Friday 13 September 2019

మహావీరుడి సాహసగాథ


(ఈ సెప్టెంబర్ నెలాఖరులో వెలువడనున్న నా "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో ముందుమాట)

   ఇది ఒక సాహసవీరుడి కథ. ఒక దేశభక్తుడి అద్భుత గాథ. భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి  సుభాస్ చంద్ర బోస్ ఉజ్వల జీవిత చరిత్ర.


    1757 లో ప్లాసీ నుంచి 1944లో ఇంఫాల్ దాకా ఇంచుమించు రెండు శతాబ్దాలపాటు బ్రిటిషు దురాక్రమణదారులపై భారత వీరులు చేసిన పోరాటాలకు లెక్కలేదు. చూపిన శౌర్యానికి,పరాక్రమానికి సాటిలేదు. దేశం కోసం కష్టాలుపడి, త్యాగాలు చేసి , ఉరికంబాలెక్కి , ప్రాణాలు ధారవోసిన కీర్తికాయులకు కొదవలేదు. వీరిలో ఎవరికీ తీసిపోనివాడు, స్వాతంత్ర్య సేనానులలో ముందు లెక్కించవలసిన వాడు, తరతరాల దేశభక్తుల ఆత్మార్పణకు లక్ష్యమైన స్వరాజ్యం (లాంటిది)  జాతికి సిద్ధించటానికి కారణభూతుడైనవాడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్.
     రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల ఆటంబాంబు విజయం తరవాత ఇండియాలో బ్రిటిషు సామ్రాజ్యానికి ఎదురులేదు. 1942లో క్విట్ ఇండియా అలజడిని క్రూరంగా అణచివేసిన మీదట దేశంలో జాతీయ ఉద్యమం సద్దుమణగింది. ఇక ఆ తరవాత కాంగ్రెస్ నాయకుల పని అయిపోయింది. వారికి వయసు మళ్లింది. అలసిపోయారు.మళ్లీ జైలుకు వెళ్లటానికి ఏ ఒక్క రు సిద్ధంగా లేరు. ఇది అనంతర కాలంలో నెహ్రూ పండితుడే బ్రిటిష్ జర్నలిస్టు,గ్రంథకర్త Leonard Mosley  ముందు సిగ్గు పడకుండా ఒప్పుకున్న నిజం. [The Last Days of The British Raj, Leonard Mosley,  p.285]
       
    మళ్లీ జైలు అంటేనే భయపడేంతలా  చేవచచ్చి చచ్చుబడిన జాతీయ కాంగ్రెస్ మహాసంస్థను చూసి బ్రిటిష్ రాజ్ హడలిపోయే ప్రసక్తే లేదు. అయినా కొంపలేవో మునుగుతున్నట్టు, భూతమేదో తరుముకొస్తున్నట్టు ఇంగ్లీషు వాళ్ళు జండా పీక్కుని ఇండియా నుంచి ఉడాయించాలని ఎందుకు తొందర పడ్డారు?
   
దీనికి సమాధానం చెప్పగలిగింది అప్పుడు ఆ నిర్ణయం చేసిన బ్రిటిష్ ప్రభువులే. ఇదే ప్రశ్న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీని 1956 కోలకతా పర్యటనలో పశ్చిమ బెంగాల్ యాక్టింగ్ గవర్నర్ ఫణిభూషణ్ చక్రవర్తి అడిగాడు. సుభాస్ చంద్రబోస్ ఐ.ఎన్.ఎ. కార్యకలాపాలు  బ్రిటిష్ పవరుకు మూలాధారమైన సైనిక, నౌకా దళాల  విధేయత పునాదిని  బలహీనపరచటమే దానికి ముఖ్య కారణమని అట్లీ జవాబు. మీ నిష్క్రమణ మీద గాంధీ ప్రభావం ఎంత అని చక్రవర్తి అడిగితే అట్లీ ‘చాల తక్కువ’ అని తిరస్కారసూచకంగా వత్తి పలికాడు. [History of The Freedom Movement in India, R.C.Majumdar, vol.3,p.610]
    ఇదీ వాస్తవం! మమ్మల్ని వెళ్ళగొట్టింది సుభాస్ చంద్ర బోసే; గాంధీ కాదు- అని ఆదరా బాదరా ఉడాయించిన ఇంగ్లిషు వాళ్ళే చెప్పాక  మనకు స్వాతంత్ర్యం ఎవరివల్ల వచ్చింది అన్న విషయంలో సందేహానికి తావులేదు. బానిసత్వపు సంకెళ్ళు తెగగొట్టినందుకు కృతజ్ఞతతో భారతజాతి మొదట స్మరించవలసింది నేతాజీ  సుభాస్ చంద్ర బోసును.
    విచిత్రం, విషాదం ఏమిటంటే వీరుల త్యాగ ఫలాన్ని తేరగా అనుభవించిన  మన ఖల్ నాయక్ లు, వారికి గొడుగుపట్టే మేధావులు  అసలు కథానాయకుడైన నేతాజీ ఊసే ఎత్తరు ; స్వాతంత్ర్యం తెచ్చిన పుణ్యంలో అతడికి కూడా వాటా ఉందనీ ఒప్పుకోరు! ఎన్నో వేల సంవత్సరాల రికార్డెడ్ చరిత్ర కలిగిన ప్రాచీన భారత జాతికి 150 ఏళ్ల కింద పుట్టినవాడు ‘జాతిపిత’ అనీ... సత్యం, అహింసల నిష్ఠతో గాంధీ మహాత్ముడి నాయకత్వాన కాంగ్రెస్ మహాసంస్థ చేసిన సత్యాగ్రహాల వల్లనే దేశానికి విదేశీ చెర వదిలిందని తెల్లవారి రాజకీయ వారసులైన దేశవాళీ దొరలు  చరిత్రకు వెల్లవేయించి  భావి తరాలవారికి బ్రెయిన్ వాష్ చేశారు. గాంధీ, నెహ్రూలు మినహా వేరొకరిని తలవాల్సిన అవసరమే లేనట్టు కల్లబొల్లి చరిత్రలను వండి వార్చారు.
    చరిత్రకు ఎన్ని చేతబడులు  చేసినా ఈ దేశ వాసుల గుండె గుడిలో నేతాజీకున్న సుస్థిర , శాశ్వత స్థానాన్ని ఎవరూ  తొలగించలేక పోయారు. ఇప్పటికీ దేశంలో ఏ మూల ఏ ఊరికి వెళ్ళినా నేతాజీ విగ్రహం కనిపిస్తుంది. నేతాజీకి సంబంధించిన ఏ సమాచారమైనా జనానికి ఆసక్తి కలిగిస్తుంది. నేతాజీ పేర యువజన సంఘాలు ఎల్లెడలా పనిచేస్తున్నాయి. నేతాజీ బొమ్మ చూస్తేనే యువతరానికి  నేటికీ ఒళ్ళు పులకరిస్తున్నది.
     సుభాస్ చంద్ర బోస్ వలె విదేశాలకు వెళ్లి తమ దేశ విమోచన కోసం పోరాడిన యోధులు ప్రపంచచరిత్రలో ఎందరో ఉన్నారు. కాలం కలిసివచ్చి, పరిస్థితులు అనుకూలించి ఉంటే లెనిన్, మాజినీ, డి వలెరాలలాగా నేతాజీ కూడా దిగ్విజయం సాధించి ఘన నీరాజనాలు అందుకునే వాడే. చెప్పుడు మాటలు వినకుండా సోవియట్ రష్యా బోసు తపనను, చిత్తశుద్ధిని ఏ దశలో ఏ కాస్తయినా అర్థం చేసుకుని ఉంటే తనకు ఇష్టం లేకున్నా నాజీల పంచన చేరవలసిన అగత్యం అతడికి వచ్చేదే కాదు.అక్ష రాజ్యాల(Axis Powers) కూటమిలోని జర్మనీ, జపాన్ పాపిష్టి పాలకులు  ఏ మాత్రమైనా ప్రాప్తకాలజ్ఞతచూపి  నేతాజీ హితవును సకాలంలో మన్నించి ఉంటే భారత చరిత్రగతి మరో విధంగా ఉండేది. అలసి సొలసి ,ముదిమి మీద పడి , ఇక పోరాటం చేసే సత్తువపోయి కాళ్ళు బారజాపిన కాంగ్రెస్ నేతాశ్రీలు చేవ, శక్తి ఉన్న సుభాస్ చంద్ర బోస్ పోరాటానికి ఏ మాత్రం సహకరించినా నిజమైన స్వరాజ్యం మనకు 1947కు ముందే సిద్దించేది. ఎంత ప్రయత్నించీ ఏదీ కలిసిరాకపోయినా , ఎల్లెడలా ప్రతికూలతే ఎదురైనా ధైర్యం కోల్పోక, సంకల్పం సడలక , ఓడిపోతానని తెలిసీ వీరోచితంగా పోరాడి, ఆఖరి నెత్తురుబొట్టును కూడా దేశం కోసం అర్పించాడు కనకే అతడు నేతాజీ అయ్యాడు. ఒక ధర్మవీరుడు, అకళంక దేశభక్తుడు, కర్మయోగి ఎలా ఉంటాడు, రాజకీయాలను ఎలా నడుపుతాడు, ఎలా పోరాడతాడు అన్నదానికి సజీవ దృష్టాంతంగా జాతిజనుల గుండెల్లో నిలిచిపోయాడు.
      ఆరాధనాభావం కొల్లలుగా ఉన్నా నేతాజీకి సంబంధించిన చాలా వివరాలు నేటి తరానికి తెలియవు.తెలిసే అవకాశమూ లేదు. గాంధీ, నెహ్రుల మీద టన్నులకొద్దీ ఉన్న సాహిత్యంతో.... వారి మీద విపరీతంగా జరిగిన అధ్యయనాలూ, పరిశోధనలతో ... వారి స్మృతులను ,అడుగుజాడలను భద్రపరిచేందుకు అమలైన బృహత్ ప్రణాళికలతో పోల్చితే నేతాజీ విషయంలో జరిగింది స్వల్పాతిస్వల్పం. హీనాతిహీనం. సర్కారీ ప్రాపకం లేని  ఏ మహానుభావుడి చర్యలనైనా, చరిత్రనైనా సొంత కుటుంబం వారే పదిలపరచుకోవలసి రావటం ఈ దేశ దౌర్భాగ్యం. బోస్ చరిత్ర బాధ్యత కూడా ప్రధానంగా ఆయన కుటుంబానికి మాత్రమే పట్టింది. ‘నేతాజీ రిసెర్చ్ బ్యూరో’ స్థాపించి వారే ఏవో తంటాలు పడుతున్నారు. వారి కృషి గొప్పదే. కానీ దానికీ సహజంగానే చాలా పరిమితులుంటాయి.
      నేతాజీ బోస్ మీద అనేక భాషల్లో గ్రంథాలు చాలానే వచ్చాయి. కాని వాటిలో సమగ్రం, ప్రామాణికం అనదగ్గవాటిని వేళ్ళమీద  లెక్కించటానికి రెండో చేయి అక్కర్లేదు. బ్రిటిషు సి.ఐ.డి. వాసన పట్టకుండా ఉండటానికి బోస్ తన కార్యకలాపాలను ఎక్కడా గుర్తులను మిగల్చకుండా గుంభనంగా నడపవలసివచ్చింది. ఏదో సందర్భంలో అతడితో సంపర్కం ఉన్న వారు తమ పాత్రను అతిగా చిత్రిస్తూ చిలవలు పలవలు అల్లి  అనంతరకాలంలో పుస్తకాలు రాసెయ్యటంతో రకరకాల కల్పనలు వ్యాప్తిలోకి వచ్చాయి.
       నేతాజీ పేరు చెప్పగానే ఎవరికైనా మనసులో మెదిలేది మిలిటరీ యూనిఫాం వేసుకున్న పోరాటమూర్తి. ముందు గుర్తొచ్చేది ఆయన అద్భుతంగా నడిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లేక ఆజాద్ హింద్ ఫౌజ్. నేతాజీ అనగానే ఈ కాలంలో ప్రతివారూ ఆసక్తితో అడిగేవి ఇవి: ‘విమాన ప్రమాదంలో నిజంగా మరణించాడా? మరణించక పొతే ఏమయ్యాడు? ఆయనే ‘గుమ్నామీ బాబా’ అట నిజమేనా?’ నేతాజీ కి సంబంధించి ఇవి ముఖ్య ప్రశ్నలనటంలో సందేహం లేదు. కాని బోస్ గురించి తెలుసుకోవలసింది అతడి మాయం మిస్టరీ ఒకటే కాదు. దానికంటే ముఖ్యమైనది, ప్రతి నవయువకుడూ గమనించవలసింది, గుర్తుపెట్టుకోవలసింది దేశంలో ఉండగా సుభాస్ చంద్ర బోస్ రాజకీయ చరిత్రను! మహాత్ముడని నిఖిలలోకం కొనియాడిన, యావద్భారతం నెత్తిన పెట్టుకున్న గాంధీజీని సైతం నిర్భయంగా ఎదిరించగలగటం... గాంధీ నిలబెట్టి సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థిని  సైతం బహిరంగ ఎన్నికలో ఓడించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కాగలగటం...తనకు ఏ అధికార హోదా లేకపోయినా కలిసిన ప్రతి దేశాధినేతనుంచీ విశేష గౌరవం అందుకోగలగటం  ఎంతో గుండె బలం , ప్రజా బలం, గొప్ప వ్యక్తిత్వం  ఉన్న మహానాయకుడికి తప్ప సాధ్యపడదు. అంతటి నేతను ఉపేక్షించి దమ్మూ ధైర్యం లేని నెహ్రూలాంటి వారిని మాత్రమే జాతీయనేతలుగా కీర్తించటం చరిత్రకు అపచారం. మన విజ్ఞతకు అవమానం.
     మన స్వాతంత్ర్య పోరాటంలో సుభాస్ చంద్ర బోస్ ఉజ్వల పాత్రను వాస్తవంగా చిత్రించే ప్రయత్నమే ఈ పుస్తకం. ఇది కేవలం బోస్ జీవితచరిత్రే కాదు. అతడిని కేంద్రంగా తీసుకుని 1920-1945 మధ్య జాతీయోద్యమ చరిత్రనూ ఇందులో స్పృశించాను. ఆ విదంగా 1922 చౌరీ చౌరా దగ్గర ఆగిన ‘ మన మహాత్ముడు’కు ఇది కొనసాగింపు. నా చరిత్ర గ్రంథాల సీరీస్ లో ‘భగత్ సింగ్’ కు ఇది తరువాయి.
     జాతి జీవితంలో ఆధునిక కాలాన నడయాడిన మహాపురుషులు చాలామందే ఉన్నారు. సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఉన్నంత వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి , సాహస ప్రవృత్తి, శౌర్యం, ధైర్యం, త్యాగం, నిష్కల్మష మనస్తత్వం , ఆలోచనల రేంజి, కలర్ ఫుల్ పర్సనాలిటీ చాలా కొద్ది మందిలో  కనపడుతుంది. అనేక ఖండాల లోని , అనేక దేశాలలో అనేక దశాబ్దాలు సాగిన  బహుముఖ కార్యకలాపాలను, సాహస కృత్యాలను ఒక్క పుస్తకంలో చరిత్రకు న్యాయం చేస్తూ ఇమడ్చటం కష్టం. దేశంలో బోస్ రాజకీయ చరిత్రను, జర్మనీ కేంద్రంగా అతడి యాక్టివిటీలను ఈ పుస్తకంలోచర్చించాను. , రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ పెద్ద తప్పు చేసాడు ; హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజెంటు అన్న శాశ్వత అపకీర్తి మూట కట్టుకున్నాడు - అని తెలిసీ తెలియనివారు దురుద్దేశపూరితంగా 70, 80 ఏళ్లుగా వేస్తున్న అభాండాలకు సమాధానాలూ ఇందులో ఇచ్చాను.
     తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్ర్యంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని దీని తరువాయి పుస్తకం "నేతాజీ'లో రాద్దామనుకుంటున్నాను.
                      













    

   

No comments:

Post a Comment