Tuesday, 13 March 2018

తొలి గురువు మా నాన్న

పాత ముచ్చట్లు - 7

ఎం.వి.ఆర్.శాస్త్రి
.....
     జర్నలిజం లో నాకు  తొలి  గురువు  మా నాన్న.

     ఆయన పేరు మార్తి లక్ష్మీనారాయణ శాస్త్రిగారు. స్వగ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. భక్తరామదాసు అనే కంచర్ల గోపన్న పుట్టింది  ఆ ఊళ్లోనే . నా చిన్నతనంలో ఆ ఊరికి సెలవలలో తరచుగా వెళుతుండే వాళ్ళం.

    పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి , బతుకు తెరువుకోసం మా నాన్న అక్కడికి 30 కిలోమీటర్ల దూరం లోని  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కు వెళ్లి స్థిరపడ్డాడు.పంచాంగం , దస్తావేజులు రాస్తూ, కరణీకం చేస్తూ కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ' ఆంధ్ర పత్రిక ' కు ఏజెంటు గా,  కరస్పాండెంటు (  ' స్వకీయ విలేఖరి' )  గా ఉండేవాడు. విలేఖరిగా ఆ రోజుల్లో ఆయనకు మంచి పేరు. స్థానిక మోతుబరి నాయకులు ఎవరినీ లెక్క చెయ్యకుండా వార్తలు రాసే వాడు.  గ్రామ పంచాయతీ మెంబర్లు ఏదో ఎన్నికలో క్రాస్ వోటింగ్ చేశారని గొడవ అయిన సందర్భంలో అంతా కలిసి ఆంజనేయ స్వామి గుళ్ళో  ప్రమాణాలు చేసినప్పుడు " హనుమంతుడి నెత్తి మీద చెయ్యి " అన్న శీర్షికతో మా నాన్న రాసిన వార్తను ఆయన సమకాలికులు ఇప్పటికీ  చెప్పుకుంటారు. ఈ కింద ఇచ్చింది నాకు నాలుగో ఏట తీసిన ఫ్యామిలీ ఫోటో. మా నాన్నకూ అన్నయ్య కూ మధ్యన ఉన్నది నేను.

      నేను పుట్టింది జగ్గయ్యపేటలో.  బళ్ళో  చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా ఏ ఆగస్టు 15 జండా పండగకో, సోషల్ క్లబ్బు వార్షికోత్సవానికో  మా నాన్న సైకిల్ మీద నన్ను తీసుకు పోయే వాడు. ఎవరు ఏమి మాట్లాడారో నోట్ చేసుకోమనే వాడు. ఇంటికొచ్చాక నాతొ వార్త రాయించి ,  సరిదిద్ది  ఏ మరునాడో పోస్ట్ చేయించే వాడు.

   అదేమిటి ? ఈ రోజు వార్త మరునాడు పోస్ట్ చేయటమేమిటి ? అది పాసిపోదా ? అని ఆశ్చర్య పోకండి. అప్పటి రోజులు వేరు. ఆగస్టు 15  వార్తలను మళ్ళీ జనవరి 26 రిపబ్లిక్ డే వచ్చేంతవరకూ వరసక్రమంలో పత్రికల వారు వేస్తూనే ఉండే వారు. ముఖ్యమైన వార్త కదా అని ఏ టెలిగ్రామ్ ద్వారానో , ట్రంక్ కాల్ ( దానికి కొన్ని గంటలపాటు వెయిటింగు ) చేసో చెప్పపోతే  పత్రిక ఆఫీసు వాళ్ళు ఒక్కో సారి కోప్పడేవారు. పోస్టులో మెల్లిగా పంపవచ్చు కదా అని.

  ఆ రకంగా నిక్కర్లు వేసుకుని బడికి వెళ్ళే రోజుల్లోనే న్యూస్ రిపోర్టింగ్ చేశానని నేను క్లెయిమ్ చేయవచ్చు !!

   తర్వాత నంద్యాల పాలిటెక్నిక్ లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ వెలగబెట్టి జయప్రదంగా ఒక సబ్జెక్టు తప్పాను .  (తర్వాత  పాసయ్యాను. ) మిగతా సబ్జెక్టులలో ఫస్ట్ మార్కులు వచ్చాయనుకోండి . ఏం లాభం? అసలు  చదువు కంటే ... కాలేజీ ఎగ్గొట్టి  చదివిన మార్క్సిజాన్ని ఎక్కువ వొంట బట్టించుకుని తిరిగొచ్చి నిరుద్యోగ పర్వంలో పడ్డాను. ఖాళీగా ఉండటంతో పత్రిక ఏజెన్సీ , విలేఖరి గిరీ మా నాన్న తరఫున నేనే చేసే వాడిని. మొదట్లో నన్ను విలేఖరిగారి అబ్బాయి అనేవాళ్ళు. కొన్నాళ్ళకు మా నాన్ననే విలేఖరిగారి తండ్రి అనేవాళ్ళు  - అసలు సంగతి తెలియనివాళ్ళు.

   విలేఖరి పని సరదాగా ఉండేది. ఏజెన్సీ పనే కొంచెం ఇబ్బంది.

   నా చిన్న తనం లో ఆంధ్రపత్రిక మద్రాసు ( చెన్నై) నుంచి వెలువడేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రమంతటికీ కలిపి ఒకటే ఎడిషను. 7 , తంబు చెట్టి వీధి లోని కార్యాలయంలో పని మొదలెట్టేవారు. పండితారాధ్యుల నాగేశ్వర రావు, బి.సి.కామరాజు, నండూరి రామమోహన రావు ,బాపు, ముళ్ళపూడి రమణ ,నండూరి  రామమోహన రావు ,తిరుమల రామచంద్ర ,  వేటూరి సుందర రామ మూర్తి లాంటి హేమాహేమీలు అప్పట్లో శివలెంక శంభు ప్రసాద్ ' అయ్యవారి' సంపాదకత్వంలో ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలను నడిపించేవారు.

    సాయంత్రం 7 గంటలప్రాంతంలో  పేజీలు  పూర్తి చేసి ఏ 9 గంటలకో బయలు దేరే ట్రైన్ కు పార్సిళ్ళను అందించేవారు. మర్నాడు ఏ సాయంత్రానికో ఆంధ్ర దేశం లోని దూర ప్రాంతాలకు పత్రిక చేరేది.  బెజవాడ ( విజయవాడ ) లో దిగిన పార్సిల్ అక్కడినుంచి బస్సులో మా ఊరు చేరే సరికి మధ్యాహ్నం అయ్యేది. పేపర్ బాయ్ లేని నాడు నేను, తమ్ముడు, నాన్న కలిసి మండుటెండలో చెమటలు కక్కుతూ ఊళ్ళో పేపర్లు పంచిన రోజులు చాలానే ఉండేవి.

   నా నిరుద్యోగ పర్వం నాటికి పరిస్థితి నయం. అప్పటికి ఆంధ్ర పత్రిక , ఆంధ్ర ప్రభ లు రెండూ బెజవాడ లో ఎడిషన్లు పెట్టాయి. ఇంచుమించుగా అదే సమయంలో ( 1960 ) ఆంధ్ర జ్యోతి మొదలైంది. ఆంధ్ర ప్రభ నుంచి వచ్చిన నార్ల వెంకటేశ్వర రావు గారు దానికి సంస్థాపక సంపాదకులు. లక్ష సర్క్యులేషన్  తో ఆంధ్రప్రభ నంబర్ వన్. 40-50 వేల సర్క్యు లేషన్ తో పత్రిక , జ్యోతి 2-3 స్థానాల్లో మారుతూ ఉండేవి. ఆంధ్ర ప్రభ ,ఎక్స్ ప్రెస్ గ్రూపుకు శరవేగంతో దూసుకుపోయే సొంత వాహనాలు ఉండేవి.   మిగత పత్రికలు  బస్సులు, రైళ్ళ మీదే ఎక్కువగా ఆధారపడుతుండేవి.

   బెజవాడకు 75 కిలోమీటర్ల దూరమే కాబట్టి సాధారణంగా ఉదయం 8 కల్లా మా ఊరికి బస్సులో పేపర్ కట్టలు వచ్చేవి. 9 లోపు పేపర్ అందితే చందాదారులు కరక్ట్ టైంకే వచ్చిందని సంతోషపడే వాళ్ళు. బస్సు  ఆలస్యం వల్ల ఏ పదో దాటితే  చికాకు పడే వాళ్ళు. పేపర్ బాయ్ లేని రోజుల్లో నేనే పేపర్లు పట్టుకుని సైకిల్ మీద వెళితే  " ఓ అబ్బాయ్ ! ఇంత లేట్ అయితే ఎలా  ? మానేస్తాం జాగ్రత్త " అని ఇంటావిడ అరుస్తూంటే ... నన్ను విలేఖరిగా ఎరిగి నమస్కారాలు పెట్టే ఇంటాయనలు ఎంబరాసింగ్ గా ఫీల్ అయేవాళ్ళు.

   ఉదయం పేపర్లు పంపిణీ చేయగానే సరిపోదు. రోజువారీగా కొనే లాండ్రీ, బార్బర్, పాన్ షాపు ల్లాంటి వాళ్ళ దగ్గర సాయంత్రం వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవాలి. వారికి చేయి ఖాళీ   అయ్యేదాకా ఆగాలి. అయినా వాళ్ళే నయం. చందా దారుల్లో కొందరైతే నెల తిరిగాక డబ్బులియ్యటానికి తెగ తిప్పించుకునే వారు. పక్క ఊళ్లలో ఉండే కస్టమర్ల దగ్గర డబ్బుల వసూళ్ళు కష్టంగానే ఉండేవి.

   2017 జనవరిలో అప్పజోస్యుల విష్ణుభొట్ల ( AVKF) ఫౌండేషన్ వాళ్ళు పాయకరావుపేట మహాసభ లో నాకు జీవిత సాఫల్య "ప్రతిభామూర్తి" పురస్కారం ఇచ్చారు. ఆ సభలో నన్ను " గ్రామీణ విలేఖరిగా అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాడినని కిందరు పెద్దలు మెచ్చుకున్నారు. గ్రామీణ విలేఖరే కాదండి . దానికంటే కింది స్థాయి ఒకటిఉంది. ఇళ్ళకు తిరిగి న్యూస్ పేపర్లు పంచేపని. అదిగో ఆ అట్టడుగు స్థాయి నుంచి  మీ దయ వల్ల పైకి వచ్చిన వాడిని - అని నా ప్రసంగంలో చెప్పాను !

     అప్పటి నా బినామీ విలేఖరిత్వం రోజుల్లో తీసిందే కింది ఫోటో.


    అది మా ఊళ్ళో నేను చదువుకున్న  జిల్లా పరిషత్ హై స్కూల్ స్వర్ణోత్సవ సందర్భం. 50 ఏళ్ళు 1967 లోనే నిండాయి. కాని స్వర్ణోత్సవం నాలుగేళ్ళు లేటు గా చేశారు. దాన్ని కవర్ చెయ్యటానికి   విజయవాడ నుంచి వచ్చిన ప్రెస్ పార్టీతో  మేము  ఉన్న చిత్రమిది. కుడివైపు నుంచి వరసగా ఆంధ్ర జ్యోతి సబ్ ఎడిటర్ అడుసుమిల్లి పూర్ణచంద్రరావు , హిందూ రిపోర్టర్ మాధవరావు, ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ మంగళపల్లి సుబ్రహ్మణ్యం, నేను, స్థానిక ఆంధ్రజ్యోతి విలేఖరి మారం సత్య నారాయణ , మా నాన్న, స్థానిక హిందూ విలేఖరి పంగనామముల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.

   అప్పుడు నా పక్కన కూచున్న ఆంధ్రప్రభ సుబ్రహ్మణ్యం (ఎమ్మెస్ఎం ) గారు నేను వేదికమీద మంత్రులు మాట్లాడినమాటలన్నీ కుర్రతనం కొద్దీ పరపరా తెగ నోట్ చేసుకోవటం చూసి ముచ్చట పడి "  తెలివిగల వాడివయ్యా పైకొస్తావ్ " అన్నారు వాత్సల్యంతో. 20 ఏళ్ళ తరవాత నేను అదే ఆంధ్ర ప్రభకు డిప్యూటీ ఎడిటర్ గా వెళ్లాను. అప్పటికి సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయ్యారు. నా నంబర్ కష్టపడి కనుక్కుని ఫోన్ చేసి " నాకు గర్వంగా ఉందయ్యా ! గవర్నర్ కి  వచ్చేంత జీతంతో ఆంధ్రప్రభలో చేరావటగా " అన్నారు.

   ఎమ్మెస్ఎం గారి తరం వేరు. ఆయన రిటైర్ అయింది బహుశా ఛీప్ సబ్ ఎడిటర్ గానే . అయినా ఎందరో రాష్ట్ర మంత్రులు , అగ్ర నాయకులు ఆంధ్రప్రభ ఆఫీసుకు వెళ్లి ఆయన , పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు లాంటి ఉద్దండులను కలిసి సలహాలు తీసుకునే వారు.
పత్రికలన్నా , జర్నలిష్టులన్నా  రాజకీయ నాయకులకు, రాజ్యమేలే వారికీ గౌరవంతో కూడిన భయం ఉన్న రోజులవి. రాజకీయాల స్థాయికి జర్నలిజం అప్పటికింకా దిగజారలేదు.


5 comments:

  1. చాలా మంది కి గైడ్ గా ఉంటుంది మీ డైరీ.

    ReplyDelete
  2. Super sir!! Today's Young journalists like me need to learn a lot from your experiences.

    ReplyDelete
  3. It's a great learning to listen to you sir!!

    ReplyDelete
  4. మీ గతచెలిమెలోనుంటి తీసిన జ్ఞాపకాల ఊటనీరు దాలి లోని పాలటికె గోకుతిన్నంత రుచిగా తీయగా మా దప్పిక తీర్చింది. విలేఖరి అర్హతను గుర్తుచేసింది. మీకు శథదా నమస్సులు. మల్లికార్జున్ అన్నావఝ్జుల,పాలకుర్తి.

    ReplyDelete
  5. మీ గతచెలిమెలోనుంటి తీసిన జ్ఞాపకాల ఊటనీరు దాలి లోని పాలటికె గోకుతిన్నంత రుచిగా తీయగా మా దప్పిక తీర్చింది. విలేఖరి అర్హతను గుర్తుచేసింది. మీకు శథదా నమస్సులు. మల్లికార్జున్ అన్నావఝ్జుల,పాలకుర్తి.

    ReplyDelete