Friday, 16 January 2026

మీడియా తప్పేమిటి?

 మూడు రోజులుగా మీడియాలో, అన్ సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వార్త, బరితెగించిన మీడియా అంటూ సమాజంలో బహు నీతిమంతుల ధర్మాగ్రహాల ఫెళ ఫెళార్భాటానికి బిత్తరపోయి ఇంతకీ ఏమిటా వార్త అని ఇప్పుడే చూశాను. అరడజనుకుపైగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ల టైము వేస్టు చేసి, సిట్టు వేసి, విమానాశ్రయం లో మాటువేసి ఫ్లైటెక్కబోతున్న జర్నలిస్టును అంతర్జాతీయ టెర్రరిస్టు లెవెల్లో అవమానకరంగా పట్టుకొచ్చి, ఇళ్లమీదపడి జర్నలిస్టులను మానసికంగా హింసించి, బాధ్యత గల మీడియా సంస్థ కార్యాలయం ఆగమాగం చేయాల్సినంత మహానేరం, మహాపాపం ఇందులో ఏముందో నాకైతే అర్థం కాలేదు.

 జర్నలిజంలో అర్ధ శతాబ్ది అనుభవం గడించి...  బాధ్యతా యుతమైన దిన పత్రికకు 23 ఏళ్లు బాధ్యతాయుతంగా సంపాదకత్వం వహించి...ప్రభుత్వాల మీద, అధికార మదాంధుల పవరుకావరం మీద ఎన్నో యుద్ధాలు చేసి సమాజంలోని అన్ని వర్గాల సుహృద్భావం, గౌరవం చూరగొన్న ఎడిటర్ గా నాకు ఎన్టీవీ వారి కథనంలో తప్పు పట్టాల్సింది ఏమీ కనిపించటం లేదు.

 నేను ఎడిటర్ గా ఉండగా ఇదే స్టోరీని నా రిపోర్టర్ పట్టుకొచ్చి ఉంటే నిరభ్యంతరంగా క్లియర్ చేసే వాడిని. మరీ ఎన్టీవీ పిల్లలు వేేసినంత పచ్చిగా, కచ్చగా కాదుగాని, కాస్త శుభ్రమైన భాషలో, ఎవరి చేతికీ చిక్కని రీతిలో సంస్కరించి ఆ స్టోరీని తప్పక బయటపెట్టే వాడిని. దాని మీద ఏ ఆక్షేపణలు, నేరారోపణలు వచ్చినా, ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా నా రిపోర్టర్లకు, సంపాదకీయ సిబ్బందికి రక్షణగా నిలబడి ప్రభుత్వ, పోలీసు దురాగతాన్ని నా పత్రిక ఫ్రంట్ పేజిలో చీల్చి చెండాడేవాడిని.మేము చేసింది ఎలా సబబో, మాపై జరిగింది ప్రజాప్రయోజనాలకు,  పత్రికా స్వాతంత్ర్యానికి ఏరకంగా భంగకరమో పౌర సమాజానికి సహేతుకంగా, తార్కికంగా వివరించి, ప్రజాస్వామ్య హితైషులందరినీ ఒప్పించేవాడిని. మళ్లీ ఇంకొకసారి ఇలాంటి ఆగడానికి పాల్పడకుండా పౌర సమాజపరంగా గట్టి గర్జన చేయించి ఉండేవాడిని. 

తాజా ఉదంతంలో నేను షాక్ అయింది పోలీసుల ఓవరాక్షనుకు కాదు.  పౌర సమాజం అన్నా, మీడియా అంకుశమన్నా భయమనేది లేకపోతే ప్రభుత్వాలూ, పోలీసు శాఖలూ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. ఆశ్చర్యపోవలసిందీ, అసహ్యించుకోవలసిందీ ఆ మీడియా సంస్థలోని ఎడిటోరియల్ హెడ్ల,   యాజమాన్య ప్రతినిధుల నిష్క్రియాపరత్వం చూసి! తాము చేసిన దానిని సభ్య సమాజం ముందు తమకు తాముగా బహిరంగంగా డిఫెండ్ చేసుకోలేక... మీడియా వ్యవస్థ గౌరవాన్ని, జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేక -కలుగులో దాక్కున్న- వారి పిరికితనాన్ని చూసి!

జర్నలిస్టులకు, ఎడిటర్లకు విలువ అనేది పోయి మీడియా అనేది యజమానుల ఇష్టారాజ్యంగా, మేనేజిమెంట్ల నీచ నికృష్ట స్వార్థాల స్వైర విహారంగా, రాజకీయ, వ్యాపార లావాదేవీల సెటిల్మెంటు రంగస్థలిగా మారినప్పుడు మీడియా దౌర్భాగ్యం ఇలాగే ఉంటుంది.