మనుధర్మం - 6
ఎం.వి.ఆర్.శాస్త్రి........
పెళ్లయ్యె దాకా తండ్రి పెత్తనంలో -
పెళ్లయ్యాక మొగుడి పెత్తనంలో -
ముసలితనంలో కొడుకు పెత్తనంలో -
బానిసలా పడి ఉండు. వాళ్ల దయ - నీ ప్రాప్తం. నీ ఖర్మమింతే. నీ బతుక్కి స్వతంత్రం గా ఉండే రాత లేదు.
-అని స్త్రీ జాతికి మనువనే మహా దుర్మార్గుడు శాపం పెట్టాడు అని కదా నేటి సోకాల్డ్ మేధావుల మంట ? అర్థం, అంతరార్థం తెలియకుండా , తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎక్కడో పిక్కి మాటిమాటికీ వారు ఉటంకించే ఆ ముక్క ఉన్నది "మనుస్మృతి " తొమ్మిదో అధ్యాయం మూడో నెంబరు శ్లోకంలో .దాని వెంట ఇంకో శ్లోకం కూడా ఉంది :
కాలే దాతా పితా వాచ్యో వాచ్యశ్చానునయనే పతిః
మృతే భర్తరి పుత్రస్తు వాచ్యో మాతు రక్షితా (9-4)
(పెళ్లి చేయాల్సిన కాలంలో బిడ్డకు పెళ్లి చేయకపోతే తండ్రి నిందితుడు. భార్యను సుఖపెట్టలేకపోతే భర్త నిందితుడు. భర్త చనిపోయాక తల్లిని కాపాడకపోతే కొడుకు అపరాధి. )
అంటే తండ్రికీ, భర్తకీ, కొడుకుకీ మనువు అప్పచెప్పింది పెత్తనం కాదు...బాధ్యత ! దానిని సరిగా నిర్వర్తించపొతే వారు అపరాధులు అని మనువు హెచ్చరించాడు. ఆడది అంటే మగవాడి కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన బానిస; మగవాడు ఎలా ఉన్నా, తనను ఎలా చూసినా, ఏమి చేసినా ఆడది నోరెత్తటానికి వీల్లేదు అనే - ఈ కాలపు వారు చాలామందికి నిలువెల్లా ఉన్న దురహంకారం మనువుకు ఉంటే పై కట్టడి చేయడు.
సరే బిడ్డకు పెళ్లి చెయ్యటం కన్నవారి బాద్యత. దాన్ని వారు సక్రమంగా తీర్చకపొతేనో ? కూతురి సంపాదన తేరగా మరిగి ... ఆమెకు పెళ్లి చేసి బయటకి పంపిస్తే తమకు నష్టం కాబట్టి ఏదో ఒక వంక పెట్టి వచ్చిన సంబంధమల్లా చెడగొడుతూ ఆడపిల్లకు పెళ్లి కాకుండా జాగ్రత్త పడుతున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎంతమంది లేరు? అమ్మానాన్నే కావాలని చెడగొడుతున్నారని ఒకమూల అనుమానం ఉన్నా, తెగించి, తనకు నచ్చినవాడిని తానే ఎంచుకుని పెళ్లాడితే ఇంటా బయటా నలుగురూ ఏమనుకుంటారో నని భయపడి - సాహసించలేని అమ్మాయిలు ఎంతమంది లేరు? స్త్రీ చైతన్యం ఇవాళ ఎంతలా ఉరకలేస్తున్నా... కాలం, సమాజం ఎంత ముందుకు పోయినా... విద్య, విజ్ఞానం ఎన్ని అంగలు వేసినా ... స్వతంత్రించి పెళ్లిచేసుకోవడంలో తప్పులేదన్న దైర్యాన్ని, విశ్వాసాన్ని ... మధ్య తరగతి సాంప్రదాయక కుటుంబాలలో చాలామంది ఆడపిల్లలకు ఇప్పటికీ తగినంతగా కలగజేయలేకపోతున్నామే!!
వేల ఏళ్లకిందటే మనువు ఏమి చెప్పాడో చూడండి:
అదీయమానా భర్తారం అధిగచ్చేత్ యదిస్వయమ్
నైనః కించిదవాప్నోతి న చయం సాధి గచ్చతి (9-91)
(తల్లిదండ్రులు తనకు యుక్తవయసులో పెళ్లి చేయనప్పుడు తాను యోగ్యుడైన వాడిని పెళ్లాడితే పెద్దవారిని ధిక్కరించిన పాపం స్త్రీకి కలగదు. )
మరి పైకి చెప్పుకోలేని క్షోభతో కుమిలిపోయే ఈ కాలపు పెళ్లికాని పడుచులకు మనువు మిత్రుడా? శత్రువా?
పెళ్లయింది. మొగుడు దేశాలు పట్టిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడు తిరిగొస్తాడో తెలియదు. అసలు తిరిగొచ్చే ఉద్దేశం ఉందో, అక్కడే వేరెవరినైనా తగులుకున్నాడో తెలియదు. ఆ స్థితిలో భార్య ఎంతకాలం ఎదురు చూడాలి? ఏమి చేయాలి?
'ముద్దకట్టిన మృగాడు' అని మనవాళ్ల మనసుల్లో ముద్ర పడిన మనువు అయితే - "ఎన్నాళ్లయినా ఎదురు చూడాల్సిందే. మగడొచ్చేదాకా తండ్రి లేక మామ కాళ్ల దగ్గర చచ్చినట్టు పడి ఉండాల్సిందే. మళ్లీపెళ్లి గిళ్లి జాన్తానై " అనాలి కదా?
మనుస్మృతిలోని ఈ శ్లోకం చూడండి:
ప్రోషితో ధర్మ కార్యార్థం ప్రతీక్ష్యోష్టౌ నరస్సమాః
విద్యార్థం షడ్యశోర్థం వా కామార్థం త్రీంస్తు వత్సరాన్ (9-76)
(దేశాంతరానికి భర్త ధర్మకార్యం మీద పొతే అతడి రాక కోసం ఎనిమిదేళ్లు ఎదురు చూడాలి. చదువు నిమిత్తమో, కీర్తి కోసమో వెళితే ఆరేళ్లు నిరీక్షించాలి. వేరొక స్త్రీ మీద వ్యామోహంతో వెళ్లాడని తెలిస్తే మూడేళ్లు వేచి ఉండాలి. )
అన్నేళ్లు గడిచినా మనిషి జాడ లేదు. అప్పుడు భార్య ఏమి చేయాలి? అది ఆమె ఇష్టం. కావాలనుకుంటే వేరొకడిని పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని కూడా కనవచ్చు. మారు మనువు వొద్దు సంతానం కలిగితే చాలు - అనుకుంటే ఇంట్లోని పెద్దల అనుమతితో యోగ్యుడైన వారిద్వారా 'నియోగ' పద్ధతిలో గర్భవతి కావచ్చు.
దేశాలు పట్టిపోయిన మగడు తిరిగిరానప్పుడే కాదు ! మగడు చనిపోయినా - భార్య (గురజాడ అప్పారావులు నాటకాల్లో రాసినట్టు) గుండు చేయించుకుని, జామారు కట్టుకుని పుట్టింట్లో పడి ఏడవనక్కర్లేదు. ఇష్టమైతే నిరభ్యంతరంగా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని కనవచ్చు. లేదా నిస్సంతు అయిన విధవ 'నియోగ' విధానం ప్రకారం దగ్గరి బంధువు ద్వారా గర్భం దాల్చవచ్చు.
ఒకవేళ -
భర్త దేశాంతరం వెళ్లాడు. నిర్ణీత కాలమంతా భార్య ఎదురు చూసింది. తిరిగిరాకపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకుంది. తరవాత రెండో మగడితో సంబంధం చెడింది. మనసు విరిగింది. అంతలో మొదటి భర్తతిరిగొచ్చాడు. కొట్టినా తిట్టినా మొదటి మొగుడే మేలు అని భార్య అనుకుంది. అతడి దగ్గరికి వెళ్లటానికి రడీ అయింది. మొదటి భర్త ఆమెను స్వీకరించవచ్చా ?
మనం ఊహించుకుంటున్న క్రూర ధూర్త నారీ ద్వేషి అయిన మనువు అయితే ఈ ప్రశ్నకు " చస్తే కుదరదు. అలాంటిదాన్ని కుక్కలతో కరిపించాలి. ముక్కు చెవులు కోసి, రాళ్లతోకొట్టి, బతికుండగానే తగలబెట్టాలి" అనాలికదా?
నమ్ముతారో లేదో ! పునః సంస్కారం చేసి ఆమెతో నిరభ్యంతరంగా పాత సంసారం కొనసాగించవచ్చు - అన్నాడు మనువు.
పైన ఉటంకించిన మను ధర్మసూక్తులను నమ్మబుద్ధి కాకపోతే ఈ కింది శ్లోకాలను చూడండి:
యా పత్యా వా పరిత్యక్తా విధవా వా స్వయేచ్చయా!
ఉత్పాదయేత్ పునర్భూత్వా స పౌనర్భవ ఉచ్యతే (9-175)
(భర్తచే విడవబడిగాని, అతడు మరణించిన తరవాతగాని వేరొకడిని పెళ్లాడిన స్త్రీకి కొడుకు పుడితే అతడు 'పౌనర్భవుడు' అనబడతాడు. )
సా చేదక్షత యోనిస్స్యాద్గత ప్రత్యాగతాపివా
పౌనర్భవేన భర్త్రా సా పునస్సంస్కారమర్హతి (9- 176 )
(మొదటి వివాహం తరవాత భర్త సుఖంపొందకనో, చిన్నతనంలోనే వివాహమైనందునో అతడిని వదిలి రెండవ వాడికి భార్యగాపోయి, రోగాదుల వల్ల భర్త సుఖం పొందక మరల మొదటి భర్త దగ్గరికే వచ్చినట్టయితే ఆమెకు మళ్ళీ వివాహ సంస్కారం చేయాలి. )
నాన్యస్మిన్ విధవా నారీ నియోక్తవ్యా ద్విజాతిభిహి
అన్యస్మిన్ హి నియుంజానా ధర్మం హన్యుస్సనాతనం ( 9-64 )
(సంతానం లేని విధవ దగ్గరకు [పూర్వపు ధర్మం నిర్దేశించిన కఠోర నియమ నిబంధనలకు లోబడి ] సంతానం కలిగించటం కోసం బావ , లేక , మరిది , వారి సాపిండీకులను తప్ప వేరెవరినీ అనుమతించకూడదు.)
అంతేకాదు..
ఆడపిల్ల అన్నంత మాత్రాన "ఆడ"కు వెళ్లే తీరాలా? ఎలాంటి వాడయినా, ఎన్ని అవలక్షణాలు ఉన్నాసరే ఎవడో ఒకడిని పెళ్లి చేసుకునే తీరాలా? పాపిష్టి నికృష్టుడిని చేసుకుని జీవితాంతం బాధపడేకన్నా అసలు పెళ్లిజోలికే పోకుండా ఉండటం మేలు కాదా?
అవును ముమ్మాటికీ ! అందులో సందేహమేమిటి అంటారు అభ్యుదయ భావాలుగల ఆధునికులు. కాని పాతకాలపు ' పురుషాహంకారి ' మనువు స్త్రీలకు అలాంటి స్వేచ్చను అనుమతిస్తాడా?
కామమామరణాత్తిష్టేత్ గృహే కన్యర్తుమత్యపి
న చైవైనాం ప్రయచ్చేత్తు గుణహీనాయ కర్హిచిత్ ( 9-89 )
(గుణహీనుడైన వరుడికి ఇవ్వటంకంటే కుమార్తెను జీవితాంతం పుట్టినింట్లోనే ఉంచుకోవటం మేలు. )
ఇవన్నీ 'మనుస్మృతి'లో ఉంటే ఉండొచ్చు. ఈ21 వ శతాబ్దంలో కూడా సంకుచితంగా, మూర్ఖంగా ఆలోచించే చాలామంది కంటే మనుస్మృతి కారుడు కొంతలో కొంత మేలే కావచ్చు. ఇలాంటి సుగుణాలు అక్కడక్కడ ఉంటేనేమి? మనుస్మృతి నిండా స్త్రీలపట్ల దారుణ దుర్వివక్షే కదా? ఎక్కడ చూసినా స్త్రీ జాతిపై దూషణతిరస్కారాలే కదా? వాటిని ఎలా ఉపేక్షించగలం? స్త్రీని నీచంగా చూసే 'మనుస్మృతి'ని ఎలా సహించగలం? - అనేవాళ్ళూ ఉన్నారు
(దానికి జవాబు వచ్చే భాగంలో )
చాలా వివరంగా ఎంతో ఓపికగా పరిశీలిస్తూ వ్రాసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్.
ReplyDeleteఅభ్యుదయవాదులకే అభ్యుదయవాదిలా, స్త్రీల పట్ల కన్నతండ్రిలా కాక, ఒక స్త్రీ ఉద్యమ కారుడిలా, సాక్షాత్తూ ధర్మదేవతలా కన్నతల్లిలా ఆలోచించిన మనువు ఆలోచనా సరళిని ఈ ప్రపంచానికి తెలియకుందా పోయింది. కొన్ని దుష్ప్రచారాల వల్ల.- డా. గౌతమ్ కశ్యప్, Ph.D., on Film Story and Screenplays (University of Madras,) +918885588090 హైదరాబాద్ - 18
మీ దృష్టిలో మీ అంత లోతుగా మీ విశాలమైన అభ్యదయ హృదయంతో మనువును పరిశీలించే వారు ఇంకా ఇంకా ధర్మశాస్త్రాలను ఇప్పటి వారికి వివరించాలి సర్.
Deleteమీ అంత లోతుగా మీలా విశాలమైన నిష్పక్షపాతమైన అభ్యదయ హృదయంతో మనువును పరిశీలించే వారు ఇంకా ఇంకా ధర్మశాస్త్రాలను ఇప్పటి వారికి వివరించాలి సర్. విశ్వజనీనమైన మహోన్నతమైన ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఈ ప్రపంచ మానవాళికి వివరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ReplyDeleteఅంబేడ్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేస్తూ, "మనుధర్మ శాస్త్రంలో అనేక గొప్ప సూత్రాలను నేను చూశాను. వాటిపై నాకు గౌరవం వుంది. ఐతే అదే మను ధర్మశాస్త్రంలో ఎంతో నీచమైన సూత్రాలను కూడా నేను చూశాను.అనేకమంది మేధావులు కూడా ఆ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల, నీచమైన విషయాలే ధర్మసూత్రాలుగా ప్రచారం పొందుతున్నాయి. వాటిని ప్రశ్నించడం కోసం లోకం దృష్తిని ఉలిక్కిపడేట్టు చేసి, ఇటువైపు మళ్ళించడం కోసమే, ఇలా నేను మనుధర్మ శాస్త్ర గ్రంధాన్ని దహనం చేశాను" అన్నారు.
ReplyDeleteనిజానికి ఇప్పుడు మీరు స్వీకరించిన ఈ బాధ్యత
అలాంటి ధర్మం పేరుతో చలామణీ అవుతున్న నీచమైన అసందర్భ అధర్మ సూత్రాలను మెకాలే మహానుభావులు వ్రాసిపారేయించి, మనుధర్మ శాస్త్రం లో చేర్చేశారనీ పరిశోధకులు అనేకమంది చెప్పగా విన్నాను. వాటిని ప్రక్షిప్తాలన్న సత్యాన్ని నలుగురికీ చెప్పి వాటిని గుర్తించి ఏరి పారేసి, అసలు సూత్రాలను వివరించాల్సిన బాధ్యత హైందవ పీఠాధిపతులకే కాక హిందుత్వాన్ని గౌరవించే నిజమైన ప్రతి భారతీయుడికీ వుంది. మానవత్వాన్ని ప్రేమించే ప్రతి మనిషికీ ఉంది.
ఈ ప్రపంచంలోని స్త్రీ మూర్తులందర్నీ ఎంతో మానవతా దృక్పధంతో చూసిన ఇలాంటి న్యాయశాస్త్రం వేరొకటి ఏ మతంలో అయినా వుందా అనిపిస్తోంది.
అఖండ భారతాన్నే కాదు విశ్వమానవ ధర్మానికే దిక్సూచి ఇది. This should be taken as the basis of International Law Code.
విశ్వమానవ శాంతిని నిర్మించడానికి ఇంతకంటే బలమైన ధర్మ శాస్త్రం మరొకటి లేనే లేదనిపిస్తోంది మనుధర్మ శాస్త్రాన్ని చూస్తుంటే..
Yours postings will more inspire Hinduism greatness.keep posting .we will educated.todays studies are not usefull and good things like this will be not teaching in schools
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDeleteExtraordinary essays
ReplyDelete