స్టార్స్ X సైన్స్ -- 5
ఎం.వి.ఆర్. శాస్త్రి
......
ఒకాయనకు లేటు వయసులో లేకలేక కొడుకు పుట్టాడు. పుట్టగానే జాతకం ఎలా ఉందని జ్యోతిష్కులను అడిగాడు. వాళ్ళేమో - ఇరవయ్యో ఏడు తరువాత మీ వాడు గొప్ప సన్యాసి కావొచ్చని చెప్పారు.
ఈ సంగతి మన వీర సైన్సు వాదులకు చెబితే ఫక్కున నవ్వుతారు. ఎక్కడో ఉన్న గ్రహాలూ, పుట్టిన క్షణంలోని నక్షత్రాలూ మనిషి భవిష్యత్తును నిర్ణయించడం 'నాన్సెన్స్' అని కొట్టిపారేస్తారు. మాయదారి జ్యోతిష్కులు ఏదో అన్నారని మరీ హడలిపోకు. అయితే గియితే అది ఇరవై ఏళ్ల తరవాత మాట కదా? కావలసినంత టైముంది. ఈలోపు కుర్రాడిని జాగ్రత్తగా పెంచు. మంచి స్కూల్లో చేర్పించు. దరిద్రగొట్టు వేదాంతం పుస్తకాలు చదవనియ్యకు. బైరాగుల్ని, సన్యాసుల్ని వాడి చాయలకు పోనివ్వకు. ఎప్పటికప్పుడు మంచి సైకాలజిస్టులకు చూపించు. బుర్ర చెడకుండా మధ్యమధ్య స్కానింగ్ చేయించు... అని విలువైన సలహాలు కూడా ఇస్తారు.
ఆ తండ్రి వీరికంటే తెలివైనవాడు. ఆయన సామాన్యుడు కాదు. పెద్ద రాజ్యాన్నేలే మహారాజు. జోస్యం నిజం కాకూడదన్న ఆరాటంతో కొడుకుచుట్టూ దుర్భేధ్యమైన రక్షణ వలయం ఏర్పచాడు. కష్టం, దుఃఖం అనేది ఎరగకుండా పెంచాడు. రేయింబవళ్లూ, 365 రొజులూ సుఖాల్లో విలాసాల్లో ముంచెత్తాడు. కాస్త ఈడు రాగానే అప్సరసలాంటి అమ్మాయిని తెచ్చి పెళ్ళి చేశాడు. ముద్దులు మూటగట్టే మనవణ్నీ ఎత్తుకున్నాడు. బయటి ప్రభావాలేవీ పడకుండా, ప్రాపంచిక దుఃఖాలేవీ తెలియకుండా బహు జాగ్రత్తగా తాను కంట్రోలు చేస్తూ వచ్చినందువల్ల కొడుకు గురించి ఇక భయం లేదనే అనుకున్నాడు.
ఏం లాభం? మానవ సాధ్యమైన జాగ్రత్తలన్నీ అనేక సంవత్సరాల ముందు నుంచే తీసుకున్నా. ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న భార్యతో, బిడ్డతో మమకార బంధాలను తెంచుకుని, సుఖాలనూ భొగాలనూ ఎడమకాలితో తన్నేసి 27వ ఏట ఎవరికీ చెప్పా పెట్టకుండా రాకుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యసించాడు.
ఇదేమి కట్టుకథ కాదు. చరిత్ర పుస్తకాల కెక్కిన లోకారాధ్యుడు గౌతమ బుద్దుడి సుప్రసిద్ధ గాథ. ఇరవై ఏళ్ల తరవాత ఒక మనిషి జీవితం తిరగబోయే మలుపును అతడు పుట్టినప్పటి గ్రహగతుల ఆధారంతో జ్యోతిష్కులు చాలా కరక్టుగా చెప్పగాలిగారన్నదే ఈ చారిత్రక వాస్తవంలో గమనించాల్సిన పాయింటు.
వేల సంవత్సరాల కిందటి బుద్దుడి జీవితంలో ఒక జోస్యం నిజమైతే ఏమిటట? అది కేవలం కాకతాళీయం కావొచ్చుకదా? జనానికి సైన్సు వాసన సోకని అజ్ఞానపుటంధయుగాల్లో జరిగిన వాటికి లెక్కేమిటి - అంటారా?
సరే! వేల సంవత్సరాల కిందటి చరిత్ర గ్రంథాలను అవతల పారేసి ఆధునిక కాలానికే వద్దాం.
దుర్గాదాస్ పేరు చాలామంది వినే ఉంటారు. గతంలో 'హిందుస్తాన్ టైమ్స్' దినపత్రికకు ప్రధాన సంపాదకుడు. నెహ్రూకు, పటేల్ కు బాగా సన్నిహితుడు. పటేల్ ఉత్తరాలను ఎడిట్ చేసి ఎనిమిది సంపుటులుగా ప్రచురించాడు. జాతీయ నాయకులతో ప్రత్యక్ష పరిచయాన్ని రంగరించి India from Curzon to Nehru and After పేరిట సుప్రసిద్ధ గ్రంథం రాశాడు. అందులో Enter the Soothsayer అధ్యాయం కింద అప్పటి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సత్యనారాయణ సిన్హాను ఉటంకిస్తూ, దుర్గాదాస్ ఇలా రాశాడు:
... సర్దార్ పటేల్ ఫలానా తేదీన మరణించనున్నట్టు ఒక జ్యోతిష్కుడు తొమ్మిది నెలల ముందుగా చెప్పాడు. కాని పటేల్ నమ్మలేదు. ఓ రోజు రాత్రి సిన్హాకు మామూలుగా ఫోన్ చేసి, పార్లమెంటరీ వ్యవహారాలూ అవీ మాట్లాడాక 'ఏమంటున్నాడు మీ పత్రీవాలా?' అని హాస్యమాడాడట కూడా. కానీ ఆ జోస్యుడు అన్నటే జరిగింది. సరిగ్గా అతడు చెప్పిన రోజునే పటేల్ కన్నుమూశాడు.
1958లో టి.టి.కృష్ణమాచారి అధికార ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో ఇంకో పండితుడు వచ్చి ఆయన పతనమవనున్నాడని సిన్హాకు చెప్పాడు. మతిలేకుండా మాట్లాడుతున్నావని సిన్హా విసుక్కున్నాడు. అప్పుడా జ్యోతిష్కుడు 'కృష్ణమాచారి ప్రభుత్వం నుంచి నిష్క్రమించిన రోజునే మౌలానా ఆజాద్ బాత్ రూమ్ లో కాలుజారి పడి, నాలుగు రోజుల తరవాత మరణిస్తాడు' అన్నాడు. అలాగే ఆజాద్ కు యాక్సిడెంట్ అయింది. కలకత్తా నుంచి డాక్టర్ బి.సి.రాయ్ ను పిలిపించి చూపిస్తే కంగారు పడాల్సింది ఏమీ లేదన్నాడట. సిన్హా పార్లమెంటు లాబీలో నెహ్రూను కలిసి జోస్యం సంగతి చెబితే ' ఏం చెత్త నువ్వు మాట్లాడుతున్నది? ఆజాద్ కు ప్రమాదమేమీ లేదని బిధాన్ (డాక్టర్ రాయ్) గట్టిగా చెప్పాడు' - అని కోపంగా ఎగిరిపడ్డాడట. సరిగ్గా నాలుగు రోజుల తరవాత విద్యామంత్రి మరణించాడు. దీంతో నెహ్రూకు కూడా వణుకు పుట్టిందట.
'నెహ్రూ మొదటిసారి తీవ్రంగా జబ్బు పడ్డది 1962 మార్చిలో. నెలపైగా మంచంమీద ఉన్న ఆ కాలంలో మీ జాతకం ఎవరైనా మంచి జ్యోతిష్కుడికి చూపించండి అని సిన్హా సలహా ఇస్తే నెహ్రూ పట్టించుకోలేదు. అప్పుడు గుల్జారీలాల్ నందా నచ్చజెప్పి ఒప్పించాడు. డిల్లీలో బాగా పేరున్న జ్యోతిష్కుడు వచ్చి నెహ్రూ జాతకం పరిశిలించి 'మీ ఆప్తమిత్రుడు మీకు ద్రోహం చేస్తాడు. ఈ సంవత్సరంలోనే చైనా మన మీద దాడి చేస్తుంది' అన్నాడు. నెహ్రూ మండిపడి ' అది ఎన్నటికీ జరగదు. నీవి వట్టి మూర్ఖపు మాటలు' అనగా జ్యోతిష్కుడు జాతకాన్ని మడిచి వెనక్కి తిరిగిచ్చి వెళ్ళిపోయాడట.
తరవాత ఎక్కువ వారాలు గడవకుండానే చైనా దండయాత్రకు దిగింది. నెహ్రూ జ్యోతిష్కుడిని ఆలకించే మనఃస్థితిలోకి వచ్చాడు. మళ్ళీ పిలిపిస్తే జ్యోతిష్కుడు వచ్చాడు. అతడు చెప్పింది వింటే దిగులు ఎక్కువైంది. 'నెహ్రూజీ జీవితకాలం ముగిసింది. ఇక పూజలు మాత్రమే ఆయన ఆయుస్సును పొడిగించగలవు' అని జోస్యుడు చెప్పాడట. ఆ తరవాత ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా యాభై మంది అర్చకుల చేత ఢిల్లీ శివారు కల్కాజీలోని గుడిలో నిర్ణీతమైన పూజలు చేయించారు. రోజూ పూజాదికాలు కాగానే బ్రాహ్మణ పండిట్లు ప్రధాని నివాసానికి వెళ్ళి ఆయన నుదుట బొట్టు పెట్టేవారు.
దాని తరవాత ఇంకా తీవ్రస్థాయిలో 1964 జనవరిలో నెహ్రూ మళ్లీ జబ్బు పడతారని మే 27 తరవాత ఆయన ఉండరని జ్యోతిష్కుడు చెప్పాడు. సిన్హా ఎంత వారించినా వినకుండా కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనడానికి జనవరి 4న నెహ్రూ భువనేశ్వర్ వెళ్ళాడు. తర్వాత రెండు మూడు రోజులకు పక్షవాతం వచ్చింది. సరిగ్గా మే 27నే ఆయన తుదిశ్వాస విడిచాడు.
[India from Curzon to Nehru , Durga Das ..-pp374-375]
దీనికేమంటారు?
నిత్యశంకితులైన సోకాల్డ్ 'హేతువాదులు' దీన్నీ శంకించవచ్చు. పటేల్, ఆజాద్, నెహ్రూలు ఫలానా తేదీల్లో మరణించనున్నారని జోస్యుడు చెప్పాడనటానికి కాగితం మీద రుజువుందా? సత్యనారాయణ సిన్హా అనే ఆయన దుర్గాదాస్ అనే ఆయనకు ఎవరి గురించో చెబితే అంతా నిజమేనని నమ్మేయడమేనా? నోటి మాటకు విలువేముంది? పరోక్ష సాక్ష్యం ఎలా పనికొస్తుంది? అని సత్తెపెమాణకంగా కోప్పడవచ్చు.
ఒకపెద్ద జాతీయ దినపత్రికకు సంపాదకుడుగా పనిచేసిన దుర్గాదాస్ అంతటి ప్రముఖుడు పుస్తకంలో రాసింది కూడా నిజం కాకపోవచ్చనే అనుకుందాం. ఎవరి మాటా నమ్మకుండా పూర్తిగా డాక్యుమెంటరీ రుజువులను బట్టే పోదాం.
ఇంకా ఉంది
No comments:
Post a Comment