Saturday 21 January 2023

నేతాజీకి తీరని ద్రోహం

   నేతాశ్రీలు ఎందరున్నా నేతాజీ ఒక్కడే. నేతాజీ అంటే సుభాస్ చంద్ర బోసే!

      నేతాజీ బోస్ లక్ష్యశుద్ధితో లక్షల మందిని పోరుబాట పట్టించి , 1857 తరవాత మళ్ళీ ఆ స్థాయిలో సాయుధ స్వాతంత్ర్య సంగ్రామం నడిపించిన  విప్లవ యోధుడు . రవి అస్తమించడని మిడిసిపడిన బ్రిటిష్ సామ్రాజ్యాన్నే మెడలు వొంచి , కొమ్ములు విరిచి , దేశం నుంచి తరిమివేయ గలిగిన శూరుడు! దేశం కోసం ప్రాణం అర్పించిన లోకోత్తర అమరవీరుడు .

      సుభాస్  బోస్ అంటే ఒక స్వప్నం. ఒక సైన్యం. ఒక సాహసం.

      సుభాస్ బోస్ ఒక ప్రభంజనం. ఒక ప్రకంపనం.

       విలువ తెలియకుండా ఇవాళ మనం తేరగా అనుభవిస్తూ , విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న స్వాతంత్ర్యం అనబడేదానికి కారణభూతుడు  సుభాస్ చంద్ర బోస్.  స్వాతంత్ర్య వీరుల త్యాగ ఫలాన్ని అప్పనంగా  అనుభవించిన ఖల్ నాయక్ లు, వారికి గొడుగుపట్టే పెంపుడు మేధావులు  అసలు కథానాయకుడైన నేతాజీ ఊసే ఎత్తరు.  

     దేశాన్ని చెరపట్టిన బ్రిటిషు సామ్రాజ్యం మీద రాజీపడకుండా వీరోచితంగా పోరాడి , స్వాతంత్ర్యం సాధించిన  నేషనల్ హీరో నేతాజీ సుభాస్ చంద్ర బోస్! స్వాతంత్ర్యానికి అతడే కారకుడు  లేక ప్రధాన కారకులలో ఒకడు అయినప్పుడు స్వతంత్ర భారతంలో కనీసం మిగతా సోకాల్డ్ కారకులతో సమానంగా అయినా ఆయనకు సముచిత గౌరవ స్థానం లభించాలి కదా? మట్టి మనుషులను గట్టి యోధులుగా మలచి , 40 వేల సైన్యంతో తెల్ల దొరతనంతో భీకర సంగ్రామం చేసి , మాతృభూమి శృంఖలాలు తెంచగలిగిన మహావీరుడిని, దేశం కోసం రక్తం ధారవోసిన అతడి స్వాతంత్ర్య సైన్యాన్ని జాతి తగినరీతిలో  సన్మానించి , అవ్యాజాదరణ  చూపి ,కృతజ్ఞత ప్రకటించి ఉండాలి కదా? జరిగిందేమిటి?


             స్వాతంత్ర్యానికి పూర్వం ఊరూరా నేతాజీ చౌక్ లు, నేతాజీ విగ్రహాలు , నేతాజీ యువజన సంఘాలు కనిపించేవి. స్వాతంత్ర్యం అనబడేది వచ్చాక సుభాస్ చంద్ర బోస్ పేర ఒక గౌరవ చిహ్నం గాని , ఏ ప్రభుత్వ సంస్థకూ ఆయన పేరు గాని, కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ గాని లేకుండా , ఆయన ఉజ్వల చరిత్రను ఎవరూ తలవకుండా కాంగ్రెసు ప్రభుత్వాలు  గట్టి జాగ్రత్తలు తీసుకున్నాయి.   స్వాతంత్ర్య సంగ్రామ ప్రధాన సేనాపతి సుభాస్ చంద్ర బోస్ అన్న సంగతే భావి తరాలకు తెలియకుండా , ఆయన సమీకరించి నడిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటమే చరిత్రకు ఎక్కకుండా నెహ్రూ ఇందిర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలకు అబద్ధాల మసి పూశాయి.  నేతాజీ కుటుంబం తమ ఇంటిని “నేతాజీ భవన్” గా మార్చి సొంత వనరులతో చేయిస్తున్న కార్యక్రమాలే తప్ప ఆ జాతీయ వీరుడి సంస్మరణకు ప్రభుత్వపరంగా చేసింది  పెద్దగా లేదు. కేంద్రంలో పార్టీలు , ప్రభుత్వాలు ఎన్నిమారినా నేతాజీ పట్ల ఉదాసీన వైఖరిలో ఇంతవరకూ మార్పులేదు.

       కళ్ళు తెరిచి నిండా మూడు శతాబ్దాలు కాని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాలర్ నోట్ల మీద జార్జి వాషింగ్టన్ , లింకన్, రూజ్ వెల్ట్ వంటి జాతీయ నాయకుల ఫోటోలు ఉంటాయి. కనీసం పదివేల సంవత్సరాల  రికార్డెడ్ చరిత్ర కలిగిన మన పుణ్యభూమిలో మాత్రంమినహ ఏ కరెన్సీ నోటు మీదైనా కనిపించేది -  150 ఏళ్ల కిందట పుట్టిన , బహు వివాదాస్పదుడైన ఒక గాంధీ ముఖారవిందం మాత్రమే.  రాజ్యాంగ పరమైన హోదా, ప్రతిపత్తి ఏమీ లేని ... జాతిపిత అనే బిరుదు ఎవరిచ్చారో భారత సర్కారుకు కూడా తెలియని .... ఎం.కె. గాంధీ అనే సో కాల్డ్ మహాత్ముడి బొమ్మ మాత్రమే ప్రతినోటు మీదా కనపడాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? స్పెషల్ గా చట్టమేమైనా చేశారా? ఒకవేళ దిక్కుమాలిన నిబంధనలేవైనా అడ్డమొస్తే వాటిని తీసి అవతల ఎందుకు పారెయ్యరు?కాంగ్రెసును , నెహ్రూ వంశ పాపిష్టి పాలననూ తిట్టున తిట్టు తిట్టకుండా తిట్టే నరేంద్ర మోదీకి కూడా గద్దెనెక్కి తొమ్మిదేళ్ళు కావస్తున్నా  కనీసం ఒక్క కరెన్సీ నోటుమీద అయినా నేతాజీ బొమ్మ ముద్రించాలని ఇంతవరకూ  ఎందుకు బుద్ధి పుట్టలేదు? గాంధీ తప్ప జాతీయ నాయకుడు , జాతీయ వీరుడు, పూజ్యుడు ఎవరూ లేరా? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు నిండాయని  ఆజాదీకా అమృతోత్సవ్ అట్టహాసంగా జరిపినప్పుడైనా  ఆ స్వాతంత్ర్యానికి అసలు కారకుడైన నేతాజీ చిత్రంతో ఒక్క కరెన్సీ నోటునైనా జారీ చేయటానికి నేతాజీ వీరాభిమానినని చెప్పుకునే మోదీకి వచ్చిన అడ్డంకి ఏమిటి? 2017లో కోలకతా హైకోర్టు ఇదే విషయం నిగ్గదీసినప్పుడు ఇదే మోదీ సర్కారు  - ఇండియన్ కరెన్సీ నోట్లపై జాతీయనాయకుల బొమ్మలు ముద్రించే విషయంలో రిజర్వుబ్యాంకు స్పందన కోరవలసి ఉంటుంద”ని విన్నవించింది కదా? స్పందన కోరటానికి ప్రభుత్వానికీ, స్పందించటానికి రిజర్వుబ్యాంకుకూ ఆరేళ్ళు కూడా సరిపోలేదా? అసలైన స్వాతంత్ర్య ప్రదాత అయిన జాతీయ మహానేత సుభాస్ చంద్ర బోస్ కు సముచిత గౌరవం ఇవ్వటానికి ఒక రిజర్వు బ్యాంకు ఆజ్ఞ, అనుమతి కావాలా? దేశాన్నేలే ప్రభుత్వానికి బాధ్యత లేదా? 370 రాజ్యాంగ అధికరణాన్ని తలచిందే తడవుగా ఒక్క పూటలో కొట్టిపారేయగలిగిన సూపర్ డూపర్ కార్యశూరులకు  ఆఫ్టరాల్ ఒక కరెన్సీ రూలు ఒక లెక్కా?  

      ఇక ఇంకో దౌర్భాగ్యం.  మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహా నాయకుడు ఆత్మార్పణం చేసి ముప్పావు శతాబ్దం గడచిన తరవాత కూడా ఆయన మరణించిన సంగతే మనము గుర్తించము. అంగీకరించము.  సుభాస్ చంద్ర బోస్ కు (జనవరి 23న) జననమే తప్ప రికార్డుల ప్రకారం మరణం లేదు. స్వాతంత్ర్య ప్రదాత అయిన మహనీయుడు మరణించి 75 ఏళ్ళయినా ఆయన చితాభస్మాన్నీ , ఆస్థికలను  దేశానికి తీసుకొని వచ్చి శ్రద్ధాంజలి ఘటించటానికి దిక్కు లేదు.  ఆస్థికల పాత్ర నేటికీ జపాన్ లోని రెంకోజీ మందిరంలోనే పట్టించుకునే దిక్కులేకుండా , మన నిర్లిప్తతకూ, నిష్క్రియాపరత్వానికీ ప్రత్యక్ష ప్రతీకగా పడి ఉన్నది. నేతాజీ అనుంగు భక్తుడినని చాటుకునే నరేంద్ర మోదీ ఇటీవల ప్రధాన మంత్రి హోదాలో టోక్యో వెళ్ళినప్పుడు నేతాజీ భస్మపాత్ర ఉన్న రెంకోజీ గుడి దరిదాపులకు వెళ్ళిన పాపాన పోలేదు.

      1945 ఆగస్టు 18న తైవాన్ లోని తైపేలో విమాన ప్రమాదం లో నేతాజీ మరణాన్ని చట్టబద్ధంగా ఏర్పాటైన రెండు విచారణ సంఘాలు ధ్రువీకరించాయి. ఆ విచారణల తీరు తెన్నుల గురించి ఎన్ని అక్షేపణలు ఉన్నా అవి చేసిన నిర్ణయాలవరకూ  తప్పు పట్టవలసిన పని లేదు. విమాన ప్రమాదంలో నేతాజీ మృతిని అంగీకరించిన పూర్వ ప్రభుత్వ నిర్ణయాన్ని జనతా ప్రభుత్వం  కూడా ధృవీకరించింది . అలాగే- 1999 లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదం, అందులో నేతాజీ మరణం అబద్ధమంటూ ఇచ్చిన నివేదికను  తరవాత వచ్చిన యు.పి.ఏ.ప్రభుత్వం తిరస్కరించింది. అంటే-  రాజ్యమేలేది ఏ కూటమి అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలూ 1945 ఆగస్టు 18 న తైపే లో నేతాజీ మృతి చెందిన వాస్తవాన్ని అంగీకరించాయి. ఆనాడునేతాజీ మరణం నిజమని ఒప్పుకున్నాక , మారుపేరుతో నేతాజీ పార్థివ కాయాన్ని దహనం చేయటమూ నిజమే , అక్కడ సేకరించిన అస్థికలూ, చితాభస్మమూ నేతాజీవే అని ఒప్పుకుని తీరాలి కదా? ఆ భస్మ పాత్ర ఇంకా జపాన్ లోనే ఎందుకు ఉండాలి? దానిని ఇకనైనా స్వదేశానికి ఎందుకు తీసుకురారని మనం గట్టిగా అడగవద్దా? అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసి , వెంటపడి ఆ పని చేయించవద్దా?  ప్రమాదంలో నేతాజీ మృతి నిజం కాక పొతే అసలు నిజం ఏది? అప్పుడు కాకపొతే నేతాజీ ఎప్పుడు ఎక్కడ మరణించాడు అన్నది  ఇప్పటివరకూ ఏ ఒక్కరూ నిర్ద్వంద్వంగా నిరూపించలేనప్పుడు  బోస్ మిస్టరీ గురించి ముదనష్టపు వాగుళ్ళు ఇంకెంత కాలం వాగుతారని  అందరం ఒక్క గొంతుతో ఉరమవద్దా?

            ప్రజల నుంచి వత్తిడి లేనిదే, ప్రజాభిప్రాయం సంఘటితమై వెంటపడనిదే,  జాతి జాగృతం కానిదే ఏ పనీ కాదు. ఏ ప్రభుత్వమూ  కదలదు. నేతాజీ కి సముచిత నివాళి కి సంబంధించినంత వరకూ ప్రధాన వైఫల్యం ప్రజలది. వారిని కదిలించి , మంచి చెడ్డ ఎరుకపరచి ,ముందుకు నడిపించలేని మేధావి వర్గానిది. జాతిపట్ల బాధ్యత మరచిన ఒపీనియన్ మేకర్లది. ఎందుకంటే నేతాజీ పోరాడింది మన కోసం. మన స్వాతంత్ర్య కోసం. మన జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం. వేలమంది యోధులను సమీకరించి , దేశం కోసం రక్తం ధారవోయమని ఉద్బోదించి ,  కత్తుల వంతెన మీద వట్టికాళ్ళతో నడిపించి , మహా సంగ్రామం చేయించి , ఆఖరికి తన ప్రాణాలనే అర్పించి స్వాతంత్ర్య ఫలాన్ని సాధించి పెట్టిన జాతీయ వీరుడి దివ్యస్మృతిని  సముచిత రీతిలో గౌరవించుకోవటం జాతిజనుల  ప్రాథమిక బాధ్యత కాదా? కనీస బాధ్యత విస్మరించిన ప్రభుత్వాలనూ, ప్రభుత్వాలనూ నిగ్గదీసి , మెడలు వంచి కావలసినపని చేయించుకునే అధికారం సర్వాదికారులైన ప్రజలకు లేదా?


                                 ------------------------------------------

 

                                 ------------------------------------------

 

 

      

 

 

 

 

 

   

 

 

 

      

No comments:

Post a Comment