9.7 అంటే చాలా తక్కువ అని  డల్ గా చెప్పాడు. టాపర్ కావాలనుకునే మెరిట్ స్టూడెంటు కాబట్టి వాడి నిరుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్ఛు. 

కానీ ఈ బిజెపి వాళ్ళకేమయింది? పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూసి ఆముదం తాగినట్టు మొహం పెడుతున్నారు? వరసగా మూడో సారి ఆ పార్టీ కూటమి దేశంలో అధికారం అందుకుని హ్యాట్రిక్ కొట్టబోతున్నది. ఇదేమైనా అల్లాటప్పా విజయమా? మామూలుగా ఏ రూలింగు  పార్టీ నైనా ఐదేళ్ళు భరించటమే కష్టం. వెనకటి రూలింగు పార్టీ మీద తీవ్ర అసహ్యం పుట్టి , దాని మీద కసితో ఈ పార్టీని నెత్తిన పెట్టుకున్న జనం దీని నిర్వాకం చూశాక దీని మీదా రోత పుట్టి ఎప్పుడెప్పుడు దీన్ని వదిలించుకుంటామా అని తొందర పడతారు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఎత్తి చెత్తకుండీ లోకి గిరవాటేసి  ఎదురుగా ఏ ప్రత్యామ్నాయం కనిపిస్తే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. అంటే ఏకాడికీ ఏ పార్టీ అయినా పవరు కొట్టేసేది సాధారణంగా నెగిటివ్ వోటు మీదే . ఎంత మోతుబరి పార్టీ కైనా ఒక టర్ము కాగానే యాంటీ ఇన్కంబెన్సీ తెగులు పట్టుకుని మరుసటి ఎన్నికల్లో అడ్రెసు గల్లంతు కావటం మామూలే కదా? అలాంటిది తమ  నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ళలో సాధించిన ఘన విజయాలను , అవినీతి మచ్చ అంటని పరిపాలనను సగర్వంగా చెప్పుకుని భారతీయ జనతా పార్టీ పాజిటివ్ వోటు తో మూడో సారి కూడా అత్యధిక శాతం వోట్లూ, సీట్లూ గెలుచుకోవటం ఏ రకం గా చూసినా దిగ్విజయం కాదా? స్వతంత్ర భారత చరిత్రలో ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ టర్మ్ కూడా పవర్లోకి రావటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? సొంతంగా 282 స్థానాలు గెలిచి 2014లో పవర్లోకి వచ్చిన పార్టీకి మూడో టర్ములో కూడా 42 తక్కువగా అన్ని సీట్లూ దక్కటం గొప్పకాదూ?




ఆ మాటంటే – 400 వస్తాయని అనుకున్నాము కదా ? ఎగ్జిట్ పోల్సు లో కూడా అన్ని సర్వేలూ 350 పక్కా అనే చెప్పాయి కదా? తీరా వచ్చినవి 240 నే కదా?కనీసం  సింపుల్ మెజారిటీకి కూడా తక్కువేనాయె అని బిజెపి వీరాభిమానుల ఏడుపు. బెట్టింగు దందాల స్పెషల్ ఆర్డర్లకు తగ్గట్టు , ఎవరి కాకులలేక్కలు వాళ్ళు వేసి మీడియా సంస్థలు వండి వార్చే తల తిక్క ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు నమ్మమన్నారు? “అబ్ కీ బార్ చార్ సౌ పార్” అని మీ నాయకులు తెగ హడావుడి చేసినంత మాత్రాన నిజంగానే 400 వస్తాయని మీరెలా అనుకున్నారు?  రాజకీయ దురంధరులు మోదీ , అమిత్ షా 400 అన్నారంటే కనీసం 300 తగ్గక పోవచ్చు అనే అర్థం . ఇప్పుడు ఎన్ డి ఏ కి వచ్చిన సీట్లు 300 కి ఏడే కదా తక్కువ? బిజెపి వరకే చూసుకున్నా  240 సీట్లతో అదే సింగిల్ లార్జెస్టు పార్టీ. సొంతంగా మెజారిటీకి 33 మాత్రమె తక్కువ. దాని దరిదాపుల్లో ఇంకో పార్టీ ఏదీ లేదు.మొత్తం అపోజిషన్ పార్టీలన్నీ  అలయన్సుగా కూడి తెచ్చుకున్న మొత్తం సీట్లకంటే ఒంటి చేత్తో బిజెపి తెచ్చుకున్నవే ఎక్కువ.   ఎన్ డి ఏ కూటమికి  మాజిక్ మార్కు కంటే 21 సీట్లు ఎక్కువే వచ్చాయి. చాలదా? మరి ఎందుకు  కంగారు? 

రెండో పెద్ద పార్టీ ఏది? కాంగ్రెసు . దానికి వచ్చినవెన్ని? ఆఫ్టరాల్ 99. నిండా మూదంకెలు కూడా లేవు. అధికారమే ఏకైక లక్ష్యంగా ఒక నీతీ రీతీ లేకుండా అమాం బాపతు పార్టీలను కూడగట్టి అది కట్టిన INDIA గుడారానికి మొత్తం కలిపి వచ్చిన సీట్లేన్ని? 235. అంటే మాజిక్ ఫిగరు కు దాదాపు 40 తక్కువ. అయినా సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , సోనియా గాంధీలు బ్రహ్మండమేదో బద్దలు కొట్టినట్టు, ఇప్పటికే పవరు ఎగిరి వచ్చి వొళ్ళో వాలినట్టు జాయింటుగా ఇకిలిస్తూ వేళ్ళతో V గుర్తు చూపిస్తున్నారు . 



మెజారిటీ కూడా ఇప్పటికే వచ్చేసిన బిజెపి వాలాలేమో మొగాలు వేలాడేసి ఇంతేనా, ఇంతేనా అంటూ తెగ ఫీలై పోతున్నారు. వీరేమో గెలుపును చూసి ఓటమి అనుకుంటున్నారు. వారేమో ఓటమిని గెలుపుగా చూపెట్టుకుంటున్నారు. భలే! 

ఇంతకీ నీరసం ఎందుకయ్యా అని బిజెపి కాంపు వాళ్ళని అడిగితే – ఇలా సొంతంగా సింపిల్ మెజారిటీకి కూడా తెరువు లేని పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు అని ఉసూరుమంటారు. అనుకోకపోతే అది వారి తెలివితక్కువ. ఇది ఇలా అయ్యే ఆస్కారం ఎంతైనా ఉన్నదని బిజెపి బడానేతలకు కూడా ఎప్పుడో తెలుసు. కర్మం చాలక ఇటువంటి అగత్యం వచ్చినా మెజారిటీకి ఇబ్బంది లేకుండా చూసుకోవటానికే చిన్నా పెద్దా ప్రాంతీయ పార్టీలను తమ బుట్టలో వేసుకోవటానికి వారు తెగ తంటాలు పడ్డారు. తెలంగాణా ఎన్నికల ముందు కేసీఆర్ పార్టీతో చాటుమాటు సరాగాలాడినప్పుడే ఈ సంగతి రాజకీయ పరిశీలకులకు అర్థమయింది. ఆంద్ర ప్రదేశ్ లో నమ్మరాని తెలుగుదేశంతో పొత్తు వద్దే వద్దని పార్టీ, హిందూ వర్గాలు ఎంత మొత్తుకున్నా వినకుండా డిల్లీ పెద్దలు పట్టుబట్టి కొంగు ముడి వేయించినప్పుడైనా దానిలోని మర్మం కమలం వాళ్లకు తేటతెల్లం అయి ఉండాలి, ఉత్తరాదిన పడ గల గండ్లను దక్షిణాదిన వైసిపి,  టిడిపి లాంటి పార్టీల సాయంతో పూడ్చుకోవాలని బిజెపి నాయకులు చాలాకాలం కిందటే డిసైడయ్యారు . తమ అవసరాలకు అనుగుణంగా వైకాపా నడుచుకున్నంత కాలమూ జగన్ అవసరాలను కేంద్రం వారు అరసుకున్నారు. జనాల్లో వైకాపా పూర్తిగా భ్రష్టు పట్టిందని గ్రహించాక ఇష్టమున్నా లేకున్నా టిడిపిని చేరదీశారు. తప్పేమీ లేదు. దటీజ్ పాలిటిక్స్!

ఏమైనా ఈ ఎన్నికల్లో బిజెపి గర్వంగా చెప్పుకోదగిన విజయాలు చాలా ఉన్నాయి. కాంగ్రెసును నజ్జునజ్జు చేసి మొత్తం 29 కి 29 సీట్ల క్లీన్ స్వీప్ తో మధ్యప్రదేశ్ కంచుకోట ను తిరిగి వశం చేసుకోవటం ,ఒడిశాలో21కి 20 లోక్ సభ సీట్లు కొట్టేసి , అసెంబ్లీ లో పూర్తీ మెజారిటీ తో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచగలగటం దిగ్విజయం కాదా? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేయిజార్చుకున్న కర్ణాటకలో ఈ మారు కాంగ్రెస్ కంటే ఒకటి తక్కువగా రెట్టింపు సీట్లతో స్వీట్ రివెంజ్ తీర్చుకోవటం పెద్ద  విశేషమే. గుజరాత్ లో 26 కు 25, డిల్లీలో 7 కు ఏడూ “ఆప్ చీపురు’ తో సహా ఊడ్చేయ్యటం  చిన్న విషయం కాదు. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి స్కోరు ఏ రకంగా చూసినా అద్భుతమనదగ్గదే. తెలంగాణలో ముఠా తగవులు, అంతర్గతంగా సాబటేజ్ లు, సంస్థాగత సమస్యలు పెచ్చరిల్లిన దృష్ట్యా ఈ సారి ఎన్నికల్లో రెండు మూడుకుమించి రావని పార్టీ లోపలివారే ఒక దశలో భయపడిన సంగతి గుర్తుపెట్టుకుంటే బిఆర్ఎస్ ను పచ్చడి చేసి కాంగ్రెసుతో సరిసమానంగా ఎనిమిది లోక్ సభ సీట్లను కేవలం మోదీ మహిమ తో బిజెపి గెలుచుకోవటం గొప్ప విశేషం. అలాగే ఐదేళ్లుగా అన్నివిధాలా చితికి , అతీగతీ లేదని అందరూ ఆశ వదిలేసుకున్న ఆంద్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కూటమి కూడి , తెలుగుదేశం ధర్మమా అని ఏకంగా 8 అసెంబ్లీ , 3 పార్లమెంటు సీట్లు బిజెపి  దక్కించుకోవటమంటే  జాక్ పాట్ కొట్టినట్టే., తెలుగుదేశం తో పొత్తు లేనిదే జగనాసుర రాక్షస రాజ్యాన్ని అంతమొందించటం అసాధ్యమని తాను నమ్మినదాన్ని తిట్లూ చివాట్లను లెక్కచెయ్యకుండా అందరికీ నచ్చచెప్పి కడు ఓపికగా ఒడుపుగా కూటమిని కూర్చి , తాను తగ్గి ఉమ్మడి ప్రయోజనాన్ని పెంచి అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్ దార్శనిక రాజనీతిజ్ఞతను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. కిందటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాలలో జయప్రదంగా ఓడిపోయిన దుస్థితి నుంచి ఈ సారి పోటీ చేసిన 21 కి 21 అసెంబ్లీ స్థానాలనూ , రెండుకు రెండు లోక్ సభ స్థానాలనూ ‘పొలిటికల్ పవర్ స్టార్’  మొత్తంగా గెలుచుకోగలగటం పరమాద్భుత విజయం.  ఐదేళ్లుగా గూండాల రాజ్యంగా , అరాచక నిలయంగా, సోమరిసత్రంగా తయారై అన్నివిధాలా చితికి చిద్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకలు తీరిన రాజకీయ దురంధరుడు, సమర్థ పాలకుడు , దార్శనిక ప్రజ్ఞావంతుడు అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం శుభ పరిణామం. పూర్వప్రభుత్వం దింపిన అప్పుల ఊబి నుంచి పైకి లాగి , మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించగలడనీ, పాడుబడిన అమరావతికి పునర్ వైభవం తెచ్చి రాష్ట్రానికి చక్కని రాజధానిని అమర్చి బాగా అభివృద్ధి చేయగలడననీ చంద్రబాబు మీద ప్రజలు ఆశ పెట్టుకున్నారు. గతానుభవాల నుంచి పాఠం నేర్చి, 2014-19 ఏలుబడిలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని  , ‘సన్ స్ట్రోకు’ ల నుంచి జాగ్రత్త పడగలిగితే చంద్రబాబు నాయుడు ఆదర్శ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోగలడు.  

తెలంగాణ లో కాంగ్రెసుకు  బలమైన ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగింది . దాని ఫండమెంటల్సు చాలా పటిష్టం గా ఉన్నాయి.  కాబట్టి  తెరాస లేక భారాసకు కష్టకాలమే.  పోటీ చేసిన మొత్తం అన్ని సీట్లలో ఘోరంగా ఓడిపోయినంత మాత్రాన గులాబీ వాడి వడలినట్టేనని చెప్పటం తొందరపాటు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావాన్మి ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదు.

కానీ అదే మాట ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి , అతడి పార్టీ విషయంలో చెప్పలేము .అధికార ప్రభావం పోయి , కేంద్రంలో రాష్ట్రంలో బలాబలాలు మారినందున  తీవ్ర ఆర్ధిక నేరాల క్రిమినల్ కేసులనూ , జైలునూ అతడు ఇంకేమాత్రమూ తప్పించుకోజాలడు. అధికారం ఆశతో అతడి నడమంత్రపు పార్టీలోకి వాలిన రాజకీయపక్షులు అది కాస్తా పోయాక కొత్త వలసను వెతుక్కోక మానవు. వైఎస్ సొంత కుటుంబం వారే చీకొట్టే పరిస్థితి వచ్చాక  వైఎస్ఆర్  కాంగ్రెసు పార్టీ అంతరించకుండా మిగలగలిగితే అబ్బురమే. జగన్ రెడ్డి ని ముద్దులాడి అతడి అండతో మిదిసిపడ్డ సాములోర్లకూ , మర్డర్ కేసులో ఏ పాపమెరుగని పసివాడికీ , అధికార మదంతో నోళ్లు పారేసుకున్న తక్కుంగల వదరుబోతులకూ  ఇక కష్ట కాలమే. 

ఈ సారి 400 సీట్లు గ్యారంటీ అని బిజెపి పెద్దలు, అవునునిజమే అన్నీ వచ్చేట్టు ఉన్నాయని మిడిమేలపు మీడియా ఇచ్చిన బిల్దపులను చూసి, ఇక ఎలాగూ గెలవబోయే వారికి మన సాయం ఎందుకన్నఉదాసీనత  జనంలో ఎక్కడొస్తుందో , ఓవర్ కాన్ఫిడెన్సు మూలంగా  బిజెపి కొంప ఎక్కడ మునుగుతుందోనని ఆ పార్టీ హితైషులు చాలా భయపడ్డారు. అదృష్టవశాత్తూ 2004 గత్తర అయితే తప్పింది. అత్యధిక ప్రజాదరణ సంపాదించి , సొంతంగా మెజారిటీకి కేవలం  బెత్తెడు దూరంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి నిలబడింది. ఎన్నికలకు ముందే కుదిరిన ఎన్ డి ఏ కూటమి వరకూ పూర్తి మెజారిటీకి ధోకా లేదు. అయినా మీడియా మాయావులు పనికి మాలిన తెలివితేటలు ఉపయోగించి నానా రకాల ఊహాగానాలతో అకారణ అనుమానాలనూ , భయాలనూ రేకెత్తిస్తున్నారు. 

నిజమే. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు అడ్డం తిరిగితే ఎన్ డి ఏ కు మెజారిటీ కష్టమే. కాని అంతటి రాజకీయ దురంధరులు ఎన్నికల ఏరు దాటీ దాటగానే  కూటమి తెప్పను తగలేసి పోయిపోయి, అన్ని రకాల స్వార్థాలూ రాశిపడి ఉన్న  నీతిమాలిన కాంగ్రేసు కలగూరగంపలో చేరతారని ఊహించలేము.  నమ్మకద్రోహానికి పాల్పడితే జనం మొగాన పేద నీళ్ళు కొడతారన్న భయంవల్ల అయినా అలాంటి నీచత్వానికి కనీసం కొంతకాలం వరకూ ఎవరూ దిగజారరు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము . ఆమె గుణగణాలు ఎరిగిన వారెవరికీ ఆమె న్యాయ మార్గం తప్పుతారన్న సందేహం కలగదు. కాస్తంత  సందు దొరికితే చాలు తమకు అధికారం కోసం లేక బిజెపి అధికారాన్ని గండికోట్టటం కోసం  ఎంతనీచానికైనా అవతలివారు  దిగజారగలరు. కానీ ఆ పాటి సందు వారికి ఇప్పుడప్పుడే చిక్కదు. 

ఏమైనా కేంద్రంలో బిజెపి ఏకచత్రాధిపత్యం ముగిసినట్టే. ప్రభుత్వ మనుగడకు కూటమి పార్టీల సహకారం తప్పనిసరి అయినప్పుడు భాగస్వామ్య పక్షాలు తల ఎగురవేయక మానవు. మద్దతుకు ప్రతిఫలంగా హిరణ్యక్షవరాలు కొరకుండానూ ఉండవు. గతంలో జయలలితలూ మమతా బెనర్జీ లూ చంద్రబాబులూ వాజపేయికి తెచ్చిపెట్టిన సంకటాల వంటివి  ఇకముందూ ఎదురుకాబోవని చెప్పలేము. వాటి సంగతి తరవాత మాట్లాడుకోవచ్చు. ఏమైనా నరేంద్ర మోదీ మరీ వాజపేయి అంత సౌమ్యుడు, మంచివాడు కాడు కాబట్టి కథ ఎలా అయినా తిరగవచ్ఛు. చూద్దాం. 

ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాలలో గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్ లో , రాజస్తాన్, పంజాబ్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భంగపాట్ల నుంచి బిజెపి నేర్వవలసిన గుణపాఠాలు, మార్చుకోవలసిన పద్ధతులు  ఏవీ లేవా? లేకేమి ? ఆ పార్టీ , దాని నాయకులు చేసిన తప్పులు , ఆత్మావలోకనం చేసుకోవలసిన అంశాలు , సరిదిద్దుకోవలసిన లోపాలు బోలెడు ఉన్నాయి. వాటి గురించి ఇంకో సారి చెప్పుకుందాం. 

                            ------------------------------------------------------

No comments:

Post a Comment